Saturday, May 1, 2021
డబ్బులోయ్ డబ్బులు . . . . . 4
నా చిన్నప్పుడు డబ్బులు దాచుకోవటానికి మట్టి ముంతలు దొరికేవి . మా అమ్మ అది కొనిచ్చి, అందులో చిల్లర పైసలు దాచుకోవటానికి అప్పుడప్పుడు ఇచ్చేది. ఇహ ఆ కుండకు రక రకాల రంగులు పూసి, డిజైన్స్ వేసి ముస్తాబు చేసేదానిని. ఆ కుండ నిండాక చిన్నప్పుడతే బుక్స్ కొనుక్కునేదానిని. ఆ కుండలకు వేసే పేంటింగ్స్ లకు, నింపే డబ్బులకు, నాకు , మా అత్తయ్య కూతురు పార్వతికి ఎప్పుడూ కాంపిటీషన్ వుండేది. అదేమిటో పాపం మా పార్వతి కుండ నిండగానే, వాళ్ళింట్లో దొంగలు పడి తన కుండ పగులకొట్టి, డబ్బులెత్తుకెళ్ళేవారు. తన కెప్పుడూ మట్టి పెంకులే మిగిలేవి. ఐనా అధైర్య పడకుండా మళ్ళీ నింపడము మొదలు పెట్టేది. మళ్ళీ హిస్టరీ రిపీట్స్!
నేను నా అలవాటు ప్రకారము మా పిల్లలిద్దరికీ చెరొక ముంత కొనిచ్చాను. మా అమ్మాయి సంజు కు దానిని అలంకరించి చూసుకోవటమే సరిపోయేది. మా అబ్బాయి బిపు మటుకు దానిని నింపటానికి ఇంట్లో చిల్లర పైసలు లేకుండా చేసేవాడు. మా మామగారు కిడ్డీ బాంక్ కొనిచ్చినా పిల్లలు దీనిని చూసుకునే మురిసి పోయేవారు. నాకు కూడా ఇంట్లోకి ఏఅవసరం వచ్చినా కిడ్డీ బాంకైతే తాళం తీసి వాడుకుంటాము ముంతలైతే అంత తొందరగా పగులకొట్టము కదా అనిపించి ఎక్కువగా ముంతలలోనే డబ్బులు వేసేదానిని. ప్రతి నెల మొదటితారీకున ఇద్దరి ముంతలు తీసి , ‘బాంక్ ఆఫ్ బరోడా’ లోని వాళ్ళ ఎకౌంట్ లో వేసేసేదానిని. అందులో కనీసం 100 రూపాయలు వేయాలి అంటే ఎక్కడెక్కడి చిల్లర వాడి ముంతలో చేరి పోయేది. మేము వేరే వూళ్ళలో వున్నప్పుడు, హైదరాబాద్ వచ్చేటప్పుడు, మూడు రోజుల ప్రయాణము లో ఖర్చు పెట్టుకోవటము కోసము ఏమండి పిల్లలిద్దరికి చెరి పది రూపాయలు ఇచ్చేవారు. మేము హైదరాబాద్ చేరుకున్నాక కూలీకి ఇవ్వటానికి మావాడి దగ్గరే ఆ పది రుపాయలు అప్పుచేసేవారు ఏమండి. ఖర్చు దగ్గర కూడా మహా పినాసీ. అందుకే ఏమండి ముద్దుగా ‘డబ్బులుగా’ అని, ‘రామనాథ్ గోయింకా’ అని పిలుచుకుంటారు. ఇప్పుడైతే డబ్బులన్నీ బాంక్ లోనే వుంటాయి. ఎప్పుడైనా అడుగుతే, గిడుగుతే పర్స్ లో లేవు మాతే ఏ. టి .యం కెళ్ళి తేవాలి. ఇప్పుడైతే నువ్విచ్చేయ్ తరువాత ఇస్తాను అంటాడు. ఎప్పుడూ ఆ ప్లాస్టిక్ మనీ తప్ప ,నొట్ మనీ వుండ నే వుండదు. అత్యవసరమైతే ఎలారా? అంటె నువ్వున్నావుగా అంటాడు. మా కోడలు మొహమాట పడి ఆంటీ నా క్రెడిట్ కార్డ్ వాడుకోండి అంటుంది. కూరలమ్మాయి, పూలవాడు క్రెడిట్ కార్డ్ తీసుకోరుకదమ్మా. నా షాపింగులు అవేకదా అంటాను నేను. వరేయ్ బేటా మీ ఆవిడకి పూలు కొనియ్యటనికి నువ్వేమీ శోభన్ బాబు కాలం వాడివి కాదు కాని కనీసము మొక్కజొన్న పొత్తులు కొనివ్వటానికైనా దగ్గర కాసిని డబ్బులుంచుకోరా అంటే చిద్విలాసం గా నవ్వేస్తాడు.
