"బ్లాగు పుస్తకం" అవిష్కరణ గురించి బ్లాగులల్లో చదువుతూనే వున్నాను .ఇంటికి దగ్గరే కదా వెళుదామా అని మనసుపీకుతోంది .దానికంత ఆలోచనెందుకు వెళితేపోలే అనుకున్నా , వెళ్ళటం కాదుకదా ప్రాబ్లం . అసలు ప్రాబ్లం ఆ హాల్ ఐదో అంతస్తులో . ఒకటో రెండో అంతస్తులైతే మెట్లెక్కచ్చు కాని ఐదు ఎట్లా ఎక్కుతాను .నాకు తెలుసు లిఫ్ట్ వుంటుందని . అసలు ప్రాబ్లం అదే కదా :) హుం . . . ఇక ఆశ వదిలేసి తీరిగ్గా పనులు చేసుకుంటూ వుంటే సి. ఉమాదేవి గారు ఫోన్ చేసారు . ఉభయకుశలోపరి , ఆపైన తోట లో చెట్ల గురించి అయ్యాక , రెండునెలలనుచి రాకుండా మొహం చాటేస్తున్న తోటమాలి గురించీ మాట్లాడుకోవటం అయ్యాక , మీరు బ్లాగు పుస్తకావిష్కరణ కు వెళుతున్నారా అని అడిగారు . లేదండి అన్నాక , బుర్ర లో బల్బ్ వెలిగి మీరు వెళుతున్నారా అని అడిగాను . వెళుదామనుకున్నానండి కాని ఎవరూ తోడు దొరకటం లేదు అన్నారు . మీరు వెళుతుంటే నేనూ వస్తాను అని చటుక్కున అనేసాను . ఐతే 1 కల్లా రెడిగా వుండండి , నేను మిమ్మలిని పికప్ చేసుకుంటాను అన్నారు .అలా మాచ్ ఫిక్సైంది . కాని గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . . . లిఫ్ట్ ఎలా ఎక్కటమా ????? ఉమాదేవి గారు ఏమనుకుంటారో అని ఓ వైపు ఆలోచిస్తూనే వున్నాను . ఎక్కడా జాగా లేనట్లు వీళ్ళు ఐదో అంతస్తులో సెటిల్ కావటమేమిటి అని మనసులో విసుక్కుంటూ మధనపడుతున్నాను . . . ఇంతలో లక్ష్మి గారు కాల్ చేసి నేను మిమ్మలిని మీ ఇంటి దగ్గరే పికప్ చేసుకుంటానండి , మీరు రెడీఏనా అన్నారు . హమ్మయ్య లక్ష్మి గారు వస్తున్నారు . లిఫ్ట్ సంగతి ఆవిడే చూసుకుంటారు . మనం హాపీసూ :))))))
లక్ష్మిగారి శ్రీవారు శ్రీ.వెంకటేశ్వర్లు గారి పుణ్యమా అని సభాస్తలికి చేరుకున్నాము . ఆయన దగ్గరుండి మరీ లిఫ్ట్ ఎక్కించి వెళ్ళారు . ఆ బిల్డింగ్ వాళ్ళ పుణ్యమా అని ఆ లిఫ్ట్ కూడా కటకటాల లిఫ్ట్ . హమ్మయ్య గండం గడిచింది . హాల్ లో సుజాత గారు ,వరూధిని గారు కనిపించారు . తెలిసిన వాళ్ళున్నారు అమ్మయ్య అనుకున్నాను .
