Showing posts with label సాంప్రదాయాలు. Show all posts
Showing posts with label సాంప్రదాయాలు. Show all posts

Sunday, July 17, 2022

భాగ్యలక్ష్మి దేవాలయము -చార్మినార్

భాగ్యలక్ష్మి దేవాలయము చార్మినార్ నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. బోనాలజాతర సంధర్భంగా మనము దర్శిస్తున్న అమ్మవారి దేవాలయాలలో ఈ రోజు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాము రండి. ఈ దేవాలయము ఎప్పుడు వెలిసినది అన్నదానికి వివిధకథలు వినిపిస్తున్నాయి. ఓసారి చార్మీనార్ దగ్గరికి అమ్మవారు నడుచుకుంటూ వస్తే అక్కడి కాపలావారు ఆవిడను అడ్డగించారు. దేవి తనగురించి చెబితే రాజానుమతి తీసుకొని వస్తామనీ, అప్పటి వరకూ అక్కడే ఉండమని ఆ కాపలాదారు లోపలికి వెళ్ళి రాజుతో చెప్పాడు. అప్పుడు రాజుకు ఆ వచ్చింది అమ్మవారేనని అనిపించి, కాపలాదారు వెళ్ళకపోతే ఆవిడ ఇక అక్కడే ఉండిపోతుందని అనుకొని అతనిని వెళ్ళవద్దంటాడు. దానితో ఆ దేవి అక్కడే ఉండిపోయిందట. “ఇక్కడ వందల ఏళ్ల నుంచీ అక్కడ పూజలు జరుగుతున్నాయి. కాకపోతే గుడి ఉండేది కాదు. అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా, బొడ్రాయి రూపంలో ఉండేది. 1979 లో వక బస్ డ్రైవర్ ఆ రాయిని ఢీకొట్టాడు. అది ప్రమాదవశాత్తు జరిగింద లేక కావాలని చేశారా అనే గొడవ నడిచింది. అప్పుడు చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రి. ఆయనే అప్పుడు అక్కడ ఒక గుడిలా కట్టడానికి సహకరించారు. అప్పట్లో ఆ గుడి పూజారి కర్ఫ్యూలో కూడా పూజలకు వెళ్లేవారు. శుక్రవారం పూట మధ్యాహ్నం 12 గంటల నమాజు సమయంలో ఆయన హారతి గంట కొట్టకుండా పోలీసులు ఆ గంట పట్టుకుని కూర్చునేవారు. పగిలిన రాయిని పూజించకూడదు కాబట్టి ఒక పటం పెట్టి పూజించేవారనీ, ఆ తరువాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసారనీ, విగ్రహము పాదాల దగ్గర రెండు వెండితొడుగుల కింద ఆ రాయి ముక్కలను ఉంచారనీ అక్కడి పూజారులు చెపుతారు. ఇంకా ఈ దేవాలయము గురించి ఉన్న చాలా కథలు, ఈ దేవాలయము గురించిన పరిశోధనల పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు గూగులమ్మను అడుగుతే చెపుతుంది. బోనాల చివరిరోజున అమ్మవారి రథయాత్ర ఇక్కడ నుంచి సాగుతుంది. ఇందులోని పాట మా అమ్మమ్మ కీ|శే|శ్రీమతి. వరలక్ష్మమ్మగారు దాదాపు నలభైయాభై సంవత్సరాల క్రితం పాడినది. ఇదండీ ఈనాటి మనదేవాలయ దర్శనము. వచ్చేవారం మరో దేవాలయ దర్శనములో కలుసుకుందాము. నా పోస్ట్ లను శ్రద్దగా వింటున్న మితృలకు ధన్యవాదాలతో సెలవు. నమస్తే. https://www.youtube.com/watch?v=E4LQ1DUJIgs

Thursday, November 11, 2021

ఏమని పొగుడుదునే

Shorts హరిహరులకు ప్రియమైన ఈ కార్తీకమాసమున వెంకటేశునికి ఇష్టమైన అన్నమయ్య గీతాలను, సుందరం, కోమలమైనా ఈ పుష్పాలతో తలుచుకొని నమస్కరించుకుందాం 🙏 https://youtube.com/shorts/Gt5POfvhmuE?feature=share

Thursday, September 9, 2021

#Telugu Audio Book| Blog kathalu EP:O2 Ganapatibaabaa ku modam modakam...

నా వినాయకచవితి స్పెషల్- గణపతిబాబాకు మోదం మోదకం ఈ లింక్ లో వినండి. ఇందులోని వినాయకుని మూర్తిలను చేసింది మా అమ్మాయి సంజ్యోత్, మనవరాలు అదితి. మీ ఇష్టం మరి. వీడియో చేసింది, మోదక్ లు చేసింది నేనే :) అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

Thursday, August 26, 2021

saampradaayaalu వరలక్ష్మీ నమోస్థుతే Telugu Audio Books - telugu kathalu...

వీడియో చేయటము నేర్చుకుంటున్నాను. అమ్మవారిని ఈ విధముగనైనా సేవించుకుందామని మా వాళ్ళు అందరూ పూజించిన అమ్మవారి రూపాలను తీసుకొని చేసాను. కొంచము ఎడిటింగ్ సరిగ్గా రాలేదు. నేపధ్యగానం పార్వతి, DR.బిందు.

Wednesday, April 10, 2019

గజరాజులు విచ్చేసెన్ :)


గజరాజులు విచ్చేసెన్ :)


నాకు ఏనుగు కొనుక్కోవాలనే కోరిక ఇప్పటిది కాదు.అదో అల్లప్పుడెప్పుడో సిలిగురి లో ఉన్నప్పుడు, ఓరొజు అడవి గుండా వెళుతుండగా ,సడన్ గా మా డ్రైవర్ జీప్ ఆపేసాడు.ఎందుకా అని అనుకుంటుండగా ఓ పెద్ద ఏనుగు, దానిని ఆనుకొని ఓ బుజ్జి ఏనుగు రోడ్ మీద మందగమనం తో తాఫీగా వెళుతూ కనిపించాయి.అవి రోడ్ దాటి,అడవిలోకి వెళ్ళేదాకా డ్రైవర్ జీప్ ఇంజన్ కూడా శబ్దం కాకుండా ఆపేసాడు.అవి లోపలి కి వెళ్ళిపోయాక అమ్మయ్య అని బయిలుదేరాడు.ఆ బుజ్జి ఏనుగు ఎంత ముద్దొచ్చేసిందో!అదో అప్పటి నుంచి నాకు ఏనుగుల మీద ప్రేమ పుట్టేసింది.దానికి తగ్గట్టు మా ఏమండీ ఆర్డర్లీ వెంకటేశం పొద్దున్నే వచ్చి,మా ఏమండీ ఆఫీస్ కు వెళ్ళాక,నేనిచ్చిన కాఫీ తాగుతూ,అతను ఆంధ్రాసైడ్ నుంచి వచ్చాడు.కుటుంబం అక్కడే ఉంది.ఇక్కడ లంగర్ లో ఇచ్చే టీ నచ్చేది కాదు అందుకని నేను కాఫీ ఇస్తే మహా ఎంజాయ్ చేస్తూ, తాగుతూ అంతకు ముందు రోజు యూనిట్ దగ్గర ఏనుగులు చేసిన అల్లరి కథలు కథలుగా చెప్పేవాడు.ఓ సారి సెంట్రీ వళ్ళో అరటిపండ్లు పెట్టుకొని ఒకటొకటే తిందామని ఒకటి వలిచి నోట్లో పెట్టుకోబోతే వెనక నుంచి ఎవరో గుంజేసుకున్నారట.ఎవరోలే అనుకొని ఇంకోటి వలుస్తే అదీ గుంజేసుకున్నారట.ఇలా మూడు అయ్యేసరికి కౌన్ బే అని కోపంగా వెనక్కి తిరుగుతే ఓ ఏనుగు పిల్ల ఉందిట. అంతే అతను అరటిపళ్ళు అక్కడేపడేసి పరుగోపరుగు.ఏనుగు పిల్లకే భయమా అంటే పిల్లను చూస్తే భయం కాదుట అది అరిస్తే ఏనుగుల మంద వచ్చిపడతాయట.అలా రోజొక కథ చెప్పేవాడు.దానితో ఏనుగుల మీద ప్రేమ ఇంతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయి ఓ ఏనుగు కొనుక్కుందామండీ అని రోజూ మా ఏమండీని పోరేదానిని.మా ఏమండీ ఏమో నన్ను ఎగాదిగా చూసి ఏనుగంటే ఏమనుకుంటున్నావు?అందులోనూ అడవి ఏనుగు నిన్నూ నన్నూ ఎత్తి అవతలపారేస్తుంది అని కోపం చేసేవారు.ఏమిటో పెళ్ళాం కోరిక కొంచమైనా అర్ధం చేసుకోరు  :(  ఐనా నా పోరు పడలేక రెండు కుందేళ్ళు తెచ్చి ఇవి పెంచుకో అన్నారు.ఆ తరువాత అరణ్యవాసం నుంచి జనావాసం లోకి వచ్చాక ఏనుగుల కోరిక మరుగున పడిపోయింది.
మళ్ళీ ఈ మధ్య యోగా నేర్చుకుందామని ఓ యోగా టీచర్ ఇంటికి వెళితే అక్కడ గేట్ దగ్గరే , ఎర్రకోట ఏనుగు ఠీవీ గా కనిపించేసరికి ఏనుగు కోరిక పురి విప్పింది.దానికి తగ్గట్టు రోజూ క్లబ్ కు వెళ్ళేటప్పుడు ఏఓసీ సెంటర్ దగ్గర ఓ పెద్ద నల్ల ఏనుగు బొమ్మ నన్ను చూడు నా అందం చూడు అన్నట్లు తొండమెత్తి దర్జాగా ఊరిస్తోంది.మళ్ళీ ఏమండీ ఏనుగు కావాలీ అంటే వినిపించుకోరే! ఇట్లా కాదని డిసెంబర్ లో మా కోడలు వచ్చినప్పుడు నా ఏనుగు కోరిక చెప్పాను."ఏనుగు ను పెంచుకుంటారా ఆంటీ?అసలు దానిని ఎక్కడ పెడుతారు?" అని గాభరా పడిపోయింది."నిజం ఏనుగు కాదులే అనూ,ఎర్ర కోట ఏనుగు.మన మెట్ల దగ్గర పెడితే ఎంత ఠీవిగా బాగుంటుందో"అని ఊహల్లోకి వెళ్ళిపోయాను."ఓ ఎర్రకోట ఏనుగా ఐతే కొందాము లెండి."అని ఊపిరి పీల్చుకుంది.ఆ తరువాత ఇద్దరమూ కలిసి రోడ్ పక్కన మట్టిబొమ్మలు అమ్మేవాళ్ళ దగ్గర వెతికాము కాని దొరకలే.ఈ సారి వచ్చినప్పుడు ఇంకా వెతికి కొనిస్తానులెండి ఆంటీ అని ప్రామిస్ చేసి వెళ్ళిపోయింది.ఇంతలో సందట్లో సడేమియాలా మా డ్రైవర్ మేడం మీ ఏనుగుల మీద నా పిల్లలు ఎక్కి ఆడుకుంటారు."అని సంబరపడిపోయాడు."అని బాంబ్ పేల్చాడు.బాగుంది సంబడం :(
ఇదిలా ఉండగా మా పిన్ని నీ అమ్మవారి పక్కన పెట్టేందుకు రెండు ఏనుగు బొమ్మలు కొన్నాను అని మా తమ్ముడితో పంపింది.ఎంత ముద్దుగా ఉన్నాయో బుజ్జి బుజ్జి ఏనుగులు . "మీ పిన్ని ని అడిగావా ఏనుగులు కావాలని ?" అన్నారు ఏమండీ."అయ్యో లేదు అమ్మవారు తెప్పించుకుంది."అన్నాను. ఐనా ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎర్రకోట ఏనుగు సంపాదించుకోవాలి.వేటి అందం వాటిదే మరి .
"జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే;
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ జయపాలయమాం!!"

