Wednesday, January 27, 2016

రోలు దానం!



కాలు కాలిన పిల్లిలా వంటింట్లోకీ బయటకూ తిరుగుతున్నాను.సమస్య చాలా పెద్దది. దానిని ఎలా ఫేస్ చేయాలో తెలీటం లేదు! సెలవలా ఐపోతున్నాయి. ఇంకో వారం లో వెళ్ళిపోవాలి. అది లేకుండా పని జరగదు. అడగటానికి భయం ! కిం కర్తవ్యం!చూసీ చూసీ అత్తయ్యగారు అడిగేసారు "ఏం కావాలే కమలమ్మా?"
గబుక్కున "రోలు" అన్నాను.
"రోలా రోలేం చేసుకుంటావు?"
"సిలిగురి తీసుకెళ్ళాలండి.."
"హూం పాతది దానం చేసేసావా?"
అన్నట్లు గబ గబా బుర్ర ఊపేసాను."నిక్షేపం లాంటి రోలు.పోయినసారి కొట్టించే సమయం లేదని నేను వాడుకుంటున్నది ఇచ్చేసాను.అదీ ఇచ్చి కూర్చున్నావు.ఐనా కమలమ్మా ఇది ఎన్నోసారే నువ్వు రోలు తీసుకుపోవటము?"గదమాయించారు.
"నాలుగో సారో ఐదో సారో నండి.నేనేమి చేయనండి నేను వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు. మీ అబ్బాయి ఇచ్చేస్తారు."బిక్క మొహం వేసుకొని అన్నాను.
"సరే కానీయ్ ఏమి చేస్తాము."
ప్రతి సారీ సెలవల్లో వచ్చి తిరిగి వెళ్ళటప్పుడు ప్రహసనం తప్పదు . కొత్త రోలు దగ్గరుండీ మరీ కొట్టించుకు తెచ్చేవారు మామగారు.కొద్దిగా లోతు , వెడల్పుగా కొట్టి, చుట్టూ వెడల్పుగా అంచు, రుబ్బిన పప్పు కిందపడకుండా దానికి సన్న గట్టు తో వైనంగా సింగారించుకొని వచ్చేది రోలు. దానిలో మెంతులూ , కాగితాలూ వేసి రుబ్బించి ఇచ్చేవారు.రెండు పెట్టెలు, ఒక సూట్కేస్, బెడ్డింగ్ పక్కన గోనె సంచీలో రోలుగారు తయారు!
మూడు రోజుల ప్రయాణం. రెండు చోట్ల రైలు మారాలి.ప్రతి చోటా కూలీకి బాక్స్ కో దో రూపయా, పత్తర్ కో పాంచ్ రూపయా!రోలు ధర పది రూపాయలు!తడిపి మోపెడు!తీసుకెళ్ళక పోతే ,హోటల్ లో ఆర్డర్ ఇచ్చినట్లు , ఇడ్లీ, వడా , దోసా అని మావారిచ్చే బ్రేక్ ఫాస్ట్ పార్టీలెట్లా ?
దేవుడా , రాముడా అనుకుంటూ మోసుకెళ్ళటమూ , సెలవల్లో వచ్చేటప్పుడు మిసెస్ చెడ్డా నో "మాలా తుమారా పత్తర్ హమే దేదోనా ప్లీజ్ తుంకో పైసా దేదూంగా ."అని బతిమిలాడుతే నా చూపులు పట్టించుకోకుండా ,ఇవ్వకుండా ఉండటం మావారి తరమా ?విడ్డూరం కాకపోతే పైసలు తీసుకుంటామామళ్ళీ నేను రోలు తెచ్చుకోవటానికి పడే పాట్లు, అత్తయ్యగారి చివాట్లు తలుచుకుంటూ ఊసురోమంటూ, ఇడ్లీ దోశ చేయటం నేర్పిన పాపానికి రోలు దానం చేయక తప్పదు. మనసులో ఏడ్చుకుంటూ , ఠీక్ ఠీక్ లేలో అని, ఇస్తినమ్మ దానం అనుకుంటూ ఇచ్చెయటమే!
 అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అంటారు కాని నన్నడిగితే రోలు దానం గొప్పది అంటాను.

