Tuesday, June 12, 2012

అమ్మకొడుకు" మమ్మీ వాడు చూడు ఎంత ముద్దుగా వూడుస్తున్నాడో " పక్కింటి వాచ్ మాన్ కొడుకు ను చూపిస్తూ మా అమ్మాయి అంది . మా పక్కన కొత్తగా కడుతున్న ఫ్లాట్స్ లో వాచ్ మాన్ గా కొత్తగా వచ్చారనుకుంటా . ఓ చిన్న బాబు వాళ్ళ అమ్మ వూడుస్తుంటే ఇంకో చీపురు తీసుకొని పక్కన వాడూ వూడుస్తున్నాడు . వెధవ ఆ చీపిరిలో సగం కూడా లేడు . సంవత్సరమున్నర వుంటుందేమో వాడి కి.. చాలా ముద్దుగా వున్నాడు .కష్టపడి ఆ చీపురును సాగదీస్తూ , పడుతూ లేస్తూ వూడుస్తున్నాడు . వాడి కి మేము చూస్తున్నామని ఎలా అర్ధమైందో , మా వైపు చూసి చేయి వూపాడు . వాడే వాళ్ళ అమ్మకు సాయ పడుతున్నట్లు పేద్ద ఫోజులూ వీడూనూ :) కాసేపు వాడిని ముచ్చట గా చూసి లోపలి కి వెళ్ళిపోయాము .

మా అమ్మాయి వెళుతుంటే బై చెప్పటానికి బయటకు వచ్చాము .ఫ్లాట్స్ లో మా ఇంటి వైపు గోడ దగ్గర పొయ్యి పెట్టి వుంది . అందులో కట్టెలు భగ భగా మండుతున్నాయి . పొయ్యి మీద ఏదో వుడుకుతోంది. ఇంతలో పక్క నుంచి ఆ చిన్నూగాడు పరిగెత్తుకుంటూ ఆ పొయ్యి దగ్గరకు వచ్చేస్తున్నాడు . . . ఒకాసారే అందరమూ ఉలిక్కి పడ్డాము . మావారు ఏయ్ . . . ఏయ్ . . . అని గాభరగా పిలుస్తూ గబ గబ మెట్లు దిగసాగారు . మావారి కేకలు విని గోడ పక్క నుంచి వాళ్ళ అమ్మ లేచి , నేను ఇక్కడే వున్నా సారూ అంది . అమ్మయ్య మా అందరి గుండెలు కుదుటబడ్డాయి . . . ఐనా మావారు వూరుకోలేదు . వాడి అమ్మను , నాన్నను పిలిచి చిన్న పిల్లవాడి తో జాగ్రత్తగా వుండండి . సాయంకాలం రోడ్ మీద చూసాను వాడి ని అని క్లాస్ పీకారు . అప్పుడు మేము గేట్ దగ్గరే వున్నాము సారు అన్నాడు వాడి నాన్న. నీ మొహం నువ్వెక్కడో గేట్ దగ్గర వున్నావు . వాడు రోడ్ మీద వున్నాడు ఏదైనా వెహికిల్ వస్తే వాడికి తప్పుకోవటం వచ్చా ? మోటార్ సైకిల్ మీద పిల్లలు జోరుగా వెళుతుంటారు . వాడిని బయటకు రానీయకండి అని ఇంకా గట్టిగా క్లాస్ తీసుకున్నారు . . .

