Showing posts with label ఏమండీ కథలు. Show all posts
Showing posts with label ఏమండీ కథలు. Show all posts

Sunday, July 5, 2020

కందిపప్పు కావాలా బాబూ !!!


3.కందిపప్పు కావాలా బాబూ!


నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
కొత్తకుండలో నీరు చల్లన, కొత్తకాపురం తియ్యన! కానీ ఈ వంటిల్లు ఉంది చూసారూ మహా  చిలిపిది.కొత్తపెళ్ళికూతురిని తికమక , మకతిక పెట్టేసి చెడుగుడు ఆడిస్తుంది.అందులోనూ చదువు నుంచి డైరెక్ట్ గా వచ్చిన అమ్మాయంటే దానికి మహా అలుసు.అలా అది నన్ను ఏడిపించిన  ఓ విషయం మొన్న గాజర్ హల్వా లో చెప్పాగా!ఈ రోజు ఇంకోటి,నా ఏమండీ కథలల్లోని మూడో కథ "కందిపప్పు కావాలా బాబూ!" లో చెపుతాను .సరేనా!

తీరికగా నవల చదువుకుంటున్న నాతో మా అమ్మాయి "ఇండియన్ స్టోర్స్ కు వెళుదాము రామ్మా "అని పిలిచింది.నవల పక్కన పెట్టి తన తో బయలుదేరాను.స్టోర్ లో ఏమేమి ఉన్నాయా అని చూస్తున్న నాకు ,పక్క రాక్ దగ్గర నుంచి "ఇందులో కందిపప్పూ ఏదిరా ? మనం ఏమి తీసుకోవాలి?" అని ఓ అబ్బాయి మాట వినిపించింది.తెలుగు మాట వినిపించగానే ఎవరో తెలుగువాళ్ళు ఉన్నారే అనుకుంటూ తొంగి చూసాను.ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారు.ఒక అబ్బాయి చేతిలో కందిపప్పు,సెనగపప్పు,పెసరపప్పు ఉన్న పొట్లాలు పట్టుకొని రెండో అబ్బాయిని అడుగుతున్నాడు.
"ఏమో రా మా అమ్మ వచ్చే ముందు చూపించి చెప్పింది కాని ఇప్పుడు గుర్తు పట్టలేకపోతున్నాను."అన్నాడు రెండో అబ్బాయి.
ఆ సంభాషణ వినగానే నా మనసు నా పెళ్ళైన కొత్తరోజుల్లోకి, పూనాకి వెళ్ళిపోయింది, అచ్చట్లు ముచ్చట్లు , చిటిపొటి అలుకలతో మా కొత్తకాపురం మొదలై అప్పటికి రెండు నెలలైంది.పూనాకు వచ్చే ముందు ,వెళ్ళగానే సరుకులు ఏమి కొనుక్కుంటారు అని అమ్మ,అత్తయ్యగారు వంటకు కావాల్సిన పప్పులూ, బియ్యం తో సహా అన్నీ మూడు నెలలకు సరిపోను కట్టి ఇచ్చారు.ఇద్దరూ విడివిడిగానూ, కలిసీ ఏవి ఏవో ,ఎట్లా వాడాలో చెప్పారు.సరే ఇహ కొత్తకాపురమూ, కొత్త మొగుడూ,కొత్తవంటా లో మూడునెలల సరుకులూ రెండు నెలలకే ఐపోయాయి.సరుకులన్నీ ఐపోతున్నప్పుడే ఏమండీ తో సామాన్లు తెచ్చుకోవాలీ అని చెపుతునే ఉన్నాను కాని ఏమండీకి ,పరీక్షల మూలం గా టైం దొరకటం లేదు.పోనీ నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుందామా అనుకుంటే , వచ్చీరాని హిందీ.దేనిని ఏమంటారో తెలీదు.పైగా హైదరాబాద్ లో ఉన్నప్పుడోసారి బజార్ కు వెళ్ళినప్పుడు అరటిపండ్లు బాగుంటే కొందామని ఎంతకిస్తావు బాబూ అని అడిగాను.
"సవా రూపియాకో డజన్" అన్నాడు.ఏది కొన్నా బేరం ఆడాలి కదా.వాళ్ళు చెప్పిన రేట్ కు కొంటామేమిటి అనుకొని "దేడ్ రూపియాకు దేదో." అన్నాను. అతను నా వైపు ఎగాదిగా చూసి ఇచ్చేసాడు.భలే బేరమాడాను అని సంతోషపడిపోతూ ఇంటికి వచ్చి అత్తయ్యగారితో చెప్పాను.ఆవిడ "ఓసి పిచ్చిపిల్లా సవ్వారూపియా అంటే, రూపాయి పావలా.దేడ్ రూపియా అంటే రూపాయిన్నర.వాడు రూపాయి పావలాకి ఇస్తానంటే నువ్వు రూపాయన్నరకు తెచ్చావు."అన్నారు.సో అలా ఉండే నా హిందీ తో ఏమి కొంటాను?
ఇక ఆరోజు కాలేజ్ కు వెళ్ళే ముందు "ఏమండీ ఇంట్లో పెసలు తప్ప అన్నీ ఐపోయాయి.ఏమీ లేవు.ఈ రోజు సామాన్లు తెచ్చుకోకపోతే కష్టం "అన్నాను.
"పెసలు ఉన్నాయిగా,నీకు పెసరట్టు చేయటం బాగానే వచ్చిందిగా. ఈ రోజు కు పెసలు నానబోసి రాత్రి కి పెసరట్టు చేసేయి. ఈ రోజు ఎగ్జాం ఐపోయాక ,సాయంకాలం వెళ్ళి తెచ్చుకుందాము."అన్నారు ఏమండి.
కాలేజ్ నుంచి వచ్చాక సాయంకాలము షాప్ నుంచి వచ్చాక రుబ్బేందుకు ఓపిక ఉంటుందో ఉండదో అని పొద్దున నానబోసిన పెసలు రుబ్బి, తయారై ఏమండీ కోసం ఎదురుచూస్తున్నాను. ఏమండీ హడావిడి వచ్చి, "పదపద , ఎగ్జాంస్ ఐపోయాయని అందరమూ సినిమా ప్రోగ్రాం వేసుకున్నాము."అని హడావిడి చేసారు.
"సినిమాకా ? సామాన్లు తెచ్చుకోవాలి కదా."అన్నాను.
"పరవాలేదు లే రాత్రికి, రేపు బ్రేక్ ఫాస్ట్ కూ పెసరట్టు, మాగాయి తినేద్దాము.అంతగా ఐతే లంచ్ కూడా మెస్ లో తినవచ్చు. లంచ్ ఐనాక అటునుంచి అటే వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం.పద"అన్నారు.
సినిమా అయ్యాక అందరూ అక్కడే ఉన్న ఉడిపి హోటల్ లో కి నడిచారు.నేను  అంత కష్టపడి రుబ్బిన పెసర పిండి పాడైపోతుంది అని గొణుగుతుంటే,ఏమండి మేము ఇంటికి వెళుతాము చెప్పి అని వచ్చేసాము. ప్రెషప్ ఐ అట్లు వేయటం మొదలు పెట్టాను.వేడివేడిగా అట్లు తిందామనుకుంటే  వేసిన అట్టు వేసినట్లే పెనం కు అతుక్కుపోతోంది.దాని దుంపతెగ ఎంతకీ ఊడిరాదే! అట్లకాడ తో గీకీ గీకీ ఆ ముద్దను సింక్ లో పడేయటమూ, ఇంకోటి వేసి మళ్ళీ గీకటం.ఏమండీ కూడా ప్రయత్నం చేసారు.అబ్బే ఏమాత్రం లొంగలేదా పెసరట్టు.అదే పిండి, అదే పెనం, అదే స్టవ్.ఎప్పుడూ చేసేవే.మరి ఇప్పుడేమొచ్చింది వాటికి.రేపొద్దున బ్రేక్ ఫాస్ట్ కు కాదుకదా ఇప్పుడు డిన్నర్ కు కూడా లేకుండా పిండి మొత్తం ఐపోయి చేయి నొప్పి మాత్రం మిగిలింది.ఇద్దరమూ మొహామొహాలు చూసుకుంటూ కూర్చున్నాము.మొహాలు చూసుకుంటూ కూర్చుంటే కడుపు నిండదుగా!అప్పటికి రాత్రి పదకొండైంది.బయట కనీసం పండ్లేమైనా దొరుకుతాయేమో చూసొస్తానని ఏమండీ స్కూటరేసుకెళ్ళి చుట్టుపక్కలంతా వెతికారు.ఎక్కడా ఏమీ దొరకలేదు.ఇక చేసేదేమీ లేక రాత్రి కోసం తోడుబెట్టిన పెరుగు ఇద్దరమూ చెరో కప్పూ తిని, మరునాటి కాఫీ కోసం ఉంచిన పాలతో చేరో కప్ కాఫీ తాగి పడుకున్నాము. పెరుగూ. కాఫీ సూపర్ కాంబినేషన్ కదా!
మరునాడు బ్రేక్ ఫాస్ట్ , లంచ్ మెస్ లో కానిచ్చేసాము.లంచ్ తరువాత మెస్ నుంచే కిరాణా దుకాణం వెళ్ళాము.దుకాణం లో ని పని పిల్లవాడు "ఏమి కావాలి?"అని అడిగాడు.అవునూ ఏమేమి కావాలని చెప్పాలి? మళ్ళీ ఇద్దరి కీ అనుమానం.బియ్యం ను చావల్ అని, పిండిని ఆటా అని, పప్పును దాల్ అని అంటారని మాత్రమే తెలుసు.కానీ ఏవేవి ఎంతెంత కావాలని అడగాలి ? కాస్త ఆలోచించి,"చావల్ అధా కిలో, దాల్ ఆధా కిలో"అని చెపుతుండగా ఆవాలని రాయీ అంటారనీ, జీలకర్రను జీరా అంటారనీ గుర్తొచ్చి,"రాఈ ఏక్ కిలో, జీరా ఏక్ కిలో, ఆటా ఏక్ కిలో"అని చెప్పాను.అతను "దాల్ కౌన్ సా దాల్?"అని అడిగాడు.అవునూ కంది పప్పు ను ఏమంటారు? అని ఇద్దరమూ ఆలోచించాము కాని తెలీలేదు.ఇంతలో దుకాణం పిల్లవాడు మిగితా సామాన్లు పొట్ల కట్టి తెచ్చాడు.ఇదేమిటి బియ్యం ఇంత తక్కువగా, ఆవాలూ జీలకర్ర ఇంత ఎక్కువగా ఉన్నాయి అని గడబిడ పడ్డాను.ఏమి దాల్ కావాలో చెప్పండి అన్నట్లు నిలబడ్డాడు.ఏమండీ "సాంబార్ చేసుకుంటామే ఆ దాల్"అన్నారు.అతను అది నాకు తెలీదు అన్నాడు అతను..ఇంతలో అక్కడే బల్ల ముందు కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న దుకాణం ఓనర్ మా ఇబ్బంది చూసి లేచి వచ్చి "నయా సాదీ హువా క్యా? మదరాసీ హై క్యా?"అని అడిగాడు.ఏమండి అవును అన్నారు.
అప్పుడు ఆయన "ఇక్కడికి దగ్గరలో ఒక మదరాసీ వాళ్ళున్నారు.ఆ అమ్మ ఎప్పుడూ మా దగ్గరే సామానులు కొంటుంది.వెళ్ళి వాళ్ళ ను అడగండి.మీకు ఏమేమి కావాలో చెపుతారు."అని వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పాడు.
వాళ్ళ ఇల్లు తొందరగానే కనుక్కున్నాము.బెల్ కొట్టగానే ఒకాయన వచ్చి తలుపు తీసి, మమ్మలిని చూసి ఆశ్చర్యపోయి ఏమిటి అని అడిగారు.ఏమండి మమ్మలిని పరిచయము చేసుకొని, మాకు వచ్చిన ఇబ్బంది చెప్పి,దుకాణాదారు వాళ్ళ అడ్రెస్ ఇచ్చాడని చెప్పారు.ఆయన మమ్మలిని లోపలికి ఆహ్వానించి , మమ్మలిని కూర్చోమని "ప్రమీలా"అని పిలిచారు.లోపలి నుంచి ఒకావిడ వచ్చారు.ఇద్దరూ నడి వయసు దంపతులలా ఉన్నారు.ఆవిడను చూపిస్తూ," నా భార్య ప్రమీల.నా పేరు రామారావు"అని మాకు పరిచయం చేసి "వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళుట.సరుకులు కొనుక్కోవటానికి దుకాణం కు వస్తే ఏమి కొనుక్కోవాలో తెలీలేదుట.శేట్ జీ మనింటికి పంపాడుట."అని ఆవిడకు చెప్పారు.
ఆవిడ మమ్మలిని మరీ ఏమీ తెలీని పిచ్చిమొహాలనుకుంటుందేమో నని,ఏమండీ ఏదో చెప్పబోయే లోపలే "అన్ని సరుకులూ కాదండీ.బియ్యం అర్ధకిలో, పిండి కిలో ,ఆవాలూ జీలకర్రా కిలో కిలో చెప్పానండి.కానీ పప్పులను ఏమంటారో తెలీలేదు."అని గబగబా చెప్పేసాను.
రామారావుగారు "బియ్యం అర్ధకిలో, పిండి కిలో చెప్పావా? పిండి ఎక్కువెందుకు చెప్పావు ? ఆవాలు కిలో చెప్పావా?ఆవకాయ పెడతావా?" తమాషాగా అన్నారు.
ఏదో ఊపులో చెప్పానే కాని అసలుకే కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే నే నాకు భయం.పైగా ఆయన అలా నవ్వుతూ అంటే ఇంకా భయం వేసింది."ఏమండీ పొద్దునా సాయంకాలమూ ఫులకాలే తింటారండీ.అందుకని ఆటా కిలో చెప్పానండి.నాకు ఆవకాయ పెట్టటం రాదండి."అన్నాను బిక్క మొహం వేసుకొని భయం భయం గా.
"మీరూరుకోండి."అని ప్రమీలగారు ఆయనను మందలించి,"నువూ రామ్మా .సరుకులు చూపిస్తాను"అని నా భుజం చుట్టూ ఆప్యాయంగా చేయి వేసి వంటింట్లోకి తీసుకెళ్ళారు.ఏమండి రామారావుగారిని అడిగి పెన్, పేపర్ తీసుకొని మా వెనుకే వచ్చి, "ఊరికే వినటం కాదు ఈ పేపర్ లో వాటి పేర్లు హిందీలో ఏమంటారో రాసుకో"అని నాకు ఇచ్చారు.
"కంది పప్పు ను తూర్ దాల్ అంటారు.మీకు నెలకు ఒక కిలో సరిపోతుంది.ఇది శెనగపప్పు.దీన్ని చన్నా దాల్ అంటారు.పోపులోకే కదా పావుకిలో చాలు."అని ఒక్కొక్క పప్పునూ చూపిస్తూ చెపుతున్న ఆవిడతో,"శెనగ పప్పు అంటే భక్షాలు చేస్తారు కదా.అదేగా ఐతే ఒక కిలో తీసుకుంటాను."అన్నాను.