ఈ కాలం లో అందరూ క్రెడిట్ కార్డ్ లూ, ఏ. టి .యం లూ అంటారు. అక్కడ దొంగల చేతికి చిక్కని మాట నిజమే కాని అత్యవసరమైతే మన చేతికి చిక్కేదెలా? ఈ మద్య బందుల తో ఏ.టి .యం లు కూడా బందే వుంటున్నాయి. ఇళ్ళళ్ళో ఐతే చిల్లర పైసలు ఎక్కడపడితే అక్కడే పడేస్తారు. ఓసారి మా మామగారు ఒక ప్లాట్ అమ్మినప్పుడు కొనుక్కున్నతను ఒక సంచీ నిండా చిల్లర పైసలు తెచ్చి పేమెంట్ చేసాడుట. ఇంట్లో పిల్లలంతా కూర్చొని ఆ చిల్లర లెక్కబెట్టారుట. మా మామగారు అలాగే బాంక్ లో డిపాజిట్ చేసేసారుట! అప్పుడు నేను ఇక్కడ లేను. సెలవలో వచ్చినప్పుడు మా ఆడపడుచులు చెపుతుంటే అయ్యో నేను మిస్సయ్యానే అనుకున్నాను.
“ఏటా పొదుపు దినోత్సవం రోజు "ఉత్తమ పొదుపు ఏజెంట్లు" అవార్డులను ప్రభుత్వం అందజేస్తుంది. ఇలాంటి అవార్డులను వరుసగా ఆరేళ్ళపాటు అందుకుంది,మహబూబ్ నగర్ జిల్లాలోని, వనపర్తి లోని బాలస్వామి కుటుంబము. రోజూ మదుపరుల నుంచి సేకరించిన డబ్బును పోస్టాఫీస్ లో జమచేస్తే వీరికి కమీషన్ వస్తుంది. అదే ఈ కుటుంబానికి ఆధారం . ఫామిలీ మొత్తానికి ఫుల్ టైం జాబ్. ఏటా వీరి ద్వారా చిన్న మొత్తాల పొదుపు సంస్థకు వెళ్ళే సొమ్ము కోటిరూపాయల పైనే. వీరి సంపాదన నెలకు లక్షా ఇరవై వేలు పైనే! అదీను వనపర్తి లాంటి ఓ మోస్తరు టౌన్ లో. కుటుంబము లోని తల్లి ఇంద్రావతమ్మ, తండ్రి బాలస్వామి, ఇద్దరు కొడుకులు చంద్రశేఖర్, శ్రీకాంత్ ఇదే పని చేస్తారు. కుటుంబ పెద్ద బాలస్వామి ఇలా చెపుతున్నారు ‘ ఈ రోజులలో అందరూ విడిపోయి బతకటానికే ఇష్టపడతారు. కానీ మా ఇంట్లో అందరం కలిసి జీవిస్తున్నాము. కష్టపడి సంపాదిస్తున్నాము. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళ తో చాలా హాపీ గా వుంటున్నాము. చిన్న మొత్తాల పొదుపు పధకం మన సొమ్ముకు ఎంత భద్రతను ఇస్తుందో, ఉమ్మడి కుటుంబం కూడా అంతే సామాజిక భద్రతను ఇస్తుంది. అందుకు మేమే ఉదాహరణ. ప్రేమపూర్వక సంబందాలుంటే మన ఇంటికి సిరి సంపదలు వాటంతట అవే నడిచి వస్తాయి.’ “ ఇది నేను ఆంధ్రజ్యొతి దిన పత్రిక లో చదివాను. వార్త రాసి పెట్టుకున్నాను కాని డేట్ రాసుకోవటం మర్చిపోయాను. నేను డబ్బుల గురించి, పొదుపు గురించి రాస్తున్నప్పుడే ఈ వార్త రావటము నాకు చాలా త్రిల్ కలిగించింది. ఇంకో వార్త కూడా పేపర్ లో వచ్చింది. అదేమిటో రేపు చెపుతాను. కొన్ని సంఘటనలు ఎంత యాదృశ్చికమో అని హాశ్చర్యపోయాననుకోండి!
