Tuesday, June 26, 2012

మా వీధి మహారాణి కి పురుడొచ్చింది :)
మొన్న రాత్రి మంచి నిద్రలో వున్నాను . "బౌ . . . వూ. . " అన్న అరుపులతో మెలుకువ వచ్చింది . లేచి టైం చూస్తే 1 గంట కావస్తోంది . అబ్బ ఈ కుక్కలకు అర్ధరాత్రీ లేదూ . . . అపరాత్రీ లేదు ఒకటే మొరుగుతూవుంటాయి అని విసుక్కుంటూ పడుకున్నాను . కాని ఎంతసేపటి కీ అరుపు ఆగదు . కొంపదీసి మనింట్లోనుంచి కాదుకదా అన్నాను అప్పుడే లేచిన మావారి తో . ఏమో చూద్దాం అని తలుపు తీసారు . మెట్ల మీద నిలబడి మా తలుపు వైపు చూస్తూ అరుస్తోంది మావీధి మహారాణి . మమ్మలిని చూడగానే తోకవూపటం మొదలుపెట్టింది . పో పో అని వెళ్ళ గొడితే మెట్లు దిగి మావైపు చూసి అరుస్తోంది . గేట్ బైట దాని ఫ్రెండ్ అరుస్తోంది . అర్ధరాత్రి మద్దెల దరువు ఇదేమిగోల , పోకుండా అరుస్తూ వుందేమిటి అని విసుక్కున్నారు మావారు . గేట్ తీయాలేమో . అది కడుపుతో వున్నట్లుంది . ఎట్లాగో ఇటు దూకింది కాని బయటకు దూకలేకునట్లుంది అని గేట్ తాళంచెవి తీసుకొచ్చాను . ఆయన తాళం తీస్తుంటే పక్కన తోకాడిస్తూ నిలబడి , తాళం తీయగానే బయటకు పరిగెత్తింది !

అది నిజంగానే మహారాణిలా ఫీలైపోతూవుంటుంది . రోడ్ మధ్యలో పడుకుంటుంది . ఏ వెహికిల్ వచ్చినా పక్కకు జరగదు . వాళ్ళు హారన్ వేయగా వేయగా ఎంతసేపటికో పక్కకు జరుగుతుంది . ఆపైన మా వీధి వాళ్ళ వెహికిల్ కాకుండా వేరెవరిదైనా అవుతే అరుచుకుంటూ దానిని కొంచం దూరం తరుముతుంది .మా వీధిలోకి ఎవరూ రావటానికి వీలులేదు ! మా ఇంటి ముందు కూడా కాపలాకాస్తూవుంటుంది . ఏమిలేదు అప్పుడప్పుడు అన్నం పెడుతుంటాము . ఎండాకాలం ఏమో మట్టి ముంతలో నీళ్ళుపోసి బయటపెడుతాము . పాపం దానికే ఆ విశ్వాసం .అదొక్కతే మావీధిని ఏకచత్రాదిపత్యంగా ఏలుతూ వుంటుంది . అప్పుడప్పుడు దాని చుట్టాలో , స్నేహితులో వస్తూ వుంటాయి . అప్పుడు వాటిని తీసుకొని మా వీధంతా ఓ రౌండు తిప్పితీసుకొస్తుంది . దాని పర్మినెంట్ అడ్డా మా పక్క ఇల్లు . ఇంతకు ముందు అక్కడ ఏవో ఆఫీసులుండేవి . దానితో అక్కడ దానిని అదిలించేవాళ్ళెవరూ లేరు . యధేచ్చగా వుండేది . ఇప్పుడు ఫ్లాట్స్ కట్టాక , అందులోకి ఓనర్స్ వచ్చాక దానిని రానివ్వటంలేదు . ఐనా ఏలాగోలాగు దూరిపోతూవుంటుంది . ఇదీ దాని బాక్ గ్రౌండ్ కథ :)