"నీకు భక్షాలు చేయటం వచ్చా?"ప్రమీలగారు ఆశ్చర్యంగా అడిగారు.
"ఓ వచ్చండి.మా అత్తగారు చేస్తుంటే చూసాను."అన్నాను.
ఆవిడ ఇంకేమీ అనకుండా సరుకులన్నిటి పేర్లూ హిందీ లో చెప్పి, సుమారు మా కిద్దరికీ నెలకు ఎంత అవసరముంటాయో చెప్పారు.అన్నీ వివరంగా బుద్దిగా రాసుకున్నాను.ఆ తరువాత కాసేపు  కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని, ప్రమీలగారు పెట్టిన మైసూర్ పాక్,జంతికలూ తిని , చాయ్ తాగి ఆవిడకు థాంక్స్ చెప్పి లేచాము.అప్పుడప్పుడూ రమ్మని మమ్మలిని వాళ్ళు,వాళ్ళను కూడా మా ఇంటికి రమ్మని మేమూ ఆహ్వానించుకున్నాము.ఆ విధం గా నా వంటింటి మీద విజయం సాధించాను అనుకోని సంబరపడ్డాను.
మరునాడు ఆదివారం కావటం తో తీరికగా బ్రేక్ ఫాస్ట్ చేసి, పప్పు ,పాలకూర కలిపి కుక్కర్ లో వేసి, స్టవ్ మీద పెట్టి, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో రాసుకుంటున్న ఏమండీ పక్కన కూర్చొని దొండకాయలు కట్ చేస్తున్నాను.ఇంతలో "ఢాం" అని పది తుపాకులు ఒక్కసారే పేల్చినంత పెద్ద సౌండ్ వచ్చింది.ఇద్దరమూ ఉలిక్కి పడ్డాము.ఆ చప్పుడు ఎక్కడి నుంచి వచ్చిదో అర్ధం కాలేదు.ఇంతలో బయట నుంచి "కుమార్. . .  కుమార్ "అని గట్టిగట్టిగా పిలుస్తూ ఎవరో తలుపులు దబదబ బాదుతున్నారు.ఏమండీ గబగబా వెళ్ళి తలుపు తీసారు.పక్కింటి కాప్టెన్.బల్బీర్ ,ఆయన భార్య ఇంకా కిందింటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు.ఏమైందో మాకు అర్ధం కాలేదు.బల్బీర్ "ఏమైంది?అంత పెద్ద చప్పుడు వచ్చింది.మీరిద్దరూ బాగానే ఉన్నారుగా?"అని కంగారుగా అడిగాడు.
"మాకేమయ్యింది.చప్పుడు మా ఇంట్లో నుంచి వచ్చిందా?" అన్నారు ఏమండి.
అందరూ ఇల్లంతా హడావిడిగా వెతుకుతున్నారు.ఇంతలో ఎవరో వంటింట్లో నుంచి "ఇక్కడ కుక్కర్ పేలింది."అని అరిచారు.అందరూ అటెళ్ళారు.
కుక్కర్ మూత ఊడి కిందపడిపోయి ఉంది.పప్పు పైన సీలింగ్ కూ, కిందా అంతా చల్లినట్లుగా పడి ఉంది.గాస్ స్టవ్ నొక్కుకుపోయింది.
"కుక్కర్ పేలి పైకి ఎగిరి ,కిందకు స్టవ్ మీద పడి , కింద నేల మీద కు పడినట్లుంది."అన్నారు ఎవరో.
"ముందు గాస్ బంద్ చేయండి."అన్నారు ఎవరో.ఏమండి గబగబా లోపలికెళ్ళి గాస్ బంద్ చేసారు.అసలు కుక్కర్ ఎలా పేలింది అనుకోసాగారు అందరు.
బల్బీర్ వాళ్ళింటికి లంచ్ కు వచ్చిన కాప్టెన్ స్వామినాధన్ వాళ్ళ అమ్మగారు ,"కుక్కర్ లో నీళ్ళు తక్కువయ్యాయేమో, ప్రెషర్ ఎక్కువై పేలిపోయింది.సేఫ్టీ వాల్వ్ దగ్గర కడిగి నప్పుడు కొబ్బరి పిచో, మట్టో అడ్డంపడి మూసుకుపోయి ఉంటుంది.అందుకని సేఫ్టీ వాల్వ్ తెరుచుకోలేదు. ఇంకా నయం అమ్మాయి బయట ఉండబట్టి సరిపోయింది.వంటింట్లోనే ఉంటే ఏమయ్యేదో."అన్నది.
బిత్తరపోయి జరుగుతున్నదంతా అయోమయం గా చూస్తున్న నా దగ్గరకు వచ్చి ఏమండీ నా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నారు.నన్ను కూర్చోబెట్టారు.అప్పటికి కాస్త తేరుకున్న నా దగ్గరకు ఆ పెద్దావిడ వచ్చి నా తల నిమురుతూ "భయం లేదులే.అదృష్టవంతురాలివి పెద్ద ప్రమాదం తప్పింది.కుక్కర్ లో ఏమి వేసావు ?" అని అడిగారు.
"పాలకూరా,పప్పు వేసాను పిన్నిగారు."అన్నాను.
అందరూ కాసేపు జరిగిన దాని గురించి మాట్లాడుకొని ,మాకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు.ఆ పిన్నిగారు ఏదో అనుమానం వచ్చినదానిలా "ఏ పప్పు వేసావు ? ఎంత నీళ్ళుపోసావు?"అని అడిగారు.ఆవిడను లోపలికి తీసుకెళ్ళి నేను వేసిన పప్పు చూపించాను."మీరు శెనగపప్పుతో వండుకుంటారా?" కాస్త అనుమానంగా అడిగారు."కాదండీ ఇది కంది పప్పే కదా?"అడిగాను నేను.
"కాదు శెనగపప్పు.దీనికి ఎక్కువ నీళ్ళుపోయాలి.నువ్వు తక్కువ నీళ్ళుపోసావు.పైగా సేఫ్టీ వాల్వ్ మూసుకుపోయింది.అందుకే పేలింది."అని చెప్పి కందిపప్పుకూ, శెనగపప్పుకూ తేడా చూపించి , లేబుల్ మీద వాటి పేరు రాసి డబ్బా మీద అతికించుకో అని సలహా చెప్పి ఆవిడా వెళ్ళిపోయారు.
అప్పటికి స్టోర్ లో సామాన్లు కొనటం ఐపోయి , బిల్ కూడా పే చేసిన మా అమ్మాయి, "అమ్మా రా" అని పిలవటముతో కొత్తకాపురమూ, నా వంటిల్లు నుంచి బయట పడ్డాను.
ఇంకా "ఇంతకీ ఇందులో కందిపప్పు ఏదిరా?" అని తర్జనభర్జనలు పడుతున్న ఆ అబ్బాయిల దగ్గరకు వెళ్ళి "కందిపప్పు కావాలా బాబూ?" అని అడిగాను.
వాళ్ళిద్దరూ నా వైపు చూసి అవునాంటీ అన్నారు ఒక్కసారే.వాళ్ళకు కందిపప్పు చూపించి "దీని మీద తూర్ దాల్ అని రాసి ఉంటుంది.గుర్తుపెట్టుకోండి."అని చెప్పి మా అమ్మాయితో బయటకు నడిచాను.