ఏతా, వాతా చెప్పొచ్చేదేమిటంటే, చిల్లర మా లక్ష్మిని చిన్న చూపు చూడకండి. చిల్లర ఎన్ని వండర్ లైనా చేస్తుంది." పిల్లలకు చిన్నపటినుండే పొదుపు అలవాటు చేయాలి. డబ్బులు కూడ బెట్టుకొని, కొనుక్కోవటములోని ఆనందాన్ని అనుభవించనీయాలి . . . ధనమే కదా అన్నింటికీ మూలము. ఆ ధనము విలువ తెలియజేయాలి.
“ఇల్లన్న చోట, పిల్లలున్న చోట 10,000 రూపాయలు, ఓ మనిషి భోజనం ఎప్పుడూ సిద్దముగా వుంచుకోవాలి." మా అత్తగారి టైం లో పది రూపాయలైతే నా టైం వచ్చేసరికి 10,000 అయ్యాయి. తప్పదు మరి!
వచ్చేవారము మరి కాసిని కాసుల కబురులతో కలుసుకుందాము . ఏమిటీ ఇంకా వుందా అంటే వుండదేమిటి? మనీ నా మజాకా ? వచ్చే వారము దాకా టా టా.
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
హ హ హ అదిరిందండి మీ చిల్లర దెబ్బ. నేను నిర్లక్ష్యం గా వదిలేస్తూ వుంటా. మా అబ్బాయి ని నేను అదే అని ఏడిపిస్తా సుబ్బా రావు బదులు పిసినారి రావు అని పెడీతే పోయేది పేరు అని, అంతా మా నాన్నే లెండి పేరు పెట్టినందుకు. వాడి నాన్న కు నాకు ఇద్దరికి లేదు అంత పొదుపు.
Hi Bipin,
How are you? Many Many Happy Returns of the Day. Wishing you a very happy birthday.
మీరన్నట్లు మా ఇంటిలో మా ఇంటావిడ ధర్మమా అని 10,000/- రూపాయలూ,ఓ మనిషి భోజనమూ ఎప్పుడూ రెడీగానే ఉంటాయి.ఇంట్లో అందరికీ తనే 'ఏ.టి.ఎం' !!
మీ 'డబ్బులు/రామ్నాథ్ గోయెంకా/బిపిన్' కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
హాయ్! బిపూ, యాపీ యాపీ బర్త్ డే టు యు.
Have a nice Day & enjoy yourself. All the best.
నాకైతే కష్టపడీ పైసా పైసా పిడతలో వేసి అది నిండీన తర్వాత పగలగొట్టి వాటిని ఖర్చు చెయ్యలంటే అస్సలు మనసొప్పదు. తక్కువ మొత్తం అయిన సరే దానితో అదో మమకారం ఏర్పడిపోద్ది. చిల్లర గొప్పతనం బాగా చెప్పారు.
మీరు నార్త్ ఇండియన్ నా?
Hi Bipin,
Many more happy returns of the day...Dont forget to send me cake..OK.. :-)
Waiting for more like this
*భావనా,
ఈ మధ్య అబ్బాయిలెందుకో తెగ పిసినారి వాళ్ళవుతున్నారు .
thank you .
*harephala gaaru ,
thank you .
* jaya ,
thank you .
* శేఖర్ గారు ,
మీలాంటి అబ్బాయిలకోసమే అమ్మలు ఏ.టి. యం అవతారం ఎత్తేది .
మేము , అసలు సిసలు పదహారణాల తెలుగు వాళ్ళమండి .
మీ విషెస్ కి థాంక్స్ అండి . కేక్ తప్పక పంపుతాము .
*srujana ,
thank you.
చిల్లర దాచడం బాగుంటుంది కానీ, తర్వాత దానిని ఖర్చు పెట్టడానికి మనసొప్పదండీ.. శేఖర్ గారి మాటే నాదీను.. అన్నట్టు మీ బిపు కి ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.. (వచ్చే సంవత్సరానికి బోల్డంత అడ్వాన్స్ గా చెప్పానని చెప్పండి)
Are you from Houston, Texas?
umajiji no andi. i am in Hyderabad.
Post a Comment