
మా వారి పూజ కోసం దేవుడి ముందు అంతా శుభ్రం చేసి , పూలు కోసుకొద్దామని ,పూల బుట్ట అందుకున్నాను . అందుకునే ముందు ఓక్షణం ఆలోచించాను పెద్ద ది తీసుకోనా చిన్న బుట్ట తీసుకోనా అని పెద్ద బుట్టైతే చాలా పూలు పడుతాయి. అమ్మో అన్ని పూలు కోయటమే ! అందుకని చిన్నదే తీసుకొని , ఎందుకైనా మంచిదని టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ సద్ది , మెడిసన్స్ పెట్టి పూల కోసం బయిలుదేరాను :)
నాతో పాటు మీరూ వస్తున్నారుగా తోటలోకి :)









ఏ పూవు చూసినా కోయబుద్ది కాదు . చెట్టుకే అందం గా వున్నాయి అనిపిస్తుంది . తోట అంతా తిరిగి , మొక్కలన్నిటినీ పలకరించి , నాలుగు పచ్చగన్నేరు , నాలుగు రెక్కవర్ధనం , ఓ రెండు మందారాలు కోసుకొని , ఇంట్లోకి నడుస్తూవుంటే మావారు మెట్ల మీద ఎదురైనారు . అదేమిటి అప్పుడే వెళుతున్నారు , పూజ చేసుకోరా అంటే చేసాను అన్నారు . బ్రేక్ ఫాస్ట్ అన్నా అదీ ఐందన్నారు . మెడిసన్స్ వేసుకున్నారా అంటే ఆ అన్నారు . మరి పూలు కోసుకొచ్చాను , దేవుడి కి పెట్టరా అంటే నువ్వు పెట్టేయ్లే అని బై చెప్పి వెళ్ళిపోయారు ! ప్రతిరోజూ అంతే . తొందరగా పూలు కోసుకొద్దామనే వెళుతాను కాని ఎప్పుడూ అంతే :) ఈ నాలుగు మొక్కలకేనా అనకండి ఇంకా చాలా మొక్కలుండేవి .
వుండేవి అంటే హూం వుండేవి అంతే . ఇదంతా గత వైభవం ! ఏమి చెప్పను నా దీనగాధ ! మా పక్కన ఇల్లు కూల గొట్టారు . అది కూల గొట్టేటప్పుడే బోలెడు దుమ్ము . ఇంటి నిండా , వంటి నిండా చాలక నా మొక్కల నిండానూ . సరేలే దుమ్మే కదా అనుకున్నాను .ఫ్లాట్స్ కట్టటం మొదలు పెట్టారు . అడ్డం గా తెర కట్టారు పర్లేదు అనుకున్నాను . ఓ తెల్లారి పూలు కోసేందుకు వెళ్ళి చూద్దునుకదా కుండీల నిండా సిమెంట్ :( గబ గబా కుండీలన్నీ ఇంకో వైపుకు మార్చాను . ఐనా లాభం లేక పోయింది . సిమెంట్ పడ్డ కుండీలలోని మొక్క లన్నీ చచ్చిపోయాయి :( వాటిని చూసి కన్నీళ్ళు ఆగలేదు :( కనీసం మిగిలిన వాటినైనా బతికించుకుందామని పక్కింటి కీ దూరంగా జరిపాను . అంతేనా ? ఎండాకాలం మొదలైంది . మొక్కలని బాదం చెట్టు నీడ లోకి మారుద్దామంటే పక్కింటి చెత్త అక్కడి దాకా పడుతోంది . మే ఎండింగ్ ఐయ్యేసరికి మా బోర్ ఇక నీళ్ళు ఇవ్వలేనని చేతులెత్తేసింది ! దానికీ కారణం పక్కవాళ్ళే ! మా బోర్ 400 అడుగుల లోతైతే వాళ్ళు 800 దాకా వెళ్ళారు :(
ఓ పక్క మండించే ఎండలు .ఇంకో పక్క అరా కొరా వచ్చే మున్సిపాలిటీ నీళ్ళు , బోర్ నీళ్ళ తో ఎలాగో రోజులు వెళ్ళదీస్తూ ,బియ్యం గట్రా కడిగిన నీళ్ళూ అవీ ఎలాగో నీళ్ళుపోస్తునే వున్నాను . కాని ఎండ వేడి కి తట్టుకోలేక నిప్పులో మాడ్చినట్లుగా అన్ని మొక్కలూ నల్లగా మగ్గిపోయాయి . పాపం అలానే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని మందారాలు పూలు ఇస్తూనే వున్నాయి .ఓ రోజు మందారాలు కోస్తూ వుంటే పక్కింటి ఆవిడ , ఈ ఎండలకి , కుండిలల్లో ఐనా మందారాలు బాగానే పూస్తున్నాయండీ అంటూ ధీర్గం తీసింది . చేతిలో వున్న పూల బుట్టతో ఒక్కటి తగిలిద్దామన్నంత కోపం వచ్చింది . తమాయించుకున్నాను . అంతే ఆ దిష్ఠి కి అవీ మాడి పోయాయి :( అటుపక్క , ఇటుపక్క వాళ్ళ మూలంగా నా మొక్కలన్నీ పోయాయి . వా వా (((((((

పూల మొక్కల గాధ ఇలా వుంది . నేను చేసిన పోషణకు చక్కగా జామకాయలు ఓ ఇరవైదాకా కాసాయి . దోరకాయలు చాలా రుచిగా వున్నాయి . ఈ సారి చెట్టంతా పూత పిందె వేసాయి . చెట్టు కళకళ లాడుతూ వుంది . ఓకాయ కొంచం పెద్దగా కూడా అయ్యింది .అది మా బెడ్ రూం కిటికీ నుంచి కోసుకునేట్లుగా వుంది . ఇంకొంచం మాగాక కోద్దామనుకున్నాను . కొంచమాగండి కళ్ళ నీళ్ళు తుడుచుకొని చెపుతాను . . . . . నిన్న ఎక్కడి నుంచి వచ్చిందో రామదండు , మూడు కోతులొచ్చాయి . ఆ కాయ తోపాటు చెట్టంతా దులిపి పెట్టాయి . కొమ్మలు విరిచేసాయి వాఆఅ (((((

ఇహ కొబ్బరిచెట్టు దగ్గరకి పదండి . ఈ సంవత్సరమంతా ప్రతి శనివారం దేవుడి కి ఓ కొబ్బరికాయైతే ఇస్తోంది . ఇదొక్కటే అన్ని వడుదొడుకులను తట్టుకొని నిలబడ్డది :)

ఈ దీన పరిస్తితులలో మొన్నటి నుంచి వాన పడుతోంది :) చావలేక మిగిలివున్న మొక్కలన్నీ దుమ్ము , సున్నం వంటి నిండా కొట్టుకొని వున్నాయి. ఈ రెండు రోజుల వానతో అవన్ని చక్కగా స్నానం చేసి పచ్చని పట్టుచీరలు కట్టుకొని ముస్తాబయ్యాయి .బొజ్జ నిండా నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. మా మాలి ఈశ్వరయను పిలిచి కొత్త మొక్కలు పెట్టించాలనుకుంటూ వుంటే మా వారు , ఎండాకాలం మన నీళ్ళ ప్రాబ్లం గుర్తుంచుకొని తెచ్చుకో మొక్కలని . ఆ తరువాత మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటావు అని హెచ్చరించారు .అప్పటి సంగతి అప్పుడే :) ఇప్పుడైతే బోలెడు మొక్కలు లిస్ట్ లో వున్నాయి .

