Saturday, September 21, 2019

మబ్బుల పల్లకి


ఓ సారి సుందరినాగమణి మన మొదటి విమానప్రయాణం గురించి సరదగా రాసుకుందామా అంది.ఊరికే అనుభవం రాసుకోవటం ఎందుకు ఓ కథలాగానే రాస్తే పోలే అనుకొని నా మొదటిప్రయాణం గురించి రాసుకున్న కథ ఇది.కథా కాలం 1973 అక్టోబర్, హైదరాబాద్ – కలకత్తా

మబ్బుల పల్లకి
"ఏమండీ... ఏమండీ... ప్లీజ్ ప్లీజ్" ముందుకు వెళుతున్నవిజయ్ చేయిపట్టుకొని అన్నాను.
"ఊ... వెళ్ళు ” అన్నారు విజయ్.
"థాంక్యు. ఎంతైనా మా అయన చాలా మంచివారు. బంగారు కొండ" అన్నాను.
"ఎందుకూ కిటికీ సీట్ ఇచ్చినందుకా? ఇవ్వక పోతే బతకనిస్తావా, దారంతా గొణుగుతూనే వుంటావు.” అన్నారు చిన్నగా నవ్వుతూ.
నేనూ నవ్వుతూ లోపలకు వెళ్ళి, కుర్తీ సరిగ్గా సద్దుకొని కూర్చుంటూ కిటికీలో నుంచి బయటకు చూసాను. కొద్ది దూరంలో, అక్కడక్కడ రెక్కలు సాచి, వెండి రంగులో, ఎండకు మిలమిలా మెరుస్తూ రాయంచలా నిలబడి వున్నాయి మబ్బుల పల్లకీలు ( విమానం కు నేను పెట్టుకున్న ముద్దు పేరు ). వాటిని అలా పరవశంగా చూస్తూ వుండి పోయాను. అందులో ఒకటి చిన్నగా స్టార్ట్ అయ్యి ముందుకు, చిన్నగా పరుగు మొదలు పెట్టింది. దానిని అలా చూస్తూ వుండగా మనసు గతంలోకి పరుగెత్తింది.
అది 1972 వ సంవత్సరము. అప్పుడే బంగ్లాదేశ్ యుద్దము ముగిసి శాంతి నెలకొంటున్న రోజులు. సరిహద్దులల్లో ఇంకా పూర్తి ఉద్రిక్తత తగ్గలేదు. ఆ సమయము లో మా వారికి సరిహద్దు ప్రదేశంలో ఒకటైన షిలిగురి నుండి వెళ్ళే ఆర్మీ కాంప్ కు పోస్టింగ్ వచ్చింది.  యుద్దం ముగిసినా ఉద్రిక్తత తగ్గలేదు కాబట్టి ఆంక్షలు ఇంకా పూర్తిగా సడలించ లేదు. దాన్ని ఇంకా పీస్ స్టేషన్ కా మార్చలేదు కాబట్టి కుటుంబాలను, దగ్గరలోనే వున్న డార్జ్ లింగ్ లో సెపరేటెడ్ ఫామిలీ క్వాటర్స్ లో వుండవచ్చు అన్నారు. కానీ అక్కడకూ ఆయన ఏ రెండు మూడు నెలలకో కాని రాలేరు. అప్పుడు చంటి పిల్లతో వక్కతీ అక్కడ ఎలా వుంటుంది వద్దు అని పెద్దవాళ్ళు, ఇక పోతే బి. యే పూర్తి చేయ వలసిన బృహత్కార్యం నా భుజ స్కందాలపైన వుండటం వల్లనూ, నేనూ మా అమ్మాయి హైదరాబాద్ లోనే వుండిపోయాము. ఆయన సంవత్సరానికి రెండు నెలలు సెలవల్లో వచ్చి వెళుతుండేవారు. ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి.. పోయిన సారి వచ్చివెళ్ళిన తరువాత, మా అమ్మాయి డాడీ అని ఏడ్చినప్పుడు మా వారి ఫొటో చూపించి ఏవో కథలూ కాకర కాయలు చెబితే వూరుకుంది కాని ఈ సారి చాలా బెంగ పెట్టుకుంది. ఏమి చేయాలో మాకు తోచటం లేదు. ఆయన వచ్చివెళ్ళి నాలుగు నెలలైనా బెంగ తగ్గ లేదు. పోనీ ఆయనతో మాట్లాడిద్దామంటే ఈరోజుల్లా ఫోన్ల కాలం కాదు. ఉత్తరాలే గతి. అవీ పోస్టల్ వాళ్ళ దయా, మా ప్రాప్తం అన్నట్లూ నిక్కీ నీలిగీ తీరికగా వచ్చేవి! అప్పుడేమైందంటే.....