Thursday, September 5, 2019

జీవితం ఏమిటి?



  

ఆరు సంవత్సరాల క్రితం మేము యు.యస్ వచ్చినప్పుడు కాలిఫోర్నియా లో పార్క్ వాకింగ్ ఫ్రెండ్ పటేల్ సాబ్,ఇక్కడ సీనియర్ సిటిజన్ సెంటర్స్ ఉంటాయి.అక్కడ చాలా ఆక్టివిటీస్ ఉంటాయి అని చెప్పి, మా ఇంటి దగ్గర నుంచి ఏ బస్ ఎక్కాలో అంతా వివరంగా చెప్పారు.అప్పుడు మా అమ్మాయి అన్ని వివరాలు కనుక్కొని మొదటి రోజు మమ్మలిని తీసుకెళ్ళింది.అక్కడ నాకు మాజాంగ్ అంతగా నచ్చలేదు కాని మా ఏమండీ అక్కడున్నన్ని రోజులూ బస్ లో వెళ్ళి బ్రిడ్జ్ ఆడి వస్తుండేవారు.తరువాత మినసోటా మా అబ్బాయి దగ్గరకు వచ్చినప్పుడు మా కోడలు కనుక్కొని మామ్మలిని తీసుకెళ్ళింది.ఇంటి కి దగ్గరగా నే ఉండింది.మంగళ వారం ,గురువారం మాజాంగ్, మనగళవారం ,శుక్రవారం బ్రిడ్జ్ ఉండేవి.ఇంకా చాలా ఆక్టివిటీస్ వున్నాయి కాని మేము జాయిన్ అవలేదు.మొదటి రోజు మా ఏమండీ నన్ను మాజాంగ్ రూం కు తీసుకెళ్ళి "నా వైఫ్ మాల.తను ఇండియాలో మాజాంగ్ ఆడుతుంది.ఇక్కడ కూడా ఆడాలని వచ్చింది.ఇంగ్లీష్ వచ్చు కాని కొంచం మీ ఆక్సెంట్ ఫాలో కాలేక పోవచ్చు " అని నన్ను వాళ్ళకు పరిచయం చేసారు.వాళ్ళూ నన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు.అక్కడున్నన్ని రోజులూ ఆడాను.నేను ఆడుతున్నంత సేపూ మా ఏమండీ మధ్య మధ్య వచ్చి నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా చూసి వెళుతుండేవారు. అక్కడ కాఫీ ఉంది తాగవచ్చు అని చెపుతుండేవారు.గురువారం బ్రిడ్జ్ లేకపోయినా నా కోసం వచ్చి అక్కడి వాళ్ళతో కబుర్లు చెపుతూ బుక్స్ చదువుకుంటూ ఉండేవారు.బ్రిడ్జ్ గ్రూప్ వాళ్ళు ఒక్కోసారి ఎవరో ఒకరు కేక్స్ , పేస్ట్రీస్ వగైరా తెస్తుండేవారు. మేము వచ్చేసే ముందు రవ్వాకేసరి చేసి తీసుకెళ్ళాము.మా అబ్బాయి అట్లా పెట్టకూడదు అని భయపడ్డాడు కాని వాళ్ళు మటుకు హాపీగా తిన్నారు.రసిపీ కూడ అడిగి తెలుసుకున్నారు. ఒకొళ్ళిద్దరు ఇండియన్ ఫ్రెండ్స్ అయ్యారు.వాళ్ళు మమ్మలిని డ్రాప్ చేస్తుండేవాడు.సెంటర్ వాళ్ళు కూడా ముందుగా చెపితే నాలుగు డాలర్ లకు ఇంటి దగ్గర దింపేవాళ్ళు .అలా మేము బాగానే ఎంజాయ్ చేసాము.రెండేళ్ళ క్రితం వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాము.
మొన్న మేము వచ్చే ముందు నుంచీ మా మనవడు " అమ్మమ్మా ఈ సారి నేను నిన్ను సెంటర్ కు తీసుకెళుతాను."అంటుండేవాడు."నేను చూద్దాం లేరా నాకేమీ వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు" అన్నాను."కాదు నువ్వెళ్ళాలి, మాజాంగ్ ఆడాలి." అనేవాడు.ఇక్కడికి వచ్చాక కూడా అడుగుతూ వుంటే నేను మూడ్ లేదురా అని వెళ్ళలేదు.మొన్న మంగళవారం పట్టుబట్టి తీసుకెళ్ళాడు.నువ్వెళ్ళు నేను లోపలికి వెళుతాను లే అన్నా వినకుండా, నాతో పాటు లోపలికి వచ్చి, వాడే ఎక్కడాడుతున్నారో కనుక్కొని నన్ను తీసుకెళ్ళి,అక్కడి వాళ్ళతో " షి ఈజ్ మై గ్రాండ్ మదర్ మాల. "అంటూ అప్పుడు వాళ్ళ తాత ఏమి చెప్పారో అవే డైలాగ్ లు చెప్పి నన్ను పరిచయం చేస్తుంటే నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను.నేను తీసుకెళ్ళటానికి వస్తాను అమ్మమ్మా , అక్కడ కాఫీ ఉంటుంది నీకు కావాలంటే తాగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు.