Sunday, March 24, 2019

దేవుళ్ళు


దేవుళ్ళు
"పారాడే కృష్ణుడి బొమ్మ పూజలో ఉంటే చక్కగా ఇల్లంతా పిల్లలు పారాడుతారు."అని అమ్మ ఇంకా ఏమో చెప్పబోతూ ఉంటే "ఇంకేం పారాడే పిల్లలమ్మా , నా పిల్లలను, మనవళ్ళను అందరినీ పెంచాను.ఇంక నాకు ఓపికలేదు మునిమనవళ్ళను కూడా పెంచేందుకు అని అమ్మ ఇస్తున్న కృష్ణుడి బొమ్మ తీసుకోలేదు నేను."నేను చెప్పే మాట వినే ఓపిక నీకెప్పుడూ లేదు.నేను ఇవ్వనులే "అని అలిగింది అమ్మ. "ఇది మరీ చిటికెనవేలు గోరంత ఉంది.ఎక్కడ పెట్టి పూజ చేస్తాను"అన్నాను.మాట్లాడకుండా ఓ చిన్న వెండిపళ్ళెం లో ,ఆ బుజ్జి పారాడే కృష్ణుని పెట్టి ఇచ్చింది." ఇంత చిన్న పళ్ళెం లోనా?ఎక్కడన్నా పడిపోతాడేమో పోనీ చిన్న వెండి గిన్నెలో పెట్టుకోనా?" అంటే "వద్దు.ఇట్లా పళ్ళెం లోనే ఉండనీయి .గిన్నెలో ఐతే బంధించినట్లుంటాడు పాపం." అంది.ఇంకా నయం డ్రాయింగ్ రూంలో పెట్టు ఇల్లంతా దొగాడుతాడు అనలేదు అని సంతోషించి తెచ్చి పూజలో పెట్టాను.ప్రతిరోజూ పూజ చేసుకునే ముందు ,పారాడుతూ పారాడుతూ ఎటో పారిపోయిన ఆ బుజ్జిగాడిని వెతుకుంటూ ఈ సంభాషణ అంతా తూచా తప్ప కుండా గుర్తుతెచ్చుకుంటాను.నా మొహం మర్చిపోతేగా గుర్తు తెచ్చుకోవటానికి.నేను ముందు రోజు పెట్టిన పూలు తీసి,శుభ్రం చేసుకొని పూజ మొదలు పెట్టే సమయానికి కనిపించడు.ఈ మాయదారి కృష్ణుడు ఎక్కడా అని వెతుకుతే వంటింటి గట్టుమీదో, బాల్కనీ లోనో తీసేసిన పూల మధ్య చిద్విలాసంగా ఉంటాడు.అదీ ఓ పట్టాన దొరుకుతాడా? ఒక్కోపూవే తీస్తూ ఎన్ని తిప్పలు పడాలో!"అమ్మ కొంచం పూలు తక్కువ పెట్టు.లేదా పూలు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయి."అని సలహా ఇస్తూ ఉంటుంది మా మణి.అదేమిటో ఊరంతా పూసేపూలు ఆ సమయం లో మాఇంట్లో పూయవు.అన్ని చోట్లా పూయటం ఐపోయాక తీరికగా ఈ నెల నిద్ర లేచి అన్ని చెట్లూ కలిసిమెలిసి ఒకేసారి పూస్తాయి.పొద్దున్నే కింద  నుంచి వచ్చటప్పుడు పూల బుట్ట నిండా మందారాలు, నంది వర్ధనాలు, గన్నేరులూ తెస్తుంది మణి.మరి మల్లెలూ ఇప్పుడే వస్తాయి.వీటన్నిటితో పూజ చేయాలా వద్దా? సందట్లో సడేమియాలా , చాన్స్ దొరికిందే చాలని ఆ పూలన్నిటితో కలిసి బయటపడితే ఎట్లా చావను ఈ కిష్టిగాడితో!అక్కడితో ఐందా పళ్ళెం లో ఓ పట్టాన నిలవడు.అంటే తల కిందులుగా పెట్టి ఉంటాను.తీసి కళ్ళ దగ్గరగా పెట్టుకొని చూసి , కాళ్ళు  పళ్ళెం లోకి తల పైకి వచ్చేట్టుగా పెట్టాలి.అంత చింటూగాడి తల కాళ్ళు వెతకాలని ఈ మధ్య కళ్ళజోడు కూడా పూజా గదిలోకి ప్రవేశించింది.ఇంత చిన్ని కృష్ణుడేమిటమ్మా అంటే ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు ,నెమలిపించము, కౌస్తుభము కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో! అని సెంటిమెంట్తో,ఎమోషన్ తో పడేసింది మాయమ్మ.అలనాడు ఆ యశోదమ్మ  కిష్టయ్యతో ఎట్లా వేగిందో!
ఆ మధ్య మా పిన్ని ఫోన్ చేసినప్పుడు"నువ్వు ఇక్కడ నుంచి అమ్మవారి బొమ్మ కొనుక్కెళ్ళావు కదా , ఉందా? పూజ చేస్తున్నావా?"అని అడిగింది. "ఉంది పిన్ని.నువ్వు అమ్మవారికి మంగళసూత్రాలు కూడా కొనిచ్చావు కదా,పూజ చేసుకుంటూనే ఉన్నాను "అన్నాను."ఐతే హైద్రాబాద్ వచ్చేటప్పుడు నీకు రెండు ఏనుగులు తెచ్చిస్తాను.అవి అమ్మవారి కి అటూ ఇటూ పెట్టు."అంది."ఏనుగులు తెచ్చిస్తావా?నీకు ఏనుగులు కొనే తాహత్తు ఉందేమో కాని పిన్నీ వాటిని పెంచే తాహత్తు నాకులేదు."అని జోకాను.పిన్ని దగ్గరకు మొన్న వెళ్ళినప్పుడు గుర్తొచ్చి"నా ఏనుగులేవి పిన్నీ?"అని అడిగాను."నీకు వాటిని పెంచే తాహత్తు లేదన్నావుగా అందుకే తేలేదు."అని అలక చూపించింది."అబ్బా జోక్ చేసాను పిన్ని.నేను అప్పుడే వాటికోసం జాగా కూడా చేసాను." అన్నాను.అలక మర్చిపోయి "అమ్మవారి పక్కన ఏనుగులు ఉంటే ఇల్లు ధనధాన్యాల తో సౌభాగ్యంగా ఉంచుతుంది గజలక్ష్మి రూపం లో."అంది. "ఇప్పుడు ఇక నాకు ధనం తో పనేముంది.ఉన్న ధనం చాలు .ఐనా నువ్వు చెప్పావుగా ఇవ్వు.ఏమిటో నువ్వూ అమ్మ ఇట్లా నన్ను ఫిక్స్ చేస్తున్నారు."అన్నాను."గోవిందరాజస్వామి గుడి పక్కన కొట్లల్లో ఇలా దేవుళ్ళ వాహనాలన్నీ అమ్ముతారు.నేను వెళ్ళినప్పుడల్లా ఆ వాహనాలు బయటకు తీయించి బాగున్నవి కొని ఇట్లా ఇస్తుంటాను.వచ్చేవారం మీ చిన్న తమ్ముడితో పంపిస్తాలే.నువ్వు చెప్పిన మాట విని శ్రద్దగా చేసుకుంటావని నీకు చెపుతున్నాను."అంది పిన్ని.
"అదక్కా సంగతి. ఆమ్మ , అమ్మ మాట వినేదానివి నువ్వొక్కదానివే.అందుకని, ఇక నుంచి తిరుపతి నుంచి ఎవరొస్తూన్నా గరుడవాహనం ఎక్కి లక్ష్మీ నారాయణులు,సింహవాహనం ఎక్కి అమ్మవారు,నెమలి వాహనం ఎక్కి కుమారస్వామి ఒక్కొక్కరుగా నీ ఇంటికి విచ్చేస్తారు. వారి వాహనాల కి పార్కింగ్ ప్లేస్ కూడా ఎలాట్ చేయాలి. పూజ గది కాస్త పెద్దగా చేయించమని బావగారికి చెప్పు."అన్నాడు మా తమ్ముడు.
అన్నట్లు మా బుజ్జి కృష్ణయ్య ఈ సారి వెరైటీగా దేవుడి పీట కింది కి పాక్కుంటూ వెళ్ళిపోయాడు.నేను వంగలేక మణి ని వంగించి బయటకు రప్పించాను.ఇంతలో మా జయ వస్తే"ఈ కృష్ణుడిని తెచ్చి నువ్వేనా ?అని అడిగాను ఎందుకంటే అమ్మ షాపింగ్ అంతా తనే."అవును "అంది."ఇంతకంటే చిన్నది దొరకలేదా?"అడిగాను."లేదక్కా.వెతికాను.సిన్సియర్ గా అని ,”ఇదే చిన్నది.ముందు కొంచం పెద్దది తెస్తే ,వద్దు చిన్నది తెమ్మంది అమ్మ. అదేమి చేసిందో ఇది నీకిచ్చిందా?ముద్దుగా ఉన్నాడు కదూ" అంది."ఏమి ముద్దో తల్లీ నానా తిప్పలు పడుతున్నాను ఈ బుజ్జిగాడి తో."

Wednesday, January 31, 2018

సమ్మక్క-సారలమ్మ





















మాకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఎల్లమ్మ ప్రతి సంవత్సరం  సమ్మక్క ప్రసాదం బంగారం ( బెల్లం) తెచ్చి ఇస్తోంది.దానితో , నా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది :) నా చిన్నప్పుడు ఒక్ గూడెం లో ఉన్నట్లుగా గుర్తు.అక్కడ వెదురు గుడిశెలో ఉండేవాళ్ళం.అమ్మ బయట నులక మంచం మీద కూర్చొని ఉంటే, కింద ఒక లంబాడీ ఆమె కూర్చొని అద్దాలు కుడుతూ ఉండేది.అప్పుడు నాకు అన్నీ అద్దాల లంగాలు జాకిట్లు,గౌన్లు ఉండేవి.సాయంకాలం నాన్నగారు రాగానే ఎవరో ఒకళ్ళు జొన్న రొట్టెలు , ఎర్రటి పచ్చడి తెచ్చి, దొర తింటడు పెట్టమ్మా అని ఇచ్చేవాళ్ళు. గూడెం అంతా నేను తిరుగుతూ ఆడుకుంటూ ఉండేదానిని.ఇది నాకు ఈ మధ్య అప్పుడప్పుడు గుర్తొస్తూవుంటే అమ్మను అడిగాను.అవును అప్పుడు ములుగు దగ్గర దుంపలగూడెం లో ఉండేవాళ్ళం.అక్కడి గిరిజనులకు ఇళ్ళు కట్టించటం అది మీ నాన్నగారు చేసేవారు అన్నది.నిన్న మా వాళ్ళందరు మేడారం జాతరకు వెళుతుంటే అమ్మా నేనూ ఆ విషయాలు గుర్తు తెచ్చుకున్నాము.ఈ జాతరకు నాన్నగారు కూడా వెళ్ళేవారట.అమ్మ మమ్మలిని కూడా తీసుకుపొమ్మంటే అక్కడ అడవి జంతువులు, పాములు ఉంటాయి , మేము వస్తుంటేనే మా జీపు కు అడ్డంగా పులి వచ్చింది అని తీసుకుపోలేదుట.మనకే ప్రమాదం కాని ఆయనకు కాదా ఏమొ మరి అంది!మణి తో అమ్మ అప్పుడు మా సారు తీసుకుపోలేదు ఇప్పుడు నువ్వు తీసుకుపోతావా అంటే అక్కడ మీరేమి ఉండగలరమ్మా అని నవ్వి వెళ్ళిపోయింది.
అప్పట్లో అక్కడ అంతా దట్టంగా అడవి ఉండేదిట.నాన్నగారు సర్వే కి వెళ్ళి సాయంకాలానికి వచ్చేసేవారుట.జాతర అయ్యాక మళ్ళీ ఆ అడవిలోకి ఎవరూ వెళ్ళేవారు కాదని మా డ్రైవర్ చెప్పాడు.ఇప్పుడు గుడి లాగా కట్టించారు .అందరూ వస్తూ పోతున్నారు.మేము పోయిన నెల వెళ్ళినప్పుడు జాతర దగ్గరకొస్తుండటము తో రోడ్ లు బాగుచేయటము, కరెంట్ పనులు మొదలైనవి జరుగుతున్నాయి.కొద్ది దూరం వెళ్ళగానే రోడ్ మీదుగా వాగు కనిపించింది.అప్పుడప్పుడు వాగులు ఇలా పొంగుతూ ఉంటాయని వెనకకు తీసుకెళ్ళి , పక్క రోడ్ మీదుగా తిప్పి తీసుకెళ్ళాడు. అలా అడవి మధ్య నుంచి వెళ్ళటం కూడా ఒక మంచి అనుభూతి :) కొంచం అడవి మధ్యలోకి వెళుదామని ఉత్సాహ పడ్డాను కాని, చీకటి పడుతోందని మా ఫ్రెండ్ రాజేశ్వరి, మా డ్రైవర్ మహేష్ ఒప్పుకోలేదు .
మొత్తం వెదురుతో కట్టిన గుడి అది. మాములు  గుడికి భిన్నం గా వుంది.అది గుడి అనరట.గద్దె అంటారట. గుడి మొదట్లోనే బంగారం తూచే తరాజు ఉంది. గుడి ముందు అడవి పూలతో కట్టిన దండలు, బెల్లము అమ్మవారలకు సమర్పించేందుకు అమ్ముతున్నారు.విశాలమైన ప్రాంగణం లో ఆ గద్దెలు ఉన్నాయి. అక్కడ అప్పుడు చరిత్ర చెప్పేందుకు ఎవరు లేరు. ఒక పూజారిణి మాత్రం ఉంది. ఆమెకు ఏమీ తెలీదుట.పూజారయ్య ఊళ్ళోకి పోయాడు అంది. అక్కడ మాకు తోచినట్లుగా పూజ చేసుకొని వచ్చాము.అసలు అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నుంచి ఈ గద్దె మీద కు తీసుకొస్తారు? అని అడుగుతే ఆమెకాని మహేష్ కాని చెప్పలేకపోయారు!
మా మహేష్ పెళ్ళి అక్కడే అయ్యిందని ఆ స్థలం చూపించాడు.లోపలికి వ్వెళ్ళేటప్పుడు జాతకం చెపుతానన్న కోయ దొరను తప్పించుకొని వెళ్ళాము కాని,తిరిగి వచ్చేటప్పుడు తప్పించుకోలేకపోయాము.పైగా రాజేశ్వరి ఇంట్రెస్ట్ చూపించింది.తను చెప్పించుకొని వచ్చి మీరూ చెప్పించుకోండి సరదాగా అంది.సరే నని కూర్చున్నాను.ముందుగానే నీ యింట ఇప్పటి వరకు పుంజు మాట నడిచింది.ఇక ముందు పెట్ట మాట పుంజు వింటుంది అనగానే అది ఎప్పుడు ఏ జన్మలో జరగాలి అని పక్కున నవ్వాను.అతను చాలా సీరియస్ గా చూసి మీ నాయన చాలా ధర్మాత్ముడు.ఇక్కడ కోయల కోసం చాలా సేవ చేసాడు అన్నాడు.నేను నివ్వెర పోయాను!ఆ తరువాత మా నాన్నగారి గురించే ఎక్కువగా చెప్పాడు!
సమ్మక్క సారలమ్మల గురించి వివిధ కథలు ప్రచారం లో ఉన్నాయి.అందులో ఎక్కువగా వినిపించేది కాకతీయులు వారి రాజ్యం మీద దండెత్తుతే విరోచితముగా పోరాడారు అని.రుద్రమదేవి కన్న ముందే ఆ యువతులు యుద్దం లో పాల్గొన్నారని అంటారు.కొంత మంది వీరిద్దరు అక్కాచెళ్ళెళ్ళు అంటారు కొంతమంది తల్లీ కూతుళ్ళు అంటారు.సమ్మక్క కొడుకే జంపన్న అని, వీరోచితముగా పొరాడి చనిపోయాడని, అతని రక్తం తో ఏర్పడిందే జంపన్నవాగు అని అంటారు.ఆ వాగు లో నీళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయిట.అది చాలా పవిత్రమైన వాగు అని నమ్మకం.అందులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు.ఎవరి కొరకైతే మొక్కుకుంటారో ఆ మనిషి అంత బరువు గల బంగారం( బెల్లం) తూచి అమ్మవారికి సమర్పించుకుంటారు.
తరువాత తెలుగు మహాసభలల్లో తెలంగాణా వారి స్టాల్ లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం వారు ప్రచురించిన, సమ్మక్క-సారలమ్మ జాతర పుస్తకం కొని చదివాను.అందులో చాలా వివరం గా ఇచ్చారు.



Saturday, October 21, 2017

భగినీ హస్త భోజన్





ఈ రోజు అంగా కార్తీక శుద్ద విదియ . ఉత్తరాదిన ముఖ్యంగా  "భగినీ హస్త భొజన్" అని జరుపుకుంటారు. మన వైపు కూడా కొంత మంది చేస్తారు కాని అంతగా ప్రాచుర్యం లో లేదు. భగినీ అంటే సోదరి. సోదరుడు , సోదరి చేతి భోజనం చేయటమన్నమాట. వివాహమైన అమ్మాయి ఇంట్లో మనవాళ్ళు భోజనం చేసేవారు కాదు. పంజాబ్ అటువైపైతే తప్పని సరిగా చేయాల్సి వస్తే విస్తరి కింద కొంత డబ్బు ఉంచుతారని మా పంజాబీ స్నేహితులు చెప్పారు. అమ్మాయి ఇంట్లో భోజనం చేయటము తప్పని కాదు కాని ఆడపిల్ల రుణం ఉంచుకోకూడదు అని. శుభకార్యాలల్లో తినొచ్చుట.ఐతే కార్తీక శుద్ద విదియనాడు మటుకు సోదరుని, సోదరి పిలిచి భోజనము పెట్టి కానుకలిచ్చి పంపాలట.
దీనికీ ఒక కథ ఉంది.
సూర్యభగవానునకు  సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని  పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు తన అన్నయ్య కు  ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు  పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, మన్నించమని, ‘కార్తీక శుధ్ద విదియ’ నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.
అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ., అలాగే ప్రతి పోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు. అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.
ఇదంతా పుక్కిటి పురాణం అని అనుకున్నా, రాఖీ రోజు సోదరుని ఇంటి కి వెళ్ళి రాఖీ కట్టి బహుమతి తెచ్చుకోవటము, సోదరుడు భగినీ హస్త భోజనము రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి బహుమతి తెచ్చుకోవటమూ, చిన్ననాటి ఆప్యాయతలు , అనుబంధాలు దూరం కాకుడదు అని ఈ సంప్రదాయామును పెట్టి ఉంటారు అనిపిస్తుంది. తరిచి చూడాలే కాని మన సంప్రదాయాలన్నిటిలోనూ ఏదో ఒక అర్ధము ఉంటుంది.అవి ఆషామాషీగా ఏర్పర్చినవికావు.
మా స్నేహితులు చేస్తుంటే చూసి నేనూ మా అమ్మాయితో చేయించేదానిని. మా పిల్లలిద్దరూ ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మాయి తమ్ముడిని భోజనానికి తప్పక పిలిచేది. ఈ రోజు ఎక్కడో చదివారట , మా పెద్ద ఆడపడుచు గారు తమ్ముళ్ళిద్దరినీ భోజనానికి పిలిచారు.వాళ్ళిద్దరి తోపాటు మా తోటికోడళ్ళిద్దరినీ పిలిచారు :)



Saturday, October 12, 2013

కలికి చిలుకల కొలికి



బతుకమ్మ తెలంగాణా వారి ఆడపడుచు.ప్రతి దసరాకు పుట్టింటి కి తీసుకొచ్చి ఆదరించి పంపుతారు. పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఇలా చెపుతారు.

అత్తామామా పట్లా చారా,
వద్దిక కలిగి వుంటే బుద్దిమంతురాలివైతే,
మాయమ్మ లక్ష్మిదేవీ పోయీరావమ్మా.
పోయి మీ అత్తింట బుద్దికలిగి వుండు.
ఎవరేమన్ననూ ఎదురాడబోకమ్మా,
పలుమార్లు పన్నెత్తి నవ్వబోకమ్మ,
పరమాత్మ (భర్త)తో కూడి వెలుగు మాయమ్మ,
అరిటాకు వంటిదీ ఆడజన్మంబు,
అత్తగారి తో పోరు చేయబోకమ్మ,
మామగారి తో మాట్లాడబోకమ్మ,
వీధి నిలుచుండి , కురులిప్పబోకమ్మ,
సంధ్య నిద్ర మరువు తల్లి,
పాటించిన దీపావళి పండుగ పదినాళ్ళున్నది,
నాటికి నిన్ను తీసుకు వస్తు,
ఇంకా ఆరునెలలున్నది సంక్రాంతి పండుగ,
నాటికీ నిన్ను తీసుకు వస్తు,
మాయమ్మ లక్ష్మి దేవీ పోయీరావమ్మ.
ఏమిటీ అమ్మాయిల కు  ఇది చదువుతుంటే కోపం వస్తోందా :) ఆగండాగండి. ఇందులోని అర్ధం తెలుసుకుంటే కోపం ఉష్ మంటుంది. కుటుంబానికి మూల స్తంభం స్త్రీ.ఇంటి ని పిల్లలను తీర్చిదిద్దవలిసింది ఆమే.ముఖ్యంగా పిల్లలను.ఎంత తండ్రి భుజాల మీదికి ఎక్కి ఆడినా చివరకు తల్లి వడినే చేరుతారు.ఆమె వొద్దిక గావుంటేనే కదా ఇంట్లో సుఖ శాంతులు వుండేది.ఇష్టం వచ్చినట్లు చిర్రుబుర్రులాడుతూ వుంటే ఇల్లు నరకమే .ఇంక పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఇంటి వాతావరణం సంతోషంగా వుంటేనే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు.ఇలా మంచి పౌరులను సమాజానికి అందించే భారాన్ని స్త్రీ భుజం మీద వుంచారన్నమాట :)

ఈ పాట విన్నప్పుడల్ల నాకు  మాంగల్యబలం సినిమా లోని ఇదో ఈ పాట గుర్తొస్తుంది:)



ఇంకో బతకమ్మ పాట;

అమ్మాయి , నీళ్ళు తీసుకొద్దామని , కడవ చంకన బెట్టుకొని వెళుతోందిట. ఇంతలో ఆమె పుట్టింటి కి తీసుకెళుదామని అన్నలు వచ్చారట.వాళ్ళను చూడగానే ఆమెకు కళ్ళళ్ళో నీళ్ళోచ్చేసాయట.ఎందుకు తల్లీ కన్నీరు , మీవాళ్ళకు చెప్పిరా వెళుదాము అంటారుట అన్నలు. అప్పుడు అత్తమామలను, బావగారిని, తోడికోడలును, గోలీలాడుకునే మరిదినీ (ఆ పొట్టోడినీ ఎందుకో :)) చివరకు భర్తనూ అడిగి, వారికోసం అన్నలు ఏమి తెచ్చారో చెప్పి పుట్టింటికి బయిలుదేరుతుంది:)
సీతకాలమొచ్చేకోల్ చీరల్లూ చినిగే,
మారుకాలమొచ్చే కోల్, మడతల్లూ చినిగే,
సీత నీ పుట్టింటా కోల్ చీరలే లేవా ,
నీలు చీర కట్టీకోల్ , నీలు రవిక తొడిగీ,
నీలాలపేరేసి (నీలపు రంగు గొలుసు)కోల్ నీళ్ళకుతాబోయి,
వచ్చిరి అన్నల్లూ కోల్ వనముల్లూ దాటి,
నిలిచిరి అన్నల్లూ కోల్ నిండూ పందిట్లో,
కాళ్ళు కడుగ నీళ్ళిచ్చీ కోల్ కన్నీళ్ళూబెట్టే.
ఎందుకు కన్నీరు కోల్ ఏలా కన్నీరూ,
తుడుచుకో కన్నీరూ కోల్ ముడుచుకో కురులూ,
ఎత్తుకో పాపడిన్నీ కోల్ ఎక్కుటద్దమునా,
నువ్వు చెప్పేవారితో కోల్ చెప్పీరావమ్మా.
కుర్చీపీటా మీదా కూర్చునట్టీ కోల్ ఓ అత్తాగారు,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండి.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారు?
నాకు నల్లచీరా కోల్ నెమలడుగుల రవికా,
అత్తకు పట్టిచీరా కోల్ అద్దాల పట్టు రవికా,
మామకు ధోతుల్లూ కోల్ మల్లెపూలా శాలువాలూ,
వారికి అంబర్షా కోల్ అంగీలా జోడూ,
పాపకు పట్టంగీ కోల్ పాలుతాగు గిన్నె.
అట్లతే నేనెరుగా కోల్ నీ మామానడుగు.

పట్టెమంచానా పవళించూ కోల్ ఓ మామాగారూ,
మా అన్నలొచ్చారు కోల్ మమంపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నీ బావానడుగూ.

భారతము చదివేటీ కోల్ ఓ బావాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .

అట్లైతే నేనెరుగా కోల్ నీ అక్కా నడుగూ.

వంటిల్లు దిద్దేటీకోల్ ఓ అక్కాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనురుగా కోల్ నీ మరిదీనడుగు.

బొంగరాలాడేటీ కోల్ ఓ చిన్నీ కృష్ణా,
మా అన్నలోచ్చారూ కోల్ మమంపారండీ?
మీ అన్నలొస్తేనూ కోల్ మీకేమీ తెచ్చారు?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నా అన్నా నడుగూ.

రచ్చలో వుండేటీ కోల్ ఓ రాజేంద్రా భోగీ,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండీ.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారూ?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
ఎప్పుడు వస్తావూ కోల్ ఎప్పుడు పోతావూ?
చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ కోల్ చేసీ వస్తానూ.
మరుదుల పెళ్ళిళ్ళకూ కోల్ మరలీ వస్తానూ,
తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకూ కోల్ తరలీపోతాను.
ఎత్తర మేనాలూ కోల్ దించర దివిటీలూ!
హమ్మయ్య పర్మిషన్ వచ్చేసింది :)

ఈ పాట వింటుంటే సీతారమయ్యగారి మనవరాలు లోని 'కలికి చిలుకల కొలికి మాకు మేనత్త ' పాట గుర్తురావటం లేదూ :)

బతకమ్మ కథ లో నూ , పాటల్లో నూ చెప్పేది ఆడపిల్లను వొద్దికగా వుండమని , ఇంటి ఆడపడుచును గౌరవించమనీనూ.అమ్మాయికి పెళ్ళి చేసి పంపేసాము ఇహ మా బాధ్యత తీరింది అనుకోక, పండుగకు సాదరంగా ఆహ్వానించి, గౌరవించి, ఆదరించాలి. అప్పుడే అన్నదమ్ములు , అక్క చెళ్ళెళ్ళ మధ్య సంబంద బాంధవ్యాలు నిలుస్తాయి. కుటుంబవ్యవస్త పదిలంగా వుంటుంది. తద్వారా సామాజం వర్ధిల్లుతుంది.



