స్నేహితుల ప్రోత్సాహం తో కథలు వ్రాయటం మొదలు పెట్టి నాలుగు వ్రాసాను. అందులో వకటి విహంగ లో ప్రచురితమైంది . రెండో కథ ఎక్కడి కి పంపాలా అనుకుంటూ వుంటే ఆంధ్రభూమి కి పంపండి అన్నారు శ్రీలలిత గారు .
అమ్మో అంత పెద్ద పత్రికకే .అసలే ఈ మధ్య కథల పోటీ పెట్టారు వాళ్ళకే ప్రచురించాల్సిన కథలు చాలా వుంటాయి ఇంక నా కథేం చుస్తారు . ఐనా ముందు ముందే అంత పెద్ద పత్రికకు పంపి , వాళ్ళు వేసుకోకపోతే చాలా నిరాశ కలుగుతుంది అని అనుమాన పడ్డాను .
మీకెందుకు పంపండి ఎలా వేసుకోరో చూద్దాం . కాకపోతే కొంచం టైం పడుతుంది . కథ రాగానే మాలాంటి ఫ్రెండ్స్ మి మీకు కాల్ చేసి చెపుతాముగా అన్నారు:)
భయపడుతూనే పంపాను .
మొన్న సాయంకాలం మాజాంగ్ ఆడి వస్తూ వుండగా సెల్ రింగైంది. ఎవరా అని చూస్తే గ్లేర్ పడి పేరు కనిపించలేదు . చిన్నగా హలో ఎవరండి అన్నాను.
"రైటర్ మాలాకుమార్ గారి తో మాట్లాడవచ్చా ?"
ఓ క్షణం ఏమీ అర్ధం కాలేదు ! గొంతు తెలిసినట్లుగానే వుంది. బయట ట్రాఫిక్ చప్పుళ్ళలో తెలీటం లేదు .
"ఎవరండి?"
"నా పేరు శ్రీలలిత అండి .రైటర్ మాలాకుమార్ గారి తో మాట్లాడవచ్చా?"
" మీరా? ఏమిటండి పొద్దున పొద్దున్నే ఈ జోకులు :)"
"నేను మీకేమి చెప్పాను ? మీ కథ పబ్లిష్ కాగానే మాలాంటి ఫ్రెండ్స్ మి చెపుతాము అన్నానా:) ఆగస్ట్ నెల ఆంధ్రభూమి మంత్లీ లో మీ కథ వచ్చింది . కంగ్రాట్యులేషన్స్ ."
"నిజమా ? "
"ఆ. 53 వ పేజీలో వచ్చింది."
ఆశ్చర్యం !!!!!
పంపి నెలైందో లేదో అప్పుడే వచ్చేసింది!అదికాదు నా కథ భూమి లో వచ్చింది . ఎంత త్రిల్లింగా వుందో ! ఎంత ఎకసైటింగ్ గా వుందో!!!!!
ఇంటి కి వెళ్ళేసరి కి మా వారు భూమి తెప్పించారు . ఆ పేజ్ ఓపెన్ చేసి వుంచారు.
వావ్ ****** నా పేరు అచ్చులో ****** నా కథ అచ్చులో ******
నా ఎక్సైట్మెంట్ ను అందరికీ పంచాలికదా :)
కథలు వ్రాయమని పోరి, నా తో కథ వ్రాయించిన స్నేహితులు శ్రీలలిత గారికి , ఉమాదేవి గారికి , లక్ష్మి గారి కి చాలా చాలా థాంకూలు .
నా మొదటి కథ నే తమ పత్రిక లో ప్రచురించిన , ఆంధ్రభూమి సంపాదకులు ఏ. ఏస్ . లక్ష్మి గారి కి ధన్యవాదాలు .
ఇదీ నా కథ :)
దయచేసి
సారికారాజ్
తో మాట్లాడవచ్చా?
