Sunday, December 29, 2019

నవ్వులనజరానా-1&2


నవ్వుల నజరానా
రచయతలు ; ఇరవైఆరుగు
నవ్వులు;కడుపుబ్బ
అనగనగా ఒక ఊళ్ళో ఒకాయన ఉన్నాడు.ఏమిటి  ఊళ్ళో ఒకాయనే ఉన్నాడా ఇంకెవరూ లేరా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకండి.చెప్పింది వినండి. పేరు ఏదో ఓ పేరు మీ కిష్టమైంది అనుకోండి.ఆయన రోజంతా పొలంలో పనులు చేసీ చేసీ కష్టపడి , ఇంటికొచ్చి ,వేడి వేడి నీళ్ళు స్నానంచేసి, పెళ్ళాం పెట్టిన వేడి వేడి బువ్వ తిని ఇలా పడుకున్నాడో లేదో నిద్ర ముంచుకొచ్చేసేది.అవును పాపం అలిసిపోయాడుకదా అందుకన్నమాట.మాంచి గురకపెట్టి నిద్రపోతూ ఉంటే ,అర్ధరాత్రి అంకమ్మ శివాలులా "దూకుతా దూకుతా" అని పెద్ద పెద్ద అరుపులు వినిపించేవి.యేహే ఏందీ గోల అనుకొని అటుతిరిగి పడుకునే వాడు.కానీ రోజు అర్ధరాత్రి "దూకుతా దుకుతా"అని అరుపులతో నిద్రాభంగమైపోయేది.ఓ రాత్రి ఇంక విసుగొచ్చి,"రోజూ ఏందే నీగోల ?దూకుతా దూకుతా అని అరవకపోతే దూకి చావరాదు"అని గట్టిగా అరిచాడు.అంతే "ధబ్" అనే పెద్ద శభ్ధం తో ఓ బేద్ద మూట అతని మీద పడింది.అంతే ఉలిక్కి పడిలేచి ,ఆ మూటను విప్పి చూసాడు.ఆశ్చర్యం. . . అధ్భుతం . . . ఆ మూట నిండా బోలెడంత డబ్బు, నగలూ!ఎంత సంపదో!ఇంక తరువాత ఏముంది ఎంజాయ్!కథం కహానీ!  
ఇక అసలు సంగతేమిటంటే పదిరోజుల నుంచీ మిమ్మలినందరినీ ఊరిస్తున్న మా "నవ్వుల నజరానా"25-12-2019 , ఓ ఆహ్లాదకరమైన సాయంకాలం పుస్తకాల సంపద మధ్య  మీ ముంగిట్లో కి దూకేసింది.ఇక ఒడిసిపట్టుకోవటమే మీ వంతు.అరే ఏమిటంత తొందర కాస్తాగండి. . .అందులో ఏమేమి నగలూ నాణ్యాలున్నాయో చెప్పనిస్తారా లేదా!
ఓ బోడబ్బాయ్ ఆంధ్రాలో పుడితే అమెరికాలో ఎక్సాస్ ప్రెసిడెంట్ కు కుడికన్ను అదిరిందిట శుభసూచకంగా ఎందుకో వంగూరి చిట్టెన్ రాజుగారు"అమెరికా వాహన యోగం"లో చెపుతున్నారు ఆలకించండి.
ఎవో దయ్యాలూ భూతాలూ పట్టి పీడించటం , వాటిని పోగొట్టేందుకు భూతాలరాజు వేపమండలతో చితక బాదటం విన్నాను కాని, ఎవరి చుట్టైనా గిరగిరా ఓ ఆత్మ తిరుగుతూ ఉంటే వాడు సారీ సారీ అప్పలాకొండగారు ఏమి చేయాలని సెలవిచ్చారంటే ఆయన గారు చచ్చినట్టు పడుకుంటే , చుట్టూ అందరూ ఆయనగారు చచ్చిపోయారని భోరు భోరున ఏడుస్తూ ఉంటే ఆ ఆత్మ తల తిరుగుగుడు అగి వెళ్ళిపోతుందిట.ఏమొనబ్బా అదేమిటో వడ్లమాని మణిగారి కథ "అ(అప్పలకొండ)-ఆ(ఆనందరావు)"కథ చదివి తెలుసుకోవలసుకున్నాను.
ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది అమెరికా వెళుతున్నారు కాని వారెవరికీ రాని ప్రాముఖ్యత "బామ్మగారి బోస్టన్ ప్రయాణం" కు ట్రంపు గారి ఇండియా ప్రయాణం, మోడీ గారి అమెరికా ప్రయాణం కు వచ్చినదానికన్నా ఓ పిసరు ఎక్కువగానే వచ్చింది.మరి ఎందుకో ఆ కథా కమామీషు ఉమాదేవి కల్వకోటగారు చెపుతున్నారు, కాస్త కడుపులు జాగ్రత్తగా పట్టుకొని ,తలలు గట్రా దేనికీ తగిలించుకోకుండా నవ్వుతూ ఆలకించండి.
భార్య గారు ప్రేమగా భర్తగారిని "ఈమండీ రాత్రి భోజనంలోకి ఏమి చేయమంటారు?" అని అడుగుతే అహా ఓహో అని రెచ్చిపోయి మీ కోరికల చిట్టా విప్పారో మీ ఇష్టం అడ్డంగా దొరికి పోతారు.ఎలాగా అంటే ఇలాగా వెంకట్ అద్దంకి గారి "అతిసంశయ"లో రఘులా మీ ఇష్టం మరి!
అమాయక పెళ్ళాం పెట్టే అతి ఖర్చుల నుంచి తప్పించుకోవాలని పాపం ఓ ఉత్తమ మొగుడుగారు అతి తెలివి ప్లాన్ వేస్తే పాపం అది ఎట్లా బెడిసి కొట్టిందో ఆయనగారి మెడకు చుట్టుకుందో సయ్యద్ నజ్మా షమ్మీ గారి "ఉత్తమమొగుడు"చదివి నవ్వుకొని జాలిపడండి.
వెనకటికెవరో తనది సౌండ్ స్లీపని గురకపెడుతుంటే సౌండ్ నాకూ-స్లీప్ మీకూ అని మొత్తుకుందిట ఓ ఇల్లాలు.అలా సిగరెట్ మజా మీకూ-సజా మాకు అని మొత్తుకుంది కనకలత ,ఎమెస్వీ గంగరాజుగారి కథ "గెలివి"లో!
జగమెరిగిన జలజమ్మకు పరిచయం నేను చేయలేనండోయ్ బాబూ మీరే గిరిజా రాణి కలవల గారి "జలజాక్షి-జలజాపతి" లో ఫ్రెష్ గా మరోసారి పరిచయం చేసుకోండబ్బా!
పెళ్ళా ఏది వండిపెడితే అది నోరుమూసుకొని తినక వంకలా హన్నా అట్లాంటి మొగుడికి ఏమి శిక్షవేయాలో మనకు జ్ఞానబోధ చేస్తున్నారు తులసి భాను గారు"సుమతీసత్య"లో .చదివి నేర్చుకోండి.
ఐదు పెల్లిల్లు చేసుకుంటున్న మనవరాలిపెల్లిల్ల ల్లో హడావిడి చేసి తమ తడాఖా చూపిద్దామని ఓ సరదా పడిపోయారు ఓ అమ్మమ్మ, నానమ్మ.పట్టు చీరలు ,కాసులపేరు,వడ్డాణాలు వేసుకుందామని ఆశపడ్డారు.కానీ జిగేల్ మనే గిల్టు నగలూ తగిలించుకొని,పిచ్చిజరీలతో తళతళా మెరిసిపోతున్న సింతటిక్ చీరలు కట్టుకోవలసి వచ్చిన వైన మెట్టిదనగా . . . నేను చెప్పటం ఎందుకు మీరే తెలుసుకోండి జి.యస్.లక్ష్మి గారి "తాజాతాజాపెళ్ళిబాజాలు" లో చదివి.
