Thursday, January 5, 2012

బొమ్మాళీ నన్నొదిలేయ్ !!! నన్ను వళ్ళేయవే బొమ్మాళీ!!!



నేను కూడలి లో చేరిన కొత్తల్లో , కూడలి నిండా " నిన్నొదల బొమ్మాళీ " అని టైటిల్స్ తెగ కనిపించేవి . అప్పుడే స్కూల్ లో కొత్తగా చేరిన మా మనవడు స్కూల్ నుంచి వస్తూనే " నిన్నొదళ బొమ్మాళీ " ( ళ నే , ల కాదు . అప్పట్లో మేము ఎక్సైట్మెంట్ లో అలాగే మాట్లాడేవాళ్ళము :)) అని నా మీదకు తెగ గెంతుతూ వుండేవాడు . ఈ బొమ్మాళీ ఏమిటి చెప్మా అని , ఆ పొస్ట్ లు చదివితే " అరుందతి " సినిమా లో డైలాగ్ అని అర్ధమైంది :) అదేదో దయ్యాలూ , పునర్జన్మలూ వున్న భయంకరమైన సినిమా అని తెలిసి , చూడాలని క్యూరియాసిటీ వున్నా దాని జోలికి పోలేదు .

రెండు నెలల క్రితం కొన్ని సి.డి లు తెచ్చుందామని కోటీ వెళ్ళాను . రెండుమూడు నెలల కోసారి , కొన్ని పుస్తకాలు , సినిమాల సి.డి లు కొనుక్కొచ్చుకోవటం నా అలవాటు :) . సి.డి లు చూస్తూ వుండగా , సేల్స్ మాన్ " అరుంధతి " సి .డి లు తెచ్చి అక్కడ సద్దాడు . ఈ సినిమా ఎట్లా వుంటుంది బాబూ అని అడిగాను అతనిని . మస్త్ వుంటది మేడం అన్నాడు అతను . ఇంతకు ముందు " చంద్రముఖి " సినిమా వచ్చినప్పుడు సుదర్షన్ లో చూడటానికి వెళ్ళి , టికెట్స్ కొనుక్కొని కూడా భయమేసి పది రూపాయల నష్టాని కి అమ్మేసి బయటపడ్డాము . ( వాళ్ళు డబ్బులు తక్కువిచ్చారని బయటకు వచ్చి చూసుకున్నాక తెలిసిదిలెండి . అప్పుడేమో హడావిడిగా వాటిని వదిలించుకునే మూడ్ లో వున్నామన్నమాట ) . ఆ తరువాత సి. డి తెచ్చుకొని చూసి వోరినీ దీనికేనా నేను అంత భయపడి డబ్బు నష్టపోయింది అనుకున్నాను . అలాగే ఈ అరుంధతి కూడా థియేటర్ లోని సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో తీరిగ్గా చూడవచ్చు అని ధైర్యం చేసి సి. డి తెచ్చేసుకున్నాను . తెచ్చిన రెండు నెలల కి చూడటానికి నాకు ఇప్పుడు టైం దొరికింది. ఈ రెండు నెలలు వూరికే వుండలేదు లెండి . వీలైనప్పుడల్లా వారినీ వీరినీ , ఇలా అరుంధతి ని తెచ్చుకున్నాను చూడవచ్చా అని అడిగి అభిప్రాయ సేకరణ చేస్తూనే వున్నాను . అదేమిటో అందరూ వద్దు చూడకు , చూస్తే భయపడి చస్తావ్ అని బెదిరించారు . అప్పుడు కాస్త భయమేసినా ఆ ఈ మాత్రానికేనా అని నోరు చప్పరించేసాను . ఈ మద్య మావారు ఇంట్లో వుండి అప్పుడప్పుడు సి.డి లు చూస్తున్నప్పుడోసారి ఏమండీ అరుంధతి చూద్దామా అని అడిగాను . ఏదీ ఆ పెద్ద బొట్టు పెట్టుకొని వుంటుంది ఆ సినిమానా నాకు అలాంటివంటే చిరాకు అనేసారు , ఏం చేస్తాం అప్పుడు మిస్సమ్మో మరేదో చూసాము :) . , . ఇహ ఆగలేక ,నిన్న మావారు ఆఫీస్ ఎప్పుడెప్పుడు వెళుతారా అని ఎదురుచూసీ . . . చూసీ ఆయన ఆయనటెల్లగానే నేనిటు అరుంధతి ని బయటకు తీసాను .