నిన్న పొద్దున బయటకు వెళ్ళి వచ్చి గేట్ తీస్తూ వుంటే , మావారు మీ మహారాణి కి కానుపైనట్లుందే అన్నారు . ఎక్కడా అని చూస్తూవుంటే మా ఎదురుగోడ దగ్గర పిల్లలతో పడుకొని వుంది . అయ్యో నేను చూడనేలేదు సారూ , ఎప్పుడు ఈనిందో ఏమో అనుకుంటూ మా శైలజ , విస్తరిలో అన్నం పెట్టుకొని దాని దగ్గరకు వెళ్ళింది . అదొక్కసారే గుర్రు మంది . దూరంగా పెట్టేసి వచ్చేసింది .నేను ఖారం పొడి చేస్తూవుంటే శైలజ , ఎదురుగా పురిటాలు వుంది . వేడి వేడి అన్నం లో కాస్త ఖారం పొడి , నెయ్యి వేసి కలిపి పెట్టిరానా అంది . ఇంకా నయం దాని జోలికి పోకు , కరుస్తుందేమో అన్నాను :)

రాత్రైసరికి వానవచ్చే సూచనలు కనిపించాయి . అయ్యో పాపం అది పసి కూనలతో బయట వుంది ఎలాగా అని తర్జన భర్జన పడుతున్నాను .ఇంతలో శైలజ వచ్చి అమ్మా మన టి.వి బాక్స్ వుంది అదా దాని కి కప్పిరానా అంది . అది అట్టపెట్టెకదా శైలజ తడిసిపోతుందేమో . పాపం కదలలేక నిస్త్రాణం గా పడుకొని వుంది అన్నాను . మరేమి చేద్దామమ్మా అంది శైలజ . అదే చూస్తున్నాను . పోనీ మన పోర్టికోలోకి తీసుకొద్దామంటే దగ్గరికెళితేనే గుర్రు మంటోంది . తిక్క ముండ కరిచినా కరుస్తుంది ఎలాగా అంటే పోనీ బియ్యం బస్తా కప్పి వస్తానమ్మా అని ఖాళీ బియ్యం బస్తా తీసుకొని వెళ్ళింది . కాని అది దగ్గరకు రానిస్తేనా ! ఒకటే గుర్రు మంటోంది . ఇంతలో ఆ ఇంట్లో ట్యుటోరియల్ కాలేజ్ పెట్టినతను బయటకు వచ్చాడు. వెళ్ళిపోవటానికి గేట్ వేస్తూ శైలజ ను చూసి ఏమిటమ్మా అక్కడున్నావు అని అడిగాడు . ఇక్కడ కుక్క ఈనింది సార్ . వానవచ్చేట్లుగా వుంది దానికి కప్పుదామంటే దగ్గరకు రానీయటం లేదు అని చెప్పింది . ఓరినీ ఇది ఇక్కడుందా . మధ్యాహ్నం నుంచి కనపడటం లేదేమా అనుకుంటున్నాను అని అంటూ దాని దగ్గరకు వెళ్ళాడు . అతని ని చూసి అదేమనలేదు .అతను దాని తల నిమురుతూ ఇక్కడున్నావా . పిల్లలు పుట్టాయా . బాగున్నయిరా నీ పిల్లలు . వానవస్తుందేమో లోపల పడుకుందువు కాని అని దానిని బుజ్జగిస్తూ , ఒకో పిల్ల ను తీసి బియ్యం బస్తా మీద పడుకోపెట్టాడు . ఆ బస్తాను తీసుకెళ్ళి లోపల మెట్ల కింద గదిలో పడుకో బెట్టాడు . ఈ లోపల నేను పాలు గిన్నెలో పోసి శైలజ కిచ్చి పంపాను . మొత్తాని కి దానిని సేఫ్ ప్లేస్ లోకి చేర్చి , పాలుపోసి అమ్మయ్య అని టెన్షన్ ఫ్రీ అయ్యాము :)

ఈ రోజు పొద్దున కాసిని పాలు గ్లాస్ లో ఇచ్చి , దానికి పోసి , పప్పీస్ ను ఫొటో తీసుకొని రా శైలజ అని పంపాను . అతను నేను పాలు తెచ్చి పోసాను లేమ్మా అన్నాడుట . ఐనా పాలు పోసి , ఫొటో తీసుకొని వచ్చింది . దానికి ఆ బస్తా నచ్చనట్లుంది , కూనలను ఓ పక్కన పడుకో బెట్టిందిట . పాల గిన్నె ఇంకో మూల పెట్టిందిట . దాని కి నచ్చినట్లు రూం సద్దుకుందన్నమాట :) మొత్తాని కి నువ్వు నీ అసిస్టెంటు మీ మహారాణి కి పురుడు పోసారన్నమాట అని మావారు నవ్వారు :)

17 comments:

Anonymous said...

beau

చెప్పాలంటే...... said...

jagratta gaa chudandi maala garu maharaani kadaa:)

సి.ఉమాదేవి said...

