డబ్బులోయ్ డబ్బులు-1
నిన్న రాత్రి మా మనవడు విక్కీ వాళ్ళ స్కూల్ లో
ఓ ప్లే చేసారని, అన్ని పోర్షన్ లూ వాడే ఆక్ట్ చేసి
చూపించాడు. అందులో కొత్త అల్లుడు అత్తవారింటికి, పండగ కి
మొదటిసారిగా వస్తాడు. అత్తగారు ఆప్యాయముగా రకరకాల పిండి వంటలు చేసి పెడుతుంది. అల్లుడు
అన్నీ హాయిగా ఆరగించి, కడుపులో నొప్పని గోల పెడుతాడు. వెంటనే
డాక్టర్ అల్లుడి కి ఆపరేషన్ చేసి, అల్లుడి కడుపు లో నుండి,
బొబ్బట్లూ, అరిసెలూ, గారెలూ
వగైరా తో పాటు కొన్ని చిల్లర నాణాలు కూడా తీసి చూపిస్తాడు. ఆ డబ్బులు ఎక్కడవా?
అని అందరూ విస్తు బోయి చూస్తుంటే, మామగారు
"నీ దాపరికము మండా, చిల్లర డబ్బులు పప్పుల డబ్బాల్లో
దాస్తావు. ఇప్పుడు చూడు ఏమైందో" అని అత్తగారిని తిడుతాడు!
మా మనవడు మామగారి పాత్ర, అత్తగారి పాత్ర ఆక్షన్ తో చూపిస్తే నవ్వు ఆపుకోలేక, నవ్వుతూ
నవ్వుతూ నేను, రింగులు
తిప్పుకొని, బ్లాక్ అండ్ వైట్ రోజులలోకి వెళ్ళిపోయాను.
అవి నా పెళ్ళై రెండు నెలలైన రోజులు,
నన్ను వంట నేర్చుకోమని మాఏమండి వాళ్ళ అమ్మ దగ్గర వదిలి పటియాలా వెళ్ళిన రోజులు, నేను
భయం భయం గా, బెరుకుగా వున్నరోజులు. ఆ రోజులలో . . . ఓరోజు
మా అత్తగారు ఒక 100 రుపాయ నోటు నా చేతికి ఇచ్చి , బాంక్ కి వెళ్ళి
మార్చుకు రమ్మన్నారు. మా ఆడపడుచు విజయ ను తను అప్పుడు 8 థ్
క్లాస్ చదువుతోంది, నాకు బాంక్ దారి చూపించటానికినూ, నాకు తోడుగానూ పంపారు. ఇద్దరమూ కోఠీ ఆంధ్రా బాంక్ కి వెళ్ళి, అక్కడ కౌంటర్ లో చిల్లర ఇవ్వమని ఇచ్చాము. అతను మమ్మలినీ, నోటునూ ఎగాదిగా
చూసి “ నీకెక్కడిది అమ్మాయ్ ఈ నెటు?”
అని అడిగాడు. నేను
మా అత్తగారు ఇచ్చారండి అని చెప్పాను. “అక్కడ కూర్చోండి” ఇస్తాను అన్నాడు.
ఇద్దరమూ ఆయన ఎదురుగా కూర్చున్నాము. ఆయన ఎవరినో పిలిచి దాన్ని చూపించాడు. అతను ఆ
నోట్ నూ , మమ్మలినీ మార్చి మార్చి చూసి, వెళ్ళి ఇంకెవరినో తీసుకొచ్చాడు. అలా… అలా బాంక్ లో వున్న వాళ్ళంతా అక్కడ
చేరి, మమ్మలినీ, ఆ నోట్ నూ ఒకటే
చూడటము. ముందు ఏమనుకోలేదు కాని, అందరూ చేరి అలా శల్య
పరీక్షలు చేస్తుంటే చాలా భయం వేసింది. ఇక విజయేమో వదినా వెళ్ళి పోదాము పదా అంది.
కాని నాకేమో చిల్లర తీసుకొని వెళ్ళక పోతే అత్తయ్య గారు ఏమంటారో నని భయం. ఇక
వుండలేక ఏమవుతే అదైందని అతని దగ్గరికి వెళ్ళి
“మాకు చిల్లర వద్దండి.” మా నోట్ ఇచ్చేయండి. వెళ్ళిపోతాము” అన్నాను. ఆయన
“వుండమ్మాయ్, మా మేనేజరు గారు వస్తున్నారు. ఆయన రాగానే
చిల్లర ఇస్తాను” అంటుండగానే, మేనేజరు గారు వచ్చార . ఆయన ఇక ప్రశ్నలు మొదలు పెట్టాడు.