అందులో ఇద్దరు నన్ను గుర్తుపట్టి హాయ్ మాలా అని పలకరించారు.అందరూ చాలా బాగా మాట్లాడారు. కాకపోతే నాకే అక్కడ ఉన్నంతసేపూ ఏమండీ నే గుర్తొచ్చి ఆడలేక పోయాను.ఎట్లాగో పూర్తి చేసి బయటకు వచ్చి , కాసేపు బ్రిడ్జ్ రూం లోకి వెళ్ళి చూసి,మేమిద్దరమూ తిరిగిన ప్లేస్ లన్నీ తిరిగి బయటకు వచ్చి ,విక్కి వచ్చేవరకూ కూర్చుందామని అక్కడున్న బెంచ్ దగ్గరకు వెళుతుంటే అమ్మమ్మా అని వినిపించింది.చూస్తే అక్కడే కార్ పార్క్ చేసుకొని ఉన్నాడు.నువ్వెప్పుడొచ్చావురా అంటే "చాలా సేపైంది.నువ్వు ఎమోషనలైపోయి ఎట్లా ఉంటావో నని వచ్చి ఇక్కడ ఉన్నాను.మధ్య మధ్య వచ్చి చూసాను నువ్వు నన్ను చూడలేదు."అన్నాడు.ఎవరో వస్తూ పోతూ ఉంటారు అని నేను అంతగా పట్టించుకోలేదు.వాడు చెపుతుంటే నా కళ్ళు మసక బారిపోయాయి.నోట మాట రాలేదు అలాగే వాడిని చూస్తూ థాంక్యూ కన్నా అని అస్పస్టంగా అన్నాను.థాంక్స్ ఎందుకమ్ముమ్మా యు ఆర్ మై అమ్మమ్మ.అన్నాడు.మేము హైదరాబాద్ నుంచి వచ్చే ముందు ఓ రోజు మా అమ్మాయి ఆఫీస్ కెళ్ళాక ,వాడి ఫ్రెండ్ తో కలిసి ఎటో వెళ్ళాడు.ఎక్కడికెళ్ళావురా అని వచ్చాక అడుగుతే చిలుకూరు బాలాజీ కి ప్రదక్షణలు చేసి వచ్చాను అన్నాడు.ఎందుకురా నీకేమీ వీసా ప్రాబ్లం లేదు కదా అంటే నవ్వి ఊరుకున్నాడు.తరువాత మా అమ్మాయి చెప్పింది , వాడి ఫ్రెండ్ చిలుకూరి బాలాజీ చాలా స్ట్రాంగ్ గాడ్ మనముఏమైనా కోరుకొని ప్రదక్షణలు చేస్తే ఆ కోరిక తీరుంది అని చెప్పాడుట అందుకని వీడు వెళ్ళి మా అమ్మమ్మకు పీస్ ఆఫ్ మైండ్ రావాలి అని పదకొండు ప్రదక్షణలు చేసి వచ్చాడుట అని .
ఈ రోజు మా అబ్బాయి కూతురు తీసుకెళ్ళింది.బామ్మా నీకేమి కావాలన్నా చెప్పు.నేను చేసి పెడుతాను అంటూ మాటి మాటికీ అడుగుతూ ఉంటుంది.చిన్న మనవడైతే నా చుట్టు పక్కలే కూర్చొని వాడి గేంస్ ఆడుకుంటూ ఉంటాడు.కాకపోతే వాడు తెలుగు పూర్తిగా మర్చిపోయాడు.వాడి ఇంగ్లిష్ నాకు అర్ధం కాదు నా ఇంగ్లిష్ వాడికి అర్ధం కాదు ఏదో సైగలతో మాట్లాడుకుంటూ ఉంటాము.మా అబ్బాయి అమ్మా ఎక్కడ అనగానే "ఐ ఆం విత్ బామ్మా " అని సమాధానం ఇస్తూ ఉంటాడు :) ఇక మా పెద్ద మనవరాలు ఒక మెట్టు పైకి వెళ్ళి "అమ్మమ్మా నువ్వు జి ఆర్ ఈ ఎగ్జాంస్ రాయి ఏదో ఒక కోర్స్ లో చేరుదువుగాని .ఊరికే ఉంటే ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు." అంటుంది."లేదా నాతో పిట్స్ బర్గ్ వచ్చేయి నేను టు బెడ్ రూం ఎపార్ట్ మెంట్ తీసుకున్నాను నేను మా ఫ్రెండ్ ఉంటున్నాము నువ్వు నా రూం లో ఉందువు గాని. అప్పుడు డప్పుడు ఇద్దరమూ టూర్స్ కెళ్ళవచ్చు అంటుంది"తను అక్కడ ఈ సంవత్సరం మాస్టర్స్ లో చేరుతోంది.ఈ పిల్లలు నేను పెంచిన పిల్లలేనా ? ఎంత పెద్దవాళైపోయారు.నా గురించి ఎంత ఆరాట పడుతున్నారు.
ఈ రోజు మాజాంగ్ పరవాలేదు ఆడగలిగాను.అందరూ చాలా ఫ్రెండ్లీ గా ఉన్నారు.చాలా మాట్లాడారు.ఎన్ని ప్రశ్నలేసారో.వాళ్ళ ఆక్సెంట్ అర్ధం చేసుకోవటం అంత కస్టం కాలేదు.నన్ను తీసుకెళ్ళటానికి మా అబ్బాయి వస్తే మీ అమ్మను ఇక్కడున్నన్ని రోజులూ తీసుకురా అని చెప్పారు.ఒకావిడైతే మీ ఇల్లు ఎటువైపు నేనుండేవైపైతే పికప్ అండ్ డ్రాప్ చేస్తాను అంది కాని వాళ్ళ ఇల్లు మా ఇంటికి కంటే ముందు .మా అమ్మాయి ఒక చిన్న బుక్ , పెన్ ఇచ్చి వాళ్ళ పేర్లు అడిగి రాసుకో అని చెప్పింది.అప్పుడు మా ఏమండీ కూడా అలాగే చెప్పారు. అడగగానే అందరూ వాళ్ళ పేర్లు రాసి ఇచ్చారు. అనుకుంటాము అమెరికన్స్ మనతో మాట్లడరు అని కాని నాతో బాగానే ఉన్నారు మరి.
పిల్లలంతా నన్ను సంతోషంగా ఉంచేందుకు పడుతున్న ఆరాటం చూస్తుంటే కళ్ళు మసకబారిపోతున్నాయి. ఏమండీ అకస్మాత్తుగా వదిలేసిపోయారని బాధపడనా ? ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిపోయారని సంతోషపడనా :( నా బాధను , సంతోషాన్ని ఏదీ పట్టించుకోకుండా కాలం సాగిపోతునేవుంది  :(  కలలా కాలం కరిగిపోయి జ్ఞాపకాలే మిగిలాయి.ఇదేనా జీవితం ?

