Thursday, December 8, 2011

అన్నపూర్ణావారి ఆణిముత్యాలు


యుట్యూబ్ లో ఏవో పాటల కోసం వెతుకుతుంటే "దొంగరాముడు " సినిమా కనిపించింది . దొంగరాముడు చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను . సి.డి కోసం వెతికాను కూడా ! అప్పుడు దొరకలేదు . అనుకోకుండా ఇప్పుడు చేతికి చిక్కింది అనుకొని హాపీగా చూసేసాను :) అప్పుడే ఎందులోనో అన్నపూర్ణావారు సినిమాలు తీయబట్టి 60 సంవత్సరాలు అయ్యింది అని చదివాను . అంతే అన్నపూర్ణావారి సినిమాలు చూద్దామని కోరిక పుట్టింది . నెట్ లో వెతికితే ఇదో లిస్ట్ దొరికింది . ఆ లిస్ట్ తీసుకొని కోటీ వెళ్ళి సి. డి షాప్ లో వెతికాను . " పెళ్ళీడు పిల్లలు " , " సుడిగుండాలు " తప్ప మిగితావన్నీ దొరికాయి . ఈ లిస్ట్ లో " పల్నాటి యుద్దం " కూడా వుంది కాని అది అన్నపూర్ణావారిది కాదు . మరి అన్నపూర్ణావారిది కూడా పల్నాటియుద్దం సినిమా వుందేమో మరి నాకైతే కనిపించలేదు ...
"దొంగరాముడు " చూస్తూవుంటే చాలా ముచ్చటగా అనిపించింది . ఏ. నాగేశ్వరరావు , సావిత్రి , జమున ఎంత చిన్నగా వున్నారో . పరిస్తితులు మనుషులను ఎలా దొంగ గా మారుస్తాయో చూపిస్తారు ఇందులో . నాకైతే తెగ నచ్చేసింది . హీరో పరిస్తితుల ప్రభావం తో దొంగ గా మారటము కాదు నచ్చింది , సినిమా నచ్చింది :)
శరత్ నవల " నిష్కృతి " ఆధారం గా నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం " తోడికోడళ్ళు " . ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . . . . ఎవర్ గ్రీన్ సాంగ్ . . .
తెలిసీ తెలియని వయసు లో జరిగిన పెళ్ళికి , కట్టిన మాంగల్యానికి ఇచ్చిన విలువే " మాంగల్య బలం ". నావరకు నాకైతే పాటలన్నీ సూపర్ హిట్ .
ఒకే పోలికల తో వున్న అజయ్ , విజయ్ వారి స్తానాలు మార్చుకొని , వారి ఇంటిని సరిదిద్దుకున్న , ఇద్దరు యువకుల కథే " ఇద్దరు మితృలు ". ఆద్యంతమూ సరదాగా సాగిపోతుంది .
ముగ్గురు స్నేహితురాళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చెప్పే కథ " చదువుకున్న అమ్మాయిలు ."
తనను పెంచినవారి కోసం పాటుబడిన ఓ మంచి అమ్మాయి జీవితం లో సుఖ దుఖాల కథే "వెలుగునీడలు ."
కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన నవల " చక్రభ్రమణం " కు సినిమా రూపమే " డాక్టర్ . చక్రవర్తి ." ఈర్శ , అసూయలు ఒక ముచ్చటైన దంపతులను ఎలా విడదీస్తాయో చూస్తూవుంటే చాలా బాధ కలుగుతుంది .
ఇద్దరు నాయికల మద్య అందమైన నాయకుడు . ఎక్కడా ? ఇంకెక్కడ " ఆత్మగౌరవం " లో :)
తలితండ్రుల అదుపు , ఆప్యాయత ఎరుగని ఓ అబ్బాయి , తన స్నేహితురాలి సంతోషం కోసం ఓ హత్య చేస్తడు . పిల్లలకు కుటుంబం లో సరి ఐన ఆప్యాయత , క్రమశిక్షణ లేకపోతే ఎలా తయారవుతారు ? ఎలా అంటే ఇదో " సుడిగుండాలు " లోని అబ్బాయి , అమ్మాయిలా .
హత్య చేసాడని జైలుకు వెళ్ళిన తండ్రి , నిరపరాధి అని నిరూపిస్తాడీ "పూలరంగడు ."
ఓ స్వాతంత్ర్య సమరయోధుని కొడుకు ఓ జవాన్ . అతను పెళ్ళిచేసుకో బోతున్న ప్రేయసి కార్ ఆక్సిడెంట్ లో చనిపోయింది . కాని ఆమె కొన్ని రోజుల తరువాత అతనికి ఓ గైడ్ గా కనిపించింది ! ఇదేమి వింత ! తెలుసుకోవాలని వుందికదూ ఐతే చూడండి " జై జవాన్ ".
ప్రేమించి పెళ్ళి చేసుకోబోతూ , కాదనుకొని తనను పెంచిన మేనమామ కూతురిని పెళ్ళిచేసుకోవటానికి సిద్దపడ్తాడు హీరో గారు . ఎందుకంటే " అమాయకురాలు " చూస్తే కాని తెలీదు !
ఓ జమిందారు కూతురు , పొగరుబోతు అమ్మాయి తనను ఏడిపించిన అబ్బాయికి బుద్ది చెప్పబోయి జీవితమే నాశనం చేసుకుంటుంది పాపం , యద్దనపూడి సులోచనారాణి నవల విజేత ఆధారం గా తీసిన " విచిత్రబంధం " లో .
ఎంత చదువుకున్నా , ఎంత తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా అవసరం . ఈ సంగతే చెప్పారు , యద్దనపూడి సులోచనారాణి నవల " బంగారుకలలు " అధారం గా తీసిన " బంగారుకలలు " సినిమాలో .
విభిన్న మనస్తత్వాలు కల ఇద్దరు అమ్మాయిలు వారి జీవితాన్ని ఎలా తిప్పుకున్నారో చెప్పే కథ , యద్దనపూడి సులోచనారాణి నవల "ప్రేమలేఖలు " ఆధారం గా తీసిన సినిమా " ప్రేమలేఖలు ."
అంతస్తుల భేధం ప్రేమికుల మద్య ఎడబాటును కలిగిస్తుంది . అవును వారు ఎంత ప్రేమించుకున్నా విడిపోకతప్పదు , యద్దనపూడి నవల " రాధాకృష్ణ " నవల ఆధారం గా తీసిన " రాధాకృష్ణ " సినిమాలోలా !
"అమెరికా అబ్బాయి " పాపం ఏమయ్యడో ఏమో ! షాపువాడు పని చేయని సి.డి ఇచ్చి నన్ను సినిమా చూడనీయకుండా చేసాడు హుం !

