Tuesday, June 16, 2015

మనసు తెలిసిన చందురుడా






ఈ నెల మాలిక లో నా కథ "మనసు తెలిసిన చందురూడా"

http://magazine.maalika.org/2015/06/09/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%A4%E0%B0%B0/


రచన: మాలాకుమార్
చేతిలోని నవలను మూసి టైం చూసుకుంది వర్ష. ఎనిమిదిన్నర కావస్తోంది. ఇంకో అరగంటలో వూరు చేరుతాము. ఆఫీస్ మానేసే అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఎదురు సీట్ వైపు చూసింది. ఎదురు సీట్ లో వున్న అతను లాప్ టాప్ లో పని చేసుకుంటున్నాడు. ఎక్కినప్పటి నుంచీ లాప్ టాప్ లో తల దూర్చే వున్నాడు మహానుభావుడు అనుకొంది. ఇంతలో సెల్ రింగైంది. అమ్మ! “ఊ చెప్పమ్మా ” అంది.
“వర్షా నేను చెప్పిన సంగతి మర్చిపోకు. ఈ సంవత్సరం ఎట్లాగైనా నీ పెళ్ళి. . . ”
“అబ్బా అమ్మా! నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి , ఆరు గంటల క్రితం వరకూ చెబుతూనే వున్నావు. నేనూ ఇప్పట్లో పెళ్ళి చేసుకోను , ఇంకో రెండేళ్ళు నన్ను జాబ్ చేసుకోనీయండి అని చెబుతూనే వున్నాను . ఇంకా ఈ టాపిక్ ఆపేయ్ ” విసుగ్గా అంటూ కాల్ కట్ చేసి సెల్ పక్కన పడేసింది.
ఎదురు సీటబ్బాయి తలెత్తి చూసి , వెంటనే లాప్ టాప్ లోకి తల వంచేసాడు. “చీ . . . ముందూ వెనుకా చూసుకోకుండా గట్టిగా మాట్లాడినట్లున్నాను.అంతా అమ్మ మూలంగానే ఎప్పుడూ ఒకటే గోల.” అని తనమీద తానే చిరాకు పడిపోయింది.
రైలు ఆగింది. బాగ్ తీసుకొని హడావిడి గా ముందుకు కదిలింది. “ఏమండి ” పిలుపు విని వెనకకు తిరిగింది. ఎదురు సీట్ అబ్బాయి. ఇప్పటి వరకూ మంచివాడిలా ఫోజ్ కొట్టాడు , ఇప్పుడేమో వెంటబడ్డాడు అనుకుంటూ ” ఏమిటి ?” అంది.
“ఇది మీ సెల్లా ?”
ఓ అమ్మతో మాట్లాడి విసుగ్గా పక్కనపడేసి, మర్చిపోయింది అనుకొంటూ “థాంక్స్ అండి ” అని సెల్ తీసుకొని వడి వడి గా ముందుకు కదిలింది.
త్వరత్వరగా తయారయ్యి బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్ళింది.నీళ్ళు కారుకుంటూ వున్న ఉప్మాను చూడగానే నీరుకారిపోయింది. ఇహ లాభం లేదు , ఈ హాస్టల్ లో వుండి , ఈ పిచ్చి తిండి తింటూ బతకటం కష్టం , ఏదైనా రూమో , చిన్న ఇల్లో చూసుకోవాలి తప్పదు అనుకొంది. లంచ్ బ్రేక్ లో స్నేహితురాలు అర్పితతో తన సమస్య చెప్పుకుంది.
“మా ఇంట్లో మేడమీద ఓ గది వుంది. ఓ అబ్బాయి వుండేవాడు. ఈ మధ్యే పెళ్ళి చేసుకొని , వేరే ఇల్లు చూసుకొని మారిపోయాడు. నీకేమైనా నచ్చుతుందేమో చూడు. కాకపోతే వకటే గది అందులోనే వంట చేసుకోవాలి.” అంది అర్పిత.
