"47 సంవత్సరాల క్రిందట విడుదలైన ఈ నవల ఆ రోజులలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు .1962 నుంచి 1976 వరకు మూడు సార్లు పునర్ముద్రించబడినది .దాదాపు 15000 కాపీల వరకు అమ్ముడుబోయినాయి ఆ రోజులలోనే . ఈ నవల పుస్తకము వెనుకనున్న క్రింది వాక్యాలు నవల పట్ల ఉత్కంఠతని రెట్టింపు చేసాయి ."
చాలా సీరియస్ గా చదువుతున్నాను . ఇంతలో ఠప్ మని కరెంట్ పోయింది ."చావు తప్పితే చాలు " నవల లింక్ ను కార్తీక్ మూడు రోజుల కిందటే ఇచ్చాడు . అప్పటి నుంచి చదువుదామంటే తీరిక దొరకలేదు .తీరిక దొరికి తీయగానే ఇదీ సంగతి ! అంతటా గాఢాంధకారం . లాప్ టాప్ వెలుతురు తప్ప ఇంకేమీ లేదు . స్ట్రీట్ లైట్స్ కూడా పోయినట్లున్నాయి !చదవనా వద్దా అని కొంచం సేపు ఆలోచించి , చీకట్లో చేసే పనిమటుకు ఏముందిలే అనుకొని మళ్ళీ లాప్ టాప్ లో కి కళ్ళు తిప్పాను .
"భారతి భుజాల మీద ఏదో చేతులు వేసింది .మొహాని కి ఏదో రాసుకుంది ? ఏమిటది ?
మెట్ల మీద ప్రసాద్ చూసిన ఆకారం ఏమిటి ?మనిషి కాదని నిశ్చయం గా ఎందుకన్నాడు ?
వైకుంఠరావు చనిపోయి రెండు రోజులైంది .అతని శవం మేడ మీద కుర్చీలో ఎట్లా వుంది ? ఇంట్లో ఎట్లా తిరుగుతోంది ?
"దూరంగా పొండి, తలుపు దగ్గరికి వెళ్ళకండి " అని అరుస్తూ భారతి , ప్రసాద్ ని , శేఖర్ నీ ఎందుకు వెనక్కి లాగింది ?
ఈ పుస్తకం రాత్రిళ్ళు ముట్టుకోవద్దు .వంటరి గా వున్నప్పుడు చదవద్దు . భయం వేసినప్పుడు అప్పటి కి చదవటం ఆపి కొంత సేపటి తరువాత మళ్ళీ మొదలు పెట్టండి..!"
అక్కడి దాకా చదివాక గుండె టక్ టక్ మని కొట్టుకోసాగింది . ముందుకు చదవనా వద్దా అన్న మీమాంసలో పడ్డాను . ఇంతలో చిన్నగా ఏదో వెలుతురు కనిపించింది . . . . .
ఆ తరువాత . . . ఏదో నీడ లాప్ టాప్ మీద కు వచ్చింది . . . . .
ఆ పైన నా భుజానికి ఏదో మెత్తగా తగిలింది . . . . .
అంతే ఒక్క వుదుటున లేచి కళ్ళు మూసుకొని కెవ్ . . . కెవ్ . . . మని అరిచాను * * * * *
చీకట్లో భయపడతావని ఎమర్జెన్సీ లైట్ తీసుకొని వస్తే ఏమిటా అరుపులు అని మావారు , లాప్ టాప్ కిందపడకుండా పట్టుకుంటూ అన్నారు .
మెల్ల గా వీపు మీద కొట్టు కుంటూ " ఉష్ . . . మీరా " అన్నాను .
" మరెవరనుకున్నావు ? కిందికి వస్తావా ఇక్కడే కూర్చుంటావా ?"
"దయ్యమనుకున్నాను " ( స్వగతం ) " వస్తాను చీకట్లో ఇక్కడేమి చేస్తాను ? " ( పైకి ) అని లాప్ టాప్ క్లోజ్ చేసి కింది కెళ్ళిపోయాను .
