Tuesday, June 19, 2012
నా మొక్కల దీనగాధ :(((((
మా వారి పూజ కోసం దేవుడి ముందు అంతా శుభ్రం చేసి , పూలు కోసుకొద్దామని ,పూల బుట్ట అందుకున్నాను . అందుకునే ముందు ఓక్షణం ఆలోచించాను పెద్ద ది తీసుకోనా చిన్న బుట్ట తీసుకోనా అని పెద్ద బుట్టైతే చాలా పూలు పడుతాయి. అమ్మో అన్ని పూలు కోయటమే ! అందుకని చిన్నదే తీసుకొని , ఎందుకైనా మంచిదని టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ సద్ది , మెడిసన్స్ పెట్టి పూల కోసం బయిలుదేరాను :)
నాతో పాటు మీరూ వస్తున్నారుగా తోటలోకి :)
ఏ పూవు చూసినా కోయబుద్ది కాదు . చెట్టుకే అందం గా వున్నాయి అనిపిస్తుంది . తోట అంతా తిరిగి , మొక్కలన్నిటినీ పలకరించి , నాలుగు పచ్చగన్నేరు , నాలుగు రెక్కవర్ధనం , ఓ రెండు మందారాలు కోసుకొని , ఇంట్లోకి నడుస్తూవుంటే మావారు మెట్ల మీద ఎదురైనారు . అదేమిటి అప్పుడే వెళుతున్నారు , పూజ చేసుకోరా అంటే చేసాను అన్నారు . బ్రేక్ ఫాస్ట్ అన్నా అదీ ఐందన్నారు . మెడిసన్స్ వేసుకున్నారా అంటే ఆ అన్నారు . మరి పూలు కోసుకొచ్చాను , దేవుడి కి పెట్టరా అంటే నువ్వు పెట్టేయ్లే అని బై చెప్పి వెళ్ళిపోయారు ! ప్రతిరోజూ అంతే . తొందరగా పూలు కోసుకొద్దామనే వెళుతాను కాని ఎప్పుడూ అంతే :) ఈ నాలుగు మొక్కలకేనా అనకండి ఇంకా చాలా మొక్కలుండేవి .
వుండేవి అంటే హూం వుండేవి అంతే . ఇదంతా గత వైభవం ! ఏమి చెప్పను నా దీనగాధ ! మా పక్కన ఇల్లు కూల గొట్టారు . అది కూల గొట్టేటప్పుడే బోలెడు దుమ్ము . ఇంటి నిండా , వంటి నిండా చాలక నా మొక్కల నిండానూ . సరేలే దుమ్మే కదా అనుకున్నాను .ఫ్లాట్స్ కట్టటం మొదలు పెట్టారు . అడ్డం గా తెర కట్టారు పర్లేదు అనుకున్నాను . ఓ తెల్లారి పూలు కోసేందుకు వెళ్ళి చూద్దునుకదా కుండీల నిండా సిమెంట్ :( గబ గబా కుండీలన్నీ ఇంకో వైపుకు మార్చాను . ఐనా లాభం లేక పోయింది . సిమెంట్ పడ్డ కుండీలలోని మొక్క లన్నీ చచ్చిపోయాయి :( వాటిని చూసి కన్నీళ్ళు ఆగలేదు :( కనీసం మిగిలిన వాటినైనా బతికించుకుందామని పక్కింటి కీ దూరంగా జరిపాను . అంతేనా ? ఎండాకాలం మొదలైంది . మొక్కలని బాదం చెట్టు నీడ లోకి మారుద్దామంటే పక్కింటి చెత్త అక్కడి దాకా పడుతోంది . మే ఎండింగ్ ఐయ్యేసరికి మా బోర్ ఇక నీళ్ళు ఇవ్వలేనని చేతులెత్తేసింది ! దానికీ కారణం పక్కవాళ్ళే ! మా బోర్ 400 అడుగుల లోతైతే వాళ్ళు 800 దాకా వెళ్ళారు :(
ఓ పక్క మండించే ఎండలు .ఇంకో పక్క అరా కొరా వచ్చే మున్సిపాలిటీ నీళ్ళు , బోర్ నీళ్ళ తో ఎలాగో రోజులు వెళ్ళదీస్తూ ,బియ్యం గట్రా కడిగిన నీళ్ళూ అవీ ఎలాగో నీళ్ళుపోస్తునే వున్నాను . కాని ఎండ వేడి కి తట్టుకోలేక నిప్పులో మాడ్చినట్లుగా అన్ని మొక్కలూ నల్లగా మగ్గిపోయాయి . పాపం అలానే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని మందారాలు పూలు ఇస్తూనే వున్నాయి .ఓ రోజు మందారాలు కోస్తూ వుంటే పక్కింటి ఆవిడ , ఈ ఎండలకి , కుండిలల్లో ఐనా మందారాలు బాగానే పూస్తున్నాయండీ అంటూ ధీర్గం తీసింది . చేతిలో వున్న పూల బుట్టతో ఒక్కటి తగిలిద్దామన్నంత కోపం వచ్చింది . తమాయించుకున్నాను . అంతే ఆ దిష్ఠి కి అవీ మాడి పోయాయి :( అటుపక్క , ఇటుపక్క వాళ్ళ మూలంగా నా మొక్కలన్నీ పోయాయి . వా వా (((((((
పూల మొక్కల గాధ ఇలా వుంది . నేను చేసిన పోషణకు చక్కగా జామకాయలు ఓ ఇరవైదాకా కాసాయి . దోరకాయలు చాలా రుచిగా వున్నాయి . ఈ సారి చెట్టంతా పూత పిందె వేసాయి . చెట్టు కళకళ లాడుతూ వుంది . ఓకాయ కొంచం పెద్దగా కూడా అయ్యింది .అది మా బెడ్ రూం కిటికీ నుంచి కోసుకునేట్లుగా వుంది . ఇంకొంచం మాగాక కోద్దామనుకున్నాను . కొంచమాగండి కళ్ళ నీళ్ళు తుడుచుకొని చెపుతాను . . . . . నిన్న ఎక్కడి నుంచి వచ్చిందో రామదండు , మూడు కోతులొచ్చాయి . ఆ కాయ తోపాటు చెట్టంతా దులిపి పెట్టాయి . కొమ్మలు విరిచేసాయి వాఆఅ (((((
ఇహ కొబ్బరిచెట్టు దగ్గరకి పదండి . ఈ సంవత్సరమంతా ప్రతి శనివారం దేవుడి కి ఓ కొబ్బరికాయైతే ఇస్తోంది . ఇదొక్కటే అన్ని వడుదొడుకులను తట్టుకొని నిలబడ్డది :)
ఈ దీన పరిస్తితులలో మొన్నటి నుంచి వాన పడుతోంది :) చావలేక మిగిలివున్న మొక్కలన్నీ దుమ్ము , సున్నం వంటి నిండా కొట్టుకొని వున్నాయి. ఈ రెండు రోజుల వానతో అవన్ని చక్కగా స్నానం చేసి పచ్చని పట్టుచీరలు కట్టుకొని ముస్తాబయ్యాయి .బొజ్జ నిండా నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. మా మాలి ఈశ్వరయను పిలిచి కొత్త మొక్కలు పెట్టించాలనుకుంటూ వుంటే మా వారు , ఎండాకాలం మన నీళ్ళ ప్రాబ్లం గుర్తుంచుకొని తెచ్చుకో మొక్కలని . ఆ తరువాత మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటావు అని హెచ్చరించారు .అప్పటి సంగతి అప్పుడే :) ఇప్పుడైతే బోలెడు మొక్కలు లిస్ట్ లో వున్నాయి .
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
అయ్యో అయ్యో..ఎన్ని మొక్కలు పాడైపోయాయో... కళ్ళముందే అలా పోతూవుంటే పాప, చాలా బాధపడి వుంటారు. లిల్లీపూలు భలే అందంగా ఉన్నాయండీ...
మీ మెక్కల స్టోరీ బాగుంది అండీ...
సందేహించకుండా కొత్తమెక్కలు వేసేయండి.. ఈ సారి మీకు ఎండాకాలం నీటికి ఇబ్బంది ఉండకూడదని నేను దేవుడ్ని ప్రార్ధిస్తాను...