Monday, October 7, 2013

బతకమ్మ కథ


దేవీ నవరాత్రులు మొదలు అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున బతకమ్మను పెడుతారు.బతకమ్మ అంటే అమ్మవారి రూపం.రకరకాల పువ్వులు ఒకదానిమీద ఒకటిగా పేర్చి ఎంత ఎత్తు చేయగలుగుతే అంత ఎత్తున పేరుస్తారు.పైన ఓ తమలపాకు లో పసుపు తో గౌరమ్మను చేసి పెడతారు. సాయంకాలం ఇంటి ముందు కాని , ఏదైనా దేవాలయము ముందు కాని , శుభ్రంగా వూడ్చి, కళాపి చల్లి, ముగ్గులేసి ఆడవాళ్ళు  అందరూ తమ తమ బతకమ్మలను తెచ్చి అక్కడ వుంచి చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ పూజిస్తారు.పూజ అయ్యాక నైవేద్యం పెట్టి , నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. ఈ విధముగా తొమ్మిది రోజులు ఆడుతారు.రోజుకొక రకం నివేదన చేస్తారు.తొమ్మిదోరోజు వడిబియ్యం తో సాగనపుతారు.ఇది దసరా ముందు రోజు , అంటే నవమి రోజు అవుతుంది. కొంతమంది, మనము ఆడపిల్ల ను పండుగకని పుట్టింటికి తెస్తాము కదా , పండుగ  ముందు సాగనపటమేమిటని , తొమ్మిది రోజులలో వక రోజు ఆడకుండా వుంచి, పండుగ మరునాడు సాగనంపుతారు.

ఇది తెలంగాణప్రాంతము లో చాలా శ్రద్ధగా , ఉత్సాహం గా చేసే పూజ.దీనికి ఒక కథ వుంది.

"అనగనగా  ఒకాయన వుంటారు..ఆయనకు ఏడుగురు కొడుకులు , వక కూతురు.అందరికీ పెళ్ళిళ్ళు చేసి, బాధ్యతలన్నీ తీరాయికదా అని, ఆయన భార్య తో  తీర్ధయాత్రలకు వెళుతారు.అప్పుడే దసరా పండుగ వస్తుంది.మరి ఆడపిల్లను పుట్టింటి కి తేవాలికదా! అందుకని అన్నలు చెల్లెలిని తీసుకొస్తారు.చెల్లెలు బతకమ్మ లాడుదామనుకుంటుంది. కాని, పట్టుచీర, కాళ్ళకు కడియాలు లేవు.ఎలా మరి?అందుకని పెద్దవదినను అడుగుతుంది కాని ఆమె నాకూ కావాలి ఇవ్వను అంటుంది. అలా ఆరుగురు వదినలూ ఇవ్వమంటారు.ఏడో వదిన దగ్గరకు వెళ్ళేసరికి ఆవిడ స్నానం చేస్తూ వుంటుంది." శీలకు పట్టుచీర, గూట్లో కడియం వున్నాయి ,తీసుకుపో . కాని చీరకు కొర్రు పట్టినా, కడియం నొక్కుకుపోయినా , నీ రక్తం నా నుదుటను పెట్టుకుంటాను." అంటుంది. చెల్లెలు ఓ క్షణం ఆలోచిస్తుంది. ఆ ఏమవుతుందిలే జాగ్రత్తగా తెచ్చిస్తే సరి అనుకొని తీసుకొని, చీర కట్టుకొని,కాలికి కడియం పెట్టుకొని వెళుతుంది.

ఉత్సాహంగా,జోరుగా బతకమ్మ ఆడేస్తుంది.ఆ ఉషారులో పాపం చీరకు కొర్రు పడుతుంది,కడియం నొక్కుకుపోతుంది.ఏమిచేయాలో తోచదు.చడీ చప్పుడు చేయకుండా , నిశబ్ధంగా అవి తీసుకుపోయి ఎక్కడి నుంచి తెచ్చిందో అక్కడ పెట్టేస్తుంది.ఐనా వదినకు తెలీకుండా వుంటుందేమిటి? తెలుసుకుంటుంది. అంతే భర్త వచ్చే సమయానికి తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.ఎందుకలా పడుకున్నావు ఏమైంది అని అడిగిన భర్తకు, నాకు చాలా తల నొప్పిగా వుంది, నీ చెల్లెలి ని చంపి ఆ రక్తం తో నా నుదుట బొట్టుపెట్టుకుంటేనే తగ్గుతుంది అంటుంది.అతను కొద్దిసేపు బయటకు వెళ్ళి , ఓ గిన్నె లో రక్తం తెచ్చి ఇస్తాడు. ఆమె సంతోషంగా ఆ రక్తం తో బొట్టుపెట్టుకొని నీళ్ళ కోసం బావి దగ్గరకు వెళుతుంది.

బావి దగ్గర వున్న ఆడవాళ్ళందరూ "మనమందరమూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే , ఇదేమిటీ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొచ్చిందీ"అని పకపకా నవ్వుతారు.అంతే కోడలి కి కోపం వచ్చి, చరచరా ఇంటి కి వచ్చి,తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.భర్త ఈసారి కాకి రక్తం తెచ్చి ఇస్తాడు.అది తెలీక ఆవిడ ఆ బొట్టు పెట్టుకొని వెళుతుంది.మళ్ళీ అందరూ"ఈ సారి కాకి రక్తం పెట్టుకొని వచ్చింది " అని నవ్వుతారు.అంతే కోడలికి బోలెడు కోపం వచ్చేస్తుంది. వళ్ళు మండిపోతుంది.ఈ సారి నీ చెల్లి రక్తం తెస్తే కాని వీల్లేదని భర్తకు గట్టిగా చెప్పేస్తుంది.

పాపం అతను ఇంకేమి చేయగలడు. ముద్దుల భార్య కదా కోరిక తీర్చాలి కదా!అందుకని ఈ సారి చెల్లిని ప్రేమగా పిలిచి , నిన్ను బావ దగ్గర దింపివస్తాను పదా అని తీసుకెళుతాడు.పాపం, అన్నయ్య మోసం, వదిన కుట్ర తెలీని ఆపిల్ల అతనితో బయిలుదేరుతుంది. దారి మధ్యలో ఓ చెట్టుకింద ఆపి"అలిసిపోయాము కదా కాసేపు పడుకో "అని చెల్లిని వళ్ళో పడుకోబెట్టుకొని తల వత్తుతాడు. ఆమె నిద్రపోగానే చంపేసి , కాస్త రక్తం తీసుకొని ఇంటికి తిరిగి వెళుతాడు.ఈ సారి వదిన ఆ రక్తం బొట్టు పెట్టుకొని బావి దగ్గరకు వెళ్ళగానే అక్కడవున్న వారంతా "ఈ సారి కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందే"అని పకపకా నవ్వుతారు.అప్పుడు వదిన తృప్తి పడుతుంది.

అమ్మానాన్నా తీర్ధయాత్రల నుంచి తిరిగి వస్తుంటారు.తమ వూరి దగ్గరకు రాగానే ఓ చక్కటి పూల తోట కనిపిస్తుంది.అరే ఇదేదో కొత్తగా వచ్చినట్లుందే మనము వెళ్ళేటప్పుడు లేదు , కాసేపు ఇక్కడ సేద తీరుదాము అనుకుంటారు.అక్కడే వున్న బావిలో నుంచి నీళ్ళు తోడుదామనుకొని తండ్రి చేద అందులో వేయబోతాడు. వెంటనే
"అంటకు అంటకు ఓ నాన్నా,
అంటితే నీ చేయి కందేనూ,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."
అని వినిపిస్తుంది.వెంటనే నాన్న చేదవదిలేస్తాడు. అమ్మ చేద వేయబోతుంది. అప్పుడూ అలాగే వినిపిస్తుంది. ఇదేమిటి ఇలా అంటోంది. పైగా మన అమ్మాయి గొంతులా వుంది అని అమ్మానాన్నా కలవరపడిపోతారు.కొడుకులను రమ్మని కబురు పెడుతారు. వాళ్ళూ ఎవరు చేద వేయబోయినా అలానే వినిపిస్తుంది.చివరి అన్న వేయబోతే,

"అంటకు అంటకు ఓ అన్నా,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్నవు నీవొచ్చి పడబొడిచి బోయినావు"అంటుంది.

వదిన చేద వేయబోతే ,
"అంటకు అంటకు ఓ వదినా,
దోషకారి వదినవు నీవు చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."అంటుంది.

దాని తో అందరికీ జరిగినది తెలిసిపోతుంది.ఇంతలో ఆ అమ్మాయి భర్త ఏమైంది, ఏడాదైనా భార్య రాలేదు అని చూసేందుకు వస్తాడు. అతనూ ఈ తోటను చూసి లోపలికి వస్తాడు.అక్కడ , అత్తమామలను, బావమరుదులను చూసి ఆశ్చర్యపోతాడు. జరిగింది తెలుసుకుంటాడు. భార్య మీద ప్రేమతో చాలా సేపు ధుఖించి, తనూ ఆ బావిలోపడి చనిపోదామనుకుంటాడు. ఇంతలో అశిరీరవాణి , "ఓయీ నీ భార్య క్రితం జన్మలో బతకమ్మ పూర్తిగా తొమ్మిదిరోజులు ఆడకుండా మధ్యలో వదిలేసింది. అందువలన ఈవిధముగా జరిగింది. నువ్వు శ్రద్ధగా చుటుపక్కల అమ్మాయిలతో బతకమ్మ ఆడించు. నీ భార్య మాములు రూపం పొందుతుంది". అని చెపుతుంది. అంత , చుట్టుపక్కల అమ్మాయిలందరినీ ప్రోగుచేసి, ఆ తోటలోని పూవులతోనే బతుకమ్మను పేరించి , తొమ్మిది రోజులూ ఆడిస్తాడు. తొమ్మిదోరోజు పూర్తికాగానే , ఆ తోట, బావి మాయమై అతని భార్య గా మారిపోతుంది.అందరూ సంతోషిస్తారు.చివరి అన్న, వదిన వారిని క్షమార్పణ కోరుతారు."

బతకమ్మ ఆడటం పూర్తికాగానే అందరూ చుట్టూ కూర్చొని ఈ కథ చెప్పుకొని , హారతి ఇచ్చి, నైవేధ్యం పెడతారు. కథా అక్షింతలు తలపై వేసుకుంటారు.ఆ తరువాత నీళ్ళలో నిమజ్జనం చేస్తారు.

ఇది ఇంతకు ముందు చెప్పిన "బతకమ్మ" విశేషాలు.