“పరవాలేదు సద్దుకుంటాను. సరిపోకపోతే అప్పుడు చూసుకుందాము. మరి మీకేమీ ఇబ్బంది కాదా?”అడిగింది వర్ష.
“మాకేమి ఇబ్బంది. పైగా ఇద్దరమూ కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.”అంది అర్పిత.
సాయంకాలం అర్పితతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గది నచ్చింది. అర్పిత అమ్మ సుభద్రగారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నిశ్చింతగా వుండొచ్చు అనుకొని, ఈ వీకెండ్ వచ్చేస్తాను అని చెప్పింది.
డ్రాయింగ్ రూం లో కూర్చొని ఇద్దరూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ వుండగా ఓ అబ్బాయి వచ్చాడు. పొద్దున రైల్ లో తన ఎదురుగా కూర్చున్న అబ్బాయి . ఇదేమిటి ఇక్కడకు వచ్చాడు గాభరా పడిపోయింది వర్ష.
“మా అన్నయ్య అర్ణవ్. అన్నయ్యా నా కొలీగ్, ఫ్రెండ్ వర్ష. ఇక ముందు మన మేడ మీద గదిలో వుండబోతోంది.” అని ఒకరినొకరికి పరిచయం చేసింది అర్పిత.
“పొద్దున రైల్ లో చూసాను మీ ఫ్రెండ్ ను. కలిసి ప్రయాణం చేసాము “నవ్వుతూ చెప్పాడు అర్ణవ్.
“అవును నా సెల్ మర్చిపోతే తెచ్చి ఇచ్చారు .”అంది వర్ష.
అనుకున్నట్లుగానే ఆ వీకెండ్ అర్పిత వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యింది. పెద్ద గది, విశాలమైన టెరస్ , ఉయ్యాల, వరుసగా అందంగా పేర్చిన పూల కుండీలు చాలా నచ్చేసింది. రాగానే వంట పెట్టుకోవద్దు ఈ పూటకు మా ఇంట్లో తినెసేయ్ అని పిలిచారు సుభద్ర గారు. భోజనాల దగ్గర అర్పిత నాన్నగారు ప్రభాకర్ గారు పరిచయమయ్యారు. అభిమానంగా కొసరి కొసరి మరీ వడ్డించారు సుభద్ర గారు. అసలు నువ్వు విడిగా వండుకోవటమెందుకమ్మా మా ఇంట్లో నే తిను అన్నారు ప్రభాకర్ గారు. ఎంత వారు అభిమానంగా పిలిచినా బాగుండదు అనుకొని సున్నితంగా వారించింది. ఆ ఇల్లు, ఆ ఇంట్లోని వారి అభిమానం చాలా నచ్చాయి. వెంటనే అమ్మకు కాల్ చేసి చెప్పింది. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది.
ఉదయమే లేచి , తల స్నానం చేసి , తల తుడుచుకుంటూ టెరస్ లోకి వచ్చింది.పిట్ట గోడ దగ్గర నిలబడి యధాలాపంగా కింది కి చూసింది. పైపు తో మొక్కలకు నీళ్ళు పడుతూ అర్ణవ్ కనిపించాడు. ఇంకా స్నానం చేయనట్లున్నాడు నైట్ డ్రెస్ తెల్ల పైజామా , కుర్తాలో వున్నాడు. జుట్టు కొద్దిగా చెదిరి మొహం మీద పడుతోంది. ఎందుకో తలపైకెత్తి చూసాడు. అక్కడ వర్ష కనిపించగానే గుడ్ మార్నింగ్ అని చిన్నగా నవ్వాడు.ఒక్కసారిగా గుండె జల్లుమంది వర్షకు.
జాగింగ్ చేసి వస్తూ , వరండాలో కూర్చొని వున్న అర్పిత, వర్షలను చూసి “ఏమిటీ పొద్దున్నే ఇద్దరూ అలా కూర్చున్నారు ?”అని అడిగాడు అర్ణవ్.
“చిన్న ప్రాబ్లం అన్నయ్యా ” అంది అర్పిత.
“ఏమిటో నేను తెలుసుకోవచ్చా ?” అడిగాడు అర్ణవ్.