బాగా చెప్పారండీ... కరుణశ్రీగారి పుష్పవిలాపం లాగ మీ మొక్కల విలాపం మనసుని తాకింది.
నాదీ ఇదే పరిస్థితి. ఈ ఎండలకి పాపం నా మొక్కలు కొన్ని తల వాల్చేసాయి. ప్రాణం గిలగిలలాడిపోతోంది నాకు. :((
పోనీలెండి మీకు వర్షం పడింది. ఉన్న మొక్కలైనా ఊపిరి పీల్చుకుంటాయి. :)
మాకెప్పుడు పడుతుందో!! :((
maala garu pulu koseyakandi paapam mokkalu baadha padataayi kadaa!! enta baavunnayo pula mokkalu kaani vesavi kopaaniki mana to paatemokkalu bali aipoyaayi...(:
ప్రకృతి ప్రసాదించే వాన చినుకు అమృతోపమానం.మొక్కల వేదనను ఆర్తిగా వినిపించారు.
mokkala kosam mee bhadha bavvundandi.
మాలా గారు, మనం స్వహస్తాలతో పెంచుకున్న మొక్కలు అలా అయిపోతే బాధ కదండి?
నోరూరుంచే జాంకాయల చెట్టు కాస్తా కోతుల పాలయిందా?
కొబ్బరికాయ చెట్టు మాత్రం తట్టుకుని నిలబడిందనమాట.
బాధపడకండి మాలా గారు. మళ్ళీ పెంచుకుందురు మొక్కలను.
నీటి ఎద్దడి,ప్రతికూల వాతావరణం లోను ..మీ అభిరుచి చాలా బాగుంది.మీ తోట చాలా బాగుంది.:) దిష్టి తగిలింది అనుకోకండి మాలా కుమార్ గారు. కాక్టస్ జాతి మొక్కలు పెట్టండి. అలాగే గంటల తరబడి అలా తోటలోనే విహరించకండి.అప్పుడప్పుడు అందరికి చూపండి. .
జ్యోతిర్మయి గారు ,
అవునండి . ఒకొక్కటి పోతుంటే ఏమీచేయలేక చూస్తూ వుండిపోయాను :(
&సాయి గారు ,
మీ ప్రార్ధన ఫలించాలని నేనూ కోరుకుంటానండి . థాంక్ యు .
&శ్రీలలిత గారు ,
మీకు కరుణశ్రీ పుష్పవిలాపం గుర్తుతెచ్చానా ? అంత ప్రఖ్యాత కవితను గుర్తుతెచ్చుకున్నందుకు ధన్యవాదాలండి .
అ.సౌమ్యగారు ,
అవునండి . చావలేక వున్నవైనా పచ్చబడుతుంటే సంతోషం గా వుంది .
&చెప్పాలంటే గారు ,
పూలు కోయటం నాకూ ఇష్టం లేదండి . కాకపోతే దేవుడి కోసం కొన్ని కోస్తాను అంతే :)
&సి ఉమాదేవి గారు .
మీ వాఖ్య బాగుందండి . ఎంతైనా రచయిత్రి కదా చక్కగా చెప్పారు .
ట్రీ గారు ,
మీకు నా బాధ నచ్చినందుకు థాంక్స్ అండి .
&జలతారువెన్నెల గారు,
అవునండి అన్ని అలా పోయాయి :( మీ ఓదార్పుకు థాంక్స్ అండి .
& అనొనమస్ గారు ,
మీ ఇంఫర్మెషన్ కు థాంక్స్ అండి .
&వనజవనమాలి గారు ,
దృష్ఠి తగలటానికి అక్కడేమీ లేవండి . అదంతా రెండు నెలల క్రితం వైభోగం . మాకు ఇల్లు అమ్మిన వాళ్ళు అన్నీ క్రోటన్సే పెట్టారు . వాళ్ళకు టేస్ట్ లేదనుకొని అవన్నీ తీయించేసి , రంగు రంగుల పూల మొక్కలు పెట్టించాను కాని అసలు కారణం నీళ్ళ ప్రాబ్లం అనుకోలేదు :) ఈ సారి బోగన్ విల్లాస్ పెడుదామనుకుంటున్నాను . అవీ పోతే ఇహ తూరుఫు తిరిగి దండమే :)
Post a Comment