Monday, April 15, 2013

చిట్టి శత్రువు"కెవ్వ్ కెవ్వ్ "
  బయట  నుంచి మావారు , స్టోర్ రూం నుంచి శైలజ పరిగెత్తు కొచ్చారు ఏమైందేమైంది అంటూ . ఎలుక అక్కడ అలమారు నుంచి నా కాలి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది . నేను అరవగానే రయ్ తిరిగి అలమార్లో కి దూరిపోయింది అని చెప్పాను .
ఐనా అలమారు తలుపు వేసి వుంది . ఎక్కడా ఖాళీ నే లేదు ఎలా దూరిందో దొంగ ముండ , పది రోజుల నుంచి ఏడిపిస్తోంది అని గొణుగుతూ అలమార తలుపు తీసింది శైలజ . నా కళ్ళ ముందు అలమారాలో దూరింది , డబ్బాలు , పేపర్ తీసి వెతికినా కనపడలేదు . గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోయింది .
ఇదంతా చూసి , మాత్రాని కేనా అంత అరిచావు అని మళ్ళీ పేపర్ చదవటాని కి వెళ్ళి పోతూ వుంటే , హేమండీ అని గోముగా పిలిచాను . ఏమిటీ అన్నట్లు నా వైపు తిరిగారు .
" మరి మీరు , మనం పూనా లో వున్నప్పుడు మనింట్లో కి ఇలాగే ఎలుక దూరి మిమ్మలిని సతాయిస్తుంటే , మీరు ,గోరియక్ కలిసి దానిని వెళ్ళగొట్టారు కదా ! ప్లీజ్ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ తో దీనినీ వెళ్ళ గొట్టరూ !"
: ఏం పిచ్చి పిచ్చి గా వుందా ? నేను ఎలుకలు పట్టేవాడిలా కనిపిస్తున్నానా ?ఐనా దీని కింత హడావిడి ఎందుకు ఎలుక బోన్ తెచ్చి పెట్టేయ్ " అని సలహా పడేసి వెళ్ళిపోయారు .
" మంచి సలహానే ఇచ్చారు . ఐనా మీ అలమారా తలుపు సరిగ్గా మూయండి . ఎప్పుడూ తెరిచి వుంచుతారు . వున్న నాలుగు పాంట్లూ కొరికేసిందంటే ఇహ టవల్ కట్టు కొని తిరగాలి " అని టవల్ లో మావారు ఆఫీస్ కెళ్ళటము వూహించు కొని నవ్వుతూ వెనక నుంచి చెపుతూ మళ్ళీ కెవ్వ్ కెవ్వ్  మని అరిచాను .
ఏమైందమ్మా
అని అడిగింది శైలజ . దొంగపీనుగ పేపర్ లే కొరుకుతూ వుంటుంది , పేపర్ అలమార తీసి వుంటే ఇంకేమైనా వుందా నా నవలలన్నీ గోవిందా . వేల కు వేలు పోసి కొన్నవి అవికాస్తా కొరికిందంటే ఇంకేమీ లేదు . అసలే దేవుడి గదిలో పుస్తకాలన్నీ చింపేసింది అన్నాను .

అవునమ్మా పుస్తకాలు తప్ప ఏవీ ముట్టుకోవటం లేదిది అంది శైలజ .
అప్పటికప్పుడే ఎలుక బోను తెప్పించాను . రాత్రి అందులో ఉల్లిపాయ పెట్టి వంటగది లో వుంచి , రోజు తో నీ పని మటాష్ అనుకున్నాను .