కుర్చీనీ టి. వి ముందుకు జరుపుకున్నాను . కొంచం చుడువా ప్లేట్లో తెచ్చుకొని సైడ్ టేబుల్ మీద పెట్టాను . మంచినీళ్ళ గ్లాస్ కూడా తెచ్చుకున్నాను . సెల్ పక్కన పెటుకున్నాను . మళ్ళి మధ్యలో లేచే పని లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ .చేసుకున్నానన్నమాట :) చిన్నగా ఆంజనేయ స్వామిని తలుచుకొని సి.డి ని ఇన్సర్ట్ చేసాను . . . ఆన్ చేసాను * * * *

సినిమా మొదలైంది . ముందు ఏమి వచ్చిందబ్బా . . . ఏమో గుర్తులేదే !!!!! ఎవరో భార్యా భర్త లు కార్ లో వెళుతున్నారు . గద్వాల్ అని ఏదో బోర్డ్ కనిపించింది . ఇంతలో ఓ పాడుబడ్డ కోట . వీళ్ళు దాని దగ్గరికి చేరగానే ఆ కోట లైట్ల తో వెలిగి పోతోంది . అక్కడే వాళ్ళ కార్ ఆగిపోయింది . . . ఎందుకు ? ఏమో గుర్తురావటం లేదు . . . ఇద్దరూ కార్ దిగి ఆ ఇంటి వైపు నడిచారు . . .
గేట్ మొదట్లో ఎవరో కనిపించి ఆ ఇంటికి వెళ్ళవద్దు అంటారు . ఐనా వినరు .ఇద్దరూ లోపలికి వెళుతారు . నేను చూడలేక దడ దడ కొట్టుకునే గుండెను పట్టుకొని బయటకు వెళ్ళాను * * * మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఓ గోడ కూలుతోంది . . . భార్య కనిపించలేదు . భర్త ఏమయ్యాడు . ఏమో . . . ఇదేమిటి నా మైండ్ ఇంత బ్లాంకైంది * * *
ఆ తరువాత సత్యనారాయణ ఓ గదిలోకి వెళ్ళాడు . అక్కడ టేబుల్ డ్రా లో నుండి ఏమో తీస్తున్నాడు . అంతే చిన్నగా ఆ గది తలుపులు మూసుకుంటున్నాయి . . . మూసుకుంటున్నాయి . . . మూసుకున్నాయి . . . అంతే నా గుండె ఇంకా స్పీడ్ గా ధడ్ . . . ధడ్ . . . ధడ్ . . . ఇంక చూడలేక పోయాను . ఆఫ్ చేసి బయటకు వెళ్ళి కూర్చున్నాను .
మళ్ళీ ఆ తరువాత ఏమి జరిగిందో నన్న క్యూరియాసిటీ తో అరుంధతిని పెట్టాను . అప్పటి వరకు చూసినదా నిని ఫార్వర్డ్ చేసి కొంచం ముందు కు పెట్టాను . ఎవరో పకీరు , ఇందాక చూసినబ్బాయిని ఎడా పెడా బాదుతున్నాడు . అనుష్క అతనిని ఆపి ఆ అతనిని కోపంచేసి , ఆ అబ్బాయిని తీసుకెళ్ళబోతుంది . ఇంతలో ఆ పకీరు కు ఆ పాడుపడిన ఇల్లు కనిపిస్తుంది . వెంటనే అతను అనుష్క తో ఇతనికి కాదు నీకు ఆపద పొంచి వుంది జాగ్రత్త అంటాడు . హుం అని హుంకరించి వెళ్ళిపోతుంది .