గత ఆరు నెలలుగా వీలు చిక్కినప్పుడల్లా " అన్నపూర్ణావారి ఆణిముత్యాల " ను చూసాను. దొంగరాముడు లో నాగేశ్వరరావు బంగారు కలలు లో ఎంతా మారిపోయారో ! దొంగరాముడు లో " అందచందాల గడుసరివాడు విందు భోంచేయ వస్తాడు నేడు " , అని చక్కగా డాన్స్ చేసిన సావిత్రి కి , వెలుగునీడలు లో " చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టినరోజు " లో కదలలేక కదిలిన సావిత్రి కి ఏమాత్రం పోలికలేదు . నటనలో కాదు ఆకారం లో :) ఆ రోజులలో నటన మీద తప్ప ఆకారం మీద అంత శ్రద్ద పెట్టినట్లు లేరు . వాళ్ళు అసలు నటిస్తున్నట్లుగా లేదు . ఆ పాత్రలలో ఇమిడిపోయారు . అరే సూర్యకాంతం తోడికోడళ్ళు లో ఎంత బాగుంది . గయ్యాళితనం మటుకు మారలేదు :) పాపం రేలంగి కి ముందునుంచీ ఒకటే పర్సనాలిటీ . అన్ని సినిమాలల్లో పాత్రదారులనందరినీ ఆ ఆ పాత్రలకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసారు .

నటీ నటులకు తగ్గట్టు కథ ఎంపిక చేసారా ? కథకు తగ్గట్టు నటీ నటులను తీసుకున్నారా ? చెప్పటం కష్టమే ! అన్నీ చక్కటి కథా చిత్రాలే . కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . కుటుంబ సబ్యులకు మద్య వుండే అనురాగాలు , ఆప్యాయతలు , ఈర్శాద్వేషాలు బాగా చూపారు . ఎక్కువగా నవల ఆధారం గా , ఎక్కువగా యద్దనపూడి సులోచనారాణి నవలల ఆధారంగా తీసారు . దాదాపు చాలా వరకు మద్య తరగతి వారి కథలే .

40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా వుండేదో ఈ సినిమాలలో చూడవచ్చు . గండిపేట , కాలాపహాడ్ , నౌబత్ పహాడ్ , రిట్జ్ హోటల్ , నేను చదువుకున్న రెడ్డీవుమెన్స్ కాలేజ్ చూస్తూ వుంటే తప్పిపోయిన పిల్ల ను చూసినంత ఆనందం వేసింది . ఇప్పుడు ఆ పరిసరాలు చాలావరకు మారిపోయాయి . ఇప్పుడు గండిపేట అంత అందం గా ఎక్కడుంది ? కాలపహాడ్ , నౌబత్పహాడ్ లేనే లేవు . రూపు మార్చేసుకొని , బిర్లా మందిర్ , బిర్లా సానిటోరియం అయ్యాయి . అప్పట్లో కాలపహాడ్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించేది .

నటీ నటులు , కథలు , హైద్రాబాద్ పరిసరాలు బాగా చూపించటం సరే , చందమామను ఎంత అందముగా చూపారని ! బాల్కనీ , అందులో గుత్తులు గుత్తులు గా పూసిన మాలతీ తీగ , ఆకాశం లోని జాబిల్లి , ఆ బాల్కనీ లో పరవశించిపోయిన నాయికా , నాయకులు , ఎంత అందమైన దృశ్యం ! చందమామ పాట తో పాటు , దాదాపు ప్రతి సినిమాలోనూ దేశభక్తి గేయం కూడా తప్పకుండా వుంది .

అన్ని సినిమాలు చూడ చక్కగా వున్నాయి . ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఐనా కలర్ వి కూడా వున్నాయి . కొన్ని సినిమలైతే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత బాగున్నాయి . మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత వినసొంపైన పాటలు , మంచి కథలు తో హాయిగా ఆహ్లాదంగా సాగిపోయే సినిమాలే అన్నీనూ . పోట్లాటలు , కాట్లాటలు , రక్తపాతాలు , రౌడీయిజాలు , దయ్యాలు , భూతాల తో వున్న సినిమాలే కాని ఇంత చక్కటి కథా చిత్రాలు ఈ రోజులలో ఎందుకు తీయరో !

Thursday, November 10, 2011

స్పినాచ్ ఖావో శక్తి బడావో !



ఓ బేద్ద రాచ్చసుడు , వికటాట్టహాసం చేస్తూ ఓ అమ్మాయిని చంకనిరికించుకొని పోతున్నాడు . . . . .
ఆ అమ్మాయి భయం తో కెవ్ . . . కెవ్ మని అరుస్తోంది . . . . .
ఇంతలో వచ్చాడు ఓ అబ్బాయి . ఆ రాచ్చసుడి తో డిషుం . . . డిషుం . . . అని యుద్దం చేస్తున్నాడు . కాని పాపం ఓడిపోతున్నాడు . . . . .
ఇంతలో పై నుంచి ఓ టిన్ ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది . దానిని ఓపెన్ చేసి , అందులో వున్న స్పీనచ్ ను తిన్నాడు .
హంతే . . . హాచర్యం . . . ఆ అబ్బాయి కి కండలు వచ్చి ,బళం వచ్చేసింది . అంతే . . . ఆ రాచ్చసుడి తో యుద్దం చేసి , ఓడించి ఆ అమ్మాయిని కాపాడాడు , ' పపాయా ద సేలర్ ' .
ఈ కథంతా చెప్పి ,
హూ . . . హా . . . " స్పీనచ్ కావో , శక్తి బడావో " అంటూ పరుపు మీద ఓ గెంతు గెంతి యుద్దం ఫోజ్ పెట్టాడు మా మనవడు .
" బామ్మా ! నా కిప్పుడే స్పీనచ్ పెట్టు " అని ఆర్డర్ వేసాడు .

