Thursday, August 13, 2015

రాధామాధవీయం

ఈ నెల యామిని అంతర్జాల పత్రిక లో వచ్చిన నా కథ, "రాధామాధవీయం."
మీకు వీలున్నప్పుడు చదివి అబిప్రాయం చెప్పండి ప్లీజ్.థాంక్ యు.




http://www.yaaminii.com/uncategorized/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A7%E0%B0%B5%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-%E0%B0%95%E0%B0%A5/



రాధామాధవీయం
మాలాకుమార్ 
లైట్ బ్లూ కలర్ ఫుల్ హాండ్ షర్ట్ , డార్క్ బ్రౌన్ కలర్ పాంట్ లో పచ్చటి రంగులో,ఆరడుగుల ఎత్తుతో అందంగా వున్నాడు మాధవ్.షర్ట్ ను పాంట్ లోపలికి దోపి , సరిచేసుకొని, బెల్ట్ పెట్టాడు.షర్ట్ చేతి బటన్స్ పెట్టుకుంటూ , "తాతయ్యా నేను రెడీ " అని కేకేసాడు.
లోపల గదిలో పల్లవి తయారవుతూ, "తాతయ్యా నేనింకా రెడీ కాలేదు , ఐదు నిమిషాలు వచ్చేస్తున్నాను "అంది.మంచం మీద పడుకొని పల్లవిని గమనిస్తోంది రాధ. మాధవ్ అంత పచ్చగా కాకపోయినా తెల్లగా , ఐదడుగుల నాలుగంగుళాలతో , సన్నగా , కోమలంగావుంది , ఆకుపచ్చ కు ఎర్ర అంచున్న పట్టులంగా, ఆకుపచ్చ జాకిట్ , ఎర్రవోణీ వేసుకుంది. జడ చక్కగా లావుగా పొడుగ్గా వుంది. నుదుటన దోస గింజ ఆకారంలో బొట్టు దిద్దుకొని కాటుక పెట్టుకోనా వద్దా అని ఆలోచిస్తోంది.రాధవైపు చూస్తూ "రాధీ కాటుక పెట్టుకోనా ? మరీ ఓవర్ గా వుంటుందా ?" అని అడిగింది. ప్రశ్న పట్టించుకోకుండా "అమ్మలూ మీరంతా ఎక్కడి కెళుతున్నారే ?"అని ప్రశ్నించింది రాధ . "అదేమిటే తెలీనట్లు అడుగుతున్నావు అన్నయ్య పెళ్ళి చూపులకు వెళుతున్నాము కదా "అంది పల్లవి.పల్లవి వైపు సాలోచనగా చూసింది రాధ.ఇంతలో బయట నుంచి రమాదేవి "అమ్మలూ ఇంకా కాలేదా ? తాతయ్య తొందర పడుతున్నారు "అని పిలిచింది. "ఒక్క నిమిషం వస్తున్నానమ్మా,"అంది పల్లవి.ఏదో నిశ్చయానికి వచ్చినట్లు లేచి, ముందు గది లోకి వచ్చింది రాధ. అక్కడ తాతయ్య రాఘవయ్య గారు, మాధవ్, మామయ్య విష్ణుమూర్తి, అత్తయ్య రమాదేవి తయారై , పల్లవి కోసం ఎదురుచూస్తున్నారు.
 రాధ చరచరా  మాధవ్ ముందుకు వెళ్ళి,"బావా నేనెట్లా వున్నాను ?"అని అడిగింది. ఒక్క క్షణం మాధవ్ తడబడి,రాధ వైపు చూసాడు. మంచి రంగు , ఐదడుగుల ఆరంగుళాలు, పెద్ద జడ తో , ఎరుపుమీద పసుపు చుక్కలున్న లంగా జాకెట్ మీద పసుపు రంగు వోణీతో అందంగా వుంది రాధ.వచ్చీరాని నవ్వుతో , చాలా అందంగా వున్నావు అన్నాడు. ఇక ఆపుకోలేనట్లు ముందుకు వెళ్ళి మాధవ్ కాలర్ పట్టుకొని "మరైతే ఎందుకు ఇంకో అమ్మాయిని చూడటాని కి వెళుతున్నావు ? నీకు నేను పనికి రాలేదా ?"అని అడిగింది.