వర్ష వైపు చూసింది అర్పిత. చెప్పమన్నట్లు తల వూపింది వర్ష.
“నిన్న సాయంకాలం నుంచీ ఎవరో ఒకటే కాల్ చేసి వర్షను విసిగిస్తున్నారు అన్నయ్య.”
“ఏమని ? “ప్రశ్నించాడు అర్ణవ్.
“హలో అనగానే ఈ ఫోన్ నుంచి కాల్ వచ్చింది, మీరేనా చేసింది అంటాడు, కాదంటే వినడు.రాత్రంతా చేస్తునే వున్నాడు. సెల్ ఆఫ్ చేద్దామంటే వాళ్ళ అమ్మ కాల్ చేస్తారేమో తీయకపోతే కంగారు పడతారు అని ఆఫ్ చేయలేదు. సైలెంట్ మోడ్ లో వుంచింది. ఐనా న్యూసెన్సే కదా .”అని వివరణ ఇచ్చింది అర్పిత.
ఐనా దీనికింత ఆలోచన ఎందుకు ఆ నెంబర్ ను బ్లాక్ చేయొచ్చుకదా! “అన్నాడు అర్ణవ్.
ఇద్దరూ మొహాలు చూసుకొని ఓహ్ అని తల మీద చిన్నగా తట్టుకున్నారు.”అదేమిటో బుర్ర పని చేయలేదు అన్నయ్యా అంది అర్పిత.
“మీ సెల్ ఎవరికైనా కాల్ చేసుకోవటానికి ఇచ్చారా ?” వర్ష ను అడిగాడు అర్ణవ్.
“నిన్న సాయంకాలం , నా సెల్ లో కార్డ్ ఐపోయింది.మా నాన్నకు కాల్ చేసుకొని ఇస్తాను అంటే రాము కు ఇచ్చాను.నేను చెక్ చేసాను , వాళ్ళ నాన్నకు చేసిన కాల్ ఒక్కటే వుంది.”అన్నది వర్ష.
అప్పుడే రింగైంది వర్ష సెల్. “వాడే”అన్నది వర్ష.
“ఇటివ్వండి నేను చూస్తాను .” అని సెల్ తీసుకొని ఆన్ చేసి “హలో” అన్నాడు.
“నిన్న ఈ నంబర్ నుంచి మాకు కాల్ వచ్చింది. మీరేనా చేసింది.”అని అడిగాడు అవతలి వ్యక్తి.
“మేము కాదు. అసలేమిటి మీ ప్రాబ్లం?”అడిగాడు అర్ణవ్ .
“కొద్దికాలం గా మా చెల్లెలి సెల్ కు కాల్ వస్తోంది. నంబర్ లు మార్చి మార్చి చేసి విసిగిస్తున్నాడు. నిన్న సాయంకాలం ఆరు గంటలకు ఈ నంబర్ నుండే చేసాడు.ఈ సారి ఎట్లాగైనా వాడిని పట్టుకోవాలని చూస్తున్నాను.”
“ఈ నంబర్ నుంచి ఎవరూ చేయలేదు. ఐనా మీరు అంటున్నారు కాబట్టి కనుక్కుంటాను.”అని పెట్టేసాడు.
అక్కడే ఏదో సద్దుతున్నట్లుగా అటూ ఇటూ తిరుగుతున్న పనబ్బాయి రామూని పిలిచాడు.
“ఈ కాల్ ఎవరు చేసారురా నిజం చెప్పు “అని గద్దించాడు.
“నేనే చేసాను సార్ “తల వంచుకొని వణుకుతూ చెప్పాడు.
“మరి ఆ కాల్ లేదు “ఆశ్చర్యంగా అడిగింది వర్ష.
“ఏముంది డిలీట్ చేసి వుంటాడు.పదరా పోలీస్ స్టేషన్ కు.”దబాయించాడు అర్ణవ్.