కార్టూన్స్ తో కొన్ని సార్లు మంచి కూడా జరుగుతున్నదన్నమాట ! మరి మామనవడి శక్తి పెంచటానికి స్పీనచ్ తో వంటలు చేయొద్దు ! చేసి పెట్టాను :)

అవే మన వన భోజనాలకు కూడా తెచ్చాను . అందరూ ఎంచక్కా తినేసి , శక్తి ని పొందండి :))



1. పాలక్ పూరి ;
రెండు పాలకూర కట్టలు ,
రెండు కప్పుల గోధుమ పిండి ,
వొక స్పూను వాము ,
కొద్దిగా కొత్తిమీర ,
ఓ పచ్చిమిరపకాయ ,
కొద్దిగా జీలకర్ర పొడి ,
సరిపడా ఉప్పు .
ముందుగా పాలకూరను శుభ్రం గా కడిగి , కట్ చేసుకోవాలి , పాలకూర , కొత్తిమీర , పచ్చిమిరపకాయ మిక్సీ లో వే పేస్ట్ లాగా రుబ్బుకోవాలి .
ఆ పేస్ట్ ను , వామును , జీల కర్రపొడిని , ఉప్పును గోధుమపిండిలో వేసి పూరీపిండిలా తడుపుకోవాలి . పిండి ని తడిపేందుకు ఆ పేస్టే సరి పోతుంది . ఒకవేళ తక్కువ అవుతే నీళ్ళు పోసుకోవచ్చు .
ఆ పిండి తో చిన్న చిన్న వుండలు చేసుకొని , పూరీలు వత్తుకొని కాల్చుకోవాలి .

2.పాలక్ రైస్ ;
రెండు గ్లాసులు బాసుమతి బియ్యం ,
మూడు కట్టలు పాలకూర ,
ఒక గ్లాస్ పాలు ,
మూడు గ్లాసులు నీళ్ళు ,
రెండు ఉల్లిపాయలు ,
కొద్దిగా దాల్చిని చెక్క , షాజీర , పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచి , నాలుగు లవంగాలు .
రెండు స్పూన్స్ గరం మసాలా పొడి ,
సరిపడా ఉప్పు ,
పోపుకు నూనె .
ముందుగా బియ్యం ను కడిగి పక్కన పెట్టుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడిగి కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలను , సన్నగా పొడవుగా కోసుకోవాలి .
కుక్కర్ ను పొయ్యిమీద పెట్టి , అందులో నూనె వేయాలి . నూనె కాగాక దాల్చిని , లవంగాలు , షాజీర , లవంగాలు కొద్దిగా కచ్చా పచ్చాగా కొట్టిన పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచీ వేయాలి . అవి వేగాక , ఉల్లిపాయముక్కల ను వేసి , లేత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి . ఉల్లిపాయముక్కలు వేగాక , పాలకూర పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేట్లుగా వేయించుకొవాలి . ఆ తరువాత అందులో మూడుగ్లాసుల , నీళ్ళు , ఒక గ్లాసు పాలు పోయాలి . ఉప్పు గరం మసాలా పొడి వేసి , బియ్యం వేయాలి . బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి , విజిల్ పెట్టేయాలి . ఐదు విజిల్స్ వచ్చాకా , మంట తగ్గించి ఐదు నిమిషాలుంచి , స్టవ్ ఆపేయాలి .

౩. పాలక్ పన్నీర్ ;
పాలకూర పూరీలు , పాలకూర అన్నమూ అయ్యాక వాటిలోకి ' పాలక్ పన్నీర్ '.
పాలకూర ఐదు కట్టలు ,
వంద గ్రాముల పన్నీర్ పాకెట్ ,
రెండు ఉల్లిపాయలు ,
ఒక వెల్లుల్లి రెబ్బ ,
కొద్దిగా అల్లం ముక్క ,
ఓ స్పూన్ గరం మసాల పొడి ,
ఉప్పు ,
ఖారం ,
పోపుకు నూనె .

పన్నీర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని , నూనెలొ కొంచం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడి , కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి .
మూకుడులో పోపుకు సరిపడా నూనె వేసి , అల్లం , వెల్లుల్లి , ఉల్లి ముద్దను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి . ఆ ముద్ద వేగాక పాలకూర పేస్ట్ ను వేయాలి . పాలకూర బాగా వుడికాక , వేయించి వుంచుకున్న పన్నిర్ ముక్కలను , గరం మసాలా పొడిని , ఉప్పు , ఖారం ను వేసి బాగా కలిపి ఇంకొద్దిసేపు వుడికుంచుకోవాలి . కూర గంటె జారుడుగా వుండాలి . ముద్ద కాకూడదు . అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు .
అంతే , పాలక్ పూరి , పాలక్ రైస్ , పాలక్ పన్నీర్ తయార్ :)

వీటి కి తోడు కీరా రైతా . ఇది చేయటము చాలా సులువు . కీరా తొక్కతీసి , తురుము కోవాలి , కీరా తురుము , సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలూ , కొత్తిమీర , ఉప్పు పెరుగులో కలపటమే !

ఇలాగే పూరీ లను , అన్నం ను , బీట్రూట్ , కారెట్ , మెంతికూర , పుదీన ,టమాటా, మటర్ ( మటర్ ను పేస్ట్ చేయ కూడదు . అలానే వేసేయాలి .) ల తో కూడా చేయవచ్చు . కాదేది కవితకనర్హమూ అన్నట్లు ఏ కూరైనా వేసి వండవచ్చు . మామూలా గా తెల్ల అన్నం వండుతే , చిన్నప్పుడు మా అబ్బాయి తెల్లన్నం నాకొద్దు అని గొడవ చేసేవాడు . అదే పోలిక వాడి కొడుకుకు వచ్చింది . పూరీ ఐనా , చపాతీ ఐనా , అన్నం ఐనా కలర్స్ కలర్స్ వుండాల్సిందే ! కొంచం ఓపిక చేసుకొని వండుతే పిల్లలకు అన్ని కూరలూ పెట్టినట్లుగా కూడా వుంటుంది . కడుపు నిడా తింటారు . బలానికి బలమూ , ఆరోగ్యానికి ఆరోగ్యమూనూ . పుణ్యమూ , పురుషార్ధము :)

Wednesday, September 14, 2011

రాధ - మధు



టి. వి చూసే అలవాటు లేని నేను , యద్దనపూడి నవల సీరియలా గా వస్తోంది అని విని , ఏదేమిటో చూద్దామని టి. వి ఆన్ చేసాను . అంతే రెండు సంవత్సరాల పాటు రాత్రి 8 కాగానే మా టి. వి ముందు హాజరు . రాధ - మధు సీరియల్ తెగ నచ్చేసి , అప్పుడప్పుడు పిల్లలతో కూడా టి. వి కోసం యుద్దం చేసేంతగా నచ్చేసింది :)))))

ఈ తియ్యనైన ఎడబాటు ప్రేమ కథ ను స్కార్ఫియో ప్రొడక్షన్ వారు " రాధ- మధు " గా టి . వి సీరియల్ గా తీసారు . ఈ సీరియల్ లో కథ ను బేస్ గా మాత్ర మే తీసుకున్నారు . తాతయ్యను , నానమ్మ గా చూపించారు . కొన్ని పాత్రల నిడివి ని పెంచారు . కొన్ని ఎక్స్ ట్రా పాత్రలు చేరాయి . ఐనా ప్రతిపాత్ర బలమైందే . ప్రతి పాత్రా అవసరమైందే అన్నట్లుగా వున్నాయి . వొకటి ఎక్కువ , వకటి తక్కువగా లేవు . చిన్న పాత్రల మీద కూడా శ్రద్ద చూపించారు . ఏ పాత్రను తీసుకున్నా సహజం గా అనిపించింది . డైలాగులు చాలా మామూలు బాషలో వున్నాయి . అనవసరమైన ఇంగ్లీష్ పదాలు లేవు .ఎక్కడా అతిలేదు . సంభాషణలు చాలా మాములుగా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లే వున్నాయి . అంతేకాని భారీ డైలాగులు లేవు . హాస్యం కూడా బాగా పండించారు . చాలా అద్భుతంగా తీసారు .

హీరో పేరు రాధాకృష్ణ . అందరూ రాధా అనిపిలుస్తుంటారు . హీరోయిన్ పేరు మధూలిక . మధు అని పిలుస్తుంటారు . నానమ్మ రాజరాజేశ్వరీ దేవి . కథ కు ప్రాణం ఈ మూడు పాత్ర లే . సినిమాలలో గుంపులో గోవిందమ్మ గా , చిన్న చిన్న పాత్రలు వేసే శివపార్వతి ని ముందు నానమ్మ గా చూసి , ఈమె ఏమి చేయగలదు అనుకున్నాను కాని , జమీందారు భార్య గా ఆ వశం ప్రతిష్ఠ కాపేడేందుకు కొడుకును దూరం చేసుకొన్నప్పుడూ , ఆ తరువాత పశ్చాతాపం చెందినప్పుడూ , మనవడి ని పెంచేటప్పుడు బాద్యత గల నానమ్మగా , మనవడి ని మార్చాలి , పెళ్ళి చేయాలి అని తపించినప్పుడూ , పనివాళ్ళ మీద కూడా అభిమానం చూపించేటప్పుడూ , పేద ఇంటి పిల్లను మనవడి కి ఇచ్చి పెళ్ళి చేసినప్పుడూ , రాధ ప్రేమ కథ తెలిసి , తనకు తెలీకుండానే ఇద్దరు అమ్మాయీల జీవితాన్ని నాశనం చేసానే అని పరితపించినప్పుడు , మితృ , గోపాలం ల బాల్య స్నేహితురాలిగా చాలా బాగా నటించింది . నటించింది అంటము కాదు జీవించింది . నానమ్మ అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . చాలా హుందాగా వుంది . రాధగా కళ్యాణ ప్రసాద్ తోరం , మధుగా మౌనిక చాలా సహజం గా వున్నారు . అసలు వాళ్ళిద్దరికీ సీరియల్ తీసే ముందే , ఎలా నటించాలి అని శిక్షణ ఇప్పించారేమో అని నా అనుమానం . వాళ్ళ హావ భావాలు , బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ అన్నీ నాచురల్ గా వున్నాయి . ఆ పాత్రలకు తగ్గట్టుగా నవలలో నుంచి ప్రాణం పోసుకొని వచ్చారా అన్నట్లుగా వున్నారు . వాళ్ళ ముందు , శోభన్ బాబు , జయప్రద తేలి పోయారు . మధు చీర కట్టు చూస్తే సింతటిక్ చీరలు కూడా ఇంత అందం గా కట్టుకోవచ్చా అనిపించింది . పద్మశ్రీ , లక్ష్మి ల జడలు కూడా పెద్దగ్గానే వున్నా మధు జడ డామినేట్ చేసింది . నడుస్తూ , నడుస్తూ భుజం మీదు గా చూడటము ఓహ్ చాలా అందంగా అనిపించిందీ అమ్మాయి .(ఇన్ని తెలివితేటలు , అందమూ , మంచి గుణాలన్ని కలవోసిన అమ్మాయిని నిజ జీవితం లో భరించటం కష్టమేమో :)) కాకపోతే కొన్ని సార్లు మధు కాన్ ఫిడెన్స్ ఓవర్ గా చూపించిదా అనిపించింది .

జూలీ గా లహరి బాగా ఇమిడిపోయింది . అందరి సానుభూతి నీ దోచుంది . మిగితా పాత్ర ధారు లంతా కూడా బాగా చేసారు . కాకపోతే అందరివీ అసలు పేరులు తెలీలేదు . సాయన్న , గొదావరి , బాపి మొదలైన వారి అసలు పేర్లు తెలీలేదు . యువజంట రాధ - మధు తో పోటీ పడ్డారు గోపాలం ఆది లక్ష్మి , వెంకట్రావు , జానకమ్మ . సాయి , పద్మశ్రీ హాస్యాన్ని బాగా పండించారు . ముందు పారిజాతం పాత్ర అనవసరం అనుకున్నాను కాని రాధ - మధు ల ను కలిపేందుకు పరోక్షం గా ఆ పాత్రే సాయపడింది . రాఘవయ్య పాత్ర సగము నుంచి ముఖ్యమైన పాత్రైపోయింది . రాజు , శీను , సరోజ , భారతి , బబ్లు , అనసూయ , సన్నీ లాంటి చిన్న పాత్రల కు కూడా న్యాయం చేసారు . మధు ఆప్తులుగా మూర్తీ , లక్ష్మి బాగా చేసారు . మధు తమ్ముడు రవి చాలా ముద్దుగా వున్నాడు . వరమ్మ పాత్ర పల్లెటూరి అమ్మలక్కల పాత్ర ను సజీవం గా చూపారు . రాధ - మధు లను కలపాలని అందరూ ప్రయత్నం చేయటం టచీగా అనిపించింది .
ఇహ రాధ మధు కలుస్తారు అనుకోగానే ఏదో అవాంతరం రావటం , మనం ఉసూరు మనటం . అందుకే డైరక్టర్ దీనిని తీయని ఎడ్బాటు ప్రేమ కథ అన్నాడు :) సీరియల్ రెండు సంవత్సరాల పాటు కళ్ళు తిప్పుకోనీయకుండా టి. వి కి కట్టి పడేసిన అద్భుతమైన సీరియల్ ఇది . కాని , కొన్ని సార్లు సాగతీతగా అనిపించింది . కొన్ని చోట్ల పద్మశ్రీ , పారిజాతము ల ఎపిసోడ్స్ కొంచం బోర్ కొట్టించాయి . అలాగే ఆద్యంతమూ రాధ మధుల మేకప్ మొదలైన వాటిల్లో శ్రద్ద చూపించారు కాని చివరి ఎపిసోడ్ కు వచ్చేసరికి ఇద్దరి మేకప్, హేర్ స్టైల్ రెండూ బాగాలేవు . అంతకు ముందు రెండు పెళ్ళి కూతురి గెటప్ లో ముచ్చటగా వున్న మధుకు హేర్ స్టైల్ పూర్తిగా మార్చి , ఓవర్ మేకప్ చేసారు . పాన్ కేక్ బాగా కనిపించి మోటుగా వుంది . అంతవరకు వున్న అందమే పోయింది . అలాగే రాధ కు కూడా . హేర్ మొత్తం వెనక్కి దువ్వేసి , మేకప్ కూడా ఓవర్ గా చేసారు . ఒకేసారి గా ఇద్దరూ వయసు ఎక్కువ వాళ్ళుగా అగుపించారు . చిన్న చిన్న లోపాలు తప్ప సీరియల్ చాలా బాగుంది .
కొన్ని సరదా అబ్జర్వేషన్స్ ; రాజరాజేశ్వరి జమిందారిణి ఐనా , పాపం ఆ రాజమాత కు సీరియల్ మొత్తం లో పది చీరల కన్న ఎక్కువ లేవు ! మధు జడ మొదట్లో చాలా వదులుగ సన్నగా వుండి రాను రాను లావైంది . జుట్టు కు క్లిప్ పెట్టుకొని గుడికి వెళ్ళి నప్పుడు జుట్టు జడంత పొడువులేదు . సీరియల్ చివరలో జడకు బోలెడు క్లిప్స్ పెట్టారు . సీరియల్ అంతా బెడ్ కాఫీ తో మొదలుకొని , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ అన్నీ యధావిధిగా పెట్టారు . అందుకేనేమో సీరియల్ ఐపోయే సమయానికి అంతా కాస్త లావెక్కారు :) ప్రతి చిన్న విషయాన్ని అంటే ఎవరైనా ఆక్టర్ ఇక ముందు కనిపించరు అంటే ముందే వారిని పని మీద వూరికి పంపటం వగైరా చేసి మనకు డౌట్స్ రాకుండా చేసారు . కాని చివరలో రాధ కు , పేపర్ లో చూసి , ఆపరేషన్ కోసం సహాయం చేసింది రవి కేనని ఎలా తెలిసిందో చెప్పటం మర్చిపోయారు . సీరియల్ అంతా తన నొటి తో దడ దడ లాడించిన వరమ్మ లాస్ట్ సీన్ లో లేకపోవటం కొరతే మరి :)
ఇది యద్దనపూడి సులోచనారాణి నవల " గిరిజా కళ్యాణం " ఆధారం గా నిర్మించ బడింది . దాని కథ చిత్రమాలికలో " గిరిజా కళ్యాణం " లో చదవండి ..
ఇది యు ట్యూబ్ లో వుంది . చూడని వారు చూడవచ్చు .
కొస మెరుపేమిటంటే , ఈ సీరియల్ వస్తున్న రోజుల్లోనే ఎందుకో జి చానల్ పెడితే అందులో " ఆట" అనే ప్రోగ్రాం వస్తోంది . అప్పుడు మధు అందులో " ఆ అంటే అమలాపురం " పాటకు డాన్స్ చేస్తోంది . అది చూడగానే మనసంతా బాధ తో నిడిపోయింది . ఆర్టిస్టులంటే అన్నీ పాత్రలూ పోషించాలి కాని ఆ సీరియల్ వస్తుండగా ఆ అమ్మాయి ఈ డాన్స్ చేయకుండా వుండాల్సింది అనిపించింది :(