మాలాకుమార్
ఉదయాన్నే బాలకనీ
లో కూర్చొని భాస్కర్ పేపర్ చదువుతూ , కాఫీ
తాగుతున్నాడు .పక్కనే అనిత కుర్చీ రోడ్ వైపు కు తిప్పుకొని ఎదురుగా వున్న పార్క్ ,
పార్క్ లో వున్న చెట్టు మీది పిట్టలను , ఎదురుగా కరెంట్ తీగ మీద వున్న ఉడతనూ చూస్తూ
కాఫీ తాగుతూ మైమరచి వుంది .
కొద్ది క్షణాలు అన్నీ చూసి , ఆనందం తో "ఏమండీ
, కొత్త ఇల్లూ " అని ఏదో అనబోతున్నంతలో లోపలి నుంచి టెలిఫోన్ రింగ్ వినిపించింది
. ఫోన్ లో మాట్లాడటాని కి లేవబోతున్న భాస్కర్ తో "ఆగండాగండి , కొత్తా ఇల్లూ ,
కొత్త ఫోనూ . కొత్త ఫోన్ నేను చూస్తా నేనుచూస్తా " అంటూ ఉషారుగా లోపలికి పరిగెత్తి
ఫోన్ తీసి సుతారంగా "హలో " అంది .
అటు నుంచి చాలా
మర్యాదగా "ప్లీజ్ కెన్ ఐ స్పీక్ విత్ సారికారాజ్ ?" అన్నారు .
"సారీ రాంగ్
నంబర్ ."అని అతి మర్యాదగా జవాబిచ్చింది .
ఎవరూ అని అడిగిన
భాస్కర్ కు ఎవరో రాంగ్ నంబర్ అని ఐనా అదేమిటీ ముందుకుముందే రాంగ్ నంబర్ వచ్చిందీ అని
నిరాశపడిపోయి ,అంతలోనే పోనీలే అనుకుంది .ముందు ముందు జరగబోయే విపత్తును వూహించలేని
అనిత ప్రకృతి ఆరాధనలో మునిగిపోయింది .
***
పొద్దున్నే వంటపని
లో హడావిడిగా వుంది అనిత . టైమైపోతోంది . ఈ రోజింకా వంటకాలేదు .తొందరపడిపోతూ స్టవ్
మీద గిన్నె పెట్టి పోపేసింది . అందులో వంకాయలు వేయబోతుండగా ఫోన్ రింగైంది . భాస్కర్
చూస్తాడని ఆగింది .
కాని భాస్కర్ స్నానం చేస్తున్నాడేమో రాలేదు . ఇహ
తప్పక స్టవ్ కట్టేసి వెళ్ళింది .
ఫోన్ తీసి హలో
అనగానే "మేడం సారికారాజ్ తో మాట్లాడవచ్చా
?"అని మర్యాదగా ఎవరో అడిగారు .
"ఎందుకు
మాట్లాడకూడదు నాయనా బ్రహ్మాండం గా మాట్లాడవచ్చు . నువ్వెవరితో మాట్లాడుతే నాకేమిటి ? కాకపోతే మా ఇంట్లో సారికారాజ్
అని ఎవరూ లేరని ఇప్పటి కి ఈ నెలలో లక్షాతొంభైసార్లు
చెప్పి వుంటాను కాకపోతే నీ బుర్రకే ఎక్కటం లేదు .నా బుర్ర తింటున్నావు .ఇహ పెట్టేస్తావా
ఫోన్ ."
"సారీ మేడం
. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము ."అని ఫోన్ పెట్టేసారు .
"చీ పొద్దున్నే
పని అంతా పాడైపోయింది . ఎవరో ఈ మహా తల్లి ఈ నంబర్ ఎందుకిచ్చిందో "అని తిట్టుకుంటూ
వంట ఇంటిలోకి వెళ్ళింది .