ఓ రోజు పొద్దున్నే కాలేజీకి వెళుదామని పుస్తకాలు తీసుకొని బయటకు వస్తున్నాను. నా వెనుక మా అత్తగారు ఏదో చెబుతూ వస్తున్నారు. ముందు వరండాలోకి వచ్చాము. అక్కడ మా మామగారు కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు. ఇంతలో...
"టెలిగ్రాం" అంటూ వచ్చాడు... పోస్ట్ మాన్. ఒక్క వుదుటన మా మామగారు లేచి ఎక్కడి నుంచి బాబూ అని అడిగారు.
"కాప్టెన్. విజయ్ దగ్గర నుంచండి.”అన్నాడు పోస్ట్ మాన్
ఆ అని వణుకుతున్న చేతుల తో టెలిగ్రాం అందుకున్నారు మా మామగారు.
గోడను పట్టుకొని నేను, నా భుజం గట్టిగా పట్టుకొని మా అత్తగారు వణుకుతూ నిలబడ్డాము.
ఆ టెలిగ్రాం నన్ను చదవమన్నట్లుగా అమ్మాయ్ అంటూ నావైపు చాచారు మామయ్యగారు. నేను అప్పటికే ఫేంట్ అయ్యే ప్రోగ్రాం లో వున్నాను!
ఇక తప్పక ఆయనే విప్పి చదివారు.”సుమతిని, పూజను కలకత్తా లో రిసీవ్ చేసుకుంటాను.” అని వుంది అందులో. ఇదేమిటి? ఏమి జరిగింది? మమ్మలిని కలకత్తా లో రిసీవ్ చేసుకోవటం ఏమిటి?అంతా అయోమయం లో పడ్డాము. కళ్ళ నీళ్ళ తో అత్తయ్య గారు కుర్చీలో కూలబడ్డారు. మామయ్య గారు ఆ టెలిగ్రాం ను అటు తిప్పి ఇటు తిప్పీ అలోచనలో వున్నారు. నేను పుస్తకాలు పక్కన పడేసి, గోడ కు వంటి కాలి మీద ఆనుకొని నిలబడి గోళ్ళు కొరికేస్తున్నాను.
చిన్నారి వచ్చి కాళ్ళకు చుట్టుకొని అమ్మా ఆకలి అంది. అప్పుడు గమనించాము పొద్దుటి నుంచీ అలాగే వున్నామని, భోజనాలు చేయాలని?” ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కానీయండి భోజనం చేద్దాం" అన్నారు మామయ్య గారు.
మమ్మలిని ఇంకా అయోమయావస్తలో వుంచటం ఇష్టం లేక పోస్టల్ వాళ్ళు మధ్యాహ్నం పోస్ట్ లో వుత్తరం ఇచ్చేసారు పాపం. మళ్ళీ గుండె దడ మొదలు ఎందుకంటే అది మామూలు కవరు కాదు బ్రౌన్ కలర్ పొడవాటి కవర్ మామయ్య గారి పేరు మీద వుంది! చిన్నగా, జాగ్రత్తగా చించారు.