"ఏమండీ మనం ఎన్ని రోళ్ళు దానం చేసామంటారు?" ఏమిటో అప్పుడు పట్టించుకోనట్లే ఇప్పుడూ నా ఘోష పట్టించుకోవటం లేదు మావారు!ఇంతకీ ఇన్నేళ్ళ తరువాత రోటి దానం సంగతి ఎందుకు గుర్తొచ్చిందంటే , మధ్య ఆంధ్రభూమి వార పత్రికలో పొత్తూరి విజయలక్ష్మిగారు వారి జ్ఞాపకాల జావళీ లు రాస్తున్నారు. సారి వారి రోలు గురించి వ్రాసారు .అంతే నాలోనూ జ్ఞాపకాల జావళీ జూలు విప్పుకుంది. అదీ సంగతి!

16 comments:

శ్రీలలిత said...

హ హ బాగుందండీ.. నాకెప్పుడు దానం చేస్తారూ రోలూ.. (కరెంటుదండోయ్)

శ్రీ said...

మా అమ్మగారిలా ఎవ్వరూ కూడా రోలు వేరెవ్వరికీ ఇవ్వరు అని నేను రూడీ చేసుకున్నాను . కాని మిమ్మల్ని చూసాక ... ఏమనాలో తెలీటం లేదు . రోలు అంటే గౌరమ్మ కదా శుక్రవారం/ పెళ్లెప్పుడు / పేరంటాలప్పుదు చక్కగా దానిక్కూడా పసుపు కొమ్ము గట్రా కడతారు కూడా .ఏమిటో ...!!!...

బులుసు సుబ్రహ్మణ్యం said...

జోర్హాట్ లో మేము కూడా రోలు కోసం నానా ప్రయత్నాలు చేశాము. ఒక తెలుగు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ట్రాన్స్ఫర్ అయి వెళుతుంటే, ఆయనని బతిమాలి, మొహమాట పెట్టి, బలవంతం చేసి దానం చేయించుకొన్నాం....దహా.

నీహారిక said...

నాకెప్పుడు దానం చేస్తారూ రోలూ.. గౌరమ్మ కదా !

చెప్పాలంటే...... said...

mottaniki dummu baaga dulipesaru gaa... tondara gaa naaku o rolu daanam daanito patu next year b'day greetings :) Please Mala garu

రాజ్యలక్ష్మి.N said...

మీ రోలు విశేషాలు బాగున్నాయండీ చిన్నప్పడు మా మామయ్య వాళ్ళింట్లో మా అమ్మవాళ్ళ చిన్నప్పటి పెద్దరోలు గుర్తు చేశారు.. మీ పోస్ట్ చదివి మా అమ్మకి కూడా తన జ్ఞాపకాలు గుర్తొచ్చాయట.. :)

Zilebi said...



రోలు దధాతి "soul" కు సౌఖ్యం :)

చీర్స్
జిలేబి

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు కరెంటుదెందుకండీ షాక్ కొడుతుంది ఎంచక్కా రాతి రోలు ఇస్తాలెండి.

మాలా కుమార్ said...

బులుసు గారూ,
ఇదో ఇలానే మావారినీ మొహమాట పెట్టి చక్కదనాల రోలును దానం పుచ్చుకున్నారు జనాభా :)

మాలా కుమార్ said...

శ్రీ, మీ అమ్మగారూ నాటైపేనన్నమాట బాగుంది :)

మాలా కుమార్ said...

నీహారికా, దానం ఇచ్చేందుకు ఇప్పుడు నా దగ్గర ఎక్స్ ట్రా రోలు లేదండి.అది ఇచ్చేస్తే ఇంకోటి కొట్టించుకొచ్చే మామగారు కూడా లేరు.సారీ :)

మాలా కుమార్ said...

మంజూ అలాగే జనవరి 12 గుర్తుంచుకుంటాను.

మాలా కుమార్ said...

రాజీ మీ అమ్మగారిని కూడా జ్ఞాపకాలు వ్రాయమని, మీరు పోస్ట్ చేసెయండి.సరదాగా ఉంటుంది.

మాలా కుమార్ said...

జిలేబీ గారూ
:)

రుక్మిణిదేవి said...

హ,హ,హ,హ,... రోలు కధలు బాగున్నాయి.. మన ఆంద్ర నుండి ఇతర రాష్ట్రాలు వెళ్ళే వాళ్లకి రోలు అనుభవాలు సుపరిచితాలే .. ఇడ్లీలు ,దోశలు,రోటి పచ్చళ్ళు మరి .........చాలా బాగుంది మాల గారు ..

Unknown said...

అయిపోయింది ఏదో అయిపోయింది ఇంక విచారంకండి