Friday, December 27, 2013

హాపీ బర్త్ డే సాహితి

 
ఈ రోజే నా బ్లాగ్ పుట్టినరోజు. నేనింకా రేపనుకుంటున్నాను. అదేమిటో ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేస్తోంది.

ఈ రోజు కు ఐదు సంవత్సరాలు నిండాయి.స్కూల్ల్ ల్లో వేయాలి :)  ఐదు సంవత్సరాలంటే ఎక్కువే :)  నేనసలు ఇన్ని సంవత్సరాలు బ్లాగ్ వ్రాస్తాననుకోలేదు :)

హాపీ బర్త్ డే సాహితి:)

Monday, December 2, 2013

నా అభిమాన రచయిత్రి కి జలుబొచ్చింది !

 



1971 లో అనుకుంటా ఓరోజు మా ఫ్రెండ్ స్వర్ణ నేను లైబ్రెరీ కి వెళుతున్నాను నువ్వూ వస్తావా అని అడిగింది.అక్కడ ఏమి బుక్స్ వుంటాయి అనీడిగాను. తెలుగు , ఇంగ్లిష్ నావెల్స్ వుంటాయి. రోజుకు అద్దె పావలా తీసుకుంటాడు , నువ్వెప్పుడూ నవలలు చదవలేదా అని అడిగింది. ఇంతవరకు నవలల గురించి తెలీదు. పెళ్ళైయ్యెవరకూ చందమామ , ఇంకా ఏవో కొన్ని పిల్లల పుస్తకాలు మా అమ్మ తెప్పించేది చదివేదానిని. పెళ్ళయ్యాక పూనా లో అవన్నీ దొరకేవికాదు. పైగా అప్పుడు పిల్లల పుస్తకాలు చదువుతుంటే అందరూ వెక్కిరిస్తారేమో నని మానేసాను. ఆంధ్రజ్యోతి వీక్లీ దొరికేది అది చదివేదానిని. అందులో 'జీవనతరంగాలు ' యద్దనపూడి సీరియల్ వచ్చేది అది మాత్రం చదివాను అని చెప్పాను. అవునా అని తెగ హాశ్చర్యపోయి యద్దనపూడిదే ' సెక్రెటరీ ' అని నవల సూపర్ హిట్ . అది చదువుదువుగాని ఇప్పిస్తానురా అని బలవంతాన ఆర్కే లైబ్రరీ కి తీసుకెళ్ళింది .అంతే అది మొదలు పిల్లల పుస్తకాల నుంచి నవలలకు మారిపోయి , వాటికి ఎడిక్ట్ అయ్యాను. ఇంట్లో పనులు,  పసిపిల్ల మా అమ్మాయిపనులు , కాలేజీకి వెళ్ళిరావటము , చదువు ఇన్ని వూపిరాడని పనుల మధ్య ఎలాగోలాగా సమయం చూసుకొని రోజు కొక నవలైనా చదివేదానిని :) ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పట్లో చాలా వరకు రచయిత్రిల వి , చాలా వరకు సాఫ్ట్ ప్రేమ కథలే వచ్చేవి. అందుకే ఇప్పటికీ నాకు అవే నచ్చుతాయి.భారి డైలాగులు , విషాదాంతాలు , రక్తపాతాలు వున్నవి సినిమాలైనా నవలైనా నచ్చవు.హాస్యం వున్నవైతే మరీ మరీ నచ్చుతాయి :) అదో అలా అలా పొత్తూరి విజయలక్ష్మి నవలలకు , కథలకు వీరాభిమానినైపోయాను :)

'పెళ్ళి చూపులకు పెళ్ళికొడుకు వస్తాడని పార్క్ లో ఎదురు చూస్తున్న పెళ్ళి కూతురికి , చంకలో పిల్లవాడు , చేతిలో పాలసీసా , జుట్టు చెదిరిపోయి,షర్ట్ బటన్స్ వూడిపోయి హైరానా పడుతున్న పెళ్ళి కొడుకు ' ను, 'చీ దిక్కుమాలిన ఆడజాతి .వీళ్ళకు నీతీ నిజాయితీలేవు .'అని మొత్తం ఆడజాతినే అసహ్యించుకునే , హృదయం గాజు గ్లాసు లా  విరిగిపోయిన ఉమాకాంతరావును, బనీను గుడ్డతో జాకిట్టూ, జాకిట్టు గుడ్డతో బనీను కుట్టే పారిజాతం నూ ,ఆడపెళ్ళి వారింట్లో అన్నీ సరిగ్గా అమురుతాయో అమరవో నని , వంటవాడిని, సామాను తోసహా తీసుకొని బయలు దేరిన తాతగారిని , అబ్బో ఇలా చెపుతూ పోతే అంతులేని బోలెడు చిత్ర విచిత్రమైన పాత్రల తో మనసారా , కడుపారా పొర్లి పొర్లి నవ్వించే కథలను వ్రాయటము పొత్తూరి విజయలక్ష్మిగారికే సాధ్యమేమోనని నా హభిప్రాయం :) 

ఇంత నవ్వించే నవలలో, కథలల్లో "ఆత్మ కథ" అనే ఓ సీరియస్ నవలా వుంది. ఇంకా ఏమైనా సీరియస్గా వున్నవి వ్రాసారేమో నాకు తెలీదు కాని ఇది మటుకు చదివాక హృదయం చాలా భారమైపోయింది.అందులోని హీరో బల్వీర్ ను చాలా రోజులు మర్చిపోలేకపోయాను :( 



అనుకోకుండా ఈమధ్యనే విడుదలైన పొత్తూరిగారి పుస్తకం "కొంచం ఇష్టం కొంచం కష్టం " నా చేతికి చిక్కింది . ఇదో ఇక్కడ దీని గురించి వ్రాసాను.

ఓ రెండేళ్ళ నుంచి, లైబ్రెరీల చుట్టూ ఏమి తిరుగుతావు , హాయిగా నువ్వే బుక్స్ కొనుక్కో , ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు అన్న మా అబ్బాయి సలహాతో బుక్స్ కొనటం మొదలు పెట్టాను. అదేమిటో పొత్తూరి గారివి కొత్తగా పబ్లిషైనా బుక్స్ దొరికాయి కాని పాతవి దొరకలేదు. ఎలాగా అని దిగులుపడుతుంటే పి.యస్. యం లక్ష్మిగారు, ఆ బుక్స్ వెనకాల ఆవిడ ఫోన్ నెంబర్ వుందికదా కాల్ చేసి ఆవిడనే అడగండి అన్నారు. అమ్మో ఆవిడకు కాల్ చేసి మాట్లాడటమే ఏమంటారో అన్నాను. ఏమంటారు ? ఎవరైనా మీ బ్లాగ్ చదువుతానంటే మీరు సంతోషిస్తారాలేదా ఆవిడా అంతే అన్నారు కాని ధైర్యం చేయలేకపోయాను:) ఈ లోపల ఉమాదేవిగారు ఆవిడను అడిగి ఏవో కొన్ని వున్నాయట అడగండి పరవాలేదు ఆవిడేమీ అనుకోరు అన్నారు. ధైర్యే సాహసే పుస్తకాలే అనుకుంటూ ఆవిడకు ఫోన్ చేసాను.ఐతే పాతవి ఆవిడ దగ్గరా లేవట! కొత్తవి వున్నాయి అన్నారు. అవి నాదగ్గరా వున్నాయని చెప్పాను. చాలా బాగా , ఎప్పటి నుంచో తెలిసినట్లు ఓ ఫ్రెండ్ లా మాట్లాడారు . చాలా సంతోషమనిపించింది:)

ఓరోజు ఉమాదేవి గారు ఫోన్ చేసి ఈ రోజు రచయితల మీటింగ్ త్యాగరాయగాసభలో వుంది వస్తారా అని అడిగారు. నేనేమీ రయిత్రిని కాదుకదండీ అంటే పొత్తూరివిజయలక్ష్మి గారిని కలవచ్చు అని తాయిలం చూపించారు :)ఇహ ఆగుతామా :) వెళ్ళాను. లోపలికి వెళుతూనే పొత్తూరి విజయలక్ష్మిగారు కనిపించారు.ఉమాదేవి గారు నన్ను పరిచయం చేసారు.మీరు మొన్న కాల్ చేసారు కదా అని వెంటనే గుర్తుపట్టారు. "మాలాగారి అభిమానం లో తడిసి , నాకు జలుబొచ్చిందండీ " అన్నారు విజయలక్ష్మిగారు. "అయ్యో పాపం " అనుకున్నాను మనసులో :) అలా నా అభిమాన రచయిత్రి ని కలిసాను :)

Saturday, October 12, 2013

కలికి చిలుకల కొలికి



బతుకమ్మ తెలంగాణా వారి ఆడపడుచు.ప్రతి దసరాకు పుట్టింటి కి తీసుకొచ్చి ఆదరించి పంపుతారు. పంపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఇలా చెపుతారు.

