
"అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకు ముద్దు ,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు ,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు ,
మాచిన్ని అదితి మాకు ముద్దు ."
అని పాడగానే కిలకిలా నవ్వేది మా చిన్ని అదితి . కళ్ళు విప్పార్చుకొని మరీ చూసేది . అబ్బో మా అదితి కళ్ళు ఎంత అందమైనవో ! పుట్టీ పుట్టగానే కళ్ళు తెరిచేసింది . అప్పుడే లోకాన్ని చూసేయాలని ఎంత ఆరాటమో ! కళ్ళు మిల మిలా మెరుస్తూ , చాలా బ్రైట్ గా వుండేవి . కార్ లో నా పక్కన , కార్ సీట్ లో కూర్చొని రెప్ప వేయకుండా , సీరియస్ గా చూసేది . అమ్మ ఇంట్లో వున్నంతసేపూ నాతో నే ఆటలూ పాటలూ . కాని అమ్మ బయటికి వెళ్ళిందో అంతే ఏడుపే ఏడుపు . అమ్మా కావాలి , అమ్మమ్మా కావాలి :) అంతే తప్ప పాపం ఎప్పుడూ గొడవ చేయలేదు . అసలు పుట్టిన రెండో రోజే ఇంట్లో స్నానం చేయించాలి అంటే ఎంత భయము వేసిందో ! మా అమ్మాయికి , అల్లుడి కి నా గొప్ప చూపించుకోవాలి కదా ! పైగా వాళ్ళిద్దరికీ బేబీ టబ్ లో కాకుండా చక్కగా నూనే రాసి , నలుగు బెట్టి స్నానం చేయించాలని కోరిక . పైగా మా అమ్మ తో సున్ని పిండి ప్రత్యేకముగా చేయించి తెచ్చుకుంది నా కూతురు :) నాకొచ్చు నాకొచ్చు అని బడాయికి పోయి , మా అత్తగారిని మనసులో తలుచుకొని , టబ్ లో కూర్చొని , కాళ్ళ మీద పసిపిల్లను వేసుకొని స్నానము చేయించేసాను . పాపము హాయిగానే వుండిందో , నొప్పే పుట్టిందో తెలీదు కాని , కుయ్ , కయ్ అనకుండా స్నానం చేయించేసుకుంది మా బంగారక్క . ఏడాదికే ముద్దు ముద్దు మాటల తో ,
" ఐ లవ్ యు ,
యు లవ్ మి ,
వుయ్ అర్ ఆర్ హాపీ ఫామిలీ ,
వితె గ్రేట్ కీస్ అండ్ హగ్ ,
ఐ లవ్ యూ అమ్మమ్మా ."
అనిపాడేది . ఎంత సంతోషమో కదా ! మరే మా బంగారుతల్లి అంతా నా పోలికే :)
ఇలా నా మనవరాలి గురించి చెప్పాలంటే బోలెడు కబుర్లు వున్నాయి . అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లే వున్నాయి . నిన్న మొన్నటి పసికూన 10త్ మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యింది . ఈ రోజు నుంచి కాలేజ్ గర్ల్ ! పిల్లలు పెరుగుతూ వుంటే వారి ఆటపాటలను చూస్తూ మురిసిపోవటము బాగానే వుంటుంది కాని అప్పుడే ఇంత పెద్దవాళ్ళు ఐపోయారా అని బెంగ కూడా వేస్తుంది ! కాని తప్పదు కదా !!!
భవిష్యత్తు లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ,
నీకు ఇష్టమైన , నచ్చిన ఫీల్డ్ లో రాణించాలని కోరుకుంటూ ,
ఆల్ ద బెస్ట్ అదితీ .
మా అదితి కి ఇష్టమైన చాక్లెట్ కేక్ తిని , ఈ రోజు నుంచి కాలేజీ కి వెళుతున్న మా అదితి ని మీరందరు కూడా విష్ చేసేయండి మరి.. పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు రక్ష కదా !