Saturday, March 11, 2017

రౌడీ గారి తో భేటీ!










కొన్ని పాత విషయాలు తలుచుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి.అసలు అప్పుడు అంత పిచ్చిమొహంలా ఎలా బిహేవ్ చేసానా అనిపిస్తుంది.అలాంటిదే సంఘటన. ఇదీ బ్లాగ్ కు సంబందించిందే.నాకు లాప్ టాప్ ఇచ్చినప్పుడు మా అబ్బాయి చాలా స్ట్రిక్ట్ గా,తెలీని వాళ్ళ తో మాట్లాడకు వగైరా వగైరా చాలా చెప్పాడు.నాకూ , మా మనవరాలికీ , మనవడి కీ కలిపి ఒకే లాప్ టాప్ ఇచ్చాడు.అందులో నాకు అడ్మింట్రేషన్ పవర్ కూడా లేదు.రోజూ మా ముగ్గురి బ్రౌజ్ హిస్ట్రీ, మేయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండేవాడు.అదో రోజులల్లో సారి, జ్యోతి. నిడదవోలు మాలతిగారు వచ్చిన సంధర్భంగా  సుజాతగారింట్లో గెట్ టుగేదర్ ఉంది రండి అన్నారు.అప్పటికే ఓసారి జ్యోతి తో కలిసి ఓల్డేజ్ హోం కు వెళ్ళి ఉండటం వల్ల (అప్పుడు మా ఏమండీ పర్మిషన్ , మా వాడికి తెలీకుండా తీసుకొని వెళ్ళాను లెండి.)  మా అబ్బాయి వెళ్ళేందుకు పర్మిషన్ ఇచ్చాడు.సరే అమీర్ పేట్ చందనా బ్రదర్స్ దగ్గర జ్యోతి పికప్ చేసుకొని తీసుకెళ్ళింది.అంతకు ముందే నేనెవరో ఎవరికీ తెలీదు కదా అని మొహమాట పడితే పరవాలేదు, మీ బ్లాగ్ పేరు చెప్పి మీ పేరు చెప్పి పరిచయం చేసుకోండి అంది జ్యోతి.అలాగే బెరుకు బెరుకుగా అందరినీ పరిచయం చేసుకొని , వరూధిని పక్కనే కదలకుండా కూర్చున్నాను :) ముందుంది మొసళ్ళ పండగ అని తెలీక, పరవాలేదు బాగానే గడిచింది అనుకొన్నాను .
మరునాడు నా బ్లాగ్ లో మీటింగ్ గురించీ, జ్యోతి ని అడిగి ఫొటోలు తీసుకొని(అప్పుడు నాకు కెమెరా కాని సెల్ కాని ఏవీ లేవు మరి) పోస్ట్ ఏదో నాకు తోచినట్లుగా రాసుకున్నాను.అప్పుడే ఎవరో కూడా ఫొటో పెట్టి పోస్ట్ వేసారు.అందులో కొత్త బ్లాగర్ ఎవరో సాహితి అట , ఆవిడ తన బ్లాగ్ పేరు చెప్పుకుంటూ తిరిగింది అని రాసారు.అది చదవగానే చాలా దుఃఖం వచ్చింది నేను డప్పు కొట్టుకున్నానా అని :( అది చాలదన్నట్లు కామెంట్స్ లో ఎవరో మలక్ పేట్ రౌడీ అట నేను పాతకాలం దాన్ని అందుకే మా వారి పేరు తగిలించుకున్నాను అని వెక్కిరించాడు.అసలే దుఃఖం లో ఉన్నానేమో ఇంకా ఉక్రోశం, ఆవేశం వచ్చేసాయి.అసలు ఇప్పుడే నన్నెవరన్నా పెద్దదాన్ని అంటే ఊరుకోను. మధ్య మా ట్రేనర్ కు కూడా స్పీచ్ ఇచ్చాను.అలాంటిది అప్పుడు ఊరుకుంటానా?ఏమనుకుంటున్నావు నువ్వు మలక్పేట్ రౌడీవవుతే , మా దగ్గర యూసుఫ్ గూడా రౌడీలున్నారు ఖబడ్దార్ అనేసాను.
ఇహ చూస్కోండి అన్ననే కాని చ్చేంత భయం.ముందు మా అబ్బాయేమంటాదో నని, రెండోది రౌడీ ఇంటిమీదికి వస్తాదేమోనని.మా ఏమండీ టైం కు వెళతారో, టైం కు వస్తారో తెలీదు.నెలలో మూడొంతులు కాంప్ లోనే ఉంటారు.కొడుకూ కోడలూ అంతే సమయం లేని ఉద్యోగాలు.ఇక ఇంట్లో ఉండేది నేనూ, పనమ్మాయి శారద 18 ఏళ్ళది, ఐదేళ్ళ మనవరాలు, మూడేళ్ళ మనవడూ!వాళ్ళిద్దరూ బుజ్జిపిల్లలు.వాళ్ళేమీ చేయలేరు.శారద నాకంటే ధైర్యస్తురాలే కాని రౌడీ నీ ఎదుర్కొనే ధైర్యం ఉందా అని.ఇంకో పనమ్మాయి సరస్వతి వచ్చిపోతూ ఉంటుంది.ఇద్దరినీ ఎందుకైనా మంచిదని మీకెవరైనా రౌడీలు తెలుసా అని అడిగాను.సరస్వతి నేను పని చేసే ఇంకో ఇల్లు పెద్ద రౌడీ దమ్మా, రోజూ పొద్దున్నే ఆయన దగ్గరకు చాలా మంది రౌడీలు వస్తుంటారూ , అయ్యకు చెప్పనా అంది.వద్దు అని,అయ్యబాబోయ్ ఇక సరస్వతి ని చూసినా భయమే!మా పక్క ఇల్లు విలన్ల డెన్. అదే లెండి సినిమాలోది.అక్కడ విల్లన్ల మీద షూటింగ్ అవుతూ ఉండేది అప్పట్లో.అంతా పెద్ద పెద్ద విలన్ల్ లాగా ఉండే వాళ్ళు.వాళ్ళల్లో ఎవరు రోడ్ మీద కనపడ్డా మా మనవరాలు , బామ్మా నీ రౌడీ వచ్చాడు అని అరిచేది. నా గుండె ఢాం.అసలు బాల్కనీ లోకి వెళ్ళటమే మానేసి,తలుపులు కూడా మూసేసాను.రెండు రోజుల తరువాత ఇక టెన్షన్ ఆపుకోవటం నా వల్ల కాలేదు.చిన్నగా మా అబ్బాయి తో "బాబా మీ ఫ్రెండ్ ప్రశాంత్ ఇంటిపక్కన ఒకతను సినిమాల్లో రౌడీ గా వేసేవాడు కదా ( క్షణం క్షణం సినిమాలో విలన్ పక్కన , విలన్ నర్సింగ్ అని పిలవ గానే వచ్చేవాడు అతను) అతను నిజంగా రౌడీనా"? అని అడిగాను.ఎందుకు మాతే అన్నాడు. పక్కనే ఉన్న మా కోడలు , అప్పటికే శారద, మా మనవరాలు తనకి చెప్పినట్లున్నారు, "ఏం కాదాంటీ. రౌడీ కూడా రౌడీ అని పేరు పెట్టుకోడు .భయపడకండి. మీ ఫ్రెండ్ జ్యోతి ని అడగండి.ఆవిడ చాలా ఏళ్ళ నుంచి బ్లాగ్ ల్లో ఉన్నారు కదా తెలిసి ఉంటుంది." అంది.ఇక తప్పక మా వాడికి సంగతి వివరించి ,నాలుగు చివాట్లు తిని, జ్యోతి ని అడిగాను అతనెవరు? అని.హోరినీ మీరది సీరియస్ గా తీసుకున్నారా? అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్.సరదాగా రౌడీ అని పేరు పెట్టుకున్నాడు.అసలు అతను ఇండియాలో ఉండడు.యు.యస్ లో ఉన్నాడు అంది.అమ్మయ్య అసలు దేశం లోనే ఉండడుకదా అని ఊపిరిపీల్చుకున్నాను. ఇదీ రౌడీ గారి తో భేటీ కథ.అప్పుడు ఎందుకు అంత భయపడ్డానా అని ఇప్పుడు నవ్వుకుంటాను.

ఆ తరువాత ఆ రౌడీ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు.నా పుట్టినరోజున పోన్ చేస్తే ఒక్క క్షణం పోల్చుకోలేకపోయాను.ఆ తరువాత చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము.అప్పుడే వాళ్ళ అమ్మగారి తో పాట వ్రాయించి , పాడించి నాకు బహుమతి గా ఇచ్చాడు.ఆ పాట ఎక్కదో దాచాను కూడా.ఆ తరువాత జ్యోతి పుట్టిన రోజు ప్లాన్ చేసి అందరి బ్లాగ్ లల్లో, జ్యోతి మీద పోస్ట్ వ్రాయించాము.ఆ రోజు కూడలి లో ఓపెన్ చేయగానే అన్నీ జ్యోతి మీద పోస్ట్ లే.ఎవరో కామెంట్ చేస్తే నాకు తెలీకుండా మా ఫ్రెంద్స్ ఇలా కూడలిని కబ్జా చేసారు అని సంజాయిషీ ఇచ్చుకుంది పాపం.ఆ తరువాత జ్ఞాప్రసూనగారింట్లో రౌడీగారి అమ్మగారిని కలిసాను.ఆవిడతో చెపితే, వాడంతేనండీ అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు.ఏమైనా అంటే గాంధారి కి ధుర్యోధనుడు పుట్ట్లేదు అలా అనుకో అంటాడు అన్నారు సీతాదేవిగారు, రౌడీ గారి అమ్మగారు.ఇద్దరమూ నవ్వుకున్నాము.ఇంతా చేస్తే ఆ రౌడీగారు మా అమ్మాయి వయసే :)

గెట్ టుగేదర్ తరువాత బ్లాగ్ ల్లో అబ్బాయిలు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సుజాత గారు యు.యస్ వెళుతూ ఇచ్చిన పార్టీ లో చాలా మందిని కలిసాను.అప్పుడప్పుడు జరిగి మా గెట్ టుగేదర్ ఫొటోలు ఇవి.

4 comments:

Lalitha said...

మిమ్మల్ని బ్లాగింగ్ తొలినాళ్లలో రాగింగ్ చేసినట్లున్నారు కదా - భలే వున్నాయి మీ రౌడీ కబుర్లు :)

Hima bindu said...

బాగున్నాయి మీ తొలినాటి భయాలు ;-)

మాలా కుమార్ said...

అలా అంటారా :) lalita gaaru.

మాలా కుమార్ said...

himabindu garu, thank you.