
మాఏమండీ గారు , రాజమండ్రి పని మీద వెళుతున్నాను వస్తావా ? అని అడగ్గానే సరే సరే అని ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను . కాని మీకు పని వుందన్నారు ఎంతసేపో అని అనుమానం వెలిబుచ్చితే , అదెంత సేపులే , ఓ గంట లో ఐపోతుంది , ఆ తరువాత ఐ విల్ బి అట్ యువర్ సర్వీస్ . అని వాగ్దానం చేసేసారు . రాజమండ్రి ఎన్ని సార్లు వెళ్ళినా , పూర్తిగా చూడ లేదు , పోయినసారి గుళ్ళూ గోపురాలు చూపించారు , ఈ సారి కోనసీమ సైట్ సీయింగ్ కెళుదాము అనగానే , నీ ఇష్టం ఒక గంట లో నా పని పూర్తికాగానే , నువ్వెన్ని రోజులన్నా , ఎక్కడికన్నా నేను రెడి .అనేసారు అహా ఏమి నాభాగ్యమూ అని పాడుకుంటూ , నేను రాజమండ్రి వెళుతున్నానోచ్ అని వూరూ వాడా చాటింపేసి కార్ ఎక్కాను .
పొద్దున బ్రేక్ ఫాస్ట్ కాగానే , ఓ గంటలో వచ్చేస్తాను , రెడీ గా వుండు అన్నారు మావారు . ఈ లోపల నువ్వు రెండు నవల్స్ తెచ్చుకున్నావుకదా , అవి చదువు , ఇక్కడి నుండి గోదావరి ని చూడు అని సలహా ఇచ్చారు . గంట అంటే , నేను రెండు నవలలు చదివేంత సేపా ? రెండు నవలలేం ఖర్మ , స్వాతి కూడా తెచ్చుకున్నాను అన్నాను . మరింకేం, ఓ గంటలో రాగానే ఐ విల్ బి ఎట్ యువర్ సర్వీస్ మేడం అంటూ వెళ్ళి పోయిన మనిషి , సాయంకాలం ఏడు గంటలకు వచ్చారు . రాగానే సినిమా చూస్తావా ? అంటూ పక్కనున్న అసిస్టెంట్ తో ఏం సినినా బాబూ అది , ఏం మాయచేసావోకాని కదా , పద పద అని హడావిడిగా , నన్ను ఇంకో మాట మాట్లాడ నీయకుండా తీసుకెళ్ళారు . హుం వెళ్ళిన కాసేపటికే ఇంటర్ వెల్ !!! నేనొప్పుకోను నేనొప్పుకోను అంటున్నావా అని ఓ జోక్ . ఏమన్నా ఏం లాభం ?? తిరిగొచ్చేటప్పుడు , మహేష్ మనము వెళ్ళిన సినిమా హాల్ పేరేమిటి ? అని డ్రైవర్ ని అడుగుతే ఏమో మేడం అని చాలా వినయంగా జవాబిచ్చాడు .
పొద్దుటి నుండి మల్లాది నవల , ఎంతేంత దూరం చదువుతూ , మద్య మద్య లో గోదావరిని తీసిన ఫొటోలు ఇదిగో ఇవి .ఆ నవల కూడా పూర్తిగా చదివేసానకోండి

మరునాడు పొద్దున షరా మామూలే !! ఓ గంటలో వచ్చేస్తాగా , రాగానే ఐ విల్ బి ఏట్ యువర్ సర్వీస్ . అప్పటిదాకా ఇంకో నవల చదివేయి . ఇంచక్కా గోదావరిని చూస్తూ వుండు . గోదావరినా ? అసలు ఇక్కడి నుండి కనిపిస్తోందా అని ఉక్రోషం గా అన్నాను . మాట్ల్లడకుండ వెళ్ళి , ఐదు నిమిషాలలో వచ్చేసారు . వచ్చేసారా అని ఆనందం ప్రకటించేలోపలే , పద పద అన్నారు . ఎక్కడికి అంటే చెప్తాగా పద అన్నారు . వెనుకాలే బాయ్ లగేజ్ తీసుకొని వస్తోంటే , ఏమిటీ అంటే పెద్ద సస్పెన్ మేంటేన్ చేస్తూ లిఫ్ట్ లో పై ఫ్లోర్ కు తీసుకెళ్ళారు . ఇదో చూడు , ఈ ఫోర్ నాట్ వన్ రూం నుండి , గోదావరి వ్యూ ఎంతబాగుందో అన్నారు . మరి త్రీటెన్ నుండి గోదావరి వ్యూ సరిగ్గా లేదన్నావు కదా అందుకే రూం మారిపించాను . ఏమిటీ నా మొహం అలా చూస్తున్నావు ? అన్నారు . ఏం లేదండి , మిస్టర్ పెళ్ళాం లో ఆమనిని బురిడీ కొట్టించిన రాజేంద్ర ప్రసాద్ , మీ మొహం లో కనిపిస్తున్నాడు అన్నాను . సరె సరె లే ఓగంట లో వస్తాను రాగానే . . . ఒకే వెళ్ళిరండి అని పంపించి , "నమ్మరాదే చెలి ఈ మగవరిని నమ్మరాదే చెలి" అని ఆమని పాటి కూనిరాగాలు తీస్తూ, వల్లూరి లక్ష్మి రాసిన అనూహ్య తీరాలు నవల చదువుతూ మధ్య మధ్య లో గోదావరిని చూస్తూ తీసిన ఫొటోలు ఇవి !!!

త్రీ టెన్ రూం నుండి , ఫౌర్ నాట్ వన్ రూం నిండి గోదావరి ని ఇంకా చాలా ఫొటోలే తీసాను . అన్ని పెడితే నా బ్లాగ్ గోదాట్లో మునిగి పోతుందేమో ననే భయం తో అన్నీ పెట్టటము లేదు .
ఏమండీ , సాయంకాలము వస్తూనే సారీ మాలా రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళాలి .అనుకోకుండా డైరెక్టర్ గారి తో మీటింగ్ వచ్చింది . నెక్స్ట్ వీక్ వద్దాము . అప్పుడు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు వుందాము . కోనసీమ అంతా తిగుదాము . ఈ పని కాగానే ఐ విల్ బి . . .
అవునులెండి , యూఅర్ ఆల్ వేస్ ఎట్ మై సర్వీసే . ఇహ చేసేదేముంది ? పదండి పోదాం . . . . .
ఇంకేముంది ? ఇహ ఇంతేసంగతులు చలో హైదరాబాద్ .