అనుష్క కు కాల్ వస్తుంది . లేచి కార్ తీసుకొని ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరకు వస్తుంది . . . కార్ దిగుతుంది . . . చేతిలో పెద్ద టార్చ్ లైట్ తీసుకొని ఆ భవనం దగ్గరకు బయలు దేరుతుంది . . . . . పెద్ద బొట్టు , పూసలదండలు వేసుకున్న మాంత్రికుడి లాంటి అతను ఎదురొచ్చి అటు వెళ్ళవద్దు అంటాడు . వినదు . . . రాహుల్ . . . రాహుల్ . . . ( రాహులా . . . రోహితా ? ఏమో ఏంపాడో ఏదో వకటి ) అని పిలుస్తూ ఆ పెద్ద టార్చ్ లైట్ వెలిగించి చూస్తూ ఆ భవనం లోకి న. . డి . . చి. . ంది. . .

నా గుండె ధడ్. . . ధడ్. . . ధడ్ . . . బాబోయ్ ఇహ నా వల్ల కాదు చూడటం . ఇలా ఐతే నా గుండె ఆగిపోతుంది బాబోయ్ అనుకొని ఆపేసి " శాంతి నివాసం " పెట్టాను . ఇంకా గుండె దడ తగ్గలేదు . కాసేపు బాలకనీలో తిరిగి వద్దామని కొంచం వాకింగ్ చేసి , గుండెను పదిలం గా పట్టుకొని వచ్చాను . వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొదలైంది . దేవిక కాంతారావు పాదాలు కొంగుతో తుడిచి , పౌడర్ వేసి సాక్స్ ఎక్కిస్తోంది . హూమ్మ్ . . . . ఇదెక్కడి పతి భక్తి రా నాయనా . . . . .నీ పతిభక్తి మండ * * * దేవుడా . . . దేవుడా మండే పొయ్యి లోనుంచి కాలే పెనం మీద వేసావా తండ్రీ అని ఆర్తనాదం చేసి , పొయ్యికన్న పెనం బెటర్లే అనుకున్నాను :)

అప్పుడే ఐపోలేదు . ఐపోతే ఇంకేముంది . సి. డి ప్లేయర్ మీద నుంచి అరుంధతి రా రమ్మని పిలుస్తూనే వుంది . అందుకే మా వారిని ఇద్దరం కలిసి మెలిసి అరుంధతి ని చూద్దామని బతిమిలాడాను .ఠాట్ . . . అన్నారు .

జీన్స్ పాంట్ , చక్కని షర్ట్ , మెళ్ళో స్కార్ఫ్ , చేతిలో పెద్ద టార్చ్లైట్ . . . . .అందం గా వున్న అనుష్క .* * * ఆ టార్చ్ లైట్ నా మొహం మీద కు వెసి , అటూ ఇటూ తిప్పుతూ దా* * * దా* * * వచ్చేయ్ * * * అని పిలుస్తోంది .
వద్దు వద్దు * * * రాను * * * బొమ్మాళీ నన్నొదిలేయ్ * * * నన్నొదిళేయ్ బొమ్మాళీ * * *

"మాలా . . . మాలా . . . లే " అని మావారు లేపారు . ఎన్నడూ లేనిది ఏమిటి అంత పెద్ద కేకలు పెడుతున్నావు అని అడిగారు . ( అవును మరి ఇన్నేళ్ళలో ఆయన కలవరించటమే కాని నేను కలవరించటం తెలీదుగా ! ) మొహమంతా చెమటలు . . . వణుకుతున్నాను * * * ఏదో పీడ కల వచ్చిందని చెప్పి తప్పించుకున్నాను .

పొద్దున లేచినప్పటి నుంచి నా కళ్ళు అరుంధతి నే చూస్తున్నాయి . . . నా కాళ్ళు అటే పోతున్నాయి . . . చేతులూ అటే వెళుతున్నాయి . అరుంధతి రా . . . రా . . అని పిలుస్తోంది . ఎప్పటికైనా ధైర్యం తెచ్చుకొని ఆ సినిమా చూడాలి అని నా మనసులోని కోరిక . బయటకు చెపితే మా వారు ఆ సి. డి విరగ్గొట్టి అవతల పారేయరూ !!!!!

నాకు ధైర్యం వచ్చేవరకూ నన్ను వళ్ళెయ్ బొమ్మాళీ * * * * * అని ఆ బొమ్మాళీ ని వేడుకుంటున్నాను :) :) :) :) :)

18 comments:

kastephale said...

నేను సినిమా చూసి ముఫయి ఏళ్ళ పైమాటే! మీ రెవ్యూ చదువుతోంటే భయమేసింది. చూడను లెండి.

