Monday, March 3, 2014

మా ఆయన బంగారం
ఈ నెల స్వప్న మాసపత్రిక లో నా కథ "మా ఆయన బంగారం" చదివి మీ అభిప్రాయం చెపుతారు కదూ :)రాత్రి 9 గంటలైంది.భోజనం కానిచ్చి టి.వి. పెట్టాడు అభిమన్యు.' టైంస్ నౌ ' చానల్ లో అర్ణబ్ గోస్వామి చెడుగుడు ఆడేస్తున్నాడు. వక్తలు పెద్ద పెద్దగా మాట్లాడేస్తున్నారు.కాసేపు వాళ్ళ గోడు విని పడక గదిలోకి వచ్చింది శశిరేఖ.పరదాలు పైకి వేసి, కిటికీ తలుపులు తీసి బయటకు చూపుసారించింది.రోడ్డంతా ఖాళీగా , నిశబ్ధంగా వుంది. గంటక్రితం పడ్డ వానలో మొక్కలన్నీ తడిసి ముద్దైనట్లున్నాయి, వీధి లైటు వెలుగులో మెరిసిపోతున్నాయి.పారిజాతం సువాసనలు సన్నగా గాలి లో తేలివస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. కొద్ది నిమిషాలు అలానే నిలబడి , లాప్టాప్ తీసింది. మేయిల్ చూసుకుంది. ఎవరైనా స్నేహితులు ఆన్ లైన్ వున్నారా అని చూసుకుంది. ఇంకా ఎవరూ వచ్చినట్లులేరు!యుట్యూబ్ ఇంకో టాబ్ లో తీసి, ఏపాట పెడదామా అని ఆలోచించి చాలా రోజులైంది విని అనుకొని ' జాణవులే . నెరజాణవులే ' పెట్టింది.
  
"ఆ ఆ  ఆ ఆ
 నెరజాణవులే వరవీణవులే కిలికించితాలలో ఆహహ్హా
జాణవులే మృదుపాణివిలే మధు సంతకాలలో  "
జిక్కి గొంతు మృదు మధురం గా సాగుతోంది. సిల్క్ స్మిత చాలా వయ్యారంగా నాట్యం చేస్తోంది. ఈ పాట ,దీనికి సిల్క్ స్మిత డాన్స్ శశికి చాలా ఇష్టం. ఇంతమంచి డాన్సర్ ఎందుకు క్లబ్ డాన్సర్ గా చేసిందా అని బాధపడుతూవుంటుంది.
ఆ పాటలో మునిగిపోయివున్న శశిరేఖ కు గట్టిగా 'వదులు ' అని వినిపించింది.వక్క క్షణం ఉలిక్కి పడింది.అదేమిటీ పాటలో బాలకృష్ణ అరిచాడా అనుకుంటూ చూస్తూ వుండగానే మళ్ళీ ఈ సారి ఇంకొంచం గట్టిగా "వదులు "అని వినిపించింది. అప్పుడు ఇది పాటలో నుంచి కాదు బయట నుంచి అని అర్ధమై , లేచి బయటకు చూసింది. తమ గేట్ కు ఎదురుగా , రోడ్ కు ఇంకోవైపు ఒక అబ్బాయి బైక్ మీద్ కూర్చొని , పక్కనే నిలబడి వున్న అమ్మాయి చేయి పట్టుకొని లాగుతున్నాడు. ఆ అమ్మాయి చేయి వదిలించుకొని పక్కకు వెళ్ళింది.  ఆ అబ్బాయి బైక్ మీద , ఆ అమ్మాయిని వెంబడిస్తూ ఆగు అని అరుస్తున్నాడు .  ఉలిక్కిపడి వారం రోజుల నుంచి తెగ సినిమాలు చూసి భ్రమ పడుతున్నానా అనుకుంటూ కళ్ళు నులుము కొని మళ్ళీ చూసింది శశిరేఖ .ఆ అమ్మాయి విస విసా  ఇంటి రోడ్ కు అవతలి వైపు నడుస్తోంది . ఆ అబ్బాయి ఆమెను ఆగు అని అరుస్తూ వెంబడిస్తున్నాడు . ఆ అమ్మాయి వెను తిరిగి నడిచింది . అతనూ బైక్ వెనక్కి తిప్పాడు . అలా ఇద్దరూ అటూ ఇటూ తిరిగారు . ఇంతలో అతను బైక్ ఆపి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు . ఆమె " వదులు . . . వదులు " అని గింజుకోసాగింది . ఏమైనా సినిమా షూటింగా అని చుట్టూ చూసింది . కెమెరాలు , లైట్ లు , మనుషులు ఎవరూ కనిపించలేదు . ఐతే ఈ సీను నిజం గానే నా కళ్ళెదుట జరుగుతోందన్నమాట అనుకొని ఏమి చేయాలో తోచక ఒక్క సెకను నిలబడి , లోపలి కి వెళ్ళి అభిమన్యు కు చెప్పింది.అర్ణబ్ గోస్వామి నుంచి బయటకొచ్చి , హడావిడిగా బయటకు వెళ్ళాడు. వెంటనే రెండేసి మెట్లకొకటి చొప్పున దిగితూ బయటకు పరిగెత్తాడు.అభిమన్యు అలా పరిగెత్తటము చూసి , అక్కడే సర్వెంట్ గది ముందు , పోర్టికోలో కూర్చొని వున్న పనమ్మాయి సావిత్రి కూడా అతని వెనుక పరిగెత్తింది.