అందరినీ అక్కడ వున్న బోర్డ్ మీద పేరు రాయమన్నారు . టీ బిస్కెట్స్ ఇచ్చారు . వక్తలందరూ బ్లాగు పుస్తకం గురించి , బ్లాగుల గురించి చక్కగా మాట్లాడుతున్నారు . చాలా ఇంట్రెస్టింగా వుండింది . ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెపుతుంటే చాలా సరదాగా వుంది .అంతా బాగానే వుంది కాని నన్నూ మాట్లాడమన్నారు :) అంతే గుండెల్లో ఢాం * * * బాబోయ్ * * * నేనా మాట్లాడటమా ??? చిన్నగా తప్పించుకున్నాను . చావా కిరణ్ వచ్చి లక్ష్మిగారి కి , ఉమాదేవి గారికి బ్లాగు పుస్తకాలిచ్చారు . నా వైపు చూసి మాట్లాడిన వాళ్ళకే పుస్తకాలు అన్నాడు . హి హి హి అని నవ్వి వూరుకున్నాను :) అందరూ మట్లాడారు . మీరొక్కరే మాట్లాడలేదు మాట్లాడండి అని లక్ష్మిగారు , ఉమాదేవి గారు అన్నారు . వాళ్ళన్నారనే కాదు , ఈ సంగతి తెలుస్తే , మావారు ఇచ్చే క్లాస్ ను భరించటం చాలా కష్టం అని , మొత్తాని కి ఏదో మమ అనిపించాను . ఏమి మాట్లాడాను అంటే ఏమో , విన్నవాళ్ళ అదృష్టం హి హి హి . మొత్తానికి నాకూ ఓ పుస్తకం దొరికింది :)))))
సరే పుస్తకం దొరికింది . దానితో పాటు చావా కిరణ్ ,నాగార్జునాచారి , బంతి , చాణక్య , అపర్ణ ,కశ్యప్ , కట్టావిజయ్, జీవితం లో కొత్తకోణం శ్రీనివాస్ గార్ల ల పరిచయం కలిగింది . అందరూ చాలా అభిమానం గా మాట్లాడారు . అందరినీ పరిచయం చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది .
"బ్లాగు పుస్తకం " ముఖచిత్రం ముచ్చటగా వుంది . చూడగానే చదవాలి అనిపించింది ."ఈ పుస్తకం కేవలం మీకు దారి చూపించి , ఆ దారి గురించి చెబుతుంది . మీ ప్రయాణం మీరే చేయాలి సుమా !" అని మన బాధ్యతను గుర్తు చేస్తూ మొదలవటం నాకు చాలా నచ్చింది .మన మన్సులో వున్న భావాలను బ్లాగుల్లో ఎలా పంచుకోవాలో ఒక పద్దతిగా వివరించారు .ఏ విషయాలను పంచుకోవచ్చో ,ఏవి తెలియజేయకూడదో చక్కగా వివరించారు .కొత్తగా బ్లాగు మొదలు పెట్టేవారి కి ఈ పుస్తకం సరైన మార్గదర్శి . బ్లాగు రాస్తున్నవారికి కూడా ఎన్నో సాంకేతికా విషయాలను , చిత్రాల తో సహా వివరించారు . అంతే కాకుండా వేరే వాళ్ళ బ్లాగులను ఎలా చదవాలో కూడా తెలియజేసారు .మన వాఖ్యలను ఎలా రాయాలి , వాఖ్యలకు ఎలా స్పందించాలో కూడా తెలియజేసారు .ముఖ్యం గా ఈ బ్లాగుల వల్ల ఏర్పడే పరిచయాలను , ఎన్నో అనుభవాలను తెలియజేసారు .
ఇంతెందుకు అదీ , ఇదీ అని కాదు బ్లాగుల గురించి సమస్తమూ తెలుసుకోవచ్చు . నిజంగా ఇది బ్లాగర్లకు చాలా వుపయోగపడే పుస్తకం . దీని రూపకర్తలు , చావా కిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు చాలా కష్టపడ్డారు .వారికి అభినందనలు .
అన్నట్లు ఇందులో నా పేరు కూడా వుందండోయ్ చూడటం మర్చిపోకండి . థాంక్ యు , చావాకిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు . నాకు బ్లాగులో ఏదైనా డౌట్ వస్తే తనను అడగమని రెహ్మాన్ గారు వారి ఐ డి ఇచ్చారు . థాంక్స్ అండి .