పైన వున్నది మా ఇంటి బుజ్జి బతకమ్మ :)

Monday, September 3, 2012

లక్ష్మీనారాయణ యజ్ఞం



మావారు , ఆయన ఫ్రెండ్ అనుకోకుండా , జూబిలీహిల్స్ లోని పూరీజగనాథ ఆలయాని కి వళ్ళారుట . అక్కడ లక్ష్మీనారాయణ యజ్ఞం జరుగుతొందిట . మావారి కి ఆ యజ్ఞం చూడగానే , ఆయజ్ఞం లో కూర్చోవాలి అనిపించి , కార్యకర్త లను , మాకూ కూర్చునే అవకాశం ఇవ్వగలరా అని అడిగారట . ఆయనేమో , లేదండి అన్ని బుక్కైపోయాయి అన్నారట . ఐనా సరే నా నంబర్ తీసుకోండి , ఒకవేళ ఏకారణం చేతైనా , ఎవరైనా డ్రాప్ అవుతే మాకు అవకాశం ఇవ్వండి అని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చారట .ఆ మరునాడే కార్యకర్త శంకర్ నారాయణజీ కాల్ చేసి మీ సంకల్పం చాలా బలంగా వుంది , 31 న ఒకరు డ్రాపైపోయారు , మీకు వీలైతే మీరు రావచ్చు అన్నారు . అంతే మావారు చాలా సంతోషపడిపోయి ఓ తప్పకుండా వస్తాము అన్నారు . అలా లక్ష్మీనారాయణ యజ్ఞం లో పాలుపంచుకునే అవకాశం మాకు వచ్చింది .




శుక్రవారం 31 వుదయం 8 గంటలకే యజ్ఞవాటిక కు వెళ్ళాము .మావారి కి దీక్షా వస్త్రాలు ఇచ్చారు . అవి వేసుకొని , గుడిలోకి వెళ్ళి స్వామివారి ధర్షనం చేసుకొని వచ్చాము . 8.30 కు యజ్ఞం మొదలైంది . మొత్తం ఐదు యజ్ఞ కుండాలు వున్నాయి . వాటి దగ్గర ఐదుగురు బ్రాహ్మలు , ఇద్దరు దంపతులు కూర్చున్నారు . యజ్ఞ ప్రధాన ఆచార్యులవారు లక్ష్మీకాంత్ జీ ధీక్షిత్ వారణాశి నుంచి వచ్చారు . ఇంకా పదహారుగురు ఆచార్యులు కూడా వారణాశి నుంచి , మిగిలిన ఆచార్యులు ఇక్కడివారు వున్నారు . మేము వెళ్ళిన ది యజ్ఞం మొదలైన ఆరోరోజు న . ఇలా యజ్ఞం లో కూర్చొవటం మాకు ఇదే మొదటిసారి . శుక్రవారం , పౌర్ణమి , శతబిషం నక్షత్రం వున్న రోజున మేము యజ్ఞం లో కూర్చోవటం చాలా మంచిదైంది అన్నారు ఆచార్యులవారు . అక్కడివారి పద్దతి ప్రకారము దంపతులలో మొగవారి కండువాకు , ఆడవారి వోణీ కొసకు , తొమ్మిది ముడులు వేసారు . అందులో రూపాయి కాసును , బియ్యం , ఇంకా ఏవో పెట్టారు . పూజలో వున్నంతసేపూ ఇద్దరి ముడులనూ అలాగే వుంచారు .

ముందుగా గణపతి పూజను ఆ తరువాత వాస్తుదేవుని పూజను చేయించారు . ఆ తరువాత యాగ కుండాల దగ్గర కూర్చోబెట్టి , అగ్ని లో నెయ్యి ని , నవధాన్యాలు వేయిస్తూ , ఉదయము , స్త్రీ సూక్తం తోనూ , మధ్యాహ్నము పురుష సూక్తం తోనూ యాగం చేయించారు . 12 .30 విరామం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు . మళ్ళీ మధ్యాహ్నం 3.30 మళ్ళీ మొదలు పెట్టారు . మధ్య విరామ సమయంలో లలితాసహస్రనామం చేసారు . అప్పుడు తామరపూవులతో అమ్మవారిని పూజించారు . 6.30 యజ్ఞం ముగిసిన తరువాత లక్ష్మీనారాయణులకు హారతి , నివేదన చేసారు .




మరునాడు శనివారం సాయంకాలం 4.30 కు పూర్ణాహుతి కోసం వెళ్ళాము . ముందుగా ఈ ఏడురోజులూ యజ్ఞం చేసిన వారినందరినీ యాగస్తలం ఉత్తర్దిశగా తీసుకెళ్ళారు . అక్కడ అందరి మధ్యలో ఒక బుట్టలో శనిదేవుని విగ్రహం పెట్టి అందరూ దక్షణలను సమర్పించారు . ఆ తరువాత పూజ చేసారు . ఆపైన ఆ బుట్టను ఒకతను ( అతని ని ఏదో అన్నారు , మర్చిపోయాను ) నెత్తిన పెట్టుకొని అందరి చుట్టూ తిరిగాడు . అప్పుడు అందరిని తలలు వంచుకొని కళ్ళు మూసుకోమన్నారు . ఆ కార్యక్రమము చూడకూడదుట . అలాగే యజ్ఞవాటిక చుట్టూ కూడా తిప్పించారు . అప్పుడు మా అందరినీ దూరం గా వుండమన్నారు . ఆ తరువాత కాళ్ళూ చేతులు కడుక్కొని మళ్ళీ యజ్ఞవాటికలోకి వళ్ళాము . అందరినీ అన్ని కుండాలచూట్టూ నిలబెట్టి , కుండాలలో నెయ్యిని పోయించారు . దానికి అరటిబోదలతో పైపులా చేసి . కుండం ముందు వెదురుకర్రల సపోర్టుతో నిలబెట్టారు . దాని ద్వారా నెయ్యిని పోయించారు .( అగ్ని కి కి ఆజ్యం తోడవటం ఏమిటో అప్పుడు నాకు తెలిసింది ) ఆ తరువాత ప్రధాన ఆచార్యులవారు అందరి నీ ఆశీర్వదించి లక్ష్మీరూపును , ప్రసాదాన్ని ఇచ్చారు . కొంగుకు వేసిన ముడులను విప్పదీసి , అందులోని అక్షితలను మా శిరస్సున వేసారు . దాని తో యజ్ఞం ముగిసింది .

అలా మా రిటైర్మెంట్ రోజులు మొదలయ్యాయి :)


Thursday, December 3, 2009

కుంకుమ తిలకం

హిందూ సాంప్రదాయము లో పసుపు , కుంకుమకు ముఖ్యపాత్రనే వుంది . ఏ శుభకార్యము తలపెట్టినా , ముందుగా పసుపు ,కుంకుమ లనే కొంటారు . ఆ తరువాతనే ఏమి కొన్ననూ . అమ్మవారికి , కుంకుమపూజ చేస్తే చాలామంచిది అని , పర్వదినాలలో తప్పక చేస్తారు . కుంకుమను , సుమంగళీ చిహ్నముగా భావిస్తారు .

మా అమ్మ కుంకుమను ఇంట్లోనే తయారు చేసేది . ప్రతిరోజూ అమ్మవారికి , ఆ కుంకుమ తోనే పూజ చేసి , ఆ పూజా కుంకుమను , ముతైదువులకు పంచేది . మా బంధువులు , మితృలు అందరూ కావాలని అడిగి తీసుకునేవారు . ఈ పోస్ట్ ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్మలు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .
ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చా పచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఈ కొలతలు మా అమ్మ చేసుకున్నవి . ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

నేను కైలాసగౌరి నోము చేసుకున్నప్పుడు , మా వియ్యపురాలు ,( మా కోడలు అమ్మగారు ), కృష్ణవేణి గారు , విజయనగరకాలనీలో ఒక ముసలావిడ దగ్గర , కుంకుమ కొట్టించారు . అయితే అప్పుడు , మేము పసుపు కొమ్ములను , నిమ్మరసములో నాన వేయలేదు . పటిక , ఎలిగారము వేసాము . ఆ ముసలావిడ పసుపు కొమ్ములను కొట్టేటప్పుడే , కొద్ది కొద్దిగా ,దాదాపు పది నిమ్మకాయల రసమును పిండింది . పొడిని , తెల్లబట్ట తో జల్లించి , నువ్వుల నూనెను కలిపింది . తరువాత ఇంటికి తెచ్చాక , నేను కొద్దిగా రోజ్ వాటర్ ను కలుపుకున్నాను . ఈ కుంకుమ , ఎరుపు రంగులో కాకుండా , బజారులో దోరికే రంగులో కాకుండా మధ్యస్తము గా బాగుంది . బజారు కుంకుమ కొంచము ముదురు మెరూన్ కలర్ లో వుండి , కొంచము నలుపు రంగులో కనిపిస్తుంది .

ఓపిక , టైము వుంటే కుంకుమను తయారుచేసుకొని చూడండి . ఎంతైనా మనము సొంతముగా తయారు చేసుకున్న ఆనందమే వేరుకదా !

Tuesday, November 17, 2009

నోములు నోయరుగా , టెన్షన్ పడరుగా


ఓ అప్పుడెప్పుడో అంటే మొదటి ఫొటోలో మా వదినగారు వున్నారే అప్పుడన్నమాట నోముకొని , ఇదో రెండో ఫొటో లో వున్నారే ఇప్పుడు తీర్చుకుందామనుకున్నారన్నమాట. మరి ఆవిడ తో పాటు మాకూ టెన్షన్ వుంటుందా ? వుండదా ? అసలే , నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు , ఏదో వూరెళుతూ , ఆత్తగారి కళ్ళు గూట్లో వున్నాయనుకోవే కమలమ్మా అని చెప్పివెళ్ళారు . అప్పుడు నిజంగానే , మా అత్తగారు ఆవిడ కళ్ళు వంటింటి గూట్లో పెట్టి వెళ్ళారేమో నని తెగ వెతికా . నిజంగా నిజం . అంటే అత్తగారున్నపుడు ఎంత జాగ్రత్తగా పని చేస్తానో , ఆవిడ లేకపోయినా అంత జాగ్రత్తగానే పని చేసుకోవాలని అర్ధం అని తరువాత తెలిసిందనుకోండి .అది వేరే సంగతి . కాని ఇప్పుడు ఈ ఫొటోల వెనకాల జాగ్రత్తగా గమనిస్తే , మా అత్తగారిదో , మా మామగారి దో ఫొటో కనిపిస్తుంది . అంటే నేను సరిగ్గా చేస్తున్నానాలేదా అని గమనిస్తునే వున్నరన్నమాట !

మా వదినగారు , ఫోన్ చేసి పలానా రోజు నీకు వీలవుతుందా ? అని అడుగగానే ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న నేను , ఎందుకు వీలు కాదండి ? వీలవుతుంది . నేనేమి చేయాలో చెప్పండి అన్నాను . నువ్వేమి చేయొద్దమ్మా , మీ సావిత్రి తో 20 మందికి వంట వండించు.. ఆమె లేక పోతే కాటరింగ్ కి ఇద్దాము అన్నారు . కాటరింగ్ వద్దండి , సావిత్రి వండుతుంది . ఏమైనా నైవేద్యాలు ప్రత్యేకం గా చేయించాలా ? అని అడిగా . పూర్ణాలు , పులిహోరా , వక కూర , పప్పు , వాయినానికి 16 కుడుములు చాలు అన్నారు . ఓస్ అంతేకదా చేయిస్తాను . మరి ముతైదువులని పిలవాలికదా , వాయినాల కోసం చేటలు చేయించాలికదా ? అని అడిగాను . అవన్నీ నేను చేసుకుంటానులే అన్నారు .సరే అన్నాను .

సావిత్రి తో పలాన రోజున మావదినగారు 20 మందిని తీసుకొని వస్తున్నారు . మీరు ఎక్కడికీ వెళ్ళొద్దు . ఇంట్లోనే వుండాలి అన్నాను

ఆ రోజాండీ అంటూ ఆమె మొదలుపెట్టగానే నా బి . పి రయ్ మంది .ఏం ?

"మరేం లేదండీ ఆ రోజు మా కజిన్ వూరు నుండి వస్తానంది . తను నాకు డబ్బులివ్వాలి . ఆ రోజు కలవక పోతే వాళ్ళ వూరు అనంతపూరు వెళ్ళాల్సి వుంటుంది . "

"ఎంతివ్వాలి ? "

"300 . పరవాలెదు లెండి వుంటాను లెండి ."

అమ్మయ్య బతికించారు అనుకునేంతలో శారద , అమ్మా రేపు మా అమ్మ కాకినాడ వెళుదామంటోంది . మా కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తుందిట . అంది . అంతే నా బి. పి రయ్ .. . . రయ్ . . . రయ్

మీ ఇద్దరిలో ఎవరైనా ఇల్లు కదిలారో కాళ్ళిరక్కొడుతాను . అన్నానే కాని వీళ్ళు ఏలేబర్ యూనియన్ వాళ్ళకో ఫోన్ చేయరుకదా ? వాళ్ళొచ్చి నన్ను జైల్లో వేయరుకదా అనే డౌట్ ! ! అంతలోనే ఆ వీళ్ళకంత ధైర్యం ఎక్కడేడిచిందిలే అని నా ధైర్యం ! వాళ్ళకు నా టెన్షన్ సంగతి తెలుసుగా , కాకపోయినా నా మొహం చూసి కనిపెట్టే వుంటారు .మీరు టెన్షన్ పడకండి మేమెక్కడికీ పోము అని హామీ ఇచ్చారు . ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా ? అమ్మయ్య ఈ ఎపిసోడ్ అయ్యింది .

మా వదినగారు ఏమి చేయొద్దు , అన్ని నేనే తెచ్చుకుంటాను అన్నంతమాత్రాన ఎలా వదిలేస్తాను ? అసలే నాకు అన్నిటికీ టెన్షన్ ఎక్కువ. ఏరొజైనా టెన్షన్ పడే విషయము లేకపోతే ఏ టెన్షన్ లేదే అని టెన్షన్ పడతానని , మా వారు , పిల్లలు వెక్కిరిస్తూవుంటారు . అలాంటిది ఇంతటి బృహత్కార్యం నా భుజాలమీద వుంటే ఇక చెప్పేది ఏం వుంది . అనుకున్నాక మూడు రోజులలోనే ఓ ప్పది సార్లు మా వదినగారికి ఫోన్ చేసివుంటాను . ఇక ముందు రోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను . ఈ పిల్ల కి నేరక పోయి చెప్పానురా దేవుడా అనుకున్నారో ఏమో పాపం ఆవిడకి జొరం వచ్చేసి , రాత్రి ఫోన్ చేసి రేపు నోము చేసుకోగలనంటవా మాలా అని అడిగారు . అంతే నా బి . పి రయ్ . . . రయ్ . . . .రయ్ . . . . . రయ్ . . . .

కాస్త ధైర్యం తెచ్చుకొని , పరవాలేదండి నోచుకోగలరు అంతా నిర్విఘ్నం గా జరిగి పోతుంది అని ఆవిడకి ధైర్యం చెప్పాను .

ఏ పండగ పబ్బం ఐనా ఇల్లు కడగటము నాకు అలవాటు . కాని ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మా అబ్బాయి చెప్పాడు , ఇక్కడ కడగటాలు పెట్టుకోకు , మొత్తం మూడంతస్తుల నీళ్ళు , మొదటంతస్తులోకి వస్తాయి , అన్ని ఎత్తి పోయాలి అని . ఏం చేస్తాను ? అందుకే బాల్కనీ , మెట్లు కడిగించి , ఇంటి ముందు ముగ్గేసి వూరుకుంటున్నాను . ఇప్పుడూ అదేపని చేసాను . అమ్మవారు పంపినట్లు పూలవాడు , బంతిపూలు తెచ్చాడు . బంతిపూలు , చామంతులు , గులాబీ లు కొన్నాను . బంతిపూలదండ కట్టి గుమ్మానికి కట్టాను . మామిడాకులు కూడా వుంటే బాగుండేది . పండగ రోజులలో ఐతే బజారులో అమ్ముతారు . మా పక్కింట్లో చెట్టు వుంది కాని , వాళ్ళ పనివాడికి , మా సావిత్రికి పోట్లాట వచ్చినప్పటినుండి వాడు కోసుకోనివ్వటము లేదు . దానికి కూడా టెన్షన్ ఎందుకమ్మా నేను తెస్తాను అని మా అమ్మాయి వాళ్ళింటినుండి తెచ్చింది .

ముందంతా ఇంత టెన్షన్ పడ్డానా ? అసలు సమయం వచ్చేసరికి అంతా చాలా బాగా జరిగింది . ఆ రోజు సావిత్రి మంచి మూడ్ లో , వంట చాలా బాగా చేసిందని అంతా మెచ్చుకున్నారు . లలితసహస్రనామాలు అందరూ కలసి చదువుతుంటే ఇల్లంతా పులకించి పోయినట్లనిపించింది . పొద్దుటినుండి సాయంకాలము 5 గంటల వరకు అందరు ముతైదువులు ఇల్లంతా తిరుగుతూ వుంటే , ఆ కార్యక్రమం అంతా కన్నులపండుగ గా వుండింది .

ముత్తైదువలకేనా , బాలలకు తాంబూలం ఇచ్చారు . ఇంతేనా ? ఐతే నాకేదీ అంటూ . మా మరిదిగారి మనవడు మిహిర్ అడిగాడు . అవునుకదూ , మరి అప్పుడు అక్కడ వున్న మా కుటుంబ పెద్ద , మా మొగ దిక్కు వాడే కదా ! తప్పుతుందా వాడికి , వాడి తో పాటు మిగితా మొగపిల్లలకి తాంబూలము తో పాటు 100 రూపాయలు దక్షిణ .

ఇంత పుణ్య కార్యము మా ఇంట్లో జరుపుకొని , మాకింత మంచి అనుభూతిని కలిగించినందుకు థాంక్ యు వదినగారు .


హరిణీ ,
ఫొటోలు తీసి ఇచ్చినందుకు థాంక్ యు . వాటి కోసం నిన్ను టెన్షన్ పెట్టాను కదూ ! హి హి హి

Friday, November 6, 2009

పదహారు కుడుముల తద్ది

పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు పుట్టింటి వారు పెట్టాలి . సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి ఆద్వర్యము లో నే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారు , కాని వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .

ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్ప , మిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు . పసుపు తో గౌరమ్మని చేసి , ఓ తమలపాకులో పెట్టి ,పూజ ప్రారంభించాలి . ముందుగా సంకల్పము చెప్పుకొని , గౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి . నేను ,అష్టోత్తర శతనామావళీయుక్త శ్రీనిత్యగౌరీపూజావిధానము అనే పుస్తకము లో వున్న పూజా పద్దతి ప్రకారము చేసుకుంటాను . పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొని , నోము కథ చదువుకోవాలి . ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసి , కొన్ని మన నెత్తిన చల్లుకోవాలి . ఆ పై నోములో చెప్పిన విధముగా ముతైదువులకు వాయనమిచ్చి , పాదనమస్కారము చేసి , ఆశీర్వాదము పొందాలి . ఇది ఏనోముకైనను తప్పనిసరి .

పదహారుకుడుముల తద్ది కథ :

పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో , కంటికీ , మంటికీ ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది " .ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని " ఆ కన్య చెప్పగా విని , కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ , గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి , ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది . వెంటనే యింటికి వెళ్ళి , ఆ నోమును యధోక్తముగా చేసుకున్నట్లైతే , సిరిసంపదలు కలిగి చిరకాలము సుఖించగలవు ." అని చెప్పిరి . అందుకారాచపడుచు వారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి చేరి , యధావిధిగా నోము పట్టి చేసుకొనెను . ఇట్లుండగా నోము నాడు , కుడుములు చేటలో పెట్టి , చల్లకి పొరిగింటికి పోగా , ఆమె వచ్చునంతలో ఓ కుక్క , అక్కడి కుడుములను తినివేసెను . అది గుర్తించిన ఆ రాచకన్య , తాను తెచ్చిన చల్లను కూడా ఆకుక్కకే పోసి , నమస్కరించగా , చల్ల త్రాగి , ఆ కుక్క గౌరిగా మారి , ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను .

విధానము : భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని , పదహారు బిళ్ళ కుడుములు ( బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసి , కొద్ది గా నెయ్యి , కొద్ది గా ఇలాచీపొడి వేసి , బాగా కలపాలి . ఆ పిండిని పదహారు ఉండలుగా చేసి , ఒక్కో ఉండను కొద్దిగా వత్తి , బిళ్ళలాగా చేయాలి .) చేయాలి . రెండు కొత్త చేటలు తీసుకొని , వాటికి పసుపు రాసి , కుంకుమ బొట్టు పెట్టి , ఒక చాటలో పదహారు కుడుములు , పసుపు ,కుంకుమ , పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ,ఒక ముతైదువుకు వాయనమివ్వాలి .

ఉద్యాపన :

నోము పట్టిన రోజేకాని , లేదా ఏదైనా మంచిరోజున కాని ఉద్యాపన చేయాలి . ఆ రోజు పదహారుమంది ముతైదువులను ఆహ్వనించాలి . పదహారు జతల చేటలకు పసుపు , కుంకుమరాసి , వాట్లో ఒక్కొక్క బిళ్ళకుడుమును , పసుపు కుంకుమ ను , రెండు గాజులను , చీర జాకిట్టు బట్టను , నల్లపూసలను వుంచి ,ఒక చాటతో ఇంకోచాటను మూసి , తాంబూలములో పూలు, పండ్లు , ఒక రూపాయి కాయిను వుంచి సిద్దము చేసుకోవాలి . గౌరీదేవిని యధావిధిని పూజించి , ఒకచీర జాకెట్ బట్టనుఒక చేట జత లో వుంచి , సమర్పించి , రెండు బిళ్ళకుడుముల తో పాటు మహానివేదన చేయాలి . తరువాత ఒక్కో ముతైదువుకు , పసుపురాసి , కుంకుమ పెట్టి ,గంధము రాసి సిద్ధముగా వుంచుకున్న చేటలజత ,దక్షిణ తాంబూలాల తో ఇవ్వాలి .

కథ లోపమైనను , వ్రత లోపము కారాదు .

యాభై సంవత్సరాల క్రితము , మా అత్తగారు , మా వదినగారి తో నోమించిన , నోములు , ఈ నోము ఉద్యాపనతో అయిపోయాయని అనుకున్నాము ! ఈ నోము ఉద్యాపన కాగానే , అమ్మయ్య మా అత్తగారి బాధ్యత ను తీర్చాను అని నేను అనగానే , వదినగారు , ఇంకోటి , చిట్టి బొట్టు నోము వుందనుకుంటాను అని చిన్నగా వెళ్ళబెట్టారు ! ఈ రోజు ఉదయమే గుర్తొచ్చింది అన్నారు. ఐతే ఇంకా ఏమేమి వుండిపోయాయో గుర్తు తెచ్చుకోండి ,అన్నీ మాఘమాసం లో తీర్చేద్దాము అని చెప్పాను . కాబట్టి ఇప్పటికి నోముల సంగతులు ఐపోయాయి . మళ్ళీ మాఘమాసములో ,నాకు ఓపిక , మూడ్ వుంటే , మా వదినగారి మిగిలిపోయిన నోముల తో పాటు , నేను చేసుకున్న నోముల గురించి చెబుతాను .

మంగళం

సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి

శ్రీ గౌరిదేవికి జయ మంగళం

సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి

శ్రీ గౌరిదేవికి జయ మంగళం

ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ

స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం

శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న

అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం .

Thursday, October 29, 2009

కార్తీకమాసము - పర్వదినములు




కార్తీకమాసమంతా స్నానాలు, ఉపవాసాలు , దీపదానాలు , పూజలూ ,వ్రతాలూనూ . ఏపూజకాపుజే విశిష్టమైనది .కాని నాకు అన్నిటిలోకి కార్తీక పౌర్ణమి చాలా ఇష్టము . సోమవారనాడు ,,కార్తీకపుర్ణిమ నాడు ఉపవాసాము చేయటము నాకు అలవాటు . ఆ రోజు ఉదయమంతా ఉపవాసముండి , సాయంకాలము భోజనము చేసేదానిని . రెండు సంవత్సరాలనుండి ఆరోగ్యరీత్యా మానేయాల్సివచ్చింది. ఆ రోజు మా అత్తగారు సాయంకాలము నిమ్మకాయపులిహోర , నిమ్మకాయ మిరియం బహు రుచిగా చేసేవారు. ఉపవాసమున్నవాళ్ళకే అవి పెడుతాననేవారు . అలా వాటి కోసము నా ఉపవాసాలు మొదలయ్యాయి ! అలాగే కార్తీకపౌర్ణమి రోజు అనుకోకుండా హరిషిద్ది మాత గుడి కి వెళ్ళటము జరిగింది. ఆ రోజు పోరుబందర్ లో సముద్రపు వడ్డున స్త్రీలు దీపాలు వెలిగించి ,పాటలు పాడుతూ సముద్రములోకి దీపాలను వదలటము మరుపురాని అనుభూతి.
ప్రతి రోజు దేవునికి దీపము వెలిగించలేని వారు ఈ రోజు 365 వత్తులను ఆవునేయితో ఏఏదైనా దేవాలయములో , వీలుకాకపోతె ఇంటిలో దేవుని వద్ద వెలిగిస్తే రోజూ వెలిగించిన ఫలము వస్తుంది అంటారు .
ఈ సారి 2 / 11 న కార్తీకపౌర్ణమి , సోమవారము రెండూ కలిసి వచ్చాయి .

ఈ మాసములోని పర్వదినాలలో శుక్లపక్ష ద్వాదశి రోజున చేసే క్షీరాభ్ధిద్వాదశి పూజ ప్రధానమైనది .ఈ రోజున కృతయుగములో దేవతలు , రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక క్షీరాభ్ధిద్వాదశి అని పేరు. క్షీరసాగరము లోనుండి వచ్చిన మహాలక్ష్మిని ఈ రోజు శ్రీమహావిష్ణువు వివాహమాడాడు . అందుకని ఈ రోజు శ్రీమహావిష్ణువు , శ్రీ మహాలక్ష్మిల కల్యాణము చేస్తారు. ఎప్పుడూ క్షీరసాగరములో శయనించే విష్ణువు ఈ రోజున మహాలక్ష్మి తో పాటు బృందావనానికి వస్తాడని అంటారు. అందుకే ఈ రోజు తులసి మొక్క వద్ద , ఈ కార్తీకమాసములో సమస్త దేవతలూ , మునులుకూడా ఆశ్రయించుకొని వుండే ఉసిరిక కొమ్మని పెట్టి పూజిస్తారు.
ఈ నెల 30 న క్షీరాభ్ధిద్వాదశి .

కార్తీకమాసములో శనిత్రయోదశి సోమవారముకంటే చాలా ఎక్కువ ఫలితమిస్తుంది . ఆ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితమిస్తుంది . పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరురెట్లు అధిక పలమిస్తుంది . ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ పలితానిస్తుంది . ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన పలితానిస్తుంది అని పెద్దలంటారు.

కార్తీకపురాణములో ఇలా చెప్పారు.
కార్తీక శు. పాడ్యమి : తెల్లవారు జామునే లేచి ,స్నానము చేసి , దేవాలయానికి వెళ్ళి , కార్తీకవ్రతం సంకల్పము చెప్పుకొని ,ఆకాశదీపాని దర్షించుకోవాలి .
విదియ : ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి , కానుకలిచ్చి రావాలి .
తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటము వల్ల సౌభాగ్యసిద్ది .
చవితి : ఈ రోజు నాగులచవితి సంధర్భముగా పుట్టలో పాలు పోయాలి .
పంచమి : దీనికి జ్ఞాన పంచమి అని పేరు . ఈ రోజు సుబ్రమణ్యప్రీత్యర్ధము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ది కలుగుతునది .
షస్టి : నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానము చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి .
సప్తమి : ఈ రోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానమివ్వటము వలన ఆయుషు వృద్ది అవుతుంది .
అష్టమి : ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది .
నవమి : నేటినుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి .
దశమి : ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి .
ఏకాదశి : ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి .
ద్వాదశి : ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంకాలము ఉసిరిమొక్క , తులసి మొక్కలను పూజించి ,దీపాలను వెలిగించటము సర్వపాపాలనూ నశింప చేస్తుంది .
త్రయోదశి : ఈ రోజు సాలగ్రామ దానము చేయటము వలన సర్వకష్టాలు దూరమవుతాయి .
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతము చేసుకునేందుకు నేడు మంచిది .
కార్తీక పూర్ణిమ : మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానము చేసి , శివాలయము వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటము వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి .

ఇంకా ఈ మాసములో చేసే ఈశ్వరార్చనా , అభిషేకం అపమృత్యు దోషాలను ,గ్రహ బాధలను తొలిగిస్తాయి .

సర్వేజనాః సుఖినోభవస్తు .

Tuesday, October 27, 2009

కార్తీకమాసము

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే " గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు " అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.

కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని ,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది .

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం

జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం

రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం

సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం

దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం

సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం

దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం

అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం

అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

సురగురు సురవరపూజితం లింగం సురవరపుష్ప సదార్చితలింగం

పరమపదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం

లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచివసన్నిధౌ

శివలోక మవాపోత్ని శివేన సహమోదతే .

<
/tr>
Get this widget | Track details | eSnips Social DNA



పైన వున్న ఫొటో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వున్న బిల్వ వృక్షముది . మా అల్లుడు సతీష్ అడుగగానే ఫొటో తీసి మేల్ చేసారు , థాంక్ యు సతీష్. .