***
ఏమిటో చూస్తుండగా
కాలం గడిచిపోతోంది . ఈ ఇంటి కి వచ్చి అప్పుడే ఐదు నెలలైపోయాయి అనుకుంటూ మిక్సీ లోనుంచి
మిరపండ్ళ కారం తీసింది.
చింతకాయ ముద్ద లో వేసి , మెంతిపిండి , ఇంగువ వేసి
బాగా కలిపి జాడీ కి ఎత్తి , గట్టిగా మూత పెట్టి చేతులు కడుక్కుంది .
"హూం ఈ ఏడాదికి చింతకాయ పచ్చడి పెట్టటమైంది
. ఏమిటో ఈ పచ్చళ్ళు లేకపోతే ముద్ద దిగదు . ఏడాదేడాది కి పచ్చళ్ళు పెట్టే వోపిక ఐపోతోంది
"అని స్వగతం గా అనుకుంటూ , నడుం రాసుకుంటూ , పనిలోపనిగా ఓ క్రోసిన్ మాత్ర వేసుకొని
వచ్చి మంచం మీద వాలింది అనిత . చాలా అలసటగా వుంది .
కళ్ళు మూసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే సరి అని
కళ్ళుమూసుకుంది .
"ట్రింగ్ . . . ట్రింగ్ " ఫోన్ మోత . లేవాలనిపించటంలేదు
. ఎవరో అవసరమైతే మళ్ళీ చేస్తారులే అని లేవలేదు . అది నిన్ను ఇలా వదలను అని ఆగి ఆగి
మోగుతూనే వుంది . "ఎవరు బాబూ ఈ జిడ్డుగాళ్ళు , కొంపదీసి అమ్మ కాదుకదా , నిన్న
వంట్లో బాగాలేదంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను . ఇప్పుడెలా వుందో ఏమో ,"అనుకుంటూ
గాభరాగా వెళ్ళి ఫోన్ ఎత్తింది .
"మేడం సారికారాజ్
తో మాట్లాడవచ్చా ప్లీజ్?"
"ఓరి దేవుడా
ఎవరు నాయనా ఈ సారికారాజ్ నాకు ఇట్లా తగులుకుంది . ఇక్కడ ఎవరూ సారికారాజ్ లేరు అని ఇప్పటి
కి ఐదు నెలలుగా మొత్తుకుంటున్నాను. ఐనా సమయం
సంధర్భం లేకుండా నాప్రాణాలు తీస్తున్నారు .
నాలుగు రోజులకోసారి కాల్ చేసి సారికారాజ్ వుందా అని అడుగుతారు . పెట్టేయ్ ఫోన్
ఇంకోసారి చేసావంటే నీ కాళ్ళిరగొడుతా "
"సారీ మేడం
" .
"ఈ సారీలకేమొచ్చెలే
. ఏమి చేసుకోను ఈ సారీలను కూరొండుకోనా ?అలమారాలో బధ్రంగా దాచుకోనా ? ఇంకోసారి నా దుంపతెంచకు
నాయనా నీకు పుణ్యం వుంటుంది .”
మూడు ఫోన్లూ
, ఆరు అరుపులుగా సారికారాజ్ ఫోన్ ల తో రోజులెళ్ళిపోతున్నాయి .
అవునూ ఏమిటీ ఈ మధ్య సారికారాజ్ కాల్ రాలేదు . ఓరినాయనో
ఇదేమిటీ రోజు రోజుకూ నాకూ ఈ సారికారాజ్ కూ
బంధం పెరిగిపోతోంది . ఇలా ఫోన్ రాలేదనుకుంటున్నాను .
భాస్కర్ కూడా
రోజూ రాగానే నీ ఫ్రెండ్ కాల్ వచ్చిందా అని వెళాకోళం చేస్తాడు హుం. . .
***
పిల్లలకు , భాస్కర్
కూ టిఫిన్ పెడుతోంది అనిత .
