Tuesday, May 18, 2021
స్నేహితురాలికి లేఖ
ప్రియమైన స్నేహితురాలికి,
మీ మేసేజెస్ అన్నీ చదివానండి. వాట్స్ అప్ లో కాకుండా మీకు ఉత్తరంతో జవాబిద్దామనిపించి మీ ఒక్కో మెసేజ్ కు అదేలెండి ప్రశ్నకూ జావాబులివిగో. నేను బాగానే ఉన్నానండి. మొన్న 7 న మా మనవడు, మా అమ్మాయి కొడుకు విక్కీ గ్రాడ్యుయేషన్ కోసం వాడి యూనివర్సిటీ ఐయోవాకు, మా అమ్మాయి, అల్లుడు, మనవరాలు తో వెళ్ళాను. బాగా జరిగింది. ఇక్కడకు వచ్చి ఆరునెలలయ్యింది ఇంక ఇండియాకు ఎప్పుడోస్తానంటారా? మా పిల్లలు అక్కడ అసలే రోజులు బాగాలేవు వెళ్ళి ఒక్క దానివి ఏమి చేస్తావు? తొందరేమిటి అంటున్నారు. పైగా ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. వాకింగ్ చేసేందుకు కూడా వీలు లేక బోర్ అంతే తప్ప ఇంకేమీ ఇబ్బంది లేదు. అడ్జెస్ట్ అయిపోతున్నాను ఇక్కడ చిన్నగా. అక్కడ మా ఇంట్లో మా డ్రైవర్ మహేష్ ఫామిలీ ఉన్నారు. రత్న, భారతి అందరినీ మానిపించేసాను. ఎంచక్కా నాడబ్బులన్నీ దాచుకుంటున్నాను. ఎంత హాపీసో కదా :) మా పిల్లలు నాకు పిసినారి అని పేరు పెట్టారు. పెడితే పెట్టారుగాక :) నాకేంటట.
నాకు మా పిల్లలిద్దరూ వాళ్ళ ఇళ్ళల్లో పెద్ద కిటికీ ఉన్న గది ఇచ్చారు. అందుకే హాపీగా చలి తగ్గలేదు బయటకు పోలేను కానీ నా గది కిటికీ లో నుంచి బయట ప్రకృతి ని చూస్తూ చాలా ఆనందిస్తున్నాను. నేను వచ్చినప్పుడు తెల్లని మంచు పూలుపూలుగా రాలుతూ కనువిందు చేసింది. అబ్బ ఎంత తెల్లని తెలుపో! ఎటుచూసినా తెలుపే. ఆ తెల్లని చెట్ల మీదనే రంగురంగుల పిట్టలు వాలేవి. ఆరెంజ్, బ్లూ, బ్రౌన్ అబ్బ ఎన్ని రంగుల పిట్టలో. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి. వీటికి చలి లేదా అనుకునేదానిని. అందులో రెండు ఆరెంజ్ కలర్ పిట్టలు నా కిటికీ పక్కనే ఉన్న కొమ్మ మీద వాలి, నాతో ముచ్చట్లు పెట్టేవి. ఒక్కోసారి అవి రెండూ కీచులాడుకొని ఒకటి ఎగిరిపోయేది. రెండోది నా వైపు దీనంగా చూసేది. "అలిగి వెళ్ళిపోయాడా? దిగులు పడకు. నీలాంటి బంగారుతల్లిని విడిచి ఎక్కడికీపోడూ వచ్చేస్తాడులే" అని నేను ఓదారుస్తుండగానే ఆయనగారు రివ్వున వచ్చేసేవారు. ఈవిడగారు నావైపు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఏమండితో కలిసి తుర్రుమనేది. వాటి సరాగాలు చూస్తుండగానే…..
