Friday, July 6, 2012

ఎదురీత




just yellow media pvt ltd వారు టి.వి సీరియల్స్ అంటే నాకున్న అభిప్రాయాన్ని పోగొట్టారు . యద్దనపూడి నవల ఆధారం గా తీసిన సీరియల్ అని ఎక్కడో చదివి ' రాధ-మధు 'చూసాను . చాలా నచ్చేసింది . ఆ తరువాత వారే తీసినవి , 'అమ్మమ్మా.కాం' , ' లయ ' కూడా నచ్చాయి . చక్కని కుటుంబ కథ ల తో ఎక్కడా బోర్ కొట్టించకుండా , ఎత్తులూ పైఎత్తులూ , అత్తా కోడళ్ళ సంవాదాలు , ఓర చూపులూ , కోర చూపులూ , మొహాల మార్పిడులూ వగైరా టి.వి సీరియళ్ళ ఆనవాయితీలు లేకుండా చాలా నీట్ గా వున్నాయి . అందుకే వారు తీసిన సీరియల్ అని తెలిసి ' ఎదురీత ' చూసే సాహసం చేసాను .

రామకోటయ్య మొదటి భార్య ఒక కొడుకును కని చనిపోతుంది . ఆ బాబును చూసుకుంటూ వుందామనుకున్న రామకోటయ్య పరిస్తితుల వల్ల రెండో పెళ్ళి చేసుకుంటాడు . ఆ రెండో భార్య , మొదటి భార్య కొడుకు శేషు ను సరిగ్గా చూసుకోదు అన్న నెపం తో శేషుబాబు ను ఆస్తి తో సహా తీసుకుపోతుంది అమ్మమ్మ . రామకోటయ్య బుచ్చిరెడ్డిపాలెం లో వున్న తన పూర్వీకుల ఆస్తిని మొత్తం శేషుబాబు కు ఇచ్చి , వరిశలేరు వెళ్ళిపోతాడు .భార్య సులోచన , ఇద్దరు కూతుళ్ళు సత్య , వీణ , కొడుకు రాజా తో స్వయంకృషితో సంపాదించుకున్న 40 ఎకరాల పొలము తో,హాయిగా వుంటారు. ఆ వూరి లో అందరికీ తలలో నాలుకలా వుంటూ , గౌరవం పొదుతుంటాడు . అంత చక్కని కుటుంబం లో కాలక్రమేణ వచ్చే మార్పులు , శేషుబాబు అమ్మమ్మ సుగుణమ్మ పెట్టిన చిచ్చుతో ఎలాంటి మార్పులు వస్తాయి , ఆ మార్పులను ఎలా ఎదురొడ్డి తట్టుకున్నారు అన్నదే కథ . ఆ సీరియల్ ను ఇక్కడ చూడవచ్చు .అన్ని కథలూ మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరిగినట్టుగా వున్నాయే తప్ప , ఏదో సీరియల్ చూస్తున్నట్లుగా లేదు .

కుటుంబపు పెద్దగా , ఓ తండ్రిగా రామకోటయ్య పాత్ర చక్కగా మలిచారు . పిల్లలను క్రమశిక్షణతో ,మంచి విలువలతో ఎలా పెంచాలో రామకోటయ్య పాత్ర చూపిస్తుంది .ఎన్ని అవాంతరాలొచ్చినా , ఎవరు ఎంత బెదిరించినా బెదిరిపోక , తను చూసిన హత్య గురించి కోర్టులో సాక్షం ఇస్తాడు . అందే పిల్లల కు ఆదర్శం ఐయింది . ఎన్ని కష్టాలు వచ్చినా బెదిరిపోక ధైర్యం గా నిలబడతారు . తము నమ్మిన దానిని ఆచరిస్తారు . కుటుంబమంతా చక్కగా కలిసి మెలిసి వుంటారు .కుటుంబం మధ్య అనురాగాలు , ఆప్యాయతలు చక్కగా చూపించారు . అందుకే అన్యాయం చేసిన అన్నయ్యను కూడా ఆదరిస్తారు .వారిదగ్గర పనిచేస్తున్న వెంకట్రావును ఇంటి మనిషిలా కలుపుకుంటారు . పెద్దరికం ఇస్తారు . చివరికి మెస్స్ కు ఓనర్ ను చేస్తారు . ఆడపిల్లలైనా విధి ని ధైర్యంగా ఎదురుకుంటారు . రాజా చివరి ఉత్తరాలు చదువుతుంటే నిజం గా కళ్ళలో నీరు తిరిగాయి .

మిగిలిన పాత్రలు కూడా చక్కగా నటించారు . సుగుణమ్మ గా కనిపించిందేకాని , శివపార్వతి గా కనిపించలేదు .ఆ పాత్ర మీద ఎంత కోపం వస్తుందంటే , సుగుణమ్మ ఎదురుగా కనిపిస్తే కొట్టాలన్నంత . అంటే అంత బాగా చేసిందన్నమాట . శేషుబాబు చివరి వరకూ డమ్మిలా వున్నా చివరలో చక్కని పరిణితి చూపించాడు . పెద్దన్నయ్యగా తండ్రి బాధ్యత లు చేపడతాడు .భాస్కర్, గౌతం , అంకయ్య, బెనర్జి , బుచ్చిబాబు, వెంకట్రావు , వెంకయ్య, నీలిమ ,విజయ్ ఇంకా మిగిలిన పాత్రధారులు అందరూ బాగా చేసారు .

ఇక చిత్రీకరణ , కథ , మాటలు బాగున్నాయి . మేకప్ కూడా సహజం గా వుంది .నిర్మాతకో , దర్శకుడికో పొడుగుజడలంటే ఇష్టమనుకుంటాను . అందుకే హీరోయిన్లకే కాదు వీలైనంతవరకు ఆడపాత్రలన్నిటికీ పొడుగు జడలుంటాయి . కాకపోతే ఇంకొంచం శ్రధ్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది .అప్పుడప్పుడు సవరాలు కనిపిస్తూ వుంటాయి:) అరణ్య కు పఫ్ తీయకుండా మామూలుగా జడవేస్తే బాగుండేది . చీరలు చక్కగా కట్టారు . పాత్రధారుల ఎంపిక కూడా బాగుంది . సత్య పాత్రకు వీణను తీసుకున్నా , వీణ పాత్రకు సత్యను తీసుకున్నా సరిపోయేవారు కాదు . రాజా పాత్రధారి ముద్దుగా వున్నాడు . ఆ పాత్ర చనిపోయినప్పుడు చాలా దుఖం వచ్చింది . చంపకుండా వుంటే బాగుండు అనిపించింది . కాని ఆ తరువాత కథ అంతా దానిమీదే ఆధారపడి వుంది కదా :) అంతా బాగుంది కాని ఇందులో కాస్త కోర చూపులు ఓరచూపులు కొద్దిగా ఎక్కువైనాయి .అందులో నటించినటీనటుల పేర్లు , వారి పాత్ర పేర్లతో చూపిస్తే బాగుండేది . నాలాంటి వారు ఎవరు ఎవరిగా నటించారో తెలీక తన్నుకలాడుతారుకదా మరి :) ముందునుంచీ తాపీగా తీసుకొచ్చి చివరలో హడావిడి ముగించినట్లు అనిపించింది .

ఈ సీరియల్ కథా రచయత ; గంగరాజు గుణం ,

మాటలు , కథనం , ఆజాద్ చంద్రశేఖర్,

నిర్మాత ; ఊర్మిళా గుణం ,

దర్శకుడు ; వాసు ఇంటూరి ,

సంగీతం ; యస్. పి బాలచంద్రన్ ,

గాయకుడు ; యస్.పి బాలసుబ్రమణ్యం ,

రచయత; చిర్రాపూరి విజయకుమార్ ,

మేకప్; నల్ల శ్రీను .

అసలు ,వీరే రాధ- మధు టీం తో యద్దంపూడి నవల ఇంకోటి సీరియల్ గా తీస్తే చూడాలని వుంది :)))