మనవడు అమ్మమ్మా నేను ఇడ్లీ తినను బ్రెడ్ ఇవ్వు అని
మారాం చేస్తుంటే వాడి ని బ్రెడ్ లేదురా ఈ పూటకు ఇడ్లీ తిను మా బాబువు కదూ అని బతిమిలాడుతోంది
.
" పోనీ
అమ్మా వాడి ని వదిలేయ్ . వాడికాకలేస్తే వాడే తింటాడు"అంటూ ఫోన్ రింగవుతుంటే వెళ్ళింది
హాసిని . ఫోన్ ఎత్తి "ఇక్కడెవరూ సారికారాజ్ లేరండి ."అంది .
"నీకూ నాకూ
తెల్లారిందీ ? ఇంకా ఫోన్ రాలేదెమిటా అని దిగులుపడిపోతున్నాను . తలుచుకుంటే తల కింద
ప్రత్యక్షం అయ్యావు తండ్రీ . మీ దుంపల్తెగ . నువ్వూ , నీ సారికా రాజ్ ఏడునెలలుగా ఏలినాటి శనిలా పట్టి పీడిస్తున్నారు కదరా .పిశాచాల్లా
పీడిస్తున్నార్రా . పోతార్రోయ్ నరకానికి పోతారు . వుత్తి పుణ్యాని కి నన్ను ఏడిపిస్తున్నందుకు
ఆ యముడు మిమ్మలిని వేడి వేడి నూనె లో వేసి వేయిస్తాడురా . మీ బొందబెట్టా. మీశ్రాద్దం
పెట్టా . మిమ్మలిని విరగదీసి పొయ్యిలో పెట్టా ." అని ఆవేశం తో వూగిపోతున్న అనిత ను కూర్చోబెట్టి
మంచినీళ్ళిచ్చింది హాసిని .
"అవును
డాడీ . అసలు ఆ ఫోన్ కట్ చేసి అమ్మకు సెల్ ఫోన్ కొని యివ్వు . పీడా వదులుతుంది . లేకపోతే
కంప్లేంట్ చేసి నంబర్ అన్నా మారిపించు . అసలు కోపమే ఎరుగని అమ్మ చూడు ఎంత కోపం తెచ్చుకుంటోందో
. లో బి.పి కాస్తా హై. బి.పి అయ్యింది . ఈ విషయమై ఏమైనా చేయాలి డాడీ."అంది హాసిని.
"నేనెప్పటి
నుంచో చెపుతున్ననమ్మా సెల్ ఫోన్ పెట్టుకో అని వినదు . అనవసరంగా ఖర్చు , నాకెవరు చేస్తారు
అమ్మ , హాసిని , చెల్లెలు గీత , ఆడపడుచు రాధ అంతే కదా . అంటుంది .ఈ ఫోన్ నా పేరు మీద
వుందని సెంటిమెంట్. కట్ చేయించవద్దు అంటుంది ."అన్నాడు భాస్కర్.
"అవునూ
ఈ ఫోన్ మీ పేరు మీద వుంది . ఫోన్ వచ్చిన మొదటి రోజే మొదటి కాల్ నే సారికారాజ్ ది. పైగా
రోజూ రాగానే సారికారాజ్ యోగక్షేమాలు అడుగుతారు .అంటే మీకు ఆ సారికా రాజ్ "అంటూ
భాస్కర్ వైపు అనుమానంగా చూసింది అనిత.
"ఏం పిచ్చి
పిచ్చిగా వుందా ఆ సారికారాజ్ ఎవరికో నేను నంబర్ ఇచ్చానా ? నేనిస్తే ఆ పిల్ల చేయాలి
కాని ఎవరో ఆ పిల్ల కోసం అడగటమేమిటి ?అని కోపం గా అరుస్తున్న భాస్కర్ ను చూసి భయపడిపోయింది
అనిత.
