Friday, April 30, 2021

డబ్బులోయ్ డబ్బులు ??? 3

 

 

 

1971/ 1974 మూడు సంవత్సరాలు మా ఏమండి షిలిగురి (బంగ్లాదేశ్ యుద్దం సమయం లో, యుద్దం అయిపోయి పీస్ ఆయ్యాక క్వాటర్స్ కట్టి ఇచ్చారు. అప్పడు నేనూ వెళ్ళి ఒక సంవత్సరం ఉన్నాను) ఉన్నారు. నేను మా అత్తవారింట్లో హైదరాబాద్ లో ఉండి, రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లో బి.యే చదువుతున్నాను. కాలేజ్ పక్క సందులోనే మా ఇల్లు. అప్పుడు మాకు కాలేజ్ గేట్ మూసేసేవారు. ఎందుకంటే కాలేజ్ చుట్టూ  బోలెడు సినిమా థియేటర్ లున్నాయి. అందులో పాత తెలుగు సినిమాలు మార్నింగ్ షో లు 10.30/ 11 గంటలకు వేసేవారు. పిల్ల పోరగాళ్ళు సినిమాలకు  పోయి చెడిపోతారని గేట్ మూసేవారు. మార్నింగ్ షో టైం అయిపోయాక 11.30 తరువాత గేట్ తెరిచేవారు. అయితే మా అమ్మాయి పసిపిల్ల నేను ఫీడ్ చేయాలని బయటకు వెళ్ళేందుకు పర్మిషన్ తీసుకున్నాను. అప్పుడే మా రెండో ఆడపడుచు పది పరీక్షలయిపోయి కాలేజ్ లో చేరేందుకు అడ్మిషన్స్ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఉంది. నేను మా అమ్మాయి పేరు చెప్పుకొని బయటకు వచ్చి, ఫీడ్ చేసి మా ఆడపడుచును తీసుకొని సినిమాకెళ్ళేదానిని. అప్పటికి మా ఫ్రెండ్స్ గేట్ తీయగానే వచ్చేవారు. కొంచం సినిమా అయిపోతే ఏమవుతుందిట :) మా మామగారికి సినిమాలకు వెళ్ళటమంటే ఎలర్జీ మస్త్ కోపం వచ్చేది. ఎవరైనా వెళుతున్నారని వాసన వచ్చినా ఇంటి గేట్ తాళం వేసేవారు. అప్పుడు ఏమండి నా ఖర్చుల కోసం నెలకు 50 రూపాయలు పంపేవారు. ఆ రూపాయలు ఎలా సద్వినియోగం చేసానో సరదాగా మీకు చెబుదామని పోస్ట్ చేస్తున్నాను :) ఈ బాక్ గ్రౌండ్ తో చదవండి :)

 

 

నీకేమమ్మా? మీ ఆయన నెలకు 50 రూపాయలు పంపిస్తారు. హాయిగా నెలకో చీర 15 రూపాయలదీ కొనుక్కుంటావు , 20 రూపాయలైనా కొనగలవు. వారాని కో సినిమా చూడగలవు. మమ్మలినీ సినిమా కు తీసుకెళ్ళొచ్చుకదా, సుదర్షన్ వాడు  ఆడవాళ్ళకు 50 పైసలకే టికెట్ పెట్టాడట. ముందుగా వెళుతే టికెట్ దొరుకుంతుంది అని స్వర్ణ నస పెడుతుంటే, సరే లే నేను ఇంటికెళ్ళి, అత్తయ్యగారికి చెప్పి, విజయను తీసుకొని వస్తాను, నువ్వు ముందు పదా అన్నాను. సినిమా ప్రోగ్రాం వాసన గట్టి జుబేదా, లలితా వాలి పోయారు. చేసేదేముంది. వాళ్ళనూ రమ్మన్నాను. ఇంతలో రెష్మీ,  సుష్మ చేరి పోయారు.  పైగా వాళ్ళెళ్ళేటప్పుడు నన్ను జమురూధ్ తీసుకెళుతానని బేరం పెట్టారు. వరండా లోనే మామయ్యగారు ప్రత్యక్షం! అప్పుడే వచ్చేసావు కాలేజ్ లేదా? “ అనగానే లేదండి సంజును చూసి వెళుదామని వచ్చాను అని చెప్పి చిన్నగా లోపలికి జారుకొని, అత్తయాగారికి సినిమా ప్రోగ్రాం గురించి రహస్యం గా (అనుకున్నాను) చెప్పి విజయను రమ్మని బయటపడ్డాను. తిరిగి ఇద్దరమూ విడి విడి గానే ఇంటికి వచ్చాము. అమ్మయ్య నాలుగు రూపాయల్ తో ఫ్రెండ్స్ కి సినీమా పార్టీ ఇచ్చి, వాళ్ళ బారినుండి తప్పించుకున్నాను . మామయ్యగారి కంట పడకుండా కూడా తప్పించుకున్నాను . ఎంత తెలివో కదా !!!!

 

" అమ్మాయ్  నీ దగ్గర 10 రూపాయలున్నాయా?"  అని మామయ్యగారు అడుగగానే వున్నాయండి అంటూ తీసుకెళ్ళాను . అవి తీసుకొని నాతో రా అని,  ఇంటికి దగ్గర లో వున్న ,  కోపరేటివ్ బాంక్ కు తీసుకెళ్ళి , ఎకౌంట్ ఒపెన్ చేయించి ,  ప్రతినెలా,  అందులో  పది రూపాయలు డిపాజిట్ చేసి తనకు చూపించమని ఆర్డర్ పాస్ చేసారు. అది సినిమా మహత్యం . హూఊఊఊఊఉం .  వచ్చే 50 రూపాయల లో 10,  మా అత్తగారికి పాకెట్ మనీ ఏమండి బదులు నేనివ్వాలి. అది మా వారి హుకు . 10  ఇండియన్ బాంక్ లో,  పది కోపరేటివ్ బాంక్లో కట్టాలి.  అది మామగారి ఆర్డర్. 10 నా బ్లాక్ మనీ కింద అత్తగారి కివ్వాలి. అది అత్తగారి ఆజ్ణ. ఇక మిగిలినవి పది రూపాయలు . దానిలోనే నా చదువు, సినిమాలు ,  బట్టలు, మా అమ్మాయి ఖర్చు అంతా వెళ్ళాలి . మర్చేపోయాను,  పైన కనిపిస్తుందే ఓ పెట్టి ,  అది మా అత్తగారు నేను నా వైట్ మనీ దాచుకోవటానికి ఇచ్చారు. ఆ బొట్టుపెట్టె, మా అత్తగారికి, ఆవిడ మూడో అన్నయ్య పెళ్ళి లో ఇచ్చారట. ఆ పది రూపాయలు అందులో పెట్టుకునే దానిని . ప్రతి నెలా  మావారు 50 రూపాయల చెక్ పంపగానే,  విజయను తోడు తీసుకొని ఆబిడ్స్ లోవున్న గ్రిండ్లే బాంక్ కు వెళ్ళి తెచ్చుకోవటమూ,  సాయంకాలము లోపల ఎక్కడివక్కడ పంచేసి ,  మిగిలిన పదిరూపాయలకు బడ్జెట్ వేసుకోవటము,  ఆ పది రూపాయలు ఖర్చైపోతే నెల ఎలా గడుపుకోవాలి అని ఖర్చు పెట్టటానికి అసలు ప్రాణమే వొప్పేదికాదు . పైగా అరటిపండ్లు , చారాణా ( 25 పైసలు ) కో డజన్ అంటే నై , నై బారాణా ( డెబ్బై ఐదు పైసలు ) కో దేవో అని చాలా బేరమాడి,  బండి వాడిని మొహమాట పెట్టి , బారాణా కు పండ్లు కొన్న ఘనచరిత్ర తో,  ఏమైనా కొనాలన్నా సరిగ్గా కొంటున్నా నా లేదా అనే అనుమానమొకటి. తెగ పిసినారినై పోయాను. దాని లో కూడా ఐదు రూపాయిలు ఆ పెట్టెలో,  ఇంకో ఐదు రూపాయలు నా బట్టల పెట్టెలో నా సొంత బ్లాక్ మనీ దాపరికం.

 

సందడిలో సటాకు అన్నట్లు,  మా మరిదిగారు  వదినా మీరు అన్నయ్య చెక్ కోసం ఎదురుచూడటమెందుకు?  అది జాయింట్ ఎకౌంట్ కదా అన్నారు.  హన్నా ఇన్ని రోజులు నాకు తెలియదే ఈ సంగతి. ఎంత కుట్ర అనుకొని ఏమండి సెలవలో వచ్చినప్పుడు,  అడుగుతే అంత దూరం ఎందుకులే,  చిక్కడపల్లి లో సిండికేట్ బాంక్ లో తీసుకో అని అక్కడ వున్న ఆయన అకౌంట్ మా జాయింట్ ఎకౌంట్ చేసేసారు. అప్పుడే ఐపోలేదు. ఓ నాలుగు సంవత్సరాల తరువాత . . . మేము సైనిక్ పురి లోఉన్నప్పుడు ఓరోజు మామయ్యగారు ఒకాయనను వెంటపెట్టుకొనివచ్చి ,  స్టేట్ బాంక్ లో కొత్తగా కిడ్డీ బాంక్ అని మొదలుపెట్టారు. ఇదిగో పిల్లలిద్దరి కోసం రెండు తీసుకొచ్చాను. రోజూ చిల్లర డబ్బులు ఇందులో వేయి. మొదటి తారీకున ఈయన వచ్చి ,  వీటి తాళాలు తీసి ఆ డబ్బులు తీసుకెళ్ళి పిల్లల ఎకౌంట్ లో జమ చేస్తాడు అని చెప్పారు. అదైందా ...  ఓ పది సంవత్సరాల తరువాత నా పార్లర్ కోసం లోన్ ఇస్తారని,  బాంక్ ఆఫ్ బరోడా లో కరెంట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయించారు ఏమండి అదినూ మా మామగారి సలహా తో. ఆగండాగండి... వెళ్ళిపోకండి. పూర్తి కహానీ వినండి. ఓసారి పార్లర్ కి ఒకాయనను వెంట పెట్టుకొని మా మామగారు రాగానే నాకు ప్రమాద ఘంటికలు వినిపించనే వినిపించాయి . ఇదిగో అమ్మాయ్ ఇతనూ రోజూ నువ్వు పార్లర్ మూసే సమయానికి వస్తాడు. ఎంతో కొంత జమచేయి అంటూ నారాయణగూడా విజయా బాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయించారు,  కొన్ని రోజులయ్యాక కాస్త ధైర్యం తెచ్చుకొనిమామయ్య గారు  నాదగ్గర ఏమైనా లక్షలు మూలుగుతున్నాయా? ఇన్ని బాంక్ ల లో ఎకౌంట్ లు ఎందుకండీ?” అంటే , “లక్షలే కాదమ్మాయ్ పైసలు కూడా దాచాల్సిందే అనేసారు. అంతటి తో ఐపోలేదు. మా అబ్బాయి సలహా తో,  మా కోడలు మా ఇద్దరి పేరు మీద , ఆంధ్రా బాంక్ లో జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేసింది . ఇప్పటికి ఎన్ని బాంకుల పేరులు చెప్పాను?  గుర్తు పెట్టుకున్నారా లేదా ???

 

ఓ ఐదారు సంవత్సరాల కిందట అనుకుంటాను,  ఒక రోజు అన్ని బాంక్ లకు వెళ్ళి ఎకౌంట్స్ అన్ని క్లోజ్ చేసాను . పాపం అందరూ ఎందుకు మేడం క్లోజ్ చేస్తున్నారు. కావాలంటే మా శ్రీనగర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని తెగ బతిమిలాడారు! ఈ ప్రక్రియ లో కాచిగూడా ఇండియన్ బాంక్ కనపడనే లేదు. అది ఎప్పుడో ఎక్కడికో షిఫ్ట్ చేసేసారట! అందుకే మా అత్తగారిలాగా నాకూ బాంకుల మీద నమ్మకం లేదు. అందుకే నా వైట్ మనీ మా అత్తగారిచ్చిన పెట్టిలోనూ బ్లాక్ మనీ . . . . . . లోనూ దాచుకుంటాను. అంతెందుకు  ఈ మద్య తెలంగాణా గొడవలలో ఏ .టి .యం లు కూడా పనిచేయనప్పుడు, ఏమండి, మా అబ్బాయి నా అలమారాకి కన్నం వేసారు . నా అలమారాలో హీన పక్ష్యం లక్ష రూపాయలైన వుంటాయని మా బిపు ప్రగాఢ నమ్మకం. నేనే అవాక్కయ్యేట్టుగా అక్షరాలా లక్ష రూపాయలు నా అలమారాలో బయట పడ్డాయి! అప్పుడు అచ్చం మా మామగారిలా మాఏమండి "నీ దాపరికం తగలెయ్యా! ఇంట్లో ఎవరైనా ఇన్ని డబ్బులు ఉంచుకుంటారా? అసలే చిన్నపిల్లల్లిదరితో ఒక్కదానివే ఉంటావు" అని కోపం చేసి నా డబ్బులన్నీ తీసేసుకున్నారు అయ్యాకొడుకులు 🙁 నా డబ్బులన్ని తీసేసుకున్నారు అని నేను గొడవపెడుతుంటే అందుకే మనీ ఎప్పుడూ ఇంట్లో వుంచకూడదు ఆంటీ, ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అని మాకోడలు సలహా ఇచ్చింది. ఆ తరువాత వడ్డీ పదివేల తో సహా బాంక్ లో డిపాజిట్ చేసి, ”జాయింట్ ఎకౌంట్ లో ఉంటే నేను తీసుకుంటానని నీ అనుమానం కదా అందుకే నీకు విడిగా నీ డబ్బులతో నీ పర్సనల్ ఎకౌంట్ ఓపెన్ చేసాను తల్లీ దాచుకో" అని పాస్ బుక్చెక్ బుక్ చేతికిచ్చారు ఏమండికాకపోతే నేనెపుడూ నా పర్సనల్ ఎకౌంట్ లో నుంచి తీసి వాడను మా జాయింట్ ఎకౌంట్ వే వాడుతాను. అంతే గా మరి!


"ఇల్లన్నాక,  పిల్లలున్న చోట ఓ పది రూపాయలూ, ఒక మనిషి అన్నము వుండాలి " అన్నది మా అత్తగారు చెప్పిన మాట. ఎంతైనా అత్తగారి మాట పట్టుచీరల మూట కదా!!!

 

కొస మెరుపు:  నా డిగ్రీ పూర్తికాగానే, స్టేట్ బాంక్ లో పని చేసే మాఏమండి ఫ్రెండ్ కాప్టెన్. నగేష్ ,  “నారాయణగూడా లో స్టేట్ బాంక్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మాలా కు ఉద్యోగం ఇస్తాము.  పంపుతారా?” అని మా మామగారిని అడిగారు. కాని  పిల్లలు చిన్నవాళ్ళని , మావారికి పీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవుతే వెళ్ళాలి కదా అనీనూ నేను వుద్యోగం లో చేరలేదు . అలా బాంక్ వుద్యోగం కూడా వచ్చిందన్నమాట! చేయక పోయినా  అప్పుడప్పుడు  మాఏమండిని సాధించటానికి మాత్రము పనికి వస్తోంది!!!

సరే మరి . వచ్చే వారం కలుసుకుందాము. ఏమిటీ ఇంకా వుందా అంటే వుండదేమిటి మనీ నా మజాకా? వచ్చేవారం,  ఇదే రోజు డబ్బుల గురించి మరి కాసిని కబుర్లు. అందాకా సెలవు.

 

(సశేషం)

 


 


డబ్బులోయ్ డబ్బులు # # # # # 2













డబ్బులోయ్ డబ్బులు- ##2


మా మామగారికి నా షాప్పింగ్ మీద బొత్తిగా నమ్మకం లేదు. దానికి తగ్గట్టుగా నే , కూరగాయల రాజమ్మ దగ్గరి నుండి , బియ్యం కిరాణా దుకాణదారు వరకు నాకొక ధర, మామయ్యగారికొక ధర చెప్పేవారు. కూరగాయల రాజమ్మ, నాకు రూపాయన్నర కిలో చెబితే, రూపాయకి బేరమాడే కొనేదానిని. మామయ్యగారికేమో అదే కూర రూపాయి ముప్పావలాకి చెప్పి, అర్ధ రూపాయకి ఇచ్చేది. అదేమిటి రాజమ్మా అంటే పెద్దయ్య ఎట్లాగూ బేరమాడుతాడని రూపాయి ముప్పావలా చెప్పాను అనేది. మరి అర్ధరూపాయకే ఇచ్చావుకదా అంటే ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి చెప్పకుండా తప్పించుకునేది. బియ్యం వాడూ అంతే! నాకు రెండురూపాయలకు కిలో ఇస్తే, మా మామగారికి రూపాయన్న రకే ఇచ్చేవాడు. అదేమిటో నామటుకు నేను చాలానే బేరమాడే దానిని . హూం!

 

ఓసారి ఏమైందంటే, మాఏమండి ఓ పనివాడి ని తీసుకొచ్చారు. ఏమండి ఎవరిని పనికి పెట్టుకున్నా, వాళ్ళకి డిప్ప కట్టింగ్ చేయించేస్తారు. అలా కట్టింగ్ చేయించుకోని వాడికి ఉద్యోగం ఇచ్చే మాటే లేదు. సరే  ఈ సారి ఆయనకు తప్పనిసరిగా వూరెళ్ళాల్సిన పని వచ్చి, పనివాడు శంకర్ కి కట్టింగ్ చేయించమని, నాకు రూపాయిచ్చి,  పైగా చెప్పారు, నాన్నకు తెలీకుండా తీసుకెళ్ళు. నాన్నకు తెలిస్తే  నారాయణగూడా బ్రిడ్జ్ మీద చారాణా కే చేయించుకొస్తానంటాడు అని చిలక్కు చెప్పినట్టు మరీ చెప్పెళ్ళారు. తప్పేదేముంది అలాగే వైయంసి దగ్గర, ఏమండి చెప్పిన నైస్ హేర్ కట్టింగ్ సెలూన్ కే తీసుకెళ్ళాన . అతనూ  పాపం నాకు చాలా మర్యాదలు చేసి, మేజర్ గారి కాండిడేట్ కదమ్మా. నాకు తెలుసు ఎలా కట్టింగ్ చేయాలో అని నైస్ గా డిప్ప కట్టింగ్ చేసేసాడు. హమ్మయ్య ఏమండి చెప్పిన పని చేసాను అని నిట్టూర్చినంతసేపు పట్టలేదు. నా నిట్టూర్పు మధ్యలో ఆగిపోవటానికి . "పనివాడికి సెలూన్ లో కట్టింగా? రూపాయి పెట్టా? పైగా నువ్వు తీసుకెళ్ళావా? నేనింట్లోనే వున్నాగా? నాకు చెప్పొచ్చుగా? నారాయణగూడ బ్రిడ్జ్ మీద పావలా కే చేయించుకొచ్చేవాడిని . నీకు, నీ మొగుడికి బొత్తిగా డబ్బులంటే లక్షం లేకుండా పోతోంది" అని ఇంకా హాట్ బూట్ గా మా మామగారు క్లాస్ పీకేసారు. అదే సమయములో, మా మామగారికి తెలిసిన ఒకాయన వచ్చి, కాచిగూడా లో ఇండియన్ బాంక్  బ్రాంచ్ పెట్టారని, దానికి వాళ్ళ అబ్బాయిని మేనేజర్ గా వేసారనీనూ, మీ కెవరైనా తెలిసిన వాళ్ళుంటే, అక్కడ ఖాతాలు ఓపెన్ చేయించండి అని ప్రాధేయ పడ్డాడు. ఇంకెవరో ఎందుకు మా పెద్దకోడలి తోనే చేయిస్తానని, నాతో అక్కడ ఎకౌంట్ ఓపెన్ చేయించి, ఇక పైన ఇలాంటి పనికి మాలిన దండగ ఖర్చులు చేయొద్దని,  ఏమైనా ప్రతినెల ఆ ఎకౌంట్లో పది రూపాయలు వేసి, ఆయనకు చూపించాలని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.

 

మా మామగారికి నమ్మకస్తులు  మా తోడికోడలు , మా అబ్బాయి. తోడికోడలు కుడిచేయైతే, మా అబ్బాయి  ఎడంచేయి. రామయ్య ఎడమ కాలు . (మరి ఇంకో చేయి వుండదుగా. అందుకని కాలన్న మాట.) ఆయన బజారుకు వెళ్ళలేక పోతే, ఈముగ్గురిలో ఎవరితోనైనా తెప్పిస్తారన్నమాట.  వీళ్ళూ బేరమాడటములో మా మామగారి వారసత్వం పుణికి పుచ్చుకున్నారు. ఇక తాతా మనవడు ఏదైనా కొనటానికి వెళ్ళారంటే, చిక్కడపల్లి , సుల్తాన్ బజార్, కోటీ అన్నీ తిరిగి, అదీనూ నడుచుకుంటూ ఓ రూపాయి తక్కువకే తెచ్చుకుంటారు. ఓసారి  మంచం నవారు కొనటానికి హోల్ మొత్తం హైదరాబాద్  ఆబిడ్స్ తప్ప  తిరిగారు . ఆబిడ్స్ లో అంతా మోసగాళ్ళన్నమాట. అందుకని అటెళ్ళరు.



అలా పొదుపు చేసిన డబ్బులు ఏ బాంక్ లో ఎన్ని నెలలకు యఫ్ . డి వేస్తే ఎంత వడ్డీ వస్తుంది అన్నది ఆయనకు కరతామలకం. కోపరేటివ్ బాంక్ , బాంక్ ఆఫ్ బరోడా కు ప్రతిరోజూ వెళ్ళొస్తూ వుండేవారు. నా దగర 100 రూపాయలు జమ అయ్యాయంటే వాటిని ఏదో ఒక విధం గా యఫ్. డీ చేసేసేవారు. ఆ పేపర్లన్ని ఆయన పేపర్ల తో పాటు ఒక రేకు పెట్టెలో వుంచి, దానిని మంచం కింద వుంచేవారు. తెల్లవారుఝామున లేవగానే బర్ర్ర్ర్ర్ర్ మంటూ ఆ పెట్టిని మంచం కిందనుండి లాగి, ఓ గంట సేపు ఆ పేపర్లు అన్నీ తిరగేసేవారు. ఇక డబ్బులేమో ఆ పైన కనిపిస్తుందే ఆ కోట్ లో దాచేవారు. అందులో అన్నీ ముఖ్యమైనవి వుంచేవారన్నమాట. అలా దాపుడు కే కాని  ఆ కోట్ ఆయన ఎప్పుడూ వేసుకోగా నేనైతే చూడలేదు. అది ఆయన పర్సనల్ బాంక్ అన్నమాట. మా అత్తగారు డబ్బులు అడగగానే ఎందుకు ఎంత అని సవాలక్ష ప్రశ్నలు వేసి, నువ్వు జమిందారిణివే. నీకూ , నీ పెద్ద కొడుకుకు (పెద్ద కొడుకంటే ఇంకెవరు మా ఏమండీనే!) డబ్బు విలువ తెలీదు అనేసి, ఆ కోట్ లోనుండి తీసి ఓ పదిసారులు లెక్కపెట్టి మరీ ఇచ్చేవారు. పాపం అంటమే కాని ఎప్పుడూ ఇచ్చేందుకు లోటు చేయలేదు.


మా అబ్బాయి అక్షరాలా తాత పోలికే! అరిచి ఘీ పెట్టినా వాడి దగ్గరనుంచి ఓ పైసా రాలదు. ఏమండి వాడిని "చిన్న కిషన్ రావ్" అని , "డబ్బులుగా" అని ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు.

 

అలా , అలమారాలో డబ్బులు దాచటము, మా అత్తగారి దగ్గర నేర్చుకుంటే, కొద్దో గొప్పో ఎలా సేవ్ చేయాలి, ఆ డబ్బును బాంక్ లో ఎలా దాచాలి అన్నది మా మామగారి దగ్గర నేర్చుకున్నాను. మా అత్తగారు చెప్పినప్పుడు  నా కళ్ళు అలా చుక్కల్లా మెరిసాయి. అందుకని ఆవిడ గురించి రాసినప్పుడు చుక్కలు పెట్టాను. మా మామగారు చెప్పినప్పుడు ఒక ప్లస్ కాదు రెండు ప్లస్ లు కనిపించాయి అందుకని రెండు ప్లస్లు పెట్టాను. ఇక నేనెంతవరకు నేర్చుకున్నాను, ఎంతవరకు దాచుకున్నాను, ఎలా బేరాలాడాలి (ఐనా  మా మామగారికి  నాకు బేరాలాడటము రాదనే ప్రగాఢ విశ్వాసము వుండేది. కొన్ని సారులు నిజమే నేమో నని నాకూ అనిపిస్తుంది సుమీ) అని చెప్పేదానికి ఏమి గుర్తులు,  ఎక్కడా అని దీర్ఘం వద్దు టైటిల్ దగ్గర ఆలోచించుకొని, ( ఓవేళ మీరేమైనా సూచిస్తే ) ఆ గుర్తుల తో, నా దాపరికపు అనుభావాల తో, వచ్చే వారం, ఇదే రోజు, ఇదే సమయానికి, ఇదే బ్లాగ్ లోకి వస్తాను. అంతవరకు సెలవా మరి.

(సశేషం)

 


 


Thursday, April 29, 2021

డబ్బులోయ్ డబ్బులు * * * * * 1



డబ్బులోయ్ డబ్బులు-1

నిన్న రాత్రి మా మనవడు విక్కీ వాళ్ళ స్కూల్ లో ఓ ప్లే చేసారని, అన్ని పోర్షన్ లూ వాడే ఆక్ట్ చేసి చూపించాడు. అందులో కొత్త అల్లుడు అత్తవారింటికి, పండగ కి మొదటిసారిగా వస్తాడు. అత్తగారు ఆప్యాయముగా రకరకాల పిండి వంటలు చేసి పెడుతుంది. అల్లుడు అన్నీ హాయిగా ఆరగించి, కడుపులో నొప్పని గోల పెడుతాడు. వెంటనే డాక్టర్ అల్లుడి కి ఆపరేషన్ చేసి, అల్లుడి కడుపు లో నుండి, బొబ్బట్లూ, అరిసెలూ, గారెలూ వగైరా తో పాటు కొన్ని చిల్లర నాణాలు కూడా తీసి చూపిస్తాడు. ఆ డబ్బులు ఎక్కడవా? అని అందరూ విస్తు బోయి చూస్తుంటే, మామగారు "నీ దాపరికము మండా, చిల్లర డబ్బులు పప్పుల డబ్బాల్లో దాస్తావు. ఇప్పుడు చూడు ఏమైందో" అని అత్తగారిని తిడుతాడు!

 

 

మా మనవడు మామగారి పాత్ర, అత్తగారి పాత్ర ఆక్షన్ తో చూపిస్తే నవ్వు ఆపుకోలేక, నవ్వుతూ నవ్వుతూ  నేను, రింగులు తిప్పుకొని, బ్లాక్ అండ్ వైట్ రోజులలోకి వెళ్ళిపోయాను. అవి  నా పెళ్ళై రెండు నెలలైన రోజులు, నన్ను వంట నేర్చుకోమని మాఏమండి వాళ్ళ అమ్మ దగ్గర వదిలి  పటియాలా వెళ్ళిన రోజులు, నేను భయం భయం గా, బెరుకుగా వున్నరోజులు. ఆ రోజులలో . . .  ఓరోజు  మా అత్తగారు  ఒక 100 రుపాయ నోటు నా చేతికి ఇచ్చి , బాంక్ కి వెళ్ళి మార్చుకు రమ్మన్నారు. మా ఆడపడుచు విజయ ను తను అప్పుడు 8 థ్ క్లాస్ చదువుతోంది, నాకు బాంక్ దారి చూపించటానికినూ, నాకు తోడుగానూ పంపారు. ఇద్దరమూ కోఠీ ఆంధ్రా బాంక్ కి వెళ్ళి, అక్కడ కౌంటర్ లో చిల్లర ఇవ్వమని ఇచ్చాము. అతను  మమ్మలినీ, నోటునూ ఎగాదిగా చూసి “ నీకెక్కడిది అమ్మాయ్ ఈ నెటు?”  అని అడిగాడు. నేను  మా అత్తగారు ఇచ్చారండి అని చెప్పాను. “అక్కడ కూర్చోండి” ఇస్తాను అన్నాడు. ఇద్దరమూ ఆయన ఎదురుగా కూర్చున్నాము. ఆయన ఎవరినో పిలిచి దాన్ని చూపించాడు. అతను ఆ నోట్ నూ , మమ్మలినీ మార్చి మార్చి చూసి, వెళ్ళి ఇంకెవరినో తీసుకొచ్చాడు. అలా… అలా బాంక్ లో వున్న వాళ్ళంతా అక్కడ చేరి, మమ్మలినీ, ఆ నోట్ నూ ఒకటే చూడటము. ముందు ఏమనుకోలేదు కాని, అందరూ చేరి అలా శల్య పరీక్షలు చేస్తుంటే చాలా భయం వేసింది. ఇక విజయేమో వదినా వెళ్ళి పోదాము పదా అంది. కాని నాకేమో చిల్లర తీసుకొని వెళ్ళక పోతే అత్తయ్య గారు ఏమంటారో నని భయం. ఇక వుండలేక ఏమవుతే అదైందని అతని దగ్గరికి వెళ్ళి  “మాకు చిల్లర వద్దండి.” మా నోట్ ఇచ్చేయండి. వెళ్ళిపోతాము” అన్నాను. ఆయన “వుండమ్మాయ్, మా మేనేజరు గారు వస్తున్నారు. ఆయన రాగానే చిల్లర ఇస్తాను”  అంటుండగానే, మేనేజరు గారు వచ్చార . ఆయన ఇక ప్రశ్నలు మొదలు పెట్టాడు.

 

 

నీకు పెళ్ళైందా? మీ వారు ఏం పని చేస్తున్నారు? ఈ నోట్ నీకెక్కడిదీ?" ఇలా సాగిపోయింది. ఇక ఏడుపే తక్కువ.  కాళ్ళూ, చేతులూ గజగజ వణికి పోతున్నాయి. ఆయన  కాషియర్ వైపు తిరిగి “వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు”  అంటూ ఏదో చెప్ప బోతుండగా, విజయ  “మేమేమీ చిన్నపిల్లలం కాదు. నేను రోజరీ కాన్వెంట్ లో 8 థ్ క్లాస్ చదువుతున్నాను. మా అన్నయ్య మిలిట్రీ లో కాప్టెన్”  అని గడగడా చెప్పింది. నేనేమో ఏడుపు, బిక్క, దేభ్యం ఎన్నిరకాల మొహాలున్నాయో అవన్నీ వేసుకొని "ఇదెక్కడి గొడవరా దేవుడా!" అని మధన పడుతూ, ఏమి చేయాలో దిక్కు తోచక ఉన్న పరిస్థితులల్లో, మా అదృష్టవసాత్తూ  ఓ ముసలాయన అక్కడికి వచ్చాడు. ఆయన సంగతి విని, ఆ నోట్ ను చూసి  “ఇది మా చిన్నప్పటి నోట్ అండి. మంచిదే” అన్నాడు. ఈ లోపల వాళ్ళూ కన్ ఫర్మ్ చేసుకొని, చిల్లర ఇచ్చేసారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి వెళ్ళి మా అత్తగారికి ఇచ్చి, జరిగిన హడావిడి చెపుతుండగా, మా మామగారు వచ్చారు. ఆయన అచ్చం  విక్కీ చెప్పిన ప్లే లోని మామగారిలాగానే మా అత్తగారి తో "నీ దాపరికం మండా. ఇంత పాతది ఎక్కడి నుండి తీసావు? పైగా ఆడపిల్లలిద్దరినీ పంపావా?  దొంగ నోట్ అనుకొని ఏ పోలీస్ లకో అప్పచెప్పలేదు. ఇంకా ఏమైనా వుంటే బయటకు తీయి" అని కోపం చేసారు.  మరి మా అత్తగారు తీసి ఇచ్చారా? లేదా? ఇస్తే ఎన్ని ఉన్నాయి? వగైరా నాకు తెలియదు. ఎందుకంటే మామగారు అరుస్తున్నప్పుడు అక్కడ ఉండకుండా తప్పుకున్నానన్నమాట! మరి లేక పోతే పనిలో పని నాకు పడతాయిగా!

 

అవిషయము గుర్తొచ్చి నవ్వుకుంటుంటే ఏమండి ఏమిటి సంగతి అని అడిగారు. అప్పుడు ఈ సంగతి చెప్పగానే ఏమండి, అప్పుడు కాబట్టి అంత తర్జన బర్జన పడ్డారు. ఇప్పుడైతే దాన్ని మధ్యకు చింపేసి మిమ్మలిని లాకప్ లో పెట్టేవారు అన్నారు. బాబోయ్ ఎంత ప్రమాదం తప్పింది!

 

 

ఓసారి మా ఏమండిని దేనికో డబ్బులు అడుతుంటే మా అత్తగారు విని, ప్రతి పైసా అడగటమేమిటి అని, నాకు ఏమండి  నెలకు 10 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసారు. అదేమిటో మా ఏమండికి అప్పటికీ ఇప్పటికీ ఏ డబ్బులు గుర్తువుండవు కాని, నాకిచ్చినవి మాత్రము గుర్తు వుండి తీసేసుకునేదాకా తోచదు! అలా ఒకసారి ఆయన అడుగుతుండగా మా అత్తగారు విని,  వాడు అడగగానే నీదగ్గర వున్న డబ్బులు ఇచ్చేయకు. ముందు ముందు పిల్లలు పుట్టినప్పుడు చాలా ఖర్చులు వుంటాయి. ఆడపిల్లైతే ఎక్కువ వుంటాయి. మగవాళ్ళకు అన్ని తెలీవు. మనము పెట్టే ప్రతి ఖర్చూ దండగ అనుకుంటారు. నీ దగ్గర లేవంటే, అవసరమైతే బయట తెచ్చుకుంటాడు. బయట వాళ్ళకైతే తిరిగి ఇచ్చేస్తాడు. నీకైతే ఇవ్వడు. వాడు ఇవ్వగానే సగము తీసి జాగ్రత్తగా దాచు" అని హితబొధ చేసారు. అదో అలా నా బ్లాక్ మనీ ప్రహసనం మొదలయ్యిందన్నమాట!

 

 

ఇహ డబ్బులు ఎక్కడ దాచాలి? నా పెట్టెలో పెట్టుకుంటే ఆయనకు తెలుస్తుంది. దానికి కూడా మా అత్తగారే ఉపాయం చెప్పారు. ఆవిడ అలమారలో, ఎవరికీ కనిపించని చోట, ఎవరికీ చెప్పకుండా, చివరకు ఆవిడకు కూడా చెప్పకుండా దాచమని. ఆ అలమారా మా ఏమండి సంపాదన మొదలుకాగానే, ఓ పట్టుచీర, అది పెట్టుకునేందుకు ఓ పెద్ద గాడ్రెజ్ అలమారా వాళ్ళ అమ్మకు కొనిచ్చారుట. అందులో ఆవిడవి ఓ నాలుగైదు చీరలు, మిగితా ఇంటిల్లిపాదీ ఖజానా ఉండేది. మొదటి ఐదు రూపాయలు చేతి లో పట్టుకొని, అలమారా తలుపు తీసి ఎక్కడ దాచాలా అని తెగ చూసాను. మా ఏమండి కోటు జేబులో లాభం లేదు. ఆయన సూట్ రెగ్యులర్ గా వేసుకుంటారు. మా మామగారి కోట్ కూడా లాభం లేదు. ఎందుకంటే ఆయన డబ్బులు, ఇంకా ఏవేవో ఆయనవన్నీ  అందులోనే దాచుకుంటారు. మా మరిదిగారి కోట్ ఐతే బెస్ట్. ఏదో మా పెళ్ళికి మా ఏమండి  కుట్టిస్తే, బలవంతం మీద మా పెళ్ళిలోవేసుకున్నారే కానీ  ఆ తరువాత ఎప్పుడూ వేసుకోలేదు. అందుకని నేను పూనా నుండి వచ్చినప్పుడల్లా నేను దాచుకున్న  నా బ్లాక్ మనీ అందులో దాచేదానిని. అలా ఒకసారి వచ్చినప్పుడు చూద్దునుకదా నా డబ్బులు మటుమాయం! మా అత్తగారిని అడుగుతే ఆవిడ  “వెంకట్ , వదిన డబ్బులు తీసుకున్నావారా?” అని అడిగారు.

 

నాకేం తెలుసు? నా కోట్ జేబులో వుంటే నావనుకొని తీసేసుకున్నాను. నా కోట్ జేబు లో వున్నాయి కాబట్టి అవి నావే. నేను ఇవ్వను. అయినా ఖర్చైపోయాయ్” అన్నాడు.

 

 నా ఏడుపు మొహం చూసి “పిచ్చిదానా, నాకైనా చెప్పొద్దా?”  అన్నారు ఆవిడే చెప్పొద్దు అన్నది మర్చిపోయి!

 

 

ఆ తరువాత  మా అత్తగారికే దాచమని ఇవ్వటము మొదలు పెట్టాను. నా బ్లౌజ్ పీస్ లోనిదే కొంత ముక్క తెచ్చి ఆవిడకు ఇస్తే అందులోనే కట్టి, మా ఏమండి మొదటిసారిగా నాకు గిఫ్ట్ ఇచ్చిన చాకొలెట్ బాక్స్ లో, పెట్టి అలమారాలో ఎక్కడో దాచేవారు. మా మామగారేమో నాతో నారాయణగూడా కోపరేటివ్ బాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయించారు. అప్పటికి నా పాకెట్ మనీ 50 రూపాయలకు పెరిగింది. దాని తో 10 రూపాయలు మా అత్తగారి ఆధ్వర్యం లో, 10 రూపాయలు మా మామగారి ఆధ్వర్యం లో కోపరేటివ్ బాంక్ లో దాచేదానిని. నేను సిలిగురి వెళ్ళాక ఆ దాపుడు ఆగిపోయింది. ఆ తరువాత ఇంకా బోలెడు బాంక్ లల్లో దాచాను. ఆ బాంక్ ల కథ ఇంకోసారి.

 

 

మా అత్తగారు మరణించాక ఆవిడ సామానులు తీసినప్పుడు, అప్పుడు నేను  ఆవిడకు దాచమని ఇచ్చిన డబ్బులు అలాగే ఆ మూటలోనే, ఆడబ్బాలోనే బయటపడ్డాయి. మొత్తం 120 రూపాయలు వున్నాయి. అప్పుడు అక్కడ వున్న పిల్లలకు మా అత్తగారి సేవింగ్ కథ చెప్పి, ఆ గుర్తుగా తలా పది రూపాయలు ఇచ్చాను. 40 రూపాయలు అప్పటి కింకారాని, రాబోయే నా మనవళ్ళూ,  మనవరాళ్ళ కు జ్ఞాపకముగా ఇవ్వటానికి దాచాను. నేను వాళ్ళకు ఇవ్వగలిగిన సిరులు ఈ జ్ఞాపకాలే! పైన ఫొటో కనిపిస్తున్నవి అవే.

 

 

ఆ డబ్బులు తీసి చూపించగానే , మా మనవరాళ్ళు, మనవళ్లు  చాలా త్రిల్ల్ ఐపోయారు. అంత పెద్ద 10 రూపాయలా అని హాచర్య పోయారు.

 

(సశేషం)

 

 

రాసింది మాలా కుమార్ AT FRIDAY, JANUARY 15, 2010  

LABELS: కాసులపేరు

 


Tuesday, April 6, 2021

Nee Jathaga Nenundaali | కథామాల Podcast by Mala Kumar | E09 - అహో లక్ష్...



9. అహో లక్ష్మణా!!!
నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
అహో లక్ష్మణా! అని తన మరిది చేసిన నిర్వాకం గురించి నలభై సంవత్సరాల తరువాత కూడా ఉక్రోష పడిపోయింది ఓ వదినగారు. ఆ వదినా మరుదుల గొడవేమిటో మాలాగారు చెపుతున్నారు, అదేలెండి నేనే చెపుతున్నాను విందాం రండి. ఈ కథ జూన్ 21 2015 నున గోతెలుగు.కాం లో పబ్లిష్ అయ్యింది.