Saturday, January 23, 2010

" జనగణమన " కు రేపటి తో అరవైయ్యేళ్ళు
అధినాయక జయహే . . భారత భాగ్య విధాత . . .అంటూ యావత్ దేశం లో జాతీయభావాన్ని పురికొల్పే " జన గణ మన " గీతం . . . మన జాతీయ గీతంగా ఏర్పాటు చేసుకొని రేపటికి సరిగ్గా అరవైయ్యేళ్ళు ! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారిన ఈగీతాన్ని 1950 జనవరి 24 న రాజ్యాంగసభ , జాతీయగీతం గా అధికారికం గా ఆమోదించింది . వాస్తవానికి ఈ గీతాన్ని గురుదేవుడు 1911 డిసెంబర్ 27నే రాసారు . 1919 ఫిబ్రవరి లో ఈ గీతాన్ని స్వరపరిచారు .అందుకు ఆంద్రప్రదేశ్ లోని మదనపల్లి వేదిక కావటం విశేషం . ప్రస్తుతం మనం అదే స్వరం లో ఇప్పటికీ పాడుకుంటున్నాము . ఈ గీతాలాపనకు సాధారణం గా 55 సెకెండ్లు పడుతుంది . సంక్లిష్టమైన బెంగాలీ సంస్కృతములో రాసిన ఈ గీతాన్ని రవీంద్రుడు అనంతరం ఇంగ్లీషు లోనికి అనువదించారు . బహుళ భాషలు , యాసలు సమ్మిళితమైన భారతదేశం లో అన్ని ప్రాంతాల్లోనూ ఈ గీతాన్ని ఆలపించినా . .ఆయా ప్రాంతాలను బట్టిపదాలలో మార్పులు కనిపిస్తుంటాయి . అసలు గీతం లోని కొన్ని నిశ్శబ్దాక్షరాలూ కనిపిస్తుంటాయి . 1911 లోనే ఈ గీతం రాసినా .. చాలాకాలం వరకు పెద్దగా వెలుగులోకి రాలేదు . అప్పట్లో రవీంద్రుని సంపాదకత్వములో వెలువడిన బ్రహ్మోసమాజ్ పత్రిక " తత్వ బోధ ప్రకాశిక " పాఠకులకు మాత్రం ఇది పరిచితం .

మన రాష్ట్రంతో సంబంధం
ఐరిష్ కవి , తన స్నేహితుడు జేంస్ హెచ్ క్యూజిన్స్ ఆహ్వానముతో ఠాగూర్ కొంతకాలం మదనపల్లి లోని బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ లో గడిపారు . ఆ కాలేజీకి క్యూజిన్స్ ప్రిన్సిపల్ గా వుండే వారు . ఫిబ్రవరీ 28 వ తేదీ సాయంత్రం గురుదేవుడు అక్కడి విద్యార్థులతో ఇష్టా గోష్టి జరిపారు . వారందరి విజ్ఞప్తి మేరకు బెంగాలి లో జనగణమన గీతాన్ని ఆలపించారు . ఆ సంధర్భంగానే ఆ గీతాన్ని ఆంగ్లం లోకి అనువదించారు . క్యూజిన్స్ భార్య మార్గరేట్ .. పశ్చిమ సంగీతములో నిపుణురాలు . ఆమె చివరిసారి ఈ గీతాన్ని స్వరపరిచారు . అలాగే ఈ గీతాన్ని , ఇప్పటికీ మనం పాడుకుంటున్నాము . మదనపల్లి లోని బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ లో ఆంగ్ల రాత ప్రతి ఇప్పటికీ ఫ్రేం కట్టి భద్రం గా వుంచారు .

వివాదాలూ వున్నాయి
ఈ గీతం పై వివాదమూ వుంది . ఈ గీతం బ్రిటిష్ వలస పాలకులను కీర్తిస్తూ వుందనేది ఆ వివాదం . ఈ గీతం తొలిసారి 1911 డిసెంబర్ లో కలకత్తా లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేసాల్లో ఆలపించారు . ఆ సదస్సు లో రెండవ రోజును బ్రిటిష్ నేత ఐదవ జార్జి రాకకు స్వాగతం పలికేందుకు వుద్దేశించారు . ఈ సంధర్బం గా స్టేట్స్ మన్ పత్రిక తన మరుసటి రోజు పత్రికలో " బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ .. చక్రవర్తిని ఆహ్వానిస్తూ , తను రాసి స్వరపరచిన గీతం ఆలపించారు " అని పేర్కొంది . దీనితో చక్రవర్తి గౌరవార్ధం ఈ గీతం రాసారనే దురభిప్రాయం నెలకొంది . అదే సదస్సు లో చక్రవర్తిని కీర్తిస్తూ మరో పాట కూడా పాడారు . దీంతో మీడియా ఈవిషయం లో పొరబడిందని కొందరు చెబుతుంటారు . అయితే తాను ఈ పాటను దేవుడి ( భారత భాగ్య విధాత ) ని ఉద్దేశించి రాసిందేనని , బ్రిటిష్ చక్రవర్తిని ఉద్దేశించి రాసింది కాదని ఠాగూర్ అప్పట్లోనే స్పష్టం చేసారు . 2005 లో ఈ గీతం లోని సింధు అన్న పదాన్ని తొలిగించాలని కొందరు వాదించారు . సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉందనేది వారి వాదన . అయితే , సింధు అనే పదం హిందూ , సింధూ నాగరికతలను ఉద్దేశించినదంటూ కొందరు ఆ ప్రతిపాదనను విభేదించారు .

ఈ ఆర్టికల్ ఈ రోజు 23- 1- 2010 ,ఆంధ్రజ్యొతి డైలీ పేపర్ లోనిది యధాతధంగా .

7 comments:

Rajasekharuni Vijay Sharma said...

చక్కని విషయం తెలియజెశారు. ధన్యవాదాలు.

శ్రీలలిత said...

మాలాగారూ,
రిపబ్లిక్ డే సందర్భంగా మంచి విషయాన్ని అందించారు. నేను కూడా చాలా రోజులు ఈ గీతాన్ని రవీంద్రులు బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలపైనే వ్రాసారని అనుకుంటూ వుండేదాన్ని. ఆయన దానిని ఖండించిన వాదన తర్వాత తర్వాత తెలిసింది. యెంతైనా ఇటువంటి శుభసమయంలో ఈ గీతాన్ని మనందరం ఏకమై గొంతెత్తి పాడుకుందాం..
కొసమెరుపు..
అందరికీ తెలుసునో లెదో.. ఈ మధ్య మన ప్రధానమంత్రిగారు కేరళా లో సైన్స్ కాంగ్రెస్ మీటింగులకి వెళ్ళినప్పుడు వందేమాతరం, జనగణమన పాడడానికి ఆయన అనుమతించలేదుట. ఆయన మూడు మీటింగ్ లకి అటెండ్ అయ్యారుట. మూడుచోట్లా వద్దన్నారుట. ఈ విషయం గురించి మన వార్తాపత్రికలలో ఎక్కడా వచ్చినట్లు నాకు గుర్తులేదు. టీ.వీ.వార్తల్లో కూడా చెప్పినట్టులేదు. సరే మరింక వందేమాతరం గురించి పార్లమెంట్ లో అయిన గొడవ అందరికీ తెలిసిందే. మనం ఎటుపొతున్నామో అర్ధం కావటం లేదు.

Srujana Ramanujan said...

Very nice post. Great info. But the song was written some 100 years back. Made the Anthem sixty years back

భావన said...

మంచి పోస్ట్ మాల గారు. అవును నేను చాలా కాలం ఈ గీతం వాళ్ళ కోసమే అనుకునే దాన్ని తరువాత ఎప్పుడో తెలిసింది. మంచి పోస్ట్.

మాలా కుమార్ said...

రాజశేఖరుని విజయ శర్మ గారు ,
శ్రీలలిత గారు ,
సృజన ,
భావన
థాంక్ యు .

మధురవాణి said...

నాకు 'జనగణమన' గురించి ఇంత వివరంగా ఈ సంగతులన్నీ తెలీదు. చెప్పినందుకు థాంక్స్ మాలా గారూ :)

మాలా కుమార్ said...

మధురవాణి ,
థాంక్ యు .