అనుకోని పరిణామానికి అక్కడ వున్న అందరూ ఉలిక్కి పడి రాధ వైపు ఆశ్చర్యంగా చూసారు.మాధవ్ నిశ్చేస్ఠుడైనాడు. మాధవ్ ను వదిలేసి , అక్కడే వున్న సోఫాలో కూర్చొని రెండు చేతులతో మొహం కప్పుకొని రోదించసాగింది రాధ.ఎవరికీ ఏమి మాట్లాడాలో తోచలేదు.లోపలి నుంచి జానకమ్మ , పల్లవి గబగబా బయటకు వచ్చారు.మాధవ్ వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.
జానకమ్మ రాధను పొదివి పట్టుకొని "ఏమిటమ్మా ఇది ?" అని అడిగింది.
"అమ్మమ్మా , తాతయ్యా నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు. ఐనా మీకు కూడా నేను పనికిరాలేదు కదూ . మామయ్యా నా బంగారుతల్లివే అంటావు ఎప్పుడూ , నీకూ నేను కనిపించలేదు ."అంటూ అమ్మమ్మ చేతిని విదిలించుకొని పరిగెత్తుతూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.
ఏమిచేయాలో , వుండాలో వెళ్ళిపోవాలో తెలీకుండా నిలబడి వున్న మధ్యవర్తి తో ,నాకు హటాత్తుగా బిపీ పెరిగిందని ,అందుకని రాలేక పోతున్నామనీ  మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెపుతామనీ పెళ్ళివాళ్ళకు చెప్పండి . అని చెప్పి అతనిని పంపించివేసాడు రాఘవయ్య.
రాధ వెనకనే పల్లవి పరిగెత్తుతూ వెళ్ళింది. అప్పటికే రాధ తలుపేసేసింది. "రాధీ తలుపు తీయవే " అని తలుపు కొట్టసాగింది పల్లవి. రాధ పలకలేదు. తలుపుతీయలేదు. ఏమి అఘాయిత్యం చేసుకుంటుందోనని అంతా హడలిపోయారు."తలుపు తీయి బుజ్జీ , నీతో నేను మాట్లాడాలి "అని బతిమిలాడాడు రాఘవయ్య.ఇంతలో విష్ణుమూర్తి వెళ్ళి మాధవ్ తలుపు తట్టాడు. "నాన్నా , నన్ను కాసేపు వదిలేయి "అన్నాడు మాధవ్.చాలాసేపు బతిమిలాడాక తలుపు తీసింది రాధ. కాని ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వక , కళ్ళకు అడ్డం గా చేతులు పెట్టుకొని పడుకుంది. రాత్రి అందరికీ భారం గా గడిచింది.
పొద్దున్నే రాఘవయ్య , రాధ తో "నువ్వు రోజు నారాయణ తాతయ్య ఇంట్లో వుండు.సాయంకాలం నేను వచ్చి మాట్లాడుతాను ."అన్నాడు. తను చెప్పేది చెప్పింది. ఇంక నిర్ణయం ఏమి తీసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు అనుకొని దిగులుగా , రెండు వీధుల అవతల వున్న నారాయణ తాతయ్య ఇంటి కి వెళ్ళింది.అక్కడ తాతయ్య, లీలమ్మ బామ్మా ఏమీ మాట్లాడలేదు. బహుశా తాతయ్య వాళ్ళకు చెప్పి వుంటాడు అనుకొంది రాధ.
దాదాపు పది గంటలు కావస్తూ వుండగా రాధ అమ్మ వైదేహి, నాన్న వెంకటేశ్వరరావు , వరంగల్ నుంచి వచ్చారు. " ఏమైంది బాబాయ్ , మామయ్య  మమ్మలిని వెంటనే రమ్మని ఫోన్ చేసాడు. సాయంకాలం రాధ కు పెళ్ళిచూపులని చెప్పాడు "అని నారాయణ మూర్తి ని అడిగాడు శ్రీనివాసరావు.