అందులో నుంచి పొడవుగా మడత పెట్టి వున్న రెండు అట్ట ముక్కలు వక ఉత్తరము బయటకు వచ్చాయి., పూజ చాలా మనాది పడ్డది కాబట్టి ఒక వారము రోజులు తన దగ్గరలో ఫామిలీ ని వుంచుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాని, (కూతురే మనాది పడిందా నేను కాదా కొంచం కినుకగా అనుకున్నాను. ) విజయవాడలో, కలకత్తా లో రైళ్ళు మారి నాలుగు రోజులు వక్కతే ప్రయాణం చేయటం కష్టం కాబట్టి విమానం టికెట్లు పంపుతున్నాననీ, ఫలానా రోజు అక్కడ వాళ్ళిద్దరినీ విమానం ఎక్కిస్తే, కలకత్తాకు నాలుగు గంటల్లో చేరుకుంటుంది, తనను రిసీవ్ చేసుకోవటానికి నాకు వచ్చేందుకు వీలు కాకపోతే, కలకత్తా ఏర్ పోర్ట్ కు వక సిపాయిని పంపిస్తాననీ, అతను యూనీఫారం లో వుంటాడు, సుమతి పేరు వున్న అట్టను పట్టుకొని వుంటాడు కాబట్టి అతనిని కనుక్కోవటం సులభం, అతను జాగ్రత్తగా ఇక్కడకు తీసుకు వస్తాడు అని ఆ వుత్తరం సారాంశం!
సిపాయి కాకుండా తనే వచ్చి రిసీవ్ చేసుకుంటానని టెలిగ్రాం ఇచ్చారన్నమాట! ఐతే టెలిగ్రాం బులెట్ లా, ఉత్తరం తాపీ గాటెలిగ్రాం ముందు, ఉత్తరం వెనకలా ముందు వెనుకల వచ్చాయన్న మాట. మామయ్య గారి దగ్గర నుంచి ఉత్తరం తీసుకొని, గదిలోకి వెళ్ళి ఉత్తరం మళ్ళీ చదివాను. అంతా నేను ఎలా రావాలో, ఏమేమి తెచ్చుకోవాలో వ్రాసి ఉంది. పూజ గురించి వ్రాసారు కాని నా గురించి కాని, నాకు వేరే ఉత్తరం కాని ఏమీ లేదు! కొంచం నిరాశగా అనిపించి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఉత్తరంలో నుంచి చిలిపిగా నవ్వారు. ఊ అనుకొంటూ తల పక్కకు తిప్పుకున్నాను. నా గడ్డం పట్టుకొని, నా మొహం తన వైపు తిప్పుకుంటూ ” అలిగావా ?" అని అడిగారు.
"కాదా మరి నాకస్సలు ఉత్తరమే వ్రాయ లేదు. అంతా మామయ్య గారికే వ్రాసారు. నేను మీ ఉత్తరం కోసం ఎంత ఎదురు చూస్తానో తెలుసు కదా?” అలుకగా అన్నాను.
"నిజమేననుకో కాని నిన్ను రమ్మని నీకు వ్రాస్తే బాగోదు కదా! నాన్నకు చెప్పాలిగా! అందుకని నాన్నకు రాసాను.” అన్నారు.
"మీరన్నీ అంతే చేస్తారు. సెపరేటెడ్ ఫామిలీ క్వాటర్స్ లలో కూడా బాగుంటుందిట. లేడీస్ అందరూ కార్డ్స్ అనీ, క్లబ్లనీ ఎంజాయ్ చేస్తారుట. అంతా చక్కగా కలిసి మెలిసి వుంటారుట. పిల్లలకూ కంపెనీ వుంటుందిట. మిలిట్రీ కాంప్ కాబట్టి సెక్యూరిటీ బాగా ఉంటుందిట. మొన్న బజార్ లో మిసెస్. చెడ్డా కనిపించించి చెప్పింది. నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగింది. పైగా మీరూ అప్పుడప్పుడూ కనిపిస్తూ వుంటారు. ఇక్కడికైతే సంవత్సరం దాకా రారు. ఇంకా సంవత్సరం గడవాలి. అప్పుడు కాని పోస్టింగ్ రాదు. మీరేమొ నువ్వు గ్రాడ్యుయేట్ కావాలి అని కాలేజ్ లో చేర్పించి వెళ్ళారు. ఇప్పుడు పది రోజులున్నా మళ్ళీ 8 నెలల దాకా కనిపించరు. ఇక నా వల్ల కాదు ఇలా వంటరిగా వుండటం.” విచారంగా చెప్పాను.
"మరి నేను ఉండగలనా? మిమ్మలినందరినీ వదిలి ఈ అడవిలో ఉంటున్నాను. మొన్న బల్ బీర్ చెప్పాడు, ఇంటికి వెళ్ళినప్పుడు ” మమ్మీ ఎవరో అంకుల్ వచ్చా?” అన్నాడుట కొడుకు! ఎంత బాధ! మిలిట్రీ వాళ్ళు ఇంతే వుంటారు. మరి అడ్జెస్ట్ కావాలి. రాత్రి పూట బీర్మగ్ తీసుకొని టెంట్ ముందు కూర్చుంటే, పైన చంద్రుడు వెన్నెలలు కురిపిస్తూ వుంటాడు. అడవి పూల సువాసనలు తేలి వస్తూ ఉంటాయి. వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా! నీన్నెంత మిస్ అవుతానో! ఈ వెన్నెలంతా దండగై పోయింది కదా అనిపిస్తుంది.”నవ్వారు విజయ్.
"అయ్య గారికి కవిత్వం కూడా వస్తోంది.” నవ్వాను నేను.
"సుమతీ" మామయ్య గారి పిలుపు వినిపించింది. ఉలిక్కి పడ్డాను. ఓ ఇదంతా కలా నిరాశగా అనుకున్నాను. చేతిలోని ఉత్తరమూ, టికెట్లూ మసక మసకగా కనిపించాయి. కళ్ళు తుడుచుకున్నాను.”నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూసితిని.” అనుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహమూ కళ్ళూ కడుక్కొని బయటకు వెళ్ళాను.
గాభరా ఏమీ లేదని తెలిసాక మళ్ళీ చర్చ మొదలైంది. అప్పటికే ఐదవ నెల కనుక సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, ఇప్పుడు పంపిస్తే ఎలాగా ? మళ్ళీ అది తిరిగి వచ్చే సరికి ఆరో నెల వచ్చేస్తుంది. మన ఆనవాయితీ ఐదో నెల చేయటమే. ఠాట్ ఇప్పుడు పంపేందుకు వీలు లేదు వాడి కి ఉత్తరం వ్రాసేయండి అన్నారు అత్తయ్య గారు. ఎట్లాగా వాడు టికెట్ పంపాక పంపమని ఎలా చెబుతాము? మీ తల్లీ కొడుకులతో చస్తున్నాను మామయ్యగారి ధుమధుమలు! గొడకానుకొని, అడుగూ బొడుగూ గోళ్ళు కొరుకుతూ నేను. కాకపోతే ఈ సారి సీను బయట వరండాలో కాకుండా లోపలి హాల్ లో! సరే తర్జన భర్జన లు, శిఖరాగ్ర సమావేశాల అనంతరం నన్ను పంపేందుకూ, సీమంతం తొమ్మిదో నెలలో చేసేందుకూ నిర్ణయాలు జరిగి పోయాయి.
ఆకాశం లో కనిపించే విమానం ఎక్కుతున్నానంటే చెప్పలేనంత ఎక్సైట్ మెంట్! ఎంచక్కా కిటికీ లో నుంచి మబ్బులు పట్టుకోవచ్చేమో! మబ్బులు ఎలా వుంటాయి? మబ్బుల్లో తేలి పోయాను. మా అమ్మాయిని బయటకు తీసుకెళ్ళె చుక్కలా దూరం గా కనిపిస్తున్న విమానం చూపించి మనం అందులో డాడీ దగ్గరకు వెళుతున్నాము అని చెప్పాను. మా అమ్మాయి ఎగిరి గంతేసింది. మల్లీశ్వరి లోని మబ్బుల పాటలు గుర్తొచ్చాయి. నేను కాలేజి లో ఫ్రెండ్స్ తో, మా అమ్మాయి ఇంటికొచ్చిన వాళ్ళందరితో మా విమాన ప్రయాణం గురించి డప్పు కొట్టేసాము.
ఎదురు చూస్తున్న శుభ గడియ వచ్చేసింది. సూట్ కేస్ బయటకు తెస్తుంటే మా వారు నాకు ఇవి తేకు అవి తేకు, భోజనం కూడా విమానలో పెడుతారు అంటూ వ్రాసిన బోలెడు జాగ్రత్తలు గుర్తొచ్చాయి. ఆయన పిచ్చి కాకపోతే నేనేమన్నా పార్వతీశాన్నా నల్ల ట్రంక్ పెట్టె, మర చెంబు, గొడుగు గట్రా పట్టుకు పోవటానికి! ఎలా తయారవ్వాలి అన్న మీమాంస లో పడ్డాను. పూజ కైతే మావారు తెచ్చిన గళ్ళ పినోఫాం వేసాను కాని నాకే ఓ పట్టాన తోచటం లేదు. చక్కగా చీర టైట్ గా కట్టు కొని, పెద్ద నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, తలకు స్కార్ఫ్ కట్టుకొని విమానం మెట్లెక్కి, తలపు దగ్గర నిలబడి చేయి అలవోకగా వూపే హీరోయిన్లు గుర్తొచ్చారు. నేనూ అలా తయారవుదామని సరదా పడ్డాను కాని అమ్మో ఇంకేమైనా వుందా? గంజి పెట్టిన వెంకట గిరి చీరో, బెంగాల్ కాటనో కట్టుకుంటే మరీ ముసలమ్మలా కనిపిస్తానేమొ! చీరలన్నీ అటుతిప్పీ ఇటు తిప్పీ సీమంతానికి మా అమ్మ తెచ్చిన లేత పసుపు రంగు జార్జెట్ చీర తీసాను. జాకెట్ కుట్టించుకోమని అమ్మ ఇచ్చి పోయింది. ఎలాగూ సీమంతం ఇంకా నాలుగు నెలలు వుంది కదా ఇంకోటి కొనుక్కోవచ్చులే అనుకొని అదే కట్టేసాను. మమ్మలిని విమానం ఎక్కించటానికి మామయ్యగారు, పనివాడు వచ్చారు.
విమానం దగ్గరకు వెళ్ళాము.....
మెట్లెక్కాము... లోపలి కివెళుతూ తలుపు దగ్గర నిలబడి తిరిగి చూసాను.. లాంజ్ చాలా దూరంగా వుంది. మామయ్య గారు ఎక్కడున్నారో తెలీలేదు. వాళ్ళు నాకు కనిపించనట్లే నేనూ వాళ్ళకు కనిపించను కదా స్టైల్ గా చేయి ఊపుదామా అని ఓ క్షణం అనుకున్నాను. అమ్మో నా పక్కన బుజ్జి పిల్ల వుంది కదా వాళ్ళు కనిపెట్టేస్తారేమో! తిరిగి వచ్చేటప్పుడు ఆయన వుంటారు గా ఆయనకు చేయి ఊపొచ్చులే అని సరి పెట్టుకొని లోపలకు వెళ్ళాను.
తలుపు దగ్గర ఏర్ హోస్టెస్ నాజూకుగా నమస్కార్ చేసి లోపలకు ఆహ్వానించింది. ఇంకో ఏర్ హోస్టెస్ మమ్మలిని తీసుకెళ్ళి మా సీట్ దగ్గర కూర్చోపెట్టింది. మా వెనుక ఇద్దరు నన్స్ కూర్చొని వున్నారు. వాళ్ళు పూజను పలకరించారు. వాళ్ళు పిలిచి మాట్లాడించారు. ఎవరైనా మాట్లాడాలే కాని దానికేమీ కొత్తా పాతా లేదు అందరి తో మాట్లాడేస్తుంది. వాళ్ళతో కబుర్లు మొదలు పెట్టింది. ఇంతలో విమానం తలుపు మూసేసారు. ఏర్ హోస్టెస్ వచ్చి పూజను ఎత్తుకొచ్చి నా పక్కన కూర్చో బెట్టి, ఇద్దరికీ బెల్టులు కట్టి వెళ్ళింది. నేను చుట్టూ కలియ చూసాను. నేనూ, ఇద్దరు నన్స్ తప్ప ఆడవాళ్ళెవరూ లేరు అంతా మొగవాళ్ళే! వాళ్ళైన అక్కడక్కడ వున్నారు. ఏర్ హోస్టెస్ ఓ ట్రే లో చాక్లెట్ లు, దూది వుండలు తెచ్చి అందరికీ ఇస్తోంది. పూజ రెండు గుప్పిళ్ళ నిండా చాక్లెట్స్ తీసుకొని తన జేబుల్లో పోసుకుంది. అయ్యో బంగారు అన్ని తీసుకోకూడదు అని నేను గాభరా పడి పోయాను. పరవా లేదు అని ఆమె నవ్వుకుంటూ వెళ్ళి పోయింది. మా వారి ఇన్స్ ట్రెక్షన్స్ ప్రకారం దూది నేను రెండు చెవుల్లో పెట్టుకొని పూజ కూ పెట్టాను.
విమానం చిన్నగా కదలటం మొదలైంది. కాస్త పరుగెత్తి ఒక్క జర్క్ తో పైకి లేచింది! గుండె గుభేల్ మంది! పూజ ఒక్కసారే ఉలిక్కి పడి కెవ్ మంది. బెల్ట్ చేత్తో తీసేసేందుకు ప్రయత్నం చేస్తూ గింజుకుంటోంది! నేను దాని చేయి పట్టుకొని ఊరడిస్తున్నాను. విమానం స్టడీ అయ్యాక ఏర్ హోస్టెస్ వచ్చి మా ఇద్దరి బెల్ట్ లూ విప్పేసింది. పూజ ఒక్క ఉదుటన నా వళ్ళోకి దూకి నా మెడ చుట్టూ చేతులు వేసి ఏడవటం మొదలు పెట్టింది. ఎంత ఊరడించినా ఊరుకోదు. నాకేమో ఉక్కిరి బిక్కిరి ఐపోతోంది. ఏర్ హోస్టెస్ వచ్చి ఎత్తుకో బోయింది. ఆమె చేతులు నెట్టేసింది. వెనుక వున్న నన్స్ పిలిచారు ఉమ్... హూ.... వెళ్ళదు. నా వడిలో నుంచి లేవదు. ఒకటే ఏడుపు! ఏర్ హోస్టెస్ ను అడుగుతే పాపం నా హాండ్ బాగ్ లో నుంచి దాని పాల సీసా తీసి ఇచ్చింది. అది నోట్లో పెడితే ఓక్క తోపు తోసేసింది. అలా గంట పైనే అనుకుంటా ప్రయాణం చేసి ఓ ఊరు చేరు కున్నాము. అది ఏ వూరో గుర్తులేదు. అక్కడ ఎక్కువ సేపు ఆగ లేదు. మళ్ళి ప్రయాణం మొదలు! ఇంకాసేపు గడిచాక భువనేశ్వర్ చేరుకున్నాము. అక్కడ కొద్ది సేపు ఆగుతుంది అని, కిందికి దిగి కాసేపు నడుస్తే ఫ్రెష్ గాలి కి ఏడవటం వూరుకుంటుదేమో అని ఏర్ హోస్టెస్ చెప్పింది. చిన్నగా దాని ని ఎత్తుకొని దిగాను. నేల మీదకు దిగగానే నా మీది నుంచి ఒక్క దూకు దూకి రయ్ న ముందుకు పరిగెత్తింది!
అదృష్టవసాత్తు ఎదురుగా వస్తున్న ఏర్ పోర్ట్ ఉద్యోగి దానిని పట్టుకొని నాకు ఇచ్చాడు. విమానం వద్దు అని ఒకటే ఏడుపు!
మరి డాడీ దగ్గరకు వెళ్ళొద్దా అంటే డాడీ కావాలి, విమానం వద్దు అంటుంది.
ఓ నన్ నా దగ్గరకు వచ్చి నా దగ్గర స్లీపింగ్ టాబ్లెట్ వుంది. ఓ హాఫ్ వేయి పడుకుంటుంది అంది.
అమ్మో స్లీపింగ్ టాబ్లెట్ నా. నాకు స్లీపింగ్ టాబ్లెట్ అంటే చాలా భయం. వద్దండి థాంక్ యు అని చెప్పాను.
విమానం ఎక్కనంటుంది. భువనేశ్వర్ లో ఎలా దిగను? ఏమి చేయను ? అంతా అయోమయం. ఏర్ హోస్టెస్ సహాయంతో కష్టం మీద విమానం ఎక్కాను. ఏర్ హోస్టెస్ చాక్లెట్స్ తెచ్చింది. ఏమనుకుందో ఏమో కాని మా అమ్మాయి తన దగ్గర వున్న చాక్లెట్స్ కూడా తీసి ఆ ట్రే లో వేసేసింది. ఏడుపు తగ్గలేదు. నా వడిలో నుంచి దిగదు. ఏడ్చీ ఏడ్చీ తోటకూర కాడ లా వడిలి పోయింది. కళ్ళూ ఎర్రబారి, కళ్ళూ మొహమూ వాచిపోయాయి. ఇంక ఏడ్చే ఓపిక లేదేమో వెక్కిళ్ళు పెడుతోంది. నాకూ ఓపిక ఐపోయింది. ఏర్ హోస్టెస్ అటు వచ్చినప్పుడల్లా ఇంకెంతసేపు అని అడగటమే! పొద్దున్నా ప్రయాణం సరదాలో మా అత్తగారు వట్టి పిల్లవు కూడా కాదు, వాళ్ళు పెడితే ఏం పెడుతారో తినిపో అంటే కష్టం మీద సగం చపాతి తిన్నాను. ఇక్కడ వాళ్ళు పెట్టినవి తను తినలేదు నన్ను తిననీయలేదు నా కూతురు. నీరసం వస్తోంది. కళ్ళు తేలి పోతున్నాయి. అమ్మయ్య ఎట్టకేలకు కలకత్తా చేరుకున్నాము. లేచి నిలబడ లేను. కాళ్ళూ, నడుమూ పట్టేసాయి. పిల్ల చంక దిగదు. చాలా అంటే చాలా కష్టం మీద ఏర్ హోస్టెస్ సహాయము తో దిగి బస్ ఎక్కాను.
అమ్మయ్య అదిగో అక్కడ మా వారు కనిపిస్తున్నారు. అప్పటి వరకూ గొంతులో సుళ్ళు తిరుగుతున్న ఏడుపు బయటకు వచ్చేస్తోంది. ఆయన దగ్గరకు ఎలా వెళ్ళామో తెలీదు! డాడీ అంటు మా అమ్మాయి, ఏమండీ అంటూ నేను ఇద్దరమూ ఆయనను వాటేసుకొని భోర్ మన్నాము!
మబ్బుల పల్లకీ లో నా మొదటి ప్రయాణం అలా బీభత్సం గా మొదలై భీభత్సంగా ముగిసింది!
విమానం ఎక్కిన ప్రతి సారి అది గుర్తొస్తుంది. మేమిద్దరమూ మీద పడి భోర్ మనగానే విజయ్ పడ్డ కంగారు గుర్తొస్తే నవ్వొస్తుంది. చిన్నగా నవ్వుతున్న నన్ను చూసి ” ఏమిటీ నీ మొదటి ప్రయాణం గుర్తొచ్చిందా?" అని అడిగారు విజయ్.
"ఊ! అప్పుడంత గోల గోల చేసిందా, ఇప్పుడేమో పెద్ద డైరక్టరై నెలకు పది రోజులు మబ్బుల పల్లకీ లోనే ఊరేగుతూ వుంటుంది మీ కూతురు.” అన్నాను నవ్వుతూ.
"మరి నా బంగారు తల్లి కదా?” మురిపెంగా అన్నారు విజయ్.

(20-11-2015 - గో తెలుగు. కాం వెబ్ మాగ్జిన్)

ఇది గో తెలుగు లో వచ్చినప్పుడు ఇక్కడ లింక్ ఇచ్చాను.

https://sahiti-mala.blogspot.com/2015/11/blog-post.html



No comments: