Wednesday, September 11, 2013

నీరో చక్రవర్తిణి

నిన్నటి నుంచి మేము బరోడాలో వుండగా వున్న, మావారి పర్సనల్ కుక్ మోతీరాం గుర్తొస్తున్నాడు:) మావారు ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు, కాంప్ లకు వెళ్ళినప్పుడు వెంట వెళ్ళేవాడు. ఓ రెండు పెట్టెలల్లో స్టవ్, వంటసామాను అన్నీ తీసుకొని వెళ్ళేవాడు. భోజనం సమయం లో ఎక్కడ ఆగుతే , అక్కడ ఓ పక్కగా , పెట్టెలు తెరిచేసి గబగబా పులకాలు , ఆలూ సబ్జీనో ఏదైనా టిండ్ సబ్జీనో చేసి పెట్టేవాడు.ఈయన ఇంటికి వచ్చినప్పుడు మోతీరాం గరం గరం రోటీ, సబ్జీ , చాయ్ చేసిచ్చాడు అని తెగ మెచ్చుకునేవారు. సరే అంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నేనూ , ఆలూ సబ్జీ నో, ఏదైనా టిండ్ సబ్జీనో చేసిపెడితే,ఇంట్లో కూడా ఇవెందుకు ఫ్రెష్ కూరలు చేయక అని విసుక్కునే వారు.మరే ఏ ఎడారిలోనో మోతీరాం చేసిపెడితే ఇంటికి వచ్చినా అవే తలుచుకుంటారు నేను చేస్తే విసుక్కుంటారు అని మనసులో గొణుక్కునేదాన్ని. అంతేగా పైకి అనే ధైర్యం అప్పుడు లేదుగా :) ఇంట్లో ఏదైనా పార్టీ అనగానే , మసాల్చీ (హెల్పర్) తో సహా వచ్చేసేవాడు.అతని వచ్చేలోపలే నేను నా వంట కానిచ్చుకొని బయట కూర్చునేదాన్ని.అతను వంట పూర్తి చేసి, ఎంత రాత్రైనా పార్టీ అయ్యాక వంటిల్లు , స్టవ్ , గట్టు అన్ని శుభ్రంగా తుడిచి ప్లేట్లన్నీ బయటవేసి, వంటింట్లో వాసనలు రాకుండా స్ప్రే చేసి వెళ్ళేవాడు:)
ఓసారి ఇలాగే నా పని ముగించుకొని బయట వరండాలో కూర్చొని నవల చదువుకుంటున్నాను. ఇంతలో ఓ బుజ్జి కోడిపిల్ల గున గున లాడుతూ నా కాలి కిందికి వచ్చింది.తెల్లగా ముద్దుగా వుంది. ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తుంటే మోతీరాం పరుగెత్తుకొచ్చాడు.ఏమిటీ అంటే ఆ కోడిపిల్ల కోసం అట!అదేమిటి దీనితో ఏమిచేస్తావు అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను మేం సాహెబ్ అన్నాడు.లోపల చికెన్ , మటన్ వండుతున్నాడని తెలుసు కాని వాటికోసం ఇలా కోడిపిల్లలని చంపాలా అని కళ్ళు తిరిగిపోయాయి. చికెన్ అంటే కోడిపిల్లేకదా మేం సాహెబ్ అన్నాడు. పైగా జిందా చికెన్ ఐతే చాలా రుచి అట.మా అమ్మాయైతే దాన్ని చంపేస్తావా అని ఏడుపు మొదలు పెట్టింది.గుడియా రాణీ ఆప్ జాకె ఖేలో అని దాన్ని బుజ్జగించి పంపి, మేం సాహెబ్ కృపయా ఆప్ అందర్ మత్ ఆయియేగా అని శుద్ద హిందీలో చెప్పి , ఆ కోడిపిల్లను వెంటాడి పట్టుకొని వెళ్ళాడు.


ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడెందుకు గుర్తొచ్చాడు అంటే , ఈ రోజు ఇంట్లో 60 మందికి పార్టీ జరుగుతోంది.బరోడా నుంచి వచ్చేసాక ఎన్ని పార్టీలైనా ఇంట్లో నాన్ వెజ్ వండలేదు. పది సంవత్సరాల క్రితం వరకూ మా అత్తగారు, మామగారు వున్నారు. కాబట్టి నో నాన్ వెజ్ :) ఆ తరువాత పిల్లలకు ఇష్టంలేదు అందుకూ నో నాన్ వెజ్ :) ఇప్పుడు ఫుల్ సొతంతరం వచ్చేసింది. వాళ్ళ ఆఫీస్ లో వి.పి జాబ్ వదిలేసి వెళుతున్నాడు అందుకని ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచీ అందరినీ విత్ ఫామిలీస్ పార్టీ కి పిలిచేసారు.ఆ వి.పి ఈయన గారికి చాలా క్లోజ్. ఈయన కు బాస్ అట మరి. కాని చూసేందుకు ఈయనగారే బాస్, ఆ అబ్బాయి ఈయన అసిస్టెంట్ లా వుంటారు. ఈయన చేరక ముందు అతను అతని వీలుప్రకారం రావటం , అతని పనేదో అతను తాపీగా చేసుకోవటం అలవాటట.అప్పటికీ ఆ అబ్బాయి నాతో అన్నాడు, సార్ ని ఆఫీస్ కు రోజూ రానవసరం లేదు, టైం ప్రకారం రానవసరం లేదు అని చెప్పామండి కాని వచ్చేస్తున్నారు. మమ్మలినందరీ అలాగే రమ్మంటున్నారు. బోలెడు పని చేయిస్తున్నారు అని. అంటే అన్నాను అంటారు కాని ఈయన షంటింగ్ భరించలేకే జాబ్ వదిలేసి వెళుతున్నాడేమోనని నా డౌటూ :) కాదట హయర్ స్టడీస్ కు వెళుతున్నాడు అన్నారు కాని నాకైతే అనుమానమే ! ప్రియమైన శిష్యుడు వెళ్ళిపోతున్నాడని పార్టీ అన్నమాట!