"వూరుకో
డాడీ ఏదో రాంగ్ కాల్ కోసం మీరిద్దరూ ఇలాపోట్లాడుకోవటమేమిటి ? "అని హాసిని ఆపింది .
పిల్లలిద్దరూ
అమ్మమ్మా తాత ల గొడవ చూసి బిక్కచచ్చిపోయారు . అందరూ ఆలోచనలో పడ్డారు .
భాస్కర్
"ఎల్లమ్మా "అని పనిమనిషిని పిలిచాడు ."నువ్వు మేము రాక ముందు ఇక్కడ
వున్న వారింట్లో కూడా పని చేసావు కదూ ?"
"అవును
సార్ ".
"వీళ్ళింట్లో
సారిక అని ఎవరి పేరైనా వుందా ?"
"లేదు సార్
. అమ్మ పేరు సరిత , ఇద్దరు అమ్మాయిల పేర్లు దివ్య , నవ్య."
"కింద ఎవరో
అద్దెకు వుండేవారు కదా వాళ్ళ ఇంట్లో ఎవరి పేరైనా సారిక నా ?"
"లేదు సార్
. ఆయమ్మ పేరు రేణుక "
మరి ఈ సారికా
రాజ్ ఎవరై వుటారు . అందరూ ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు .
హయ్యో రామచంద్రా
ఏమిచేయాలి ఈ ఫోన్ ను ? ఫోన్ ఎత్తిపట్టుకొని దాదాపు ఏడుస్తున్న గొంతుతో అంటున్న అనితను
చూసి సారికారాజ్ కోసమా అని సైగ చేసాడు భాస్కర్ .
నిశ్శబ్ధంగా
ఫోన్ అందించింది . అటు నుంచి "మేడం ప్లీజ్ కెనై స్పీక్ విత్ సారికా రాజ్
?"అని చాలా మర్యాదగా వినిపించింది .
అంతే "లుక్.
. . . . . . . . "రెచ్చిపోయాడు భాస్కర్ .
అటువైపు ఫోన్ పెట్టేసారు . ఆయాసపడుతున్న భాస్కర్
కు నీళ్ళందించింది అనిత .
"ఈ సారి సారికారాజ్ కాల్ వస్తే నువ్వు మాట్లాడకు
. నేనుంటే నాకిచ్చేయ్ ."అన్నాడు . సరే నని తల వూపింది .
***
"హేమండోయ్
మీరు ఆస్ బూస్ అని ఇంగిలిపీసులో అరిచేసరి కి వాడు భయపడిపోయినట్లున్నాడు . ఎంతైనా మొగవాళ్ళ
భయం వుండాలి . తొమ్మిది నెలల నుంచి నుంచి పిచ్చిదానిలా నేనెంత మొత్తుకున్నా వినలేదు
.ఇప్పుడు చూడండి ఆ ఫోన్ వచ్చి వారమైంది . ఏలినాటి శని వదిలింది ."
ముసిముసి గా
నవ్వుతూ టి.వి రిమోట్ అందుకున్నాడు భాస్కర్
.
***
"ఎక్స్
క్యూజిమీ మేడం ," వరండాలో ఎవరో అమ్మాయి నిలబడి పిలిచింది .
యస్ అంటూ బయటకు వెళ్ళింది అనిత.
ఆ అమ్మాయి "నా పేరు సారికారాజ్ "అంది
.ఉలిక్కిపడింది
అనిత .
ఏడాది గా వున్న బంధం . ఆత్మీయురాలిని చూసినట్లుగా
సంబర పడిపోయింది .
కూర్చోండి అని కుర్చీ చూపించింది .