అత్తామామా పట్లా చారా,
వద్దిక కలిగి వుంటే బుద్దిమంతురాలివైతే,
మాయమ్మ లక్ష్మిదేవీ పోయీరావమ్మా.
పోయి మీ అత్తింట బుద్దికలిగి వుండు.
ఎవరేమన్ననూ ఎదురాడబోకమ్మా,
పలుమార్లు పన్నెత్తి నవ్వబోకమ్మ,
పరమాత్మ (భర్త)తో కూడి వెలుగు మాయమ్మ,
అరిటాకు వంటిదీ ఆడజన్మంబు,
అత్తగారి తో పోరు చేయబోకమ్మ,
మామగారి తో మాట్లాడబోకమ్మ,
వీధి నిలుచుండి , కురులిప్పబోకమ్మ,
సంధ్య నిద్ర మరువు తల్లి,
పాటించిన దీపావళి పండుగ పదినాళ్ళున్నది,
నాటికి నిన్ను తీసుకు వస్తు,
ఇంకా ఆరునెలలున్నది సంక్రాంతి పండుగ,
నాటికీ నిన్ను తీసుకు వస్తు,
మాయమ్మ లక్ష్మి దేవీ పోయీరావమ్మ.
ఏమిటీ అమ్మాయిల కు  ఇది చదువుతుంటే కోపం వస్తోందా :) ఆగండాగండి. ఇందులోని అర్ధం తెలుసుకుంటే కోపం ఉష్ మంటుంది. కుటుంబానికి మూల స్తంభం స్త్రీ.ఇంటి ని పిల్లలను తీర్చిదిద్దవలిసింది ఆమే.ముఖ్యంగా పిల్లలను.ఎంత తండ్రి భుజాల మీదికి ఎక్కి ఆడినా చివరకు తల్లి వడినే చేరుతారు.ఆమె వొద్దిక గావుంటేనే కదా ఇంట్లో సుఖ శాంతులు వుండేది.ఇష్టం వచ్చినట్లు చిర్రుబుర్రులాడుతూ వుంటే ఇల్లు నరకమే .ఇంక పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఇంటి వాతావరణం సంతోషంగా వుంటేనే పిల్లలు మంచి పౌరులుగా ఎదుగుతారు.ఇలా మంచి పౌరులను సమాజానికి అందించే భారాన్ని స్త్రీ భుజం మీద వుంచారన్నమాట :)

ఈ పాట విన్నప్పుడల్ల నాకు  మాంగల్యబలం సినిమా లోని ఇదో ఈ పాట గుర్తొస్తుంది:)



ఇంకో బతకమ్మ పాట;

అమ్మాయి , నీళ్ళు తీసుకొద్దామని , కడవ చంకన బెట్టుకొని వెళుతోందిట. ఇంతలో ఆమె పుట్టింటి కి తీసుకెళుదామని అన్నలు వచ్చారట.వాళ్ళను చూడగానే ఆమెకు కళ్ళళ్ళో నీళ్ళోచ్చేసాయట.ఎందుకు తల్లీ కన్నీరు , మీవాళ్ళకు చెప్పిరా వెళుదాము అంటారుట అన్నలు. అప్పుడు అత్తమామలను, బావగారిని, తోడికోడలును, గోలీలాడుకునే మరిదినీ (ఆ పొట్టోడినీ ఎందుకో :)) చివరకు భర్తనూ అడిగి, వారికోసం అన్నలు ఏమి తెచ్చారో చెప్పి పుట్టింటికి బయిలుదేరుతుంది:)
సీతకాలమొచ్చేకోల్ చీరల్లూ చినిగే,
మారుకాలమొచ్చే కోల్, మడతల్లూ చినిగే,
సీత నీ పుట్టింటా కోల్ చీరలే లేవా ,
నీలు చీర కట్టీకోల్ , నీలు రవిక తొడిగీ,
నీలాలపేరేసి (నీలపు రంగు గొలుసు)కోల్ నీళ్ళకుతాబోయి,
వచ్చిరి అన్నల్లూ కోల్ వనముల్లూ దాటి,
నిలిచిరి అన్నల్లూ కోల్ నిండూ పందిట్లో,
కాళ్ళు కడుగ నీళ్ళిచ్చీ కోల్ కన్నీళ్ళూబెట్టే.
ఎందుకు కన్నీరు కోల్ ఏలా కన్నీరూ,
తుడుచుకో కన్నీరూ కోల్ ముడుచుకో కురులూ,
ఎత్తుకో పాపడిన్నీ కోల్ ఎక్కుటద్దమునా,
నువ్వు చెప్పేవారితో కోల్ చెప్పీరావమ్మా.
కుర్చీపీటా మీదా కూర్చునట్టీ కోల్ ఓ అత్తాగారు,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండి.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారు?
నాకు నల్లచీరా కోల్ నెమలడుగుల రవికా,
అత్తకు పట్టిచీరా కోల్ అద్దాల పట్టు రవికా,
మామకు ధోతుల్లూ కోల్ మల్లెపూలా శాలువాలూ,
వారికి అంబర్షా కోల్ అంగీలా జోడూ,
పాపకు పట్టంగీ కోల్ పాలుతాగు గిన్నె.
అట్లతే నేనెరుగా కోల్ నీ మామానడుగు.

పట్టెమంచానా పవళించూ కోల్ ఓ మామాగారూ,
మా అన్నలొచ్చారు కోల్ మమంపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నీ బావానడుగూ.

భారతము చదివేటీ కోల్ ఓ బావాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ.
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .

అట్లైతే నేనెరుగా కోల్ నీ అక్కా నడుగూ.

వంటిల్లు దిద్దేటీకోల్ ఓ అక్కాగారూ,
మా అన్నలొచ్చారూ కోల్ మమపారండీ .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనురుగా కోల్ నీ మరిదీనడుగు.

బొంగరాలాడేటీ కోల్ ఓ చిన్నీ కృష్ణా,
మా అన్నలోచ్చారూ కోల్ మమంపారండీ?
మీ అన్నలొస్తేనూ కోల్ మీకేమీ తెచ్చారు?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
అట్లైతే నేనెరుగా కోల్ నా అన్నా నడుగూ.

రచ్చలో వుండేటీ కోల్ ఓ రాజేంద్రా భోగీ,
మా అన్నలొచ్చారూ కోల్ మమంపారండీ.
మీ అన్నలొస్తేనూ కోల్ నీకేమీ తెచ్చారూ?
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
. . . . . . . . . . . . .
ఎప్పుడు వస్తావూ కోల్ ఎప్పుడు పోతావూ?
చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ కోల్ చేసీ వస్తానూ.
మరుదుల పెళ్ళిళ్ళకూ కోల్ మరలీ వస్తానూ,
తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకూ కోల్ తరలీపోతాను.
ఎత్తర మేనాలూ కోల్ దించర దివిటీలూ!
హమ్మయ్య పర్మిషన్ వచ్చేసింది :)

ఈ పాట వింటుంటే సీతారమయ్యగారి మనవరాలు లోని 'కలికి చిలుకల కొలికి మాకు మేనత్త ' పాట గుర్తురావటం లేదూ :)

బతకమ్మ కథ లో నూ , పాటల్లో నూ చెప్పేది ఆడపిల్లను వొద్దికగా వుండమని , ఇంటి ఆడపడుచును గౌరవించమనీనూ.అమ్మాయికి పెళ్ళి చేసి పంపేసాము ఇహ మా బాధ్యత తీరింది అనుకోక, పండుగకు సాదరంగా ఆహ్వానించి, గౌరవించి, ఆదరించాలి. అప్పుడే అన్నదమ్ములు , అక్క చెళ్ళెళ్ళ మధ్య సంబంద బాంధవ్యాలు నిలుస్తాయి. కుటుంబవ్యవస్త పదిలంగా వుంటుంది. తద్వారా సామాజం వర్ధిల్లుతుంది.



Monday, October 7, 2013

బతకమ్మ కథ


దేవీ నవరాత్రులు మొదలు అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున బతకమ్మను పెడుతారు.బతకమ్మ అంటే అమ్మవారి రూపం.రకరకాల పువ్వులు ఒకదానిమీద ఒకటిగా పేర్చి ఎంత ఎత్తు చేయగలుగుతే అంత ఎత్తున పేరుస్తారు.పైన ఓ తమలపాకు లో పసుపు తో గౌరమ్మను చేసి పెడతారు. సాయంకాలం ఇంటి ముందు కాని , ఏదైనా దేవాలయము ముందు కాని , శుభ్రంగా వూడ్చి, కళాపి చల్లి, ముగ్గులేసి ఆడవాళ్ళు  అందరూ తమ తమ బతకమ్మలను తెచ్చి అక్కడ వుంచి చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ పూజిస్తారు.పూజ అయ్యాక నైవేద్యం పెట్టి , నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. ఈ విధముగా తొమ్మిది రోజులు ఆడుతారు.రోజుకొక రకం నివేదన చేస్తారు.తొమ్మిదోరోజు వడిబియ్యం తో సాగనపుతారు.ఇది దసరా ముందు రోజు , అంటే నవమి రోజు అవుతుంది. కొంతమంది, మనము ఆడపిల్ల ను పండుగకని పుట్టింటికి తెస్తాము కదా , పండుగ  ముందు సాగనపటమేమిటని , తొమ్మిది రోజులలో వక రోజు ఆడకుండా వుంచి, పండుగ మరునాడు సాగనంపుతారు.

ఇది తెలంగాణప్రాంతము లో చాలా శ్రద్ధగా , ఉత్సాహం గా చేసే పూజ.దీనికి ఒక కథ వుంది.

"అనగనగా  ఒకాయన వుంటారు..ఆయనకు ఏడుగురు కొడుకులు , వక కూతురు.అందరికీ పెళ్ళిళ్ళు చేసి, బాధ్యతలన్నీ తీరాయికదా అని, ఆయన భార్య తో  తీర్ధయాత్రలకు వెళుతారు.అప్పుడే దసరా పండుగ వస్తుంది.మరి ఆడపిల్లను పుట్టింటి కి తేవాలికదా! అందుకని అన్నలు చెల్లెలిని తీసుకొస్తారు.చెల్లెలు బతకమ్మ లాడుదామనుకుంటుంది. కాని, పట్టుచీర, కాళ్ళకు కడియాలు లేవు.ఎలా మరి?అందుకని పెద్దవదినను అడుగుతుంది కాని ఆమె నాకూ కావాలి ఇవ్వను అంటుంది. అలా ఆరుగురు వదినలూ ఇవ్వమంటారు.ఏడో వదిన దగ్గరకు వెళ్ళేసరికి ఆవిడ స్నానం చేస్తూ వుంటుంది." శీలకు పట్టుచీర, గూట్లో కడియం వున్నాయి ,తీసుకుపో . కాని చీరకు కొర్రు పట్టినా, కడియం నొక్కుకుపోయినా , నీ రక్తం నా నుదుటను పెట్టుకుంటాను." అంటుంది. చెల్లెలు ఓ క్షణం ఆలోచిస్తుంది. ఆ ఏమవుతుందిలే జాగ్రత్తగా తెచ్చిస్తే సరి అనుకొని తీసుకొని, చీర కట్టుకొని,కాలికి కడియం పెట్టుకొని వెళుతుంది.

ఉత్సాహంగా,జోరుగా బతకమ్మ ఆడేస్తుంది.ఆ ఉషారులో పాపం చీరకు కొర్రు పడుతుంది,కడియం నొక్కుకుపోతుంది.ఏమిచేయాలో తోచదు.చడీ చప్పుడు చేయకుండా , నిశబ్ధంగా అవి తీసుకుపోయి ఎక్కడి నుంచి తెచ్చిందో అక్కడ పెట్టేస్తుంది.ఐనా వదినకు తెలీకుండా వుంటుందేమిటి? తెలుసుకుంటుంది. అంతే భర్త వచ్చే సమయానికి తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.ఎందుకలా పడుకున్నావు ఏమైంది అని అడిగిన భర్తకు, నాకు చాలా తల నొప్పిగా వుంది, నీ చెల్లెలి ని చంపి ఆ రక్తం తో నా నుదుట బొట్టుపెట్టుకుంటేనే తగ్గుతుంది అంటుంది.అతను కొద్దిసేపు బయటకు వెళ్ళి , ఓ గిన్నె లో రక్తం తెచ్చి ఇస్తాడు. ఆమె సంతోషంగా ఆ రక్తం తో బొట్టుపెట్టుకొని నీళ్ళ కోసం బావి దగ్గరకు వెళుతుంది.

బావి దగ్గర వున్న ఆడవాళ్ళందరూ "మనమందరమూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే , ఇదేమిటీ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొచ్చిందీ"అని పకపకా నవ్వుతారు.అంతే కోడలి కి కోపం వచ్చి, చరచరా ఇంటి కి వచ్చి,తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.భర్త ఈసారి కాకి రక్తం తెచ్చి ఇస్తాడు.అది తెలీక ఆవిడ ఆ బొట్టు పెట్టుకొని వెళుతుంది.మళ్ళీ అందరూ"ఈ సారి కాకి రక్తం పెట్టుకొని వచ్చింది " అని నవ్వుతారు.అంతే కోడలికి బోలెడు కోపం వచ్చేస్తుంది. వళ్ళు మండిపోతుంది.ఈ సారి నీ చెల్లి రక్తం తెస్తే కాని వీల్లేదని భర్తకు గట్టిగా చెప్పేస్తుంది.

పాపం అతను ఇంకేమి చేయగలడు. ముద్దుల భార్య కదా కోరిక తీర్చాలి కదా!అందుకని ఈ సారి చెల్లిని ప్రేమగా పిలిచి , నిన్ను బావ దగ్గర దింపివస్తాను పదా అని తీసుకెళుతాడు.పాపం, అన్నయ్య మోసం, వదిన కుట్ర తెలీని ఆపిల్ల అతనితో బయిలుదేరుతుంది. దారి మధ్యలో ఓ చెట్టుకింద ఆపి"అలిసిపోయాము కదా కాసేపు పడుకో "అని చెల్లిని వళ్ళో పడుకోబెట్టుకొని తల వత్తుతాడు. ఆమె నిద్రపోగానే చంపేసి , కాస్త రక్తం తీసుకొని ఇంటికి తిరిగి వెళుతాడు.ఈ సారి వదిన ఆ రక్తం బొట్టు పెట్టుకొని బావి దగ్గరకు వెళ్ళగానే అక్కడవున్న వారంతా "ఈ సారి కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందే"అని పకపకా నవ్వుతారు.అప్పుడు వదిన తృప్తి పడుతుంది.

అమ్మానాన్నా తీర్ధయాత్రల నుంచి తిరిగి వస్తుంటారు.తమ వూరి దగ్గరకు రాగానే ఓ చక్కటి పూల తోట కనిపిస్తుంది.అరే ఇదేదో కొత్తగా వచ్చినట్లుందే మనము వెళ్ళేటప్పుడు లేదు , కాసేపు ఇక్కడ సేద తీరుదాము అనుకుంటారు.అక్కడే వున్న బావిలో నుంచి నీళ్ళు తోడుదామనుకొని తండ్రి చేద అందులో వేయబోతాడు. వెంటనే
"అంటకు అంటకు ఓ నాన్నా,
అంటితే నీ చేయి కందేనూ,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."
అని వినిపిస్తుంది.వెంటనే నాన్న చేదవదిలేస్తాడు. అమ్మ చేద వేయబోతుంది. అప్పుడూ అలాగే వినిపిస్తుంది. ఇదేమిటి ఇలా అంటోంది. పైగా మన అమ్మాయి గొంతులా వుంది అని అమ్మానాన్నా కలవరపడిపోతారు.కొడుకులను రమ్మని కబురు పెడుతారు. వాళ్ళూ ఎవరు చేద వేయబోయినా అలానే వినిపిస్తుంది.చివరి అన్న వేయబోతే,

"అంటకు అంటకు ఓ అన్నా,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్నవు నీవొచ్చి పడబొడిచి బోయినావు"అంటుంది.

వదిన చేద వేయబోతే ,
"అంటకు అంటకు ఓ వదినా,
దోషకారి వదినవు నీవు చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."అంటుంది.

దాని తో అందరికీ జరిగినది తెలిసిపోతుంది.ఇంతలో ఆ అమ్మాయి భర్త ఏమైంది, ఏడాదైనా భార్య రాలేదు అని చూసేందుకు వస్తాడు. అతనూ ఈ తోటను చూసి లోపలికి వస్తాడు.అక్కడ , అత్తమామలను, బావమరుదులను చూసి ఆశ్చర్యపోతాడు. జరిగింది తెలుసుకుంటాడు. భార్య మీద ప్రేమతో చాలా సేపు ధుఖించి, తనూ ఆ బావిలోపడి చనిపోదామనుకుంటాడు. ఇంతలో అశిరీరవాణి , "ఓయీ నీ భార్య క్రితం జన్మలో బతకమ్మ పూర్తిగా తొమ్మిదిరోజులు ఆడకుండా మధ్యలో వదిలేసింది. అందువలన ఈవిధముగా జరిగింది. నువ్వు శ్రద్ధగా చుటుపక్కల అమ్మాయిలతో బతకమ్మ ఆడించు. నీ భార్య మాములు రూపం పొందుతుంది". అని చెపుతుంది. అంత , చుట్టుపక్కల అమ్మాయిలందరినీ ప్రోగుచేసి, ఆ తోటలోని పూవులతోనే బతుకమ్మను పేరించి , తొమ్మిది రోజులూ ఆడిస్తాడు. తొమ్మిదోరోజు పూర్తికాగానే , ఆ తోట, బావి మాయమై అతని భార్య గా మారిపోతుంది.అందరూ సంతోషిస్తారు.చివరి అన్న, వదిన వారిని క్షమార్పణ కోరుతారు."

బతకమ్మ ఆడటం పూర్తికాగానే అందరూ చుట్టూ కూర్చొని ఈ కథ చెప్పుకొని , హారతి ఇచ్చి, నైవేధ్యం పెడతారు. కథా అక్షింతలు తలపై వేసుకుంటారు.ఆ తరువాత నీళ్ళలో నిమజ్జనం చేస్తారు.

ఇది ఇంతకు ముందు చెప్పిన "బతకమ్మ" విశేషాలు.

పైన వున్నది మా ఇంటి బుజ్జి బతకమ్మ :)

Friday, September 20, 2013

చక్కటి పూల కు చాంగుభళా!


నిత్య పూజలివిగో నెరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము.


 పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి - తెచ్చి శిరసాదిగ దిగనలది
అద్దెరబ ఈ కూన అందరి కన్నులకింపై,


పేరంటాళ్ళ నడిమి పెళ్ళికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు - See more at: http://www.lyricsintelugu.com/2010/07/pidikita-talambrala-pendli-koothuru.html#sthash.EgYZU2wp.dpufపేరంటాళ్ళ నడిమి పెళ్ళికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు - See more at: http://www.lyricsintelugu.com/2010/07/pidikita-talambrala-pendli-koothuru.html#sthash.EgYZU2wp.dpufపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు.



కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సలుపు చూపులకు చాంగుభళా!


ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా!


జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర.

ఈ సారి కుసిన వానల మహత్యమో, ఆరు సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషి , సంవత్సరము గా  కొత్తమాలి ఈశ్వర్ పడుతున్న శ్రమ కు ఫలితమో , ఏదైనా కాని ఈ సారి నా తోట నలువైపులా రంగు రంగుల పూవులతో కనులకింపుగా వుంది:)

ఇదికాదే సౌభాగ్యము,ఇదికాదే వైభవము!
ఇంతటి ఆనందములో ,పక్కుంటి వారికోసం బాదం చెట్టును కు వీడ్కోలు ఇవ్వటం , వెనికింటి వారి కోసము అరటి మొక్కను తీసేయటము సరిపోనట్లు కొత్త బాధ వచ్చింది :(


  అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితినీ!`

చెట్టు నిండా బోండాలతో కళకళలాడుతూ , ప్రతి శనివారమూ వెంకటేశునికి తప్పక కాయనిస్తుంది ఇది. ప్రతి శ్రీరామనవమి కీ "విను వీధుల తిరిగే " మా శ్రీరామునికి నాలుగు సంవత్సరాలుగా మా ఇంటి ముందు దీని కాయను సమర్పించుకుంటున్నాము.అంతేనా ఇంటికెవరు వచ్చినా పైకి తీసుకెళ్ళి , పిట్ట గోడ మీదుగా అందే బోండాళ్ళను , వాళ్ళు కోసుకుంటే ఆనందిస్తున్నాము.అదేమిటో దీని కాండానికి చెదలు పట్టాయి. ఏ మందులకూ లొంగటము లేదు. కాండమంతా డొల్లగా ఐపోయింది. ఐనా చెట్టు నిండా బోండాలు వస్తూనే వున్నాయి. మొన్న శ్రావణ శుక్రవారానికి , వినాయక చవితి కీ నాలుగేసి పెద్ద పెద్ద కాయలు ఇచ్చింది. ఐనా ఈ చెట్టును వుంచకూడదుట!ఇంత డొల్ల వుంటే ఎప్పుడైనా కూలిపోవచ్చు, చాలా ప్రమాదం అంటున్నారు. నిన్న మా వియ్యంకుడు చూసి మరీ మరీ చెప్పారు తీసేయమని.శుక్రవారము, మంగళవారము కాకుండా చూడండి, ముందుగా దీని కాయలు గుళ్ళో కొట్టండి, చెట్టుకు పసుపూ కుమకుమ తో పూజచేసి తీసేయండి తప్పదు అని మరీ మరీ చెప్పివెళ్ళారు. ఎంత దిగులుగా వుందో !


 దిగులుపడకు నేను పూత మొదలుపెట్టాను కదా అని ఓదారుస్తోంది పక్కనున్న ఇంకో నారికేళవృక్షం.


