Tuesday, June 11, 2013

మధురస్మృతులు

ఈ ఫొటోలో వున్నది మా అత్తగారు శ్రీమతి పరచ అనసూయ  , మామాగారు శ్రీ పరచ కిషన్ రావు గార్లు.. ఈ రోజు వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారా అంటారా  పోయిన వారం మా అత్తగారి వూరు "పోలంపల్లి"వెళ్ళి వచ్చాము . ఆ వూరి గురించి చెప్పేముందు మా మామగారిని , అత్తగారిని తలుచుకున్నానన్నమాట.


"పోలంపల్లి" లో మా మామగారి పూర్వీకులు అంటే తరతరాలుగా అక్కడే స్తిరపడ్డారు . ఇది ఆంధ్రాకు , తెలంగాణాకు బార్డర్ ఏరియా. ఈ సంగతి ప్రత్యేకం గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , రజాకార్ మూమెంట్ సమయం లో ఈ వూరు కూడా పాల్గొంది . జమలాపురం కేశవరావు గారి ఆధ్వర్యం లో మా మామగారు , వూరి కరణం అప్పారావు గారు మరి కొందరు వూరి యువకులు వాళ్ళ వుద్యోగాలు వదులుకొని వచ్చి పాల్గొన్నారట. రజాకారులు తరుముతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడి కి వచ్చేవారు.బార్డర్ లో వున్న గ్రామాలలో వారి కాంప్ లు ఏర్పాటు చేసుకునేవారు.అలాంటి వక కాంప్ , పరిటాలకు కాంప్ కమాండర్ మా మామగారు. ఇక్కడ కరణం గారింట్లో ఉద్యమం వ్యూహ రచనలు చేస్తుండేవారు. ఇళ్ళలో ఆడవాళ్ళు నూలు వడకటం చేసేవారు.కార్యకర్తలకు మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసారు . మా అత్తగారు , ఆవిడ ఆడపడుచు అందరి కీ వండేవారట.అసలు రోజంతా వండుతునే వుండేవాళ్ళము అనేవారు మా అత్తగారు ఈ వూరి నుంచి మొదటిసారిగా చదువు కోసం బయటకు వెళ్ళింది మా మామగారేనట.

