అనగనగా ఒక రోజు జ్యోతిగారు ప్రమదావనంలో ఓముఖ్య విషయం చెప్పారు.. ప్రముఖ రచయిత్రి , బ్లాగరు ఐన నిడుదవోలు మాలతి గారు హైదరాబాదు వస్తున్నారహో. మనసులో మాట సుజాత గారు తన ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా రావొచ్చు. మాలతిగారిని కలిసినట్టు ఉంటుంది.,మిగతా బ్లాగర్స్ ని కలిసినట్టు ఉంటుంది అని.. అది చూసి ఏమో ఎవరితోను పరిచయము లేదు , ఎవరింటికో ఏం పోతాములే !అనుకున్నాను . మా వారు కూడా తెలీని వాళ్ళింటికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. సరేలే అని ఊరుకున్నాను. కాని అనుకోకుండా సుజాతగారి మెయిల్. "మాలాగారూ, నేను సుజాతనండీ ,ఈ ఆదివారం మా ఇంటికి రాగలరు. మా అడ్రెస్ ఇది ,మా ఫొన్ నంబర్ ఇది అని ప్రేమగా పిలిచారు. ఆవిడతో పరిచయం లేకున్నా , కొత్త బ్లాగర్ని ఐనా పిలిచి, ఇంత వివరంగా చెప్పారంటె మంచోళ్ళేనన్నమాట.ఇల్లు వాకిలీ వున్నోళ్ళే ! పైగా బ్రహ్మ కమలం చెట్టుకూడా వుందిట. మొలక కూడా ఇస్తానన్నారు సో, వెళ్ళొచ్చు.( చిన్న దురాశ) పైగా మా గురూజీ వూరుకుంటారా ? నేనూ వస్తున్నాను పదండి అన్నారు. ఓ కె డన్ .
ఆ రోజు ఆగస్ట్ 9 . ముందు రోజే జ్యోతి అదేనండి మా గురుజీ చెప్పారు, మా అమ్మాయిని తీసుకొని మీ ఇంటికే వస్తాను .ఇద్దరమూ కలిసే వెళదాము అని. ఓ కే.మరీ మంచిది , నాకు ఇల్లు వెతుక్కునే పని తప్పుతుంది. పొద్దున్నే ఫొన్ చేసి మీరు చందనా బ్రదర్స్ దగ్గరికి వచ్చేయండి అని హుకుం. ఓ.కే గురూజీ ఎలా చెపితే అలానే అన్నా. .పొద్దున్నే నా టెన్షన్ మొదలయింది, ఏ చీర కట్టుకెళ్ళాలి ? అసలైతే హాయిగా డ్రస్ వేసుకెళ్ళొచ్చు. కాని మా బాబా జమానా గాళ్ళే వొప్పుకోరే ! పైగా పెద్ద దానివి ఏదైనా గంభీరమైన చీర కట్టుకెళ్ళు అని సలహా ! ఇక చేసేదేముంది పేద్ద లుక్ రావాలని నల్లంచు తెల్ల చీర కట్టాను .( హుం రమణి గారి పొస్ట్ లో ఎవరో దాన్ని బట్టే పాత తరం దానని అనేసారు .అందుకే జీన్స్ పాంట్ ,కుర్తీ వేసుకుంటానంటే ఎవ్వరూ వొప్పుకోరు.అయినా నేను పాత తరందాన్నంటే నేనొప్పుకోను .) ఐనా తప్పదుగా. చిరంజీవి సినిమాలోని "నల్లంచు తెల్లచీర" అని మనసులో పాడుకుంటూ వెళ్లా. చందనా బ్రదర్స్ దగ్గర జ్యోతి, వాళ్ల అమ్మాయి కలిసారు. హయ్ దీప్తీ అంటే పాపం దీప్తి సిగ్గుపడుతూ చిన్నగా హయ్ అంది. ఏంటి జ్యోతీ మీ అమ్మాయి కి మాటలేరావా అంటే అవునండీ మా వారి పోలిక అన్నారు. ( అంతేలే ఆయనకి మాట్లాడే చాన్స్ ఇస్తేగా పాపం ) నేనూ జ్యొతి హాయిగా కబుర్లు చెపుకుంటూ వుంటే దీప్తి మమ్మలిని గమ్యం చేర్చింది. ఆ రోజు ప్రకృతి కూదా మాకు సహకరించింది. ఎంద, వానా రెండూ లేక చల్లని రొమాంటిక్ వాతావరణం.. కుర్రాళ్ళైతే పాటలు పాడుకునేవారేమో. అసలు అంత దూరం ప్రయాణించినా కొంచం కూడా అలసట విసుగు తెలీలేదు. మధ్యలో సుజాత గారు మేము ఎక్కడున్నామో కనుక్కుంటూనే ఉన్నారు. వారి అడ్రస్ త్వరగానే దొరికింది.మరివెంట ఉంది ఎవరు?? తలుపు దగ్గరే నవ్వుతూ ఆహ్వానించిన సుజాత ని చూసి మనసులో పాపం ఈవిడ ఇంత ఫ్రెండ్లిగా వున్నారు, నేనేమో దావూద్ ఇబ్రహీం డెన్కి వెళుతున్నట్లుగా హడలి పోయాను అనుకున్నాను .
ఎంత మంది ఉన్నారో ఒకతే ముచ్చట్లు బయటివరకు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళగానే వరూధిని కనిపించారు. ఆవిడని ఇంతకు ముందు ప్రమదావనం ప్రొగ్రాం లో చూసాను కాబట్టి గుర్తుపట్టాను. ఆవిడనే మాలతి గారిని, శ్రీవల్లీ రాధికగారినీ, రమణి గారినీ పరిచయం చేసారు. మీ పేరు కామెంట్స్ లలో చూసాను అని మాలతిగారన్నారు, ఓహో మనం కామెంట్స్ ల లో కనిపిస్తామన్నమాట 1 అని కూసింత పొంగిపోయాను. రమణి గారి పేరు చెప్పగానే మీ బ్లాగ్ లో మీ పేరు దగ్గర బాపు బొమ్మ వుంటుంది కదండీ అని గుర్తు పట్టేసాను .మరి నేను బాపూ వీరాభిమానిని ఎక్కడ బాపు బొమ్మ వుండునో అక్కడ నా చూపు వుండును. ఆ తర్వాత జ్యోతిగారు మిగతావారిని పరిచయం చేసారు. కస్తూరి మురళీకృష్ణ గారి పవర్ పాలిటిక్స్ రెగ్యులర్ గా చదువుతాను అదే ఆయన తో చెప్పాను.... అరే గీతాచార్యా అంటే ఈ అబ్బాయా ???? చిన్న పిల్లవాడిలా వున్నాడే !అతని బ్లాగులు చదివి ఎంత పెద్దవాడో అనుకున్నాను సుమా !... ఓ ఈయన కత్తిగారా ? కత్తి లానే వున్నారు.... ఓహో ఈయన చదువరినా ? బాగా చదువరిలానే వున్నారే ! అందరినీ చూస్తూ మనసులొ అనుకుంటూ మరే మనసులోని మాట దగ్గరికి వచ్చాముకదా !
మిగతావాళ్లంతా వచ్చి రెండు గంటలు పైనే ఐంది. మేమే లేటుగా వెళ్లాము. ఇక చర్చలు మొదలు.సినిమా గురించి, టీవీ సీరియళ్ల గురించి. పాత దూరదర్శన్ సినిమాల గురించి,మధ్యలో కథలు, పుస్తకాలు.ఇలా వివిధ విషయాలపై చర్చించారు అందరూ.భలే ముచ్చటేసింది. అందులో కొందరు మొదటిసారి కలుసుకున్నా కూడా ఎలాంటి జంకు భయం లేకుండా చర్చించారు. నేనే ఏం మాట్లాడాలొ,మాట్లాడకూడదో అని మౌనంగా వింటూ ఉన్నాను. అదేంటో మరి రమణి గారు కూడా సైలెంటుగా ఉన్నారు.ఆవిడ సీనియర్ బ్లాగరే కదా..
అప్పుడే సుజాత గారు "లేవండి ..భోజనాలు చేసి ,చేస్తూ మాట్లాడుకోవచ్చు"అని దండోరా వేసారు. సరె ఇదో పని ఐపోతుంది అని అందరం భోజనాలు మొదలెట్టాం. చల్లని ఆదివారం, లైట్ గా లంచ్ .. ఏమేం చేసారో చెప్పనామరి.. పులిహోర, పెరుగు ఆవడలు, పూరి, ఖుర్మ, డబల్ కా మీటా..అసలు ఈ ముచ్చట్లు ఎంతకూ పూర్తికావనిపించింది. తింటూ కూడా మళ్లీ చర్చలే. ఇప్పుడు మల్లీ ఓ నాలుగైదు గ్రూపులు. అందరూ ఒక్కో టాపిక్ గురించి ముచ్చట్లు .నేనైతే హాయిగా కూర్చుని తినసాగాను. కొత్తగదా. మళ్లీ ఇంకోసారి రెచ్చిపోతా చూడండి.ఎందుకు పిలిచామురా అనుకుంటారు .. తిన్న తర్వాత మళ్లీ సాహిత్య చర్చలు. . అలాగే కొద్ది సేపు ఆ చర్చలు వింటూ ఉన్నాను. చివర్లో ఫోటో సెషన్.. పాపం.. దీప్తి, సుజాతగారి ఆయన శ్రీనివాస్ గారు ఫోటోలు తీసారు. మరి అందరు నిలబడీతే ఎలా అంటే మాలతి గారో బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. -5 కింద కూర్చోండి, +5 పైన కూర్చోండి . మగవాళ్లు ఎక్కడో సర్దుకోండి అని.. అల నవ్వుతూ ,ఉల్లాసంగా,ఉత్సాహంగా , మాట్లాడుకుంటూ లిఫ్ట్ సంగతి కూడా మర్చిపోయి మెట్లు దిగేసాం.
గేటుదాకా వెళ్లాక గుర్తొచ్చింది బ్రహ్మకమలం. సుజాత గారి రండి అని తీసికెళ్లి చెట్లని పరిచయం చేసి అదిగినవారికి లేదనకుండా బ్రహ్మకమలం ఆకులను కోసి ఇచ్చారు. ఆకు దాతా సుఖీభవ!! నాఖర్మ కాకపోతే అది జ్యోతి గారి కారులొనే మర్చిపోయా.. ఈ సారి మాతో శ్రీవల్లి రాధిక కూడా వచ్చారు. కొంచం దూరం వెళ్ళాక కృష్ణకాంత్ పార్క్ లో ఈ-తెలుగు మీటింగ్ జరుగుతుంది కదా ఇంటికెళ్లి చేసే పనేమీలేదు.ఒకసారి అక్కడున్నవాళ్లని పలకరించి వెళదామాని బయలుదేరాం. ఆ రోడ్లు కొత్తకాబట్టి నేను దారిచూపిస్తున్నాను.. దగ్గరికి వచ్చాకా దారి తప్పి , దీప్తికి ఐస్ క్రీం ఆశ చూపించి అటు తిప్పి ఇటు తిప్పీ మొత్తానికి కృష్ణకాంత్ పార్క్ కి వెళ్ళాము. వాళ్లు షాకైనట్టున్నారు.ఇదేంట్రా పిలవకుండా వచ్చేసారు అని. అక్కడ మా పేర్లు బుక్ లో రాసాము. చాలా సమయం అయ్యేట్లుగా వుంది,వాళ్లు ఏదో సీరియస్సుగా చర్చిస్తున్నారు అనుకొని చిన్నగా లేచి బయట పడ్డాము. జ్యోతి కొన్ని ఫొటోలు తీసుకున్నాక చెట్ల గురించి మాట్లాడుకుంటూ అక్కడే వున్న కాంటిన్లో ఐస్ క్రీంలు తిని , కార్ లో రాధిక గారి నవల్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వుండగానే మా ఇల్లు వచ్చేసింది.
ఇదండీ మా స్పెషల్ ఆదివారం ముచ్చట్లు..
Wednesday, August 12, 2009
Subscribe to:
Post Comments (Atom)
35 comments:
నేనొప్పుకోనొప్పుకోను .. నేను మిస్సయ్యా.. ఇది దుర్మార్గం. మేము లేకుండా చూసి ఇలాంటివన్నీ చేసేస్తారా.. మీమీద మా కోర్టులో information నష్టం కేసు వేస్తాం. లాయరుతో సిద్దంగా ఉండండి.
పది కాలాల పాటు ఇలాగే ఎవ్వరో ఒకళ్ళ ఇంట్లో ఇలానే కలుస్తూ ఉండండి. ఇదే మీకు నా శాపం
ఎంత బాగా రాసారంటే ఇది చదివిన ప్రతి ఒక్కరు అయ్యో ఆ మీటింగ్ లో నేను వెళితే బాగుండేదే అనిపిస్తుంది
బాగుంది. బాగుంది. ప్రతిమాసం కృష్ణకాంత్ పార్కులో కాకుండా ఇలాక్కూడా ఏదైనా ఏర్పాట్లుంటే బ్లాగర్ల మీట్ బాగుంటుంది కదా!
nice................
Great. Glad to hear that. Feel very jealous :)
I am very far away in Chennai :(
Planning to start Che. Te. Ba. Sam :)
[Chennai telugu Blagarla Sangham]
నిజ్జంగా ఆ సమావేశంలో లేనివాళ్ళు మహా కుళ్ళుకునేంత ఊరిస్తూ రాశారండీ.
ఐనా ఎవడండీ మిమ్మల్ని పట్టుకుని పెద్దతరం అన్నదీ? ఎవడో బొడ్డూడని డిప్పకాయ అలా అన్నంత మాత్రాన మీరు కాబోసు అనుకోడ మేంటండీ. మీరు నల్లంచు తెల్లచీర కట్టినా, జీన్సూ కుడ్తీ వేసినా ప్రోగ్రెస్సివ్వూ డైనమిక్కేనని ఒప్పేస్కున్నాం.
సుజాతగారి సకల కళాపోషణల్లో అరుదైన మొక్కల పెంపకంలో కూడా అందెవేసిన చెయ్యన్న మాట .. (హమ్మో, ఇప్పుడు మళ్ళీ "మా చేతులు గాజులు తొడుకున్నాయా "అని రోషాలొస్తాయేమో!)
మాలతి గారు అంత కష్టపడి అమెరికా నించి ఐదరాబాదు రావడం ఒక యెత్తైతే, సుజాతగారు శ్రమతీసుకుని బ్లాగర్లందర్నీ ఆహ్వానించడం మరో యెత్తయితే, మీరిలా బ్రహ్మాండంగా కళ్ళక్కట్టినట్టు ఈ నివేదిక మాకందించడం ఇంకా బ్రహ్మాండమైన యెత్తు. మీరూ మీ గురూజీ సంతత బ్లాగ్దేవ్యనుగ్రహ ప్రాప్తిరస్తు. తథాస్తు.
మనసులోని మాటలు అందంగా జాలువారాయి
చాలా బాగా చెప్పారు మాలా. మేము మిస్సయ్యాము.