Thursday, August 15, 2019

జననీ జన్మభూమిశ్చ!


జననీ జన్మభూమిశ్చ!

మా మనవరాలు  కి వంట్లో బాగాలేదు అంటే చూద్దామని, రెండోసారి (మొదటి సారి మనవరాలు పుట్టినప్పుడు వెళ్ళాను), అట్లాంటా  కు వెళ్ళాను. నేను వెళ్ళిన మూడు నెలల తరువాత, మా ఏమండీగారు పిల్లల బలవంతము మీద ఒక నెలరోజులుందామని మొదటిసారి అమెరికాకు, వచ్చారు. ఆయన వస్తున్నరోజు, హంట్స్ విల్లే నుండి, మా అబ్బాయి, కోడలు అట్లాంటాకు వచ్చారు. మా అబ్బాయి ని రెండు సంవత్సరాల తరువాత, మావారు చూడటము అప్పుడే! ఏర్ పోర్ట్ నుండి ఇంటికి రాగానే, మా వారు సూట్ కేస్ లు విప్పుతుంటే అందరూ, చాలా క్యూరియస్ గా ఎవరికే బహుమతులు తెచ్చారా అని చూస్తున్నారు. ఒక సూట్కేస్ నిండా స్వీట్ బాక్స్ లు! ఇన్ని స్వీట్స్ తెచ్చారేమిటీ అంటే అవి మనవి కాదు, మా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలకు ఇవ్వమన్నవి అని రెండో సూట్కేస్ లో నుండి కూడా కొన్ని స్వీట్ బాక్స్ లు తీసి అవి మనకు అని ఇచ్చారు. సరే పిల్లలందరికీ తలా ఒక కానుక ఇచ్చారు. సూట్కేస్ ఖాళీ! అసలు మీ బట్టలేవండీ????? అని నేనడుగుతే పాపం అప్పుడు చూసుకున్నారు తన వస్తువులేవీ తెచ్చుకోలేదని! మరునాడు ఉదయమే మా అబ్బాయి ఆయనను తీసుకెళ్ళి, కావలసినవి కొని ఇచ్చి, ఆయన తెచ్చిన స్వీట్స్ అన్నీ పాక్ చేసి, ఎవరివి వాళ్ళకు పంపి, నేను ఫ్రైడే వచ్చి మిమ్మలిని హంట్స్ విల్లే తీసుకెళుతాను అని, మినియాపొలీస్ కు టూర్ మీద వెళ్ళాడు.
ఫ్రై డే మద్యాహనం  అన్నీ సద్దేసుకొన్నాము. వచ్చి నాలుగు రోజులే కదా అయ్యింది, నెక్స్ట్ వీక్ వెళుదురుగాని అని మా అమ్మాయి కాస్త గునిసింది. ఇక్కడ స్నో చాలా పడుతోంది, ఫ్లైట్స్ అన్ని కాన్సిల్ అయ్యాయి రేపు పొద్దున్నే వస్తానని మా అబ్బాయి  కాల్ చేసి చెప్పాడు. సరే, సాయం కాలము కాసేపు తిరిగి వచ్చి పడుకున్నాము. మద్యరాత్రి మా మనవరాలు ఏడుస్తుంటే పాలు కలుపుదామని లేచాను. ఫోన్ లో ఆన్సరింగ్ మిషిన్ బీప్... బీప్ అంటోంది. చూస్తే, మా మరిదిగారి మెసేజ్, అన్నయ్యా నీతో మాట్లాడాలి అర్జెంట్ అని వినిపించింది. వెంటనే ఏమండీనీ లేపాను. ఆయన ఇండియాకు కాల్ చేసారు. మా ఆడపడుచు విజయ లిఫ్ట్ చేసింది. ఏటమ్మా విజయా, వెంకట్ ఫోన్ చేసాడు అంటే, నాన్న తో మాట్లాడు అన్నయ్యా అని, మా మామగారికి ఇచ్చింది. మాధవా అమ్మకు వంట్లో బాగాలేదురా, కోడలిని తీసుకొని వెంటనే బయిలుదేరి రా అన్నారు, మా మామగారు. మళ్ళీ ఇద్దరూ రండి, నువ్వొక్కడివే కాదు అన్నారు. ఏమైంది నాన్నా అంటే మీరు రండి, అమ్మకు చాలా సీరియస్ గా వుంది అన్నారు. అంతే, ఎవరికీ ఏమి మాట్లాడాలో తెలీలేదు. మా అమ్మాయి  వెంటనే, ఫ్లైట్ టికెట్స్ కోసం ప్రయత్నం మొదలు పెట్టింది. మేము వచ్చిన కోరియన్ ఏర్లైన్స్ ఆ రోజు లేదు. తను టికెట్స్ కోసం ప్రయత్నము లో వుంది. మావారేమో మాటా పలుకూ లేకుండా నిశబ్ధం గా వున్నారు. ఎట్టకేలకు డెల్టా ఏర్లైన్స్ లో 5000$ తో దొరికాయి!
అప్పటికి తెల్లవారుఝాము నాలుగైంది. టికెట్స్ దొరికాయి, బయిలుదేరుతున్నారు అని మామాగారికి చెప్పింది అమ్మాయి. అప్పుడు, ఏమండీ ఫోన్ తీసుకొని, నాన్నా అమ్మతో ఒక్కసారి మాట్లాడుతాను, అమ్మకివ్వు ఫోన్ అన్నారు. మా అత్తగారు ఫోన్లో చిన్నగా ' మాధవా ' ' మాధవా ' అని రెండుసార్లు పిలవటము స్పీకర్ల లో నుండి వినిపించింది అమ్మా నేను వస్తున్నాను ఎక్కడికీ వెళ్ళకమ్మా అని ఘట్టిగా ఏడ్చేశారు. మా అందరికీ కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. ఓ పదినిమిషాలకు మా అత్తగారు ఇకలేరు అన్న వార్త తెలిసింది. ఆవిడ గొంతు విన్నప్పుడు, పరవాలేదేమో అనుకున్నాము, కాని అదే ఆవిడ చివరి మాట అని తెలుసుకోలేక పోయాము.
సారీ డాడీ సారీ, నిన్ను రమ్మని బలవంతము చేయక పోతే బామ్మ దగ్గరే వుండే వాడివేమో అని సంజు వల వలా ఏడ్చేసింది. అవును... మావారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో వుండగా, చైనా వార్ లో వెళ్ళేందుకు, చదువు వదిలేసి ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమీషండ్ ఆఫీసర్ గా చేరారట. అప్పుడు మా అత్తగారు ఎంతచెప్పినా, మన అవసరమున్నప్పుడే మాతృభూమికి సేవ చేయాలి అని యుద్ధానికి వెళ్ళారుట. ఇంజనీర్ అవుతాడనుకుంటే, మొండివాడు ఎంత బతిమిలాడినా వినకుండా వెళ్ళాడు అని మా అత్తగారు ఎప్పుడూ అనేవారు. మేము బరోడాలో వుండగా, మావారు, రాజస్తాన్ లో ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు, మా అత్తగారు చాలా సీరియస్ అయ్యారు. ఆయన వెళ్ళింది బార్డర్ కు. అక్కడికి వార్త చేరటము కష్టం. ఆ రోజులలో, మొబైల్ ఫోన్ లు కాదు ఇళ్ళలోనే లాండ్ ఫోన్ లు కూడా వుండేవికావు. యూనిట్ నుండి వార్త వెళ్ళాలి. మేము చేద్దామన్నా వీలుకాని పరిస్తితి. అసలు నాకూ ఆ వార్త అందలేదు! మావారు పదిహేను రోజుల తరువాత తిరిగి వచ్చాక తెలిసింది. అంతే వెంటనే వెళ్ళారు. ఈయనను చూడగానే, అదృష్టవసాత్తు, అప్పటికే కోలుకొన్న మా అత్తగారు, ఇక నువ్వు హైదరాబాద్ వచ్చేయరా మాధవా అని భోరున ఏడ్చేసారుట. బరోడా రాగానే వాలంటరీకోసం అప్లై చేసారు. ఆయన సీ. ఓ ఇంటికి వచ్చి మరీ, నువ్వు లెఫ్ట్ నెంట్ కల్నల్ గా అప్ర్రూవ్ అయ్యావు, ప్రమోషన్ తీసుకొని ఆజ్ ఏ కల్నల్ గా రిటైర్ అవ్వచ్చుకదా అని నచ్చ చెప్పారు. కాని, ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటే ఇంకో రెండు సంవత్సరాలుండాలి, అప్పటి వరకు నేనుండలేను, అమ్మ కోసం వెళ్ళాల్సిందే అని ఆర్మీ వదిలి హైదరాబాద్ వచ్చేసారు. జన్మభూమికి అవసరమైనప్పుడు, చదువును మధ్యలోనే వదిలేసి 19 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరారు. జనని కి అవసరము అనుకున్నప్పుడు, వచ్చిన ప్రమోషన్ ను తృణప్రాయముగా వదులుకొన్నారు. ఇప్పటికీ ఆయన ఆర్మీ ఫ్రెండ్స్ అంటూ వుంటారు, నువ్వు వాలెంటరీ తీసుకోకపోతే బ్రిగేడియర్ వి అయ్యేవాడివి అని. ఆ రోజు నుండి నాలుగు రోజుల క్రితం అట్లాంటా వచ్చేవరకూ అమ్మను కనిపెట్టుకొనే వున్నారు. విధివిలాసం..... వెళ్ళి పిల్లల దగ్గర కొన్ని రోజులు గడిపిరమ్మని పంపిన అమ్మ అంత అకస్మాతుగా వెళ్ళి పోవటము ఆయనకు చాలా పెద్ద షాక్... 
 మేము చెక్ ఇన్ అవుతుండగా మా అబ్బాయి  వురుకులు పరుగులు మీద వచ్చాడు. చాలా భారమైన గుండెలతో బయిలు దేరాము. హైదరాబాద్ ఎలా చేరామో తెలీదు. ఇంటికి రాగానే వాకిట్లో బల్ల మీద, పచ్చని మోములో ఎర్రని కుంకుమతో, ఆకుపచ్చని గుంటూరు జరీ చీర తో మెరిసిపోతూ పడుకొని వున్నది మా అత్తగారి పార్ధివ శరీరము అంటే నమ్మకము కలగ లేదు. ' మాధవా, మాధవా ' (అసలు పేరు ప్రభాత్ ఐనా, ఇంట్లో మావారిని మాధవ అనే పిలుస్తారు) అని పిలిచి మాట్లాడి వెళ్ళిపోయారు.
మాతృభూమికి, మాతృమూర్తి కి, కుటుంబ సభ్యులకు అనే కాదు ఎవరికే అవసరమైనా నేనున్నాను అని సహాయానికి వెళుతారు మా ఏమండీగారు.అసలు ఎవరికైనా సహాయం అవసరం అని కూడా వాళ్ళు అడగనవసరం లేదు.అర్ధరాత్రి ,మిట్టమధ్యాహ్నం అని లేదు ఎప్పుడు ఎవరు వచ్చినా మా ఇంట్లో భోజనం పెట్టవలిసిందే. అంత దూరం నుంచి వచ్చారు ఈ సమయం లో హోటల్స్ ఉండవు అని అర్ధరాత్రి వచ్చిన లేబర్ కు అన్నం పెట్టించేవారు.ఆ రకం గా మా ఇంట్లో ఎప్పుడూ ఒక మనిషి భోజనం ఉంటుంది.ఇక చదువు కోసమని, వైద్యం కోసమని ఏ వసరానికైనా ఎవరు అడిగినా పర్స్ లో నుంచి ఎంత చేతికి వస్తే అంత  డబ్బు తీసి ఇచ్చేవారు.ఎంత మందినో ఎన్ని విధాలుగానో ఆదుకున్నా ఏ రోజూ నాకు కూడా చేప్పలేదు. తను పని చేసిన ఈ.యం.ఈ సూత్రం "కరం హీ ధరం" అని నమ్మారు.చివరి వరకూ అదే విధంగా ఉన్నారు.
ఆర్మీ నుంచి వచ్చేసాక ఏపీ.ట్రాన్స్ కో లో కాంట్రాక్ట్స్ చేసారు.నాలుగు సంవత్సరాల క్రితం బైపాస్ అయ్యేవరకూ చేసారు.ఆ తరువాత ఆ కంపెనీ అమ్మేసి,మా అబ్బాయి పెట్టిన సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు.19 వ సంవత్సరం నుంచి చివరి వరకూ పనిచేస్తునే ఉన్నారు.
ఉదయం మాములుగా నేను ఆరున్నరకే యోగా కోసమని,నిద్ర లేపాను.లేచి ట్రాక్ సూట్ వేసుకున్నాక , కాఫీ ఇచ్చి నేను లోపలికి వెళ్ళాను.నేను మళ్ళీ బయటకు వచ్చేసరికి యోగా బెడ్ మీద పడుకొని ఉన్నారు.అలా సునాయసంగా యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు."అనాయాసేన మరణం, వినా దైత్యేన జీవితం " గడిపిన కర్మయోగి.
"ఎవరెవరో వచ్చి అమ్మా మాకు సార్ ఈ సాయం చేసారు.మాకు అండగా ఉండేవారు.అండను కోల్పోయాము" అని నివాళులు అర్పిస్తుంటే ఆశ్చర్యపోయాను.నాకసలు తెలీనే తెలీదు ఇంతమంది కి ఇంత సహాయం చేసారని.మా కాలనీలో అందరూ అనటమే మేజర్ గారి కోసం ఎంత మంది వచ్చారు అని ఇల్లు , బయట సందు అంతా నిండిపోయారు , వంద మంది మహాప్రస్థానం దాకా వెంట వెళ్ళారు, మిలిటరీ హానర్ తో సాగనంపారు.అంతటి పుణ్యాత్ముడికి భార్యను కావటం నా అదృష్టం.
మా ఏమండీగారికి సెల్యూట్ చేయటం తప్ప ఏమీ చేయలేక వంటరిగా మిగిలిపోయాను.