మావారి బాల్యం ఇక్కడే గడిచింది. మా పెళ్ళైన కొత్తల్లో మా బంధువులు , స్నేహితులు అందరూ మావారు చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి తెగ చెప్పి భయపెట్టారు.ఓసారి మా అత్తగారి మీద కోపం వచ్చి నాలుగు కిలోల నెయ్యిని ఇంటి ముందు వేపచెట్టు కింద పారబోసారట. ఎంత అల్లరి చేసినా పిల్లలను కొట్టకూడదు , తిట్ట కూడదు అని మామాగారి రూలట. ఈయన అల్లరి భరించలేక ఓసారి , ఇంటి వెనుక వున్న గోతిలో ఈయనను దింపి మా అత్తగారు ఏడుస్తూ కూర్చున్నారట. అలాంటివి బోలెడు సంగతులు , నేను మా పెళ్ళైన కొత్తల్లో అక్కడ వున్నప్పుడు ఎదురింటి వాళ్ళు చెప్పారు.మేము కొన్ని రోజులు ఆ ఇంట్లో వుండాలని , మామాగారు ఆయన చెల్లెలిని తోడిచ్చి వుంచారు. అప్పటికే ఆక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి చాలా ఏళ్ళైందిట.కాని పొలాలు చూసుకోవటానికి ఆయన వెళుతూనే వుండేవారు.అప్పుడే ఎదురింటి వాళ్ళు మావారి చిన్నప్పటి ఫొటోలు చూపించారు. నేను అడుగుతే అన్నీ ఇచ్చారు కాని వకటి మాత్రం ఇవ్వలేదు . అందులో మావారు చాలా చిన్నగా , బహుషా నాలుగేళ్ళు వుండ వచ్చు , తెల్ల పైజామా కుర్తా వేసుకొని , చేత్తో జంఢాపట్టుకొని వూరేగింపు ముందు వున్నారు . అది రజాకార్ మూమెంట్ ఐపోయిన తరువాత వూళ్ళో వూరేగింపు చేసారట అప్పడు తీసారుట. ఆ తరువాత ఇన్ని సంవత్సరాలకు అక్కడకు పోయిన వారం వెళ్ళము.మధిరలో మా వారి కజిన్ కూతురు పెళ్ళైతే అక్కడికి వెళుతూ పోలంపల్లి వెళ్ళాము. మా ఇద్దరి తోపాటు మావారి కజిన్ సంధ్య కూడా వచ్చింది. ముందుగా తిరుమలగిరి లో వెంకటేశ్వరస్వామి దర్షనము చేసుకున్నాము. ధర్షనం అయ్యాక అక్కడ వున్న క్లర్క్ ను , పోలంపల్లి ఏ రూట్ లో వెళ్ళాలి అని అడిగారు. ఆయన పోలంపల్లి వాళ్ళదే ఇక్కడ పెళ్ళవుతోందండి అని చెప్పారు. అక్కడి వెళి కనుక్కుంటే అప్పుడే పెళ్ళైపోయి అంతా కిందకు దిగారని తెలిసింది. వాళ్ళలో తులశమ్మగారి అబ్బాయి అంటే మా ఇల్లు కొనుక్కున్నావిడ కొడుకు కూడా వున్నట్లు తెలిసింది . అంతే అప్పటి నుంచి మావారి ఆనందం , ఎక్సైట్మెంట్ చెప్పలేనివి . మీరు కార్ లో కింది కి రండి నేను మెట్ల మీదుగా దిగి వాళ్ళను అందుకుంటాను అని వడి వడిగా వెళ్ళిపోయారు.మేము కింది కి వెళ్ళేసరి కి తులశమ్మగారి అబ్బాయి , మావారు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికీ ఆయన పేరు తులశమ్మగారి రెండో అబ్బాయి అనే తెలుసు .ఆయన వెంట పోలంపల్లి బయిలుదేరాము . మీరూ మాతో పాటు రండి.


వూళ్ళో కి వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్ళాలి కదా , అక్కడ ఎవరిని ఇబ్బంది పెడతాము . ఇది పోలంపల్లి కి ముందు వున్న 'వత్సవాయి 'అనే వూళ్ళోని హోటల్.భోజనం వేడి వేడిగా వడ్డించారు. ముఖ్యం గా ఎందులోనూ వెల్లుల్లిలేదు :)పెరుగైతే ఎంత రుచిగా వుందో .హాయిగా కడుపు నిండా తినేసాము.
ఈ ఫొటో ఆ హోటల్ ముందుదే. మావారి పక్కన వుంది తులశమ్మగారి రెండో అబ్బాయి ఆపక్కవారు హోటల్ నడుపుతున్న దంపతులు .
ఇహ పోలంపల్లి లోకి పదండి. వూళ్ళోకి వెళుతూనే గుడి పక్కన మా మాష్టారు ఇల్లు అని ఆపారు . ఆయన గురించి అడుగుతే పాపం పోయారు లేరు:( ఇంట్లో కూడా ఎవరూ లేరు.