ఇలాగే ఇక్కడ బ్లాగర్లను కలుసుకునే అవకాశం వస్తుందనుకున్నాను శ్రీ గారు డెట్రాయిట్ లో ప్రతి నెలా జరిగే వాళ్ళ మీటింగుకు రమ్మని మేము బయల్దేరేముందు చెప్పినదాని ప్రకారం. మీటంగు తారీకులు చెప్పండి తప్పక వస్తాము అని అత్యుత్సాహంకూడా చూపించాను. కానీ ఆ తారీకులు ఇప్పటిదాకా తెలియలేదు.
psmlakshmi
మాలగారు,
భలే ఉల్లాసంగా ఉంది మీ పోస్టు! కాసిన్ని సాహితీ కబుర్లు కూడా నడిచాయిగా! వాటి గురించి కూడా రాస్తే మరింత బావుండేది.
కొత్తపాళీ గారు,
కళలను గుర్తించే వారున్నపుడే వాటికి సార్థకత! ధన్యవాదాలు! గాజులు వేసుకోవడం, గాజుల చేతుల్తో అన్ని పనులు(మొక్కల పెంపకంతో సహా) చేయడం నాకిష్టమైన పన్లే!
అరుదైన రచయితలు అమ్రికా నుంచి వచ్చినపుడు వారి గౌరవార్ధం వారిని అభిమానించే వారితో ఇలా చిన్న సమావేశం నిర్వహిస్తే బావుంటుందని అనిపించింది. (పైగా మాలతి గారితో నా పరిచయం ఈనాటిది కూడా కాదు మరి) మీరెప్పుడొస్తారో చెప్పండి మరి?
అన్నట్లు "ఐదరాబాదు" అన్నమాట టైపాటా?
బాగుంది. బ్లాగ్లోక పునర్మిలన సంప్రాప్తిరస్తు!
@ psmlakshmi
http://groups.yahoo.com/group/DTLCgroup/
http://www.detroittelugu.org/DTLC/Main.asp
Heck! అసలు విషయం ఏదండీ? మొక్కలు, పులిహారైతే అంత మంది ఎందుకు? చర్చలేమన్నా జరిగాయా?
@సుజాత .. చాలా సంతోషం.
టైపాటుకాదు, డెలిబరేటే .. ఆ వాక్యంలో అంతకుముందొచ్చిన "అ" లతో యతి కలుస్తుందికదాని :)
ఐనా ఎవడండీ మిమ్మల్ని పట్టుకుని పెద్దతరం అన్నదీ? ఎవడో బొడ్డూడని డిప్పకాయ అలా అన్నంత మాత్రాన మీరు కాబోసు అనుకోడ మేంటండీ.
_________________________________________________
ఆ డిప్పకాయని నేనేనండీ :)) ఇంతకీ మీరు రమణిగారి బ్లాగు పూర్తిగా చదివి/చదవకుండా వ్రాశారా ఈ కామెంటు?
నాది చక్రవర్తి గారి కామెంటే.. నేనొప్పుకోను, నేనుఒప్పుకోను...
మీటింగ్ చాలా బాగా జరిగినట్లు వుంది మీరు దానిని చెప్పిన తీరు ఇంకా బాగుంది.. అయ్యో బ్రహ్మ కమలం ఆకు మర్చి పోయేరా.
పర్లేదు బానే రాసారే!!! ధన్యవాదాలు మాలగారు..
ముందుగా సుజాతగారికి అనేకానేక ధన్యవాదాలు. అపురూప, ఆత్మీయ అతిధి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా పిలిచినందుకు. నిజంగా చాలా సంతోషించాను. చాలా హాయగా గడిచిపోయింది ఆదివారం.. మాలగారు సాహితి చర్చల్లో బిడియం వల్ల పాల్గొనలేదు. సుజాతగారు, మహేష్, మురళీకృష్ణగారు ఎవరో పూనుకోవాల్సిందే.. నేను పాల్గొన్నంతవరకు మునెమ్మ కధను సినిమా తీస్తే హీరోయిన్ఎవరు ?? అనే చర్చలో మాత్రమే. ఇక పుస్తకాల గురించి కూడా చర్చ జరిగింది..