మనసున్న మహరాణి మీరు!

Anonymous said...

so nice of you all attayya... Ravi Komarraju

జ్యోతిర్మయి said...

బావున్నాయండీ బుజ్జి బుజ్జిగా... మిమ్మల్ని అభినందించకుండా వుండలేకపోతున్నాను. ఉమాదేవి గారి మాటే నాదీనూ..

శ్రీలలిత said...

నాదీ ఉమాదేవిగారి మాటే...

వేణూశ్రీకాంత్ said...

ఆ మహరాణిని ఆదరించిన ప్రతిఒక్కరికీ నా నమస్సులు మాలగారు. ఇందరు మంచి మనుషుల మధ్య ఉండడం ఆ మహరాణి అదృష్టం. ఫోటోలో బుజ్జికూనలు చాలా బాగున్నాయ్.

వనజవనమాలి said...

భూత దయ.. చాలా గ్రేట్..మాల గారు.
మీ శైలి ఎంత నచ్చేసిందో!! మీకు,శైలజ కి అభినందనలు.
బుజ్జి ముండలు ఎంత బాగున్నాయో!!

పరిమళం said...

మంచిపనిచేశారు...ఎంత ముద్దుగా బజ్జున్నాయో :) :)

మాలా కుమార్ said...

పురాణపండపణి గారు ,

మీ బౌ కు థాంక్స్ అండి :)

&చెప్పాలంటే గారు ,

అలాగేనండి జాగ్రత్తగా చూసుకుంటాము :)

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,
పెద్ద బిరుదే ఇచ్చారే :) ఆ సమ్యం లో మీరు చూసినా అలాగే చేసేవారు కదా !థాంక్స్ అండి .

&రవీ ,
థాంక్ యు :)

&జ్యోతిర్మయి గారు ,
మీ అభినందనలకు థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
థాంక్ యు అండి . ఏదో అలా ఐపోయింది :)

&వేణూశ్రీకాంత్ ,
చాలా రోజుల కు వచ్చారే . ఏదో అంతా మీ అభిమానమండి . థాంక్ యు .

మాలా కుమార్ said...

వనజావనమాలి గారు ,
అదే మీ బాబు ఇక్కడ వుండి వుంటే మీ ఇంటికే తీసుకొచ్చేవాడేమో కదండి . మీ పోస్ట్ చదివాక నాకలాగే అనిపించింది . మీఅభినందనలకి థాంక్స్ అండి .

&పరిమళం గారు ,
థాంక్స్ అండి .

జలతారువెన్నెల said...

ఉమా దేవి గారి కామెంట్ ఏ నాది కూడా..Great andi meeru.

kri said...

మాలగారూ కుక్కపిల్లలు ముద్దుగా ఉన్నాయి. ఏమిటో మీ కోలొనీలో ఉన్నవాళ్ళందరూ మంచివాళ్ళలా ఉన్నారు.
మీరందరూ కూడా మహరాజులూ/రాణులే.

రాధిక(నాని ) said...

చాలా ముద్దుగా ఉన్నాయి మీ మహారాణీ గారి బుజ్జి బుజ్జి యువరాజులు ,యువరాణీలు.

మాలా కుమార్ said...

జలతారు వెన్నెల గారు ,
ఏమిటో నండి మీరంతా నన్ను అలా మునగచెట్టెక్కిస్తున్నారు :) థాంక్స్ అండి .

& క్రిష్ణవేణి గారు ,

మీరు ఇంకో అడుగు ముందుకేసారే :) హిహిహి .
థాంక్ యు .

& రాధిక గారు ,

బహుకాలదర్శనం :) థాంక్స్ అండి .