ఇదే మా యిల్లు. మట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతున్నది అని , వుద్యోగం రాగానే ఈ ఇల్లు అమ్మ కోసం కట్టించారట మామాగారు. కార్ ఆగటం ఆలశ్యం మావారు ఎలా పరుగెత్తుతున్నారో !అప్పటి నుంచి నేనూ, సంధ్యా ఫొటోలు తీస్తూ మావారి ఆనందాన్ని చూస్తూవున్నాము:)
"అరే ఇంటి ముందు పెద్ద వేపచెట్టుండాలి లేదే" మావారి ఆశ్చర్యం.
"దాని కిందేనా మీరు రెండు కిలోల నెయ్యి వంపేసింది ?"నా ఆరా.
"రెండు కాదు నాలుగు కిలోలు "
"మరే వదినా మా అన్నయ్యను తక్కువ అంచనావేయకు ."
మా ఇద్దరి మాటలు ఆయనెక్కడ విన్నారు . ఇంట్లోకి దూరిపోయారు. ఆ ఇంటిని రెండు భాగాలుగా చేసి తులశమ్మగారి రెండో అబ్బాయి , మూడో అబ్బాయి వుంటున్నారట. ఇల్లు చూసేలోపల తులశమ్మగారి రెండో అబ్బాయి వెళ్ళి తెలిసినవాళ్ళను తీసుకొచ్చాడు. మాధవయ్యగారు వచ్చారు అంటూ వాళ్ళూ సంతోషంగా వచ్చారు .








మావారి పక్కనే బుజం మీద చేయి వేసి నిలుచున్నది , ఆయన చిన్నప్పటి గోలీలాడిన ఫ్రెండ్ లచ్చుమయ్య.


ఇది తులశమ్మగారి రెండో అబ్బాయి ఇల్లు . ఆయన భార్య, కొడుకు . ఆవిడ మంచిటీ చేసి ఇచ్చింది.టీ తాగమన్నప్పుడు ఎలాంటి టీ ఇస్తుందో అనుకున్నాను. కాని చాలా బాగుంది . ఆవిడతో టీ బాగుందండి అంటే , మీ మామగారు కూడా వచ్చినప్పుడల్లా "తులశమ్మా నీ రెండో కోడలు టీ చాలా బాగాపెడుతుంది " అనేవారు అంది .మాకు బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది .


ఇది మావారి చిన్ననాటి స్నేహితుడు మన్నెం గోపాలారావుగారి ఇల్లు. ఆయన కొడుకు , కోడలు , మనవడు. ఆవిడా బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది.
అందరూ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్నిసంవత్సరాల తరువాత వెళ్ళినా వూళ్ళో కొంతమందైనా గుర్తుపట్టేవాళ్ళు వున్నారని చాలా సంతోషపడిపోయారు.
అప్పుడు పెట్టిన ముగ్గులు కూడా అలానే వున్నాయి అని తరువాత అన్నారు. ముందే చెపితే అవి కూడా ఫొటోలు తీసే వాళ్ళము కదా అనుకున్నాము . ఎదురింటి వారు వుంటే మావారి ఫొటో అడుగుదామనుకున్నాను . ఇప్పుడైతే వాళ్ళకంత ఆసక్తి వుండదుకదా అనుకున్నాను. ఆ పెద్దవాళ్ళు లేరు . వాళ్ళ పిల్లలు ఖమ్మం లో సెటిలయ్యారు. వాళ్ళ పిల్లలు అమెరికావెళ్ళారు.






ఇదీ మా అత్తగారి వూరు , ఇల్లు.



Saturday, June 1, 2013

విహంగ లో నా కథ "మట్టిలో మాణిక్యం "


"మీరు కథలు వ్రాయొచ్చుకదా?" కలిసినప్పుడల్లా , కాల్ చేసి నప్పుడల్లా పి.యస్.యం లక్ష్మి గారి డైలాగ్ ఇది .అబ్బే నాకేమొచ్చండి నేనేమి వ్రాయగలనండీ నా మొహమాటపు జవాబు . "పొనీ ఏదైనా ఆర్టికల్స్ వ్రాసి మాగ్జిన్స్ కు పంపండి ." అనేవారు . ఆవిడంత ప్రోత్సహించినా ,బ్లాగ్ వ్రాసి ఇప్పటికే జనాలను తింటున్నాను , ఇహ కథలు కూడా వ్రాసి ఎందుకు ఏడిపించటము అనుకొని ఆవిడ మాటలను వినిపించుకోలే:)(ధైర్యం చాలలే )అలా అలా గడిచిపోతూ వుండగా ఓ సంవత్సరము నుంచి శ్రీలలితగారు మొదలయ్యారు . ఆవిడ కు ఉమాదేవి గారు తోడయ్యారు . అబ్బే అప్పటికీ మనం ఏమి వ్రాయగలం లే అనె అనుకున్నాను . ఇలా కాదని వాళ్ళు ముగ్గురూ కలిసి దండెత్తారు . అదేమిటో పాపం వాళ్ళకు నా మీద అంత నమ్మకం :)