హబ్బ హబ్బ నవ్వీ నవ్వీ నా బుగ్గలు నొప్పెడుతున్నాయి.ఇంక రాయలేను బాబు మిగితావి సాయంకాలం .అందాకా సెలవు.
(సశేషం)




నవ్వుల నజరానా-2
రచయితలు ; ఇరవైఆరుగు
నవ్వులు;కడుపుబ్బ
అబ్బా ఆగండెహే . . . అందరినీ పరిచయం చేస్తానని చెప్పానా లేదా ? మీ  తొందర దొంగల్ తోలా ! ఉరుములమెరుపుల జిగినీ చీరలు ఈవెంటోళ్ళు చెప్పినట్టు ముస్తాబై ఐదు పెల్లిల్లకు (సరిగ్గానే చెప్పా ఇవి అమెరికా పెల్లిల్లు పెళ్ళిళ్ళు కాదు) వెల్లి (అమెరికా అమెరికా) పీకలదాకా మెక్కి బుక్తాయాసం తో పడుకొని ఇప్పుడే లేచానా మరి.ఇహ చెపుతా మీ గురించి కూడా. . .
ఈ మధ్య ఎక్కడ విన్నా ,పేపర్ లో చదివినా డెంగ్యూ, చికెన్ గున్యా , దోమలు హోరెత్తిస్తున్నాయి.వీటి బాధ నుంచి తప్పించుకోవటానికే త్రివిక్రమరావు దోమలబ్యాటూ వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు.ఈ దోమల తస్సాదియ్యా అవేమైనా తక్కువ తిన్నాయా!బాగా తెలివిమీరిన రెండు దోమలు త్రివిక్రమరావును ముప్పతిప్పలు పెట్టేసాయి దా.పి.విజయలక్ష్మి పండిట్ గారి"దోమల వేట" లో!
పి.యస్.యం లక్ష్మిగారికి పాపం తిన్నది అరక్క వళ్ళు పెరిగి ఆయాసం అట.ఆయాసం తగ్గించమని డాక్టరమ్మ దగ్గరికెళుతే గుండె ఆపరేషన్ చేస్తానంటుందేమిటి చెప్మా!ఆ డాకటరమ్మ కి అంత తిక్కెందుకు వచ్చిందో "ఆయాసానికి గుండె ఆపరేషన్" లో తెలుసుకుందాం!
"చంటోడిని చంకలో పెట్టుకొని , మీ ఆఫీస్ బాగ్ ఇంట్లో మర్చిపోయారు. . . "కుశల శర్మ గారి భార్య కుశల శర్మ గారిని చివాట్లు వేస్తోంది.అదేమిటి ఆఫీస్ కు ఎవరైనా చంటోడిని చంకలో వేసుకొని తీసుకెళుతారా ఆ చోద్యం ఏమిటో కౌండిన్య (రమేష్ కలవల) గారి "కవిసార్వభౌమ-కవి కుశల శర్మ" లో చదవండి.
రిటరయ్యాక ఇద్దరూ కలిసి షాపింగ్ కు వెళితే సరదాగా ఉంటుందని భర్త వివేక్ ను వాల్మార్ట్ కు నీరజ తీసుకెళితే, అక్కడ వివేక్ చేసిన హంగామా ఇంతా అంతా కాదు సోమ సుధేష్ణ గారి "పదవీ విరమణ"లో!
అమ్మాయిలంటే ఆమడ దూరం పరుగెత్తుకెళ్ళే మధుగాడు లవ్ లో పడ్డాడు.పడటమే కాదు ప్రేయసి దగ్గర నుంచి ఓ ప్రేమలేఖ కూడా అందుకున్నాడు.ఆ ప్రేమలేఖ లో ఏముందో నేను చెపుతానేమిటి ఆశ దోశ అప్పడం. . .  అదేమిటో మీరే చదివి తరించండి అందరి అభిమాన రచయిత కంభంపాటి రవీంద్ర గారి రచన"ప్రేమలేఖ"లో.
పిల్లనో, పిల్లడినో కనిచ్చేద్దామని ఇల్లలు పుట్టింటికి వెళితే ,మనసును వీరాంగాలు వేయిస్తే ఏమి జరుగుతుందో హాస్యరసం లో శృంగారరసాన్ని ఘాటుగా తాలింపు వేసి వడ్డించారు చంగల్వల కామేశరి గారు "' లేడీ 'పోయి 'లేడీ' వచ్చే డాం డాం డాం"లో.
నవ్వుల రాజుగారు సరసి గారు గుళ్ళో మన చెప్పులు పోకుండా ,మహత్తరమైన ఉపాయం చెపుతున్నారు "చెప్పు తిప్పలు" లో. అదేమిటో నవ్వుల్ పువ్వుల్ మధ్య చదివి తెలుసుకోండి .ఆలశ్యం అమృతం విషం .త్వరపడండి.
ఫేస్ బుక్ లో మీ పోస్ట్ లకు  బోలెడు లైక్ లూ, కామెంట్స్ వస్తున్నాయా ? నాకూ తెలుసు రావటం లేదు.దిగులెందుకు ? శ్రీ సత్య గౌతమి జె.గారు రాసిన "వలలో చేపలు" చదవండి. టింగ్. . . టింగ్ . . టింగ్.
విజయ సారధి పేరు పొందిన రచయిత.కొత్త విషయాలను తెలుసుకొని తన రచనలల్లో వాడుకునేందుకు రైల్లో,విమానల్లో, బస్లల్లో అన్ని చోట్లా అందరినీ ఇంటర్వ్యూ చేస్తుంటాడు.అవే కథలుగా వచ్చేస్తూ ఉంటాయి.కాని అన్ని వేళలూ మనవి కావు అన్నట్లు విజయ సారధి పరిస్తితి "అడ్డం తిరిగిన కథ" అయ్యింది,ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి మంథా భానుమతి గారి చేతిలో!
కురుక్షేత్రం లో అర్జనుడు సైంధవుడిని చంపేసాక,అంత పాపాత్ముడికి అంత్యక్రియలు ఎందుకని వదిలేసారు.వాడి శరీరం నుంచి ఎముకలు బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపేసారు.అదే సైంధవలవణం.నిజమండీ సత్తెపమ్మాణికంగా చెపుతున్నాను.నా మాట నమ్మకపోతే డా.రామలక్ష్మి తాడేపల్లి గారి "సైంధవ లవణం" చదవండి.మీకే తెలుస్తుంది.
క్యారంస్ లో తను ఓడిపోతే భర్త మోములో విరిసిన దరహాసం ఆవిడకు ఎంతగానో నచ్చేసి . . . ఆ నవ్వును ఎప్పుడూ చూడాలని కావాలని ఓడిపోతూ ఉంటుంది పరమేశ్వరిగారు ఓరుగంటి శ్రీ లక్ష్మీనరసింహశర్మగారి "మా ఏమండోపాఖ్యానం "లో.
సుందరమ్మగారికి భర్త చనిపోయిన షాక్ లో మతి చలించింది.ఆ పిచ్చి లో ఏదో మాట్లాడుతూ ఉంటుంది.ఆ పిచ్చి కొడుకు కోడలకు ఎలా కలిసివచ్చిందో,విశాలి పేరి గారి "కలిసొచ్చిన పిచ్చి" చదువుకోవచ్చు.   అవును కొన్ని సార్లు పిచి కూడా కలిసొస్తుంది  కాదేది కలిసొచ్చేందుకు అనర్హం!
