
యుట్యూబ్ లో ఏవో పాటల కోసం వెతుకుతుంటే "దొంగరాముడు " సినిమా కనిపించింది . దొంగరాముడు చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను . సి.డి కోసం వెతికాను కూడా ! అప్పుడు దొరకలేదు . అనుకోకుండా ఇప్పుడు చేతికి చిక్కింది అనుకొని హాపీగా చూసేసాను :) అప్పుడే ఎందులోనో అన్నపూర్ణావారు సినిమాలు తీయబట్టి 60 సంవత్సరాలు అయ్యింది అని చదివాను . అంతే అన్నపూర్ణావారి సినిమాలు చూద్దామని కోరిక పుట్టింది . నెట్ లో వెతికితే ఇదో
ఈ లిస్ట్ దొరికింది . ఆ లిస్ట్ తీసుకొని కోటీ వెళ్ళి సి. డి షాప్ లో వెతికాను . " పెళ్ళీడు పిల్లలు " , " సుడిగుండాలు " తప్ప మిగితావన్నీ దొరికాయి . ఈ లిస్ట్ లో " పల్నాటి యుద్దం " కూడా వుంది కాని అది అన్నపూర్ణావారిది కాదు . మరి అన్నపూర్ణావారిది కూడా పల్నాటియుద్దం సినిమా వుందేమో మరి నాకైతే కనిపించలేదు ...
"దొంగరాముడు " చూస్తూవుంటే చాలా ముచ్చటగా అనిపించింది . ఏ. నాగేశ్వరరావు , సావిత్రి , జమున ఎంత చిన్నగా వున్నారో . పరిస్తితులు మనుషులను ఎలా దొంగ గా మారుస్తాయో చూపిస్తారు ఇందులో . నాకైతే తెగ నచ్చేసింది . హీరో పరిస్తితుల ప్రభావం తో దొంగ గా మారటము కాదు నచ్చింది , సినిమా నచ్చింది :)
శరత్ నవల " నిష్కృతి " ఆధారం గా నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం
" తోడికోడళ్ళు " . ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . . . . ఎవర్ గ్రీన్ సాంగ్ . . .
తెలిసీ తెలియని వయసు లో జరిగిన పెళ్ళికి , కట్టిన మాంగల్యానికి ఇచ్చిన విలువే
" మాంగల్య బలం ". నావరకు నాకైతే పాటలన్నీ సూపర్ హిట్ .
ఒకే పోలికల తో వున్న అజయ్ , విజయ్ వారి స్తానాలు మార్చుకొని , వారి ఇంటిని సరిదిద్దుకున్న , ఇద్దరు యువకుల కథే
" ఇద్దరు మితృలు ". ఆద్యంతమూ సరదాగా సాగిపోతుంది .
ముగ్గురు స్నేహితురాళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చెప్పే కథ
" చదువుకున్న అమ్మాయిలు ." తనను పెంచినవారి కోసం పాటుబడిన ఓ మంచి అమ్మాయి జీవితం లో సుఖ దుఖాల కథే
"వెలుగునీడలు ." కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన నవల " చక్రభ్రమణం " కు సినిమా రూపమే
" డాక్టర్ . చక్రవర్తి ." ఈర్శ , అసూయలు ఒక ముచ్చటైన దంపతులను ఎలా విడదీస్తాయో చూస్తూవుంటే చాలా బాధ కలుగుతుంది .
ఇద్దరు నాయికల మద్య అందమైన నాయకుడు . ఎక్కడా ? ఇంకెక్కడ
" ఆత్మగౌరవం " లో :)
తలితండ్రుల అదుపు , ఆప్యాయత ఎరుగని ఓ అబ్బాయి , తన స్నేహితురాలి సంతోషం కోసం ఓ హత్య చేస్తడు . పిల్లలకు కుటుంబం లో సరి ఐన ఆప్యాయత , క్రమశిక్షణ లేకపోతే ఎలా తయారవుతారు ? ఎలా అంటే ఇదో
" సుడిగుండాలు " లోని అబ్బాయి , అమ్మాయిలా .
హత్య చేసాడని జైలుకు వెళ్ళిన తండ్రి , నిరపరాధి అని నిరూపిస్తాడీ
"పూలరంగడు ." ఓ స్వాతంత్ర్య సమరయోధుని కొడుకు ఓ జవాన్ . అతను పెళ్ళిచేసుకో బోతున్న ప్రేయసి కార్ ఆక్సిడెంట్ లో చనిపోయింది . కాని ఆమె కొన్ని రోజుల తరువాత అతనికి ఓ గైడ్ గా కనిపించింది ! ఇదేమి వింత ! తెలుసుకోవాలని వుందికదూ ఐతే చూడండి
" జై జవాన్ ".
ప్రేమించి పెళ్ళి చేసుకోబోతూ , కాదనుకొని తనను పెంచిన మేనమామ కూతురిని పెళ్ళిచేసుకోవటానికి సిద్దపడ్తాడు హీరో గారు . ఎందుకంటే
" అమాయకురాలు " చూస్తే కాని తెలీదు !
ఓ జమిందారు కూతురు , పొగరుబోతు అమ్మాయి తనను ఏడిపించిన అబ్బాయికి బుద్ది చెప్పబోయి జీవితమే నాశనం చేసుకుంటుంది పాపం , యద్దనపూడి సులోచనారాణి నవల విజేత ఆధారం గా తీసిన
" విచిత్రబంధం " లో .
ఎంత చదువుకున్నా , ఎంత తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా అవసరం . ఈ సంగతే చెప్పారు , యద్దనపూడి సులోచనారాణి నవల " బంగారుకలలు " అధారం గా తీసిన
" బంగారుకలలు " సినిమాలో .
విభిన్న మనస్తత్వాలు కల ఇద్దరు అమ్మాయిలు వారి జీవితాన్ని ఎలా తిప్పుకున్నారో చెప్పే కథ , యద్దనపూడి సులోచనారాణి నవల "ప్రేమలేఖలు " ఆధారం గా తీసిన సినిమా
" ప్రేమలేఖలు ." అంతస్తుల భేధం ప్రేమికుల మద్య ఎడబాటును కలిగిస్తుంది . అవును వారు ఎంత ప్రేమించుకున్నా విడిపోకతప్పదు , యద్దనపూడి నవల " రాధాకృష్ణ " నవల ఆధారం గా తీసిన
" రాధాకృష్ణ " సినిమాలోలా !
"అమెరికా అబ్బాయి " పాపం ఏమయ్యడో ఏమో ! షాపువాడు పని చేయని సి.డి ఇచ్చి నన్ను సినిమా చూడనీయకుండా చేసాడు హుం !
గత ఆరు నెలలుగా వీలు చిక్కినప్పుడల్లా " అన్నపూర్ణావారి ఆణిముత్యాల " ను చూసాను. దొంగరాముడు లో నాగేశ్వరరావు బంగారు కలలు లో ఎంతా మారిపోయారో ! దొంగరాముడు లో " అందచందాల గడుసరివాడు విందు భోంచేయ వస్తాడు నేడు " , అని చక్కగా డాన్స్ చేసిన సావిత్రి కి , వెలుగునీడలు లో " చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టినరోజు " లో కదలలేక కదిలిన సావిత్రి కి ఏమాత్రం పోలికలేదు . నటనలో కాదు ఆకారం లో :) ఆ రోజులలో నటన మీద తప్ప ఆకారం మీద అంత శ్రద్ద పెట్టినట్లు లేరు . వాళ్ళు అసలు నటిస్తున్నట్లుగా లేదు . ఆ పాత్రలలో ఇమిడిపోయారు . అరే సూర్యకాంతం తోడికోడళ్ళు లో ఎంత బాగుంది . గయ్యాళితనం మటుకు మారలేదు :) పాపం రేలంగి కి ముందునుంచీ ఒకటే పర్సనాలిటీ . అన్ని సినిమాలల్లో పాత్రదారులనందరినీ ఆ ఆ పాత్రలకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసారు .
నటీ నటులకు తగ్గట్టు కథ ఎంపిక చేసారా ? కథకు తగ్గట్టు నటీ నటులను తీసుకున్నారా ? చెప్పటం కష్టమే ! అన్నీ చక్కటి కథా చిత్రాలే . కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . కుటుంబ సబ్యులకు మద్య వుండే అనురాగాలు , ఆప్యాయతలు , ఈర్శాద్వేషాలు బాగా చూపారు . ఎక్కువగా నవల ఆధారం గా , ఎక్కువగా యద్దనపూడి సులోచనారాణి నవలల ఆధారంగా తీసారు . దాదాపు చాలా వరకు మద్య తరగతి వారి కథలే .
40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా వుండేదో ఈ సినిమాలలో చూడవచ్చు . గండిపేట , కాలాపహాడ్ , నౌబత్ పహాడ్ , రిట్జ్ హోటల్ , నేను చదువుకున్న రెడ్డీవుమెన్స్ కాలేజ్ చూస్తూ వుంటే తప్పిపోయిన పిల్ల ను చూసినంత ఆనందం వేసింది . ఇప్పుడు ఆ పరిసరాలు చాలావరకు మారిపోయాయి . ఇప్పుడు గండిపేట అంత అందం గా ఎక్కడుంది ? కాలపహాడ్ , నౌబత్పహాడ్ లేనే లేవు . రూపు మార్చేసుకొని , బిర్లా మందిర్ , బిర్లా సానిటోరియం అయ్యాయి . అప్పట్లో కాలపహాడ్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించేది .
నటీ నటులు , కథలు , హైద్రాబాద్ పరిసరాలు బాగా చూపించటం సరే , చందమామను ఎంత అందముగా చూపారని ! బాల్కనీ , అందులో గుత్తులు గుత్తులు గా పూసిన మాలతీ తీగ , ఆకాశం లోని జాబిల్లి , ఆ బాల్కనీ లో పరవశించిపోయిన నాయికా , నాయకులు , ఎంత అందమైన దృశ్యం ! చందమామ పాట తో పాటు , దాదాపు ప్రతి సినిమాలోనూ దేశభక్తి గేయం కూడా తప్పకుండా వుంది .
అన్ని సినిమాలు చూడ చక్కగా వున్నాయి . ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఐనా కలర్ వి కూడా వున్నాయి . కొన్ని సినిమలైతే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత బాగున్నాయి . మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత వినసొంపైన పాటలు , మంచి కథలు తో హాయిగా ఆహ్లాదంగా సాగిపోయే సినిమాలే అన్నీనూ . పోట్లాటలు , కాట్లాటలు , రక్తపాతాలు , రౌడీయిజాలు , దయ్యాలు , భూతాల తో వున్న సినిమాలే కాని ఇంత చక్కటి కథా చిత్రాలు ఈ రోజులలో ఎందుకు తీయరో !