హూమ్మ్ , మరునాడు పొద్దున వచ్చేసరి కి బోను అలాగే చలనం లేకుండా వుంది :(
దొంగ ముండ చంపుకుతింటోంది అని గొణుగుతూ సామాన్ల అలమార సద్దుతోంది శైలజ . ఏమైంది శైలజా అంటే చూడండమ్మా నూనె పాకెట్ కొరికింది . పేపరంతా నూనె ఐపోయింది . మొన్నొకరోజూ ఇలాగే నూనె పడితే ఏమైందా , ఎండవేడి కి పగిలిందేమో అనుకున్నాను . జాగ్రత్తమ్మా నూనె అంతా డబ్బాలలో పోసాను డబ్బా తీసేటప్పుడు చూసుకోండి అంది .
ఇది పోయిన జన్మలో కిరోసిన్ లాంతర్ల కింద చదువుతూ వుండేదేమో అందుకే పేపర్ లూ , నూనె పాకెట్ వెంటపడింది అంటూ కెవ్వ్ మన్నాను .
ఏమైందమ్మా అంది శైలజ .
మన మాటలు వింటూ స్టవ్ కింద నుంచి ఎలా చూస్తోందో చూడు అన్నా .
మీరు పక్కకి జరగండమ్మా ఇవాళ్ళ దీని పని ఐపోయింది అంటూ అండీ అండీ , దుడ్డుకర్ర తీసుకొని రండి అని వాళ్ళాయన కోసం కేక పెట్టింది .
కర్ర పట్టుకొని భీముడిలా వచ్చాడు వెంకట్రావు . స్టవ్ కింది కి వెళ్ళిపోయిన ఎలుకను కొట్టటానికి కర్ర తో స్టవ్ కింద ఫటా ఫట్ కొట్టాడు . ఇటు కొట్టండి , అటు కొట్టండి అని ఎంకరేజ్ చేస్తోంది శైలజ . కొట్టీ కొట్టీ చమటలు కక్కుతూ స్టవ్ కింది కి చూస్తే ఇంకా అదెక్కడుంది ఎప్పుడో ఎటో పారిపోయింది .
పోనీ ఎలుకల మందు ఏవో బిళ్ళలు దొరుకుతున్నాయి గా అవి పెట్టి చూడు అని ఇంకో సలహా పడేసారు మావారు .
పాపం బుజ్జి ముండ చచ్చిపోతుందేమోనండి , బుజ్జిగా , నల్లగా నిగనిగలాడుతూ , ఉషారుగా ముద్దుగా వుంది అని జాలిపడ్డాను .
'ఐతే అనుభవించు '
సాయంకాలం గుండె రాయి చేసుకొని మందు బిళ్ళలలు తెచ్చి రూంకొకటి పెట్టాను . రోజు తో జీవి కి లోకం తో పని తీరిపోతుంది అని కూడా అనుకున్నాను !
పొద్దున్నే కాఫీ కలుపు కుందామని వచ్చి చూస్తే ఏముంది ఎక్కడి బిళ్ళలక్కడే !అదేమో ఫ్రిడ్జ్ కింద నుంచి నన్ను నక్కి నక్కి చూస్తోంది . చదువుకున్నదానివి కదూ అందుకే తెలివితేటలెక్కువ అని పళ్ళు కొరుక్కుంటూ , గోడ కున్న చీపిరి తీసి కోపంగా దాని మీదకు విసిరాను . అది పక్కకు పరిగెత్తింది . రోజు నిన్నొదల బొమ్మాళీ అనుకుంటూ చీపిరితో దాని వెంట పడ్డాను . ఇద్దరమూ , వంటిల్లూ , స్టోర్ రూమూ అంతా పరిగెత్తాము . దాని కి ఆట నచ్చింది కాబోలు పక్కకు తప్పుకుంటూ అప్పుడప్పుడు కనిపిస్తూ నన్ను కవ్విస్తోంది . దాని వెనుక పరిగెత్తీ పరుగెత్తీ అలిసిపోయాను . సోఫా లో కూలబడ్డాను :(
పొద్దున్నే రన్నింగ్ రేస్ మంచి ఎక్సర్సైజ్ .రోజూ చేయి లావుతగ్గుతావు అని అక్కడే పేపర్ చదువుకుంటున్న మావారు వేళాకోళం చేసారు .
మీరు మాట్లాడకండి నాకు వొళ్ళు మండిపోతోంది అని పక్కకు చూస్తే ఏముంది , వంటయింటి తలుపు పక్క నుంచి , అరవైఏళ్ళుగా వెంట పడుతున్న టాం కే దోరకని జెర్రీని నేను . నీకు చిక్కుతానా అన్నట్లు గుడ్ళు మిటకరిస్తూ మిర్రి మిర్రి చూస్తోంది హుం . . . . .

12 comments:

ఎగిసే అలలు..... · said...