"నిన్న ఉమాదేవి గారితో మాట్లాడానండి . మీ టాపిక్ కూడా వచ్చింది . మీరు కథలు వ్రాస్తే బాగుంటుంది అనుకున్నాము ఇద్దరమూ "అన్నారు శ్రీలలిత చాట్ లో. మరునాడు ఉమాదేవిగారు కాల్ చేసి "మాలా ,నేను శ్రీలలిత గారు మీరు కథ లు వ్రాస్తే బాగుంటుంది అని నిన్న మాట్లాడుకున్నప్పుడు అనుకున్నామండి "అన్నారు . నాకేమి మాట్లాడాలో తోచలేదు .సరే పోనీ వాళ్ళు ముగ్గురూ అంత ముచ్చటపడిపోతున్నారు . వాళ్ళ కోరిక తీరుస్తే పోలా అనుకొని ఎడమ చేత్తో , కుడి చేత్తో ఓ నాలుగు కథలు వ్రాసేసాను :)

వాటిని నా మొదటి శ్రోతలైన , మా అమ్మాయి , మాచెల్లెలు జయ లకు వినిపించేసి కాసిని మార్పులు చేసేసి శ్రీలలిత గారి మీద దండెత్తాను . మీరు చదవాల్సిందే నని మొహమాట పెట్టి చదివించేసాను . పాపం ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు బలైపోయారు .మావారి కి కూడా వినిపించాను కాని పాపం వెరీ గుడ్ వెరీ గుడ్ అనేసారు .

సరే నాలుగు లో ఒహటి విహంగ కు పంపాను . మిగితావి పరిశీలనలో వున్నాయి .(నా పరిశీలన లోనే )దాని సంగతి అటో ఇటో తేలాక , మిగితావి చూద్దామనుకున్నాను :)
అప్పటి నుంచి టెన్షన్ . ఏమంటారో . బాగాలేదనంటారో , బాగుందంటారో అబ్బో చెప్పలేను .వారం క్రితం హేమలత గారు మీ కథ ఈ నెల విహంగ లో వేస్తున్నామండి అని చెప్పగానే వావ్. . . నిజంగా వేస్తున్నారా ? మీకు నచ్చిందా ? అని ఎన్ని ప్రశ్నలు వేసాను .పాపం ఆవిడ ఓపిక గా జవాబిచ్చారు :)

అదీ సంగతి . అలా నా మొదటి కథ వచ్చేసింది .ఇదో ఇక్కడుంది . చదివేసి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి .

పట్టుబట్టి నాతో కథ వ్రాయించిన మామంచి స్నేహితులు , శ్రీలలిత గారి కి , పి.యస్. యం లక్ష్మి గారి కి , ఉమాదేవి గారికి బోలెడు ధన్యవాదాలు . నా మొదటి కథ ను ఆదరించిన హేమలత గారి కి చాలా చాలా ధన్యవాదాలు .