నిన్నటి నుంచి పార్టీ ఏర్పాట్లు మొదలయ్యాయి. మావారి పర్సనల్ అసిస్టెంట్ నంబర్ 2 కం డ్రైవర్ మహేష్ , మా వాచ్ మాన్ వెంకట్రావు రంగం లోకి దిగారు.చుట్టు పక్కల వున్న హోటల్స్ నుంచి  నాన్ వెజ్ వెరైటీస్ కొద్ది కొద్దిగా తెచ్చారు. రుచి చూసారు. బావర్చీ నుంచి , ఏదోట. అమీర్పేట్ లో ఇంకేదో హోటల్ నుంచి ఇంకేదోట. ఆర్డర్స్ ఇచ్చేసారు.డబల్కా మీఠా, కుర్బాని మీఠా ఓ కప్పు తెచ్చారు.అవి తింటే డైయాబిటిక్స్ కాని వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం వుంది వద్దు,డబల్కా మీఠా నేను చేస్తానులెండి అన్నాను. సరే అన్నారు.పొద్దున్నే ఆయన ఆఫీస్ అసిస్టెంట్ కాల్ చేసి సార్ కలాకండ్, రబ్డీ ఇక్కడ మంచి ది దొరుకుతుంది తేనా అన్నాడు. వాకే తెచ్చేయ్ :) కలాకండ్ తో రబ్డీ ఏమిటి , జిలేబీ తో ఐతే బాగుంటుంది అని నేను గొణుగుతే ఓకే జిలేబీ కూడా 2 కిలోలు వచ్చేస్తోంది. సో స్వీట్ పత్తర్ ఘట్టీ నుంచి వస్తోంది.సరే నా డబల్కా మీఠా కాన్సిల్.వెజిటేరియన్ వంట మా శైలజ చేసేస్తుందిట. నువ్వు వంటింట్లోకి రాకమ్మా , నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తావు, మా చెల్లి ని సాయం రమ్మన్నాను వస్తోంది అంది.పొద్దున్నే 6 గంటలకు మహేష్, వెంకట్రావు పైకి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వెజిటేరియన్స్ కు, సెకండ్ ఫ్లోర్ నాన్ వెజిటేరియన్స్ కూ , డ్రింక్స్ కార్నర్, స్మోక్ జోన్ అన్నీ సార్ గారి ఆధ్వర్యం లో సద్దేసారు. ఇంతలో మావారికి ఆ వి.పీ కీ అతని భార్య కూ , ఇద్దరు పిల్లలకు దండలు వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంతే ఇంకో అసిస్టెంట్ కు కాల్ చేసి , ఫ్లవర్ మార్కెట్ నుంచి నాలుగు గులాబీ దండలు తెమ్మని పురమాయించేసారు. దండలూ తయార్!

భారి ఎత్తున ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.అందరికీ నేను కాళ్ళకూ చేతులకూ అడ్డం వస్తున్నానట! ఓ రెండేళ్ళ క్రితం ఎవరైనా ఓ కప్పు  కాఫీ ఇస్తే బాగుండు, కాసేపు నడుము వాలుస్తే బాగుండు , అస్సలు కూర్చోనీయరు , నిలబడనీయరు  అని అనుకున్నమాట నిజమేకాని మరీ ఇంతగానా :) నాకు నేనే  నీరో చక్రవర్తిణి గా ఫీలవుతూ ఇక్కడ సెటిలైపోయాను:)

11 comments:

సిరిసిరిమువ్వ said...

Enjoy your queen status:)

సుజ్జి said...

వొమ్మగారు...

సుజ్జి said...

వొమ్మగారు... :)

శిశిర said...

:)సుఖపడిపోతున్నారన్నమాట. Enjoy.

మధురవాణి said...

అయితే ​పండగ చేసుకుంటున్నారన్నమాట.. సూపర్! అందరూ అన్నీ పనులూ చేస్తుంటే మీరు ఎంచక్కా చూసి ఆనందించండి.. ​

సి.ఉమాదేవి said...

ఫిడేలు బదులు మీరు ల్యాప్ టాప్ వాయించారు!బాగుందండీ మీ పోస్ట్!

MURALI said...

జరుగుతున్నప్పుడే జరిపించుకోవాలండి. పనిలో పనిగా మీరు కూడా ఓరిస్ నుండి ఐస్‌క్రీం తెప్పించుకోవాల్సింది.

వేణూశ్రీకాంత్ said...

హహహ సో స్వీట్ మీ చక్రవర్తిణి హోదా చదువుతుంటే బహు ముచ్చటగా ఉందండీ ఎంజాయ్ :-)

Karthik said...

Hhaa..hhaa.. Koddi sepu baagaa navinchesaaru..:-):-)

kiranmayi said...

Sweets from Patharghatti. Wow

kiranmayi said...

పత్తర్ ఘట్టీ నించి స్వీట్లా? వామ్మొ
మీకు ఇప్పుదు బొల్డు కదుపు నెప్పి వచ్చెస్తుంది