“నీకు పెళ్ళైందా? మీ
వారు ఏం పని చేస్తున్నారు? ఈ నోట్ నీకెక్కడిదీ?"
ఇలా సాగిపోయింది. ఇక ఏడుపే తక్కువ.
కాళ్ళూ, చేతులూ గజగజ వణికి పోతున్నాయి. ఆయన కాషియర్ వైపు తిరిగి “వీళ్ళిద్దరూ
చిన్నపిల్లలు” అంటూ ఏదో చెప్ప బోతుండగా,
విజయ “మేమేమీ చిన్నపిల్లలం
కాదు. నేను రోజరీ కాన్వెంట్ లో 8 థ్ క్లాస్ చదువుతున్నాను.
మా అన్నయ్య మిలిట్రీ లో కాప్టెన్” అని
గడగడా చెప్పింది. నేనేమో ఏడుపు, బిక్క, దేభ్యం ఎన్నిరకాల మొహాలున్నాయో అవన్నీ వేసుకొని "ఇదెక్కడి గొడవరా
దేవుడా!" అని మధన పడుతూ, ఏమి చేయాలో దిక్కు తోచక ఉన్న
పరిస్థితులల్లో, మా అదృష్టవసాత్తూ ఓ ముసలాయన అక్కడికి వచ్చాడు. ఆయన సంగతి విని,
ఆ నోట్ ను చూసి “ఇది మా
చిన్నప్పటి నోట్ అండి. మంచిదే” అన్నాడు. ఈ లోపల వాళ్ళూ కన్ ఫర్మ్ చేసుకొని,
చిల్లర ఇచ్చేసారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి వెళ్ళి మా
అత్తగారికి ఇచ్చి, జరిగిన హడావిడి చెపుతుండగా, మా మామగారు వచ్చారు. ఆయన అచ్చం
విక్కీ చెప్పిన ప్లే లోని మామగారిలాగానే మా అత్తగారి తో "నీ దాపరికం
మండా. ఇంత పాతది ఎక్కడి నుండి తీసావు? పైగా ఆడపిల్లలిద్దరినీ
పంపావా? దొంగ నోట్
అనుకొని ఏ పోలీస్ లకో అప్పచెప్పలేదు. ఇంకా ఏమైనా వుంటే బయటకు తీయి" అని కోపం
చేసారు. మరి మా అత్తగారు తీసి ఇచ్చారా?
లేదా? ఇస్తే ఎన్ని ఉన్నాయి? వగైరా నాకు తెలియదు. ఎందుకంటే మామగారు అరుస్తున్నప్పుడు అక్కడ ఉండకుండా
తప్పుకున్నానన్నమాట! మరి లేక పోతే పనిలో పని నాకు పడతాయిగా!
అవిషయము గుర్తొచ్చి నవ్వుకుంటుంటే ఏమండి ఏమిటి
సంగతి అని అడిగారు. అప్పుడు ఈ సంగతి చెప్పగానే ఏమండి, అప్పుడు కాబట్టి అంత తర్జన బర్జన పడ్డారు. ఇప్పుడైతే దాన్ని మధ్యకు
చింపేసి మిమ్మలిని లాకప్ లో పెట్టేవారు అన్నారు. బాబోయ్ ఎంత ప్రమాదం తప్పింది!
ఓసారి మా ఏమండిని దేనికో డబ్బులు అడుతుంటే మా
అత్తగారు విని, ప్రతి పైసా అడగటమేమిటి అని, నాకు ఏమండి నెలకు 10 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసారు. అదేమిటో మా ఏమండికి అప్పటికీ ఇప్పటికీ ఏ
డబ్బులు గుర్తువుండవు కాని, నాకిచ్చినవి మాత్రము గుర్తు
వుండి తీసేసుకునేదాకా తోచదు! అలా ఒకసారి ఆయన అడుగుతుండగా మా అత్తగారు విని, “వాడు అడగగానే నీదగ్గర వున్న
డబ్బులు ఇచ్చేయకు. ముందు ముందు పిల్లలు పుట్టినప్పుడు చాలా ఖర్చులు వుంటాయి.