అభిమన్యు  గబ గబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి చేయిని అతని నుంచి విడిపించి , ఆ అమ్మాయిని ఆయన వెనకే వెళ్ళిన సావిత్రికి వప్ప చెప్పి , అతనిని దబాయించటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ ఈ పరిణామం వూహించలేదేమో బిత్తర పోయారు . ఆ అమ్మాయిని సావిత్రి  గేట్ లోపలికి తీసుకొచ్చేసి గేట్ వేసేసింది .ఆ అబ్బాయి సారీ అంకుల్ తను అంటూ ఏదో చెప్పబోయాడు. అభిమన్యు వినిపించుకోకుండా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి అతను నీకు తెలుసా అని అడిగాడు.   అమ్మాయి గబగబా తల తిప్పింది. (తెలిసినట్లా..తెలియనట్లా..యేదీ తెలీకుండానా..)

 ఇంతలో పక్క ఫ్లాట్స్ ల వాచ్ మాన్ , సావిత్రి భర్త శ్రీనివాస్ వచ్చారు. వాడిని పట్టుకోండి , కట్టేసి పోలీసులను పిలుద్దాము అన్నాడు అభిమన్యు.అప్పటి వరకూ అంకుల్ . . . అంకుల్ అని ఏదో చెప్పబోతున్నవాడల్లా బైక్ ను ముందుకు పోనిచ్చాడు.

లోపలకు వచ్చిన అభిమన్యు నీపేరేమిటి అని అడిగాడు.సంధ్య అని చెప్పింది. ఎక్కడవుంటావు అన్నాడు. సంధ్య మాట్లాడలేదు. ఇంత రాత్రివేళ ఎక్కడ నుంచి వస్తున్నావు ? ఈపక్క సందులోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు.  దేనికీ సమాధానం చెప్ప కుండా తల వంచుకొని "నేనెళ్ళిపోతాను అంకుల్"అంది సంధ్య. ఎక్కడి కి వెళుతావు మీ ఇల్లెక్కడో చెప్పు వచ్చి దింపుతాను అన్నాడు.సంధ్య భయపడినట్లుగా చూసి మీరు వద్దంకుల్ నేను వెళ్ళిపోతాను అంది.సంధ్య ను పరికించి చూసి, సావిత్రీ ఈ అమ్మాయికి నీళ్ళివ్వు . కూర్చోబెట్టు, అని శశిరేఖ తో కార్ కీస్ తీసుకొని రా ఈ అమ్మాయిని ఇంట్లో దింపి వద్దాము అన్నాడు.
చెప్పులేసుకొని కార్ కీస్ తీసుకొని వచ్చింది శశిరేఖ .ఆ అమ్మాయి శశిరేఖను  చూడగానే " ఆంటీ మీరొద్దు ప్లీజ్ నేను వెళుతాను " అంది . ఆ అమ్మాయి ని చూస్తే 21 / 22 ఏళ్ళ అమ్మాయిలా వుంది . చాలా లేతగా సుకుమారంగా వుంది  లేత గులాబీ రంగు డ్రెస్ లో ముద్దుగా వుంది.బెదురు బెదురుగా చూస్తోంది. మధ్య మధ్య  చేయి వూదుకుంటోంది . చేయి ఎర్రగా కందిపోయింది . ఏం చదువుకుంటున్నవమ్మా  అని అడిగింది . నర్స్  ట్రైనింగ్ అవుతున్నానండి అంది . నువ్వెక్కడుంటావు అని అడిగింది . అక్కడే హాస్టల్ లో వుంటానండి . మా పేరెంట్స్ వైజాగ్ లో వుంటారు అంది .. ఇక్కడిదాకా ఎందుకు వచ్చావు ? అసలు ఆ అబ్బాయి ఎవరు ? గొడవేంటి అసలు అని అడిగితే రాంగ్ కాల్ వచ్చిందని అరుస్తున్నాడండి అంటుందే కాని ఆ అబ్బాయి తెలుసని కాని తెలీదు అని కాని చెప్పదు .
" ఫోన్ అంటూ వుంటే రాంగ్ కాల్స్ రాకుండా వుంటాయా ఏమిటి ? " అని సావిత్రి ఆశ్చర్యం .
ఆ అమ్మాయి చెప్పేదానికి ఒకదానికి ఒకటి కలవటం లేదు.మాములా కుచ్ గడ్ బిడ్ హై అనుకుంది శశిరేఖ. ఐనా చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్లను అలా వదిలేయలేరు.

బయటకు వెళ్ళిన అభిమన్యు చుట్టూ చూసాడు. ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు. పారిపోయాడని గ్రహించి, అక్కడే వున్న పక్క ఫ్లాట్స్ వాచ్ మాన్ ను "నువ్వు ఈ గొడవ చూసావా ?"అని అడిగాడు.
"చూసాను సార్. ముందు ఆ అమ్మాయి వచ్చింది.వెనకాల ఆపిల్లవాడు వచ్చాడు. ఆ అమ్మాయి చేయిబట్టి గుంజుతున్నాడు. చూసినా " అన్నాడు.
"మరి చూసి ఎందుకు వూరుకున్నావు ? అందరూ ఇట్లా మాట్లాడకుండా వూరుకోబట్టే కదా గొడవలవుతున్నాయి. అదే నీ చెల్లెలిని ఎవరైనా ఇట్లాగే ఏడిపిస్తూవుంటే వూరుకుంటావా ?"అని అడిగాడు.
అతను బుర్రగోక్కుంటూ "అవుననుకో సారూ " అని వూరుకున్నాడు.
లోపలి కి వచ్చి "ఆ రౌడీ వెళ్ళిపోయాడు. నీకేమీ భయం లేదు . నిన్ను ఇంటిదగ్గర దింపుతాము పదా "అన్నాడు అభిమన్యు.

శశిరేఖ సంధ్య వైపు పరిశీలనగా చూసింది. ఆమె మొహం లో ఇంతకు ముందు కనిపించిన బెదురులేదు. లీలగా కొంటెతనముందా అనిపించింది. ఏదో నిశ్చయించుకున్నదానిలా లేచి పదండి అంకుల్ అంది.

సంధ్య దారి చెపుతుంటే రెండు సందుల అవతల వున్న ఫ్లాట్స్ ముందు ఆపాడు . ఆ ఫ్లాట్స్ వాళ్ళ ఇంటికి దగ్గరే!దిగండి అంకుల్, ఆంటీ మీరూ రండి అంది సంధ్య. ఇక్కడా ? ఎక్కడో దూరాన వుంటున్న హాస్టల్ లో ఎక్కడో వుంటున్నానన్నదే అనుకుంటూ దిగింది శశిరేఖ. లిఫ్ట్ లో నాలుగో అంతస్తులో దిగారు. ఎదురుగా వున్న ఫ్లాట్ తాళం తీస్తూ రండి అని ఆహ్వానించింది.ఆశ్చర్యపోతూ ఇద్దరూ లోపలికి నడిచారు.లోపలికెళ్ళి గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.

ఎవరో బెల్ కొట్టారు. తలుపు తీసిన సంధ్యను రాసుకుంటూ బైక్ అబ్బాయి లోపలికి వచ్చాడు.అతడిని చూసి అభిమన్యు సోఫాలో నుంచి లేచి ఏదో అనబోయాడు.

"ప్లీజ్ అంకుల్ నామాట వినండి.నా పేరు సుధీర్ . నేను ఓ సాఫ్ట్వేర్ కంపనీలో పని చేస్తున్నాను.ఇది మా ఇల్లే. ఈమె నాభార్య." అంటూ నిస్త్రాణంగా సోఫాలో కూలబడ్డాడు.

సంధ్య వైపు ఆశ్చర్యంగా చూసారు అభిమన్యు, శశిరేఖ. అవునన్నట్లు తలాడించింది సంధ్య.

"మరి ఇదంతా ఏమిటి ?"కొంచం కోపంగా అడిగాదు అభిమన్యు.
"మిమ్మలిని ఇబ్బంది పెట్టినందుకు సారీ అంకుల్. మాకు ఈ మధ్యనే పెళ్ళైంది.కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను , ఎంతసేపు టార్గెట్స్ అంటాడు, ప్రాజెక్ట్స్ అంటాడు. ఎప్పుడూ ఆ లాప్ టాప్ ముందు కూర్చొని పనే పని. బయటకు వెళ్దామంటే రాడు. బిజీ, బిజీ . ఈ ప్ర్రాజెక్ట్ ఐపోనీ అంటాడు.ఈ రోజు పొద్దున ఆఫీస్ కు వెళ్ళేటప్పుడే చెప్పాను , కనీసం ఐస్క్రీం ఐనా తిని వద్దాము అని . చక్కగా తయారై ఎదురుచూస్తూవుంటే రావటమే ఆలస్యంగా వచ్చాడు. కనీసం నావైపు తిరిగి చూడను కూడా చూడలేదు.నేను అడుగుతే ఐస్క్రీం షాప్ నుంచి తెచ్చుకొని ఇంట్లో తినవచ్చుకదా అన్నాడు. నాకు వళ్ళుమండిపోయింది. అందుకే నేను ఇంట్లోంచివెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటకు వచ్చాను. ఇంకా నయం నా వెనుకే నన్ను బతిమిలాడుతూనైనా వచ్చాడు.ఆ కోపం లోనే మీరు అడిగినప్పుడు నాకు తెలీదు అని చెప్పాను "అంటూ ముద్దుగా మూతి తిప్పింది సంధ్య.

"రోలొచ్చి మద్దెలతో మొరబెట్టుకున్నట్లుంది. " అనుకుంటూ ఓరగా చూసింది శశి అభిమన్యు వైపు.

"సారీ అంకుల్ మిమ్మలిని ఇబ్బంది పెట్టాము. ఈ రోజులల్లో ఎదురుగా హత్య జరుగుతున్నా మనకెందుకులే అని చూసీ , చూడనట్లు వూరుకుంటున్నారు అందరు. కాని మీరు మాత్రం ఎవరో ముక్కూ మొహం తెలీని అమ్మాయిని ఓ రౌడీ ఇబ్బందిపెడుతున్నాడని , కాపాడాలని ప్రయత్నంచేసారు . యు ఆర్ వెరీ గ్రేట్ అంకుల్.మాలాంటివారందరమూ మిమ్మలిని చూసి నేర్చుకోవాలి . థాంక్ యు అంకుల్. "అన్నాడు సుధీర్ .
చిన్నగా తలపంకించాడు అభిమన్యు.ఇంక వెళతామన్నట్లు లేచాడు.
" ఆంటీ , అంకుల్ బోజనంచేసి వెళ్ళండి ."అంది సంధ్య.
“మాదైందమ్మా వస్తాము” అంది శశిరేఖ
కాఫీయైనా తాగమని బలవంతం చేసారు సుధీర్, సంధ్య.
కనీసం అప్పుడప్పుడైనా పనిలో నుంచి బయటకు వచ్చి భార్యను పట్టించుకోమని సుధీర్ కూ , కాస్త సద్దుకుపోయి, భర్తను ఏడిపిచకుండా వుండమని సంధ్యకూ పెద్దరికంగా బుద్దులు చెప్పి కాఫీ తాగి బయిలుదేరారు అభిమన్యు, శశిరేఖ.

డ్రైవ్ చేస్తున్న అభిమన్యు తో మనమీమధ్య మరీ 'తాయరమ్మా బంగారయ్యా ' ఐపోతున్నాము అంది శశిరేఖ.

"ఎవరు వాళ్ళు ?"

"ఓ సినిమా వుందిలెండి తాయారమ్మా బంగారయ్యా అని. వాళ్ళూ మనలాగే ఆపదలో వున్నవాళ్ళను కాపాడుతూ వుంటారు . సి. డి వచ్చిందేమో చూసి తెచ్చి మీకు చూపిస్తాను లెండి." అంటూ నవ్వింది.
"ఏమండీ "
"ఊ"
"మనమూ మిడ్ నైట్ ఐస్క్రీం తిని చాలా రోజులైంది . ఈ రోజు తిందామా ?"
ఏమీ జవాబివ్వకుండా గంభీరంగా డ్రైవ్ చేస్తున్న అభిమన్యు ను ఓసారి చూసి , హుం అనుకొని తల వెనకకు వాల్చి కళ్ళుమూసుకుంది.
కార్ ఆగగానే , ఇల్లోచ్చేసిందా అనుకుంటూ కళ్ళు తెరిచిన శశిరేఖకు , ఎదురుగా ఐస్క్రీం పార్లర్ కనిపించింది.

అనుకొంటాను కాని ఎంతైనా మా ఆయన బంగారం అనుకుంటూ మురిపెంగా అభిమన్యును చూసింది శశిరేఖ .

4 comments:

Unknown said...

బావుందండి radhika (nani)

smandalemula said...

నాకు తెలిసిపోయిందిగా ఈ కథ లో హీరో గారెవరో...:) కథగా బాగా రాసారు.

Unknown said...

పై కామెంట్ నాదేనండీ. చూసుకోకుండా మా వారి ఐడీ లోంచి రాసేసాను :)

మాలా కుమార్ said...

radhika garu , thanks anDi.

స్పురిత గారు ,

పై కామెంట్ చూసి ఎవరా అనుకున్నాను, మీరన్నమాట :) హీరో ఎవరో తెలిసిపోయిందా :)

థాంక్స్ ఫర్ ద కామెంట్ .