ఈ మద్య నవల ఆధారిత సినిమా ల గురించి చిత్రమాలిక లో వ్రాస్తున్నాను :) ఐతే నా దగ్గర అన్నీ యద్దనపూడి , యండమూరి , శరత్ బాబు నవలలు , సినిమాలే వున్నాయి . నాకు తెలిసినంతవరకు మాదిరెడ్డి , కొమ్మూరి వేణుగోపాల రావు , మల్లాది , కావలిపాటి విజయలక్ష్మి , బలభద్రపాత్రుని రమణి మొదలైన వారి నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి .కాని ఏ సినిమాలు ఏ నవలల ఆధారం గా వచ్చాయో తెలీటం లేదు . అలాగే కొన్ని నవలలు తెలుగు లో , హిందీ లో కూడా వచ్చాయి . ఎవరికైనా , నవల పేరు , అది సినిమా గా వచ్చిన సినిమా పేరు తెలిస్తే చెప్పగలరు ప్లీజ్ . అలాగే ఈ ఆర్టికల్ ఇలాగే కాకుండా ఇంకా కొంచం వేరుగా వ్రాయవచ్చేమో సలహాలు ఇచ్చినా సంతోషిస్తాను . ఆ * * * నవలలు , సినిమా సిడీ లు నేను కొనుక్కుంటానులెండి .నవలలైతే ప్రతినెలా కోటీ దాకా ఏమొస్తావులే అని నాలుగు నెలల క్రితమే మా ఇంటి వెనుకే విశాలాంద్ర వారు బ్రాంచ్ తెరిచారు . ఏ నవల కావాలన్నా తెప్పించి ఇస్తాం మేడం అని నాకు ప్రామిస్ చేసారు . కాబట్టి నొప్రాబ్లం :) సి.డి లే సుల్తాన్ బజార్ కు వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి . కాకపోతే దొరకాలి :)
అందరికీ అడ్వాన్స్ గా థాంకూలు :)