ఆడపిల్లైతే ఎక్కువ వుంటాయి. మగవాళ్ళకు అన్ని తెలీవు. మనము పెట్టే ప్రతి ఖర్చూ దండగ
అనుకుంటారు. నీ దగ్గర లేవంటే, అవసరమైతే బయట తెచ్చుకుంటాడు.
బయట వాళ్ళకైతే తిరిగి ఇచ్చేస్తాడు. నీకైతే ఇవ్వడు. వాడు ఇవ్వగానే సగము తీసి
జాగ్రత్తగా దాచు" అని హితబొధ చేసారు. అదో అలా నా బ్లాక్ మనీ ప్రహసనం
మొదలయ్యిందన్నమాట!
ఇహ డబ్బులు ఎక్కడ దాచాలి? నా పెట్టెలో పెట్టుకుంటే ఆయనకు తెలుస్తుంది. దానికి కూడా మా అత్తగారే
ఉపాయం చెప్పారు. ఆవిడ అలమారలో, ఎవరికీ కనిపించని చోట,
ఎవరికీ చెప్పకుండా, చివరకు ఆవిడకు కూడా
చెప్పకుండా దాచమని. ఆ అలమారా మా ఏమండి సంపాదన మొదలుకాగానే, ఓ
పట్టుచీర, అది పెట్టుకునేందుకు ఓ పెద్ద గాడ్రెజ్ అలమారా
వాళ్ళ అమ్మకు కొనిచ్చారుట. అందులో ఆవిడవి ఓ నాలుగైదు చీరలు, మిగితా
ఇంటిల్లిపాదీ ఖజానా ఉండేది. మొదటి ఐదు రూపాయలు చేతి లో పట్టుకొని, అలమారా తలుపు తీసి ఎక్కడ దాచాలా అని తెగ చూసాను. మా ఏమండి కోటు జేబులో
లాభం లేదు. ఆయన సూట్ రెగ్యులర్ గా వేసుకుంటారు. మా మామగారి కోట్ కూడా లాభం లేదు.
ఎందుకంటే ఆయన డబ్బులు, ఇంకా ఏవేవో ఆయనవన్నీ అందులోనే దాచుకుంటారు. మా మరిదిగారి కోట్ ఐతే
బెస్ట్. ఏదో మా పెళ్ళికి మా ఏమండి
కుట్టిస్తే, బలవంతం మీద మా పెళ్ళిలోవేసుకున్నారే
కానీ ఆ తరువాత ఎప్పుడూ వేసుకోలేదు.
అందుకని నేను పూనా నుండి వచ్చినప్పుడల్లా నేను దాచుకున్న నా బ్లాక్ మనీ అందులో దాచేదానిని. అలా ఒకసారి
వచ్చినప్పుడు చూద్దునుకదా నా డబ్బులు మటుమాయం! మా అత్తగారిని అడుగుతే ఆవిడ “వెంకట్ , వదిన డబ్బులు
తీసుకున్నావారా?” అని అడిగారు.
“నాకేం తెలుసు? నా కోట్
జేబులో వుంటే నావనుకొని తీసేసుకున్నాను. నా కోట్ జేబు లో వున్నాయి కాబట్టి అవి
నావే. నేను ఇవ్వను. అయినా ఖర్చైపోయాయ్” అన్నాడు.
నా
ఏడుపు మొహం చూసి “పిచ్చిదానా, నాకైనా చెప్పొద్దా?” అన్నారు ఆవిడే చెప్పొద్దు అన్నది
మర్చిపోయి!
ఆ తరువాత
మా అత్తగారికే దాచమని ఇవ్వటము మొదలు పెట్టాను. నా బ్లౌజ్ పీస్ లోనిదే కొంత
ముక్క తెచ్చి ఆవిడకు ఇస్తే అందులోనే కట్టి, మా ఏమండి మొదటిసారిగా
నాకు గిఫ్ట్ ఇచ్చిన చాకొలెట్ బాక్స్ లో, పెట్టి అలమారాలో
ఎక్కడో దాచేవారు. మా మామగారేమో నాతో నారాయణగూడా కోపరేటివ్ బాంక్ లో ఎకౌంట్ ఓపెన్
చేయించారు. అప్పటికి నా పాకెట్ మనీ 50 రూపాయలకు పెరిగింది.
దాని తో 10 రూపాయలు మా అత్తగారి ఆధ్వర్యం లో, 10 రూపాయలు మా మామగారి ఆధ్వర్యం లో కోపరేటివ్ బాంక్ లో దాచేదానిని. నేను
సిలిగురి వెళ్ళాక ఆ దాపుడు ఆగిపోయింది. ఆ తరువాత ఇంకా బోలెడు బాంక్ లల్లో దాచాను.
