Monday, July 13, 2009

తొలకరి (తడిసి చూడు )

వాన లో తడుస్తూ హీరో,హీరొయిన్లు పాటలు పాడు కోవటము ,పాత సినిమాల నుండి ఇప్పటి వరకూ వుంది. డైరక్టర్లు తమ తమ ఐడియా లు,ప్రతిభలను బట్టి ఆ సీనులను పండించటనికి,ముఖ్యముగా హీరోయిన్లను తడి పొడి బట్టలలో అందముగా చూపటాని కి శక్తి కొలది ప్రయత్నిస్తునే వున్నారు. కాని,శ్రీ 420 లో ప్యార్ హువా పాటలో రాజ్ కపూర్ ,నర్గీస్ ని చూపించినంత అందముగా ఎవ్వరూ చూపించలేదేమో ! అసలు రాజ్ కపూరే తన తరువాతి హీరోయిన్లను ఇంత అందముగా ,డిగ్నిఫైడ్ గా ప్రెజెంట్ చేయలేదు.ఆ వాన లో గొడుగు లో తడుస్తూ నడవటము,ఆ పై రోడ్ పక్కన టీ వాలా దగ్గర ఒన్ బై టు టీ తాగటము,వాహ్ క్యా సీన్ హై ! అదే పాట చివర లో ముగ్గురు పిల్లలు రైన్ కోట్ వేసుకొని వెళుతారు.వాళ్ళు రాగానే ప్రతివాళ్ళూ ,వాళ్ళు రాజ్ కపూర్ పిల్లలు అని పక్కవారి తో చెప్పటము పరిపాటి.

మా చిన్నప్పుడు ఆత్మ బలం సినిమా లో చిట పట చినుకులు పడుతూవుంటే పాట లో ,నాగేశ్వర రావు, బి.సరోజా దేవి చాలా రొమాంటిక్ గా చేసారని ఓ తెగ చెప్పుకొని,పిల్లలని ఆ సినిమా కి వెళ్ళకుండా కట్టడి చేసారు.పెద్దయ్యాక సుదర్షన్ థియేటర్ లో మార్నింగ్ షో వస్తే ఇప్పుడు మనల్న్ని ఎవరు ఆపుతారూ అని ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము. కాని చాలా నిరాశ చెందాము.

వానలో తడవటము, వాన నీళ్ళలో కాగితం పడవలు వేయటము చేయని వారు, తడి మట్టి వాసనని ఆస్వాదించనివారు ఎవరూ వుండరేమో 1 తిరుపతి కొండ మీద సుప్రభాత దర్షనం తరువాత బయటకి వస్తే ,చాలావరకు తుంపరలు పడుతూనే వుంటాయి.ఆ తుంపరలలో తడుస్తూ ,వేడి వేడి కాఫీ తాగుతూ నడవటం చాలా బాగుంటుంది. సాయంకాలం వానప్పుడూ పేపర్ ని కోన్ లా మడిచి ,దాని లో వేసిన మరమరాలూ,మామిడికాయ ముక్కలూ కలిపిన మిక్స్చర్ తింటూ నడుస్తూ పోతూ వుంటే కాటేజ్ ఎంతదూరమో కూడా తెలియదు.అసలు ఆ మిక్స్చర్ టేస్ట్ తిరుపతి కొండ మీద ,ఆ వాన లో ఆ నడక లో తప్ప ఇంకెక్కడా రాదు.

ఎండా కాలం మల్లెలూ,మామిడి పండ్లూ ,కొత్తావకాయా, మామిడికాయ పప్పూ,గుమ్మడి వడియాలూ చల్ల మిరపకాయల కాంబినేషన్ అవుతే, వానాకాలం చామంతిపూలూ ,కొత్త చింత కాయ పచ్చడీ, వేడి వేడీ పకోడీలూ,పొగలు కక్కే టీ ,ఓ నచ్చిన నవల కాంబినేషన్ అదుర్స్.

మల్లెల పరిమళం మరువక ముందే సన్నని సువాసనలు వెద జల్లుతూ ,బంగారు కళికలు రాసులు పోసినట్లు చామంతులు రానే వస్తాయి. ఎన్ని రకాలో ! పచ్చ చామంతి, తెల్ల చామంతి, కస్తూరి చామంతి,చిట్టి చామంతి ఇంకా ఎన్నో ఎన్నెన్నో రంగులు. అదేమిటో కస్తూరి చామంతి కనుమరుగైంది.ఎక్కడా దర్షనాలు లేవు.పచ్చ చామంతి, ఎర్ర మందారాలూ కలిపి దేవుడిని అలంకరిస్తే దేవుడు కళ కళా, తళ తళా .

అరె రే అదిగో మబ్బులు కమ్మేసాయి. సన్న చినుకులు మొదలయ్యాయి.

ఏమండీ, వానొచేట్టుగా వుంది, పకోడీలు చేయనా ?

చేయి.

సెనగ పిండి,

కొద్దిగా వరి పిండి,

సన్నగా పొడుగ్గా కోసిన ఉల్లిపాయ ముక్కలూ,

సువాసన కోసం ఓ పచ్చిమిరపకాయ ముక్కలూ,

కరివేపాకు,

జీలకర్ర,

ఉప్పూ,కారం అన్ని వేసి, కొద్దిగా వేడినూనె వేసి,గట్టిగా నీళ్ళతో కలుపుకొని సన సన్నటి , కర కర లాడే పకోడీలు చేసి

మా వారికిస్తే హాయిగా పకోడీల రుచి ని ఆస్వాదిస్తూ ,సెల్ లో, సురేంద్రా వాన వొచ్చేట్టుగా వుంది,బ్రేక్ డౌన్ వర్క్ లు వస్తాయేమొ గాంగ్ రేడీగా వుంచు,అని చెపుతున్న మాఅయిన్ని చూసి హూం బొత్తిగా కలాపోసన లేదు అనుకుంటూ,ఓ ప్లేట్ లో వేడి వేడి పకోడీలు ,గాజు గ్లాస్ లో పొగలు కక్కే టీ (ఈ కాలం లో టీ గాజు గ్లాస్ లో కాని ,స్టీల్ గ్లాస్ లో కాని తాగాలి ) మల్లాది వెంకట కృష్ణ మూర్తి కొత్త నవల తాడంకి- ది థర్డ్ తీసుకొని బాల్కనీ లో కి వెళ్ళగానే రా రమ్మంటూ తొలకరి జల్లు పలకరించింది.


ఎనాళ్ళ కొచ్చావే వానా వానా

6 comments:

Srujana Ramanujan said...

Nice post. తాడంకి- ది థర్డ్ is an interesting novel. Is it in book form?

జ్యోతి said...

మాలగారు,

ఇప్పటి ముచ్చట్లు కాదుగాని చాలా రోజులు వెనక్కి వెళ్లి వాన ముచ్చట్లు చెప్పండి. నాకైతే టీ స్టీలు గ్లాసులోనే కావాలి. తాడంకి నాదగ్గర కూడా ఉంది. ఇంకా మొదలు పెట్టలేదు..

మాలా కుమార్ said...

రింగులు,ఫాన్లు తిప్పద్దు అంటున్నారండీ అందరూ.దీని తో సరి పెట్టుకోండి.ఆ పాట చూసి అప్పటి రోజులు తలుచుకోండి జ్యోతిగారు.

మాలా కుమార్ said...

ఆ బుక్ ఈమద్యనే విశాలాంద్రలో కొన్నాను.
స్టిల్ ఎలావుంది చెప్పలేదు?
మా ఫ్రెండ్ ఏంతో కష్టపడి తీసి పంపారు.థాంక్స్ టు దెం.

Anitha Velde said...

mam,
mirchi bajji marachipoyaaru me list lo........

మాలా కుమార్ said...

అరె అలా ఎలా మర్చిపోయాను చెప్మా?
థాంక్ యు అనితా గుర్తు చేసినందుకు.