సాహితీ గారు చాల తెలివిగలదండీ మీ "చిట్టి శత్రువు"...చాలా బాగా రాశారు.... ఇలాగే మన తెలుగు బ్లాగుల వారిని నవ్విస్తూ ఉండండీ....!:-)....;:-)

ఎగిసే అలలు..... · said...

సాహితీ గారు చాల తెలివిగలదండీ మీ "చిట్టి శత్రువు"...చాలా బాగా రాశారు.... ఇలాగే మన తెలుగు బ్లాగుల వారిని నవ్విస్తూ ఉండండీ....!:-)....;:-)

Mauli said...

జాగ్రత్తండీ, నిద్ర లేచేసరికి కాళ్ళు చేతుల వేళ్ళు కొరికేసి ఉంచుతుంది కూడా :)

శ్రీలలిత said...


ఎంత కష్టం వచ్చిందీ....హు...

Padmarpita said...

చాలా బాగుంది

జలతారు వెన్నెల said...

బాగుందండి పోస్ట్!

"చదువుకున్నదానివి కదూ అందుకే తెలివితేటలెక్కువ" అని పుస్తకాలు తినేసిన ఎలుకను మీరు తిట్టుకోవడం :)
"చిట్టి శత్రువు" ని మీరు పట్టేసుకున్న రోజు కూడా పోస్ట్ వెయ్యడం మరవకండే!

మాలా కుమార్ said...

ఎగిసే అలలు గారు ,
మీకు ముందుగా నా సాహితి కి స్వాగతం అండి .
నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండి .

&మౌళిగారు ,
అమ్మో ఆ భయం పెట్టారు ఇహ నాకు నిద్ర పట్టదు . ఐనా అది పేపర్ లను , నూనే పాకెట్స్ తప్ప వేరేవి ఏవీ ముట్టుకోవటం లేదులెండి :)

&హూం . . . అవునండి శ్రీలలితగారు నాకంత కష్టం వచ్చింది :)

మాలా కుమార్ said...

పద్మార్పిత గారు ,
చాలా థాంక్స్ అండి .

& జలతారు వెన్నెల గారు ,
నా "చిత్తి సత్ర్వు " ను పట్టుకునే రోజు వస్తుందంటారా :( దాన్ని చంపకూడదు అనుకోవటం దానికి అలుసైపోయింది :(
ఆ రోజు రావాలే కాని తప్పకుండా పోస్ట్ వేస్తాను .

Lakshmi Raghava said...

chala bagundi....meeru chakkagaa rayagalaru...interstingaa...

జ్యోతిర్మయి said...

ఆలస్యంగా చూశాను ఇప్పటికి దొరికేసి వుంటు౦దేమో. సరదాగా ఉంది మాలా గారు పోస్ట్.

మాలా కుమార్ said...

లక్ష్మీ రాఘవ గారు ,
థాంక్స్ అండి .

&జ్యోతిర్మయి గారు ,
దొరకలేదండి . ఇంకా దోబూచులాడుతునే వుంది . ఈ మధ్య ఎవరో చెప్పారు గం పాడ్స్ అని దొరుకుతున్నాయని , అవి పెడితే ఎలుక దానికి అతుక్కుపోతుందని . తెద్దామనుకుంటే మా అమ్మాయి వద్దంది . దాని కి అతుక్కొని చాలా మరణయాతన పడతాయి , వద్దు మనకు పాపం తగులుతుంది అన్నది . సో అదీ కాన్సిల్ :) చూడాలి మా టాం అండ్ జెర్రి కథ ఎన్నాళ్ళు నడుస్తుందో :)
థాంక్స్ అండి .

వేణూశ్రీకాంత్ said...

హహహ మాల గారు మీ చిట్టి శత్రువు బాగానే ఇబ్బందిపెడుతుందనమాట :) ఒక పని చేయండి అది సాధారణంగా ఇష్టంగా కొట్టేసే వస్తువులు బోన్ లోపల పెట్టండి ఉల్లిపాయతోపాటు అన్నం మెతుకులు అరటిపండు ఒక ఎలకల మందు ముక్కా కూడా పెట్టేయండి ఏదో ఒకదానికోసం లోపలికి వెళ్ళకపోదు. ఆల్ ద బెస్ట్ :)