"సారీ మేడం
.ఇంతకు ముందు మీ ఫోన్ నంబర్ మాది . మేము అమెరికా వెళుతూ ఫోన్ ఇచ్చేసాము . ఆ నంబర్ మీకు
వచ్చినట్లుంది . మేము వెళ్ళే ముందు నా పెళ్ళి కోసం బంగారం కొన్నాము . కొంత డబ్బులు
ఇవ్వాల్సి వుండింది . ఈ లోపల మా తాతయ్యకు వంట్లో బాగాలేకపోతే వూరెళ్ళాము . వెళుతూ మా
నాన్నగారి స్నేహితుడి కి ఆ డబ్బులు ఇచ్చి బంగారం కొట్లో కట్టేయమన్నాము . ఆయన కట్టలేదు
. మాకాసంగతి తెలీదు . సంవత్సరం తరువాత వారం క్రితమే ఇండియా కు వచ్చాము . బంగారం
కొట్టుకు వెళితే సంగతి తెలెసింది .మీకు కాల్ చేసి అడుగుతున్న సంగతి కూడా తెలిసింది
. సారీ మేడం మా మూలంగా మీకు చాలా ఇబ్బంది కలిగింది క్షమించండి ."అంది .
"పరవాలేదులే
అమ్మా "అని మొహమాటం గా అంది అనిత.
"వస్తాను
మేడం "అని వెళ్ళిపోయింది సారికారాజ్ .
"అమ్మయ్య
కథ సుఖాంతమైంది "అని నిట్టూర్చి , కుర్చీ కి ఆనుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది
అనిత.
"ట్రింగ్
. . . ట్రింగ్ . . . "
కుర్చీలో కళ్ళుమూసుకొని
కూర్చుండిపోయిన అనిత ఫోన్ శబ్ధానికి కళ్ళు తెరిచింది .
ఇహ నిశ్చింతగా ఫోన్ తీయవచ్చు భయం లేదు అనుకుంటూ ఫోన్
ఎత్తి సుతారంగా "హలో " అంది .
"మేడం దయచేసి సారికారాజ్ తో మాట్లాడవచ్చా?"
"ఇదేమిటి
మళ్ళీ ఈ సారికారాజ్ ఫోన్ ? ఐతే ఇందాక సారికారాజ్ వచ్చి సంజాయిషీ ఇచ్చింది కలా ? " అనుకుంటూవుండగానే మళ్ళీ చెవిలో రొద అటు నుంచి చాలా మర్యాదగా " మేడం సారికారాజ్ తో మాట్లాడవచ్చా
?"
27 comments:
మీ సంబరం అంబరం తాకినవేళ మా స్నేహాభినందనలు అందుకోండి.
రచయిత్రి గారికి అభినందనలు. కధ బాగుందండి.
కథ బావుంది పరిష్కారం కలలోనా!? అయ్యో అనిత గారు. :)
అభినందనలు మాల గారు.
కంగ్రాట్యులేషన్స్ అండీ!మీ కథ నేను భూమి లో చదివాను . బాగుంది . మీరేనని అనుకున్నా . బ్లాగు లో పేరు చూసుకొనే నేను సంతోషపడిపోయాను ,ఇక అచ్చులో పేరు చూసకుంటే చాలా సంతోషం కదూ !ఎంజాయ్ చేయండి .కానీ .ఈ విషయం మీరు చాలా ఆలస్యం గా చెబుతున్నారు,బ్లాగ్మిత్రులకు అన్యాయం కదండీ!నేను మాత్రం వ్యాఖ్య వెంటనే .పెట్టేస్తున్నాను .
కథ బాగుందండి.:)అభినందనలండి
bagundi malaagaru ,
vunnaraa ?? inko katha rayatam lo munigipoyyaraa?
chalaa santosham .andukondi abhinandanalu
ఉమాదేవి గారు అంతా ప్రొత్సాహమేనండి. థాంక్ యు.
*సుబ్రమణ్యంగారు,
అప్పుడే రచయిత్రిని చేసేసారా :) థాంక్ యు.