అదో అలా . . . ఆ రోజు నుంచి బాల్కనీ లో కూర్చొని వాడి ని చూస్తూ వుండటం ఓ వ్యాపకమైపోయింది నాకు . వాడు ఎంత సేపూ వాడి అమ్మ వెనకాల వెనాకాలే తిరుగుతూ వుంటాడు . ఆమె పని చేసుకుంటూ వుంటే ఏదో సాయం చేయబోతూ అడ్డం పడుతూ వుంటాడు . ఆమె ఒకోసారి ముద్దుగా ఎత్తుకొని ముద్దుపెట్టుకుంటూ . . . అప్పుడప్పుడు కసురుకుంటూ వుంటుంది . సాయంకాలం కాగానే నల్లా దగ్గర స్నానం చేయించి , ఇంత పోడర్ మెత్తి , మంచి బట్టలు తొడిగి ముస్తాబు చేస్తుంది . ఆమె నన్ను పట్టించుకోదు కాని , ఆ దొంగ వెధవకి నేను వాడి ని గమనిస్తున్నానని ఎట్లా తెలుస్తుందో నా వైపు చూసి చిరునవ్వులు చిందిస్తాడు . ఒకోసారి అంజాన్ కొడుతుంటాడు . అలా ఓసారి ముస్తాబై వాళ్ళ నాన్న తో ఎటో వెళ్ళాడు. ఓ రోజంతా కనిపించలేదు . నాకు ఏమీ తోచలేదు . మా పనమ్మాయి శైలజ ను పిలిచి వాడెటువెళ్ళాడు అని అడిగితే అమ్మమ్మగారింటి కి వెళ్ళాడటమ్మా అంది .ఓ రోజు తరువాత వచ్చేసాడు . వాళ్ళ అమ్మకు బోర్ కొట్టి తెచ్చేసుకుందిట . వాడి అమ్మకేమో కాని నేను మటుకు ఈ రెండు రోజులూ వాడిని చాలా మిస్సైయ్యాను :)

మళ్ళీ వాడి అమ్మ వెనకాల తిరుగుతూ వాడు , వాడిని చూస్తూ నేను సెటిలైపోయాము :) ఈ మగపిల్లలు చిన్నప్పుడంతా ఇలాగే అమ్మ కొంగు పట్టుకొనే తిరుగుతూవుంటారు . ఎక్కడి కి వెళ్ళాలన్నా అమ్మ సాయం రావలసిందే . నాన్నను ఏమి అడగాలన్నా అమ్మ ద్వారా అడిగించాల్సిందే . ఏమి చెప్పలన్నా అమ్మే . అంతగా అమ్మను అతుక్కుపోతారు . ఆ పైన పెరుగుతున్నా కొద్దీ అమ్మకూ దూరమైపోతారు . వాళ్ళ ఫ్రెండ్స్ , వాళ్ళ వ్యాపకాలు ఆ తరువాత వుద్యోగామూ బాధ్యతలూ అంటూ అమ్మ కొడుకు కాస్తా అమ్మ కు తన చిన్ననాటి మధురస్మృతులూ ,వెనకెనకే తిరిగే బుడతడు ఎంత ఎదిగిపోయాదు అనే ఆశ్చర్యమే మిగులుస్తాడు :) అమ్మతో మాట్లాడేందుకు సమయమూ దొరకదూ :) పాపం వాళ్ళైనా ఏమి చేస్తారు ఈ కాలం వుద్యోగాలే అలా వున్నాయి వేళాపాళా లేకుండా .వాళ్ళ తిండి వాళ్ళు తినేందుకే సమయం దొరకదు . ఇహ పక్కకేమి చూస్తారు :)

19 comments:

సి.ఉమాదేవి said...

మీలోని అమ్మ ఆంతర్యం పలికించిన మాటలు నిజమేననిపిస్తాయి ఇప్పటి వేగవంతమైన జీవితాలను చూస్తే!

సాయి said...

బాగున్నాయి అండీ.. చిన్ని బుడుతటి చిలిపిచేష్టలు..
ఆ లాస్ట పేరా మాత్రం అక్షరాలా నిజం...

ఆ.సౌమ్య said...

బావున్నాయి మీ బుడుగ్గాడి ముచ్చట్లు. :)

చిన్ని said...

