Showing posts with label అహా ఏమి రుచి. Show all posts
Showing posts with label అహా ఏమి రుచి. Show all posts

Tuesday, February 25, 2020

కొబ్బరి మిథాయి





రేపు మా అమ్మాయి యు.యస్ వెళుతోంది.మధ్యలో ఒక రోజు దోహా లో పని ఉంది ఆగుతానన్నది.దారిలో తినడానికి కర్రుం కుర్రుం ఏమైనా చేసిపెట్టు మమ్మీ అంది. అన్నదే కాని నేను చేసేదాకా ఆగకుండా పుల్లారెడ్డి నుంచి కారప్పూస ,భక్ష్యాలు తెప్పించుకుంది.ఐనా నాకు మనసు ఆగక కొబ్బరి మిఠాయి చేసాను.పనిలో పని పది రోజుల క్రితం చేసిన మైసూర్పాక్ కూడా ( ఎందుకైనా మంచిదని ఫొటో తీసాను లెండి) చూసేయండి.
నేను ఏ పనికైనా ఎక్కువ కష్టపడనబ్బా .చాలా ఈజీ బూజీ వి చేసుకుంటాను రాతలైన , వంటలైనా :)
పచ్చి కొబ్బరి కోరు -1 గ్లాస్
పంచదార -1 గ్లాస్
ఇలాచీ పౌడర్
చిటికెడు సోడా ఉప్పు
ఒక కప్ నెయ్యి.
కొబ్బరికోరు,పంచదార బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూకుట్లో వేసి ,సిం మీద పెట్టి కరిగే వరకు తిప్పుతుండాలి.పంచదార కరిగాక కప్ పాలు పోసి దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూ (కలుపుతూ) ఉండాలి.దగ్గర పడి , పాకం కొద్దిగా గట్టిపడిందనుకున్నాక ( నేనైతే కొంచం అంటే ఎంతో లేదు చిటికెడు తీసి పళ్ళెం లో వేసి ,కాస్తా ఊదుకుంటూ చెంచాతో నోట్లో వసుకొని చూస్తుంటాను.అబ్బా పూర్తయ్యేలోపల వేరే వాళ్ళకు మిగులుతుంది లెండి) ఇలాచి పొడి వేసి ఓ కలుపు కలిపి, సోడా ఉప్పు వేసి బుస బుస పొంగుతుండగా ,ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న పళ్ళెం లోకి వంచేయాలి.హుం చూసారా నెయ్యి సంగతి మరిచేపోయాను.పళ్ళెం లోకి వంచేసాక గుర్తొచ్చింది ఏమి చేయను మరి మతిమరుపు ఎక్కువైపోయింది.మీరు మటుకు పాలు పోసిన తరువాత ,మిఠాయి దగ్గరగా వస్తున్నప్పుడే వేడిగా కరిగి ఉన్న నెయ్యి కప్పెడు వేసేయండి.నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది.(వేయకపోయినా బాగానే ఉంది మమ్మీ అంది పాపం పిచ్చిపిల్ల )

Monday, February 13, 2017

ఘుమ ఘుమల మసాలావడ





మొన్న సాటర్ డే టి వి లో వచ్చిన మా ప్రమదాక్షరి ప్రోగ్రాం చూడటం మర్చిపోయాను.చెప్పానుగా చేతికి దెబ్బ తగిలినప్పటి నుంచీ అన్నీ మర్చిపోతున్నానని.ఎవరో అన్నారు అందరికీ మెదడు మోకాల్లో ఉంటే రచయితలకు మణికట్టు లో ఉంటుంది. అందుకని నువ్వు అన్నీ మర్చిపోయావు అని.ఓహో అని నేనూ అలానే ఫిక్సైపోయా :) అసలు విషయానికోస్తే , ప్రోగ్రాం వచ్చిన రోజు లక్ష్మిగారు మీ వడలు టి.వీ లో బాగా పడ్డాయండోయ్ అన్నారు.చూద్దామంటే నిన్న టైం దొరకలేదు.ఇదో ఇప్పుడు చూసాను. నిజమే నండోయ్ నా వడలు బాగా పడ్డాయ్! యాంకరమ్మాయి రుచి చూసింది కూడా! వడలు అలా చూస్తుంటే ఆలోచనలు ఎటోపోయాయి.పోయీ . . . . పోయీ. . . . .
ఆవి మా పెళ్ళైన తొలి రోజులు.వెస్పా మీద ఝాం అంటూ హైదరాబాద్ అంతా చక్కర్లు కొడుతుండేవాళ్ళం.అలా . . . . అలా. . . పోతూ ఉండగా సాయంకాలం,కమ్మటి ఘుమ ఘుమలు ముక్కుపుటాలకు తగిలాయి.వెంటనే స్కూటర్ ఆపి చూస్తే అక్కడ రోడ్ పక్కన , బండి మీద ఒకతను వడలు వేయిస్తున్నాడు.ఇప్పుడంటే వంకాయ కూర తినాలన్నా భయం కాని అప్పుడేముంది. ఎంచక్కా పది పైసలకు ప్లేట్ తీసుకొని ఇద్దరమూ లాగించేసాము.ఏమాట కామాట చెప్పుకోవాలి , బండిమీద వండేవాటికి ఉన్న రుచి ఫైవ్ స్టార్ హోటల్ లోనూ ఉండదు.మా ఏమండీ బండతనిని తెగ బతిమిలాడి , రూపాయిచ్చి మొహమాటపెట్టి, రసిపీ తెలుసుకున్నారు.వెంటనే తిరుగు టపాలో ఇంటికి వెళుతూ పెసలుకొనుకెళ్ళి, యుద్దప్రాతిపదికన వాటిని నానబోసి మరునాడు వడలు చేసేసాను. తరువాత మా ఇంట్లో పార్టీకైనా స్టార్టర్ మసాలావడ తప్పని సరిగా ఉండేది.కాలక్రమేణా మేమూ , పుల్కాలు, సొరకాయ, బీరకాయల కు సెటిలైపోయాక కనుమరుగయ్యాయి!మళ్ళీ ఇన్నేళ్ళకు పాట్ లక్ లంచ్ లో నా వంతు వడలు వచ్చేసరికి గుర్తొచ్చి బయటకు వచ్చాయి :)

సరే ఎవరో ఒకరు అడిగేదాకా ఆగటం ఎందుకు ఇప్పుడే చెప్పేస్తున్నాను అమోఘమైన రసిపీ ;
1 గ్లాసు పెసలు,
1/4 గ్లాసు బియ్యం,
1/2 గ్లాసు శెనగపప్పు,
పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర,పుదీనా ఆకు,ఉప్పు, ( ఇష్టమున్నవాళ్ళకు వెల్లుల్లి.మనకు పడదు ),
చాట్ మసాలా పౌడర్.
పొద్దున్నే పెసలు, బియ్యం ఒక గిన్నెలో, సెనగపప్పు ఒక గిన్నెలో విడి విడిగా నానబెట్టుకోవాలి.శెనగపప్పు రాత్రికి నానబోస్తే బెటర్.రాత్రి పెసలు బాగా కడిగి, బట్ట మీద ఆరేసుకోవాలి.మరునాడు పొద్దున పెసలు బియ్యము గట్టిగా, బరకగా రుబ్బుకోవాలి.అల్లం , పచ్చిమిర్చి, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకోవాలి.పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి.వాటికి ఉప్పు చేర్చి , అవి,నానిన శెనగపప్పు అలాగాఎ పెసర పిండిలో కలుపుకొని చిన్న చిన్న వడలు చేసుకోవాలి.వడ్డించేముందు లైట్ గా చాట్ మసాలా వాటి మీద చల్లుకుంటే రుచిగా ఉంటాయి.అంతే పెసర మసాలా వడ తయార్!
ప్రమదాక్షరి మితృలారా నన్ను క్షమించండి, రోజు చాట్ మసాలా పౌడర్ తెచ్చికూడా వడల మీద చల్లటం మర్చిపోయాను.చేతి దెబ్బా. . . మతి మరుపూ. . . .

Friday, September 10, 2010

గణపతి బాబా కు మోదం మోదకం




నా చిన్నప్పుడు మా నాన్నగారు , ఇంట్లోనే వినాయకుని , మట్టి తోచేసేవారు . ఆయన తో కలిసి వినాయకుని కబుర్లు వింటూ బొమ్మను చేయటము చాలా సరదాగా వుండేది . వినాయకుని నోరేది ? చెవులింత పెద్దగా వున్నయేమిటి ? కళ్ళు అలా చిన్నగా వున్నయేమిటి ? నాన్నగారూ , అని ప్రశ్నలు వేస్తే చాలా ఓపికగా , తక్కువగా మాట్లాడాలి , ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్దగా వినాలి అని , ప్రతి విషయాన్ని గమనించాలి అని అని వినాయకుడు మనకు భోధిస్తున్నాడమ్మా చెప్పేవారు . స్నేహితుల తో పోటీబడి ఆకులు తెంపుకు రావటము చాలా ఉత్షాహం గా వుండేది . ఎప్పుడైనా పొరపాటున చవితి చంద్రుని చూస్తే అమ్మో అనుకునేదానిని .

రెండు సంవత్సరాలనుండి , మా మనవరాళ్ళు కూడా ఇంట్లోనే , మట్టి వినాయకుని చేస్తున్నారు .

ప్రతి సంవత్సరము , ఉండ్రాళ్ళు , కుడుములు నైవేద్యము గా పెడుతాము , ఈ సారి వెరైటీ గా మహర్రస్ట్రీయులు చేసే , " మోదక్ " చేద్దామనుకున్నాను . అందుకే ముందుగా ఒకసారి చేసి చూసుకుందామని చేసాను .

మోదక్ చేసేందుకు కావలసినవి ;

పై పూతకోసం ,
1 కప్ గోధుమ పిండి ,
1/2 కప్ మైదా ,
కొద్దిగా ఉప్పు ,
పూర్ణాని కి కావలసినవి ,
1 కప్ పచ్చి కొబ్బరి తురుము ,
1/2 కప్ పంచదార ( తీపి ఇష్టమవుతే ఎక్కువ వేసుకోవచ్చు ) ,
1 స్పూన్ ఇలాచీ పొడి ,
డ్రై ఫ్రూట్స్ ఇష్టమైనవి .

రిఫైండ్ నూనె

చేసే విధానము ,
ముందుగా గోధుమ , మైదా పిండి ల లో , కొద్దిగా ఉప్పు వేసి , ఆ పైన కొంచము కొంచము గా నూనె వేస్తూ తడపాలి . పిండి మొత్తము పొడి పొడి గా నూనెతో తడుపుకున్నాక , కొద్ది కొద్ది గా నీరు పోస్తూ గట్టి గా తడుపుకొని , ఓ బట్ట కప్పి పక్కన వుంచుకోవాలి . ఆ పిండి ని ఓ అరగంట నాననివ్వాలి .

పిండి నానే లోపు , కొబ్బరి , పంచదార కలిపి స్టవ్ మీద వుంచి బాగా కలిసేవరకు ఉడక బెట్టాలి . మరీ పొడి గా కాకుండా , నీళ్ళ గా కాకుండా చేసుకోవాలి . అందులో ఇలాచీ పొడి , వేయించి వుంచుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి .

ఆ తరువాత పై పిండిని , మృదువుగా మర్ధన చేసుకొని , కొద్ది గా తీసుకొని , చిన్న పూరిలా వత్తు కోవాలి . ఆ పూరీ లో పూర్ణమును కొంచము పెట్టి పువ్వులా ముడవాలి . ఆ తరువాత , స్టవ్ మీద బాణలి పెట్టి , నూనె వేసుకొని వేడి చేసుకోవాలి . మంట తక్కువగా వుంచి , ఆ నూనెలో , తయారుగా వుంచుకున్న మోదక్ లను వేయించుకోవాలి . అంతే గణపతి బాబా కు ప్రీతికరమైన మోదక్ తయార్ .