నాకు సంబంధించి మా పిల్లలను అభినందించాలనిపిస్తుంది. నేను ఎక్కడికెళ్లాలన్నాఒంటరిగా వెళ్లొద్దని ఇద్దరిలోఎవరో ఒకరు వస్తారు. చిన్నప్పుడు చేయిపట్టుకుని స్కూలుకు తీసికెళ్లిన పిల్లలేనా అనిపిస్తుంది..
మాల గారూ..
చాలా చాలా కుళ్ళుగా ఉందండీ నాకు :(
హమ్మ్.. దేనికైనా రాసిపెట్టుండాలి కాబోలు.. నేనెప్పుడు మీ అందరినీ కలుస్తానో కదా..!
మేము రాలేకపోయినా మీరు కళ్ళక్కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు.
ధన,
మంచి ప్రశ్న! నిజానికి అక్కడ ఎక్కువ భాగం ఆక్రమించింది సాహితీ చర్చలే! కానీ సీరియస్ వాతావరణంలో కాదు. అదంతా రమణి గారు కవర్ చేశారు కదాని మాల గారు మిగిలిన మైనర్ పార్ట్ ని సరదాగా ప్రెజెంట్ చేశారంతే! ఇది కేవలం కలిసి తినడానికి మాత్రం జరిగిన మీటింగ్ లా కనపడిందా ఏమిటి కొంపదీసి?
కాలం వెనకకు తిరిగిపోయి.. నేను కూడా మీతో కలిసి ఆ ఆదివారం ఆనందాన్ని పంచుకుంటే ఎంత బాగుండునా అని అనిపించింది. ఏం చేస్తాం? అదృష్టం లేదంతే.....
ముందుగా నా ఈ మీటింగ్ కి వచ్చిన మితృలు అందరికీ వందనాలు.
పేరు పేరునా ధన్యవాదాలు.
సుజాతా గారింట్లో హేమా హేమీ లను కలవటము నా అదృష్టము. అక్కడ జరిగిన సాహితీ చర్చల గురించి రమణిగారు చెప్పారు.ఇంకా ఎవరైనా కూడా చెప్పచ్చేమో ! నేను ఏదో నా ధొరణి లో సరదా గెట్ టుగేదర్ లా రాసాను. ఏమైనా తప్పులుంటే వొప్పులుగా భావించి మన్నించండి.
చక్కటి ఆతిధ్యం ఇచ్చిన సుజాత గారికి ధన్యవాదములు.
మమ్మలిని అక్కడిదాకా ఓపికగా తీసుకెళ్ళిన దీప్తి కి మరీ మరీ ధన్యవాదాలు.
అన్నట్టు నాదో పెద్ద ధర్మ సందేహం... ఇంతకీ కొత్తపాళీగారు నాకాలు లాగారా లేక నా కాలు లాగుతున్నట్టు నటిస్తూ మాలాకుమార్ గారి కాలు లాగారా?
మాల గారు :)
అదేంటో మరి రమణి గారు కూడా సైలెంటుగా ఉన్నారు.ఆవిడ సీనియర్ బ్లాగరే కదా..
_________________________________________________________________________________
సైలెంట్కి సీనియర్ - జూనియర్ తేడా లేదండీ!
ఇక బ్లాగుల విషయానికొస్తే, ఇక్కడ కూడ సీనియర్లు - జూనియర్లు అని లేదని నా అభిప్రాయం., చక్కటి సాహిత్యాభిలాష, సాహిత్యం మీద పట్టు , తెలుగుపై అభిమానం ఉన్నవాళ్ళు 16 ఏళ్ళకే ప్రతిభ కనబరుస్తున్నవారున్నారు. మరలాంటప్పుడు నేను సీనియర్ని.. ?? (ఏ బెసెస్)
చర్చల్లో పాలు పంచుకోడానికి నేను రచయిత్రిని కాదు.. ప్రముఖ బ్లాగర్ని అంతకన్నా కాదు. (రాయినైన కాకపోతిని రామ పాదం.. అన్నట్లు రచయిత్రినైనా కాకపోతిని.. అని పాడుకోవాలి :( )
సుజాతగారు అభిమానంతో పిలిచారు ప్రేక్షకురాలినయ్యాను అదే ఉదహరించాను నా బ్లాగులో అంతే. :)
మాలా గారు బాగు౦ది.