గుర్నాధం కున్న డ్రామా పిచ్చి భార్యను ముప్పతిప్పలు పెడుతుంటుంది. ఆ పిచ్చి ఓ సారి పరకాష్టకు చేరి, ఢాం అని కుదిరిపోతుంది నాగలక్ష్మి కర్రా గారి "పిచ్చి కుదిరింది"లో.
కామేశ్వరరావుగారికి బోలెడంత మతిమరుపు.ఏదో చెబుదామని భార్యను పిలుస్తారు మర్చిపోతారు.ఆయన మతి మరుపుతో ఆ ఇల్లాలూ, పిల్లలు పడే ఇబ్బందులు చాలా సరదాగా రాసారు నళిని ఎర్రా తన కథ "కళ్ళ జోడు"లో.
మనకు ఎన్నో డేలు మదర్స్ డే, ఫాదర్స్ డే,లవర్స్ డే వగైరా.ఆరోగ్యం కోసం టాయిలెట్స్ డే ఎందుకు జరుపుకోకూడదు అనే ఐడియా వచ్చింది మిసెస్.పరంశివం కు.పనిలోపని గా " భర్త డే" కూడా జరుపుకోవచ్చు అంటున్నారు ముచ్చెర్ల శకుంతల "భర్త(బ్లాక్)డే" లో!
ఫేస్ బుక్ కాలనీ పేరు ఎప్పుడైనా విన్నారా?అక్కడంతా ఫేస్ బుక్ పద్దతి ట.అక్కడ జరిగే చిత్ర విచిత్రాలకు దిమ్మ తిరిగిపోయి మూర్చబొయిన పాపం పసివాడు రవి కథా కమామీషు తెలుసుకోవాలంటే భరద్వాజ్ వెలమకన్ని రాసిన ఫేస్ బుక్ కాలనీ( లఘు నాటిక)లో తెలుసుకోవాల్సీందే!
సో ఇవండీ మా నవ్వుల నజరానా లోని కథల కబుర్లు. ఇలా కొంచం కొంచం చెప్పి ఆశపెడితే ఆశకురుపులొస్తాయంటున్నారా? ఏంకాదులెండి .పూర్తిగా చదివేద్దామని ఉబలాట పడుతున్నారు నాకు తెలుసు అందుకే ఎక్కడ చదవాలో చెప్పేస్తున్నాను.పూర్తిగా చదివి పకపకా నవ్వుకోవాలి కదా మరి.అందుకే ,
బుక్ ఏగ్జీబిషన్: హైదరాబాద్ యన్.టి.ఆర్ స్టేడియంలో
1. సురేష్ VMRG స్టాల్ No. 101
2. అచ్చంగా తెలుగు స్టాల్ల్ no. 176
3. విశాలాంధ్ర స్టాల్ల్స్- 95, 96,97, 281 - 284
4. నవచేతన స్టాల్ల్స్- 34 - 37, 141 -144 సీరియల్ ఆర్డర్ లో
నూ రచయితల దగ్గరా లభ్యం అవుతాయి.కొనేసుకొని చదివేసుకోండి.

ఏమిటీ ఏమో అంటున్నారు?ఇరవైఆరుగురు రచయితలు రాసిన ఇరవై ఆరు కథలు అన్నావు, ఇరవై ఐదు కథలనే పరిచయం చేసావు అంటున్నారా? ఆ ఇరవైఆరో కథ నాదేనండి బాబూ.అదే "దొంగగారు స్వాగతం" .నా కథ గురించి నేను చెప్పుకుంటే తనకు తాను మురిసే తాటాకు గుడిసె అని మా ఏమండీ గారు వెక్కిరిస్తారు.ఐనా నా కథ గురించి నేను చెప్పుకోవటం బాగోదు కదా .రేపు పోస్ట్ చేస్తాను చదివి మీ అభిప్రాయం చెప్పండీ :)
#నవ్వులనజరానా

No comments: