Showing posts with label వనభోజనం. Show all posts
Showing posts with label వనభోజనం. Show all posts

Thursday, November 10, 2011

స్పినాచ్ ఖావో శక్తి బడావో !



ఓ బేద్ద రాచ్చసుడు , వికటాట్టహాసం చేస్తూ ఓ అమ్మాయిని చంకనిరికించుకొని పోతున్నాడు . . . . .
ఆ అమ్మాయి భయం తో కెవ్ . . . కెవ్ మని అరుస్తోంది . . . . .
ఇంతలో వచ్చాడు ఓ అబ్బాయి . ఆ రాచ్చసుడి తో డిషుం . . . డిషుం . . . అని యుద్దం చేస్తున్నాడు . కాని పాపం ఓడిపోతున్నాడు . . . . .
ఇంతలో పై నుంచి ఓ టిన్ ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది . దానిని ఓపెన్ చేసి , అందులో వున్న స్పీనచ్ ను తిన్నాడు .
హంతే . . . హాచర్యం . . . ఆ అబ్బాయి కి కండలు వచ్చి ,బళం వచ్చేసింది . అంతే . . . ఆ రాచ్చసుడి తో యుద్దం చేసి , ఓడించి ఆ అమ్మాయిని కాపాడాడు , ' పపాయా ద సేలర్ ' .
ఈ కథంతా చెప్పి ,
హూ . . . హా . . . " స్పీనచ్ కావో , శక్తి బడావో " అంటూ పరుపు మీద ఓ గెంతు గెంతి యుద్దం ఫోజ్ పెట్టాడు మా మనవడు .
" బామ్మా ! నా కిప్పుడే స్పీనచ్ పెట్టు " అని ఆర్డర్ వేసాడు .

కార్టూన్స్ తో కొన్ని సార్లు మంచి కూడా జరుగుతున్నదన్నమాట ! మరి మామనవడి శక్తి పెంచటానికి స్పీనచ్ తో వంటలు చేయొద్దు ! చేసి పెట్టాను :)

అవే మన వన భోజనాలకు కూడా తెచ్చాను . అందరూ ఎంచక్కా తినేసి , శక్తి ని పొందండి :))



1. పాలక్ పూరి ;
రెండు పాలకూర కట్టలు ,
రెండు కప్పుల గోధుమ పిండి ,
వొక స్పూను వాము ,
కొద్దిగా కొత్తిమీర ,
ఓ పచ్చిమిరపకాయ ,
కొద్దిగా జీలకర్ర పొడి ,
సరిపడా ఉప్పు .
ముందుగా పాలకూరను శుభ్రం గా కడిగి , కట్ చేసుకోవాలి , పాలకూర , కొత్తిమీర , పచ్చిమిరపకాయ మిక్సీ లో వే పేస్ట్ లాగా రుబ్బుకోవాలి .
ఆ పేస్ట్ ను , వామును , జీల కర్రపొడిని , ఉప్పును గోధుమపిండిలో వేసి పూరీపిండిలా తడుపుకోవాలి . పిండి ని తడిపేందుకు ఆ పేస్టే సరి పోతుంది . ఒకవేళ తక్కువ అవుతే నీళ్ళు పోసుకోవచ్చు .
ఆ పిండి తో చిన్న చిన్న వుండలు చేసుకొని , పూరీలు వత్తుకొని కాల్చుకోవాలి .