చూస్తుండగానే తెలుపు కరిగిపోయి చెట్లు, ఇంటి ముందు రోడ్ అన్నీ బయట పడ్డాయి. కాకపోతే చెట్లన్నీ ఎండిమోడు బారిపోయి ఉన్నాయి. రంగుల పిట్టలు మాయమయి, బ్రౌన్ పిట్టలూ, పెద్దపెద్ద సైజు ఉడతలూ, పిల్లులూ, అడపాదడపా కుందేళ్ళు ఎక్కడి నుంచో బయట పడ్డాయి. పిల్లలు, పెద్దలూ పెద్దపెద్ద కోట్లు వేసుకొని, కుక్కలను పట్టుకొని కొద్దికొద్దిగా బయటకు రావటం మొదలయింది. అంతకు ముందు కుక్కలను వాకింగ్ కు తెచ్చినా వెంటనే లోపలికి వెళ్ళిపోయేవారు. నేనూ సరదాగా వెళుదామని బయట వరండా లోకి వచ్చాను కానీ అమ్మో ఎంత చలో! రయ్ మని లోపలికి పారిపోయాను.
సూర్యారావుగారు హలో అని కిటికీలో నుంచి పలకరిస్తుంటే, పవన్ గారు నువ్వు బయటకు వచ్చావో ఊదేస్తా ఖబడ్దార్ అని బెదిరిస్తున్నారు. సూర్యారావుగారు కాస్తాగమ్మాయ్ అన్నింటికీ తొందరేనీకి అని అభయమివ్వగా, ఎండిన చెట్లు, లాన్ పచ్చపడ్డాయి. కిటికీ లో నుంచి ఇదివరకు లేక్ గడ్డకట్టి తెల్లని మునిలా, మౌనంగా నిశ్చలంగా ఉండేది. కనిపించేది కాని ఇప్పుడు పచ్చనాకుల మధ్య ఎండ పడి తళతళా మెరుస్తూ భలే ఉంది. ఘనీభవించి ఐసయిన నీరు కరిగి పారుతున్నాయి. అవి ఎటూపోలేవు కానీ, గాలికి అలలు అలలుగా ఊగుతున్నాయి నా ఆలోచనలలాగే తెగవు ముడి పడవు అన్నట్టుగా! లేక్ మధ్య లో టెంట్ వేసుకొని, బోట్స్ పెట్టుకున్న వాళ్ళు తీసేసారు. రెండు తెల్లని బాతులూ, తెల్లని కొంగలూ వచ్చాయి. హాయిగా జలకాలాడుకుంటూ ఉన్నాయి. వాటిని పలకరిస్తూ వాకింగ్ చేస్తున్నాను. వాటి వయ్యారాలు ఫొటో తీసూనే ఉన్నానా ఒకటి తుర్ మంది. హిస్టరీ రిపీట్స్! పిట్టల కథే బాతులదీనూ :)
ఇక నా పని గురించి అంటారా, ఈ మధ్య శరత్ నవల ఆధారంగా వచ్చిన సినిమాల గురించి చెబుతున్నాను కదా నా ప్రభాతకమలం లో, నా దగ్గర ఉన్న శరత్ నవలలు అయిపోయాయి రాయటము. ఇంకా నాలుగు సినిమాలున్నాయి రాయాల్సినవి. ఆ బుక్స్ ఆన్ లైన్ లో కానీ షాప్ లల్లో కాని దొరకటం లేదు. ఔట్ ఆఫ్ స్టాక్. అందుకని కోడూరి కౌసల్యాదేవివి రెండు పంపాడు మా మేనల్లుడు. ఇప్పుడు అవి చదివి రాయాలనుకుంటున్నాను. పుస్తకాలు ఎవరూ చదవటం లేదంటారు కానీ నేను వెతుకుతున్న పుస్తకాలన్నీ ఔట్ ఆఫ్ స్టాక్! ఇంకా నీ జతగా నేనుండాలి కథామాల లోని కథలు కూడా అయిపోవచ్చాయి. అవయ్యాక ఫేస్ బుక్ లో నేను రాసినవి చదువుదామనుకుంటున్నాను.
మీ తరువాతి అనుమానం నా సమయం ఎట్లాగడుపుతున్నాననేగా. పిల్లలు, ప్రకృతి, ప్రభాతకమలం, పుస్తకాలు, ఫేస్ బుక్ ఇన్ని ఉండగా టైం పాస్ కేమిలోటు.
ఇప్పటికి ఇంతే సంగతులండి. మీ ఏమండీగారికి నా నమస్కారాలు చెప్పండి. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
మీ మాల.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment