Friday, July 17, 2009

ఆహా ఏమి రుచి

గాజర్ హల్వా
ముందుగా ఫ్యాన్ వేసుకోండి.. చాలా వెనక్కి వెళ్లాలి..
1969 ( నెల ,డేట్ గుర్తులేవు )
స్తలం ; పూనె
అప్పటికి మా కొత్తకాపురం మొదలై కొన్ని నెలలే అయింది.. నేను మా ఏమండీ గారి  ఆధ్వర్యములో వంట నేర్చుకుంటున్నాననే భ్రమలో మా ఏమండీ  ఉన్నరోజులవి. ఇద్దరమూ ఉదయమే 8 గంటలకల్లా కాలేజీ లకు వెళ్ళిపోయేవాళ్లం. మళ్ళీ ఒంటిగంటకల్లా వచ్చేసేవాళ్ళము. వచ్చాకా వంట చేసుకోవచ్చు, కుక్కర్ లో అన్నం, పప్పు ఎంతలో వుడుకుతాయి, రాగానే వండుకుంటే వేడిగా తినొచ్చు అనే మా ఏమండీ గారి  అభిప్రాయంతో ఏకీభవించి వచ్చాక వంట మొదలు పెట్టేదాన్ని. పెళ్లైన కొత్తగదా మొగుడి మాట జవదాటకూడదు అనుకునే అమాయకపు అమ్మాయిని మరి.. అది అప్పట్లో... మా అత్తగారు ఇంట్లోకి రాకూడని మూడు రోజులు  మా ఏమండీనే  వండేవారట. ఆ అనుభవం తో నా వెనక చేరి, ఇంకాస్త ఉప్పేయ్, కొంచం నీళ్ళు పోయ్ అంటూ సలహాలిస్తూ, ఆ తరువాత తినలేక ఇంత ఉప్పేసావేమిటి? నేను చెప్పినట్లు చేయలేదు అని గొణుగుతూ వుండేవారు. కాని ఇప్పటికీ వినేవాళ్ళుంటే మా ఆవిడకి నేనే వంట నేర్పాను అంటూ ఎంత సేపైనా చెపుతారులెండి. ఏం నేర్పారండీ అంటే ఆమ్లెట్ నేర్పానా ? టీ పెట్టటము నేర్పానా అంటూ లిస్ట్ మొదలుపెడుతారు.తమ గొప్పలు చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు. చెప్పొద్దు.. ఆ ఆమ్లెట్ కొసం ఎంత గోలని ? ( అసలు అది తినేదెవరు ఆయన తప్ప ) అయినా ఈ అబ్బాయిలకి అమ్మ వెనుకెనకే తిరుగుతూ, కొద్దో గొప్పో వంట నేర్చేసుకొవటం ఏమి పాడు అలవాటో? . ఆ తరువాత వాళ్ల భార్యల పాట్లు భగవంతుడికే తెలుసు. ప్రతీదాంట్లో వేలెట్టి తప్పులు ఎత్తి చూపిస్తారు . ఏ యింతి కథ చూసినా ఇంతే కదా
.
ఇంతలో ఇద్దరికీ సెలవలొచ్చాయి. హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఏం తీసుకెళ్ళాలి ?అప్పటికి కొద్ది రోజుల ముందే మా మామగారి ఫ్రెండ్స్ వచ్చి, నేను చేసిన టమాటా పప్పు, టమాటా చారు, టమాటా పచ్చడి ,వాళ్ళ కంట పడకుండా మావారు చేసిన టమాటా ఆమ్లెట్ తిని, హైదరాబాద్ లో మా మామగారి దగ్గర మీ కోడలు వంట బ్రహ్మాండం గా చేసింది అని మెచ్చుకున్నారట ! కాబట్టి ఏదైనా చేసి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఆయననే డిసైడ్ చేయమని అడిగా.. నేను వూరుకొవచ్చుగా ! అబ్బే అంత మంచి బుద్ది ఏది ? రెండుమూడు సార్లు అర్ద కిలో గాజర్లు హల్వా చేసిన ధైర్యం, అనుభవంతో ఏమండీ గాజర్ హల్వా చేయనా? అని అడిగా, . ఆ హల్వా ఆయనకూ నచ్చటము వలన సరే అనేసారు.
"ఎంత ఒక కిలో చేయనా ?"
"కిలో ఏం సరిపోతుంది ?"
"పోనీ రెండు కిలోలు ?"
"కాదులే మూడు కిలోలు చేయి . మనింట్లో అందరికీ స్వీట్ ఇష్టము కదా ."
సరే కిర్కీ మార్కెట్ కి గాజర్ తెద్దామని వెళ్ళాము. గాజర్ ఫ్రెష్ గా వుండటముతో తెగ నచ్చేసి నాలుగు కిలోలు తీసుకున్నారు. సాయంకాలం పాలవాడికి ఎనిమిది లీటర్ల పాలు కావాలని చెప్పాను. మావారు ఇరుగయ్యనీ, పొరుగయ్యనీ అడిగీ, బ్లాక్ లో కొంత వైట్ లో కొంత కొని ఎనిమిది కిలోలల పంచదార తెచ్చారు. సామాన్లన్నీ వచ్చేసాయి. రాత్రి మూడు గంట వరకు గాజర్ తురిమినా వుత్సాహంగానే వున్నాను. మొదటిసారికదా ఇంత పెద్ద ప్రయోగం చేయడం. ఉండదేంటి మరి.. పొద్దున పాలవాడు వచ్చేలోపల జీడి పప్పు వేయించి వుంచుదామని తీసాను. మళ్లీ దానిదో కథ. పదిరూపాయలకే కిలో అని ఇంటిముందుకు ఓ అమ్మాయి తెస్తే అందరమూ ఎగబడి కొనేసాము .ఆ తరువాత ఎవరికో అనుమానం వచ్చి కిలో జీడిపప్పు తూకం వేయిస్తే పూర్తిగా అర్ధ కిలో కూడా లేదు. ఇంకో కిలో కిస్మిస్స్ లు ఓ రెండు కిలోల నెయ్యిలో వేయించి, ఓ వంద గ్రాములు ఇలాచీలు పొడి చేసేసరికి పాలవాడు రానే వచ్చాడు .
మిసెస్ బల్బీర్ దగ్గరికి వెళ్ళి పెద్ద గిన్నె కావాలని అడిగాను, మరి ఆమె దగ్గరే కదా పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. ఏం చేస్తావంటే గాజర్ హల్వా అన్నాను. ఎన్ని కిలోలు అంటూ చిన్న గిన్నె చూపిస్తే ఇది సరిపోదు నాలుగు కిలోలు అని గొప్పగా చెప్పాను. పెద్ద గిన్నె తీసి ఇస్తూ, “ఇత్నా కర్ సక్తీ క్యా?” అనగానే ఎంత కోపం వచ్చిందో ! ఇంత చేస్తున్నానని కుళ్ళుకుంటోంది. అందుకే మనం వంట చేసేటప్పుడు ఎవ్వరినీ రానీయద్దు అనేవారు అత్తయ్య గారు అనుకొని జవాబివ్వకుండా గిన్నె తీసుకొని వచ్చేసాను. కిరోసిన్ స్టవ్ వెలిగించా.. మరి అప్పుడు మాకు గాస్ కొరత అందుకే చాలా పొదుపుగా వాడే వాళ్ళము, గిన్నెలో నాలుగు కిలోల గాజర్ తురుము, నాలుగు  కిలోల పంచదార , ఎనిమిది కిలోల పాలు కలిపి పెట్టేసి , బట్టలు సర్దుకోవటము మొదలు పెట్టాను. మరి సాయంకాలము నాలుగింటికే ట్రైన్. అప్పటికి పన్నెండైంది . భోజనాలయ్యాయి,సద్దుళ్ళాయాయి .టైం అయిపోతోంది. కాని హల్వానే కొంచం కూడా చిక్కబడలేదు. అలాగే ఉంది. అలిగిన పెళ్లాంలా ! ఏంచేయాలి ? ఎవరికిద్దామన్నా అందరూ సెలవల్లో వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఆపత్ భాంధవి మిసెస్ .బల్బీర్ వచ్చి అయ్యిందా అని అడిగింది. ఏడుపు మొహం వేసుకొని చూపించాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి అడగటమెందుకో ? అని గొణుక్కుంటూ ఉండగా,ఇంకో రెండు గిన్నెలు తెచ్చి మొత్తం కలిపి, మూడు గిన్నెలలోకి సర్ది, గాస్ స్టవ్వుల మీదికి కూడా ఎక్కించి నువ్వు ఒకటి కలుపు నేను రెండు కలుపుతాను అని చక చకా కలపటము మొదలు పెట్టింది. హమ్మయ్య ఎలా అయితేనేం సరిగ్గా ట్రైన్ టైమ్ కి పూర్తి చేసి, ఆవిడ దగ్గరే వున్న ఓ పెద్దకాన్లో సర్ది ఇచ్చింది. ఏమో అనుకున్నాను కానీ, పాపం ఆ గిన్నెలు కూడా ఆవిడే తోమేసుకుంది. అంత వేడి వేడి హల్వా ఎలా తీసుకెళ్ళామని మటుకు అడగొద్దు. కాన్ వేడి చురకలు తగిలించుకొని కూలీ మమ్మలినెంత తిట్టాడో చెప్పలేనుగా ! రుచి అంటారా నాలుగు కిలోల గాజర్, నాలుగు  కిలోల పంచదార, ఎనిమిది లీటర్ల పాలూ, రెండు కిలోల నెయ్యీ, కిలో అనుకున్న అర్ద కిలో జీడిపప్పూ,కిలో కిస్మిస్ ,25 గ్రాములకు తగ్గని ఇలాచీ పొడీ తో ఆరుగంటలు వుడికిన హల్వా బాగుండక ఏమౌతుంది .
ఇంక ఫాన్ ఆఫ్ చేసి, ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు నేను చేసే గాజర్ కా హల్వా ;
కిలో గాజర్,
కిలో పంచదార,
1/2 కిలో కోవా లేదా కలాకండ్,
ఓ కప్పు వేడి నెయ్యి,
జీడి పప్పు ,కిస్ మిస్స్ మన ఇష్టం , కొద్దిగా ఇలాచి పొడి.
ముందుగా గాజర్ తురుము, పంచదార కలిపి స్టవ్ మీద పెట్టాలి. పంచదార కరిగి కొంచం దగ్గర పడ్డాక కోవా కాని , కలాకండ్ కాని వేసి దగ్గరకి వచ్చేదాకా కలుపుతూ వుడికించాలి. దగ్గర పడ్డాక ముందుగా నేతి లో వేయించి వుంచుకున్న జీడి పప్పు, కిస్మిస్ ,ఇలాచిపొడి కలిపి ,వేడి నెయ్యి కూడా కలిపి ఓ ఐదు నిమిషాలుంచి తీసేయాలి. కొంచము వేడిగా తింటే అహా ఏమి రుచి , కారా మైమరచి..
( ఈ మధ్య గాజర్ బజార్ లో చాలా కనిపిస్తున్నాయి.పాపం మీరు చేసుకుంటారని :) )




21 comments:

సుభద్ర said...

bhale rasarandi maalaa gaaru....
intaki bagundi annaru ok meevaallu pogatalu kudaa rayalisindi kada.chadivi anamdimchevaallam.mee seniority chupinchi keka pettincharu,last lo hw to make raasi adharagottaru.

Vinay Chakravarthi.Gogineni said...

baagundi.............

తృష్ణ said...

ఎదురుగుండా మంచి గజర్ కా హల్వా ఊరిస్తోంది...కానీ..రుచే నోటికి అందటం లేదు..?

జ్యోతి said...

hmmm.

ఇప్పుడు నాకు గాజర్ హల్వా కావాలి. ఎలా?? రేపు తెచ్చుకుని , చేసుకుని మొత్తం నేనే తినేస్తాను..

మాలా కుమార్ said...

మరీ గొప్పలు చెప్పుకుంటే నత బాగోదుకదండి సుభద్ర గారు,
థాంక్ యు.

మాలా కుమార్ said...

vinay chakra varti gaaru,
thaanks andi.

మాలా కుమార్ said...

తృష్ణ గారూ ,
అందుకె కదా రసపీ ఇచ్చాను .అందులోనూ మీరు పాటలు పాడుకుంటూ చేసేయగల నేర్పరులు.ఆలస్యం ఎందుకు వెంటనే చేసి నన్నూ పిలవండి.

మాలా కుమార్ said...

జ్యొతి గారూ,
అంత ఆశే మాకు పెట్టకుండా తినేద్దామని .నేనూ వస్తున్నా తినటానికి.

Saahitya Abhimaani said...

CHAALAA BAGUNNADANDI VRAASINA PADDAHATI.

SIVARAMAPRASAD KAPPAGANTU

మాలా కుమార్ said...

siva gaaru,
thankyou.

నేస్తం said...

మీ వంట చదువుతున్నంత సేపూ నోట్లో నీళ్ళే నీళ్ళు :)

మాలా కుమార్ said...

నేస్తం గారూ,
మీరు నా బ్లాగ్ కి రావటము నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.
థాంక్ యు .

Srujana Ramanujan said...

భలే రాశారు. ఎక్కడ చెడగొట్టాను అని అంటారో అని తెగ తెన్షన్ పడ్డాను. ;-)

Sridevi Komarraju said...

అత్తయ్యా, నాకో డౌటు. గాజర్లు తీయగా ఉంటాయి కదా, కిలో గాజర్ కి కిలో పంచదారా?

మాలా కుమార్ said...

అవును సృజనా ,
అప్పుడు నేనూ తెగ టెన్షన్ పడ్డాను. మిస్సెస్ .బలబీర్ పుణ్యమా అని గట్టెక్కాను.

మాలా కుమార్ said...

సామ్మాన్యముగా గాజర్ను తురిమేటప్పుడు లోపలి కాడను కూడా తురిమేస్తాము.అది కొంచము వగరుగా వుంటుంది.కాబట్టి 1 కె.జి పడుతుంది.పైగా కొంచము తీపి వుంటే పిల్లలు ఇష్టపడతారు.
thank you శ్రిదేవి.

Anonymous said...

ఎంత బాగుందో....ప్చ్...ప్చ్...ప్చ్...(వేళ్ళు చప్పరించుకుంటున్నానన్నమాట)..

లలిత.

పరిమళం said...

మాలా గారూ ! మొత్తానికి సక్సెస్ ! ఆ ఫ్యాన్ పెట్టకపోతే నోరూరించే హల్వా చిత్రం పెట్టొచ్చు కదండీ ..చూసైనా లొట్టలు వేసేవాళ్ళం :) :)

మాలా కుమార్ said...

లలిత గారూ ,
మెల్లిగా వేళ్ళు జాగ్రత !`

@పరిమళంగారూ,
నలభై సంవత్సరాలైంది కదండీ ! వాసనొస్తుందేమోనని పెట్టలేదు. ఫాన్ తిప్పుకొని వెనక్కి వెళ్ళండి .చూడొచ్చు.

Anonymous said...

అయినా ఈ అబ్బాయిలకి అమ్మ వెనుకెనకే తిరుగుతూ, కొద్దో గొప్పో వంట నేర్చేసుకొవటం ఏమి పాడు అలవాటో? . ఆ తరువాత వాళ్ల భార్యల పాట్లు భగవంతుడికే తెలుసు. ప్రతీదాంట్లో వేలెట్టి తప్పులు ఎత్తి చూపిస్తారు . ఏ యింతి కథ చూసినా ఇంతే కదా!
నిజమేనండి,మా ఆయన కూడా డిటోనే.వంట అయన ఇంట్లో వుండగా చేస్తే తెల్లారినట్లే.అందుకే అయన ఆఫీసునుంచి vachelopu చేసేస్తా.
swathi madhav

మాలా కుమార్ said...

అవునండీ స్వాతి మాదవ్ గారు.,ఆ విషయం నేను చాలా రీసర్చ్ చేసే చెప్పాను.
thank you