ఆ బాంక్ ల కథ ఇంకోసారి.
మా అత్తగారు మరణించాక ఆవిడ సామానులు
తీసినప్పుడు, అప్పుడు నేను ఆవిడకు దాచమని ఇచ్చిన డబ్బులు అలాగే ఆ మూటలోనే,
ఆడబ్బాలోనే బయటపడ్డాయి. మొత్తం 120 రూపాయలు
వున్నాయి. అప్పుడు అక్కడ వున్న పిల్లలకు మా అత్తగారి సేవింగ్ కథ చెప్పి, ఆ గుర్తుగా తలా పది రూపాయలు ఇచ్చాను. 40 రూపాయలు
అప్పటి కింకారాని, రాబోయే నా మనవళ్ళూ, మనవరాళ్ళ కు జ్ఞాపకముగా
ఇవ్వటానికి దాచాను. నేను వాళ్ళకు ఇవ్వగలిగిన సిరులు ఈ జ్ఞాపకాలే! పైన ఫొటో
కనిపిస్తున్నవి అవే.
ఆ డబ్బులు తీసి చూపించగానే , మా మనవరాళ్ళు, మనవళ్లు చాలా త్రిల్ల్ ఐపోయారు. అంత పెద్ద 10 రూపాయలా అని హాచర్య పోయారు.
(సశేషం)
రాసింది మాలా కుమార్ AT
FRIDAY, JANUARY 15, 2010
LABELS: కాసులపేరు
8 comments:
what a pleasant gift to get :) good ideas..
నిజంగా అవి వెలకట్టలేని సిరులే. కరెన్సీ నోటు రూపం లోని అపురూప జ్ఞాపకాలే. జోహారండి బాబూ మీకూ, మీ కీ.శే. అత్తగారికీ...
Hat's off to మీ అత్తగారు.
మొన్న మాతృదేశం వచ్చినప్పుడు కొట్లలో ఐదు వందల నోటిచ్చినప్పుడల్లా ఆ వ్యాపారి దాన్ని పైకెత్తి ఎండకడ్డం పెట్టి శల్య పరీక్ష చెయ్యడం. ఇలా ఓ నాలుగైదు సార్లు జరిగాక, అప్పుడడిగాను ఏంటి విషయం అని. ఐదువందల్లో దొంగనోట్లు, అదీనూ ఏటీయమ్ముల్లోంచి వస్తున్నైట. ఏమో మరి, నేను బేంకు టెల్లర్ దగ్గరే తీసుకున్నా. ఏదో ఆ రెండు వారాల్లో ఎవరి చేతా దొంగనోట్లని తిట్టించుకోకుండా బయటపడ్డాం!
బాగుంది. మీ టపా...
"మా వారికి , అప్పటికీ ఇప్పటికీ ఏ డబ్బులు గుర్తువుండవు కాని , నాకిచ్చినవి మాత్రము గుర్తు వుండి తీసేసుకునేదాకా తోచదు !" :-) :-)
మీ అత్తగారికి, మీకూ అభినందనలండీ.. దాచినందుకు ఆవిడకి, సద్వినియోగం చేసినందుకు మీకు..
ఓ బుడుగా ? తాంక్స్ బుడుగు .
* శంకర్ గారు ,
మీ జోహార్ కి ధన్యవాదాలండి .
* కొత్తపాళి గారు ,
చాలా రోజులకు ఇటొచ్చారు , ధన్యవాదాలండి .
మై డైరీ గారు ,
తాంక్స్ అండి .
* మురళిగారు ,
నిజంఅండి బాబు , మావారికి నాకిచ్చిన డబ్బులు మటుకు తెగ గుర్తుంటాయి హుమ్ !
ధన్యవాదాలండి .
"మా వారికి , అప్పటికీ ఇప్పటికీ ఏ డబ్బులు గుర్తువుండవు కాని , నాకిచ్చినవి మాత్రము గుర్తు వుండి తీసేసుకునేదాకా తోచదు !"
మా నాన్నగారికి కూడా అచ్చం ఇంతేనండీ మాల గారూ.. మా అమ్మకిచ్చినవి తీసేసుకునేదాకా నిద్ర పట్టదు :) :)
మీ జ్ఞాపకాలు నిజంగా అపురూపంగా ఉన్నాయి. అదృష్టవంతులు సుమా :)
Post a Comment