Monday, April 15, 2013

చిట్టి శత్రువు



"కెవ్వ్ కెవ్వ్ "
  బయట  నుంచి మావారు , స్టోర్ రూం నుంచి శైలజ పరిగెత్తు కొచ్చారు ఏమైందేమైంది అంటూ . ఎలుక అక్కడ అలమారు నుంచి నా కాలి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది . నేను అరవగానే రయ్ న తిరిగి అలమార్లో కి దూరిపోయింది అని చెప్పాను .
ఐనా అలమారు తలుపు వేసి వుంది . ఎక్కడా ఖాళీ నే లేదు ఎలా దూరిందో దొంగ ముండ , పది రోజుల నుంచి ఏడిపిస్తోంది అని గొణుగుతూ అలమార తలుపు తీసింది శైలజ . నా కళ్ళ ముందు అలమారాలో దూరింది , డబ్బాలు , పేపర్ తీసి వెతికినా కనపడలేదు . గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోయింది .
ఇదంతా చూసి , ఈ మాత్రాని కేనా అంత అరిచావు అని మళ్ళీ పేపర్ చదవటాని కి వెళ్ళి పోతూ వుంటే , హేమండీ అని గోముగా పిలిచాను . ఏమిటీ అన్నట్లు నా వైపు తిరిగారు .
" మరి మీరు , మనం పూనా లో వున్నప్పుడు మనింట్లో కి ఇలాగే ఓ ఎలుక దూరి మిమ్మలిని సతాయిస్తుంటే , మీరు ,గోరియక్ కలిసి దానిని వెళ్ళగొట్టారు కదా ! ప్లీజ్ ప్లీజ్ ఆ ఎక్స్పీరియన్స్ తో దీనినీ వెళ్ళ గొట్టరూ !"
: ఏం పిచ్చి పిచ్చి గా వుందా ? నేను ఎలుకలు పట్టేవాడిలా కనిపిస్తున్నానా ?ఐనా దీని కింత హడావిడి ఎందుకు ఓ ఎలుక బోన్ తెచ్చి పెట్టేయ్ " అని ఓ సలహా పడేసి వెళ్ళిపోయారు .
" మంచి సలహానే ఇచ్చారు . ఐనా మీ అలమారా తలుపు సరిగ్గా మూయండి . ఎప్పుడూ తెరిచి వుంచుతారు . వున్న నాలుగు పాంట్లూ కొరికేసిందంటే ఇహ టవల్ కట్టు కొని తిరగాలి " అని టవల్ లో మావారు ఆఫీస్ కెళ్ళటము వూహించు కొని నవ్వుతూ వెనక నుంచి చెపుతూ మళ్ళీ కెవ్వ్ కెవ్వ్  మని అరిచాను .
ఏమైందమ్మా
అని అడిగింది శైలజ . ఈ దొంగపీనుగ పేపర్ లే కొరుకుతూ వుంటుంది , పేపర్ ల అలమార తీసి వుంటే ఇంకేమైనా వుందా నా నవలలన్నీ గోవిందా . వేల కు వేలు పోసి కొన్నవి అవికాస్తా కొరికిందంటే ఇంకేమీ లేదు . అసలే దేవుడి గదిలో పుస్తకాలన్నీ చింపేసింది అన్నాను .

అవునమ్మా పుస్తకాలు తప్ప ఏవీ ముట్టుకోవటం లేదిది అంది శైలజ .
అప్పటికప్పుడే ఎలుక బోను తెప్పించాను . రాత్రి అందులో ఓ ఉల్లిపాయ పెట్టి వంటగది లో వుంచి , ఈ రోజు తో నీ పని మటాష్ అనుకున్నాను .