 "ఏమోరా మాకూ తెలీదు . రాధను రోజు మీ ఇంట్లో వుండనీయమని పంపాడు . మాకూ పెళ్ళి చూపులనే చెప్పాడు . వివరాలు చెప్పలేదు."అన్నారు నారాయణమూర్తి గారు.
వెంకటేశ్వరరావు , విష్ణుమూర్తి ట్రాన్స్ఫర్ మీద ఊరూరా తిరుగుతూ వుంటారని, రాఘవయ్య , జానకమ్మ కొడుకు పిల్లలు , మాధవ్ , పల్లవి, కూతురు పిల్లలు రాధ, శ్రీరాం లను తమదగ్గరే వుంచుకొని చదివిస్తున్నారు.మాధవ్ చదువు పూర్తి చేసుకొని, నాలుగేళ్ళుగా డిల్లీ లో ఉద్యోగం చేస్తున్నాడు. రాధా, పల్లవి బి.యస్.సి మూడో సంవత్సరం చదువుతున్నారు. శ్రీరాం ఇంటర్ ఫైనల్ లో వున్నాడు.తల్లి తండ్రులు వారం పదిరోజులకోసారి వచ్చి చూసిపోతూవుంటారు.చిన్నప్పటి నుంచీ రాఘవయ్య, జానకమ్మల దగ్గరే పెరగటం వల్ల పిల్లలందరికీ వాళ్ళ దగ్గర చాలా చనువు.
మాధవ్ కు  పెళ్ళిచేయ  తలపెట్టారు. పెళ్ళిచూపులకు  వెళుతుండగా  ఇలా  రాధ  బయటపడింది. ఎవరికీ ఏమి మాట్లాడాలో  తెలీక  అంతా నిశబ్ధంగా వున్నారు. సాయకాలం ,పెళ్ళిచూపులకు పదమని బయలదేర తీసాడు రాఘవయ్య. అంతా నారాయణరావు గారింటికి వచ్చారు. అక్కడ వాళ్ళూ అంతా తయారుగానే వున్నారు. కొద్దిసపయ్యాక ఇక ఆగలేక , "బావా పెళ్ళివాళ్ళస్తారని కబురు పెట్టావు , ఎప్పుడొస్తారురా?"అని నారాయణ రావు , రాఘవయ్యను అడిగాడు.
"ఏం బావా మేము పెళ్ళివాళ్ళలా కనిపించటము లేదా ? నా మనవడు పెళ్ళికొడుకులా లేడా? పెళ్ళికూతురు ను చూపించరా ?"అని ఎదురు ప్రశ్నించాడు రాఘవయ్య.
అందరూ తెల్లబోయారు.అంతా ఒక్కసారిగా శ్వాస విడిచారు. అప్పటి వరకూ బిక్క మొహము తో కూర్చున్న పల్లవి ,లోపలికి పరిగెత్తి , రాధను వెంట బెట్టుకొచ్చింది.
"రాధా నీకు బావను పెళ్ళిచేసుకోవటం ఇష్టమేనా ?"అని అడిగాడు రాఘవయ్య.
"తాతయ్యా "అంటూ ఒక్క పరుగున వచ్చి తాతయ్య వడిలో మొహం దాచుకొని , ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేసింది రాధ.రాధ తల నిమురుతూ , కూతురు , అల్లుడి  వైపుచూసి మీకిష్టమేనా అని అడిగాడు. "వాళ్ళిద్దరి కీ , మీకూ ఇష్టమైతే మాకేమీ అభ్యంతరం లేదు "అన్నాడు వెంకటేశ్వరరావు.
అందరూ సంతోషం గా మాట్లాడటం మొదలు పెట్టారు.
