Friday, April 10, 2015

దొంగగారు అవాక్కయ్యారు!



కార్ సడంగా ఆగింది!
"ఏమైంది మహేష్?"
"సార్ ముందు స్కూటీ మీద వెళుతున్న అమ్మాయి స్కూటీలో నుంచి సెల్ పడిపోయింది." అంటూ కార్ దిగబోయాడు మహేష్.
రయ్య్య్య్య్య్య్య్య్య్య్య్య్ . . . . .
బైక్ దూసుకొచ్చింది.దాని మీద వున్న దొంగగారు  చటుక్కున కింద బడ్డ సెల్ అందుకొని ఫటుక్కున్న మాయమైపోయాడు.
డ్రైవరూ ,సారూ అవాక్కయ్యారు!
"మహేష్ తొందరగా పోనీయ్ ."
అంతే కార్ స్పీడ్ అందుకుంది.కాని బైక్ కనిపించలేదు!మాయదారి వాన మొదలైంది.
"సార్ అదిగో అమ్మాయి బస్ స్టాప్ లో ఆగి వుంది."
కార్ అమ్మాయి ముందు ఆగింది. అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది!
కార్ లో నుంచి సార్ గారు దిగారు."అమ్మాయ్ నీ సెల్ వుందా ?" ఘంభీరంగా అడిగారు.ముందు బిత్తరపోయిన అమ్మాయి స్కూటీ పక్క కవరూ , తన పాకెట్సూ అన్నీ వెతుక్కొని లేదంకుల్ అంది గాభరగా.
"అక్కడ పడిపోయింది. మేము తీసే లోపలే ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు. పట్టుకుందాం. ఫాలో మీ."
ముందు కార్, వెనుక స్కూటీ చేజింగ్ చేజింగ్ . . . . .
అయ్యో కార్ ను స్కూటీ కాదు బైక్ కోసం.
వాన పడుతూనే వుంది. . . . .
కరుడుగట్టిన స్మగ్లర్ జాన్ పాషా కోసం రా ఏజెంట్స్ రయ్ రయ్ మని చేజ్ చేస్తున్నారు.
"సార్" కెవ్వ్ కేక. "అదిగో షాప్ పక్కన బైక్ , దొంగ గారు”.
సర్ర్ ర్ర్ ర్ర్ మంటూ అబ్బాయి పక్కన కార్ ఆగింది. వెనుకే స్కూటీ. . . .
సార్ గారు చాలా ఘంభీరంగా కార్ దిగారు.సార్ గారు, డ్రైవర్ గారు, దొంగగారికి చెరో పక్కన నిలబడ్డారు. " సెల్ తీయ్."
" సెల్ సార్?" అమాయకంగా దొంగగారు.
"ఇందాక అక్కడ రోడ్ మీద పడ్డ అమ్మాయి సెల్ తీసుకున్నావు కదా అది,మర్యాదగా ఇస్తావా పోలీస్ లను పిలవమంటావా?"
అవాక్కయిన దొంగగారు జేబులో నుంచి సెల్ తీసి ఇచ్చారు!
సెల్ అందుకున్న అమ్మాయి థాంక్ యూ అంకుల్ అంది త్రిల్లింగ్ గా!

అమ్మయ్య మా ఆయనకు ఏమీ కాలేదు బాగానే వున్నారు అని నేను హాయిగా నిట్టూర్చాను. మరి లేకపోతే మధ్య ఎడ్వెంచర్సూ చేయటం లేదు. గాలో ధూళో సోకలేదు కదా!ఏమైనా మంత్రం వేయించాలా?ఎవరు వేస్తారు అని బెంగ పడిపోతున్నాను. అమ్మయ్య రోజు ఎడ్వెంచర్ చేసాము అని ఇంటికి రాగానే చెప్పారు.మరి బెంగతీరి హాపీసే కదా!