“సారీ సార్ నేనూ , ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నాము. నా నంబర్ నుంచి చేస్తే వాళ్ళ వాళ్ళకు తెలుస్తుందని వేరే వేరే సెల్ ల నుంచి చేస్తున్నాను. నిన్న వాళ్ళ అన్నయ్య చూసేసరికి నేను సతాయిస్తున్నానని అబధ్ధం చెప్పింది.సారీ మేడం .”ఏడుస్తూ చెప్పాడు రాము.
“ఓరినీ అప్పుడే ప్రేమేమిటిరా నీకు.”విస్తుపోయింది అర్పిత.
“వీడి సంగతి నేను చూసుకుంటాను .యు రిలాక్స్ .”అని రాము తీసుకొని వెళ్ళిపోయాడు అర్ణవ్.
ఆ సంఘటన తరువాత అర్ణవ్, వర్ష లలో స్నేహం పెరిగింది.మాటలు కలిసాయి. అపై మనసులు కలిసేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు! ఇరువైపుల పెద్దలకూ అభ్యంతరం లేకపోయింది. అర్ణవ్ కోరిక ప్రకారం దగ్గర బంధువులు, స్నేహితుల మధ్య , క్లుప్తంగా శాస్త్రీయంగా జరిగింది. ఇంకా రెండు సంవత్సరాలు జాబ్ చేస్తూ ఎంజాయ్ చేయాలి అనుకున్న సంగతి మర్చేపొయింది వర్ష!
సూట్కేస్ సర్దుకోవటంలో వర్షకు సహాయము చేస్తూ”భలే దానివే! టెనెంట్ గా వచ్చి ఓనర్ వి ఐపోయావు”అని వర్షను వేళాకోళం ఆడుతూ అక్కడే వున్న తల్లి తో “ఇదేమిటమ్మా అన్నయ్య మరీ ఇంత సింపుల్ గా పెళ్ళి చేసేసుకున్నాడు.అన్నయ్య పెళ్ళంటే ఎంత సందడి వుండాలి అస్సలు హడావిడి లేదు సరదాలు లేవు. కనీసం ఫస్ట్ నైట్ అన్నా బోలెడు గొడవ చేద్దామనుకున్నాను .అదీ లేకుండా వూరు ప్రయాణం పెట్టుకున్నారు. మల్లెల పందిరిమంచం లేదు, తెల్ల చీర లేదు .ఐనా నువ్వేమిటే మరీ అంత బుద్దిగా అన్నయ్య చెప్పినట్లు వినేసావు. నువ్వెక్కడో పిచ్చిమాలోకానివి.” కినుకగా అంది అర్పిత.
కూతురి మాటలు నవ్వుతూ వింటూ కోడలివైపు చూసింది సుభద్ర. వర్ష మొహము లో కూడా కొద్దిగా అసంతృప్తి కనిపించింది.
“అంటె వీడియో సుబ్బారావు కోసం పెళ్ళి చేసుకోలేదంటావు” నవ్వుతూ అంది సుభద్ర.
ఇద్దరూ పక్కున నవ్వుతూ సుభద్ర వైపు చూసారు.
“ఐనా పెళ్ళంటే నీ ఉద్దేశం ఏమిటి వర్షా?”అడిగింది సుభద్ర.
ఒక్క నిమిషం ఆలోచించి”పెళ్ళంటే ఇరుజీవితాల కలయక, ఇరు హృదయాల కలయిక. జీవితాంతము ఒకరి కొకరు తోడు నీడా.”పరవశం గా చెప్పింది వర్ష.