అప్పటి వరకూ నిశబ్ధం గా వున్న మాధవ్ "దయచేసి అందరూ ఒకసారి నా మాట వినండి. నాకు పెళ్ళి చేద్దామని అనుకోగానే , తాతయ్య, నాన్న రాధను చేసుకోమని అడిగారు. కాని నేనే  సంశయించాను. రాధ నచ్చక, ఇష్టం లేక కాదు. ఇప్పటి కి నాలుగు తరాలుగా మన ఇంట్లో మేనరికాలే జరుగుతున్నాయి . మేనరికాలైతే పిల్లలు కొన్ని సంధర్భాలలో అవలక్షణాలతో పుడతారని అపోహ వుంది. అదృష్టవసాత్తు  మనింట్లో ఇప్పటివరకు పిల్లలెవరూ లోపాల తో పుట్టలేదు.అందుకని మాకు ఆరోగ్యమైన పిల్లలు పుడతారని గ్యారంటీ ఏమీ లేదు. అవకరకం గా పుట్టిన పిల్లలను భరించే శక్తి నాకు లేదు .నేను చాన్స్ తీసుకోను. పిల్లలు కావాలి అనిపించినప్పుడు అనాధాశ్రమం నుంచో పిల్లలను తెచ్చుకొని పెంచుకుంటానే కాని కనను. రాధా , అత్తయ్యా, మామయ్యా మీకందరికీ ఇది ఇష్టమైతే , రాధను పెళ్ళిచేసుకోవటం నాకేమీ అభ్యంతరం లేదు . బాగా ఆలోచించుకోండి. అమ్మా నాన్నా మీరూ ఆలోచించండి. తాతయ్య కు నేను ఇదే చెప్పాను. మీకు చెపుతున్నాను."అన్నాడు.
అందరూ నిశబ్ధమైపోయారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ వుండిపోయారు. "రాధ కు అభ్యంతరం లేకపోతే మాకేమీ అభ్యంతరం లేదు ."అన్నాడు వెంకటేశ్వరరావు.వెంటనే "నాకేమీ అభ్యంతరం లేదు."అనేసింది రాధ .
"అసలు వాళ్ళు మీకిద్దరికే లేని అభ్యంతరం మాకేమి వుంటుంది వీలైనంత  తొందరగా పెళ్ళి చేసేద్దాము ."అన్నాడు నారాయణరావు.
మరునాడే నిశ్చయతాంబూలాలు తీసుకున్నారు.పదిహేను రోజులలోనే మూహూర్తము కుదిరి వైభవం గా పెళ్ళి చేసారు.వాళ్ళ పెళ్ళికి వచ్చిన మాధవ్ స్నేహితుడు ప్రణవ్ కు పల్లవి నచ్చటము తో , ఇరుపక్షాల వారి అనుమతి తో పల్లవి, ప్రణవ్ వివాహం కూడా తొందరలోనే జరిగిపోయింది. అనుకోకుండా కూతురి కి కూడా మంచి సంబందం కుదిరి , పెళ్ళి జరిగిపోవటం తో విష్ణుమూర్తి , రమాదేవి సంతోషించారు.
మాధవ్ డిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసాడు. పిల్లలు నలుగురూ కళ్ళెయదుటే వుండటం  రాఘవయ్య , జానకమ్మల కు ఆనందం కలిగించింది. రాధ , పల్లవి , బియెస్సీ చేసి , యమ్మెస్సీ కూడా పూర్తి చేసారు.
పల్లవి నెల తప్పిందని తెలిసి, శ్రీరాం తరువాత ఇన్ని సంవత్సరాలకు ఇంట్లోకి చిన్ని పాప వస్తోందని తెలిసి పెద్దలంతా సంతోషించారు. పల్లవికి మూడో నెల రాగానే దొంగ చలిమిడి పెట్టి తీసుకొచ్చారు. ఐదోనెల సీమంతం చేసారు. పుట్టింటా అత్తింటా గారాబాల బాల అయ్యింది.పల్లవి కి జరుగుతున్న సంబరాలు , గారాబాలు చూస్తుంటే వద్దు వద్దనుకుంటూనే రాధ మనసులో దిగులేస్తోంది.తనకు ఇలాంటి వేవీ జరగవు కదా అని ఎక్కడో ముల్లు గుచ్చుకున్నట్లుగా వుంటోంది. పల్లవి ని చూసి అసూయ పడుతున్నానా ? బావ ముందే చెప్పాడు . తను బావ కావలనుకుంది ఇక వేదన ఎందుకు   అని తనకు తానే నచ్చ చెప్పుకుంటోంది.ఉదయం పూజ చేసుకునేటప్పుడు "స్వామీ గొడ్రాలికే పాప నిస్తావంటారే , నేను గొడ్రాలిని కాదు కదా మంచి బాబు ను ఇవ్వలేవా ?" అని వేడుకుంటుంది.మళ్ళీ  కావాలనుకున్నప్పుడు బాబునో పాపనో తెచ్చుకోవచ్చు కదా హాయిగా అనుకుంటుంది . అంతలోనే ఎంతైనా తన కడుపులో మోసి , మురిపెంగా కన్న వాళ్ళతో సమానం గా కారుకదా. ఎవరో పిల్లలు తన పిల్లలనుకునే విశాలత్వం తనలో వుందా? రకరకాల ఆలోచనలతో సతమతమైపోతోంది. రోజు రోజు కు సొంత పాప కావాలనే కోరిక మొగ్గ తొడిగి , పుష్పించి ఫలమైంది .