అ౦తా కలిసిన౦దుకు చాలా స౦తోశ౦.మరి పోటోలు తిసేసారా!
నిన్న చుసా,క౦గారు లో పొస్త్ చదివి మల్లి చుద్దా౦ లే అ౦టే నాకు_
ఇప్పుడు ఒపేన్ కావటా౦ లేదు.మిమ్మల్ని నల్ల౦చు తెల్లచీర లో చుడాలని.
నాకు ఒక మ౦చి రోజు రావాలని కోరుకు౦టూ......
అమ్మో అమ్మో ఎంతమంది కుళ్ళుకుంటున్నారో ! ఇరుగు దిష్ఠి ,పొరుగు ధిస్ఠి .
ఈ పొస్ట్ రాసేటప్పుడు అస్సలు అనుకో లేదు ఇంతమంది నా అహ్వాన్నాన్ని మన్నిస్తారని.
అబ్బో ఎంతమంది విచ్చేసారో !
నిన్న హేడ్మాస్టర్ గారు ,డిప్పకాయ అని ,రౌడీగారికి భలే పేరు పెట్టారే అని సంతోషించినంత సేపు పట్టలేదు ,
రౌడీగారు ధర్మసందేహం లేవదీసారు.హూం
రమణి గారు,
ఈ రూపంగానైనా నా బ్లాగ్ కి వచ్చారు. వెల్కం .
మిమ్మలిని నొప్పిస్తే సారీ .
వచ్చిందుకు థాంక్ యు.
chakravarti garu,
naestam gaaru,
kottapaali gaaru,
katti mahaesh kumar gaaru,
vinay chakra varti garu,
venkata ganesh garu,
chilamkuru vijaya mohan garu,
psmlaxmigaru,
sujata garu,
ravi garu,
dhanaraj garu,
bhavana garu,
jyoti garu ,
madhuravani garu,
srilalita garu ,
andariki mari mari dhanyavaadamulu.
సుభద్ర గారు,
ఫొటో రమణి గారి పొస్ట్ లో వుందండి .
అన్ని చోట్లా ఎందుకులే అనిపించి తీసేసాను.
వుందిలే మంచి కాలం ముందు ముందునా !
సమావేశం మొత్తం మీ కళ్ళతో చూపించేశారు....
నాకు ఫొటో చూడాలని ఉంది. రమణి గారి బ్లోగ్ ఏదో చెప్పితే చూస్తాను.
ide chudu.
http://www.sumamala.info/2009/08/blog-post_10.html
రమణి గారి బ్లాగ్ చూసాక మీకో మాట చెప్పి పోదామని వచ్చాను.
ఫోటోలో హెంత అమాయకంగా చూస్తున్నారండీ.. పన్నెత్తి మాట్లాడతారా అసలు అన్నట్టు..! పోస్టుల్లోనేమో ఇలా హాస్యం ఒంపేస్తుంటారు. మీకు బోలెడు హాస్య చతురత ఉందండోయ్ ;)
మధురవాణి గారు,
నిజముగానే నేనెక్కువగా మాట్లాడనండీ బాబూ, మిమ్మలినందరినీ చూసాక ఇలా మాటలు దొర్లుతున్నాయి !
thank you for your compliment
chalaaa rojula tarvaata mee blog chadivaanu .bhaagaa raasaaru.meerentagaa happy feel ayyaaro mee raatalone telisi poyindi.mee blog vallameeku manchi parichayaalu kuda avutunnaayi anukontaanu.tondaralo neenu oka memberni avaalani korikundi.
Post a Comment