2.పాలక్ రైస్ ;
రెండు గ్లాసులు బాసుమతి బియ్యం ,
మూడు కట్టలు పాలకూర ,
ఒక గ్లాస్ పాలు ,
మూడు గ్లాసులు నీళ్ళు ,
రెండు ఉల్లిపాయలు ,
కొద్దిగా దాల్చిని చెక్క , షాజీర , పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచి , నాలుగు లవంగాలు .
రెండు స్పూన్స్ గరం మసాలా పొడి ,
సరిపడా ఉప్పు ,
పోపుకు నూనె .
ముందుగా బియ్యం ను కడిగి పక్కన పెట్టుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడిగి కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలను , సన్నగా పొడవుగా కోసుకోవాలి .
కుక్కర్ ను పొయ్యిమీద పెట్టి , అందులో నూనె వేయాలి . నూనె కాగాక దాల్చిని , లవంగాలు , షాజీర , లవంగాలు కొద్దిగా కచ్చా పచ్చాగా కొట్టిన పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచీ వేయాలి . అవి వేగాక , ఉల్లిపాయముక్కల ను వేసి , లేత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి . ఉల్లిపాయముక్కలు వేగాక , పాలకూర పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేట్లుగా వేయించుకొవాలి . ఆ తరువాత అందులో మూడుగ్లాసుల , నీళ్ళు , ఒక గ్లాసు పాలు పోయాలి . ఉప్పు గరం మసాలా పొడి వేసి , బియ్యం వేయాలి . బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి , విజిల్ పెట్టేయాలి . ఐదు విజిల్స్ వచ్చాకా , మంట తగ్గించి ఐదు నిమిషాలుంచి , స్టవ్ ఆపేయాలి .

౩. పాలక్ పన్నీర్ ;
పాలకూర పూరీలు , పాలకూర అన్నమూ అయ్యాక వాటిలోకి ' పాలక్ పన్నీర్ '.
పాలకూర ఐదు కట్టలు ,
వంద గ్రాముల పన్నీర్ పాకెట్ ,
రెండు ఉల్లిపాయలు ,
ఒక వెల్లుల్లి రెబ్బ ,
కొద్దిగా అల్లం ముక్క ,
ఓ స్పూన్ గరం మసాల పొడి ,
ఉప్పు ,
ఖారం ,
పోపుకు నూనె .

పన్నీర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని , నూనెలొ కొంచం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడి , కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి .
మూకుడులో పోపుకు సరిపడా నూనె వేసి , అల్లం , వెల్లుల్లి , ఉల్లి ముద్దను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి . ఆ ముద్ద వేగాక పాలకూర పేస్ట్ ను వేయాలి . పాలకూర బాగా వుడికాక , వేయించి వుంచుకున్న పన్నిర్ ముక్కలను , గరం మసాలా పొడిని , ఉప్పు , ఖారం ను వేసి బాగా కలిపి ఇంకొద్దిసేపు వుడికుంచుకోవాలి . కూర గంటె జారుడుగా వుండాలి . ముద్ద కాకూడదు . అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు .
అంతే , పాలక్ పూరి , పాలక్ రైస్ , పాలక్ పన్నీర్ తయార్ :)

వీటి కి తోడు కీరా రైతా . ఇది చేయటము చాలా సులువు . కీరా తొక్కతీసి , తురుము కోవాలి , కీరా తురుము , సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలూ , కొత్తిమీర , ఉప్పు పెరుగులో కలపటమే !

ఇలాగే పూరీ లను , అన్నం ను , బీట్రూట్ , కారెట్ , మెంతికూర , పుదీన ,టమాటా, మటర్ ( మటర్ ను పేస్ట్ చేయ కూడదు . అలానే వేసేయాలి .) ల తో కూడా చేయవచ్చు . కాదేది కవితకనర్హమూ అన్నట్లు ఏ కూరైనా వేసి వండవచ్చు . మామూలా గా తెల్ల అన్నం వండుతే , చిన్నప్పుడు మా అబ్బాయి తెల్లన్నం నాకొద్దు అని గొడవ చేసేవాడు . అదే పోలిక వాడి కొడుకుకు వచ్చింది . పూరీ ఐనా , చపాతీ ఐనా , అన్నం ఐనా కలర్స్ కలర్స్ వుండాల్సిందే ! కొంచం ఓపిక చేసుకొని వండుతే పిల్లలకు అన్ని కూరలూ పెట్టినట్లుగా కూడా వుంటుంది . కడుపు నిడా తింటారు . బలానికి బలమూ , ఆరోగ్యానికి ఆరోగ్యమూనూ . పుణ్యమూ , పురుషార్ధము :)

Sunday, November 21, 2010

మాయదారి చంద్రుడు



కిర్రు . . . కిర్రు మనే బండి చప్పుడు , అప్పుడప్పుడు , ఏహెయ్ . . . నడవండే అని ఎడ్లను అదిలిస్తున్న మస్తాన్ మాటలు , పక్క వాయిద్యం లా కీచురాళ్ళ ద్వనులు తప్ప , అంతటా నిశబ్ధం గా వుంది . బండి తాపిగా వెళుతోంది . చిన్నగా ముడుచుకొని , అమ్మ దగ్గరకు ఒదిగాను . ' చలేస్తోందా ? అమ్మలూ ' అమ్మ అడిగింది .
' ఊం ' అన్నాను కొద్దిగా వణుకుతూ .
అమ్మ , పక్కనే వున్న గొంగళి తీసి కప్పి దగ్గరగా పొదుపుకుంది . ఇంతలో ఎక్కడి నుంచో సన్నటి సువాసన గాలి లో తేలిపోతూ వచ్చింది . గుండె నిండుగా పీల్చి , ఎంత బాగుందో అన్నాను .
' మొగలి డొంక దగ్గర పడుతోంది పాపగారు . మొగలిపూల వాసన ఇది ' అన్నాడు మస్తాన్ .
'అమ్మలూ ఇటు చూడు , చందమామ ఎంత బాగున్నాడో ! ' అంది అమ్మ .
అమ్మ మీదు గా బయటకు వంగి చూసాను . ఆకాశం లో నిండు చందమామ తెల్లగా మెరిసిపోతున్నాడు. చందమామ వెలుగు లో , ఇసుకలో ని , బండి చారలు తళ తళ లాడుతున్నాయి .
'అమ్మాయిగారూ , ఈ రోజు కార్తీక పున్నమి కదండి అందుకే చంద్రుడు అంత పెద్దగా వున్నాడు .' అమ్మతో అన్నాడు మస్తాన్ .
మొగలి డొంక దగ్గర పడుతున్నట్లుంది . చాలా ఘాటుగా మొగలిపూల సువాసన అంతకంతకూ ఎక్కువకాసాగింది .
బండి చిన్నగా వెళుతూనే వుంది . ఆకాశం లో అందం గా వున్న చంద్రుని చూస్తూ , చందమామ లోని అవ్వ కథ చెపుతూ , ఆకలేస్తోందా ? అని అడిగింది అమ్మ .
' అవును . నువ్వు చందమామ కథ చెప్తుంటే ఇంకా ఆకలేస్తోంది ' అన్నాను .
అమ్మమ్మ పంపిన అన్నం మూట విప్పింది అమ్మ . అందులో అన్నం , కంది పచ్చడి , గోంగూరపచ్చడి వున్నాయి . మద్యాహ్నం , బస్ దిగ గానే , కీసర వొడ్డున కూర్చొని , నేనూ , అమ్మా తిన్నాక , మళ్ళీ నాకోసం మని జాగ్రత్తగా మూట కట్టింది అమ్మ . అందులోనే కందిపచ్చడి , అన్నం కలిపి ముద్దలు అమ్మ పెడుతుంటే ఎంత తిన్నానో కూడా తెలీలేదు ! అలా . . . . . అలా . . . . . మా ప్రయాణం సాగిపోతూ వుంది . . .' వూరు దగ్గర పడుతోంది , తుమ్మ డొంక లొచ్చేస్తున్నాయి జాగ్రత్త , తల లోపలికి పెట్టుకోండి ' అని మస్తాన్ చెపుతూనే వున్నాడు , ఓ పెద్ద తుమ్మ కొమ్మ మొహానికి గీరుకొని ,చుర్ మనటం తో , అబ్బా . . . అంటూ లేచాను .
ఓహ్ . . . ఇదంతా కలా ????? కాదు ,,, కాదు చిన్ననాటి జ్ఞాపకం . కీసరలో బస్ దిగటం , కీసర వొడ్డున అమ్మమ్మ పంపిన కందిపచ్చడి , గోంగూరపచ్చడి తో అన్నం తినటం , ఆ తరువాత బండి ప్రయాణం , మొగలిపూల సువాసన ఆస్వాదిస్తూ , కార్తీక పౌర్ణమి , నిండు చంద్రుని చూస్తూ , అమ్మ చెప్పే కథలు వింటూ , అమ్మ చేతి , అమ్మమ్మ కందిపచ్చడి అన్నం ముద్దలు తినటము , ఎన్ని సార్లు గుర్తుతెచ్చుకున్నా , కొత్తగా అనిపించే మధురమైన బాల్య స్మృతి .

అంతే ఈ సారి వన భోజనాలకు కంది పచ్చడి చేసేయాలని డిసైడ్ ఐపోయాను .



కందిపచ్చడి కి కావలసినవి ;
కందిపప్పు 1 గ్లాస్ ,
రెండు ఎండు మిరపకాయలు ,
జీలకర్ర 1 చెంచా ,
చింతపండు కొద్దిగ ,
గ్లాస్ వేడి చేసి చల్లార్చిన నీరు .
మూకుడు లో కందిపప్పును , నూనె వేయకుండా , ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి . కందిపప్పు వేగాక అందులోనే మిరపకాయలు కూడా వేసి వేయించాలి . దింపేముందు , జీలకర్ర వేయాలి . రోలు ను శుబ్రంగా కడిగి , వేయించుకున్న పప్పు , మిరపకాయలు , జీలకర్ర , చింతపండు , ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి . పచ్చడి గట్టిగా అనిపిస్తే , కాచి చల్లార్చిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రుబ్బుకోవచ్చు .
మెత్తగా రుబ్బిన పచ్చడిని , అన్నం లో నెయ్యి వేసుకొని కలుపుకొని తినటమే తరువాత చేయవలసిన పని :)

ఆహా . . . అలా తినేస్తే కార్తీక పౌర్ణమి రోజు వనభోజనం చేసినట్లు కాదు కదా ?????
అందుకే , పెరట్లోని బాదాం ఆకులను కోసుకొచ్చుకొని , ఎంచక్కా విస్తరి కుట్టుకోవాలి . , అన్నం , కందిపచ్చడి , విస్తరి తీసుకొని మేడ మీదికి పదండి . డాబా పైకి వచ్చారా ?
తెల్లని బెడ్ షీట్ నేలపై పరుచుకోండి . పరిచారా ?
వాకే , దాని మీద విస్తరేసుకొని , అన్నం , కందిపచ్చడి వడ్డించుకొని . . .
సరే ఓసారి తల పైకెత్తి చూడండి . అకాశ వీధిలో అందాల చందమామ వయ్యారీ తారల తో ఎలా సయ్యాట లాడుతున్నాడో కదా !!!! వావ్ ,,,,, తెల్లని వెన్నెల ధారలలో తడిసిపోవట్లేదూ . ఆ పైన చిరు చిరు చలి . . .
వాకిట్లోని పారిజాతాల పరిమళాలు , , , , ,
పక్కింటి చెంబేలీల సువాసనలూ , , , ,
సందులో విచ్చుకుంటున్న జాజిపూల పలకరింపులూ . . .
తెల్లని బెడ్షీట్ పైన , పచ్చని ఆకులో , పొగలు కక్కుతున్న మల్లెపూవులాంటి అన్నం , ఎర్రని కందిపచ్చడి . . .

చుక్కలు *********** కనిపిస్తున్నాయా ****** ఇంకెందుకు ఆలశ్యం కానీయండి .

ఇంత వరకూ వాకే . . . ఆ పైనే వచ్చిపడ్డాయి తిప్పలు . వెన్నెల సోనలను కురిపిస్తున్న చందురుని ఫొటో తీద్దామని ఎంత ప్రయతించినా ఊం హూ అంటాడే ! హాల్ లోని పెద్ద కిటికీ నుంచి కనిపిస్తున్న జాబిలిని బతిమిలాడాను , ఒక్క ఫోజ్ ఇవ్వమని . డాబా పై కొబ్బరాకు సందులోని వెన్నెలరేడును వేడుకున్నాను . అబ్బే . . . మాట వింటేనా ??? చూస్తూండగానే తెల్లారిపోయింది . నన్నూ , నా కెమేరాను చూసి , ఎదురింటిస్తంబం మీద ఓ పిట్ట వాలింది . సరే , దానినెందుకు చిన్న బుచ్చాలని ఓ ఫొటో తీసేసాను . అది చూసి బిల బిల లాడుతూ కాకులొచ్చి , గోడపై బైఠయించి , మమ్మలినీ తీయవూ అన్నాయి . వాకే డన్ ! మాయదారి చందురుడే కాని , నేను నీకు కనిపించనా అని మొహమంతా ఎర్రబరుచుకుంటున్న సూర్యునీ ఫొటో తీసాను . అంతే ఇంకేం చేస్తాను ?????

హాపీ కార్తీక పౌర్ణమీ :)

Monday, November 2, 2009

వనభోజనము

పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కోసం ముందు రోజు ఏమీ సిద్దం చేసుకోలేదు .ఈ రోజు వనభోజనం కోసమూ ఏదైనా చేయాలి . అందుకే సేమియా ఉప్మా చేసేద్దాం రెండూ కలిసొస్తాయ్ ! ఓపనైపోతుంది బాబూ అనుకున్నాను .ఇక ఆలస్యం ఎందుకు అని గబ గబా అన్ని కూరగాయల ముక్కలేసి ,సేమియా ఉప్మా చేసేసాను . దానిలోకి టమాటో చట్నీ సూపర్ కాంబినేషన్ .

ఓ కిలో టమాటాలలో కొద్దిగా చింతపడురసమేసి దగ్గరికి వచ్చేదాకా ఉడకపెట్టాను . ఉడికాక స్టవ్ మీదనుండి దింపి , పప్పు గుత్తితో మెత్తగా చేసి, ఓ వెడల్పాటి గిన్నెలో వేసి.చల్లారనిచ్చాను . చల్లారక రెండు స్పూన్ల ఆవపిండి ,ఒక స్పూన్ మెంతి పిండి , రుచికి తగ్గ ఉప్పు , కారం ,కొద్దిగా పసుపు వేసి కలిపి , ఒక మూకుడు లో నాలుగు చెంచాల నువ్వుల నూనె వేసి ,కాగాక , ఇంగువ , రెండు ఎండుమిరపకాయ ముక్కలు , అవాలు కొద్దిగా మెంతులు వేసి వేచి , కరవేపాకు కూడా వేసి పోపేసేసాను .అమ్మయ్య సేమియా ఉప్మా ,టమాటో పచ్చడి సిద్దం .

ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా మా చెల్లెలు , జయ ఆడపడుచు , రేణుక గుర్తుకొస్తుంది . రేణుక ,రఘుగారి ,పిన్ని కూతురు . అయినా ఆ అమ్మాయంటే ఈయనకి ప్రాణం , అసలు చెల్లి మీద కన్నా ఎక్కువ ప్రేమ అని పెళ్ళిచూపులనాడే చెప్పారు ! మరి అంతటి వి. ఐ . పి ని ప్రత్యేకముగా చూడాలికదా ! ఏం చేద్దామన్నా టైం లేదు . మావారికేమో , బజారునుండి తెచ్చిపెట్టటము నచ్చదు . పొద్దున చేసిన గులాబ్ జామూన్లు వున్నాయా ? అని చూసాను . అమ్మయ్య అదృష్టం వున్నాయి ! అవి మళ్ళీ ఎవరికంటాపడకుండా దాచేసి , హాట్ సేమియా ఉప్మా చేద్దములే , అందరూ నేను చేసిన సేమియా ఉప్మా బాగుందంటారు అనుకొని , అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను.

అటు రేణుక వదినే ( వాళ్ళు వదినే అనేఅంటారు . ) అంటూ రావటము , ఇటు కరెంట్ పోవటము రెండూ ఒకేసారి జరిగాయి . ఎంతసేపటికి కరెంట్ రాదు . ఆ అమ్మాయి వెల్తానని అనటము , మేము ఇంకాసేపు కూర్చొండి అనటము జరుగుతోంది . నాకు టెన్షన్ గా వుంది . ఇక ఇలా కాదు అనుకొని , కాండిల్ లైట్ వెలుగులో సేమియా ఉప్మా చేసేసి , ఓ ప్లేట్లో ఉప్మా , ఓ బోల్ లో గులాబ్ జామూన్లు తెచ్చి పెట్టాను . తను ఓ స్పూన్ ఉప్మా తిని , ఇక నాకు చాలు వదినె అని . అయినా నేనొదులుతానా ? బలవంతముగా భగవంతునికి పెట్టినంత భక్తి గా ( అథిది దేవోభవ కదా ),ఎదురుగా కూర్చొని మరీ ఇంకొంచం తినిపించాను. మీరూ తినండి వదినే అంది . మేము తరువాత తింటాములెండి అంటే ఇక తెగేసి నాకు చాలు అంది . సరే మొదటిసారి ఆడపడుచు గారు వచ్చారు స్వీట్ తినండి అన్నాను. మరి కొంచం భయపడుతూనే తీసుకుందో ఏమో , నాపోరు భరించలేక కొద్దిగా నోట్లో పెట్టుకుంది , ఆ తరువాత తినేసింది . అమ్మయ్య ఆడపడుచును మర్యాద చేయటము ఐపోయింది ! రేణుక అటు వెళ్ళటము ,ఇటు కరెంట్ రావటము జరిగింది . మేమూ తిందామని చూద్దునుకదా అది సేమియా ఉప్మా లా లేదు . సేమియా పొడిలా వుంది ! హడావిడి , టెన్షన్ , కరెంట్ లేక పోవటము ,( ఏరాయైతేనేమి పళ్ళూడగొట్టుకోవటానికి ) ఉప్మా లో నీళ్ళు పోయటము మర్చిపోయాను ! పాపం పిచ్చిపిల్ల కక్కలేక , మింగలేక ఎంత ఇబ్బంది పడిందో !

వనభోజనం అంటూ సేమియా ఉప్మా తెచ్చావు . పైగా దానికో కహానీ వినిపించావు అనుకుంటూ నావైపు తినాలా వద్దా అని అనుమానముగా చూడకండి . ఈ టమాటో చెట్నీ తో లాగించేయండి . సూపర్ టేస్ట్ .నచ్చకపోతే పక్కనే వున్న మంచినీళ్ళు తాగి ఎలాగో ఈ సారికి సర్దుకొండి . వచ్చేసారికి నాకు కాస్త టైం దొరకగానే ( క్షణం తీరికి లేదు , దమ్మిడీ ఆదాయము లేదు అన్నట్లుంది నా పని ) ఓ మాంచి వంటకము చేసి , సిద్దముగా వుంచుతాను ,సరేనా .

అయినా ఏమిటో పొద్దున లేచినప్పటి నుండి ఈ తిండి గొడవ ! ఏం వండాలా ? ఏం తినాలా ? అనే ! లేవగానే బ్రేక్ ఫాస్టేం చేయాలా తో మొదలయ్యి , రేపొద్దున ఏం బ్రేక్ ఫాస్ట్ చేయాలా తో ముగుస్తోంది రోజు ! ఇంతవంట వండకుండా ఏదైనా ఉపాయముంటే బాగుండును . మరీ ఈ మధ్య రాత్రి కలలో , వంటదినుసులు ,కూరగాయలు ,మొత్తంగా వంటిల్లే కరాళనృత్యం చేస్తోంది . అసలు ఈ వంట కనిపెట్టిన వారెవరోకాని , మంచి నేతితో చేసిన , శెనగపిండి బూందీ లడ్డూలు ఓ వంద ముందు పెట్టి , మింగావా ? మింగు అని మొత్తం ఒకేసారి తినిపించాలనిపిస్తోంది ! ! !