నిన్న పగలు ఇహ ఆ నవల చదవకుండా వూరుకోలేక మళ్ళీ ఓపెన్ చేసాను .
చాలా టెన్షన్ గా ప్రాణాలు బిగబట్టుకొని చదువుతున్నాను . . .
" ఎక్కడో కరకరమని చప్పుడైనట్లు అనిపించి మగత నిద్ర లోంచి మేల్కొంది , కిటికీ రెక్కలు తెరిచి వున్నాయి.బయట బాగా చీకటి గా వుండటం వల్ల ఏమీ కనిపించటం లేదు .కళ్ళు మూసుకొని దుప్పటి మెడవరకూ కప్పుకుంది .. . . . . . . .
తను కదిలినా ఏ కొంచం శబ్ధం చేసినా ఆ చప్పుడు ఆగిపోతొంది .భారతి అడుగులో అడుగువేసుకుంటూ శబ్ధం వస్తున్నవైపు వెళ్ళింది . పెద్ద బీరువాలో నుంచి వస్తున్నాయి చప్పుళ్ళు.భారతి జాగ్రత్త గా విని తనలో తను నవ్వుకుంది .ఎలుకలైవుంటాయి .బీరువా లో చేరి గొడవ చేస్తున్నాయి .బీరువా తలుపుకు వున్న పిడి పట్టుకొని లాగింది .తలుపు తెరుచుకోలేదు . మళ్ళీ లాగింది .
పూర్తిగా చీకటిగా లేదు , కాని స్పష్టంగా కనిపించే వెలుగు లేదు గదిలో .బీరువా తలుపు తెరుచుకుంది .బీరువాలోంచి ఏదో వచ్చి మీద పడ్డది - చిన్నది కాదు - ఎలుక కాదు - పిల్లి కాదు .తన కన్న పొడుగ్గా వుంది . భారతి గుండె ఆగి పోయినంత పనైంది .నోట మాట రాలేదు .అరవటానికి వీల్లే కుండా గొంతు పూడుక పోయింది . . . "
"మాలా. . . "
"అబ్బ ఎందుకంత గావుకేక పెట్టారు . దడుచుకున్నాను . ఊహ్ . . . "
" గావుకేక ఎక్కడ పెట్టాను ? చిన్నగానే పిలిచానుకదా !"
" ఇంతకీ ఎందుకు పిలిచారు ?"
" జగన్ ను జైల్ కు తీసుకెళుతున్నారు . చూస్తావని పిలిచాను ."
మరి జగన్ నూ చూడాలి . భారతి గతేమయ్యిందో చదవాలి ! లాప్ టాప్ తో డ్రాయింగ్ రూం లో సెటిలై , ఓ కంట జగన్ నూ , ఓ కంట భారతినీ చూస్తున్నాను :)
"పద్మ నిద్ర లోనుంచి చటుక్కున లేచి , కళ్ళు పెద్దవి చేసి చీకట్లోకి తీక్షణం గా చూసింది . ఏమీ కనిపించలేదు .తలుపు పక్కన దీపం స్విచ్ వుంది . స్విచ్ నొక్క గానే క్లిక్ మన్న శబ్ధం వినిపించిందిగాని దీపం వెలుగ లేదు .పద్మ కి భయం వేసింది దీపం ఎందుకు వెలగ లేదు !"
* * * * * * * * * * * * * * * * * * * * *
"టార్చ్ వెలుగులో అతనికి కనిపించిన ఆకారం భయంకరం గా వుంది . ఆ టార్చ్ వెలుగు తప్ప ఇంకే వెలుగూ లేదు .అక్కడ వలయాకారం లో టార్చ్ వెలుగు అతని మీద పడుతోంది .దాదాపు ఏడడుగుల పొడుగు , రెండు చేతులూ పేకెత్తి పెట్టాడు . చేతులకు వేళ్ళు లేవు . మొండి చేతులు .తల వుంది కాని మొహం లేదు .మెడ వరకు నల్లని గుబురు జుట్టు .ఆ జుట్టు లోనుంచి రెండు కళ్ళు . వాటి చుట్టూ వలయాకారం లో మెరుస్తున్న గీతలను బట్టి అవి కళ్ళని తెలుస్తోంది . పెద్ద కడుపు .వెలుగు కాళ్ళ వరకూ పడటం లేనందువలన కాళ్ళు నేల మీద ఆని వున్నదీ లేనిదీ తెలీటం లేదు ."