రుక్మిణిదేవి said...

మాల గారు , excellent ... చదువుతున్నప్పుడు , 1991 వ సంవత్సరం లో ఒకసారి మా అబ్బాయిని చదివించుదామని నేనూ టి.వి ఆన్ చేసి మరీ కూర్చున్నాను ..అంతే అంతస్తులు సినిమా అనుకుంటా .. "నిను వీడని నీడని నేను ..ఓ ఓ ఓ ఓ ఓ" అని మొదలైంది .. బాబుని తీసుకుని గుండె దడ దడ లాడుతుంటే తలుపులు అలానే ఒదిలేసి మరీ ఒకటే పరుగు మేడ పైకి ...పై ఇంటి వాళ్ళు వచ్చి తాళం వేసి వచ్చారు .. మళ్ళీ మా వారు ఇంటికి వచ్చేదాకా అక్కడే .. ఆ దాదా అలానే .. మై గాడ్ .. బాగుందని .. చాలా బాగా వ్రాసారు ...

సుభ/subha said...

హా హా హా... అంత భయంకరంగా ఏముండదండీ.. అసలేమీ కాదు అనుకుని చూసేయండి.. ఒక పనైపోద్ది. ఇంక బొమ్మాళీ మీ వైపు చూడనే చూడదు.

శ్రీలలిత said...

ఏదైనా చెప్పడం తేలికే..
భయపడొద్దు... చూసెయ్యండీ..అని చెపుదామనుకున్నాను... కాని.. మొన్నీమధ్య ఆ సినిమా టీవీ లో వేసినప్పుడు కూడా అది చూడకూడదని నేను చాలా జాగ్రత్తగా ఆ చానల్ దాటించడానికి కూడా ఎంత భయపడ్డానో..
ఎవరో చెప్పారు.. చిన్నపిల్లని దెయ్యం ఆవహిస్తుందని. అది మరీ బాధగా అనిపించి అస్సలు చూడకూడదనుకున్నాను..
మీ వారు ఆ సిడీ ని ఎప్పుడు విరక్కొడతారా? అని చూస్తున్నాను.. ఆ శుభవార్త తొందరగా చెప్పెయ్యండి..

ఆ.సౌమ్య said...

హహహహ మరీ ఇంత భయమేమిటండీ మీకు!
అంత భయపడాల్సినదేమీ లేదు ఆ సినిమలో...రక్తమయం సినిమా అంత...భయమెయ్యదుగానీ చిరాకేస్తుంది అంతే..ధైర్యం గా చూడండి పర్లేదు. :)

రాజ్యలక్ష్మి.N said...

ఇలాంటి సినిమాలు ఫామిలీ తొనో ఫ్రెండ్స్ తోనో కలిసి చూసేటప్పుడు అంత భయమేముందిలే అనిపిస్తుందండీ..
అదే ఒక్కళ్ళం వున్నపుడు
ఆ సినిమాలో సీన్స్ గుర్తుకు వచ్చినా,
అలాంటి సీన్స్ టీవీలో ఎక్కడన్నా కనిపించినా అప్పుడు వుంటుంది అసలు సంగతి..

రాజ్యలక్ష్మి.N said...

"వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొదలైంది . దేవిక కాంతారావు పాదాలు కొంగుతో తుడిచి , పౌడర్ వేసి సాక్స్ ఎక్కిస్తోంది . హూమ్మ్ . . . . ఇదెక్కడి పతి భక్తి రా నాయనా . . . . . "

కదండీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు..
:) :)

వేణూశ్రీకాంత్ said...

హహహ :-) ఈసారి భయమేసినపుడు ఆ సీన్ ని కామెడీ చేయడానికి ప్రయత్నించి చూడండి వర్క్ ఔట్ అవ్వచ్చు :-)

Kottapali said...

భలే. చిన్నప్పుడు నాకు దయ్యం సినిమాలంటే పిచ్చ భయంగా ఉండేది. రేడియోలో నిను వీడని నీడను నేనే పాట వస్తుంటే ఠక్కున కట్టేసేవాణ్ణి.

మాలా కుమార్ said...