నానాటి బ్రతుకు నాటకము.
ఓ నిష్క్రమణ , ఓ అవిష్క్రమణ తప్పనిదేమో!

మొగ్గ తొడిగినప్పటి నుంచి పుష్పించేవరకూ గమనించటం ఎంత ఆనందం :) ప్రతిరోజూ ఉదయమే మొక్కలలో తిరుగుతూ ఏవి పూసాయి, ఏవి వాడిపోయాయి అని పరిశీలిస్తూ ,నా మాట వినని  మొండి మొక్కలు రాధామాధవాన్ని, గన్నేరును మందలిస్తూ,నీకెప్పుడూ ఎర్ర మందారమే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని అలిగే పసుపు, గులాబీ మందారాల అలుకలు తీరుస్తూ , అదిగో అల్లదిగో అంటూ పైపైకి పోతున్నావు కాని ఎప్పుడు పూస్తావు అని మల్లెను కోపం చేస్తూ, నువ్వు బంగారుతల్లి పూయటం మొదలుపెట్టిన సన్నజాజిజి బుజ్జగిస్తూ (నా మొహం మూడే పూలు పూసింది. గట్టిగా అంటే అవీ పూయదేమో),నన్ను పూజకు ఎప్పుడూ కోయవు అని మూతిముడిచే గోరింట, చంద్రకాంత, కనకాంబరాలను ఓదారుస్తూ (అదేమిటో అవి పూజకు పనికి రావని ఎవరో చెప్పారు ) భావములో , భాహ్యంలో ఆ గోవిందుని తలుచుకుంటూ నేను పూజకు పూలు కోసుకొచ్చేసరికి చాలా సార్లు మావారి పూజైపోతుంది :) 

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం - 

Wednesday, September 11, 2013

నీరో చక్రవర్తిణి

నిన్నటి నుంచి మేము బరోడాలో వుండగా వున్న, మావారి పర్సనల్ కుక్ మోతీరాం గుర్తొస్తున్నాడు:) మావారు ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు, కాంప్ లకు వెళ్ళినప్పుడు వెంట వెళ్ళేవాడు. ఓ రెండు పెట్టెలల్లో స్టవ్, వంటసామాను అన్నీ తీసుకొని వెళ్ళేవాడు. భోజనం సమయం లో ఎక్కడ ఆగుతే , అక్కడ ఓ పక్కగా , పెట్టెలు తెరిచేసి గబగబా పులకాలు , ఆలూ సబ్జీనో ఏదైనా టిండ్ సబ్జీనో చేసి పెట్టేవాడు.ఈయన ఇంటికి వచ్చినప్పుడు మోతీరాం గరం గరం రోటీ, సబ్జీ , చాయ్ చేసిచ్చాడు అని తెగ మెచ్చుకునేవారు. సరే అంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నేనూ , ఆలూ సబ్జీ నో, ఏదైనా టిండ్ సబ్జీనో చేసిపెడితే,ఇంట్లో కూడా ఇవెందుకు ఫ్రెష్ కూరలు చేయక అని విసుక్కునే వారు.మరే ఏ ఎడారిలోనో మోతీరాం చేసిపెడితే ఇంటికి వచ్చినా అవే తలుచుకుంటారు నేను చేస్తే విసుక్కుంటారు అని మనసులో గొణుక్కునేదాన్ని. అంతేగా పైకి అనే ధైర్యం అప్పుడు లేదుగా :) ఇంట్లో ఏదైనా పార్టీ అనగానే , మసాల్చీ (హెల్పర్) తో సహా వచ్చేసేవాడు.అతని వచ్చేలోపలే నేను నా వంట కానిచ్చుకొని బయట కూర్చునేదాన్ని.అతను వంట పూర్తి చేసి, ఎంత రాత్రైనా పార్టీ అయ్యాక వంటిల్లు , స్టవ్ , గట్టు అన్ని శుభ్రంగా తుడిచి ప్లేట్లన్నీ బయటవేసి, వంటింట్లో వాసనలు రాకుండా స్ప్రే చేసి వెళ్ళేవాడు:)
ఓసారి ఇలాగే నా పని ముగించుకొని బయట వరండాలో కూర్చొని నవల చదువుకుంటున్నాను. ఇంతలో ఓ బుజ్జి కోడిపిల్ల గున గున లాడుతూ నా కాలి కిందికి వచ్చింది.తెల్లగా ముద్దుగా వుంది. ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తుంటే మోతీరాం పరుగెత్తుకొచ్చాడు.ఏమిటీ అంటే ఆ కోడిపిల్ల కోసం అట!అదేమిటి దీనితో ఏమిచేస్తావు అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను మేం సాహెబ్ అన్నాడు.లోపల చికెన్ , మటన్ వండుతున్నాడని తెలుసు కాని వాటికోసం ఇలా కోడిపిల్లలని చంపాలా అని కళ్ళు తిరిగిపోయాయి. చికెన్ అంటే కోడిపిల్లేకదా మేం సాహెబ్ అన్నాడు. పైగా జిందా చికెన్ ఐతే చాలా రుచి అట.మా అమ్మాయైతే దాన్ని చంపేస్తావా అని ఏడుపు మొదలు పెట్టింది.గుడియా రాణీ ఆప్ జాకె ఖేలో అని దాన్ని బుజ్జగించి పంపి, మేం సాహెబ్ కృపయా ఆప్ అందర్ మత్ ఆయియేగా అని శుద్ద హిందీలో చెప్పి , ఆ కోడిపిల్లను వెంటాడి పట్టుకొని వెళ్ళాడు.


ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడెందుకు గుర్తొచ్చాడు అంటే , ఈ రోజు ఇంట్లో 60 మందికి పార్టీ జరుగుతోంది.బరోడా నుంచి వచ్చేసాక ఎన్ని పార్టీలైనా ఇంట్లో నాన్ వెజ్ వండలేదు. పది సంవత్సరాల క్రితం వరకూ మా అత్తగారు, మామగారు వున్నారు. కాబట్టి నో నాన్ వెజ్ :) ఆ తరువాత పిల్లలకు ఇష్టంలేదు అందుకూ నో నాన్ వెజ్ :) ఇప్పుడు ఫుల్ సొతంతరం వచ్చేసింది. వాళ్ళ ఆఫీస్ లో వి.పి జాబ్ వదిలేసి వెళుతున్నాడు అందుకని ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచీ అందరినీ విత్ ఫామిలీస్ పార్టీ కి పిలిచేసారు.ఆ వి.పి ఈయన గారికి చాలా క్లోజ్. ఈయన కు బాస్ అట మరి. కాని చూసేందుకు ఈయనగారే బాస్, ఆ అబ్బాయి ఈయన అసిస్టెంట్ లా వుంటారు. ఈయన చేరక ముందు అతను అతని వీలుప్రకారం రావటం , అతని పనేదో అతను తాపీగా చేసుకోవటం అలవాటట.అప్పటికీ ఆ అబ్బాయి నాతో అన్నాడు, సార్ ని ఆఫీస్ కు రోజూ రానవసరం లేదు, టైం ప్రకారం రానవసరం లేదు అని చెప్పామండి కాని వచ్చేస్తున్నారు. మమ్మలినందరీ అలాగే రమ్మంటున్నారు. బోలెడు పని చేయిస్తున్నారు అని. అంటే అన్నాను అంటారు కాని ఈయన షంటింగ్ భరించలేకే జాబ్ వదిలేసి వెళుతున్నాడేమోనని నా డౌటూ :) కాదట హయర్ స్టడీస్ కు వెళుతున్నాడు అన్నారు కాని నాకైతే అనుమానమే ! ప్రియమైన శిష్యుడు వెళ్ళిపోతున్నాడని పార్టీ అన్నమాట!

నిన్నటి నుంచి పార్టీ ఏర్పాట్లు మొదలయ్యాయి. మావారి పర్సనల్ అసిస్టెంట్ నంబర్ 2 కం డ్రైవర్ మహేష్ , మా వాచ్ మాన్ వెంకట్రావు రంగం లోకి దిగారు.చుట్టు పక్కల వున్న హోటల్స్ నుంచి  నాన్ వెజ్ వెరైటీస్ కొద్ది కొద్దిగా తెచ్చారు. రుచి చూసారు. బావర్చీ నుంచి , ఏదోట. అమీర్పేట్ లో ఇంకేదో హోటల్ నుంచి ఇంకేదోట. ఆర్డర్స్ ఇచ్చేసారు.డబల్కా మీఠా, కుర్బాని మీఠా ఓ కప్పు తెచ్చారు.అవి తింటే డైయాబిటిక్స్ కాని వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం వుంది వద్దు,డబల్కా మీఠా నేను చేస్తానులెండి అన్నాను. సరే అన్నారు.పొద్దున్నే ఆయన ఆఫీస్ అసిస్టెంట్ కాల్ చేసి సార్ కలాకండ్, రబ్డీ ఇక్కడ మంచి ది దొరుకుతుంది తేనా అన్నాడు. వాకే తెచ్చేయ్ :) కలాకండ్ తో రబ్డీ ఏమిటి , జిలేబీ తో ఐతే బాగుంటుంది అని నేను గొణుగుతే ఓకే జిలేబీ కూడా 2 కిలోలు వచ్చేస్తోంది. సో స్వీట్ పత్తర్ ఘట్టీ నుంచి వస్తోంది.సరే నా డబల్కా మీఠా కాన్సిల్.వెజిటేరియన్ వంట మా శైలజ చేసేస్తుందిట. నువ్వు వంటింట్లోకి రాకమ్మా , నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తావు, మా చెల్లి ని సాయం రమ్మన్నాను వస్తోంది అంది.పొద్దున్నే 6 గంటలకు మహేష్, వెంకట్రావు పైకి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వెజిటేరియన్స్ కు, సెకండ్ ఫ్లోర్ నాన్ వెజిటేరియన్స్ కూ , డ్రింక్స్ కార్నర్, స్మోక్ జోన్ అన్నీ సార్ గారి ఆధ్వర్యం లో సద్దేసారు. ఇంతలో మావారికి ఆ వి.పీ కీ అతని భార్య కూ , ఇద్దరు పిల్లలకు దండలు వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంతే ఇంకో అసిస్టెంట్ కు కాల్ చేసి , ఫ్లవర్ మార్కెట్ నుంచి నాలుగు గులాబీ దండలు తెమ్మని పురమాయించేసారు. దండలూ తయార్!

భారి ఎత్తున ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.అందరికీ నేను కాళ్ళకూ చేతులకూ అడ్డం వస్తున్నానట! ఓ రెండేళ్ళ క్రితం ఎవరైనా ఓ కప్పు  కాఫీ ఇస్తే బాగుండు, కాసేపు నడుము వాలుస్తే బాగుండు , అస్సలు కూర్చోనీయరు , నిలబడనీయరు  అని అనుకున్నమాట నిజమేకాని మరీ ఇంతగానా :) నాకు నేనే  నీరో చక్రవర్తిణి గా ఫీలవుతూ ఇక్కడ సెటిలైపోయాను:)

Wednesday, September 4, 2013

ఎటోవెళ్ళిపోయింది మనసు :)

"హాయ్ బామ్మా "
"హాయ్ కన్నా "
"కెన్ వుయ్ హావ్ మిడ్ నైట్ ఐస్క్రీం ?"
"వావ్ వాటే గ్రేట్ ఐడియా :)" ఎన్ని సంవత్సరాలైందో మిడ్ నైట్ ఐస్క్రీం తిని !అర్జెంట్ గా కళ్ళ ముందు రింగులు తిరిగిపోయాయి!
"బుజ్జిగాడా తప్పకుండా తిందాము కాని నువ్వు అప్పటి వరకు మెలుకువగా వుండగలవా మరి?"
"వుంటా బామ్మా."అనేసి హడావిడిగా "మహేష్" అని డ్రైవర్ ను పిలిచాడు.ఏమిటిబాబూ అంటూ వచ్చాడు మహేష్.
"నువ్వు మిడ్ నైట్ వస్తావా "?
మహేష్ కు అర్ధం కాలేదు :)
బాబు అర్ధరాత్రి బయటకు వెళ్ళి ఐస్క్రీం తింటాడట , నువ్వు వచ్చి తీసుకెళుతావా అని అడుగుతున్నాడు అని చెప్పాను.ఈ బామ్మా మనవళ్ళు ఎక్కడి పిచ్చోళ్ళు అనుకున్నాడో ఏమో , మా ఇద్దరినీ తిప్పి తిప్పి చూసి వస్తాను బాబూ అని చెప్పి వెళ్ళిపోయాడు.ఇహ అప్పటి నుంచి మా రాజాబాబు గారు గంతులే గంతులు. మాటి మాటి కీ టైం చూసుకోవటం , ఇంకా మిడ్ నైట్ ఎప్పుడవుతుంది బామ్మా అని హైరానా పడిపోవటం , నాకు చాలా ముచ్చటగా , వాడి కి చాలా భారం గా సమయం గడిచీ . . .  గడిచీ . . . మొత్తానికి 11 అయ్యింది!
ఇహ మా హడావిడి మొదలైపోయింది. అందరూ బయిలుదేరేవరకూ వాడికి ఎంత కంగారో!తాత వస్తానని మర్చిపోయి నిద్రపోయారు.ఎంత లేపినా ఊ ఊ అంటారే కాని లేవరు ! డాడీ కి మీటింగూ!ఏచేస్తాం ఇద్దరినీ వదిలేసాం:)హాయిగా మా కోడలు , నేనూ , మనవడు, మనవరాలు వెళ్ళాము.

అబ్బ ఐస్క్రీం పార్లర్ ఎంత చల్లగా వుందో!ఐస్క్రీం ఓ పట్టాన తేడు. మేమిద్దరమూ చలికి ఊహ్ అనుకుంటూ వున్నాము. చివరకు తట్టుకోలేక వాడేమో చేతులు షర్ట్ లో దాచేసుకున్నాడు:)నేనేమో కొంగు పూర్తిగా కప్పేసుకున్నాను:) ఐనా చలి మమ్మలిని వదలందే!ఇద్దరికీ ఆరాటమే కాని ఏదీ తట్టుకోలేరు అని మాకోడలు, మనవరాలు మామీద జోకులు!అమ్మయ్య ఎట్లా ఐతేఏం మావాడి షేక్ (ఏమి షేక్ అబ్బా వాడేదో పేరు చెప్పాడు మర్చిపోయాను ), నా కసాటా , మనవరాలి బుల్ ఐ , కోడలి లీచీ ఐస్క్రీం వచ్చాయి.చలికి వణుకుతూ , చల్లటి ఐస్క్రీం తింటం వావ్ అదో తుత్తి :)

బయటకు వచ్చి కార్ లో ఎక్కుతూనే మహేష్ కు థాంక్స్ చెప్పాడు. పాపం మహేష్ సిగ్గుపడిపోయి ముసిముసి నవ్వులు నవ్వాడు.అంతే మా పని ఐపోయింది. ఎంత నిద్ర ముంచుకు వచ్చిందో!ఇంటికి వెళ్ళేదాకా అన్నా ఆగరా అంటే ఆ నిద్ర ఎలా ఆగుతుంది.ఏదో మిడ్ నైట్ ఐస్క్రీం మోజులో అప్పటి వరకూ అగాడుకాని !అలా అలిసిపోయి మీదవాలి నిద్రపోతుంటే ఎంత ముద్దువచ్చేసాడో చిన్నిగాడు:)



పైన కనిపిస్తోందే అది నా కొత్త కంప్యూటర్. మా అబ్బాయి తెచ్చి ఇచ్చాడు.అలా ఇస్తే పరవాలేదు బోలెడు జాగ్రత్తలు చెప్పాడు .ఇప్పుడేకాదు ముందు నుంచీ అంతే!మొదటిసారి నేను కంప్యూటర్ వాడినప్పుడు ఏ సైట్ కు వెళ్ళాలన్నా పర్మిషన్ అడిగేది.మా అబాయి కంప్యూటర్ పక్కకు తిప్పి ఏదో చేసేవాడు వచ్చేది . అప్పట్లో నేంతగా అదేమిటో పట్టించుకోలేదు. నా లాప్ టాప్ పిల్లలూ వాడేవారు.ఏదో కాజువల్ గా చూసినట్లు నా ఈ మేయిల్సూ చెక్ చేసేవాడు:) అందరికీ తలో ఎకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు.ఓరోజు మనవరాలు అడిగింది"బామ్మా నువ్వు పెద్దదానివేకదా డాడీ  నీకు ఎడ్మిన్ష్ట్రేషన్ పవర్ ఇవ్వొచ్చుకదా " అని . నిజమే కదా అనుకొని మావాడి ని షంటి, వాడితో బోలెడు కండీషన్స్ పెట్టించుకొని అడ్మిన్ష్ట్రేషన్ పవర్ తీసుకున్నాను. అప్పటి నుంచి పిల్లలు ఏదో ఓపెన్ చేసి తెచ్చి బామ్మా ఇక్కడ నీ పాస్ వర్డ్ రాయి అనేవారు. అప్పటికీ నేను అదేమి సైటా అని చూసేదానిని. పిల్లసన్నాసులు ఏసైట్ కు వెళుతారు , ఏవో గేంస్ కు వెళ్ళేవాళ్ళు పాపం. ప్రతిసారీ వాళ్ళు అడగటం నేను టైప్ చేయటం ఎందుకని నా పాస్ వర్డ్ వాళ్ళకు చెప్పేసాను. ఆ సంగతి డాడీ కి చెప్పొద్దు అనుకున్నాముకూడా !స్చప్ ఎలాగో తెలిసిపోయింది !ఇహ చూసుకోండి ఏమి తాండవమాడాడో .ఐదుగురం (ఇద్దరు మనవరాళ్ళు , ఇద్దరు మనవలు , నేను అన్నమాట)బిక్క చచ్చిపోయి , నిలువు గుడ్ళేసుకొని చూస్తూ వుండిపోయాము!అదేమిటో నేను పెద్దదాన్ని , వాడి అమ్మను అన్న జ్ఞానం కూడా లేకుండా పిల్లల ముందు చెడామడా అరిచేసి, నా అడ్మిన్ష్ట్రేషన్ పవర్ పీకేసి,కొన్ని రోజులు నేను కూడా లాప్ టాప్ వాడొద్దు అని రూల్ పెట్టేసి అబ్బో ఏ చెప్పాలి నా కష్టాలు ! 

సరే అదంతా పాత కథ కదా ఇప్పుడెందుకు అంటే ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చింది నా కథ!నేను గ్రీటింగ్ కార్డ్స్ కోసం ఏవేవో డౌన్లోడ్ చేస్తున్నానట!అందువల్ల నా కంప్యూటర్ లో వైరస్ వచ్చి ఫార్మెట్ చేయించాల్సి వస్తోందిట.ఈ కొత్త లాప్టాప్ లో ఏవీ డౌన్లోడ్ చేయనూ అంటేనే ఇస్తానన్నాడు!ముద్దుగా వున్న విండోస్ 8 లాప్ టాప్ వదులుకోబుద్ది కాలేదు!ఓ పది రోజులు తీవ్రం గా ఆలోచించాను.( అవును మరి పది రోజులు టైం ఇచ్చాడు, నేను ఇక్కడ వున్నన్ని రోజులూ వాడుకుంటాను తరువాత ఇచ్చిపోతాను అని.)గ్రీటింకార్డ్స్ నా, కంప్యూటరా అని . నా లాప్టాప్ మళ్ళి ఫార్మెట్ చేయించే స్టేజ్ కు వచ్చింది.ఇప్పటికే చాలా సార్లు చేయించాను.ఓ క్షణం అనుకున్నాను , పోరా నువ్వియకపోతే మా ఆయన కొని ఇవ్వరా ( మరే నేను కంప్యూటర్ నేర్చుకున్నపటి నుంచి నేను కంప్యూటర్ తో బిజీగా వున్నాను అని సంతోష పడిపోతూవుంటారు) అని కూడా అనుకున్నాను. కాని బుజ్జి దాన్ని వదులుకోలేక , గ్రీటింకార్డ్స్ చేయటానికి వాడుపెట్టిన షరతులు ఒప్పేసుకున్నాను.ఇహ పైన ఫొటో షాప్ లో రకరకాలుగా చేయలేను. నా పోస్ట్ లలో ఇమేజెస్ పెట్టలేను !లేదా అందరినీ ఫొటోలు అప్పు అడుక్కోవాలి:) నేను తీసిన ఫొటోలో లేక ఇంకెవరన్నా పర్సనల్ గా తీసిన ఫొటోలో మాత్రమే వుపయోగించాలిట!నెట్ నుంచి అస్సలు అస్సలు తీసుకోవద్దట! ఈ లాప్టాప్ ఫార్మెట్ చేయిస్తే మటుకు ఇకపై నేను లాప్ టాప్ మర్చిపోవాల్సిదే అని హెచ్చరించి మరీ ఇచ్చిపోయాడు. ఓ పక్క సంతోషం , ఓ పక్క దుఖం:)

లాప్ టాప్ గోలకేమొచ్చే గాని , ఐస్క్రీం తిని వస్తుంటే మా బుజ్జిగాడు బామ్మా మనం ఐస్క్రీం తిన్నది నీ బ్లాగ్ లో వ్రాయాలి అన్నాడు. నేను మాట్లాడలేదు . అవునాంటీ తప్పకుండా వ్రాయండి. అంది . ఏమో అనూ నేను పిల్ల ల విషయాలు కొంచం ఓవర్గా వ్రాస్తున్నానేమో అనిపిస్తోంది అన్నాను. లేదాంటీ , మీకు తెలుసా గౌరవ్ కు నేనెప్పుడూ చెపుతూవుంటాను, నీ పిల్లలకు మీ బామ్మ నీ గురించి వ్రాసినవన్నీ చదివి వినిపిస్తాను.అప్పుడు మీ బామ్మ ఫ్రెండ్స్ ఇలా అన్నారు అని కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను అని అంది.నిజమా అని ఎంత త్రిల్ ఫీలైపోయానో!.అవునాంటీ పిల్లల చిన్నప్పటి సంగతులు మీ ఫీలింగ్స్ అన్నీ చదవటానికి బాగుంటున్నాయి.అవి వాళ్ళపిల్లలకు చదివి వినిపిస్తుంటే ఇంకా బాగుంటుంది కదూ అంది.

ఓహ్. . . నేనెప్పుడూ ఇలా అనుకోలేదు. బ్లాగ్ లో ఏదో రాసుకోవాలి అనుకోవటం , నీకు నచ్చినవి వ్రాసుకో అమ్మా అని మా అమ్మాయి సలహా ఇవ్వటం తో , పిల్లల సంగతులు , మావారి గురించి ఐతే ఏగొడవలు రావుకదా అనుకొని అవి వ్రాసుకుంటున్నానే కాని , భవిష్యత్తులో నా ముని మనవలు- మనవరాళ్ళు చదువుతారు అని ఎప్పుడూ అనుకోలేదు!పైగా ఈ మధ్య మరీ ఓవర్ గా వ్రాసానేమో అనుకున్నవి డిలీట్ చేసానుకూడా ! అయ్యో అనుకుంటున్నాను ఇప్పుడు. బుజ్జిగాడు వాడి బర్త్డే కు అడిగి మరీ కార్డ్స్ పెట్టించుకునేవాడు. పిల్లలు సర్ప్రైజ్ గా వాళ్ళ బర్త్ డేస్ కు పోస్ట్ వేస్తే ఎంత సంతోషపడిపోయేవారో. అలా సంతోషపడ్డానే కాని , ఈ  కోణం లో ఎప్పుడూ ఆలోచించలేదు .నా మునిమనవరాలు/మనవడు ను మధ్యలో పడుకోబెట్టుకొని, నా బ్లాగ్ ఓపెన్ చేసి, నాకోడలు చదివి వినిపించటం వూహించుకుంటూంటేనే ఎంత ఉద్వేగం గా వుందో!ఆ రోజు నేను వుండను కాని నా బ్లాగ్ , నా బ్లాగ్ లో నేను వ్రాసిన నా మనవడి గురించిన విషయాలు సజీవంగా వుంటాయి.మా కోడలు చెపుతుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.తట్టుకోలేని ఆనందం తో తనని హగ్ చేసి థాంక్ యూ అనూ అని చెప్పాను !ఏమో ఎవరు చెప్పొచ్చారు , ఆ మునిమనవడుగానో/ముని మనవరాలూగానో నేనే మళ్ళీ జన్మించి వుండవచ్చుకదా !అప్పుడు ముందు జన్మలో నేను వ్రాసుకున్నవే నేను వినటం ఓహ్ ఎంత అద్భుతంగా వుంది ఈ ఊహ!ఓ మరీ ఎటో వెళ్ళిపోయాను కదూ :)

నా మనవడి కోరిక మీద నా కొత్త లాప్ టాప్ వాడి మిడ్ నైట్ ఐస్క్రీం తోనే మొదలు పట్టాను :) అందుకే అన్ని విషయాలు , నా లాప్ టాప్ గురించి, ఐస్క్రీం గురించి , అఫ్ కోర్స్ నా పునర్జ్మ గురించి అన్నీ కదంబమాల లా వచ్చేసాయి:)

Monday, August 5, 2013

చాలా ఎక్సైటింగ్ గా వుంది:)))))





స్నేహితుల ప్రోత్సాహం తో కథలు వ్రాయటం మొదలు పెట్టి నాలుగు వ్రాసాను. అందులో వకటి విహంగ లో ప్రచురితమైంది . రెండో కథ ఎక్కడి కి పంపాలా అనుకుంటూ వుంటే ఆంధ్రభూమి కి పంపండి అన్నారు శ్రీలలిత గారు .
 అమ్మో అంత పెద్ద పత్రికకే .అసలే  ఈ మధ్య కథల పోటీ పెట్టారు వాళ్ళకే ప్రచురించాల్సిన కథలు చాలా వుంటాయి ఇంక నా కథేం చుస్తారు . ఐనా ముందు ముందే అంత పెద్ద పత్రికకు పంపి , వాళ్ళు వేసుకోకపోతే చాలా నిరాశ కలుగుతుంది అని అనుమాన పడ్డాను .
మీకెందుకు పంపండి ఎలా వేసుకోరో చూద్దాం . కాకపోతే కొంచం టైం పడుతుంది . కథ రాగానే మాలాంటి ఫ్రెండ్స్ మి మీకు కాల్ చేసి చెపుతాముగా అన్నారు:)
భయపడుతూనే పంపాను .

మొన్న సాయంకాలం మాజాంగ్ ఆడి వస్తూ వుండగా సెల్ రింగైంది. ఎవరా అని చూస్తే గ్లేర్ పడి పేరు కనిపించలేదు . చిన్నగా హలో ఎవరండి అన్నాను.
"రైటర్ మాలాకుమార్ గారి తో మాట్లాడవచ్చా ?"
ఓ క్షణం ఏమీ అర్ధం కాలేదు ! గొంతు తెలిసినట్లుగానే వుంది. బయట ట్రాఫిక్ చప్పుళ్ళలో తెలీటం లేదు .
"ఎవరండి?"
"నా పేరు శ్రీలలిత అండి .రైటర్ మాలాకుమార్ గారి తో మాట్లాడవచ్చా?"
" మీరా? ఏమిటండి పొద్దున పొద్దున్నే ఈ జోకులు :)"
"నేను మీకేమి చెప్పాను ? మీ కథ పబ్లిష్ కాగానే మాలాంటి ఫ్రెండ్స్ మి చెపుతాము అన్నానా:) ఆగస్ట్ నెల ఆంధ్రభూమి మంత్లీ లో మీ కథ వచ్చింది . కంగ్రాట్యులేషన్స్ ."
"నిజమా ? "
"ఆ. 53 వ పేజీలో వచ్చింది."
ఆశ్చర్యం !!!!!
పంపి నెలైందో లేదో అప్పుడే వచ్చేసింది!అదికాదు నా కథ భూమి లో వచ్చింది . ఎంత త్రిల్లింగా వుందో ! ఎంత ఎకసైటింగ్ గా వుందో!!!!!
ఇంటి కి వెళ్ళేసరి కి మా వారు భూమి తెప్పించారు . ఆ పేజ్ ఓపెన్ చేసి వుంచారు.
వావ్ ****** నా పేరు అచ్చులో ****** నా కథ అచ్చులో ******
నా ఎక్సైట్మెంట్ ను అందరికీ పంచాలికదా :)  

 కథలు వ్రాయమని పోరి, నా తో కథ వ్రాయించిన స్నేహితులు  శ్రీలలిత గారికి , ఉమాదేవి గారికి , లక్ష్మి గారి కి చాలా చాలా థాంకూలు .
నా మొదటి కథ నే తమ పత్రిక లో ప్రచురించిన , ఆంధ్రభూమి సంపాదకులు ఏ. ఏస్ . లక్ష్మి గారి కి ధన్యవాదాలు .
ఇదీ నా కథ :)



దయచేసి  సారికారాజ్  తో మాట్లాడవచ్చా?
                                 మాలాకుమార్
ఉదయాన్నే బాలకనీ లో కూర్చొని  భాస్కర్ పేపర్ చదువుతూ , కాఫీ తాగుతున్నాడు .పక్కనే అనిత కుర్చీ రోడ్ వైపు కు తిప్పుకొని ఎదురుగా వున్న పార్క్ , పార్క్ లో వున్న చెట్టు మీది పిట్టలను , ఎదురుగా కరెంట్ తీగ మీద వున్న ఉడతనూ చూస్తూ కాఫీ తాగుతూ మైమరచి వుంది .
 కొద్ది క్షణాలు అన్నీ చూసి , ఆనందం తో "ఏమండీ , కొత్త ఇల్లూ " అని ఏదో అనబోతున్నంతలో లోపలి నుంచి టెలిఫోన్ రింగ్ వినిపించింది . ఫోన్ లో మాట్లాడటాని కి లేవబోతున్న భాస్కర్ తో "ఆగండాగండి , కొత్తా ఇల్లూ , కొత్త ఫోనూ . కొత్త ఫోన్ నేను చూస్తా నేనుచూస్తా " అంటూ ఉషారుగా లోపలికి పరిగెత్తి ఫోన్ తీసి సుతారంగా "హలో " అంది .
అటు నుంచి చాలా మర్యాదగా "ప్లీజ్ కెన్ ఐ స్పీక్ విత్ సారికారాజ్ ?" అన్నారు .
"సారీ రాంగ్ నంబర్ ."అని అతి మర్యాదగా జవాబిచ్చింది .
ఎవరూ అని అడిగిన భాస్కర్ కు ఎవరో రాంగ్ నంబర్ అని ఐనా అదేమిటీ ముందుకుముందే రాంగ్ నంబర్ వచ్చిందీ అని నిరాశపడిపోయి ,అంతలోనే పోనీలే అనుకుంది .ముందు ముందు జరగబోయే విపత్తును వూహించలేని అనిత ప్రకృతి ఆరాధనలో మునిగిపోయింది .
***
పొద్దున్నే వంటపని లో హడావిడిగా వుంది అనిత . టైమైపోతోంది . ఈ రోజింకా వంటకాలేదు .తొందరపడిపోతూ స్టవ్ మీద గిన్నె పెట్టి పోపేసింది . అందులో వంకాయలు వేయబోతుండగా ఫోన్ రింగైంది . భాస్కర్ చూస్తాడని ఆగింది .
 కాని భాస్కర్ స్నానం చేస్తున్నాడేమో రాలేదు . ఇహ తప్పక స్టవ్ కట్టేసి వెళ్ళింది .
ఫోన్ తీసి హలో అనగానే "మేడం సారికారాజ్  తో మాట్లాడవచ్చా ?"అని మర్యాదగా ఎవరో అడిగారు .
"ఎందుకు మాట్లాడకూడదు నాయనా బ్రహ్మాండం గా మాట్లాడవచ్చు . నువ్వెవరితో మాట్లాడుతే నాకేమిటి ? కాకపోతే మా ఇంట్లో సారికారాజ్ అని ఎవరూ లేరని ఇప్పటి కి  ఈ నెలలో లక్షాతొంభైసార్లు చెప్పి వుంటాను కాకపోతే నీ బుర్రకే ఎక్కటం లేదు .నా బుర్ర తింటున్నావు .ఇహ పెట్టేస్తావా ఫోన్  ."
"సారీ మేడం . ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాము ."అని ఫోన్ పెట్టేసారు .
"చీ పొద్దున్నే పని అంతా పాడైపోయింది . ఎవరో ఈ మహా తల్లి ఈ నంబర్ ఎందుకిచ్చిందో "అని తిట్టుకుంటూ వంట ఇంటిలోకి వెళ్ళింది .
***

ఏమిటో చూస్తుండగా కాలం గడిచిపోతోంది . ఈ ఇంటి కి వచ్చి అప్పుడే ఐదు నెలలైపోయాయి అనుకుంటూ మిక్సీ లోనుంచి మిరపండ్ళ కారం తీసింది.
 చింతకాయ ముద్ద లో వేసి , మెంతిపిండి , ఇంగువ వేసి బాగా కలిపి జాడీ కి ఎత్తి , గట్టిగా మూత పెట్టి చేతులు కడుక్కుంది .
 "హూం ఈ ఏడాదికి చింతకాయ పచ్చడి పెట్టటమైంది . ఏమిటో ఈ పచ్చళ్ళు లేకపోతే ముద్ద దిగదు . ఏడాదేడాది కి పచ్చళ్ళు పెట్టే వోపిక ఐపోతోంది "అని స్వగతం గా అనుకుంటూ , నడుం రాసుకుంటూ , పనిలోపనిగా ఓ క్రోసిన్ మాత్ర వేసుకొని వచ్చి మంచం మీద వాలింది అనిత . చాలా అలసటగా వుంది .
 కళ్ళు మూసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటే సరి అని కళ్ళుమూసుకుంది .
 "ట్రింగ్ . . . ట్రింగ్ " ఫోన్ మోత . లేవాలనిపించటంలేదు . ఎవరో అవసరమైతే మళ్ళీ చేస్తారులే అని లేవలేదు . అది నిన్ను ఇలా వదలను అని ఆగి ఆగి మోగుతూనే వుంది . "ఎవరు బాబూ ఈ జిడ్డుగాళ్ళు , కొంపదీసి అమ్మ కాదుకదా , నిన్న వంట్లో బాగాలేదంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాను . ఇప్పుడెలా వుందో ఏమో ,"అనుకుంటూ గాభరాగా వెళ్ళి ఫోన్ ఎత్తింది .
"మేడం సారికారాజ్ తో మాట్లాడవచ్చా ప్లీజ్?"
"ఓరి దేవుడా ఎవరు నాయనా ఈ సారికారాజ్ నాకు ఇట్లా తగులుకుంది . ఇక్కడ ఎవరూ సారికారాజ్ లేరు అని ఇప్పటి కి  ఐదు నెలలుగా మొత్తుకుంటున్నాను. ఐనా సమయం సంధర్భం లేకుండా నాప్రాణాలు తీస్తున్నారు .  నాలుగు రోజులకోసారి కాల్ చేసి సారికారాజ్ వుందా అని అడుగుతారు . పెట్టేయ్ ఫోన్ ఇంకోసారి చేసావంటే నీ కాళ్ళిరగొడుతా  "
"సారీ మేడం " .
"ఈ సారీలకేమొచ్చెలే . ఏమి చేసుకోను ఈ సారీలను కూరొండుకోనా ?అలమారాలో బధ్రంగా దాచుకోనా ? ఇంకోసారి నా దుంపతెంచకు నాయనా  నీకు పుణ్యం వుంటుంది .”
మూడు ఫోన్లూ , ఆరు అరుపులుగా సారికారాజ్ ఫోన్ ల తో రోజులెళ్ళిపోతున్నాయి .
 అవునూ ఏమిటీ ఈ మధ్య సారికారాజ్ కాల్ రాలేదు . ఓరినాయనో ఇదేమిటీ  రోజు రోజుకూ నాకూ ఈ సారికారాజ్ కూ బంధం పెరిగిపోతోంది . ఇలా ఫోన్ రాలేదనుకుంటున్నాను .
భాస్కర్ కూడా రోజూ రాగానే నీ ఫ్రెండ్ కాల్ వచ్చిందా అని వెళాకోళం చేస్తాడు హుం. . .
***
పిల్లలకు , భాస్కర్ కూ టిఫిన్ పెడుతోంది అనిత .
 మనవడు అమ్మమ్మా నేను ఇడ్లీ తినను బ్రెడ్ ఇవ్వు అని మారాం చేస్తుంటే వాడి ని బ్రెడ్ లేదురా ఈ పూటకు ఇడ్లీ తిను మా బాబువు కదూ అని బతిమిలాడుతోంది .
" పోనీ అమ్మా వాడి ని వదిలేయ్ . వాడికాకలేస్తే వాడే తింటాడు"అంటూ ఫోన్ రింగవుతుంటే వెళ్ళింది హాసిని . ఫోన్ ఎత్తి "ఇక్కడెవరూ సారికారాజ్ లేరండి ."అంది .
"నీకూ నాకూ తెల్లారిందీ ? ఇంకా ఫోన్ రాలేదెమిటా అని దిగులుపడిపోతున్నాను . తలుచుకుంటే తల కింద ప్రత్యక్షం అయ్యావు తండ్రీ . మీ దుంపల్తెగ . నువ్వూ , నీ సారికా రాజ్ ఏడునెలలుగా  ఏలినాటి శనిలా పట్టి పీడిస్తున్నారు కదరా .పిశాచాల్లా పీడిస్తున్నార్రా . పోతార్రోయ్ నరకానికి పోతారు . వుత్తి పుణ్యాని కి నన్ను ఏడిపిస్తున్నందుకు ఆ యముడు మిమ్మలిని వేడి వేడి నూనె లో వేసి వేయిస్తాడురా . మీ బొందబెట్టా. మీశ్రాద్దం పెట్టా . మిమ్మలిని విరగదీసి పొయ్యిలో పెట్టా ."  అని ఆవేశం తో వూగిపోతున్న అనిత ను కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చింది హాసిని .
"అవును డాడీ . అసలు ఆ ఫోన్ కట్ చేసి అమ్మకు సెల్ ఫోన్ కొని యివ్వు . పీడా వదులుతుంది . లేకపోతే కంప్లేంట్ చేసి నంబర్ అన్నా మారిపించు . అసలు కోపమే ఎరుగని అమ్మ చూడు ఎంత కోపం తెచ్చుకుంటోందో . లో బి.పి కాస్తా హై. బి.పి అయ్యింది . ఈ విషయమై ఏమైనా చేయాలి డాడీ."అంది హాసిని.
"నేనెప్పటి నుంచో చెపుతున్ననమ్మా సెల్ ఫోన్ పెట్టుకో అని వినదు . అనవసరంగా ఖర్చు , నాకెవరు చేస్తారు అమ్మ , హాసిని , చెల్లెలు గీత , ఆడపడుచు రాధ అంతే కదా . అంటుంది .ఈ ఫోన్ నా పేరు మీద వుందని సెంటిమెంట్. కట్ చేయించవద్దు అంటుంది ."అన్నాడు భాస్కర్.
"అవునూ ఈ ఫోన్ మీ పేరు మీద వుంది . ఫోన్ వచ్చిన మొదటి రోజే మొదటి కాల్ నే సారికారాజ్ ది. పైగా రోజూ రాగానే సారికారాజ్ యోగక్షేమాలు అడుగుతారు .అంటే మీకు ఆ సారికా రాజ్ "అంటూ భాస్కర్ వైపు అనుమానంగా చూసింది అనిత.
"ఏం పిచ్చి పిచ్చిగా వుందా ఆ సారికారాజ్ ఎవరికో నేను నంబర్ ఇచ్చానా ? నేనిస్తే ఆ పిల్ల చేయాలి కాని ఎవరో ఆ పిల్ల కోసం అడగటమేమిటి ?అని కోపం గా అరుస్తున్న భాస్కర్ ను చూసి భయపడిపోయింది అనిత.
"వూరుకో డాడీ ఏదో రాంగ్ కాల్ కోసం మీరిద్దరూ ఇలాపోట్లాడుకోవటమేమిటి ? "అని హాసిని ఆపింది .
పిల్లలిద్దరూ అమ్మమ్మా తాత ల గొడవ చూసి బిక్కచచ్చిపోయారు . అందరూ ఆలోచనలో పడ్డారు .
భాస్కర్ "ఎల్లమ్మా "అని పనిమనిషిని పిలిచాడు ."నువ్వు మేము రాక ముందు ఇక్కడ వున్న వారింట్లో కూడా పని చేసావు కదూ ?"
"అవును సార్ ".
"వీళ్ళింట్లో సారిక అని ఎవరి పేరైనా వుందా ?"
"లేదు సార్ . అమ్మ పేరు సరిత , ఇద్దరు అమ్మాయిల పేర్లు దివ్య , నవ్య."
"కింద ఎవరో అద్దెకు వుండేవారు కదా వాళ్ళ ఇంట్లో ఎవరి పేరైనా సారిక నా ?"
"లేదు సార్ . ఆయమ్మ పేరు రేణుక "
మరి ఈ సారికా రాజ్ ఎవరై వుటారు . అందరూ ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు .

హయ్యో రామచంద్రా ఏమిచేయాలి ఈ ఫోన్ ను ? ఫోన్ ఎత్తిపట్టుకొని దాదాపు ఏడుస్తున్న గొంతుతో అంటున్న అనితను చూసి సారికారాజ్ కోసమా అని సైగ చేసాడు భాస్కర్ .
నిశ్శబ్ధంగా ఫోన్ అందించింది . అటు నుంచి "మేడం ప్లీజ్ కెనై స్పీక్ విత్ సారికా రాజ్ ?"అని చాలా మర్యాదగా వినిపించింది .
అంతే "లుక్. . . . . . . . . "రెచ్చిపోయాడు భాస్కర్ .
 అటువైపు ఫోన్ పెట్టేసారు . ఆయాసపడుతున్న భాస్కర్ కు నీళ్ళందించింది అనిత .
 "ఈ సారి సారికారాజ్ కాల్ వస్తే నువ్వు మాట్లాడకు . నేనుంటే నాకిచ్చేయ్ ."అన్నాడు . సరే నని తల వూపింది .
***
"హేమండోయ్ మీరు ఆస్ బూస్ అని ఇంగిలిపీసులో అరిచేసరి కి వాడు భయపడిపోయినట్లున్నాడు . ఎంతైనా మొగవాళ్ళ భయం వుండాలి . తొమ్మిది నెలల నుంచి   నుంచి పిచ్చిదానిలా నేనెంత మొత్తుకున్నా వినలేదు .ఇప్పుడు చూడండి ఆ ఫోన్ వచ్చి వారమైంది . ఏలినాటి శని వదిలింది ."
ముసిముసి గా నవ్వుతూ  టి.వి రిమోట్ అందుకున్నాడు భాస్కర్ .
***
"ఎక్స్ క్యూజిమీ మేడం ," వరండాలో ఎవరో అమ్మాయి నిలబడి పిలిచింది .
 యస్ అంటూ బయటకు వెళ్ళింది అనిత.
 ఆ అమ్మాయి "నా పేరు సారికారాజ్ "అంది
.ఉలిక్కిపడింది అనిత .
 ఏడాది గా వున్న బంధం . ఆత్మీయురాలిని చూసినట్లుగా సంబర పడిపోయింది .
 కూర్చోండి అని కుర్చీ చూపించింది .
"సారీ మేడం .ఇంతకు ముందు మీ ఫోన్ నంబర్ మాది . మేము అమెరికా వెళుతూ ఫోన్ ఇచ్చేసాము . ఆ నంబర్ మీకు వచ్చినట్లుంది . మేము వెళ్ళే ముందు నా పెళ్ళి కోసం బంగారం కొన్నాము . కొంత డబ్బులు ఇవ్వాల్సి వుండింది . ఈ లోపల మా తాతయ్యకు వంట్లో బాగాలేకపోతే వూరెళ్ళాము . వెళుతూ మా నాన్నగారి స్నేహితుడి కి ఆ డబ్బులు ఇచ్చి బంగారం కొట్లో కట్టేయమన్నాము . ఆయన కట్టలేదు . మాకాసంగతి తెలీదు . సంవత్సరం   తరువాత వారం క్రితమే ఇండియా కు వచ్చాము . బంగారం కొట్టుకు వెళితే సంగతి తెలెసింది .మీకు కాల్ చేసి అడుగుతున్న సంగతి కూడా తెలిసింది . సారీ మేడం మా మూలంగా మీకు చాలా ఇబ్బంది కలిగింది క్షమించండి ."అంది .
"పరవాలేదులే అమ్మా "అని మొహమాటం గా అంది అనిత.
"వస్తాను మేడం "అని వెళ్ళిపోయింది సారికారాజ్ .
"అమ్మయ్య కథ సుఖాంతమైంది "అని నిట్టూర్చి , కుర్చీ కి ఆనుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది అనిత.
"ట్రింగ్ . . . ట్రింగ్ . . . "
కుర్చీలో కళ్ళుమూసుకొని కూర్చుండిపోయిన అనిత ఫోన్ శబ్ధానికి కళ్ళు తెరిచింది .
 ఇహ నిశ్చింతగా ఫోన్ తీయవచ్చు భయం లేదు అనుకుంటూ ఫోన్ ఎత్తి సుతారంగా "హలో " అంది .
"మేడం దయచేసి  సారికారాజ్ తో మాట్లాడవచ్చా?" 
"ఇదేమిటి మళ్ళీ ఈ సారికారాజ్ ఫోన్ ? ఐతే ఇందాక సారికారాజ్   వచ్చి సంజాయిషీ ఇచ్చింది  కలా ? " అనుకుంటూవుండగానే మళ్ళీ చెవిలో రొద  అటు నుంచి చాలా మర్యాదగా  " మేడం సారికారాజ్ తో మాట్లాడవచ్చా ?"

Monday, June 17, 2013

కుశలమా :)








ఫొటో లో వున్నదేమిటో ఎవరైనా చెప్పగలరా? తరం వాళ్ళు ఎప్పుడైనా చూసారా?ప్రయత్నించండి చెప్పగలేరేమో చూద్దాం :)

పోస్ట్ అన్న కేక వినగానే రయ్ మంటూ పరుగెత్తుకొచ్చి , ఉత్తరాలు అందుకోవటము లో ఎంత ఆనందం. పోస్ట్ మాన్ వచ్చే సమయాని కి ఎంత ఎదురుచూపులు :) ఫ్రెండ్స్ కు పేపర్ల కొద్దీ ఉత్తరం వ్రాయటం , వాళ్ళ దగ్గర నుంచి అంతే పెద్ద పెద్ద ఉత్తరాలు అందుకోవటం మా చిన్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగించే విషయం. మానాన్నగారి కి ట్రాన్స్ఫర్ వచ్చి వేరే వూరికి వెళ్ళగానే ముందున్న వూరి ఫ్రెండ్స్ దగ్గర నుంచి బోలెడు వుత్తరాలు వచ్చేవి .ఏప్రిల్ ఫస్ట్ ఇన్లాండ్ లెటర్ లో 'ఏప్రిల్ ఫూల్ ' అని రాసి ఏడిపించటం భలే సరదాగా వుండేది :)

పి.యు.సి లో  రకరకాల అందమైన గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటైంది.హైదరాబాద్ వచ్చాక రకరకాల లెటర్ పాడ్స్ కలెక్ట్ చేయటం, వాటి మీద అందంగా వుత్తరాలు వ్రాయటం చక్కని అనుభూతి. బషీర్ బాగ్  లో షాప్ లో దొరికేవి. ప్రత్యేకం లెటర్ పాడ్స్ కోసం షాప్ కు వెళ్ళేదానిని . లెటర్ పాడ్స్ కు సరిపోను కవర్ లు కూడా వుండేవి.ఫ్రెండ్స్ కు వ్రాయటాని కి రకం , అమ్మ కు వ్రాయటానికి రకం, శ్రీవారి కి వ్రాయటాని కి వక రకం ఇలా ప్రత్యేకమైన లెటర్ పాడ్స్ దొరికేవి. ఎంత అందంగా వుండేవో!మరి ఇప్పుడు షాప్ వుందో లేదో తెలీదు.ఎందుకంటే ఉత్తరాలు వ్రాసి, అందుకొని చాలా ఏళ్ళైపోయింది .దాదాపు అందరూ వచ్చి ఇక్కడే స్తిరపడ్డారు. ఉత్తరాలు వ్రాయటము కూడా కళ. రోజులలో సినిమాల్లో నాయికా నాయకులు అందం గా ప్రేమ లేఖలు వ్రాసుకుంటూవుండేవారు. స్చప్ . . .  ఇప్పుడు ఉత్తరాలే లేవు :(
ఇప్పుడూ పోస్ట్ మాన్ వస్తాడు. పోస్ట్ అనగానే ఎంతలేదన్నా ఆత్రుతగానే వుంటుందికాకపోతే వచ్చేవన్నీ బిల్లులు!
ఉత్తరము కుశలము తెలెపేది అందరికీ ఆనందము కలిగించేది. ఐతే టెలిగ్రాం అనగానే అందరూ భయపడిపోయేవారు.టెలిగ్రాం లో ఎక్కువగా అశుభవార్తలే వచ్చేవి.తరువాత తరువాత గ్రీటింగ్ టెలిగ్రాం లు కూడా వచ్చాయి. మా పెళ్ళి కి,మా అమ్మాయి పుట్టినప్పుడు  చాలా గ్రీటింగ్ టెలిగ్రాంస్ , మావారి స్నేహితుల దగ్గర నుంచి వచ్చాయి. ఏమిటో అప్పుడు అవి దాచుకోవాలని తోచలేదు .
ఉత్తరాలు మాయం అయ్యాయి. ఇహ టెలిగ్రాం సర్వీసులు కూడా నిలిపేస్తున్నారని పేపర్ లో చదివినప్పుడు చాలా బాధ కలిగింది. అదేమిటో చిన్న చిన్నగా నాకు తెలిసినవన్నీ కనుమరుగవుతున్నాయి:( నేను వంట మొదలు పెట్టినప్పుడు మా అత్తగారింట్లో కుంపట్లలో చేసేవారము .ఇప్పుడు ఎక్కడా కుంపటి లేదు.పచ్చడి అన్నా , పిండి రుబ్బాలన్నా రోలు తప్పనిసరి. ఇప్పుడు దాని స్తానం లో మిక్సీ వచ్చేసింది. రాచిప్ప బదులు నాన్ స్టిక్ పాన్లు వచ్చేసాయి.రిక్షా , జట్కా లేవు.ఎంత అభివృద్ధి చెందాము అనుకున్నా అవన్నీ తలుచుకుంటే దిగులుగా వుంటుంది.

పైన వున్నది మా అబ్బాయి పుట్టినప్పుడు మావారికి ఇచ్చిన టెలిగ్రాం:)