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
"కెవ్వు మని కేక పెట్టింది భారతి .నల్లగా గడ్డ కట్టిన రక్తం .కళ్ళు కనిపించటం లేదు . ముఖరేకలు కనిపించటం లేదు . ఊపిరి పీల్చటం లేదు . చలనం లేదు .కళ్ళు తెరుచుకొని వున్నాయి కాని వాటిల్లో చూపులేదు . అది శవం . శవం కొయ్యబారిపోయింది . కొయ్యబారిన శవం ఆలింగనం లో తను ఇరుక్కుంది . ఆ శవం ఎవరిది ? . . . . .
* * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
టి.వి లో టెన్ష పెరిగి పోతోంది .ఇక్కడ నవలలో అంతకన్నా భయంకరం గా టెన్షన్ పెరుగుతోంది . ఎక్కడ గుండె ఆగిపోతుందో అన్నంత టెన్షన్ . . .
ఇంత సస్పెన్స్ లో , ఇంత టెన్షన్ క్రియేట్ చేస్తూ వ్రాయటం ఒక్క కొమ్మూరి సాంబశివరావు కే చెల్లిందేమో ! నేను చదివిన మూడు నవలలూ ఒక దానిని మించి ఒకటి వున్నాయి . . .
మొత్తానికి జగన్ జైల్ దగ్గరకు వచ్చేసాడు .. . కార్ లో నుంచి దిగాడు . . . చిన్న గేట్ లో నుంచి లోపలి కి వెళ్ళాడు . . . గేట్ మూసుకుంది . . . . .
అమ్మ విజయమ్మ , కూతురు , కోడలు ను తీసుకొని దీక్ష మొదలు పెట్టింది . . . తరువాత ఏమి జరిగింది ????? టి. వి చూడుడు . . . .
నవల చదవటం మూ ఐపోయింది . ఈ ముక్కలు ముక్కల కథేమిటి ? అసలు కథేమిటి ? తెలుసుకోవాలని ఆసక్తి వున్నవారు ఇక్కడ చదువుడు .
Tuesday, May 29, 2012
Subscribe to:
Post Comments (Atom)
18 comments:
hahahaha... mala garu adhi detective novel kani meeru rasina post chooste matram navvu aagatam ledu, mari antha bayam entandi
హమ్మయ్య...కధ సుఖాంతమైంది:-)
Thanks for sharing.
డిటెక్టివ్ నవల సస్పెన్స్ లాగే సాగిందండీ మీ కరెంట్ పోవడం, జగన్ జైల్ కి వెళ్ళడం అంతా కూడా..
బాగా రాసారు.
ఏమిటి మాలగారూ మీకింకా డిటెక్టివ్ పుస్తకాలు చదివితే భయం వేస్తుందా?
మొత్తంమీద జగన్ ప్లస్ భారతి పాట్లు ఒకే టైమ్లో చూసి సమయాన్ని ఆదా చేసుకున్నారు-:)))
అద్భుతం గా వ్రాసారు. ఇంక మీరు హర్రర్ కధలు వ్రాయడం మొదలు పెట్టండి.......దహా.
అనోనమస్ గారు ,
థాంక్స్ అండి :)
*పద్మార్పిత గారు ,
కథ సుఖాంతమైందా ? ఐతే కథ మొత్తం చెప్పేసానా :)
థాంక్స్ అండి .
శ్రీలలిత గారు ,
సస్పెన్స్ మేంటేన్ చేసానంటారా :) థాంక్ యు .
