Tuesday, April 5, 2011

బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్ . . .



ఉదయమే కాఫీ గ్లాస్ తీసుకొని బాల్కనీ లోకి వచ్చాను . చల్లటి గాలి ఆహ్లాదం గా వుంది . ఎదురు పార్క్ లోని చెట్టు మీద పిట్టలు అల్లరి చేస్తూ గోల గోల గా కబుర్లు చెప్పుకుంటున్నాయి . పొద్దున్నే బుజ్జి పిట్టలు , బుల్లి పిట్టలు , పెద్ద పిట్టలు , రంగు రంగుల పిట్టలు ఇంటి చుట్టూ కిల కిలా రావాల తో సందడి చేస్తూ వుంటాయి . ఈ మద్య కోకిలమ్మ కూ . . . కుహూ రాగాలు వినిపిస్తూ వున్నాయి .పక్షుల కూతలను , నా కాఫీ నీ ఆస్వాదిస్తూ చిన్నగా తాగుతున్నాను . ఇంతలో ఎదురుగా వున్న కొబ్బరి కొమ్మ మీదికి ఓ పిట్ట రివ్వున వచ్చి వాలింది . బుజ్జి పిట్ట ముద్దు ముద్దు గా వుంది . కాని ఎందుకో పాపం తల వాల్చుకొని విచారం గా కూచునట్లు అనిపించింది ! దాని నే చూస్తూ వున్నాను . కొద్ది క్షణాల తరువాత ఇంకో పిట్ట వచ్చి దాని పక్కన కూర్చొని ముద్దు చేయసాగింది . భలే బాగున్నాయే పిట్టలు అనుకొని , గబ గబా లోపలికి వెళ్ళి నా కెమెరా తెచ్చుకున్నాను . వాటి ని ఫొటో తీద్దామని ఆంగిల్ సరి చూసుకుంటున్నాను . ఏమైందో ఏమో మొదటి పిట్ట రెండో దాన్ని తప్పించుకొని ,పక్క కొమ్మ మీద వాలింది . ఇప్పుడు తలవాల్చుకొని కూర్చోవటము దాని వంతైంది ! నేను కెమెరా ఆంగిల్ సరి చూసుకు నే సరికి ఇదో ఇలా ఎడమొహం , పెడమొహం పెట్టేసాయి అవి :)



కొద్దిసేపైనాక రెండో పిట్ట ఏమనుకుందో ఏమో మొదటి పిట్ట దగ్గరకు వచ్చింది .
' అలిగితివ ప్రియా సఖీ " అని పాడుతోందో
లేక
" అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు " అని పాడుతోందో అనే వూహ వచ్చింది :)
అప్పుడైనా ఓ ఫొటో తీసుకుందా మనుకున్నాను . అబ్బే ఏదైనా మన దగ్గర కుదరదు అని ఆ పిట్ట అక్కడి నుంచీ వెళ్ళిపోయి , ముందున్న కరెంట్ వైర్ మీద కూర్చుంది !


నాతో పాటు ఇంకో ప్రేక్షకు రాలు కూడా , పక్కింటి వాళ్ళ బోగన్ విల్లా చెట్టుమీద వుందని గమనించాను . పోనీ దాన్నైనా ఫొటో తీద్దామనుకుంటే ఆ ఉడత కాస్తా ఉడతా ఉడతా ఊచ్ . . . ఊచ్ . . . మని పారిపోయింది !

కా సేపు ఆ రెండు పిట్టలనూ చూసి , ఇప్పట్లో అవి సంజోతా చేసుకునేలా లేవనుకొని , నాఖాళీ కాఫీ గ్లాస్ వెనక పెట్టేద్దామని , వెనుక బాల్కనీ లోకి వెళ్ళాను . అక్కడ బాదం చెట్టు నీడలో పావురాయి జంట ముద్దూ ముచ్చట్ల లో కనిపించాయి ! వావ్ . . . పోనీ వీటిని ఫొటో తీద్దాం అనుకొని కెమారా తెచుకొని చూస్తే ఏముందీ ? ఇక్కడా అదే తంతు :) హుం . . . . .



మద్యాహ్నం మైతే బాదం చెట్టు నిడా పక్షులు సేదతీరుతూ వుంటాయి . అలా చెట్టంతా ఆక్రమించుకొని వున్న పిట్టలను ఫొటో తీయాలని ఎన్ని సార్లు ప్రయత్నించానో ! నా చేతిలో కెమేరాను ఓ కొంటె కోణంగి చూసి తుర్రు మంటుంది . అంతే దాని వెనకాలే అన్ని రెక్కలు టపటప లాడించుకుంటూ లేచి వెళ్ళిపోతాయి . మిమ్మలిని గన్ తో షూట్ చేయటం లేదే బుజ్జి తల్లులూ , ఇది కెమేరా అని ఎంత వేడుకున్నా వినవు ! విశ్రాంతి తీసుకుంటున్న వాటికి అంతరాయం కలిగించటము ఎందుకులే అని వూరుకుంటున్నాను . అంతే గా ? ఇంకేమి చేయగలను ?

ఈ బుజ్జి పిట్టలను చూస్తుంటే చిన్నప్పుడు పాడుకున్నపాట ,
బుర్రు బుర్రు పిట్ట తుర్ర్ మన్నది ,
పడమటింటి కాపురమ్ము చేయనన్నది ,
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది ,
మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది ,
మొగుడి చేత మొట్టికాయ తింటనన్నది !!!!!
అన్న పాట గుర్తొచ్చింది :)))))

8 comments:

మనసు పలికే said...

హహ్హహ్హా.. మాలా కుమార్ గారూ భలే ఉన్నాయి మీ పిట్టల కబుర్లు. నాకైతే మా ఇల్లు గుర్తొచ్చింది మీ కొబ్బరి చెట్లు, బాదం చెట్లు వాటి మీద పిట్టలు చూస్తుంటే.. చాలా బాగుంది టపా.. చిన్నప్పటి పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలు :)

లలిత (తెలుగు4కిడ్స్) said...

ఈ పిట్టలేంటో ఫోటోలో పట్టుకుందామంటే కూడా పారిపోతాయి.
చక్కటి కిల కిలారావాలు, అటూ ఇటూ ఎగిరే పిట్టలూ ఎంత అందంగా ఉంటాయో.
చెట్టు మీద వాలాయి అని ఫోటో తీద్దామనుకునే లోపల ఎగిరిపోతున్నాయి.
మీ ఫోటో వ్యాఖ్యానం బావుంది. నేను ఎప్పుడు పట్టగలుగుతానో ....

Sravya V said...

హ హ హ భలే ఉన్నాయి మీ పిట్టల కబుర్లు.

చెప్పాలంటే...... said...

మాలా కుమార్ గారూ భలే ఉన్నాయి మీ పిట్టల కబుర్లు. .. చాలా బాగుంది టపా

రుక్మిణిదేవి said...

chaalaa baagundandi... memu monnee madhya hyd vachhinappudu maa maridhi vaallintlo chuttuprakkala paavuraala sandadi... ippudu mee bloglo pittala sandadi.... saradaagaa wundi..

మాలా కుమార్ said...

మనసు పలికే ,
నా టపా నచ్చినందుకు థాక్ యు .

లలిత గారు ,
అంతే నండి కెమేరా తేగానే తుర్ర్ మంటాయి . ఈ ఫొటోలు అతి కష్టం మీద తీయగలిగాను :)

మాలా కుమార్ said...

శ్రావ్య ,
థాంక్ యు .
చెప్పలంటే గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

రుక్మిణి గారు ,
మీకు మా పిట్టల సందడి నచ్చినందుకు ధన్యవాదాలండి .