పల్లవి కి చక్కదనాల పాప పుట్టింది.పాలు తాగేటప్పుడు , నిద్రపోయేటప్పుడు తప్ప మిగితా సమయాలలో పాప 'తన్వి 'రాధ దగ్గరే వుంటోంది.మరీ తన్వి కి అంత అతుక్కుపోయిన రాధ ను చూసి మాధవ్, రాఘవయ్య, జానకమ్మ పల్లవి పాపను తీసుకొని వెళ్ళిపోయాక రాధ ఎలావుంటుందా అని కలవరపడుతున్నారు. రోజు "రాధా మనం పాపాయి ని తెచ్చుకుందామా ?" అని అడిగాడు ."ఇప్పుడే వద్దు " అని తల అడ్డంగా తిప్పింది.అనుకున్న రోజు రానే వచ్చింది .తన్వి కి మూడో నెల రాగానే అత్తింటి కి వెళ్ళిపోయింది పల్లవి.
పల్లవి వెళ్ళిపోయినప్పటి నుంచి డల్ గా వుంటున్న రాధతో ఏదైనా వూరికి వెళ్ళి వద్దాం , మార్పు వుంటుంది అని అడిగాడు మాధవ్ . కాని రాధ వచ్చేందుకు సుముఖత చూపించలేదు. రోజు రోజు కు నీరసిస్తోన్న రాధను జానకమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. మూడో నెల వచ్చిందని , తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి ,వాడవలసిన మందులు వ్రాసి ఇచ్చింది డాక్టర్.అందరికీ వార్త విని సంతోషించాలో , విచారపడాలో తెలీలేదు ఎవరికీ .మాధవ్ కు ఎలా చెప్పాలో అని తడబడిపోయారు రాఘవయ్య, జానకమ్మ. కొంత సంతోషం తో , కొంత భయం తో పడుకుండిపోయింది రాధ . బావ ఏమంటాడో , అబార్షన్ చేయిస్తాననడు కదా అని కలవరపడిపోతోంది. మాధవ్ ఇంటికి వచ్చేవరకూ ముగ్గురు దడ దడలాడుతూ కూర్చొని వున్నారు.
తాతయ్య చెప్పిన కబురు విని నోట మాట రానట్లుగా నిలబడి పోయాడు మాధవ్ . ఏమీ మాట్లాడకుండా పడకగదిలో కి వెళ్ళి పడుకొని వున్న రాధను చూసాడు.మనసు వైపు సంతోషిస్తుంటే భయం మరోవైపు లాగుతోంది.పడుకొని, కళ్ళ కు అడ్డంగా పెట్టుకున్న చేతి కింద నుంచి మాధవ్ ను భయం భయం గా పరిశీలిస్తోంది రాధ.

బట్టలు మార్చుకుంటూ " చేసిందంతా చేసి , ఇప్పుడు భయపడతావెందుకు ? దేవుడు ఏది రాసిపెడితే అదే జరుగుతుంది.కానీయ్ , ఏది ఎలా వున్న భరిద్దాం . డాక్టర్ ఏమన్నది ?" అని అడిగాడు .
అమ్మయ్య అనుకొన్నది రాధ.
వార్త విని ఉత్సాహంగా పల్లవి , ప్రణవ్ వచ్చారు. ఇల్లంతా సందడి సందడి చేసేసారు . తన్వి ఊఊఊ తో అత్తకు తన సంతోషం తెలిపింది.వాళ్ళను చూసి కొద్దిగా తేరుకుంది రాధ. రాధా మాధవ్ లకు ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడే బజారు నుంచి చక్కటి పాపాయి పోస్టర్ లు తెచ్చి రాధ గదిలో అలంకరించింది పల్లవి.