*వనజగారు,
అంతేనండి. ఇలాంటి వాటి కి ఇలలో పరిష్కారాలు దొరుకుతాయా:) థాంక్స్ అండి.
నాగరాణి గారు,
మీరు భూమిలోనే చదివేసి నాదనుకున్నారా ? వావ్ థాంక్ యు. ఆంధ్రభూమి ఎడిటర్ గారు వకవారం దాక బ్లాగ్ లో పెట్టవద్దు అన్నారండి. కావాలంటే కథ పబ్లిష్ అయ్యింది అని వ్రాయవచ్చు అన్నారు . రెండు సార్లు ఏమిరాస్తానులే అని, వారం అయ్యేదాకా రోజులు లెక్కపెట్టుకుంటూవుండి , ఈ రోజు పొద్దున్నే పోస్ట్ చేసానండి:)
అన్ నోన్ గారు థాంక్స్ అండి.
హృదయపూర్వక అభినందనలు రచయిత్రి మాలాకుమార్ గారు :-)) కథ బాగుందండీ సరదాగా...
Malaji,hearty congratulations and when r the celebrations?Nice story!expecting many more writings from you.
congratulations
ముందుగా అభినందనలు మాల గారు..
కధ సరదాగా సాగింది. లాస్ట్ లో ట్విస్ట్ ;)
లక్ష్మీ రాఘవ గారు ,
అప్పుడే ఇంకో కథా :) మీ ప్రొత్సాహానికి థాంక్స్ అండి.
వేణూ :) థాంక్ యు.
ఇందిర గారు,
మీరెప్పుడంటే అప్పుడే సెల్బ్రేట్ చేసుకుందాం :) థాంక్స్ అండి.
వంశీ థాంక్ యు.
రాజ్ ,
మీలాంటి మంచి కథకులకే నా కథ ట్విస్ట్ నచ్చిందంటే చాలా హాపీ :) థాంక్ యు.
అబ్బ! మీ తిట్లు విని అదే చదివి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నా! ఇల్లాలు కూడా అడిగింది ఏంటీ మీలో మీరే నవ్వుకుంటున్నారూ అని.
Congratulations Mala gaaruu.. :)
brilliant. and congratulations!
ఐతే మీ యింటికొస్తే సారీలతో కూరొండిపెడతారా? :)
అభినందనలు ,చాల బాగుంది .నిజానికి మీరెప్పుడో రచయిత్రి( బ్లాగు )అయ్యారు :)
కథ బావుందండీ......
హృదయపూర్వక అభినందనలు మాలాగారూ,
"నా కథ ఇదిగో ఇందులో పడిందంటూ.." ఇలాంటి టపాలు మీరు ఎన్నెన్నో వెయ్యాలని కోరుకుంటున్నాను.
అభినందనలు మాలాగారూ. కథ బావుంది.
మధురవాణి ,
థాంక్ యు.
నారాయణ స్వామి గారు,
అలాగే మీరు రండి మా ఇంటి కి , తప్పక వండిపెడుతాను :)
చిన్ని గారు ,
అలా అంటారా :) థాంక్ యు.
కష్టేఫలే గారు ,
నా కథ మిమ్మలిని అంతగా నవ్వించినందుకు చాలా సంతోషంగా వుందండి. థాంక్ యు .
బాల గారు థాంక్స్ అండి.
శ్రీలలిత గారు ,
మీ ప్రోత్సాహం వుంటే అలాగే రాద్ధాం :)థాంక్స్ అండి.
సిరిసిరిమువ్వగారు,
థాంక్స్ అండి.
Congrats Mala garu.. Kadha bavundi :)
అభినందనలు మాల గారు !! :) కథ బావుంది
శుభాభినందనలు మాలాగారూ
త్వరలో ఇంకా చాలా కధల గురించి చెప్పాలని కోరుతూ
psmlakshmi
medha garu,
hemalatha garu,
psm lakshmigaru,
thanks andi.
Post a Comment