కష్టేఫలె గారు ,
చూడకండి వళ్ళెయండి :)

*రుక్మిణీదేవి గారు ,
మీరూ నా అంత ధైర్యస్తులేనన్న మాట !

* సుభ గారు ,
ఏమో నండి తలుచుకుంటేనే భయం గా వుంది .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు,
ఇక ఇప్పట్లో ఆ సినిమా చూసే ధైర్యం చేయనులెండి . అంత డబ్బు పోసి కొన్నది విరగొట్టుకోవటానికానండి :)

* సౌమ్యా ,
అంతా రక్తమా ? అమ్మ బాబోయ్ రక్త మంటే మరీ భయం . నేను బ్లడ్ తెస్ట్ కివ్వాల్సి వచ్చినప్పుడల్లా అదో పెద్ద ప్రహసనం అవుతుంది . కళ్ళు గిర్రున తిరిగిపోతాయి :)

* రాజీ ,
ఓ చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూవాళ్ళం . "ఆమె ఎవరు " అలాగే చూసాము ఫ్రెండ్స్ అంతా కలిసి . అప్పుడు ఏమి చూస్తున్నాము అనే ధ్యాసే లేదసలు :)
అంత ఘోరమైన పతిభక్తి ని భరించటం కష్టం లెండి :)

మాలా కుమార్ said...

వేణూ ,
నవండి నవ్వండి . మీ అందరికీ నా భయం చూస్తే అలాగే నవ్వొస్తుంది :)

* నారాయణస్వామి గారు ,
ఐతే మీకూ చిన్నప్పుడు భయమెనన్నమాట :)

శ్రీధర్. దు said...

నాలుగేళ్ల నా కజిన్ కూతురు (చిక్కి) : హే... ఏంటి బాబాయి నీకు అరుంధతి సినిమా అంటే భయమా!? నేను 4 టైమ్స్ చూసాను తెలుసా! మా ఫ్రెండ్ అయితే 10 టైమ్స్ చూసిందిట.
నేను: :-(

Anonymous said...

బొమ్మాళీని కెలికి వదిలేస్తే అది ఊరుకుంటుందా ! రోజూ మీ కలలోకి వచ్చి వేధిస్తుంది. ముందా సి.డి.ని భూస్తాపితం చేసెయ్యండి పీడా పోతుంది .

Disp Name said...

అదేమిటండీ, 'కొలవేర్రి' కాలం లో బొమ్మాళీ ని పట్టుకున్నారు ! బొమ్మాళీ వదిలినా వెంటనే కొలవేర్రి మీ కలలో వచ్చును !


చీర్స్
జిలేబి.

మాలా కుమార్ said...

శ్రీగారు ,
నాలుగేళ్ళ పాపకే అంత ధైర్యం ! ఐతే మిమ్మలినీ నా కేటగిరీ లో కట్టేసుకోవచ్చన్నమాట :)

*లలిత,
ఐతే సి.డి ని అలాగే భుస్తాపితం చేస్తే సరిపోతుందంటారా ?

* జిలేబీ గారు ,
ముందుగా నా బ్లాగింటికి స్వాగతం .
ఏ వెర్రైతే ఏముందిలెండి తగిలించుకోవటానికి :)
చీర్స్ జిలేబీ గారు .

y.v.ramana said...

>>వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొదలైంది . దేవిక కాంతారావు పాదాలు కొంగుతో తుడిచి , పౌడర్ వేసి సాక్స్ ఎక్కిస్తోంది . హూమ్మ్ . . . . ఇదెక్కడి పతి భక్తి రా నాయనా . . . . .నీ పతిభక్తి మండ * * *

మీకు పొయ్యిలో పడ్డట్లుగా అనిపించిందా!
యువరానర్! దేవిక స్త్రీ లందరికీ ఆదర్శమూర్తనీ.. ఇక నుండి భార్యలందరూ దేవికని అనుసరించాలని ఒక ఆర్డర్ పాస్ చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను!

మాలా కుమార్ said...

రమణ గారు ,
మా సాహితి కి స్వాగతమండి .
ఎందుకండీ మీకు భార్యల మీద అంత కోపం :)
పొయ్యి మీద కాదు , పొయ్యి లోనుంచి పెనం మీదికి పడ్డట్టు అనిపించింది :)