నెలలు గడుస్తున్నాయి. ప్రతిరోజూ పల్లవి మధ్యాహ్నం తన్వి తో సహా వచ్చి కాసేపు కూర్చొని వెళుతోంది.పల్లవి తో రోజూ తన భయాలు చెప్పుకుంటోంది రాధ. "వెంకటేశ్వర స్వామి మనకు అన్యాయము చేయడు . నీకు చక్కటి పాపాయి పుడుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించు. నెగిటివ్ ఆలోచన మనసులోకి రానీయకు ." అని ధైర్యం చెపుతుంది పల్లవి.
ఎవరి భయాల తో , సంతోషాలతో పని లేని కాలం గడిచి , ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.రాధ లేబర్ రూం లో నొప్పులు పడుతోంది.అందరూ బయట ఆత్రం గా ఎదురుచూస్తున్నారు. మాధవ్ బాధ వర్ణనాతీతంగా వుంది. ప్రణవ్ చేయి గట్టిగా పట్టుకొన్నాడు. చాలా టెన్షన్ గా వున్నాడు .
"నాకూ సొంత పిల్లలు కావాలని మనసులో వుందేమో , అందుకే వెసక్టమీ చేయించుకోలేదు. తప్పంతా నాదే బావా . ఎలాంటివాళ్ళు పుడుతారో !రాధ గండం గడిచి బయట పడుతుందంటావారేపే వెసక్టమీ చేయించుకుంటాను . ఇంకా టెన్షన్ నేను భరించలేను ." అని రకరకాలుగా బాధపడుతున్నాడు.
"ఐనా మాధవ్ , ప్రపంచం లో అవలక్షణాలతో ఉన్న పిల్లలందరూ మేనరికాలవాళ్ళకే పుట్టారా? మేనరికం కాని వారికి పుట్టలేదా? మన ఫ్రెండ్ మురళకి మెదడు ఎదగని బాబు పుట్టాడు. మురళికి సుధకు ఎక్కడా బీరకాయపీచు చుట్టరికం కూడా లేదు , మరి దానికేమంటావు. మేనరికాలకు అవలక్షణాల పిల్లలు పుడతారు అని పూర్తిగా నమ్మకం ఉంటే మన గౌర్నమెంట్ , సతి, బాల్య వివాహం, కన్యా శుల్కం, వరకట్నం లాంటివి నిషేదించినట్లు మేనరిక వివాహాలు కూడా నిషేదించేది. అది అనుమానమే కాని నూరుశాతం నిర్ధారణ కాదు. అవకాశం ఉంది అంటున్నారు. అంతే. అవలక్షణాల తో పిల్లలు పుట్టటానికి రకరకాల కారణాలు ఉంటాయి.సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందిమీరు ముందు నుంచీ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు.రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి.కాబట్టి భయపడకు అంతా మంచే జరుగుతుంది." అని ప్రణవ్ ధైర్యం చెప్పాడు.
లోపలి నుంచి 'కేర్ ' మని వినిపించింది. మాధవ్  ఉలిక్కిపడి ప్రణవ్ ను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొన్నాడు. అలా ఎంతసేపు వున్నాడో ! "అన్నయ్యా , కళ్ళు తెరువు . ఇటు చూడు . బాబు ." అని పల్లవి మాట వినిపించింది. ఐనా కళ్ళు తెరిచి బాబు ను చూసే ధైర్యం చేయలేకపోయాడు.
"వరే మాధవ్ చూడరా నీ కొడుకు ఎంత ముద్దుగా వున్నాడో ." బామ్మ మాటలకు కూడా చూసే ధైర్యం లేకపోయింది. ప్రణవ్ బలవంతాన మాధవ్ ను పక్కకు జరిపి. మాధవ్  చేతులు గుంజి ముందు కు పెట్టాడు. పల్లవి చేతులలో బాబును పడుకోబెట్టింది. చిన్ని శరీరం మెత్త మెత్తగా చేతికి తగులుతుంటే , చిన్నగా కళ్ళు తెరిచి చూసాడు . బాబు బుజ్జిగా ముద్దుగా వున్నాడు.గబ గబ చేతులు కాళ్ళు, చెవులు , కళ్ళు అన్నీ పరిశీలనగా చూసాడు . అన్ని అవయవాలూ వున్నాయి . పైకైతే అన్నీ వున్నాయి అన్నాడు.