* కృష్ణవేణి గారు ,
నేను డిటెక్టివ్ నవలలు చదవటం ఇదే మొదటిసారి అండి . ఐనా మామూలు నవలలో కూడా ఈ మద్య సస్పెన్శ్ వుంటోందిలెండి . ఎంతైనా చావులూ శవాలూ అంటే భయమేస్తుందండి :)
బులుసు సుబ్రమణ్యం గారు ,
అద్భుతంగా రాసానంటారా :) అంతా నవలలోని డైలాగ్సే కదండి :) మీ సలహా గురించి ఆలోచిస్తానండి :)
నేను చెప్పాకదా ఆ నవల కనీసం 30ఏళ్ళ ముందు వచ్చిందని.. ఇది కాక "నేను నేను కాను" అని ఒకటి ఉంది అది కూడా సూపర్.. మీకు ఆరోజే మెయిల్ పెడదామనుకున్నాను కానీ సైజ్ మరీ పెద్దదిగా ఉంది..
ఈ చావు తప్పితే చాలు నవలని ఆ రోజుల్లో సినిమాగా తీసుంటే బాగుండేది.. అప్పటికింకా మన పరిశ్రమలో నటించగల హీరోలు, విలన్లు ఉండేవాళ్ళు కదా..
-కార్తీక్
ఆనాటి మా బాల్యాన్ని మళ్లీ గుర్తుకు తెస్తున్నారు.మీరివి ఇప్పుడే మొదటిసారిగా చదువుతున్నారా?
కార్తిక్ ,
మీరు సినిమా అనగానే యన్.టి.ఆర్ , యస్.వి రంగారావు , రాజనాల చకచకా నా కళ్ళ ముందు కనిపించేసారు :)
ఆ నవల బాగుంది , ఇది బాగుంది అంటే కాదబ్బాయ్ . లింక్లో , బుక్సో పంపించేయాలి . గుడ్ బాయ్ వి అన్నాను కదా మరి . అవి చదవాలని నాకూ తెగ క్యూరియాసిటీ మొదలైపోయింది . థాంక్ యు .
ఉమాదేవి గారు ,
అమ్మో మీరు బాల్యం లోనే ఈ బుక్స్ చదివేసారా :) నేను ఇప్పటివరకూ చదవలేదండి . నేను ముందుగా చదివిన నవల , ఆంధ్రజ్యోతి లో సీరియల్ గా వస్తుండగా "జీవన తరంగాలు "యద్దనపూడిది . అందుకే యద్దనపూడి కి అభిమానినైనాను . ఆ తరువాత 1972 లో అనుకుంటా , మా ఫ్రెండ్ ప్రోత్సాహం తో , నారాయణగూడా లోని ఆర్కే లైబ్రరీలో చేరి సాంఘిక నవలలు చదివాను .అప్పటి నుంచి రెగ్యులర్ గా చదువుతున్నాను కాని డిటెక్టివ్స్ చదవలేదు .స్వాతి లో మధుబాబు నవల వకటి చదివానుకాని నచ్చక ఇక చదవలేదు . కౌముది లో కొమ్మూరి నవల చదివి ,నచ్చి, వాటి కోసం వెతకటం మొదలు పెట్టాను :)
మీ వాఖ్యకు థాంక్ యు .
అసలు ఈ టపా చదువుతుంటేనే గుండె వేగం గా కొట్టుకుందంటే మీరు నమ్మాలి. ఎంత బాగా రాసారండి..చాలా నచ్చింది నాకు మాలా గారు.
జలతారు వెన్నెల గారు ,
మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .
బాబోయ్ మీరు ఇంకా సస్పెన్స్ గా వ్రాసారు.మంచి వారె...బాగా వ్రాసారు
శశికళ గారు ,
థాంక్స్ అండి .
హ హ్హ హ్హా ....
పరిమళం గారు ,
చాలా రోజుల కి చక్కగా కిల కిలా నవ్వుతూ వచ్చారే థాంక్ యు .
Post a Comment