“ఇరుజీవితాలేకాదు,ఇరుకుటుంబాలకలయికకూడా! పెళ్ళి ఆర్భాటంగా చేసుకున్నామా, క్లుప్తంగా చేసుకున్నామా అన్నది ముక్ష్యము కాదు.వివాహము లో జరిపించే తంతులలోని పరమార్ధం గ్రహించాలి, అర్ధం చేసుకోవాలి.జీలకర్రాబెల్లం ఒకరి శిరస్సుమీద మరొకరిని వుంచి , ఒకరినొకరు చూసుకోమంటారు.మనకు కనిపించకుండా వున్న , కనుబొమల మధ్య వున్నరంధ్రం ద్వారా , శిరస్సుమీద వున్న బ్రహ్మరంద్రము లోకి ఒకరి నుంచి ఒకరికి ఆకర్శణ శక్తి ప్రవేశిస్తుంది.ఆ బ్రహ్మరంద్రాన్ని తెరిపించే శక్తి జీలక్రాబెల్లం మిశ్రమము కు వుంది.అందుకే ఒకరి శిరస్సుమీద ఒకరు వుంచే సాంప్రదాయము ఏర్పాటు అయ్యింది. అలా ఒకరినొకరు చూసుకోని ఆకర్శణ శక్తి ని ప్రసరించుకోవటమే సుముహూర్తము.
ధర్మార్ధకామములలో ఏనాడు ఈమె తోడు విడిచి పోరాదు.నిండునూరేళ్ళు ఈమెకు నీడవై నిలిచి కాపాడు అని నాతి చరామిలో వరునితో చెప్పిస్తారు.
నా జీవితానికి ఆధారమైన ఈ సూత్రాన్ని నీ మెడలో ముడి వేస్తున్నాను,నీ మెడలో నున్న ఈ సూత్రము నా శాంతిసౌఖ్యములకు సందేశము, క్షేమము అని మాంగల్య తంతునానేన మంత్రము, మంగళసూత్రము లోని అర్ధము.
ఇలా ప్రతి దానిలోని అర్ధమును గ్రహించుకొని మసులుకోవాలి. ఆలుమగలుగా స్త్రీ,పురుషుల అనుబంధం మిగిలిన అన్ని బంధాలకంటే ప్రత్యేకమైనది.ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది.ప్రేమలో పడటం తేలికే.ప్రేమలో నిలబడటం కష్టం.ప్రేమను నిలుపుకోవటము కష్టం.అందుచేత పరిస్థితులు తారుమారైనప్పుడు మీకు మీరు గా సరిదిద్దటానికి గట్టిప్రయత్నం చేయాలి.మంచి అనుబంధం లో పట్టువిడుపులు , నిజాయితీ, మనసు పెట్టి పని చేయటం, నమ్మకం ముక్ష్యమైన విషయాలు.ఇద్దరూ కలిసిమెలిసి పని చేసుకున్నప్పుడే మంచి అనుబంధం ఏర్పడుతుంది.అన్ని గొడవలకూ కారణం అహం.ఆ అహం ను వదిలేయాలి. పట్టూవిడుపులు వుండాలి. అప్పుడే ఒకరికి ఒకరు తోడునీడగా,బాసటగా నిలుస్తారు.తాము వంటరివారముకామని, తనకోసం తోడు ఒకరు వున్నారని ఆనందం పొందుతారు.”అని ముగించింది సుభద్ర.
“మీ మాటలను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అత్తయ్యా” అంటూ సుభద్ర కాళ్ళకు నమస్కరించింది వర్ష.
“దిగులు పడకు అర్పితా నీ ముచ్చట కూడా తీర్చుకుందువులే .” నవ్వుతూ అంది సుభద్ర.
అందరూ రాత్రి తొమ్మిది గంటలకు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రాత్రి పూట ఇబ్బంది పడుతూ మీరంతా ఎందుకమ్మా మేమన్నా విదేశాలకు వెళుతున్నామా వారం రోజులలో వచ్చేస్తాముగా అని అర్ణవ్ అన్నా సుభద్ర వినిపించుకోలేదు. సామానులు బోగీలో పెట్టించేందుకు వెళుతున్న అర్ణవ్ ను ఆపి”నువ్వు అమ్మా, నాన్నతో మాట్లాడు అన్నయ్యా. నేను పెట్టిస్తాలే “అని అర్ణవ్ తో అని సామాను లోపలికి తీసుకెళ్ళింది అర్పిత.కొద్దిసేపు తరువాత కిందికి దిగింది అర్పిత.
స్తేషన్ కు వచ్చిన అమ్మా నాన్నలతో మాట్లాడుతున్న వర్ష “ఇంత సేపు ఏమి చేసావు?”అడిగింది వర్ష.