Saturday, August 3, 2019

తిండి గోల



తిండి గోల
ఏమండి మా పెళ్ళైన పదిరోజులకే లీవ్ ఐపోయిందని , నన్ను వాళ్ళ అమ్మ దగ్గర వంట నేర్చుకోమని వదిలేసి పటియాలా వెళ్ళారు.మూడు నెలల తరువాత లీవ్ లో వచ్చారు.అప్పటికి నేను మా అత్తగారి దగ్గర కొద్దోగొప్పో వంట నేర్చుకున్నాను.ఆ వంటలు చాలా ఉత్సాహంగా ఏమండీగారికి వండిపెడుతూ సంతోష పడిపోతున్న సమయంలో ఓ రోజు అకస్మాత్తుగా బ్రేక్ ఫాస్ట్ రోజూ ఉప్మాయేనా , మనకు అక్కడ రవ్వ దొరకదు  ఇంకోటి చూపిస్తాను రా అని వంట ఇంట్లోకి తీసుకెళ్ళారు.అప్పటికే మా అత్తగారికి ఏవో ఇన్ష్ట్రక్షన్స్ ఇచ్చినట్లున్నారు ఆవిడ చేసిన వంటంతా భోజనాల గదిలో పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు.ఏమండీగారి సూచనల ప్రకారం, ఒక చిన్న గిన్నె, పెనం,అట్లకాడ,ఓ ఫోర్క్, నెయ్యి అన్నీ తీసాను. ఇంతలో మా పనబ్బాయి నారాయణ కొన్ని ఎగ్గ్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు.అవి చూపిస్తూ ఇవి ఇట్లా పట్టుకొని ఫోర్క్ తో చిన్నగా పగల గొట్టి ఈ గిన్నెలో వేయి అన్నారు."ఏమిటీ ఈ కోడి గుడూ పట్టుకొని ,పగలగొట్టాలా ?యాక్ థూ" అన్నాను.కాని ఆయనను చూస్తూ ఇంకేమీ మాట్లాడలేక దానిని మునివేళ్ళతో పట్టుకొని కొటాను.అంతే అది మహా ఫోర్స్ గా పగిలిపోయి ,నా చేతిలో నుంచి జారి కిందపడి నానాయాగి చేసేసింది.నేను బిత్తరపోయి నిలబడ్డాను.ఆయన ఇంకేమీ అనక ఇంకో ఎగ్ తీసి తనే పగలగొట్టి గిన్నెలో వేసి బీట్ చేసారు.ఆ తరువాత పెనం స్టవ్ మీద పెట్టి ఆంలెట్ చేయటం ( నాతో చేయించటం) చాలా పెద్ద ప్రహసనం ఐపోయింది.చివరకు ఎలాగో చేసి ప్లేట్ లో వేసి తిను అన్నారు.నేనా ? ఉమ్హూ తినను గాక తినను అని మొండికేసాను."మనం వెళ్ళాక కొన్ని రోజులు మెస్ లో ఉండాల్సి వస్తుంది.అక్కడ మనలను వండుకోనీయరు.బ్రేక్ ఫాస్ట్ ఎగ్ నే ఉంటుంది.నువ్వు ఎంత తినగలుగుతే అంతే తిను, మిగిలింది నేను తింటాను."అని నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేసారు.నేను ముక్కు మూసుకొని అటు పరిగెట్టి, ఇటుతిరిగి చాలా విన్యాసాలు చేసాను.ఇక ఆయన ఓర్పు నశించి, నీ ఖర్మ నువ్వు ఎగ్ తినేదాక నిన్ను తీసుకెళ్ళను ఇక్కడే ఉండు అని ఆ ఆంలెట్ ప్లేట్ సింక్ లోకి విసిరి కొట్టి కోపంగా వెళ్ళిపోయారు.
ఏను ఏమి చేయాలో తోచక ఆట్లా నిలబడిపోయాను."ఏం జరిగిందే వాడట్లా కోపం గా వెళ్ళిపోయాడు"అంటూ లోపలికి వచ్చిన అత్తయ్యగారు,వంటింటి నిడా, గట్టుమీద,స్టవ్ మీద పడిపోయి ఉన్న ఎగ్ సొన, ఆంలెట్ , ప్లేట్ ముక్కలు అన్నీ చూసి వెనక్కి వెళ్ళి ముందు అదంతా బాగుచేయి అని చెప్పి బయటకెళ్ళిపోయారు.నేను ఏడ్చుకుంటూ అంతా శుభ్రం చేసి వాసన రాకుండా ఫినాయిల్ వేసి కడిగి, స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్యగారు వరండాలో కూర్చొని ఉన్నారు.ఏమండీగారు కనిపించలేదు.అప్పుడు అసలేమైంది వాడెక్కడికెళ్ళాడు అని అడిగారు.ఇక అంతే ఆవిడను గట్టిగా పట్టేసుకొని భోర్మని ఏడ్చుకుంటూ ఆయన నన్ను వదిలేసి పటియాలా వెళ్ళిపోయారు ఇంక రారు అని ఏడ్చేసాను.ఆవిడ ముందు గాభరా పడ్డా వాడెక్కడికెళుతాడు ఏడవకు అని సముదాయించారు కాని నా ఏడుపు ఆగలేదు.సాయంకాలం ఎప్పుడో ఇంటికి వచ్చారు.మా మామగారు ఆయనని చూడగానే "చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళావురా?అది పొద్దటి నుంచి అన్నం కూడా తినలేదు.ఒకటే ఏడుస్తోంది."అన్నారు.ఆయన మాట్లాకుండా బాత్ రూం లోకి వెళ్ళిపోయారు.నా వైపు కూడా చూడలేదు.నాకు ఇంకా దుఃఖం పొరలుకొచ్చేసింది.వెంటనే మా ఆడపడుచు దగ్గర పెన్ , పేపర్ అడిగి తీసుకొని దొడ్లోకి వెళ్ళి, "మహారాజశ్రీ ప్రియమైన శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి వ్రాయునది" అని మొదలు పెట్టి ఓ నాలుగు పేజీలు ఉత్తరం నేను ఇక ముందు ఆయన చెప్పినట్లే వింటానని,నన్ను వదిలి వెళ్ళ వద్దని ఏడ్చుకుంటూ రసి ఆయన బట్టల దగ్గర పెట్టాను. మనలో మన మాట ఆంలెట్ తింటానని పొరపాటున కూడా రాయలేదు.ఇంకోటి కూడా నాకు అర్ధం కాలేదు సినిమాల్లో హీరోయిన్ ఏడుస్తూ ఉత్తరం రాస్తే ఆమె కన్నీళ్ళు అక్కడక్కడా ఉత్తరం మీద పడుతాయి కదా, అదేమిటో నేనెంత ఏడ్చినా ఒక్క బొట్టు కూడా రాలేదు.నాకు కాస్త జెనరల్ నాలెడ్జ్ రావాలని మా మామగారు నన్ను కొన్ని సినిమాలకు తీసుకెళ్ళారులెండి.ఆయన జీవితం లో సినిమా చూడటము అదే ఫస్ట్ లాస్ట్ అట.అందరూ తెగ ఆశ్చర్యపోయారు ఆయనేమిటి కోడలిని సినిమా కు తీసుకుపోవటం ఏమిటి అని.మరేం చేస్తారు పాపం నేను మా అత్తగారికి మామగారికి బాగా నచ్చానుట.మా ఏమండీ గారు చిన్నపిల్లలా ఉంది పెళ్ళిచూపుల్లోనే వంటరాదని చెప్పేసింది అని గునుస్తుంటే చిన్నపిల్లైతే చెప్పినమాట వింటుంది నీకెందుకు మేము అన్ని నేర్పించి పంపుతాము అని ఆయనకు ప్రామిస్ చేసి ,ఆయనకూ నా పెద్దజడ నచ్చి చేసుకున్నారుట.సో ఇప్పుడు తెలిసిందిగా ఆ ఉత్తరం సినిమా పైత్యమని.మామాగారి పుణ్యమా అని అంత జెనెరల్ నాలెడ్జ్ వచ్చేసింది మరి.సరే ఇక ఉత్తరం సంగతికొస్తే నేను బెడ్ రూం లో చాలా టెన్షన్ గా కూర్చొని ఉన్నాను.ఆయన ఆ ఉత్తరం చదివారో లేదో తెలీదు.నేను చూస్తే అక్కడైతే లేదు మరి.మరునాడు ఆయన బట్టలు ఉతకటానికి వేస్తుంటే పైజామా జేబ్ లో కనిపించింది.కాని దాని గురించి ఎప్పుడూ ఏమీ అనలేదు కాకపోతే పిచ్చిపోరి అని నవ్వుకొని ఉంటారని ఇప్పుడనిపిస్తోంది.
ఆ తరువాత ఎప్పుడూ ఆంలెట్ తినమని అనలేదు నేనూ తినేందుకు ప్రయత్నం చేయలేదు కాని తినకపోవటం వలన కొన్ని సార్లు ఇబ్బందైతే పడ్డాను. నేను తినకపోయినా ఏమండీ కోసం ఆంలెట్, ఎగ్ కర్రీ,బుజియా వగైరా,పిల్లల కోసం కేక్ చేయటం నేర్చుకున్నాను.ఎగ్ భుజియా, రెండూ ఏడి వేడి ఫుల్కాలు ఏమండీగారి ఫేవరేట్ డిన్నర్..చాలా ఏళ్ళ తరువాత మేము బరోడా పొస్టింగ్ మీద వెళ్ళినప్పుడు,వెళ్ళిన రోజు ఉదయమే అక్కడ ఆయన ఫ్రెండ్ రమేష్ పార్లీకర్ వాళ్ళ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు.నేను ఫ్రెష్ ఐ వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు.అందరి ప్లేట్ లల్లో ఆంలెట్, కార్న్ ఫ్లాక్స్ , బ్రెడ్ టోస్ట్ పెట్టి ఉన్నాయి. నాకు ఒక్క నిమిషం ఏమి చేయాలో తోచలేదు.పెళ్ళైన కొత్తల్లోని ప్రహసనం గుర్తొచ్చింది.మాట్లాడకుండా తల వంచుకొని మధ్య మధ్య నీళ్ళు తాగుతూ ఎట్లా గో తింటున్నాను.ఇంతలో కల్పనా పార్లీకర్ వంట ఇంట్లో నుంచి వస్తూ నన్ను చూసి "ప్రభాత్ మాల ఆంలెట్ తినదన్నావు.ఇప్పుడే బాయీ కి చెప్పి వస్తున్నాను చపాతి చేయమని , తింటోంది గా " అంది.ఏమండీ "అవును నేనూ అదే చూస్తున్నాను."అన్నారు ఆశ్చర్యంగా.
యాభై సంవత్సరాల క్రితమే నేను ఏమండీకి మాట ఇచ్చాను ఆయన చెప్పినట్లే వింటానని.ఆయనా నాకు మాట ఇచ్చారు నన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళనని ఎక్కడికెళ్ళినా వెంట తీసుకెళుతాని. మరి ఇప్పుడు ఎందుకు నాకు మాటమాత్రమైనా చెప్పకుండా , నన్ను తీసుకెళ్ళ కుండా,నేనిచ్చిన కాఫీ తాగి, పేపర్ చదువుకొని మరీ నన్ను మాయపుచ్చి ఎక్కడికో ఎందుకు మాయమైపోయారు.యోగా చేస్తున్నారనుకున్నాను కాని యోగ నిద్రలోకే వెళ్ళిపోయారని తెలుసుకోలేకపోయాను.ఎప్పుడూ వెంట తీసుకెళ్ళేవారు ఇప్పుడు మాత్రం నన్ను రమ్మంటే నేను రానన్నా అని కలలో నైనా అడుగుదామంటే కలలో కూడా కనిపించరెందుకు ?