హూమ్మ్ , మరునాడు పొద్దున వచ్చేసరి కి ఆ బోను అలాగే చలనం లేకుండా వుంది :(
దొంగ ముండ చంపుకుతింటోంది అని గొణుగుతూ సామాన్ల అలమార సద్దుతోంది శైలజ . ఏమైంది శైలజా అంటే చూడండమ్మా నూనె పాకెట్ కొరికింది . పేపరంతా నూనె ఐపోయింది . మొన్నొకరోజూ ఇలాగే నూనె పడితే ఏమైందా , ఎండవేడి కి పగిలిందేమో అనుకున్నాను . జాగ్రత్తమ్మా నూనె అంతా డబ్బాలలో పోసాను డబ్బా తీసేటప్పుడు చూసుకోండి అంది .
ఇది పోయిన జన్మలో కిరోసిన్ లాంతర్ల కింద చదువుతూ వుండేదేమో అందుకే పేపర్ లూ , నూనె పాకెట్ ల వెంటపడింది అంటూ కెవ్వ్ మన్నాను .
ఏమైందమ్మా అంది శైలజ .
మన మాటలు వింటూ స్టవ్ కింద నుంచి ఎలా చూస్తోందో చూడు అన్నా .
మీరు పక్కకి జరగండమ్మా ఇవాళ్ళ దీని పని ఐపోయింది అంటూ అండీ అండీ , ఆ దుడ్డుకర్ర తీసుకొని రండి అని వాళ్ళాయన కోసం కేక పెట్టింది .
కర్ర పట్టుకొని భీముడిలా వచ్చాడు వెంకట్రావు . స్టవ్ కింది కి వెళ్ళిపోయిన ఎలుకను కొట్టటానికి కర్ర తో స్టవ్ కింద ఫటా ఫట్ కొట్టాడు . ఇటు కొట్టండి , అటు కొట్టండి అని ఎంకరేజ్ చేస్తోంది శైలజ . కొట్టీ కొట్టీ చమటలు కక్కుతూ స్టవ్ కింది కి చూస్తే ఇంకా అదెక్కడుంది ఎప్పుడో ఎటో పారిపోయింది .
పోనీ ఎలుకల మందు ఏవో బిళ్ళలు దొరుకుతున్నాయి గా అవి పెట్టి చూడు అని ఇంకో సలహా పడేసారు మావారు .
పాపం బుజ్జి ముండ చచ్చిపోతుందేమోనండి , బుజ్జిగా , నల్లగా నిగనిగలాడుతూ , ఉషారుగా ముద్దుగా వుంది అని జాలిపడ్డాను .
'ఐతే అనుభవించు '
సాయంకాలం గుండె రాయి చేసుకొని మందు బిళ్ళలలు తెచ్చి రూంకొకటి పెట్టాను . ఈ రోజు తో ఈ జీవి కి ఈ లోకం తో పని తీరిపోతుంది అని కూడా అనుకున్నాను !
పొద్దున్నే కాఫీ కలుపు కుందామని వచ్చి చూస్తే ఏముంది ఎక్కడి బిళ్ళలక్కడే !అదేమో ఫ్రిడ్జ్ కింద నుంచి నన్ను నక్కి నక్కి చూస్తోంది . చదువుకున్నదానివి కదూ అందుకే తెలివితేటలెక్కువ అని పళ్ళు కొరుక్కుంటూ , గోడ కున్న చీపిరి తీసి కోపంగా దాని మీదకు విసిరాను . అది పక్కకు పరిగెత్తింది . ఈ రోజు నిన్నొదల బొమ్మాళీ అనుకుంటూ చీపిరితో దాని వెంట పడ్డాను . ఇద్దరమూ , వంటిల్లూ , స్టోర్ రూమూ అంతా పరిగెత్తాము . దాని కి ఈ ఆట నచ్చింది కాబోలు పక్కకు తప్పుకుంటూ అప్పుడప్పుడు కనిపిస్తూ నన్ను కవ్విస్తోంది . దాని వెనుక పరిగెత్తీ పరుగెత్తీ అలిసిపోయాను . సోఫా లో కూలబడ్డాను :(
పొద్దున్నే ఈ రన్నింగ్ రేస్ మంచి ఎక్సర్సైజ్ .రోజూ చేయి లావుతగ్గుతావు అని అక్కడే పేపర్ చదువుకుంటున్న మావారు వేళాకోళం చేసారు .
మీరు మాట్లాడకండి నాకు వొళ్ళు మండిపోతోంది అని పక్కకు చూస్తే ఏముంది , వంటయింటి తలుపు పక్క నుంచి , అరవైఏళ్ళుగా వెంట పడుతున్న టాం కే దోరకని జెర్రీని నేను . నీకు చిక్కుతానా అన్నట్లు గుడ్ళు మిటకరిస్తూ మిర్రి మిర్రి చూస్తోంది హుం . . . . .