“అమ్మ ఓ పని చెప్పింది లే. అది చేసి వస్తున్నాను”అని కన్ను కొడుతూ చిలిపిగా అంది అర్పిత.
ఆశ్చర్యంగా చూసింది వర్ష!
రైల్ బయలుదేరబోతోందని విని, అర్ణవ్ , వర్ష రైలెక్కారు.ఇద్దరూ తలుపు దగ్గర నిలబడి అందరికీ చేతులూపారు . అర్ణవ్ తలుపు దగ్గరే వుండగా వర్ష కూపే దగ్గరకు నడిచింది. కూపే తలుపు దగ్గర నిలబడి లోపలికి చూడగానే “వావ్. . . . . బ్యూటీఫుల్ ” అన్న మాటలు వర్ష నోటి నుంచి అప్రయత్నంగా వచ్చాయి…
కూపేలో లైట్లు తీసేసారు. చుట్టూ ఐదు కాండిల్స్ , మధ్యలో అగరొత్తులు వెలిగించే ఏర్పాటు వున్న ఇత్తడి కాండిల్ స్టాండ్ లో , ఐదు కొవ్వొత్తులూ, మధ్యలో అగరొత్తులూ వెలిగించి వున్నాయి . స్టాండ్ కు పాలిష్ చేసినట్లున్నారు బంగారంలా మెరిపోతోంది. పక్కకు వున్న బర్త్ కు పైబర్త్ నుంచి మల్లెపూల దండలు అందంగా అలంకరించారు. కిటికీ కి, తలుపుకు కూడా అందంగా మల్లె దండలు చుట్టి వున్నాయి. కొవ్వత్తుల వెలుగు, ప్లాట్ ఫాం మీద నుంచి వస్తున్న దీపాల వెలుగులలో, అగరొత్తులు , మల్లెల సువాసనల తో కూపే అద్భుతంగా వుంది. వర్ష ముందుకు అడుగు వేయలేక తడబడిపోయింది. తమను కొత్తబంగారులోకంలోకి తీసుకెళుతున్న పూలరధం లా అనిపించి, బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి వచ్చి చీర మీది గులాబీలతో పోటీబడ్డాయి. అమ్మ చెప్పిన చిన్న పని చేసి వస్తున్నాను అన్నది అర్పిత. ఇదా అత్తయ్య చెప్పింది అనుకొన్నది. ఎంతబాగా చేసింది. మనసంతా సంతోషము తో నిండిపోయింది. చెప్పేలేని భావాలు ఉక్కిరి బిక్కిరి చేసాయి. మనసంతా చెప్పలేని మధురభావాలతో నిండిపోయింది.అలా ఓ విధమైన ట్రాన్స్ లో నిలబడి వున్న వర్ష బుజం మీద చేయి పడటంతో ఉలిక్కి పడింది.
కూపే లోపలకు చూస్తూ “ఫెంటాస్టిక్ ” అన్నాడు అర్ణవ్. రైలు ప్లాట్ ఫాం ను వదిలింది. బయట నుంచి వస్తున్న గాలికి సన్నగా కదలసాగాయి కొవ్వొత్తుల జ్యోతులు. కిటికీలో నుంచి సన్నగా చంద్రుని కిరణాలు పడసాగాయి. రైలు లయబద్ధంగా నడవసాగింది. కిటికీ లో నుంచి వీస్తున్న గాలికి కొవ్వొత్తులు ఒకటొకటిగా ఆరిపోయాయి. బయట నుంచి అప్పుడప్పుడు దీపాల వెలుగు వస్తోంది.కూపే చీకటి వెలుగుల సమ్మేళనము లో అద్భుతంగా వుంది. కిటికీ లో నుంచి మబ్బుల తో దోబూచులాడుతూ మసక మసకగా వున్న చందురుని చూసి
” మనసు తెలిసిన చందురుడా మసక వెలుగే చాలులేరా!”అని చిన్నగా కూనిరాగం తీసింది వర్ష.

No comments: