Sunday, December 13, 2020

SEETHAMMA VACHINDI ATHINTIKI | VIDEO SONG | GARJANA | SUMAN | BHANU PRIY...





ఈ రోజు ఈ పాట వినాలనిపించింది.
ఎందుకంటే 52 సంవత్సరాల క్రితం నేను అత్తింటికి వచ్చింది ఈ రోజే. నిన్న పెళ్ళిరోజు. ఏమండీ లేకుండా రెండో పెళ్ళిరోజు :( 

ఈ మధ్యనే ఎక్కడో చదివాను;
" జీవితమంటే నువ్వే.
గతమూ నువ్వే, జ్ఞాపకమూ నువ్వే!"

Saturday, October 24, 2020

Friday, October 16, 2020

నీ యెంటే నేనుంటా

 


మన కథలు- మన భావాలు గ్రూప్ లో ఇచ్చిన చిత్రం కు నేను రాసిన కథ-

#(చిట్టికథ)#


నీ యెంటే నేనుంటా


మొహానికి అంటుకున్న చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ వచ్చి చెట్టు కింద నిలబడి చుట్టూ చూసింది గౌరి. సూర్యుడు పడమటిదిక్కులకు పయనిస్తున్నాడు. ఎరుపు పసుపు కలిసిన ఆరెంజ్ రంగులో మెరిసిపోతున్నాడు. లేత ఆరెంజ్ రంగులో పరుచుకున్న సూర్యకిరణాలతో ఆకాశం ఆరెంజ్, నీలి రంగులలో మనోహరంగా ఉంది. చిరువేడి గాలులు వీస్తున్నాయి. పక్షులు చిన్నగా చప్పుడు చేసుకుంటూ గూళ్ళకు చేరే ప్రయత్నంలో ఉన్నాయి. సంధ్య అందాన్ని పరవశంగా చూస్తూ పొలం వైపు చూసింది. పొలం లో నిలిచి ఉన్న నీటిని కాలవలోకి మళ్ళిస్తూ పక్కనున్న రైతుతో మాట్లాడుతున్నాడు మహేష్. పైకి ఎగదోపి కట్టిన పంచ, తలకు కట్టుకున్న చిన్న రుమాలుతో గమ్మత్తుగా కనిపించాడు. చుట్టుపక్కల ఉన్న పొలల్లో వీళ్ళ వయసు వాళ్ళే కొంతమంది యువతీయువకులున్నారు. అందరినీ చూస్తుంటే గౌరి మనసు సంవత్సరం క్రితం కు జారుకుంది.

ఒక పేరు ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనిలో, ఒకే టీం లో పనిచేస్తున్నారు గౌరి, మహేష్. ఆ టీం లో ఉన్న పదిమంది అమ్మాయిలూ అబ్బాయిలూ అందరూ స్నేహంగా కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ వారాంతంలో ఏదైనా మల్టిప్లెక్స్ లోనో మరోచోటో ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఒక వారాంతం లో అందరూ కలిసి కాఫీ షాప్ లో ఉండగా " రోజూ పేపర్లో, వార్తలల్లో రైతుల ఆత్మహత్యల గురించి. అందరికీ మనము సహాయపడలేకపోవచ్చు కానీ కొంత మందికైనా మనము సహాయము చేయవచ్చుకదా అని ఈ రోజు పేపర్ లో ఒక రైతు గురించి చదివితే అనిపించింది." అన్నాడు మహేష్.

"అలాగే చేద్దాము. తలా కొంత మనీ వేసుకొని ఏ పేద రైతుకైనా ఇద్దాము" అన్నాడు శ్రవణ్.

"అలా కాదు. మనం ప్రతి వీకెండ్ ఇలా హోటల్స్ కు , సినిమాలకూ తిరుగుతూ మనీ, టైం రెండూ వేస్ట్ చేస్తున్నాము. అలా కాకుండా దగ్గరలో ఉన్న పల్లెటూరు కి వెళ్ళి, అక్కడి రైతు పొలం లో పని చేద్దాము. మనకు కూడా వ్యవసాయం లో ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి. ఇక్కడ నిపుణులను సంప్రదించి రైతులకు కావలసిన సలహాలు ఇద్దాము. మనము ప్రత్యక్షంగా చేస్తుంటే ఎవరికే అవసరమో మనకు తెలుస్తుంది " అన్నాడు మహేష్.

కొంత తర్జనభర్జనల తరువాత ప్రతి వారమూ కాకుండా రెండవ, నాలుగవ శని ఆదివారలల్లో వెళ్ళేట్టుగా అనుకున్నారు. ఆ విధంగానే దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరిని ఎన్నుకొని, అక్కడి పేద రైతుల పొలం లో , రైతులతో పాటుగా పని చేసేందుకు వారిని ఒప్పించారు. అప్పటి నుంచి రెండవ, నాలుగవ శని ఆది వారాలల్లో అక్కడికి వచ్చి పొలంపనులు చేస్తూ రైతులకు సహాయంగా ఉంటున్నారు. ఆర్ధికంగా కూడా సహాయపడుతున్నారు. ఊరివాళ్ళు కూడా వీళ్ళను చూసి ముచ్చటపడి వీరిని ఆదరిస్తున్నారు.

నిన్న, మరునాటి ప్రొగ్రాం గురించి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి "రేపు అందరమూ సరదాగా పంచ కట్టుకొని వెళుదాము. అమ్మాయిలేమో చక్కగా చీరలు కట్టుకొని పల్లెటూరి అమ్మాయిల్లా తయారవండి" అన్నాడు.

ఇక్కడ నుంచి పంచ కట్టుకొని ఎట్లా వెళుదాము అంటే అక్కడి కెళ్ళి మార్చుకుందాము అన్నాడు. సరే ఇదీ సరదాగా బాగానే ఉంది అనుకున్నారు అందరూ. అలాగే ఇక్కడికి రాగానే అబ్బాయిలు షార్ట్స్ నుంచి పంచల్లోకి మారిపోయారు. అమ్మాయిలు చక్కగా చీర కట్టుకొని తయారయ్యారు. ఆలోచనల నుంచి బయటపడి మహేష్ వైపు చూసింది గౌరి. పొలం లో పనైపోయినట్లుంది రైతుతో కలిసి వస్తున్నాడు మహేష్. మహేష్ అంటే తనకున్న ప్రేమను, అతనితో జీవితాన్ని పంచుకోవాలన్న కోరికను మహేష్ చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతోంది. మహేష్ కు తనంటే ప్రేమ ఉన్నట్లుగా అతని కనులు చెపుతున్నాయి కాని  మరి ఎందుకు తనతో చెప్పలేకపోతున్నాడో తెలీటం లేదు. మహేష్ కు తనంటే ప్రేమ ఉందా లేక తనూహించుకుంటోందా? ఆలోచనలో ఉన్న గౌరి మహేష్ తన దగ్గరగా వచ్చి నిలబడగానే తత్తరపాటుగా చూసింది.

ఆకుపచ్చని చీర, ఎర్రని జాకెట్, వాలుజడ, నుదుటన గుండ్రని బొట్టు, మెడలో పూసలపేరు తో అచ్చమైన పల్లెపడుచులా ఉన్న గౌరిని మురిపెంగా చూస్తూ, చేతిలో ఉన్న ముద్దమందారం ను గౌరి జడలో పెట్టి, ప్రేమగా గౌరి చెంపలను పట్టుకొని తనవైపు తిప్పుకుంటూ "నన్ను మనువాడుతావా గౌరమ్మా?" అని అడిగాడు. అప్పటి వరకూ  అవే తలపులలో ఉన్న గౌరి సిగ్గుతో ముద్దమందారం లా ముడుచుకుంది.

హే హే హేయ్ అని అరుస్తూ స్నేహితులంతా చప్పట్లు కొడుతూ చుట్టూ చేరారు. రైతులందరూ సంతోషంగా వారి తో చేరారు.

"ఆకాశం లోనో, సముద్రం అడుగునో ప్రపోజ్ చేయలేను. పచ్చనైన చెట్లు, నీలి ఆకాశం, ఈ కమ్మనైన మట్టిసువాసనలు, అందమైన ఈ ప్రకృతి మధ్య సూర్యభగవానుని సాక్షిగా ప్రపోజ్ చేస్తున్నాను.  ఇలా ప్రపోజ్ చేద్దామనే ఈ డ్రస్ లో వద్దామన్నాను. ఇదిగో గౌరమ్మా ఇప్పుడే చెపుతున్నాను నేను ఇలా పల్లెటూరి రైతులా కూడా అవతారం ఎత్తుతుంటాను. అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడికీ పోను. మరి ఆలోచించుకొని చెప్పు." అన్నాడు మహేష్.

"నీయెంటే ఉంటాను మహేష్ మావా

నీ బాటే నాదీ మహేష్ మావా" అంటూ మహేష్ చేయి అందుకుంది గౌరి.

 

Friday, October 9, 2020

సాలీ ఆధీ ఘర్ వాలీ!

 

సాలీ ఆధీ ఘర్ వాలీ!

మన కథలు- మన భావాలు గ్రూప్ లో ఇచ్చిన కథకు నేను రాసిన కొనసాగింపూ, ముగింపు. చుక్కలు ఉన్నంతవరు గ్రూప్ లో ఇచ్చిన కథ. ఆ తరువాతది నా కొనసాగింపు.

 

"ఏంటండీ అది!? చదవగానే అలా మ్రాన్పడ్డారు!?" చేతిలో కాఫీతో వరండాలోకి వచ్చిన విజయమ్మ, రెండు చేతులతో ఉత్తరం పట్టుకుని నించుండిపోయిన భర్త జనార్థనాన్ని చూస్తూ కంగారుగా అడిగింది.

భార్య వైపు అయోమయంగా చూస్తూ...

"అదేంటి విజ్జీ! నిశ్చితార్థం చేసుకున్నాక, మాకు మీ సంబంధం వద్దంటూ ఉత్తరం రాస్తాడేం ఆ నరసింహం!?" అన్నాడు అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోతూ.

"అయ్యో!? ఇదేం అన్యాయం అండీ!? కారణం ఏంటట!?" ఆందోళనగా అంటూ, కాఫీ అక్కడ టీపాయ్ పై పెట్టి, ఆయన మోకాళ్ళపై చేయివేసి, కాళ్ళ వద్ద కూర్చుంది విజయమ్మ.

"అదేం చెప్పలేదే. 'మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వదలుచుకోలేదు. మీతో మాకే సంబంధం వద్దనుకుంటున్నాం.' అని మాత్రం రాసాడు." ఇంకా అయోమయం నుండి తేరుకోని జనార్థనం.

"హయ్యో! నేను చెబుతూనే ఉన్నా ముందు నుండి...! ఈ వేలు విడిచిన చుట్టరికాలంటూ సంబంధాలు ఖాయం చేసుకోకండి, బంధువులన్న మాటేగానీ, ఎప్పుడో పరాయి రాష్ట్రం లో స్థిరపడిన వాళ్ళ గురించి మనకేం తెలీదంటూ....!" సన్నగా రాగం తీయటం మొదలు పెట్టింది విజయమ్మ.

"కారణం చెప్పకుండా ఇలా చేయటం ఏంటసలు. ఊరంతా పిలిచి వేడుకగా నిశ్చయం చేసుకున్న సంబంధం. ఇప్పుడు ఎందుకు క్యాన్సిలయిందని అడిగవారికి మనం ఏం చెప్పాలి!? పిల్లాడిలో ఏం లోపం ఉందో అనుకుని ఇకపై మన వాడికి సంబంధాలు వస్తాయా!?" ఆందోళనగా అన్నాడతను.

"ఓరి భగవంతుడా!? ఇదేం ప్రారబ్ధం మాకు!? చక్కని పిల్లాడు. బ్యాంకీ మేనెజరూ. ఒక్కడే కొడుకు. ఉన్న ఒక్క ఆడపిల్ల, అక్కకు పెళ్ళి అయ్యి, పురుళ్ళు, పుణ్యాలు పూర్తయి, బాదరబంధీ లేని బతుకు వాడిది. ఒకరిని నొప్పించే మనస్తత్వం కాదు. ఒక్క దురలవాటు లేదు. పైగా మనమంటే పల్లెటూరిలో ఉన్నాం కానీ, వాడు ఉద్యోగం చేసుకుంటూ పట్నం లోనే ఉన్నాడు కదా! ఇక మన పిల్లాడిని వద్దనుకుంటున్న కారణం ఏంటి!?" చిన్నగా శోకాలు మొదలు పెట్టింది విజయమ్మ.

ఆలోచిస్తున్న జనార్థనం కాస్త తేరుకుని, అర్జంటుగా ఈ సంబంధం కుదిర్చిన మీ తమ్ముడు సూర్యాన్ని, మన అమ్మాయి లావణ్యను, ఆమె భర్తను, మన వంశోద్ధారకుడు రాహుల్ ను వెంటనే రమ్మని ఫోన్ చెయ్యి. విషయం చెప్పకు. వాళ్ళు వచ్చాక ఏం చేయాలో అంతా కలిసి నిర్ణయించుకుందాం." ఏదో నిశ్చయించుకున్నట్లు అన్నాడు అతను.

·        * * * * * * * * * * * * * * * * * * * *

లావణ్యా,అశీష్, సూర్యం హడావిడిగా లోపలికి వచ్చి , బయట నే వరండాలో వెనక కు చేతులు పెట్టుకొని అచార్లూ, పచార్లూ చేస్తున్న జనార్ధనం ను, కాఫీ కప్ పట్టుకొని లోపలి నుంచి వస్తున్న  విజయమ్మను చూసి కాస్త స్థిమిత పడ్డారు. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి  అర్జెంట్ గా రమ్మని, ఇంకో మాటైనా చెప్పకుండా ఫోన్ చేసావు. అప్పటికప్పుడు వీళ్ళిద్దరినీ కూడా తీసుకొని కార్ లో వచ్చేసాను ఏమైందక్కా ?" అడిగాడు సూర్యం.

ఏమీ జవాబు చెప్పకుండా భర్తవైపోసారి చూసి లోపలికెళ్ళి, ముగ్గురికీ కాఫీ లు తెచ్చి ఇచ్చింది. అప్పటికే జనార్ధనం సూర్యం కు ఉత్తరం చూపించి సూర్యం పై చెడుగుడాడేస్తున్నాడు. ఇంతలో కార్ వచ్చి ఇంటి ముందు ఆగగానే అటువైపు చూసారు అందరు. కార్ పార్క్ చేసి, పెరిగిన గడ్డం, లోపలికి పోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహం, అరచేతికి బాండేజ్ తో నీరసంగా లోపలికి వచ్చిన రాహుల్ ను ఆశ్చర్యంగా చూసారు.

"రాహుల్ ఏమైందిరా? అట్లా ఉన్నావేమిటి?" దగ్గరికి తీసుకుంటూ గాభరాగా అడిగింది విజయమ్మ.

"ముందు వాడిని ఫ్రెషపై రానీయండి అత్తయ్యా చెపుతాడు" అన్నాడు ఆశీష్.

లోపలికెళ్ళి వచ్చి మౌనంగా అమ్మ దగ్గర కింద కూర్చుండిపోయాడు రాహుల్.

రాహుల్ జుట్టు ప్రేమగా నిమురుతూ " ఏమంది కన్నా ?" అడిగింది విజయమ్మ.

ఇంక ఆగే ఒపికలేక "నరసింహం మీ అబ్బాయి మాకొద్దు అని ఉత్తరం రాసాడు." అన్నాడు జనార్ధనం.

అభావంగా తలెత్తి చూసి, తెలుసన్నట్లు తలూపాడు రాహుల్.

"తెలుసా? అసలేమి జరిగింది ? నువ్వేం చేసావు?" ఇరిటేట్ ఐపోయాడు జనార్ధనం.

"నేను చెప్పలేను. చూపిస్తాను చూడండి." అని పైన తిరుగుతున్న ఫాన్ ను చూపించాడు రాహుల్. అందరూ ఫాన్ వైపు చూస్తుండగా అది తిరిగీ తిరిగీ వీళ్ళనోచోట ఆపింది!

పెళ్ళిచూపులలో చిలకాకుపచ్చ డ్రెస్ లో చిలకలా కనువిందు చేసి, నిశ్చితార్ధం రోజున రాణీకలర్ గాఘ్రా లో తన పక్కన రాణీలా మెరుపులు చిందించిన నిషా, కలలో రారమ్మని పిలుస్తుంటే ఆగలేకపోతున్నాడు. నిషాకనులదానా నన్ను నిషాలో ముంచేస్తున్నావు అని పాడుకునే విరహగీతాలు సాంత్వన కలిగించటము లేదు. ఇక ఉండలేక, పెళ్ళికి నెలరోజులు సెలవు తీసుకున్నావు, ఇప్పుడు వారం సెలవు కావాలంటే ఇవ్వనని చిందులు తొక్కుతున్న పిల్లిగడ్డం బాస్ ను చేతులూ, గడ్డమూ పట్టుకొని బతిమిలాడి, బాస్ గారి పెళ్ళిచూపులను గుర్తుతెచ్చి ఊహలలో తేలిస్తే  సెలవిచ్చేసాడు.  చలో ఢిల్లీ అని డిల్లీ లో నిషా ఇంటి ముందు వాలిపోయి బెల్ కొట్టాడు.

చేతిలో పిల్లి తో, జీన్స్ పాంట్ మీద లేత మబ్బురంగు టాప్ వేసుకొని, అలవోకగా జుట్టును వదిలేసి తలుపు తెరిచిన నిషాసుందరిని పరవశంగా చూస్తూ ఉండిపోయాడు. "వావ్ వాటే సర్ప్రైజ్." అని సంబరపడిపోతూ లోపలికి ఆహ్వానించింది నిషా. నిషాను పరవశంగా, నిషా చేతిలోని పిల్లిని భయంభయంగా చూస్తూ లోపలికి నడిచాడు. మిస్టర్&మిసెస్ నర్సింహం గారు చాలా ఆదరంగా  మాట్లాడారు.

" బేటీ   రాహుల్ ను నీ గదిలోకి తీసుకెళ్ళు. నేనిప్పుడే పదినిమిషాలల్లో వస్తాను." అని నిషా తో ,  "రాహుల్ బేటా లంచ్ చేసి వెళ్ళు. నాకు అర్జెంట్ గా వెళ్ళాల్సి ఉండి వెళుతున్నాను తొందరగానే వచ్చేస్తాను" అని రాహుల్ తో చెప్పి నరసింహంగారు బయటకు వెళ్ళారు.

మిసెస్.నరసింహం కాబోయే అల్లుడి కి వింధుభోజనం ఏర్పాటు చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది. సుతారంగా జుట్టును మునివేళ్ళతో సద్దుకుంటూ ముందుకు వెళుతున్న నిషాను మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా అనుసరించాడు రాహుల్.

"వావ్ నీ గది ఎంత అందంగా పెట్టుకున్నావు" ఎదురుగా పిల్లిపిల్లను ఎత్తుకొని ఉన్న నిషా ఫొటోను చూస్తూ , మనసులోనే దేవుడా అని తల కొట్టుకుంటూ అన్నాడు.

" ఫొటో బాగుంది కదూ?" మురిపెంగా చేతిలోని పిల్లిపిల్లను నిమురుతూ అంది నిషా.

"ఊ చాలా బాగుంది. నీ పిల్లి  కూడా చాలా అందంగా ఉంది. ఆడపిల్లా మగపిల్లా?." నిషా చేతిలోని పిల్లిని చూస్తూ ఏదో మాట్లాడించాలనట్లు అడిగాడు.

" బేబీ గర్ల్. పేరు తోఫీ. తోఫీ జిజియాజీ కో హాయ్ బోలో ." తోఫీని నిమురుతూ అంది నిషా.

చేదుమాత్ర మింగినట్లు ఓ గుటకవేసి  " హాయ్ తోఫీ.  తోఫీ నాకు సాలీనా. సాలీ అధీ ఘర్ వాలీ." అని ఓ ఏడుపునవ్వు నవ్వాడు.

అంతే  కోపం తో ముక్కుపుటాలు అదురుతుండగా, "ఆ ఏమిటీ నీకు ఆధీ ఘర్ వాలీ కావాలా?" అని చివ్వున కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలుచుంది.

"నిషా, నిషా సరదాగా అన్నాను సారీ సారీ." అంటూ వెనుకనే వెళ్ళి నిషా చేయి పట్టుకోబోయాడు. ఆ చేయి తోఫీకి తగిలి అది  రాహుల్ స్పర్స భరించలేనట్లు కోపంగా చూసి కదిలింది. ఆ కదలటం లో నిషా చేతిలో నుంచి జారి, కిటికీ లో నుంచి కింద పడిపోయింది. నిషా కెవ్వ్ మని అరుస్తూ కిందికి పరిగెత్తింది. నిషా వెనుకనే రాహుల్ పరిగెత్తాడు. తోఫీ ది గట్టిప్రాణమేమో  కింద పడ్డా ఏమీ కాలేదు. కాస్త సొమ్మసిల్లింది. నిషా చేతిలోకి తీసుకోగానే కాస్త అటూఇటూ కదిలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాహుల్ ను గుర్రున చూసింది. నిషా దానెత్తుకొని ఫ్లాట్ లోకి వెళ్ళిపోయి, వెనుకనే వస్తున్న రాహుల్ తో " నీ మూలంగా తోఫీ ఆపదలో పడింది. ఇంక నీ దగ్గర ఉంటే ఏమి చేస్తావో!  పైగా ఇంత బుజ్జిదాన్ని ఆధీ ఘర్ వాలీ అంటావా? ఇంక నీ మొహం నాకు చూపించకు." అని తలుపు వేసేసింది.

ఆగిన ఫాన్ తిరుగుతోంది.

"పిల్లికే అంత భయమేమిటి రాహుల్. అది నీకు ఆధీ ఘర్ వాలీ నా ? లంచ్ పోయే,వారం సెలవా పోయే. " పొంగివస్తున్న నవ్వును దాచుకునేందుకు సతమవుతూ అన్నాడు ఆశీస్.

"అలా జోక్ చేస్తే ఇష్టపడుతుందేమో అనుకున్నాను బావా. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు." దీనంగా జవాబిచ్చాడు.

"అదేం జోక్ రా. అంతా తగలేసావు." విసుక్కున్నాడు సూర్యం.

"అబ్బా మీరుండండి. అంతేగా పోతేపోయిందిలే. వెధవ పిల్లి గోల మనకెందుకు? మనకసలే పిల్లులూ, కుక్కలు పడవు. ఐనా అదేమిటిరా తమ్మూ అలా ఐపోయావు? చేతికి ఆ కట్టేమిటి?" అడిగింది లావణ్య.

" పిల్లిని అలవాటు చేసుకుందామని మా అపార్ట్మెంట్ దగ్గర ఒక పిల్లి పిల్లలను పెడితే దాన్ని ఎత్తుకుందామని పట్టుకున్నాను. పెద్ద పిల్లి వచ్చి చేతిని కరిచింది. ఇంజెక్షన్ తీసుకొని వచ్చాను. కాని అమ్మా నాకు నిషా కావాలి." అమ్మ వళ్ళో తల దూర్చాడు.

సెల్ రింగవుతుంటే జనార్ధనం ఎత్తాడు. అవతల నుంచి నరసింహం "బావగారూ ఏమనుకోకండి. పిల్లలేదో పిల్లి కోసం పోట్లాడుకున్నారు. అప్పటికప్పుడు మీ సంబంధం కాన్సిల్ చేసుకోమని నిషా గొడవ చేస్తుంటే ఫోన్ లో చెప్పలేక ఉత్తరం రాసాను. ఇప్పుడేమో రాహుల్ రోజూ చేస్తున్న ఫోన్ కాల్స్ కు కరిగిపోయింది. ముందు అనుకున్నట్లుగానే పెళ్ళి చేసేద్దాము." అంటున్నాడు.

అమ్మ వళ్ళో నుంచి తలెత్తి , రింగవుతున్న తన సెల్ ను చూసి "అమ్మా నిషా ఫోన్ చేస్తోంది." అని సెల్ ఆన్సర్ చేస్తూ చెంగున బయటకు పరిగెత్తాడు.

వెయ్యి ట్యూబ్ లైట్ల వెలుగుతో మొహం వెలిగిపోతుండగా నిషాతో మాట్లాడుతున్న రాహుల్ ను చూస్తూ " సరే కానీయండి." అన్నాడు జనార్ధనం.

 

Saturday, October 3, 2020

గుండెలో గుండె దడ!

 

 

గుండెలో గుండె దడ!

లాస్ట్ వీక్ " 'పొన్నాడ ' వారి ' పున్నాగ వనం" గ్రూప్ లొ ఇచ్చిన, టాపిక్ "యాత్ర లో హాస్యం" కు నేను రాసిన కథ "గుండెలో గుండె దడ."

"మీరసలు వచ్చినట్లే లేదు. లింగడు రానూ వచ్చాడు, పోనూ పోయాడు అన్నట్లు చేస్తారు." అని అలేఖ్య గొణుగుతుంటే , "అందుకే అమ్మా మిమ్మలిని రమ్మనేది. మీరొస్తే హాపీగా అక్క దగ్గర మూడునెలలు, నా దగ్గర మూడు నెలలు ఉండి మనవళ్ళు, మనవరాళ్ళతో ఎంజాయ్ చేయవచ్చు."అన్నాడు దీపక్.

"నాకూ రావాలనే ఉంటుందిరా. మీ డాడీ కూడా అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది కాని , మధ్యలో ప్రయాణమే ఉంది చూసావూ, మీ డాడీ విన్యాసాలతో, ఎప్పు డెవరికి ఏ ఆపద వస్తుందో, ఎందులో ఈ అభిరాముడుగారు  ఆపత్బాంధవుడిలా దూరిపోతారో  అని గుండెలో గుండె దడ పుట్టిస్తుంది." అని వాపోయింది.

" అంతా నీ భయమే కానీ డాడీ మరీ అంత ఓవర్ గా ఏమీ చేయరు. ఐనా ఈ సారి కాస్త గట్టిగా చెపుతానులే." అని కొడుకు అభయమిచ్చి టికెట్స్ బుక్ చేసాడు.

మనవళ్ళతో కొన్ని రోజులు గడపాలనే కోరిక చంపుకోలేక , " అభీ ప్లీజ్ ప్లీజ్  ఏర్ పోర్ట్ లల్లో ఏ సాహసమూ చేయకండీ. ఏదీ పట్టించుకోకండీ. ఎవరి కి వాళ్ళు వాళ్ళ సంగతి చూసుకోగలరు. అక్కడ గార్డ్ లు కూడా ఉంటారు కదా.  కావాలంటే అక్కడికెళ్ళాక చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ " అని  మొగుడిని బతిమిలాడుకుంటూ విమానం ఎక్కి , హాంగ్ కాంగ్ లో పతీసమేతంగా దిగింది. అమ్మయ్య ఇక్కడి వరకు సేఫ్ . ఇక్కడ ఉండే ఎనిమిది గంటలు అభిని కనిపెట్టుకొని ఉంటే  చాలు, లేకపోతే ఎవరికో ఏదో అవసరం వచ్చిందని సిరికిన్ చెప్పడు అన్నట్లు బుర్రున ఉరుకుతాడు  అనుకొని, " ఏమండీ ఇక్కడే వుంటారుగా . నేనిప్పుడే వాష్ రూం కు వెళ్ళి వస్తాను." అని అడిగింది.

"అబ్బా పిచ్చిపోరిలా చేయకు. ఇక్కడుండకుండా  ఎక్కడికెళుతాను." విసుక్కున్నాడు అభిరాం.

ఐనా అనుమానంగా చూస్తూనే వెళ్ళింది. వాష్ రూం నుంచి హడావిడిగా వచ్చేస్తుంటే కాలు జారి పడబోయింది. అక్కడే ఉన్న హెల్పర్ ఓ ముసలావిడ పట్టుకొని ఆపింది. ఓ థాంక్స్ ఆమెకు చెప్పేసి రాబోతుంటే చేయి పట్టుకొని ఆపి కిందపడ్డ హాండ్ కర్చీఫ్ తీసి ఇచ్చింది. పాపం ఏదో అడుగుతుంటే , నీ భాష నా కర్ధం కావటము లేదు తల్లీ,  హాండ్ కర్చీఫ్ కంటే ముఖ్యమైనది తప్పిపోకుండా చూసుకోవాలి నన్ను వదిలేయ్ తల్లీ అని మనసులో అనుకొని , ఆమెకో దండం పారేసి పరిగెత్తి , బాగ్ ల అ దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్న అభిని చూసి అమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది! అభిరాం కూడా వెళ్ళి వచ్చాక ఫుడ్ కోర్ట్స్ వైపు నడిచి, ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నారు. "ఏమైనా తిందామా?" అడిగాడు. పోయినసారి వచ్చినప్పుడు ఏర్ పోర్ట్ లల్లో వెజిటేరియన్స్ ఏమి తినవచ్చో, అందులో ఏమేమి వేయాలని అడగాలో , మనవరాలితో రాయించుకొచ్చిన  డైరీని తీసి చూస్తూ " ఏం తింటావు " అడిగాడు.

"బర్గర్స్ తిందాము. అందులో ఐతే కూరగాయలు, బన్ ఉంటుంది కాబట్టి కడుపు నిండి, మనకు ఫ్లైట్ లో ఏమైనా తినినేందుకు ఇచ్చేవరకూ ఆకలివేయకుండా ఉంటుంది." అని జవాబిచ్చింది.

ఇద్దరూ బర్గర్స్ తిన్నాక ప్లేట్ లు ఇచ్చేసి , పేమెంట్ చేసి వస్తానని వెళ్ళాడు. సోఫార్ సో గుడ్! అనుకుంటూ అందరినీ చూస్తూ టైం పాస్ చేస్తోంది అలేఖ్య. సడన్ గా అరే ఏరీ ఈయన? వెళ్ళి చాలా సేపైంది. బిల్ల్ ఇచ్చి వస్తానని వెళ్ళారు. ఎంతసేపైనా రారు. బిల్ కౌంటర్ దగ్గర లేరు. ఎక్కడి కెళ్ళారు ? రెస్ట్ రూం కనుకుందామనుకుంటే ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చింది.వెతకటానికి ఎక్కడికని వెళ్ళను? పైగా రెండు బాగులు, రెండు హాండ్ బాగులూ పట్టుకొని ఎట్లా పోను. దేవుడా .గుండె దడదడాలాడుతుండా ఆంజనేయస్వామిని తలుచుకుంటూ, కూర్చుంది. దాదాపు గంట తరువాత వచ్చాడు. ఏమీ మాట్లా కుండా అభిరాం వైపు చూసింది.

"ఏమిటి అట్లా చూస్తున్నావు? నీకన్నిటికీ టెన్షనే. షాప్ వాడు చేంజ్ ఫైవ్ చైనీస్ రూపీస్ ఇచ్చాడు. అదేమి చేసుకుంటాము మారుద్దామని అన్ని షాప్ లు తిరిగి ఒక చోట బబుల్ గం పాకెట్ కొన్నాను. పద అటెళ్ళి లాంజ్ లో కూర్చుందాము." అన్నాడు తాఫీగా బబుల్ గం నములుతూ.

ఇంకేమంటుంది పదండి అని లేచింది.

ఇంకా ఐదు గంటలు గడవాలి, అమ్మో ఇట్లా వదిలేస్తే లాభం లేదు అనుకొని, ఏమి చేస్తే బాగుంటుందా అని చుట్టూ చూసింది. లాంజ్ లో చేర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ చోట ప్లగ్ పాయింట్ కనిపించింది.అమ్మయ్య , అభీ అటు కూర్చుందామా అని అటు తీసుకెళ్ళి , అభిరాం  ఐపాడ్ బాగ్ లోనించి తీసి ఇచ్చింది. ప్లగ్ పాయింట్ లో సెట్ చేసుకొని  ఐపాడ్ తీసి బ్రిడ్జ్ ఓపెన్ చేసాడు... అమ్మయ్య ఇంక పరవాలేదు, శ్రీలక్ష్మిలాగా గంట కట్టక పోయినా ఐపాడ్తో కట్టేసాను అని ఊపిరి పీల్చుకొని, తన  బాగ్ ఓపెన్ చేసి, లాప్ టాప్ తీసి, ఈ నెల రెవ్యూ రాద్దామని ఉంచుకున్న నవల కోసం చూస్తే కనిపించలేదు. చదువుదామని పెట్టుకున్న ఆంధ్రభూమీ కనిపించలేదు. ఈ సారి రెండు రోజులముందే అన్నీ సద్దుకున్నాను. లాస్ట్ మినిట్ లో అభీ అన్నీ అటూ ఇటూ చేసారు అనుకుంటూ నా బుక్స్ తీసారా అంటే ఏమో అన్నారు తల ఎత్తకుండానే. ఓసారి అభిరాం ను చూసి నిట్టూరుస్తూ కాసేపు స్పైడర్ ఆడింది.  స్పైడర్ ఆడి విసుగొచ్చి, ఓ కన్ను అభి మీదనే ఉంచి, ఇంకో కన్ను తో ఎదురుగా ఉన్న ట్రాలీలను, ఎన్ని తెచ్చి పెడుతున్నారు, ఎన్ని తీసుకుపోతున్నారు లెక్క పెడుతూ, కిందనుంచి వెళుతున్న ట్రేన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి చూసుకుంటూ, లాంజ్ లో వచ్చేపోయేవాళ్ళను చూస్తూ, ఎదురు బోర్డ్ మీద  ఫ్లైట్ ఎన్నింటికి, ఏ గేట్ దగ్గరకు వస్తుంది వేసారా చూసుకుంటూ, ఒక కన్ను తో చూడటము కష్టమే ఐనా ఎట్లాగో మానేజ్  చేస్తూ టైం పాస్ చేయగా చేయగా భారంగా ఐదు గంటలు గడిచాయి. మొత్తానికి 3rD గేట్ దగ్గరకు వస్తుందని వేసారు. పదండి పదండి, మనము 35 నుంచి 3 కు వెళ్ళాలి అని అభీనీ  లేపింది. అమ్మయ్య ఈ సారి ఐపాడ్ కరుణించింది!

అక్షరాలా లక్ష రూపాయలు తీసుకుంటారు టికెట్ కు కాని ఆ సీట్లు ఎంత ఇరుకో.అటూ ఇటూ మెసిలేందుకే ఉండదు. కాకపోతే జేన్ ఫుడ్ అని చెప్పారు  కాబట్టి భోజనం బాగానే ఉంది. విమానం లో  ఏ సాహసమూ చేసే అవసరం ఉండదు కాబట్టి  అభి సంగతి వదిలేసి హాయిగా తినటం, నిద్రపోవటమే! 12 గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత శాంఫ్రాన్సిస్కో చేరారు.

 

Sunday, September 27, 2020

Monday, September 21, 2020

సువ్వీసువ్వీ పాడాలమ్మా!!!

 

' పొన్నాడ ' వారి ' పున్నాగ వనం . ' గ్రూప్ లో ఇచ్చిన  #సాంప్రదాయం-సైన్స్#  టాపిక్ కు నేను రాసిన కథ.

సువ్వీసువ్వీ  పాడాలమ్మా!!!

రియా వెళ్ళి చాలా సేపైంది ఇంకా రాలేదేమిటీ అని వాష్ రూంస్ వైపు వెళ్ళింది శ్రావణి.అక్కడ ఓ కుర్చీలో ,  మోకాళ్ళు పైకి ముడిచి పెట్టుకొని కూర్చొని,  మోకాళ్ళ మీద తలానించి ఏడుస్తున్న రియాను ఆశ్చర్యంగా చూసి "ఏమైంది రియా ? ఎందుకేడుస్తున్నావు ?" అని కంగారుగా అడిగింది.జవాబివ్వకుండా ఇంకా వెక్కిళ్ళు పెడుతున్న రియాను దగ్గరకు తీసుకొని ఓదారుస్తే,  చిన్నగా తన యూనీఫాం కు అంటిన రక్తం మరకలను చూపించి "ఇవి ఎట్లా వచ్చాయో తెలీటం లేదు.ఇప్పుడు ఏమి చేయను ? భయంవేస్తోంది అమ్మ ఏమంటుందో!" పెద్దగా ఏడ్చింది. ఒక్క క్షణం శ్రావణి కంగారు పడింది. వెంటనే ఈ సంవత్సరము స్కూల్ మొదలయినప్పుడు అమ్మ జాగ్రత్తలు చెప్పి,  తన స్కూల్ బాగ్ లో ఎప్పుడూ ఉంచుకోమని ఇచ్చిన చిన్న కవర్ గుర్తొచ్చింది. వెంటనే క్లాస్ రూం కు వెళ్ళి తన బాగ్ లోని కవర్ తీసుకొచ్చి,  అందులోని పాడ్ తీసి ,రియాకు ఇచ్చి , అది ఎలా వాడాలో చెప్పింది.

"నీకు తెలుసా ఇట్లా  అవుతుందని ? నీకు కూడా అవుతుందా ?" ఆశ్చర్యంగా అడిగింది రియా.

"నాకు ఇంకా కావటము లేదు కాని మా అమ్మ చెపింది ఎప్పుడైనా కావచ్చు,   కంగారుపడకు అని ఇది ఇచ్చి ఎలా వాడాలో చూపించింది. పద మేడం ను అడిగి పర్మిషన్ తీసుకొని వస్తాను.ఇద్దరమూ ఇంటికి వెళుదాము" అంది శ్రావణి.

తొందరగా ఇంటికి వచ్చిన శ్రావణిని చూసి "ఏమైంది?" కంగారుగా అడిగింది స్వాతి.

"నాకేమీ కాలేదమ్మా. రియాకు పిరియడ్ వచ్చింది.రియా ను ఇంట్లో డ్రాప్ చేసి వచ్చాను అంది.

మరునాడు నువ్వులు,  ఎండుకొబ్బరి,  బెల్లం కలిపి రోట్లో దంచి,  చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకొని,  రియాను చూసొద్దామని వెళ్ళింది స్వాతి."రారా స్వాతీ.చూసావా మా రియా మాకు పనిపెట్టింది." సంబరంగా ఆహ్వానిచ్చింది రియా అమ్మమ్మ. అక్కడంతా సందడిగా ఉంది. రియా తాతగారు,  డాడీ,  ఇంకా ఎవరెవరో ఉన్నారు. రియా తల్లి దీప పేపర్ లో ఏదో రాస్తున్నదల్లా,  ఆ పేపర్ పెన్ భర్తకిచ్చి,  రా స్వాతీ అని లోపలికి తీసుకెళ్ళింది. బెడ్ రూంలో మంచం మీద నీరసంగా ముడుచుకొని పడుకొని ఉంది రియా.

"నిన్న స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి , నాకెందుకిట్లా అవుతోంది ఏడుస్తూ ఇట్లాగే పడుకుంది.ఏమీ తినటము లేదు. మమ్మీ ,డాడీ వచ్చారు. ఈ రోజు ఆంటీ అంకుల్ వస్తారు.పెద్ద ఫంక్షన్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నము. బయట చూసావుగా కాటరింగ్ వాళ్ళూ,  పూల డెకరేషన్ అందరూ వచ్చారు. షాప్ కెళ్ళి పట్టుచీరా,  నగా తేవాలి. ఇంకా బోలెడు పనులున్నాయి. ఇదేమో ఇట్లా ఉంది చూడు." అంది దీప కాస్త చిరాకుగా.

రియా పక్కన కూర్చొని మృదువుగా రియాను తట్టింది స్వాతి. స్వాతిని చూసి లేచి కూర్చుంది రియా. "రియా నిన్నటి నుంచి ఏమీ తిలేదటకదా! ఇదో నీ కోసం నేను స్పెషల్ స్వీట్ తెచ్చాను తిని చూడు." అని ఒక చిమ్మిలి ఉండ రియాకిచ్చింది స్వాతి. ముందు కొద్దిగా కొరికి,  పూర్తిగా తినేసింది రియా. అది చూసి కాస్త మొహం చిట్లించి "ఏమిటిది నువ్వుండనా? ఇలా నువ్వుండలు,  పసుపు రాయటమూ దూరంగా కూర్చోపెట్టి ఒక బొమ్మ చేతికివ్వటమూ లాంటి చాదస్తాలన్నీ మేము మానేసాము. పిరియడ్ వస్తే దూరంగా కూడా కుర్చోము. సెక్స్ ఎడ్యుకేషన్ అని అన్ని చెప్పటము నాకు ఇష్టం లేదు." అంది కాస్త విసురుగా దీప.

దీపవైపు సాలోచనగా చూసి,"సెక్స్ ఎడ్యుకేషన్ అంటే నీ దృష్ఠిలో పత్రికలల్లో వచ్చే శృంగారకథలూ,  సలహాలూ సంప్రదింపులా దీపా? వాటి గురించి మనకెందుకు కానీ,  నేను మా శ్రావణికి ముందుగా చెప్పటము గురించి నువ్వు అంటుంటే మాత్రం నేను ఒప్పుకోను. వయసు వస్తున్న అమ్మాయికి తన శరీరంలో జరిగే మార్పుల గురించి ముందుగా తెలియచెప్పటము,  తగిన జాగ్రత్త తీసుకోవటము,  మన బాధ్యత. తెలుసుకోవటము వాళ్ళ హక్కు. ఈ మధ్య కొంతమంది స్కూళ్ళకు వెళ్ళి ఆడపిల్లలకు Menstruation గురించి వివరిస్తున్నారు. అమెరికా లో మాల్స్ లల్లో,  స్కూల్స్ లల్లో,  అన్ని పబ్లిక్ ప్లేస్ లల్లోనూ  లేడీస్ వాష్ రూం లో సానిటరీ నాప్కిన్స్ ఉంచుతారని విన్నాను. మరి మనదగ్గర ఆ ఏర్పాటు ఉందోలేదో నాకు తెలీదు.

ఇక దూరంగా కూర్చోబెట్టటమంటే వారి చిన్ని శరీరానికి విశ్రాంతి ఇవ్వటము. పసుపు ,వేపాకులు మరిగించిన నీటితో స్నానం చేయించటము,  ఈ నాలుగురోజులూ నూనేలో పసుపు కలిపి వంటికి రాయటమూ ,  ఈ మార్పులో సున్నితమైన వారి లేత శరీరానికి ఏ బాక్టీరియా అంటకుండా రక్షణ కవచము ఏర్పరచటము. ఇక నువ్వులూ,బెల్లము,  ఎండుకొబ్బరి,  పులగము లాంటి వాటితో భోజనము పెడితే సులువుగా జీర్ణము అవుతాయి. అంతే కాదు విటమిన్ సి,  విటమిన్ డి ,  అంటూ నానా రకాల టాబ్లెట్స్ మింగించకుండా ప్రకృతిసిద్దమైన విటమిన్లను అందిస్తున్నాము. బొమ్మ ఇవ్వటము అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్ లల్లో రకరకాల ఆటలు ఆడుకుంటూ పిల్లలు బిజీగా ఉంటున్నారు కాని ఆ రోజులల్లో తాటాకుబొమ్మలే కదా ఆడపిల్లలకు ఆటబొమ్మలు. వారికి ఆ సమయములో కలుగుతున్న శారిరీక చికాకు , బాధ  మీద నుంచి ధ్యాస మళ్ళించి ,  బిజీగా ఉంచేందుకు ఇచ్చేవారేమో. ముత్తదువులు "సువ్వీ సువ్వీ " అంటూ రోలురోకలి తో దంచుతే మిక్సీలో కన్నా చక్కగా మెదుగుతాయి అని రొటితో దంచుతూ ,  పాటలు పాడుతూనే బోలెడన్ని విషయాలు చెప్పేవారు. ఈ ఫంక్షన్ అనే కాదు,  గొబ్బెమ్మైనా,  బతకమ్మైనా, పెద్దమనిషి పేరంటమైనా,  సీమంతమైనా ఏదైనా ఆపాటలల్లో జీవిత సత్యాలు ,  మనము ఎలా మెలగాలో భోదించేవారు.

ప్రతి నెలా స్త్రీలు మూడు నుంచి ఐదురోజుల వరకు రుతుస్రావం అప్పుడు  బాధ అనుభవిస్తారు . కొంత మందికి విపరీతమైన బాధ ఉంటుంది. పూర్వకాలము లో ఉమ్మడికుటుంబాలు,  అందరూ పని చేయక తప్పదు. అందుకని మొదటి మూడు రోజులు పూర్తిగా ,  ఆ తరువాత పైపై పనులు చేసుకోవచ్చని ,  మామూలుగా చెపితే వినరని ఇలా దూరంగా ఉంచే ఏర్పాటు చేసారు. కాకపోతే ,  మన పెద్దవాళ్ళు మంచికి ఏర్పాటుచేసిన అన్ని సాంప్రదాయాలలాగే ఇదీ మూర్ఖమైపోయుంది . సువ్వీసువ్వీ అని పాడాలి. మన పిల్లలకు మంచీ చెడూ నేర్పాలి." అని చెప్పి ఒక్క నిమిషం ఆగింది స్వాతి. ఏమి మాట్లాడలేక ఆలోచనలో పడింది దీప. కొద్ది సేపు కూర్చొని తను తెచ్చిన బాక్స్ రియా చేతిలో పెట్టి లేచింది స్వాతి.

"ఇంతసేపు వెళ్ళావు?" అని అడిగాడు కిరణ్.

"ఏముంది చాలామందికి ప్రతిదీ చాదస్తం అంటూ ఓ పాట అలవాటైపోయింది. ఆడంబరాల మీద ఉన్న ఇంట్రెస్ట్ అవసరాల మీద ఉండటం లేదు. ఐనా నాకు తెలీక అడుగుతాను ఏది చాదస్తం ? మా తాతగారింటి ముందు గాబు నిండా నీళ్ళు,  పక్కన ఒక చెంబు ఉంచేవారు. ఇంటికెవరొచ్చినా ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవారు. మడి తో వంట చేసేది అమ్మమ్మ. మా అమ్మ మేము స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి,  బట్టలు మార్చుకుంటే నే కానీ హార్లిక్స్ ఇచ్చేది కాదు. సారీ కిరణ్ ఇన్ని చెపుతున్న నేను ,  నువ్వు మార్కెట్ నుంచి తెచ్చిన కూరలూ,  పండ్లూ అన్నీ విడివిడిగా గిన్నెలల్లో చాలా నీళ్ళు పోసి,  అందులో వేసి కడగ మంటే విసుక్కునేదానిని. సామాన్లు కూడా కాసేపు బయట ఉంచి లోపల పెట్టమంటే అబ్బా అనేదానిని. ఇప్పుడు కరోనా దయవల్ల నాకే కాదు అందరికీ అర్ధం అవుతోంది అవన్నీ ఎంత మంచి అలవాట్లో." అంది స్వాతి.

"కూల్ బేబీ కూల్" అని చిన్నగా స్వాతి చేతి మీద తట్టాడు కిరణ్.

 

 

Friday, September 11, 2020

వాలుచూపుల వయ్యారి!


 

 

 

#చిట్టి కథ#

 

వాలుచూపుల వయ్యారి!

"ఆపండి . . . ఆపండీ " పరిగెత్తుకొస్తున్న అమ్మాయిని చూసి , బస్ ఆపాడు కండెక్టర్.తలుపు దగ్గర నిలబడి ఉన్న హరి, ఆ అమ్మాయి కి చేయి అందించాడు.ఓసారి అతని వైపు వాలుగా చూసి, హరి చేతిని సుతారంగా అందుకొని ,కాలువ దాటి వచ్చి , బస్ ఎక్కింది.

"ఏం రాధమ్మా తోట నుంచి వస్తున్నావా ?" అడిగాడు బస్ లోని ఓ పెద్దాయన.

"అవును తాతా."జవాబిచ్చింది రాధ.

పల్లెటూరి అమ్మాయిలంటే లంగావోణీలతో ముద్దబంతిపూవులా ఉంటారు అనుకునేవాడు.కానీ ఈ అమ్మాయి పంజాబీ డ్రెస్ లో నాజుకుగా సన్నజాజిమొగ్గలా ఉంది. మాట్లాడుతుంటే కోయిల పాటలా ఉంది  అనుకుంటూ రాధ వైపు క్రీకంట చూసాడు. తననే వాలుచూపులు చూస్తున్న ఆ వయ్యారి  రాధమ్మకు ఫిదా ఐపోయాడు హరి.

 కళ్యాణ్ పెళ్ళిలో, కళ్యాణ్ వెనకెనుకే తిరుగుతూ చాలా ఆక్టివ్ గా ఉన్న రాధ కళ్యాణ్ బాబాయి కూతురని తెలియటం తో చాలా సంబరపడిపోయాడు.

"మా బాబాయి రాధకు ఆరు సంవత్సరాల వయసులోనే పోయాడు. అప్పటి నుంచి పిన్ని రాధను కంటికి రెప్పలా పెంచుకుంది.దాన్ని వదిలి ఉండలేక ఊళ్ళోనే హైస్కూల్ లో, పక్క ఊళ్ళో ఉన్న కాలేజీ లో చదివించింది.ఇద్దరికీ అటాచ్మెంట్ ఎక్కువ.వదిలి ఉండలేరు."అన్నాడు కళ్యాణ్.

"పరవాలేదు అత్తయ్యగారు మాతోపాటే ఉంటారు. నో ప్రాబ్లం."అని అప్పటికప్పుడే వరుస కలిపేసి మాటిచ్చేసాడు. మాట, మనసు ఇచ్చేసాక ఇక ఆలశ్యం ఎందుకు పెళ్ళున పెళ్ళైపోయింది.ఆ వెంటనే ఊటీకి హనీమూన్ వెళ్ళేందుకు టికెట్స్ కూడా కొనేసాడు.

"హరిగారూ, హరిగారూ మా అమ్మను కూడా తీసుకెళుదామండీ."గోముగా అడిగింది.

"ఓసి తింగరిబుచ్చీ హనీమూన్ కు అమ్మను తీసుకెళ్ళరే."అని మనసులోనే తల కొట్టుకొని,  మాట మరిపించి రాధతోనే ఊటీలో వాలాడు.

ఆడుతూపాడుతూ ఓ రోజు గడిచిపోయింది.మరునాడు పొద్దున లేవగానే జుట్టు విరబోసుకొని, నైటీ తో విచారం గా కూర్చున్న రాధను చూసి గాభరాపడి "ఏమైంది బంగారూ?"అడిగాడు.

"అమ్మ గుర్తొస్తోంది. ఊరికి వెళ్ళిపోదామండీ "కళ్ళ నిండా నీళ్ళతో అంది రాధ.

"నా రాణీవి కదూ! నిన్ననేగా వచ్చాము.వారం రోజులకు అన్నీ అరేంజ్ చేసుకున్నాము కదా.సరదాగా ఎంజాయ్ చేసి వెళుదాము."బుజ్జగించాడు.

బుజ్జి,కన్న,తల్లీ అని ముద్దుముద్దుగా బతిమిలాడగా బతిమిలాడగా లేచి తయారయ్యింది.బ్రేక్ ఫాస్ట్ తినిపించటం ఒక ప్రహసనం ఐపోయింది.కోరి చేసుకున్న గారాల భార్య ను ఏమీ అనలేడు.భోజనము కూడా సరిగ్గా చేయలేదు.వెళ్ళిపోదామూ వెళ్ళిపోదామూ ఒకటే పాట! అమ్మో రెండోరోజుకే కళ్ళల్లో ప్రాణాలొచ్చేసాయి.ఇలాగే ఉంటే ఇంకేమైనా ఉందా అసలుకే అత్తయ్యగారు మేము వస్తుంటే దేవకన్య ను ఎత్తుకుపోతున్న రాక్షసుడిలా నన్ను చూసారు.అప్పుడు అమ్మా, కూతురు కళ్ళు తుడుచుకుంటుంటే ఎప్పుడూ వదిలి ఉండక బెంగేమో అనుకున్నాడు కాని ఇంత ఘాడమైన సీనుందని తెలీలేదు.బాబోయ్ అని హడలిపోయి, ఓ ట్రావెలర్ చేతులూ గడ్డం పట్టుకొని టికెట్ సంపాదించాడు.

ఇంటికి చేరగానే అమ్మ ను వాటేసుకొని ఓసారి భోరుమని, ఆ తరువాత కిలకిలా నవ్వేసింది రాధమ్మ.ప్రేమయాత్రలో ప్రేమ ఏమోకాని ఏడ్చేపెళ్ళాన్ని, పుట్టబోయే పిల్లలను బతిమిలాడే అనుభవం సంపాదించేసాడు.అమ్మయ్య!

అత్తయ్యగారు ప్రేమారగా రకరకాల వంటలు చేసి కొసరికొసరి వడ్డిస్తే కడుపారా తిని భుక్తాయసం తో కూర్చున్న హరి తో " సన్నజాజి పందిరి కింద పక్క వేయించాను.రండి హరిగారూ."అని చేయి పెట్టుకొని, వాలుగాచూస్తూ  వయ్యారంగా తీసుకెళ్ళింది రాధ. పుచ్చపువ్వులా ఉన్న వెన్నెలలో, పందిరి నిండా విచ్చుకొని సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజుల పరిమళం, తెల్లని పక్క మనోహరంగా ఉంది.

"కాశ్మీరు లోయలో కన్యాకుమారి తో" అని హనీమూన్ చేసుకుందామనుకున్నాను. వెధవ టెరరిస్ట్ ల గోల తో ఆ చాన్స్ పోయింది.పోనీలే ఊటీలో ఝామంటూ తిరుగుదామనుకుంటే చివరకు "సన్నజాజి పందిరి  కిందా  " అని పాడుకోవలసి వచ్చింది విరక్తి గా అనుకున్నాడు  పాపం హరి!

Friday, September 4, 2020

Thursday, August 27, 2020

Friday, August 21, 2020

Sunday, August 16, 2020

E19 - మా ఏమండీగారూ - ఆవకాయ...

B+ with Bhaskar - KathakaLa - By Paracha, Chelluri, Kasivajhala - Aug ...



+B bhaskar  గారి కథాకళ సమూహం లో నేను చదివిన "గుండెలో గుబులెందుకు".లైవ్ షో .



Monday, August 3, 2020

Thursday, July 30, 2020

Tuesday, July 28, 2020

Wednesday, July 22, 2020

11 - వీడు వెరుపెరగడు సూడవ...

Ep 10 - ఎంతెంత దూరం

E09- మై హూం యమధర్మరాజ్ !!!...

E08 - పౌరుషిణి 2

E06 - నన్ను వదిలి నీవు పోలేవులే!

E07 - పౌరిషిణి |

E05 - మబ్బుల పల్లకి 

E04 - ఆపరేషన్ సక్సస్ పేషంట్ డైడ్!!!

E03 - కందిపప్పు కావాలా బాబూ!!!

E02 - గాజర్ హల్వా

E01 - ప్రభాత కమలం







నా ఏమండి కథలన్నీ ప్రభాతకమలం అన్న ఛానల్ ఓపెన్ చేసి పెడుతున్నానన్నాను కదా ఇది మొదటిది. మీరు విని మీకు నచ్చితే sabscribe చేసి లైక్ కొట్టండి.

Sunday, July 5, 2020

కందిపప్పు కావాలా బాబూ !!!


3.కందిపప్పు కావాలా బాబూ!


నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
కొత్తకుండలో నీరు చల్లన, కొత్తకాపురం తియ్యన! కానీ ఈ వంటిల్లు ఉంది చూసారూ మహా  చిలిపిది.కొత్తపెళ్ళికూతురిని తికమక , మకతిక పెట్టేసి చెడుగుడు ఆడిస్తుంది.అందులోనూ చదువు నుంచి డైరెక్ట్ గా వచ్చిన అమ్మాయంటే దానికి మహా అలుసు.అలా అది నన్ను ఏడిపించిన  ఓ విషయం మొన్న గాజర్ హల్వా లో చెప్పాగా!ఈ రోజు ఇంకోటి,నా ఏమండీ కథలల్లోని మూడో కథ "కందిపప్పు కావాలా బాబూ!" లో చెపుతాను .సరేనా!

తీరికగా నవల చదువుకుంటున్న నాతో మా అమ్మాయి "ఇండియన్ స్టోర్స్ కు వెళుదాము రామ్మా "అని పిలిచింది.నవల పక్కన పెట్టి తన తో బయలుదేరాను.స్టోర్ లో ఏమేమి ఉన్నాయా అని చూస్తున్న నాకు ,పక్క రాక్ దగ్గర నుంచి "ఇందులో కందిపప్పూ ఏదిరా ? మనం ఏమి తీసుకోవాలి?" అని ఓ అబ్బాయి మాట వినిపించింది.తెలుగు మాట వినిపించగానే ఎవరో తెలుగువాళ్ళు ఉన్నారే అనుకుంటూ తొంగి చూసాను.ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారు.ఒక అబ్బాయి చేతిలో కందిపప్పు,సెనగపప్పు,పెసరపప్పు ఉన్న పొట్లాలు పట్టుకొని రెండో అబ్బాయిని అడుగుతున్నాడు.
"ఏమో రా మా అమ్మ వచ్చే ముందు చూపించి చెప్పింది కాని ఇప్పుడు గుర్తు పట్టలేకపోతున్నాను."అన్నాడు రెండో అబ్బాయి.
ఆ సంభాషణ వినగానే నా మనసు నా పెళ్ళైన కొత్తరోజుల్లోకి, పూనాకి వెళ్ళిపోయింది, అచ్చట్లు ముచ్చట్లు , చిటిపొటి అలుకలతో మా కొత్తకాపురం మొదలై అప్పటికి రెండు నెలలైంది.పూనాకు వచ్చే ముందు ,వెళ్ళగానే సరుకులు ఏమి కొనుక్కుంటారు అని అమ్మ,అత్తయ్యగారు వంటకు కావాల్సిన పప్పులూ, బియ్యం తో సహా అన్నీ మూడు నెలలకు సరిపోను కట్టి ఇచ్చారు.ఇద్దరూ విడివిడిగానూ, కలిసీ ఏవి ఏవో ,ఎట్లా వాడాలో చెప్పారు.సరే ఇహ కొత్తకాపురమూ, కొత్త మొగుడూ,కొత్తవంటా లో మూడునెలల సరుకులూ రెండు నెలలకే ఐపోయాయి.సరుకులన్నీ ఐపోతున్నప్పుడే ఏమండీ తో సామాన్లు తెచ్చుకోవాలీ అని చెపుతునే ఉన్నాను కాని ఏమండీకి ,పరీక్షల మూలం గా టైం దొరకటం లేదు.పోనీ నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుందామా అనుకుంటే , వచ్చీరాని హిందీ.దేనిని ఏమంటారో తెలీదు.పైగా హైదరాబాద్ లో ఉన్నప్పుడోసారి బజార్ కు వెళ్ళినప్పుడు అరటిపండ్లు బాగుంటే కొందామని ఎంతకిస్తావు బాబూ అని అడిగాను.
"సవా రూపియాకో డజన్" అన్నాడు.ఏది కొన్నా బేరం ఆడాలి కదా.వాళ్ళు చెప్పిన రేట్ కు కొంటామేమిటి అనుకొని "దేడ్ రూపియాకు దేదో." అన్నాను. అతను నా వైపు ఎగాదిగా చూసి ఇచ్చేసాడు.భలే బేరమాడాను అని సంతోషపడిపోతూ ఇంటికి వచ్చి అత్తయ్యగారితో చెప్పాను.ఆవిడ "ఓసి పిచ్చిపిల్లా సవ్వారూపియా అంటే, రూపాయి పావలా.దేడ్ రూపియా అంటే రూపాయిన్నర.వాడు రూపాయి పావలాకి ఇస్తానంటే నువ్వు రూపాయన్నరకు తెచ్చావు."అన్నారు.సో అలా ఉండే నా హిందీ తో ఏమి కొంటాను?
ఇక ఆరోజు కాలేజ్ కు వెళ్ళే ముందు "ఏమండీ ఇంట్లో పెసలు తప్ప అన్నీ ఐపోయాయి.ఏమీ లేవు.ఈ రోజు సామాన్లు తెచ్చుకోకపోతే కష్టం "అన్నాను.
"పెసలు ఉన్నాయిగా,నీకు పెసరట్టు చేయటం బాగానే వచ్చిందిగా. ఈ రోజు కు పెసలు నానబోసి రాత్రి కి పెసరట్టు చేసేయి. ఈ రోజు ఎగ్జాం ఐపోయాక ,సాయంకాలం వెళ్ళి తెచ్చుకుందాము."అన్నారు ఏమండి.
కాలేజ్ నుంచి వచ్చాక సాయంకాలము షాప్ నుంచి వచ్చాక రుబ్బేందుకు ఓపిక ఉంటుందో ఉండదో అని పొద్దున నానబోసిన పెసలు రుబ్బి, తయారై ఏమండీ కోసం ఎదురుచూస్తున్నాను. ఏమండీ హడావిడి వచ్చి, "పదపద , ఎగ్జాంస్ ఐపోయాయని అందరమూ సినిమా ప్రోగ్రాం వేసుకున్నాము."అని హడావిడి చేసారు.
"సినిమాకా ? సామాన్లు తెచ్చుకోవాలి కదా."అన్నాను.
"పరవాలేదు లే రాత్రికి, రేపు బ్రేక్ ఫాస్ట్ కూ పెసరట్టు, మాగాయి తినేద్దాము.అంతగా ఐతే లంచ్ కూడా మెస్ లో తినవచ్చు. లంచ్ ఐనాక అటునుంచి అటే వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం.పద"అన్నారు.
సినిమా అయ్యాక అందరూ అక్కడే ఉన్న ఉడిపి హోటల్ లో కి నడిచారు.నేను  అంత కష్టపడి రుబ్బిన పెసర పిండి పాడైపోతుంది అని గొణుగుతుంటే,ఏమండి మేము ఇంటికి వెళుతాము చెప్పి అని వచ్చేసాము. ప్రెషప్ ఐ అట్లు వేయటం మొదలు పెట్టాను.వేడివేడిగా అట్లు తిందామనుకుంటే  వేసిన అట్టు వేసినట్లే పెనం కు అతుక్కుపోతోంది.దాని దుంపతెగ ఎంతకీ ఊడిరాదే! అట్లకాడ తో గీకీ గీకీ ఆ ముద్దను సింక్ లో పడేయటమూ, ఇంకోటి వేసి మళ్ళీ గీకటం.ఏమండీ కూడా ప్రయత్నం చేసారు.అబ్బే ఏమాత్రం లొంగలేదా పెసరట్టు.అదే పిండి, అదే పెనం, అదే స్టవ్.ఎప్పుడూ చేసేవే.మరి ఇప్పుడేమొచ్చింది వాటికి.రేపొద్దున బ్రేక్ ఫాస్ట్ కు కాదుకదా ఇప్పుడు డిన్నర్ కు కూడా లేకుండా పిండి మొత్తం ఐపోయి చేయి నొప్పి మాత్రం మిగిలింది.ఇద్దరమూ మొహామొహాలు చూసుకుంటూ కూర్చున్నాము.మొహాలు చూసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదుగా!అప్పటికి రాత్రి పదకొండైంది.బయట కనీసం పండ్లేమైనా దొరుకుతాయేమో చూసొస్తానని ఏమండీ స్కూటరేసుకెళ్ళి చుట్టుపక్కలంతా వెతికారు.ఎక్కడా ఏమీ దొరకలేదు.ఇక చేసేదేమీ లేక రాత్రి కోసం తోడుబెట్టిన పెరుగు ఇద్దరమూ చెరో కప్పూ తిని, మరునాటి కాఫీ కోసం ఉంచిన పాలతో చేరో కప్ కాఫీ తాగి పడుకున్నాము. పెరుగూ. కాఫీ సూపర్ కాంబినేషన్ కదా!
మరునాడు బ్రేక్ ఫాస్ట్ , లంచ్ మెస్ లో కానిచ్చేసాము.లంచ్ తరువాత మెస్ నుంచే కిరాణా దుకాణం వెళ్ళాము.దుకాణం లో ని పని పిల్లవాడు "ఏమి కావాలి?"అని అడిగాడు.అవునూ ఏమేమి కావాలని చెప్పాలి? మళ్ళీ ఇద్దరి కీ అనుమానం.బియ్యం ను చావల్ అని, పిండిని ఆటా అని, పప్పును దాల్ అని అంటారని మాత్రమే తెలుసు.కానీ ఏవేవి ఎంతెంత కావాలని అడగాలి ? కాస్త ఆలోచించి,"చావల్ అధా కిలో, దాల్ ఆధా కిలో"అని చెపుతుండగా ఆవాలని రాయీ అంటారనీ, జీలకర్రను జీరా అంటారనీ గుర్తొచ్చి,"రాఈ ఏక్ కిలో, జీరా ఏక్ కిలో, ఆటా ఏక్ కిలో"అని చెప్పాను.అతను "దాల్ కౌన్ సా దాల్?"అని అడిగాడు.అవునూ కంది పప్పు ను ఏమంటారు? అని ఇద్దరమూ ఆలోచించాము కాని తెలీలేదు.ఇంతలో దుకాణం పిల్లవాడు మిగితా సామాన్లు పొట్ల కట్టి తెచ్చాడు.ఇదేమిటి బియ్యం ఇంత తక్కువగా, ఆవాలూ జీలకర్ర ఇంత ఎక్కువగా ఉన్నాయి అని గడబిడ పడ్డాను.ఏమి దాల్ కావాలో చెప్పండి అన్నట్లు నిలబడ్డాడు.ఏమండీ "సాంబార్ చేసుకుంటామే ఆ దాల్"అన్నారు.అతను అది నాకు తెలీదు అన్నాడు అతను..ఇంతలో అక్కడే బల్ల ముందు కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న దుకాణం ఓనర్ మా ఇబ్బంది చూసి లేచి వచ్చి "నయా సాదీ హువా క్యా? మదరాసీ హై క్యా?"అని అడిగాడు.ఏమండి అవును అన్నారు.
అప్పుడు ఆయన "ఇక్కడికి దగ్గరలో ఒక మదరాసీ వాళ్ళున్నారు.ఆ అమ్మ ఎప్పుడూ మా దగ్గరే సామానులు కొంటుంది.వెళ్ళి వాళ్ళ ను అడగండి.మీకు ఏమేమి కావాలో చెపుతారు."అని వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాడు.
వాళ్ళ ఇల్లు తొందరగానే కనుక్కున్నాము.బెల్ కొట్టగానే ఒకాయన వచ్చి తలుపు తీసి, మమ్మలిని చూసి ఆశ్చర్యపోయి ఏమిటి అని అడిగారు.ఏమండి మమ్మలిని పరిచయము చేసుకొని, మాకు వచ్చిన ఇబ్బంది చెప్పి,దుకాణాదారు వాళ్ళ అడ్రెస్ ఇచ్చాడని చెప్పారు.ఆయన మమ్మలిని లోపలికి ఆహ్వానించి , మమ్మలిని కూర్చోమని "ప్రమీలా"అని పిలిచారు.లోపలి నుంచి ఒకావిడ వచ్చారు.ఇద్దరూ నడి వయసు దంపతులలా ఉన్నారు.ఆవిడను చూపిస్తూ," నా భార్య ప్రమీల.నా పేరు రామారావు"అని మాకు పరిచయం చేసి "వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళుట.సరుకులు కొనుక్కోవటానికి దుకాణం కు వస్తే ఏమి కొనుక్కోవాలో తెలీలేదుట.శేట్ జీ మనింటికి పంపాడుట."అని ఆవిడకు చెప్పారు.
ఆవిడ మమ్మలిని మరీ ఏమీ తెలీని పిచ్చిమొహాలనుకుంటుందేమో నని,ఏమండీ ఏదో చెప్పబోయే లోపలే "అన్ని సరుకులూ కాదండీ.బియ్యం అర్ధకిలో, పిండి కిలో ,ఆవాలూ జీలకర్రా కిలో కిలో చెప్పానండి.కానీ పప్పులను ఏమంటారో తెలీలేదు."అని గబగబా చెప్పేసాను.
రామారావుగారు "బియ్యం అర్ధకిలో, పిండి కిలో చెప్పావా? పిండి ఎక్కువెందుకు చెప్పావు ? ఆవాలు కిలో చెప్పావా?ఆవకాయ పెడతావా?" తమాషాగా అన్నారు.
ఏదో ఊపులో చెప్పానే కాని అసలుకే కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే నే నాకు భయం.పైగా ఆయన అలా నవ్వుతూ అంటే ఇంకా భయం వేసింది."ఏమండీ పొద్దునా సాయంకాలమూ ఫులకాలే తింటారండీ.అందుకని ఆటా కిలో చెప్పానండి.నాకు ఆవకాయ పెట్టటం రాదండి."అన్నాను బిక్క మొహం వేసుకొని భయం భయం గా.
"మీరూరుకోండి."అని ప్రమీలగారు ఆయనను మందలించి,"నువూ రామ్మా .సరుకులు చూపిస్తాను"అని నా భుజం చుట్టూ ఆప్యాయంగా చేయి వేసి వంటింట్లోకి తీసుకెళ్ళారు.ఏమండి రామారావుగారిని అడిగి పెన్, పేపర్ తీసుకొని మా వెనుకే వచ్చి, "ఊరికే వినటం కాదు ఈ పేపర్ లో వాటి పేర్లు హిందీలో ఏమంటారో రాసుకో"అని నాకు ఇచ్చారు.
"కంది పప్పు ను తూర్ దాల్ అంటారు.మీకు నెలకు ఒక కిలో సరిపోతుంది.ఇది శెనగపప్పు.దీన్ని చన్నా దాల్ అంటారు.పోపులోకే కదా పావుకిలో చాలు."అని ఒక్కొక్క పప్పునూ చూపిస్తూ చెపుతున్న ఆవిడతో,"శెనగ పప్పు అంటే భక్షాలు చేస్తారు కదా.అదేగా ఐతే ఒక కిలో తీసుకుంటాను."అన్నాను.
"నీకు భక్షాలు చేయటం వచ్చా?"ప్రమీలగారు ఆశ్చర్యంగా అడిగారు.
"ఓ వచ్చండి.మా అత్తగారు చేస్తుంటే చూసాను."అన్నాను.
ఆవిడ ఇంకేమీ అనకుండా సరుకులన్నిటి పేర్లూ హిందీ లో చెప్పి, సుమారు మా కిద్దరికీ నెలకు ఎంత అవసరముంటాయో చెప్పారు.అన్నీ వివరంగా బుద్దిగా రాసుకున్నాను.ఆ తరువాత కాసేపు  కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని, ప్రమీలగారు పెట్టిన మైసూర్ పాక్,జంతికలూ తిని , చాయ్ తాగి ఆవిడకు థాంక్స్ చెప్పి లేచాము.అప్పుడప్పుడూ రమ్మని మమ్మలిని వాళ్ళు,వాళ్ళను కూడా మా ఇంటికి రమ్మని మేమూ ఆహ్వానించుకున్నాము.ఆ విధం గా నా వంటింటి మీద విజయం సాధించాను అనుకోని సంబరపడ్డాను.
మరునాడు ఆదివారం కావటం తో తీరికగా బ్రేక్ ఫాస్ట్ చేసి, పప్పు ,పాలకూర కలిపి కుక్కర్ లో వేసి, స్టవ్ మీద పెట్టి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో రాసుకుంటున్న ఏమండీ పక్కన కూర్చొని దొండకాయలు కట్ చేస్తున్నాను.ఇంతలో "ఢాం" అని పది తుపాకులు ఒక్కసారే పేల్చినంత పెద్ద సౌండ్ వచ్చింది.ఇద్దరమూ ఉలిక్కి పడ్డాము.ఆ చప్పుడు ఎక్కడి నుంచి వచ్చిదో అర్ధం కాలేదు.ఇంతలో బయట నుంచి "కుమార్. . .  కుమార్ "అని గట్టిగట్టిగా పిలుస్తూ ఎవరో తలుపులు దబదబ బాదుతున్నారు.ఏమండీ గబగబా వెళ్ళి తలుపు తీసారు.పక్కింటి కాప్టెన్.బల్బీర్ ,ఆయన భార్య ఇంకా కిందింటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు.ఏమైందో మాకు అర్ధం కాలేదు.బల్బీర్ "ఏమైంది?అంత పెద్ద చప్పుడు వచ్చింది.మీరిద్దరూ బాగానే ఉన్నారుగా?"అని కంగారుగా అడిగాడు.
"మాకేమయ్యింది.చప్పుడు మా ఇంట్లో నుంచి వచ్చిందా?" అన్నారు ఏమండి.
అందరూ ఇల్లంతా హడావిడిగా వెతుకుతున్నారు.ఇంతలో ఎవరో వంటింట్లో నుంచి "ఇక్కడ కుక్కర్ పేలింది."అని అరిచారు.అందరూ అటెళ్ళారు.
కుక్కర్ మూత ఊడి కిందపడిపోయి ఉంది.పప్పు పైన సీలింగ్ కూ, కిందా అంతా చల్లినట్లుగా పడి ఉంది.గాస్ స్టవ్ నొక్కుకుపోయింది.
"కుక్కర్ పేలి పైకి ఎగిరి ,కిందకు స్టవ్ మీద పడి , కింద నేల మీద కు పడినట్లుంది."అన్నారు ఎవరో.
"ముందు గాస్ బంద్ చేయండి."అన్నారు ఎవరో.ఏమండి గబగబా లోపలికెళ్ళి గాస్ బంద్ చేసారు.అసలు కుక్కర్ ఎలా పేలింది అనుకోసాగారు అందరు.
బల్బీర్ వాళ్ళింటికి లంచ్ కు వచ్చిన కాప్టెన్ స్వామినాధన్ వాళ్ళ అమ్మగారు ,"కుక్కర్ లో నీళ్ళు తక్కువయ్యాయేమో, ప్రెషర్ ఎక్కువై పేలిపోయింది.సేఫ్టీ వాల్వ్ దగ్గర కడిగి నప్పుడు కొబ్బరి పిచో, మట్టో అడ్డంపడి మూసుకుపోయి ఉంటుంది.అందుకని సేఫ్టీ వాల్వ్ తెరుచుకోలేదు. ఇంకా నయం అమ్మాయి బయట ఉండబట్టి సరిపోయింది.వంటింట్లోనే ఉంటే ఏమయ్యేదో."అన్నది.
బిత్తరపోయి జరుగుతున్నదంతా అయోమయం గా చూస్తున్న నా దగ్గరకు వచ్చి ఏమండీ నా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు.నన్ను కూర్చోబెట్టారు.అప్పటికి కాస్త తేరుకున్న నా దగ్గరకు ఆ పెద్దావిడ వచ్చి నా తల నిమురుతూ "భయం లేదులే.అదృష్టవంతురాలివి పెద్ద ప్రమాదం తప్పింది.కుక్కర్ లో ఏమి వేసావు ?" అని అడిగారు.
"పాలకూరా,పప్పు వేసాను పిన్నిగారు."అన్నాను.
అందరూ కాసేపు జరిగిన దాని గురించి మాట్లాడుకొని ,మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు.ఆ పిన్నిగారు ఏదో అనుమానం వచ్చినదానిలా "ఏ పప్పు వేసావు ? ఎంత నీళ్ళుపోసావు?"అని అడిగారు.ఆవిడను లోపలికి తీసుకెళ్ళి నేను వేసిన పప్పు చూపించాను."మీరు శెనగపప్పుతో వండుకుంటారా?" కాస్త అనుమానంగా అడిగారు."కాదండీ ఇది కంది పప్పే కదా?"అడిగాను నేను.
"కాదు శెనగపప్పు.దీనికి ఎక్కువ నీళ్ళుపోయాలి.నువ్వు తక్కువ నీళ్ళుపోసావు.పైగా సేఫ్టీ వాల్వ్ మూసుకుపోయింది.అందుకే పేలింది."అని చెప్పి కందిపప్పుకూ, శెనగపప్పుకూ తేడా చూపించి , లేబుల్ మీద వాటి పేరు రాసి డబ్బా మీద అతికించుకో అని సలహా చెప్పి ఆవిడా వెళ్ళిపోయారు.
అప్పటికి స్టోర్ లో సామాన్లు కొనటం ఐపోయి , బిల్ కూడా పే చేసిన మా అమ్మాయి, "అమ్మా రా" అని పిలవటముతో కొత్తకాపురమూ, నా వంటిల్లు నుంచి బయట పడ్డాను.
ఇంకా "ఇంతకీ ఇందులో కందిపప్పు ఏదిరా?" అని తర్జనభర్జనలు పడుతున్న ఆ అబ్బాయిల దగ్గరకు వెళ్ళి "కందిపప్పు కావాలా బాబూ?" అని అడిగాను.
వాళ్ళిద్దరూ నా వైపు చూసి అవునాంటీ అన్నారు ఒక్కసారే.వాళ్ళకు కందిపప్పు చూపించి "దీని మీద తూర్ దాల్ అని రాసి ఉంటుంది.గుర్తుపెట్టుకోండి."అని చెప్పి మా అమ్మాయితో బయటకు నడిచాను.