Showing posts with label స్వగతం. Show all posts
Showing posts with label స్వగతం. Show all posts

Sunday, December 13, 2020

SEETHAMMA VACHINDI ATHINTIKI | VIDEO SONG | GARJANA | SUMAN | BHANU PRIY...





ఈ రోజు ఈ పాట వినాలనిపించింది.
ఎందుకంటే 52 సంవత్సరాల క్రితం నేను అత్తింటికి వచ్చింది ఈ రోజే. నిన్న పెళ్ళిరోజు. ఏమండీ లేకుండా రెండో పెళ్ళిరోజు :( 

ఈ మధ్యనే ఎక్కడో చదివాను;
" జీవితమంటే నువ్వే.
గతమూ నువ్వే, జ్ఞాపకమూ నువ్వే!"

Thursday, January 2, 2020

2019 !!!

2019
మహిషి గంటలు గణగణా మోగిస్తూ
నువ్వెంత నీ బతుకెంత అని
విజయగర్వం తో వికటాట్టహాసం చేసూ
వెనుదిరిగింది 2019
20202 ఐనా 2030 ఐనా ఒకటే!

Thursday, October 10, 2019

చెదిరిన గూడు

రెక్కలు తెగిపోయి, చెదిరిపోయిన గూడు
ముందు వంటరిగా నిలబడ్డాను
వానలకు వాలిపోయిన రాధామాధవం
తడిసి ముడుచుకున్న మామిడి
ఆకులు నల్లబడ్డ నాగిని
ముందే ఎండలకు మోడైన తెల్ల సంపెంగి
వచ్చావా అని దీనంగా చూసాయి.
హడావిడిగా కరెంట్ తీగ మీద వంటరిగా
పరుగులు పెడుతున్న ఉడత ఒక్క నిమిషం ఆగి
నువ్వూ నాలాగే తోడు కోల్పోయావా అని విచారంగా అంది.
ఎంతసేపు బయట నిలబడతావు
లోపలికి రా అని జాలిగా స్వాగతించింది
శూన్యమైన నా గూడు  .

Thursday, September 12, 2019

coffee



it's coffee time yaar

కాఫీ లు తాగారా ? 

Monday, June 24, 2019

Aahwanam Songs - Manasa Na Manasa - Srikanth, Ramya krishna, Heera.




తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైన నీ రూపం లో నిలిచెగా
తనువు మనసు ప్రాణం నీదైన రోజున, నాదని ఏది లేదుగా
నీవు లేని లోకం నాకు లేదని మనసా మాట్లాడమ్మా


Wednesday, February 27, 2013

తెలుగు వెలుగు లో నేను




పొద్దున్నే మావారు 'మాలా , మాలా' అంటూ గావుకేకలు పెట్టారు . ఏమైందా అని భయపడుతూ పరిగెత్తాను .

'నువ్వు పత్రిక లోకి ఎక్కావు ' అన్నారు .

ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు .' నేనా . . . పత్రిక లోకి ఎక్కటమా ????' అని తెగ హాచర్యపోయి , ఆ పైన నేనేమి చేసానురా భగవంతుడా అని భయపడుతూ 'ఏ పత్రిక లోకండి ?'అని అడిగాను .

ఇదిగో అని "మాలా కుమార్ " అని వున్నది చూపించారు .

 ఇదేమిటా అనుకున్నాను . 'ఓహో జ్యొతి గారు బ్లాగుల గురించి 'తెలుగు వెలుగు 'లో రాశానన్నారు . పేపర్ అతనిని పుస్తకం తెచ్చిపెట్టమంటే ఇంకా మార్కెట్ లోకి రాలేదమ్మా , వచ్చాక తెచ్చిస్తానన్నాడు . వచ్చినట్లుంది . ఐతే నా గురించి కూడా రాశారన్నమాట 'అని స్వగతంగా అనుకుంటూ , మావారి వైపు కాస్త గర్వంగా చూస్తూ పత్రిక తీసుకొని చూసాను .ఎంతైనా మన గురించి వుంది అంటే కాస్త గొప్పే కదా :)

మార్చ్ నెల ' తెలుగు వెలుగు ' లో తెలుగు బ్లాగుల గురించి , కొంతమంది మహిళా బ్లాగర్స్ గురించి జ్యొతిగారు వ్రాశారు . అందులో నాకూనూ కొద్దిగా ప్లేస్ ఇచ్చారు . అదీ సంగతి . ఏమి వ్రాసారంటే ఆ . . . నేనెందుకు చెపుతాను . మీరే పుస్తకం కొనుక్కొని చదవండి . లేదంటారూ ఇక్కడ చదవండి . అక్కడ చూసి వచ్చి ఇక్కడ మీరేమనుకున్నది చెప్పండి :)

థాంక్ యూ జ్యోతిగారు .

Friday, April 23, 2010

కొత్త ఇల్లూ . . . కొత్త కారూ . . . కొత్త సామానూ . . . .



ఈ సామానంతా కొని ఎన్ని సంవత్సరాలైందో . ఓ అల్లనప్పుడు , పెళ్ళైన కొత్తలో దపోడీ ( పూణే ) , యం .సి .యం లో కొత్త కాపురం పెట్టినప్పుడు , కిర్కీ మార్కెట్ లో నేను , మా వారూ , ప్రభ , జాగిర్దార్ , నలుగురము వెళ్ళి కొన్నప్పటివి .అదే పెనం , అదే ఫిల్టర్ , అవే గిన్నెలూ చూసీ , చూసీ విసుగొస్తోంది . పారేయటానికి మనసు ఒప్పదు . ఈ మధ్య పనివాళ్ళ పుణ్యమా అని కొన్ని ఎత్తుకెళ్ళారు , కొన్ని పోయాయి . ముందు బాధేసినా అమ్మయ్య కాగలసిన కార్యం గంధర్వులే తీర్చారులే అనుకొని సంతోషించాను . ఇల్లు మారేటప్పుడు , మా అబ్బాయి సామాను సద్దుతుంటే ఇవన్నీ అనూ కొన్నవీ , వాళ్ళ అమ్మాగారిచ్చినవీ , నేను ఏవో కొన్ని తీసుకుంటాను మిగితావి ఇక్కడే వుండనీయి అన్నాను . అదేమిటమ్మా అలా అంటావు ఇవన్ని నాచిన్నపటి నుండీ చూస్తున్నవే కదా అన్నాడు . స్టీల్ సామాన్లన్నీ అలాగే వుంటాయి లేరా అని పైకి , నీ చిన్నపటినుండి ఏమిటి , నా చిన్నపటినుండీ చూస్తున్నాను అని స్వగతం గా అనుకున్నాను .

పనిలో పని , పాత చీరలు కొన్ని పని మనిషికిచ్చేసాను . మిగిలిన కొద్దో గొప్పో సామానులు ట్రక్ లో వేసుకొని కొత్త ఇంటికి వచ్చాము . మా అబ్బాయి సామానులన్నీ , అన్ని రూములలో సద్దేసాడు . మేము వచ్చేసరికే మా అమ్మాయి కూడా వచ్చేసింది . పాలు పొంగించటానికి కొత్త గిన్నె , నా కొత్త కాపురానికి మరి కొన్ని కొత్త గిన్నెలు తెచ్చి , పాలు పొంగించి పాయసము చేసి , వంటిల్లంతా సద్ది పెట్టింది . రేపు నా వాగ్నార్ పంపుతాను , నీదగ్గరే వుంచుకో అన్నది . ఎందుకమ్మా , నేనెక్కడి కెళుతాను అంటే , సెలవల్లో పిల్లలని నీ దగ్గర వుంచుకుందామను కుంటున్నావు , ఆర్ యసై కి వెళ్ళా లన్నా , స్విమ్మింగ్ పూల్ కెళ్ళాలన్నా ఎలా తీసుకెళుతావు ? నువ్వైనా ఇంకా ఆటో లో ఏం వెళుతావు ? బయటకు వెళ్ళాలన్నప్పుడు డ్రైవర్ ను పిలుస్తే రోజుకింత అని తీసుకొని వస్తాడు ఐనా కార్ ఉంటే నీకేం కష్టం అంది . అవునుకదా నాకేం కష్టం ? ఉంటే గింటే , డ్రైవర్ కూ , పెట్రోల్ కూ కట్టేందుకు వాళ్ళ డాడీ కుండాలి కాని ఎంజాయ్ . అక్కా , తమ్ముడు ఇంకా కొత్త సామానులు కూడా కొన్నుక్కొస్తామని బయిలుదేరారు , కాని నేనే తెచ్చుకుంటాను అని ఆపేసాను . ఏం పిల్లలో అర్ధం చేసుకోరూ . కల్నల్ జాగిర్దార్ , ప్రభ వచ్చి , ఇల్లు చూసి . మేమింకా మీరు బూజులు దులుపుకుంటూ , సద్దుకుంటూ వుంటారనుకున్నాము . ఇల్లంతా నీట్ గా సద్దేసుకున్నారు ఎప్పటి నుండో ఇక్కడే వున్నట్లుగా సెటిల్ ఐపోయారే అని బోలెడు హచర్య పోయారు . మా పిల్లలంటే ఏమనుకున్నారు ? వాళ్ళే సద్ది వెళ్ళారు అన్నాను . ఓహో హో అందరూ పేరెంట్స్ పిల్లలతో కాపురం పెట్టిస్తే , మీ పిల్లలు అమ్మానాన్నల తో కొత్తకాపురం పెట్టించారన్నమాట అన్నారు . పని మనిషిని పంపాను వచ్చిందా అని అడిగింది ప్రభ . ఆ , మేము కార్ దిగగానే వచ్చేసేనింది . మాట్లాడు కున్నాను . ఏంతైనా పనిమనిషి ముఖ్యము కదా చాలా చాలా థాంక్స్ అన్నాను .

మరునాడు సంజు కార్ పంపింది . షాపింగ్ చేయాలంటే డ్రైవర్ ని తీసుకుపో అని పర్మిషన్ ఇచ్చింది .నాకే సొంతం గా కొత్తకార్ వచ్చిందని గొప్ప చూపించుకుందామని ప్రభను షాపింగ్ కి రమ్మన్నాను . ఎంతైనా ఓ అల్లనప్పుడు కూడా ఇద్దరమూ కలసి పూనా లో కొత్తకాపురం కోసం షాపింగ్ చేసాము కదా ! అప్పుడు , మావారు , ప్రభ చెప్పినట్లు కొన్నాను . ఇప్పుడు నా ఇష్టం లల్లా లా అనుకున్నాను . అక్కడి కెళ్ళాక కాని తెలీలేదు పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళానని . అరే మాలా జో కిరికీ మే ఖరీదానా ఓ సామాన్ నైహైక్యా ? తేరా ఐసే కైసే ఖరాబ్ హోగాయా ? మేరా తో అబ్ తక్ పడే హై . మైతో బచ్చోకో భీ దియా అని మొదలు పెట్టింది . హుస్ రామా ఏదీ కొన నీయదే . ఏది కొన బోయినా యే కాంటీన్ మే మిల్తానా వుదర్సే లేలేంగే అంటుంది . ప్లాస్టిక్ సామాన్ల షాప్ లో భయ్యా హం ఆర్మీ కే లోగ హై .హమారా పాస్ ఇత్నా పైసా నహీ రహ్తా తొడా కం కరోనా అని తెగ బేరాలాడి మొత్తానికి కాసిని డబ్బాలు కొననిచ్చిందమ్మా !షాప్ వాడు ఎక్కడ కొడతాడో నని భయపడి పోయాను . అదికాదు ప్రభా , నాదగ్గర లైటర్ లేదు , అదైనా కొందాం . అరెయార్ జల్దీ క్యా హై , కాంటీన్ సె లేలేంగే . అన్ని ఒకేసారి కొనాలని తొందరెందుకు ? చిన్నగా కొను అని సలహాలూ ! కనీసం కాస్త నిమ్మకాయ పచ్చడైనా కొననీయి తల్లీ . నేను పచ్చడులు కూడా తెచ్చుకోలేదు , రేపు ఉప్మా చేద్దామనుకుంటున్నాను , నిమ్మకాయ పచ్చడి లేకుండా ఎలా ?? అంటే ఠా ఠ్ అంది . ఇంకేం చేస్తాను ? చెవులు ఝాడించుకుంటూ వచ్చేసాను హూం .

మీఇద్దరూ రేపు మాజాంగ్ ఆడటానికి వస్తారా ? అని ఇంటికి వస్తుండగా అరుణ ఫోన్ వచ్చింది . మా ఇంట్లో ఆడుదాము , న్యూ హౌస్ వార్మింగ్ పార్టీ , ఈ వారమంతా మా ఇంట్లో నే అన్నాను . వాకే డన్ అంది . మరునాడు , వెజ్ స్ప్రింగ్ రోల్స్ , మైసుర్ పాక్ చేసాను . కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు టైపులో , స్ప్రింగ్ రోల్స్ లోకి కచెప్ లేదు , అచార్ లేదు ఎలాగో తినేసేయండి . తిన్నాక తుడుచుకోను నాప్కిన్స్ లేవు , మీ చున్నిల తో తుడిచేసుకోండి . కావాలంటే నా చున్ని కూడా అరువిస్తాను అన్నాను .. ప్రభ కాంటీన్ తీసుకెళ్ళి కొనిచ్చేదాక ఇంతే అన్నాను ( ఇంకా నయం , అనూ ఆ సెట్ ఇష్టపడి కొనుక్కుందిరా అన్నా వినకుండా , నీకు మాజాంగ్ పార్టీ లుంటాయి కావాలికదా అని ప్లేట్స్ సెట్ పెట్టాడు మా వాడు . లేకపోత చేతులలో వడ్డించాల్సి వచ్చేది ) . ఏమిటీ ప్రభ ను షాపింగ్ కు తీసుకెళ్ళావా ? హ హా అనేసారు అంతా .. నిన్న అరుణ వస్తూ , నీ న్యూ హౌస్ వార్మింగ్ కి గిఫ్ట్ అంటూ గిఫ్ట్ పాకెట్ ఇచ్చింది . లేసులు కుట్టిన ముద్దొచ్చే తెల్లటి హాండ్ నాప్కిన్స్ , కాఫీ కప్స్ సెట్ వున్నాయి . ఆ అన్నట్లు ప్రభ అప్పుడే ఇంటి నుండి నిమ్మకాయా , మామిడికాయ పచ్చడులు తెచ్చి ఇచ్చింది . ప్రేమ ఓ చక్కటి టేబుల్ క్లాక్ తెచ్చింది , కిచన్ లో పెట్టూ అంటూ . మా పిల్లలు ఆడపడుచులూ హాపీ న్యూ హౌస్ అంటూ వస్తూ పండ్లూ , వాళ్ళు వస్తున్నారని నేను ఐస్క్రీమూ తెచ్చాను . ఆ రోజు మా ఫ్రెండ్స్ కు కూడా అన్ని పండ్ల ముక్కలూ , అన్ని ఐస్క్రీంలూ కలిపి ఫ్రూట్ పంచ్ చేసి పెట్టాను . ఒక రోజు అనూ బర్థ్డే కి చేసిన పాయసం పెట్టాను . ఇంకా ఏమైనా కొనాలా , కావాలా అన్నారు అందరూ . మరి బెడ్ షీట్స్ కొనాలి అని నసిగాను .కర్టెన్సూ లేవు చూడాలి ,రేపు నేనేమి చేసిపెట్టాలో , మా ఫ్రెండ్స్ ఇంకా ఏం గిఫ్ట్స్ తెస్తారో !!!

Sunday, March 21, 2010

మిస్టర్ . పెళ్ళాం ?????


మాఏమండీ గారు  , రాజమండ్రి పని మీద వెళుతున్నాను వస్తావా ? అని అడగ్గానే సరే సరే అని ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను . కాని మీకు పని వుందన్నారు ఎంతసేపో అని అనుమానం వెలిబుచ్చితే , అదెంత సేపులే , ఓ గంట లో ఐపోతుంది , ఆ తరువాత ఐ విల్ బి అట్ యువర్ సర్వీస్ . అని వాగ్దానం చేసేసారు . రాజమండ్రి ఎన్ని సార్లు వెళ్ళినా , పూర్తిగా చూడ లేదు , పోయినసారి గుళ్ళూ గోపురాలు చూపించారు , ఈ సారి కోనసీమ సైట్ సీయింగ్ కెళుదాము అనగానే , నీ ఇష్టం ఒక గంట లో నా పని పూర్తికాగానే , నువ్వెన్ని రోజులన్నా , ఎక్కడికన్నా నేను రెడి .అనేసారు అహా ఏమి నాభాగ్యమూ అని పాడుకుంటూ , నేను రాజమండ్రి వెళుతున్నానోచ్ అని వూరూ వాడా చాటింపేసి కార్ ఎక్కాను .

పొద్దున బ్రేక్ ఫాస్ట్ కాగానే , ఓ గంటలో వచ్చేస్తాను , రెడీ గా వుండు అన్నారు మావారు . ఈ లోపల నువ్వు రెండు నవల్స్ తెచ్చుకున్నావుకదా , అవి చదువు , ఇక్కడి నుండి గోదావరి ని చూడు అని సలహా ఇచ్చారు . గంట అంటే , నేను రెండు నవలలు చదివేంత సేపా ? రెండు నవలలేం ఖర్మ , స్వాతి కూడా తెచ్చుకున్నాను అన్నాను . మరింకేం, ఓ గంటలో రాగానే ఐ విల్ బి ఎట్ యువర్ సర్వీస్ మేడం అంటూ వెళ్ళి పోయిన మనిషి , సాయంకాలం ఏడు గంటలకు వచ్చారు . రాగానే సినిమా చూస్తావా ? అంటూ పక్కనున్న అసిస్టెంట్ తో ఏం సినినా బాబూ అది , ఏం మాయచేసావోకాని కదా , పద పద అని హడావిడిగా , నన్ను ఇంకో మాట మాట్లాడ నీయకుండా తీసుకెళ్ళారు . హుం వెళ్ళిన కాసేపటికే ఇంటర్ వెల్ !!! నేనొప్పుకోను నేనొప్పుకోను అంటున్నావా అని ఓ జోక్ . ఏమన్నా ఏం లాభం ?? తిరిగొచ్చేటప్పుడు , మహేష్ మనము వెళ్ళిన సినిమా హాల్ పేరేమిటి ? అని డ్రైవర్ ని అడుగుతే ఏమో మేడం అని చాలా వినయంగా జవాబిచ్చాడు .

పొద్దుటి నుండి మల్లాది నవల , ఎంతేంత దూరం చదువుతూ , మద్య మద్య లో గోదావరిని తీసిన ఫొటోలు ఇదిగో ఇవి .ఆ నవల కూడా పూర్తిగా చదివేసానకోండి



మరునాడు పొద్దున షరా మామూలే !! ఓ గంటలో వచ్చేస్తాగా , రాగానే ఐ విల్ బి ఏట్ యువర్ సర్వీస్ . అప్పటిదాకా ఇంకో నవల చదివేయి . ఇంచక్కా గోదావరిని చూస్తూ వుండు . గోదావరినా ? అసలు ఇక్కడి నుండి కనిపిస్తోందా అని ఉక్రోషం గా అన్నాను . మాట్ల్లడకుండ వెళ్ళి , ఐదు నిమిషాలలో వచ్చేసారు . వచ్చేసారా అని ఆనందం ప్రకటించేలోపలే , పద పద అన్నారు . ఎక్కడికి అంటే చెప్తాగా పద అన్నారు . వెనుకాలే బాయ్ లగేజ్ తీసుకొని వస్తోంటే , ఏమిటీ అంటే పెద్ద సస్పెన్ మేంటేన్ చేస్తూ లిఫ్ట్ లో పై ఫ్లోర్ కు తీసుకెళ్ళారు . ఇదో చూడు , ఈ ఫోర్ నాట్ వన్ రూం నుండి , గోదావరి వ్యూ ఎంతబాగుందో అన్నారు . మరి త్రీటెన్ నుండి గోదావరి వ్యూ సరిగ్గా లేదన్నావు కదా అందుకే రూం మారిపించాను . ఏమిటీ నా మొహం అలా చూస్తున్నావు ? అన్నారు . ఏం లేదండి , మిస్టర్ పెళ్ళాం లో ఆమనిని బురిడీ కొట్టించిన రాజేంద్ర ప్రసాద్ , మీ మొహం లో కనిపిస్తున్నాడు అన్నాను . సరె సరె లే ఓగంట లో వస్తాను రాగానే . . . ఒకే వెళ్ళిరండి అని పంపించి , "నమ్మరాదే చెలి ఈ మగవరిని నమ్మరాదే చెలి" అని ఆమని పాటి కూనిరాగాలు తీస్తూ, వల్లూరి లక్ష్మి రాసిన అనూహ్య తీరాలు నవల చదువుతూ మధ్య మధ్య లో గోదావరిని చూస్తూ తీసిన ఫొటోలు ఇవి !!!



త్రీ టెన్ రూం నుండి , ఫౌర్ నాట్ వన్ రూం నిండి గోదావరి ని ఇంకా చాలా ఫొటోలే తీసాను . అన్ని పెడితే నా బ్లాగ్ గోదాట్లో మునిగి పోతుందేమో ననే భయం తో అన్నీ పెట్టటము లేదు .

ఏమండీ , సాయంకాలము వస్తూనే సారీ మాలా రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళాలి .అనుకోకుండా డైరెక్టర్ గారి తో మీటింగ్ వచ్చింది . నెక్స్ట్ వీక్ వద్దాము . అప్పుడు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు వుందాము . కోనసీమ అంతా తిగుదాము . ఈ పని కాగానే ఐ విల్ బి . . .
అవునులెండి , యూఅర్ ఆల్ వేస్ ఎట్ మై సర్వీసే . ఇహ చేసేదేముంది ? పదండి పోదాం . . . . .
ఇంకేముంది ? ఇహ ఇంతేసంగతులు చలో హైదరాబాద్ .