వెనటి తరంలో ఒక సామెత మా నాయనమ్మ వాడుతుండేది ముఖ్యంగా కొడుకుల విషయం లో "అడ్డాలనాదే బిడ్డడు గడ్డాల నాడు కాదు "అని ,కారణం ఏదైనా నిజమే కదండీ :)

జ్యోతిర్మయి said...

బుజ్జిపండు కూడా ఇలాగే...రేపు వీడు కాలేజ్ కి వెళితే అనుకుంటే ఇప్పటినుండే బెంగగా ఉంటుంది.

జలతారువెన్నెల said...

నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు, అమ్మాయిలే నయ్యం చాక్కగా అన్ని విషయాలు చెపుతారు, అబ్బయిలు ఇలాగే చిన్నప్పుడు అమ్మా అమ్మా అంటూ చుట్టు తిరిగేవారు, ఇప్పుడు అసలు మాట్లాడరు అని...ఆ విషయం లో మాత్రం నిజమనిపిస్తుంది..అలా అని వాళ్ళకి ప్రేమలు ఉండావని కాదు..కాని ఇంక అంతే!

శ్రీలలిత said...

ముందు అమ్మ కాళ్ళు పట్టడం నేర్చుకుంటే తర్వాత భార్య కాళ్ళు పట్టడం ఈజీ అవుతుంది..హ హ అహ..

మధురవాణి said...

భలే ముద్దుగున్నాడు మీ చిన్నూగాడు.. :)

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,
అవునండి . అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటాని కి సమయమే దొరకటం లేదు . అందరూ అంత బిజీ ఐపోయారు . మీ వాఖ్యకు థాంక్స్ అండి .

*సాయి గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

సౌమ్యా ,
మా కబుర్లు మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .

*చిన్ని గారు ,
మీరు చెప్పిన సామెత విన్నానండి :)

మాలా కుమార్ said...

జ్యోతిర్మయి గారు ,
బుజ్జిపండు ఇంకా బుజ్జిగాడే కదండి :)ఇప్పటి నుంచే బెంగ ఎందుకు :)

*జలతారువెన్నెల గారు ,
మీరు చెప్పింది ఒకప్పటి మాట అండి . ఇప్పుడు అమ్మాయిల కు కూడా తీరిక దొరకటం లేదు .వాళ్ళకు ప్రేమ లేక కాదండి . వాళ్ళ టార్గెట్స్ తో బిజీ అంతే .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,

మీరా రూట్ లో వచ్చారా వాకే :)

*మధూ ,
చాలా రోజులకు వచ్చావు :) నీ కామెంట్ కు థాంక్ యు .

kri said...

మాలగారూ మొత్తంమీద భలే ఉన్నాడు మీ చిన్నుగాడు.

మాలా కుమార్ said...

కృష్ణవేణి గారు ,
మీ వాఖ్య కు , మా చిన్నూగాడు నచ్చినందుకు థాంక్స్ అండి .

kri said...

అంటే చిన్నుగాడిని మీ స్వంతం చేసేసుకున్నారన్న మాట! మరి వాళ్ళ అమ్మానాన్నలని అడిగేరా?

మాలా కుమార్ said...

కృష్ణవేణి గారు ,
అయ్య బాబోయ్ వాడి ని సొంతం చేసుకొని పెంచే ఓపిక నాకు లేదండి బాబూ :) ఇలా వాడి ఇంట్లో నుంచి వాడు , మా బాల్కనీ లో నుంచి నేను చూసుకుంటూ ఆడుకుంటూ వుంటామన్నమాట అంతే నండి .

Mauli said...

లాస్ట్ పేరా ని బుజ్జి గాడు ఖండిస్తున్నాడు :)

మాలా కుమార్ said...

మౌలి గారు ,
బుజ్జి గాడి కి థాంక్స్ చెప్పండి :)

చెప్పాలంటే...... said...

avunu mala garu miru cheppindi nijame amma kongu chinnappude taruvata mari vallu herolu aipotaru kada :) kaburlu bujji gadivi baavunnayi