" నీ మొహం శుభ్రంగా వున్నాడు . ఇంకేమీ మాట్లాడకు .అందరినీ హడావిడి చేసావు." అని తాతయ్య కసురుకున్నాడు.
నర్స్ వచ్చి బాబు ను లోపలికి తీసుకెళ్ళింది.
రాధను తీసుకొచ్చి గది లో పడుకోబెట్టారు.
"బాబు ఏడి ?" అని నర్స్ ను అడిగాడు మాధవ్ .
"పీడియాట్రీషియన్ వచ్చారు . చెకప్ చేస్తున్నారు. కాగానే తీసుకొస్తాము ." అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్.
కొద్ది సేపు తరువాత బాబును తీసుకొచ్చింది నర్స్. వెనకనే , గైనకాలజిస్ట్ , పీడియాట్రీషయన్ వచ్చారు.
మాధవ్ తో పీడియాట్రీషియన్ " బాబు పూర్తి ఆరోగ్యం గా వున్నాడు . మీరు భయపడవలసిందేమీ లేదు ."అని చెప్పాడు .
"శారీరికంగా ఐతే అన్నీ అవయవాలు వున్నాయి , కాని . . . " అంటూ భయం భయం గా ఆపేసాడు మాధవ్.
"అన్ని సక్రమంగా వున్నయనే అనుకుంటున్నాను ." అని నవ్వుతూ చెప్పి , తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి డాక్టర్లిద్దరూ వెళ్ళిపోయారు.
తన వైపే చూస్తున్న రాధ దగ్గరకు వెళ్ళి ,బాబును ఒక చేతిలో రాధను ఓకచేతిలో కి తీసుకున్నాడు. ఇన్ని రోజుల టెన్షన్ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది.రాధ కళ్ళ నుంచి కన్నీళ్ళు జలజలా రాలాయిబాలింతను ,పసివాడిని వళ్ళో పెట్టుకొని కన్నీళ్ళేమిటిరా అంటున్న జానకమ్మ తో పాటు అందరూ విధమైన ఉద్వేగానికి గురయ్యారు.
పసివాడినే చూస్తున్న రాధామాధవ్ లకు బాబులో వెంకటేశ్వరస్వామి అభయ హస్తం  , చిరునవ్వు తో కనిపించాడు. బాబుకు శ్రీనివాస్ అని పేరు పెడదాము అని రాధా,మాధవ్ ఇద్దరూ ఒకేసారి అన్నారు.

ముద్దుగా , ఆరోగ్యం గా అందరి గారాల బాలుడిలా పెరగసాగాడు శ్రీనివాస్ . . .
ఇరవై వక్క సంవత్సరాల తరువాత. . .
పోలీస్ ఎకాడమీ ప్రాంగణం అంతా కోలాహలం గా,సందడి గా వుంది. అప్పుడే ట్రైనింగ్ ముగించుకున్న కాండిడేట్స్ కు పాసింగ్ ఔట్ పరేడ్ ముగిసింది.స్టిఫ్ గా మార్చ్ చేసుకుంటూ వచ్చి "హాయ్ మాం , హాయ్ డాడ్" అంటూ అమ్మకూ, నాన్నకు సల్యూట్ చేసాడు శ్రీనివాస్.

సంతోషం గా శ్రీనివాస్ నుదురు ముద్దాడి "బావా , అవలక్షణాల తో పిల్లలు పుడతారని తెగ భయపడ్డావు.చూడు నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు.ఇప్పుడేమంటావు ?" మాధవ్ తో అన్నది రాధ.

"ఏమంటాను తల్లీ . నా కాలర్ పట్టుకొని మరీ నా మెడలు వంచావు.ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ తల్లివైయ్యావు.

No comments: