Showing posts with label కబుర్లు. Show all posts
Showing posts with label కబుర్లు. Show all posts

Wednesday, February 8, 2017

ఏడేళ్ళ బంధం ఇంతటితో సరి!






మనుషులు మమతలు అంటారు కాని, మనుషులతోటే కాదు, మొక్కలు, వస్తువులు, యిల్లు, ఊరు అన్నింటి తోనూ కొద్దికాలం కలిసి ఉంటే చాలు వాటి మీద బోలెడంత మమత పెరిగిపోతుంది.అవి ఏవి వదిలేయాలన్నా ఎంత ధుఖం వస్తుందో.:( కాని తప్పదు .
దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మా మనవడి మీద పంతం తో కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు, నాకు మా మనవడి కి, మనవరాలికి అందరికీ కలిపి షేరింగ్ ఆటోలా ఒకే లాప్ టాప్ ఉండేది.ఓ సంవత్సరం తరువాత, మా ఏమండీ ఎవరికోసమో లాప్ టాప్ తెస్తే , ఆ సత్తెకాలపు సత్తయ్య తీసుకోలేదు.అప్పటి కి మా అబ్బాయికి నేను కంప్యూటర్ వాడగలను అని నమ్మకం వచ్చి,నాకు బ్లాగ్ వ్రాసుకోవటము కోసం విడిగా లాప్ టాప్ అవసరం అనిపించి, ఈ లాప్ టాప్ , మా ఏమండీ నాకు ఇస్తుంటే తీసుకోమని పర్మిషన్ ఇచ్చాడు :) కాకపోతే నేను గ్రీటింగ్ కార్డ్స్ కోసం అన్నీ డౌన్లోడ్ చేసి లాప్ టాప్ పాడు చేస్తున్నానని కోపం పడుతూనే ఉన్నాడు.ఎట్లాగో ఎక్కువ రిపేర్ లు లేకుండా కొద్దిపాటి వాటి తో నెట్టుకొస్తున్నాను.రెండు నెలల నుంచి ఎంత వైధ్యం చేయించినా మొరాయిస్తోంది.ఆ మధ్య యు.యస్. వెళ్ళి నప్పుడు ఇంకెన్ని రోజులు అది వాడుతావు అని కొత్తది ఇచ్చాడు. అంతకు ముందూ రెండు తెచ్చి ఇచ్చాడు.ఒకటి మా ఏమండీ కి ఇచ్చేసాను. ఒకటి మా వలలి కూతురుకు ఇచ్చాను.మొన్న తెచ్చింది నేను వాడటం లేదని ఆఫీస్ లో ఇచ్చేసాడు.ఎన్ని వచ్చినా దీనిని వదలని అటాచ్మెంట్ దీని మీద. ఇక తప్పలేక, కొత్తది అంటే ఎన్ని ఇచ్చినా వాడలేదు ఇవ్వను పో అంటాడేమో నని కోడలి కి అర్జీ పెట్టుకున్నాను :) మావాడు వస్తూ కొత్తది తెచ్చాడు.నిన్న రాత్రి నాకు హాండోవర్ చేసాడు. కొత్తది ముద్దుగా ముచ్చటగా ఉంది కాని, దీని వదలాలంటే, ఇదే దీని మీద చివరిసారిగా వ్రాయటం అంటే చాలా దిగులుగా ఉంది :) ఏడుపొస్తోంది :(  ఇక బై చెప్పక తప్పదు :( ఏడు సంవత్సరాల బంధం మరి :(

ఇది నేను నా కంప్యూటర్ క్లాస్ మీద రాసుకున్న పోస్ట్ :)





Wednesday, September 11, 2013

నీరో చక్రవర్తిణి

నిన్నటి నుంచి మేము బరోడాలో వుండగా వున్న, మావారి పర్సనల్ కుక్ మోతీరాం గుర్తొస్తున్నాడు:) మావారు ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు, కాంప్ లకు వెళ్ళినప్పుడు వెంట వెళ్ళేవాడు. ఓ రెండు పెట్టెలల్లో స్టవ్, వంటసామాను అన్నీ తీసుకొని వెళ్ళేవాడు. భోజనం సమయం లో ఎక్కడ ఆగుతే , అక్కడ ఓ పక్కగా , పెట్టెలు తెరిచేసి గబగబా పులకాలు , ఆలూ సబ్జీనో ఏదైనా టిండ్ సబ్జీనో చేసి పెట్టేవాడు.ఈయన ఇంటికి వచ్చినప్పుడు మోతీరాం గరం గరం రోటీ, సబ్జీ , చాయ్ చేసిచ్చాడు అని తెగ మెచ్చుకునేవారు. సరే అంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నేనూ , ఆలూ సబ్జీ నో, ఏదైనా టిండ్ సబ్జీనో చేసిపెడితే,ఇంట్లో కూడా ఇవెందుకు ఫ్రెష్ కూరలు చేయక అని విసుక్కునే వారు.మరే ఏ ఎడారిలోనో మోతీరాం చేసిపెడితే ఇంటికి వచ్చినా అవే తలుచుకుంటారు నేను చేస్తే విసుక్కుంటారు అని మనసులో గొణుక్కునేదాన్ని. అంతేగా పైకి అనే ధైర్యం అప్పుడు లేదుగా :) ఇంట్లో ఏదైనా పార్టీ అనగానే , మసాల్చీ (హెల్పర్) తో సహా వచ్చేసేవాడు.అతని వచ్చేలోపలే నేను నా వంట కానిచ్చుకొని బయట కూర్చునేదాన్ని.అతను వంట పూర్తి చేసి, ఎంత రాత్రైనా పార్టీ అయ్యాక వంటిల్లు , స్టవ్ , గట్టు అన్ని శుభ్రంగా తుడిచి ప్లేట్లన్నీ బయటవేసి, వంటింట్లో వాసనలు రాకుండా స్ప్రే చేసి వెళ్ళేవాడు:)
ఓసారి ఇలాగే నా పని ముగించుకొని బయట వరండాలో కూర్చొని నవల చదువుకుంటున్నాను. ఇంతలో ఓ బుజ్జి కోడిపిల్ల గున గున లాడుతూ నా కాలి కిందికి వచ్చింది.తెల్లగా ముద్దుగా వుంది. ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తుంటే మోతీరాం పరుగెత్తుకొచ్చాడు.ఏమిటీ అంటే ఆ కోడిపిల్ల కోసం అట!అదేమిటి దీనితో ఏమిచేస్తావు అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను మేం సాహెబ్ అన్నాడు.లోపల చికెన్ , మటన్ వండుతున్నాడని తెలుసు కాని వాటికోసం ఇలా కోడిపిల్లలని చంపాలా అని కళ్ళు తిరిగిపోయాయి. చికెన్ అంటే కోడిపిల్లేకదా మేం సాహెబ్ అన్నాడు. పైగా జిందా చికెన్ ఐతే చాలా రుచి అట.మా అమ్మాయైతే దాన్ని చంపేస్తావా అని ఏడుపు మొదలు పెట్టింది.గుడియా రాణీ ఆప్ జాకె ఖేలో అని దాన్ని బుజ్జగించి పంపి, మేం సాహెబ్ కృపయా ఆప్ అందర్ మత్ ఆయియేగా అని శుద్ద హిందీలో చెప్పి , ఆ కోడిపిల్లను వెంటాడి పట్టుకొని వెళ్ళాడు.


ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడెందుకు గుర్తొచ్చాడు అంటే , ఈ రోజు ఇంట్లో 60 మందికి పార్టీ జరుగుతోంది.బరోడా నుంచి వచ్చేసాక ఎన్ని పార్టీలైనా ఇంట్లో నాన్ వెజ్ వండలేదు. పది సంవత్సరాల క్రితం వరకూ మా అత్తగారు, మామగారు వున్నారు. కాబట్టి నో నాన్ వెజ్ :) ఆ తరువాత పిల్లలకు ఇష్టంలేదు అందుకూ నో నాన్ వెజ్ :) ఇప్పుడు ఫుల్ సొతంతరం వచ్చేసింది. వాళ్ళ ఆఫీస్ లో వి.పి జాబ్ వదిలేసి వెళుతున్నాడు అందుకని ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచీ అందరినీ విత్ ఫామిలీస్ పార్టీ కి పిలిచేసారు.ఆ వి.పి ఈయన గారికి చాలా క్లోజ్. ఈయన కు బాస్ అట మరి. కాని చూసేందుకు ఈయనగారే బాస్, ఆ అబ్బాయి ఈయన అసిస్టెంట్ లా వుంటారు. ఈయన చేరక ముందు అతను అతని వీలుప్రకారం రావటం , అతని పనేదో అతను తాపీగా చేసుకోవటం అలవాటట.అప్పటికీ ఆ అబ్బాయి నాతో అన్నాడు, సార్ ని ఆఫీస్ కు రోజూ రానవసరం లేదు, టైం ప్రకారం రానవసరం లేదు అని చెప్పామండి కాని వచ్చేస్తున్నారు. మమ్మలినందరీ అలాగే రమ్మంటున్నారు. బోలెడు పని చేయిస్తున్నారు అని. అంటే అన్నాను అంటారు కాని ఈయన షంటింగ్ భరించలేకే జాబ్ వదిలేసి వెళుతున్నాడేమోనని నా డౌటూ :) కాదట హయర్ స్టడీస్ కు వెళుతున్నాడు అన్నారు కాని నాకైతే అనుమానమే ! ప్రియమైన శిష్యుడు వెళ్ళిపోతున్నాడని పార్టీ అన్నమాట!

నిన్నటి నుంచి పార్టీ ఏర్పాట్లు మొదలయ్యాయి. మావారి పర్సనల్ అసిస్టెంట్ నంబర్ 2 కం డ్రైవర్ మహేష్ , మా వాచ్ మాన్ వెంకట్రావు రంగం లోకి దిగారు.చుట్టు పక్కల వున్న హోటల్స్ నుంచి  నాన్ వెజ్ వెరైటీస్ కొద్ది కొద్దిగా తెచ్చారు. రుచి చూసారు. బావర్చీ నుంచి , ఏదోట. అమీర్పేట్ లో ఇంకేదో హోటల్ నుంచి ఇంకేదోట. ఆర్డర్స్ ఇచ్చేసారు.డబల్కా మీఠా, కుర్బాని మీఠా ఓ కప్పు తెచ్చారు.అవి తింటే డైయాబిటిక్స్ కాని వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం వుంది వద్దు,డబల్కా మీఠా నేను చేస్తానులెండి అన్నాను. సరే అన్నారు.పొద్దున్నే ఆయన ఆఫీస్ అసిస్టెంట్ కాల్ చేసి సార్ కలాకండ్, రబ్డీ ఇక్కడ మంచి ది దొరుకుతుంది తేనా అన్నాడు. వాకే తెచ్చేయ్ :) కలాకండ్ తో రబ్డీ ఏమిటి , జిలేబీ తో ఐతే బాగుంటుంది అని నేను గొణుగుతే ఓకే జిలేబీ కూడా 2 కిలోలు వచ్చేస్తోంది. సో స్వీట్ పత్తర్ ఘట్టీ నుంచి వస్తోంది.సరే నా డబల్కా మీఠా కాన్సిల్.వెజిటేరియన్ వంట మా శైలజ చేసేస్తుందిట. నువ్వు వంటింట్లోకి రాకమ్మా , నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తావు, మా చెల్లి ని సాయం రమ్మన్నాను వస్తోంది అంది.పొద్దున్నే 6 గంటలకు మహేష్, వెంకట్రావు పైకి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వెజిటేరియన్స్ కు, సెకండ్ ఫ్లోర్ నాన్ వెజిటేరియన్స్ కూ , డ్రింక్స్ కార్నర్, స్మోక్ జోన్ అన్నీ సార్ గారి ఆధ్వర్యం లో సద్దేసారు. ఇంతలో మావారికి ఆ వి.పీ కీ అతని భార్య కూ , ఇద్దరు పిల్లలకు దండలు వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంతే ఇంకో అసిస్టెంట్ కు కాల్ చేసి , ఫ్లవర్ మార్కెట్ నుంచి నాలుగు గులాబీ దండలు తెమ్మని పురమాయించేసారు. దండలూ తయార్!

భారి ఎత్తున ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.అందరికీ నేను కాళ్ళకూ చేతులకూ అడ్డం వస్తున్నానట! ఓ రెండేళ్ళ క్రితం ఎవరైనా ఓ కప్పు  కాఫీ ఇస్తే బాగుండు, కాసేపు నడుము వాలుస్తే బాగుండు , అస్సలు కూర్చోనీయరు , నిలబడనీయరు  అని అనుకున్నమాట నిజమేకాని మరీ ఇంతగానా :) నాకు నేనే  నీరో చక్రవర్తిణి గా ఫీలవుతూ ఇక్కడ సెటిలైపోయాను:)

Monday, June 17, 2013

కుశలమా :)








ఫొటో లో వున్నదేమిటో ఎవరైనా చెప్పగలరా? తరం వాళ్ళు ఎప్పుడైనా చూసారా?ప్రయత్నించండి చెప్పగలేరేమో చూద్దాం :)

పోస్ట్ అన్న కేక వినగానే రయ్ మంటూ పరుగెత్తుకొచ్చి , ఉత్తరాలు అందుకోవటము లో ఎంత ఆనందం. పోస్ట్ మాన్ వచ్చే సమయాని కి ఎంత ఎదురుచూపులు :) ఫ్రెండ్స్ కు పేపర్ల కొద్దీ ఉత్తరం వ్రాయటం , వాళ్ళ దగ్గర నుంచి అంతే పెద్ద పెద్ద ఉత్తరాలు అందుకోవటం మా చిన్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగించే విషయం. మానాన్నగారి కి ట్రాన్స్ఫర్ వచ్చి వేరే వూరికి వెళ్ళగానే ముందున్న వూరి ఫ్రెండ్స్ దగ్గర నుంచి బోలెడు వుత్తరాలు వచ్చేవి .ఏప్రిల్ ఫస్ట్ ఇన్లాండ్ లెటర్ లో 'ఏప్రిల్ ఫూల్ ' అని రాసి ఏడిపించటం భలే సరదాగా వుండేది :)

పి.యు.సి లో  రకరకాల అందమైన గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటైంది.హైదరాబాద్ వచ్చాక రకరకాల లెటర్ పాడ్స్ కలెక్ట్ చేయటం, వాటి మీద అందంగా వుత్తరాలు వ్రాయటం చక్కని అనుభూతి. బషీర్ బాగ్  లో షాప్ లో దొరికేవి. ప్రత్యేకం లెటర్ పాడ్స్ కోసం షాప్ కు వెళ్ళేదానిని . లెటర్ పాడ్స్ కు సరిపోను కవర్ లు కూడా వుండేవి.ఫ్రెండ్స్ కు వ్రాయటాని కి రకం , అమ్మ కు వ్రాయటానికి రకం, శ్రీవారి కి వ్రాయటాని కి వక రకం ఇలా ప్రత్యేకమైన లెటర్ పాడ్స్ దొరికేవి. ఎంత అందంగా వుండేవో!మరి ఇప్పుడు షాప్ వుందో లేదో తెలీదు.ఎందుకంటే ఉత్తరాలు వ్రాసి, అందుకొని చాలా ఏళ్ళైపోయింది .దాదాపు అందరూ వచ్చి ఇక్కడే స్తిరపడ్డారు. ఉత్తరాలు వ్రాయటము కూడా కళ. రోజులలో సినిమాల్లో నాయికా నాయకులు అందం గా ప్రేమ లేఖలు వ్రాసుకుంటూవుండేవారు. స్చప్ . . .  ఇప్పుడు ఉత్తరాలే లేవు :(
ఇప్పుడూ పోస్ట్ మాన్ వస్తాడు. పోస్ట్ అనగానే ఎంతలేదన్నా ఆత్రుతగానే వుంటుందికాకపోతే వచ్చేవన్నీ బిల్లులు!
ఉత్తరము కుశలము తెలెపేది అందరికీ ఆనందము కలిగించేది. ఐతే టెలిగ్రాం అనగానే అందరూ భయపడిపోయేవారు.టెలిగ్రాం లో ఎక్కువగా అశుభవార్తలే వచ్చేవి.తరువాత తరువాత గ్రీటింగ్ టెలిగ్రాం లు కూడా వచ్చాయి. మా పెళ్ళి కి,మా అమ్మాయి పుట్టినప్పుడు  చాలా గ్రీటింగ్ టెలిగ్రాంస్ , మావారి స్నేహితుల దగ్గర నుంచి వచ్చాయి. ఏమిటో అప్పుడు అవి దాచుకోవాలని తోచలేదు .
ఉత్తరాలు మాయం అయ్యాయి. ఇహ టెలిగ్రాం సర్వీసులు కూడా నిలిపేస్తున్నారని పేపర్ లో చదివినప్పుడు చాలా బాధ కలిగింది. అదేమిటో చిన్న చిన్నగా నాకు తెలిసినవన్నీ కనుమరుగవుతున్నాయి:( నేను వంట మొదలు పెట్టినప్పుడు మా అత్తగారింట్లో కుంపట్లలో చేసేవారము .ఇప్పుడు ఎక్కడా కుంపటి లేదు.పచ్చడి అన్నా , పిండి రుబ్బాలన్నా రోలు తప్పనిసరి. ఇప్పుడు దాని స్తానం లో మిక్సీ వచ్చేసింది. రాచిప్ప బదులు నాన్ స్టిక్ పాన్లు వచ్చేసాయి.రిక్షా , జట్కా లేవు.ఎంత అభివృద్ధి చెందాము అనుకున్నా అవన్నీ తలుచుకుంటే దిగులుగా వుంటుంది.

పైన వున్నది మా అబ్బాయి పుట్టినప్పుడు మావారికి ఇచ్చిన టెలిగ్రాం:)

Monday, February 20, 2012

బ్లాగు పుస్తకం




"బ్లాగు పుస్తకం" అవిష్కరణ గురించి బ్లాగులల్లో చదువుతూనే వున్నాను .ఇంటికి దగ్గరే కదా వెళుదామా అని మనసుపీకుతోంది .దానికంత ఆలోచనెందుకు వెళితేపోలే అనుకున్నా , వెళ్ళటం కాదుకదా ప్రాబ్లం . అసలు ప్రాబ్లం ఆ హాల్ ఐదో అంతస్తులో . ఒకటో రెండో అంతస్తులైతే మెట్లెక్కచ్చు కాని ఐదు ఎట్లా ఎక్కుతాను .నాకు తెలుసు లిఫ్ట్ వుంటుందని . అసలు ప్రాబ్లం అదే కదా :) హుం . . . ఇక ఆశ వదిలేసి తీరిగ్గా పనులు చేసుకుంటూ వుంటే సి. ఉమాదేవి గారు ఫోన్ చేసారు . ఉభయకుశలోపరి , ఆపైన తోట లో చెట్ల గురించి అయ్యాక , రెండునెలలనుచి రాకుండా మొహం చాటేస్తున్న తోటమాలి గురించీ మాట్లాడుకోవటం అయ్యాక , మీరు బ్లాగు పుస్తకావిష్కరణ కు వెళుతున్నారా అని అడిగారు . లేదండి అన్నాక , బుర్ర లో బల్బ్ వెలిగి మీరు వెళుతున్నారా అని అడిగాను . వెళుదామనుకున్నానండి కాని ఎవరూ తోడు దొరకటం లేదు అన్నారు . మీరు వెళుతుంటే నేనూ వస్తాను అని చటుక్కున అనేసాను . ఐతే 1 కల్లా రెడిగా వుండండి , నేను మిమ్మలిని పికప్ చేసుకుంటాను అన్నారు .అలా మాచ్ ఫిక్సైంది . కాని గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . . . లిఫ్ట్ ఎలా ఎక్కటమా ????? ఉమాదేవి గారు ఏమనుకుంటారో అని ఓ వైపు ఆలోచిస్తూనే వున్నాను . ఎక్కడా జాగా లేనట్లు వీళ్ళు ఐదో అంతస్తులో సెటిల్ కావటమేమిటి అని మనసులో విసుక్కుంటూ మధనపడుతున్నాను . . . ఇంతలో లక్ష్మి గారు కాల్ చేసి నేను మిమ్మలిని మీ ఇంటి దగ్గరే పికప్ చేసుకుంటానండి , మీరు రెడీఏనా అన్నారు . హమ్మయ్య లక్ష్మి గారు వస్తున్నారు . లిఫ్ట్ సంగతి ఆవిడే చూసుకుంటారు . మనం హాపీసూ :))))))

లక్ష్మిగారి శ్రీవారు శ్రీ.వెంకటేశ్వర్లు గారి పుణ్యమా అని సభాస్తలికి చేరుకున్నాము . ఆయన దగ్గరుండి మరీ లిఫ్ట్ ఎక్కించి వెళ్ళారు . ఆ బిల్డింగ్ వాళ్ళ పుణ్యమా అని ఆ లిఫ్ట్ కూడా కటకటాల లిఫ్ట్ . హమ్మయ్య గండం గడిచింది . హాల్ లో సుజాత గారు ,వరూధిని గారు కనిపించారు . తెలిసిన వాళ్ళున్నారు అమ్మయ్య అనుకున్నాను .

అందరినీ అక్కడ వున్న బోర్డ్ మీద పేరు రాయమన్నారు . టీ బిస్కెట్స్ ఇచ్చారు . వక్తలందరూ బ్లాగు పుస్తకం గురించి , బ్లాగుల గురించి చక్కగా మాట్లాడుతున్నారు . చాలా ఇంట్రెస్టింగా వుండింది . ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెపుతుంటే చాలా సరదాగా వుంది .అంతా బాగానే వుంది కాని నన్నూ మాట్లాడమన్నారు :) అంతే గుండెల్లో ఢాం * * * బాబోయ్ * * * నేనా మాట్లాడటమా ??? చిన్నగా తప్పించుకున్నాను . చావా కిరణ్ వచ్చి లక్ష్మిగారి కి , ఉమాదేవి గారికి బ్లాగు పుస్తకాలిచ్చారు . నా వైపు చూసి మాట్లాడిన వాళ్ళకే పుస్తకాలు అన్నాడు . హి హి హి అని నవ్వి వూరుకున్నాను :) అందరూ మట్లాడారు . మీరొక్కరే మాట్లాడలేదు మాట్లాడండి అని లక్ష్మిగారు , ఉమాదేవి గారు అన్నారు . వాళ్ళన్నారనే కాదు , ఈ సంగతి తెలుస్తే , మావారు ఇచ్చే క్లాస్ ను భరించటం చాలా కష్టం అని , మొత్తాని కి ఏదో మమ అనిపించాను . ఏమి మాట్లాడాను అంటే ఏమో , విన్నవాళ్ళ అదృష్టం హి హి హి . మొత్తానికి నాకూ ఓ పుస్తకం దొరికింది :)))))

సరే పుస్తకం దొరికింది . దానితో పాటు చావా కిరణ్ ,నాగార్జునాచారి , బంతి , చాణక్య , అపర్ణ ,కశ్యప్ , కట్టావిజయ్, జీవితం లో కొత్తకోణం శ్రీనివాస్ గార్ల ల పరిచయం కలిగింది . అందరూ చాలా అభిమానం గా మాట్లాడారు . అందరినీ పరిచయం చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది .

"బ్లాగు పుస్తకం " ముఖచిత్రం ముచ్చటగా వుంది . చూడగానే చదవాలి అనిపించింది ."ఈ పుస్తకం కేవలం మీకు దారి చూపించి , ఆ దారి గురించి చెబుతుంది . మీ ప్రయాణం మీరే చేయాలి సుమా !" అని మన బాధ్యతను గుర్తు చేస్తూ మొదలవటం నాకు చాలా నచ్చింది .మన మన్సులో వున్న భావాలను బ్లాగుల్లో ఎలా పంచుకోవాలో ఒక పద్దతిగా వివరించారు .ఏ విషయాలను పంచుకోవచ్చో ,ఏవి తెలియజేయకూడదో చక్కగా వివరించారు .కొత్తగా బ్లాగు మొదలు పెట్టేవారి కి ఈ పుస్తకం సరైన మార్గదర్శి . బ్లాగు రాస్తున్నవారికి కూడా ఎన్నో సాంకేతికా విషయాలను , చిత్రాల తో సహా వివరించారు . అంతే కాకుండా వేరే వాళ్ళ బ్లాగులను ఎలా చదవాలో కూడా తెలియజేసారు .మన వాఖ్యలను ఎలా రాయాలి , వాఖ్యలకు ఎలా స్పందించాలో కూడా తెలియజేసారు .ముఖ్యం గా ఈ బ్లాగుల వల్ల ఏర్పడే పరిచయాలను , ఎన్నో అనుభవాలను తెలియజేసారు .

ఇంతెందుకు అదీ , ఇదీ అని కాదు బ్లాగుల గురించి సమస్తమూ తెలుసుకోవచ్చు . నిజంగా ఇది బ్లాగర్లకు చాలా వుపయోగపడే పుస్తకం . దీని రూపకర్తలు , చావా కిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు చాలా కష్టపడ్డారు .వారికి అభినందనలు .

అన్నట్లు ఇందులో నా పేరు కూడా వుందండోయ్ చూడటం మర్చిపోకండి . థాంక్ యు , చావాకిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు . నాకు బ్లాగులో ఏదైనా డౌట్ వస్తే తనను అడగమని రెహ్మాన్ గారు వారి ఐ డి ఇచ్చారు . థాంక్స్ అండి .

Friday, December 11, 2009

పిలవని వాళ్ళు పాపాత్ములు ! ! !

 మా పరోపకారి పాపన్న ( నేను మావారికి పెట్టుకున్న పేర్లలో అదొకటి లెండి ) యు.యస్ వచ్చేటప్పుడు , ఓ పెళ్ళి కి వెళ్ళివచ్చి , హడావిడిగా వచ్చి ఫ్లైట్ ఎక్కి , యు.యస్ వచ్చాక చూసుకుంటే ఆయనగారు , లాస్ట్ మినిట్లో మా ఆడపడుచు ఎందుకైనా మంచిది అని పెట్టిన రెండు , పాంట్లు , రెండు షర్ట్ లు తప్ప ఇంకేమి బట్టలు తెచ్చుకోలేదంటే నమ్ముతారా ? మరి ఈ సూట్కేస్ లు ఇంతబరువున్నాయి ఏమిటా అని మా పిల్లలు తెరిచి చూస్తే వాటినిండా ఆయన పిల్లలకోసము కొన్న గిఫ్ట్లు , అందరూ మా పిల్లల కియ్యండీ అని ఇచ్చిన స్వీట్ బాక్స్ లూనూ ! సరే ఆ స్వీట్ బాక్స్ లు అన్నీ పాక్ చేయటము , పోస్ట్ చేయటము వేరే కథ . వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళి వచ్చాక , అందరూ వాళ్ళ పిల్లలకియ్యమని ఇచ్చినవి సద్దుకున్నాక ఈయన బట్టలు సద్దుకుందామని ,బట్టలు తీసి మంచము మీద పెట్టారట . చివరి నిమిషము లో రావటము వలన బట్టలు సద్దుకోవటము మరచిపోయారట ! మేము ఇండియా కి తిరిగి వచ్చేవరకూ అలాగే మంచము మీద వున్న బట్టలను చూసి నేను నిట్టూర్చటము తప్ప ఏమి చేయలేక పోయాను !


మీరు రైళ్ళూ , బస్ ల వెంటే పరుగెత్తుతారనుకున్నాను , విమానాల వెంట కూడా అలాగే పరుగెత్తుతారా ? అని మా పిన్ని అడుగుతే , అవును పిన్నీ . కా . . . నీ . . .ఏదైనా పెళ్ళికి మటుకు పెళ్ళికొడుకు ఆలస్యముగా రావచ్చేమో కాని మేము మాత్రము ముహూర్తము సమయానికి ఒక్క నిమిషము కూడా ఆలస్యము గా వెళ్ళము తెలుసా అని గర్వం గా చెప్పాను . అసలు ఆ రోజు ఆయన ఆలస్యానికి కారణము , ఫ్రెండ్ కూతురు పెళ్ళికెళ్ళి రావటమే కదా ? ఇంటికొచ్చి పిలిచాడు , ఫోన్ చేసాడు వెళ్ళక పోతే బాగుంటుందా ? ముహూర్తము కాకుండా వచ్చేస్తే బాగుంటుందా ? ఏమిటో అర్ధం చేసుకోరూ !


ఎవరు పెళ్ళికి పిలిచినా మేము వెళ్ళకుండా వుండము . అదీ ముహూర్తము టైముకల్లా . పది పదిహేను సంవత్సరాల క్రితమైతే పెళ్ళిళ్ళ లో ఏదో వొక గొడవ జరిగేది . అందుకని , పెళ్ళైనాకా , పెళ్ళివారికి భోజన సదుపాయాలు చూసి , ఏవైనా గొడవలైతే సర్దుబాటు చేసి , అప్పగింతలైయ్యేటప్పుడు , వెనకాల కూర్చొని , మా అమ్మాయి పెళ్ళి కాకముందైతే , మా అమ్మాయిని అప్పగించే సీను తలుచుకుంటూ , మా అమ్మాయి పెళ్ళైనాక , మా అమ్మాయిని అప్పగించిన సీను తలుచుకుంటూ ,కాసిని కళ్ళ నీళ్ళు పెట్టుకొని , ఆ తరువాత పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి , ఆయన , పెళ్ళికొడుకు చేయి పట్టుకొని , అమ్మాయిని జాగ్రత్త గా చూసుకో బాబు అని చెపుతున్నప్పుడు , నేను చేతులు కట్టుకొని , ఆయన పక్కన నిలబడి , ఆయన చెప్పటమైనాక , నేనూ , ఆ పెళ్ళికూతురి చేయి చిన్నగా తట్టి వచ్చేయటము మా కలవాటై పోయింది . విచిత్ర మేమిటంటే మేము అమ్మాయి తరుపున వెళ్ళినా , అబ్బాయి తరుపున వెళ్ళినా అక్కడ ఇదే సీనుండేదన్నమాట . ప్రస్తుతమైతే మరీ దగ్గరవాళ్ళైతే తప్ప అంతవరకూ వుండటము లేదు . కాకపోతే ఈమధ్య పెళ్ళిలలో గొడవలు కూడా కావటము లేదుకదా ! కాని భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడటము మానుకోలేదు .


కాకి తో కబురు పెట్టినా వస్తామని మాకు పేరు . అది ఎంతదాకా పోయిందంటే , ఈ మధ్య మాకు బాగా కావసిన వారింట్లో పెళ్ళి జరిగింది . అది మాకు వేరే వారి ద్వారా తెలిసింది . ఐతే , ఓ పది రోజుల తరువాత ఆయన ఫోన్ చేసి మీరు పెళ్ళికి రాలేదేమని నిష్టూరమాడాడు . ఆయనను చెప్పనిచ్చి , అసలు నువ్వు నన్ను పిలిచావా అంటే బిత్తర పోయి , పిలవలేదా అని లక్షా తొంభైసార్లు సారీలు చెప్పాడు . ఇంటికొచ్చి కూడా ఇంకో లక్షా తొంభై సార్లు సారీలు చెప్పి వెళ్ళాడు !


ఈ మధ్య మా పనమ్మాయి శారద పెళ్ళైంది . ఆ పెళ్ళికి మేమిద్దరమూ వెళ్ళాము . మమ్మలిని చూడగానే శారద అమ్మా , మీరూ పెద్దసారూ వచ్చారు అని తెగ సంతోష పడిపోయింది . సరే యధావిధిగా పెళ్ళికొడుకుకు , మా శారద చాలా మంచమ్మాయి , జాగ్రత్తగా చూసుకో అని మావారు చెప్పటము జరిగింది . ఆ అబ్బాయి బిత్తర పోయి తరువాత శారద ని అడిగాడుట , మీ సారు వాళ్ళకు నువ్వంటే చాలా అభిమానమా అని . ఇంటికొచ్చి శారద చెప్పుకొని మురిసి పోయింది . అమ్మా మీరొస్తారను కోలేదు .పెద్దసారు అంత బిజీగా వుండి కూడా రావటము నాకు చాలా సంతోషము కలిగిందమ్మా అంది . పిచ్చిపిల్లా ఎందుకు రామనుకున్నావు ? ఎవరు పిలిచినా ఎలాగో వీలుచేసుకొని తప్పక వెళుతాము . అని శారదకు చెప్పి , స్వగతం ; అవునుమరి , మమ్మలిని పిలవనివాళ్ళు పాపాత్ములు ! ! !

Wednesday, December 9, 2009

అష్టవర్షా భవేత్ బాలకా

" బాబా , గౌరవ్ కి బబుల్ గం కావాలటరా ."
" ఇప్పుడే వద్దు మాతే , వాడి కి ఎయిట్ ఇయర్స్ రానీ "
ఇది నాకూ , మా అబ్బాయికి తరుచు జరిగే సంభాషణ . ఇదొక్కటేనా ? విక్కీ , జేయూ పి. యస్ బి తెగ ఆడేస్తూ వుంటారు . గౌరవ్ మటుకు వాళ్ళ పక్కన చేరి చూడాల్సిందే కాని ఆడేందుకు లేదు . పాపం వాడికి కూడా కొనీయరా బేటా అంటే వాడికి ఏట్ ఇయర్స్ రానీయమ్మా అంటాడు నా బేటా . వాళ్ళేమో చక్కగా బోలెడు గేంస్ కొనుక్కున్నారు . ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు . మాకేమో ఇంకా ఎయిట్ ఇయర్స్ రాకపోయే హూం !


మేఘా కి ఎంచక్కా ముందు రెండు పళ్ళూ వూడిపోయాయి . ఆ పళ్ళని దిండు కింద పెడితే పొద్దునకల్లా టూత్ పెయిరీ అవి తీసేసుకొని ఫైవ్ రూపీస్ పెట్టి పోయింది . ఆ రూపీస్ ని మాకు చూపిస్తూ , మేఘ తెగ ఫోజ్ కొట్టేస్తూ వుంటుంది . అనూ , పాపం గౌరవ్ కి కూడా ఓ ఫైవ్ రూపీస్ ఇవ్వచ్చుకదమ్మా , అని నేను సిఫారస్ చేస్తే , అవి నేనివ్వ లేదాంటీ , టూత్ పెయిరీ ఇచ్చింది . , వాడి కి పళ్ళూడినప్పుడు వాడికిస్తుంది , అంటుంది . అదేప్పుడమ్మా అంటే , వాడి కి ఎయిట్ ఇయర్స్ . . . సరె సరే , పళ్ళు రాలటానికి కూడా ఎయిట్ ఇయర్స్ హూం !


" జేయూ , చక్కగా బంధిపోటు వేషం వేసుకొని , ఫొటో తీసుకొని , ఎంచక్కా ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు , బామ్మా చూసావా ? "
" మరి నువ్వూ , నీ ఫేవరేట్ బెన్ టెన్ వేషం వేసుకొని ఫొటో పెట్టుకో ".
" నాకు ఫేస్ బుక్ ఎకౌంట్ లేదుగా బామ్మా ."
" ఎందుకులేదురా ? డాడీని అడుగుతావుండు . బిపూ "
" ఏంటమ్మా ? "
" గౌరవ్ కి ఫేస్ బుక్ ఎకౌంట్ లేదట , చేయొచ్చు కదరా ? వాడూ బెన్ టెన్ ఫొటోలు పెట్టుకుంటాడు. "
" బామ్మా , పెట్ సొసైటీ , ఫాం వెల్ కూడా ఆడుకోవచ్చు. "
"అవునురా మరి చేయొచ్చుకదరా ? "
" ఫేస్ బుక్ ఎకౌంట్ కావాలంటే , జి మెయిల్ ఎకౌంట్ వుండాలి . జి మెయిల్ కావాలంటే ఎయిట్ ఇయర్స్ "
"సరె సరే , ఇక్కడా ఎయిట్ ఇయర్స్ . . . హూం . . . . ."
" నీ ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఆడుకోవచ్చా అడుగు బామ్మా "
" ఆడుకోరా "

వాడికి ఎయిట్ ఇయర్స్ వచ్చి , వాడి ఏకౌంట్ వచ్చేదాకా నాకు తిప్పలు తప్పవు. ఆ పెట్స్ పారిపోకుండా చూడాలి . ఫాం ఎండి పోకుండా చూడాలి . బాబ్బాబు , కాస్త అందరూ తలో చేయి వేయరూ ! ఏం లేదు , పెట్ సొసైటీ కి , అప్పుడప్పుడూ వెళ్ళి మా పెట్స్ పారిపోతే వెతికి తెచ్చిపెట్టండి .కాస్త వాటికి తిండి పెట్టండి ప్లీస్ . పెట్ సొసైటీ స్పెల్లింగ్ తెలీదా ? ఐతే " పి " క్లిక్ చేసి , కళ్ళు మూసుకొని " హామ్మ్ హీం " అని కళ్ళు తెరవండి , పి కింద పెట్సొసైటీ స్పెల్లింగ్ వచ్చేస్తుంది . దానిమీద క్లిక్ చేసేయండి .టట్ట టాయ్ పెట్ సొసైటీ ఓపెన్ అవుతుంది అంతే . అదే చేత్తో , మా ఫాం లో ట్రీస్ కి కాస్త ఫెర్టిలైజ్ చేసేయండి . వూరికెనే కాదులే మీకూ పాయింట్స్ వస్తాయి . ఫ్రెండ్స్ అన్నాక కాస్త చేదోడు , వాదోడుగా వుండాలికదా !

ఇంతేనా అంటే ఇంకా చాలా చాలా కష్టాలున్నాయి . ఈ లోపల ఇంకా కొత్తవి రానూ రావొచ్చు . ఎనిమిదేళ్ళు ఎప్పటికి వస్తాయో , కష్టాలు ఎప్పటికి తీరుతాయో !

Saturday, November 28, 2009

ఈ రోజు ఏమీ కొనకూడదుట !

సావిత్రి గారూ ,

పిలిచారాండీ .

అవునండి , పిల్లలు పకోడీ లు చేయమంటున్నారు . కాసిని చేయండి .

పకోడిలాండీ ?

అవునండి .

ఉల్లిపాయ ఒకటే వుందండి . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

వద్దులెండి . ఆలుగడ్డ బజ్జీలు చేయండి .

బజ్జీలాండీ ?

అవునండి .

ఆలుగడ్డలై పోయాయికదండి .

అదేమిటి ? మొన్ననే రెండు కిలోలు తెచ్చాము కదండి .

మరి వేయించేసాను కదండీ . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

పోనీ బ్రెడ్ లేదా ?

రెండురోజులైంది కదండీ . . పాడైపోయింది . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

అమ్మా . . .

ఏమిటిరా ?

అవేమి వద్దుకాని , కొంచం చింతకాయ పచ్చడి పోపేయమను , అన్నం తినేస్తాను .

విన్నారుగదండి .

చింతకాయ పచ్చడి పోపాండీ ?

అవునండి .

అయితే పల్లీ నూనే తెచ్చుకోవాలండి . సూపర్ మార్కెట్ నుండి తెచ్చేదాండీ ?

అబ్బా సావిత్రి గారూ ,ఎంత తెచ్చినా , ప్రతిరోజూ , సూపర్ మార్కెట్ లో వో కాలు వంటింట్లో ఓకాలు పెడుతారు . ఈ రోజు ఏమీ కొనకూడని రోజుట . పొద్దున పేపర్ లో చదివాను . ప్రపంచమంతా పాటిస్తారుట . కనీసం ఈ వొక్క రోజైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళకుండా వుండండి .

అలాగాండీ ? మరైతే ఇప్పుడేం చేయమంటారు ?

మీరు బజారు కెళ్ళకుండా వుండండి , అంతే చాలు . కాసిని ఉసిరికాయలు కోసుకురండి . ఏదైనా చేద్దాము .

ఉసిరికాయలాండీ ?

అవునండి , వాటికేమొచ్చింది ?

ఆ గుంట వెధవలు కోసుకెళ్ళారుగండీ ?

ఏ గుంటవెధవలండీ బాబు ?

ఏమో నండీ , నేనక్కడ కూచొని బాబాగారి పుస్తకం చదువుకుంటున్నానండీ , ఇద్దరు గుంట వెధవలు గోడ దూకి వచ్చి ఉసిరికాయలు కోసుకున్నారండీ .

మీరు చూస్తూవూరుకున్నారా ?

ఎందుకూరుకుంటానండీ ? అరిచి వెళ్ళగొట్టానుగదండీ ?

మరైతే ఉసిరికాయలు ఏమైనాయండి ?

ఆఫీస్ గుంటలు కోసుకున్నారు కదండీ ?

మరి పొద్దున కొన్ని గుత్తులు చూసిన గుర్తే ?

అవాండీ ? అవి పని గుంటలు కోసుకున్నారండీ . మరిప్పుడే చేయమంటారండీ ?

మనకు కొనే రోజులు , కొనగూడని రోజులు , ఇంట్లోవి , ఏవీ కుదరవుకానీండి , ఇదో పైసలు , ఏదో కొనుక్కొచ్చి , మీ ఇష్టమైంది చేయండి ఒక్క రోజైనా మీరెళ్ళక పోతే ఆ సూపర్ మార్కెట్ వాడు దివాలా తీస్తాడు . వెళ్ళండి ఇక నాబుర్ర తినకండి ! ! ! !
సరేనండి !

Tuesday, November 24, 2009

ఊర్వశి

-->
లేడీస్ మీటింగ్ లో మిసెస్ . రైనా ఫేషియల్ గురించి చెప్పినప్పుడు తెగ నిద్దరొచ్చేసింది . మహా బోర్ కొట్టినా ఏదో మొహాన కాసిని చిరునవ్వులతికించుకొని , చాలా బాగా చెప్పావు అని మొహమాటం గా విష్ చేసి వచ్చేసానే కాని , ఆ చిరునవ్వులని 20 సంవత్సరాల పాటు అతికించుకోవలసి వస్తుందని , ఆ రోజున ఏమాత్రము ఊహించలేకపోయాను . ఆ తరువాత ఓ నాలుగు సంవత్సరాల కి , ఓ సూర్యోదయాన , మావారు , బేకార్ గా మాజాంగ్ , కార్డ్స్ ఆడుకుంటూ వుండక పోతే , మిసెస్ . బట్నాగర్ బ్యూటీ క్లాసెస్స్ తీసుకుంటోంది కదా చేరొచ్చుగా అని క్లాస్ పీకారు . అదేమిటో మా అమ్మ , మా ఆయన నేను ఎంజాయ్ చేయటము సహించలేరు ! మా అమ్మ , నాకు సెలవలు రాగానే అది నేర్చుకో , ఇది నేర్చుకో అని నెడుతూవుండేది . పెళ్ళైనాక ఆ డ్యూటీ మావారు తీసుకున్నారు . వాళ్ళను ఎదిరంచే సాహసము చేయలేక గొణుకుంటూ , సణుకుంటూ చేరేదానిని . వాళ్ళు దేనిలోనో ఓ దానిలో చేర్చేవరకే , ఆ తరువాత దాని అంతు చూసేదాక నాకు తోచదు . అప్పుడేమో నీకే పిచ్చి పడితే అదే అని తిడుతారు . నేనేం చేయను ? ప్రస్తుతము ,మావారు యానిమేషన్ కోర్స్ పేపర్లు పట్టుకొని కూర్చున్నారు . నేను చిక్కటము లేదు . విషయము పక్కదారి పట్టినట్లుంది ! ఇక అసలు దారికి వస్తే , ఏంచేయగలను ? మా వారి పోరు భరించలేక చేరి , ఆ కోర్స్ లో చివరివరకూ నిలిచినదానిని నేనొక్కదానినే ! అంతేనా ఆతరువాత ప్రతి రెండు సంవత్సరాలకి బాంబే వెళ్ళి కోర్స్ లు చేసాను . . బరోడా లో మా ఫ్రెండ్ ఉష , తన పార్లర్ లో చేరమంది . అప్పుడే యూనివర్సిటీ లో చైల్డ్ డెవలప్మెంట్ లో , పి . జి డిప్లమాలో సీట్ వచ్చింది . నేను , పార్లరా ? చదువా ? అని అటూ ఇటూ ఊగుతుంటే , మా ఇంకో ఫ్రెండ్ కల్పనా దీది , పార్లర్ లో ఎప్పుడైనా చేరవచ్చు . అంతేకాదు బ్యూటీషియన్స్ కి అవకాశాలు వున్నాలేకపోయినా , టీచర్లకి , గైనకాలజిస్ట్ లకి ఎప్పుడూ అవకాశాలు వుంటాయి , ముందు చదువుకో అని నెట్టింది . ముక్కున పెట్టుకొని చదువు పూర్తిచేసి , ఉష వాళ్ళ ఊర్వశి బ్యూటీపార్లర్ లోకి జంప్ చేసేసాను.


అలాగ జంప్ చేసినదానిని దాని మీద మక్కువతో , హైదరాబాద్ వచ్చాక ,అదే పేరు తో ఊర్వశి బ్యూటీ పార్లర్ తెరిచేసాను . మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పోర్షన్ రెంట్ కి తీసుకొని , దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని , ఆ ఇంటి ఓనర్ గారిని , ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి రమ్మని పిలవటానికి , మా వారితో కలిసి వెళ్ళాను . నన్ను మావారు పరిచయము చేయగానే , ఆ ఇంటావిడ సుకన్య నన్ను పైనుంచి , కిందిదాకా ఎగా దిగా చూసి , ఇంత మైల్డ్ గా వుంది , ఈమేమి పార్లర్ నడుపుతుంది అని పెదవి విరిచేసింది ! ఎంత ఉక్రోషం వచ్చేసిందో . ఇంటికి రాగానే , అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని , నేను పార్లర్ నడపలేనా ? ఇంత మాట అంటుందా ? అని ఆవేశ పడిపోయాను .ఇంత ఖర్చు పెట్టి , వెనుకకి పోలేను , అంతా దండగ కావలిసిందేనా ? అని తెగ మధన పడ్డాను . కానీయ్ చూద్దాం అనుకొని ముందడుగు వేసాను .


ఆవిడనే , 15 సంవత్సరాల తరువాత పార్లర్ అమ్మేసి , కీస్ ఇద్దామని వెళితే , ఎందుకు మాలా పార్లర్ మూసేస్తున్నారు ? మీరు చాలా హోంలీ గా వుంటారని , బాగా చేస్తారని , మంచి పేరు వచ్చింది . రష్ కూడా బాగా వుంది కదా మూసేయకండి కంటిన్యూ చేయండి అంది !



-->
ముందుకు వేసిన అడుగు అలాగే ఎన్నెన్నో జ్ఞాపకాలను పోగుచేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళింది . ఎంతో మంది అభిమానాన్ని సంపాదించి పెట్టింది . ఎందరికో ఉపాధిని కలిపించింది . మావారి పార్ట్నర్ చనిపోతే ఆయన భార్యకోసం , బంజారా హిల్ల్స్ లో ఊర్వశి బ్రాంచ్ ని తెరవటము మరిచిపోలేనిది . పలు కార్యక్రమాలకి ముఖ్య అథిది గా , కొన్నిటికి జడ్జ్ గా వెళ్ళటము మధురమైనవి .పార్లర్ కి వచ్చే పిల్లలతో చేరి నేనూ ఒక టీనేజ్ అమ్మాయినే అయిపోయాను . అంతేనా మౌనం గా వుండేదానిని వాగుడుకాయనయ్యాను ! నాకంటూ ఒక గుర్తింపును ఇచ్చింది నా " ఊర్వశి ".


ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నిన్న విజయవాడ , కనకదుర్గ గుడి లోంచి బయటకు వస్తుంటే " ఊర్వశీ ఆంటీ " అని పిలుపు వినిపించింది . నన్ననుకోలేదు . పార్లర్ మూసేసిన 12 సంవత్సరాల తరువాత నన్ను ఆపేరు తో పిలుస్తారని ఎలా అనుకుంటాను ? కాని నన్నే ! ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఆప్యాయం గా పలకరిస్తే ఎంత సంతోషం వేసిందో చెప్పలేను !


జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు .

జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు .



Tuesday, November 17, 2009

నోములు నోయరుగా , టెన్షన్ పడరుగా


ఓ అప్పుడెప్పుడో అంటే మొదటి ఫొటోలో మా వదినగారు వున్నారే అప్పుడన్నమాట నోముకొని , ఇదో రెండో ఫొటో లో వున్నారే ఇప్పుడు తీర్చుకుందామనుకున్నారన్నమాట. మరి ఆవిడ తో పాటు మాకూ టెన్షన్ వుంటుందా ? వుండదా ? అసలే , నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు , ఏదో వూరెళుతూ , ఆత్తగారి కళ్ళు గూట్లో వున్నాయనుకోవే కమలమ్మా అని చెప్పివెళ్ళారు . అప్పుడు నిజంగానే , మా అత్తగారు ఆవిడ కళ్ళు వంటింటి గూట్లో పెట్టి వెళ్ళారేమో నని తెగ వెతికా . నిజంగా నిజం . అంటే అత్తగారున్నపుడు ఎంత జాగ్రత్తగా పని చేస్తానో , ఆవిడ లేకపోయినా అంత జాగ్రత్తగానే పని చేసుకోవాలని అర్ధం అని తరువాత తెలిసిందనుకోండి .అది వేరే సంగతి . కాని ఇప్పుడు ఈ ఫొటోల వెనకాల జాగ్రత్తగా గమనిస్తే , మా అత్తగారిదో , మా మామగారి దో ఫొటో కనిపిస్తుంది . అంటే నేను సరిగ్గా చేస్తున్నానాలేదా అని గమనిస్తునే వున్నరన్నమాట !

మా వదినగారు , ఫోన్ చేసి పలానా రోజు నీకు వీలవుతుందా ? అని అడుగగానే ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న నేను , ఎందుకు వీలు కాదండి ? వీలవుతుంది . నేనేమి చేయాలో చెప్పండి అన్నాను . నువ్వేమి చేయొద్దమ్మా , మీ సావిత్రి తో 20 మందికి వంట వండించు.. ఆమె లేక పోతే కాటరింగ్ కి ఇద్దాము అన్నారు . కాటరింగ్ వద్దండి , సావిత్రి వండుతుంది . ఏమైనా నైవేద్యాలు ప్రత్యేకం గా చేయించాలా ? అని అడిగా . పూర్ణాలు , పులిహోరా , వక కూర , పప్పు , వాయినానికి 16 కుడుములు చాలు అన్నారు . ఓస్ అంతేకదా చేయిస్తాను . మరి ముతైదువులని పిలవాలికదా , వాయినాల కోసం చేటలు చేయించాలికదా ? అని అడిగాను . అవన్నీ నేను చేసుకుంటానులే అన్నారు .సరే అన్నాను .

సావిత్రి తో పలాన రోజున మావదినగారు 20 మందిని తీసుకొని వస్తున్నారు . మీరు ఎక్కడికీ వెళ్ళొద్దు . ఇంట్లోనే వుండాలి అన్నాను

ఆ రోజాండీ అంటూ ఆమె మొదలుపెట్టగానే నా బి . పి రయ్ మంది .ఏం ?

"మరేం లేదండీ ఆ రోజు మా కజిన్ వూరు నుండి వస్తానంది . తను నాకు డబ్బులివ్వాలి . ఆ రోజు కలవక పోతే వాళ్ళ వూరు అనంతపూరు వెళ్ళాల్సి వుంటుంది . "

"ఎంతివ్వాలి ? "

"300 . పరవాలెదు లెండి వుంటాను లెండి ."

అమ్మయ్య బతికించారు అనుకునేంతలో శారద , అమ్మా రేపు మా అమ్మ కాకినాడ వెళుదామంటోంది . మా కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తుందిట . అంది . అంతే నా బి. పి రయ్ .. . . రయ్ . . . రయ్

మీ ఇద్దరిలో ఎవరైనా ఇల్లు కదిలారో కాళ్ళిరక్కొడుతాను . అన్నానే కాని వీళ్ళు ఏలేబర్ యూనియన్ వాళ్ళకో ఫోన్ చేయరుకదా ? వాళ్ళొచ్చి నన్ను జైల్లో వేయరుకదా అనే డౌట్ ! ! అంతలోనే ఆ వీళ్ళకంత ధైర్యం ఎక్కడేడిచిందిలే అని నా ధైర్యం ! వాళ్ళకు నా టెన్షన్ సంగతి తెలుసుగా , కాకపోయినా నా మొహం చూసి కనిపెట్టే వుంటారు .మీరు టెన్షన్ పడకండి మేమెక్కడికీ పోము అని హామీ ఇచ్చారు . ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా ? అమ్మయ్య ఈ ఎపిసోడ్ అయ్యింది .

మా వదినగారు ఏమి చేయొద్దు , అన్ని నేనే తెచ్చుకుంటాను అన్నంతమాత్రాన ఎలా వదిలేస్తాను ? అసలే నాకు అన్నిటికీ టెన్షన్ ఎక్కువ. ఏరొజైనా టెన్షన్ పడే విషయము లేకపోతే ఏ టెన్షన్ లేదే అని టెన్షన్ పడతానని , మా వారు , పిల్లలు వెక్కిరిస్తూవుంటారు . అలాంటిది ఇంతటి బృహత్కార్యం నా భుజాలమీద వుంటే ఇక చెప్పేది ఏం వుంది . అనుకున్నాక మూడు రోజులలోనే ఓ ప్పది సార్లు మా వదినగారికి ఫోన్ చేసివుంటాను . ఇక ముందు రోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను . ఈ పిల్ల కి నేరక పోయి చెప్పానురా దేవుడా అనుకున్నారో ఏమో పాపం ఆవిడకి జొరం వచ్చేసి , రాత్రి ఫోన్ చేసి రేపు నోము చేసుకోగలనంటవా మాలా అని అడిగారు . అంతే నా బి . పి రయ్ . . . రయ్ . . . .రయ్ . . . . . రయ్ . . . .

కాస్త ధైర్యం తెచ్చుకొని , పరవాలేదండి నోచుకోగలరు అంతా నిర్విఘ్నం గా జరిగి పోతుంది అని ఆవిడకి ధైర్యం చెప్పాను .

ఏ పండగ పబ్బం ఐనా ఇల్లు కడగటము నాకు అలవాటు . కాని ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మా అబ్బాయి చెప్పాడు , ఇక్కడ కడగటాలు పెట్టుకోకు , మొత్తం మూడంతస్తుల నీళ్ళు , మొదటంతస్తులోకి వస్తాయి , అన్ని ఎత్తి పోయాలి అని . ఏం చేస్తాను ? అందుకే బాల్కనీ , మెట్లు కడిగించి , ఇంటి ముందు ముగ్గేసి వూరుకుంటున్నాను . ఇప్పుడూ అదేపని చేసాను . అమ్మవారు పంపినట్లు పూలవాడు , బంతిపూలు తెచ్చాడు . బంతిపూలు , చామంతులు , గులాబీ లు కొన్నాను . బంతిపూలదండ కట్టి గుమ్మానికి కట్టాను . మామిడాకులు కూడా వుంటే బాగుండేది . పండగ రోజులలో ఐతే బజారులో అమ్ముతారు . మా పక్కింట్లో చెట్టు వుంది కాని , వాళ్ళ పనివాడికి , మా సావిత్రికి పోట్లాట వచ్చినప్పటినుండి వాడు కోసుకోనివ్వటము లేదు . దానికి కూడా టెన్షన్ ఎందుకమ్మా నేను తెస్తాను అని మా అమ్మాయి వాళ్ళింటినుండి తెచ్చింది .

ముందంతా ఇంత టెన్షన్ పడ్డానా ? అసలు సమయం వచ్చేసరికి అంతా చాలా బాగా జరిగింది . ఆ రోజు సావిత్రి మంచి మూడ్ లో , వంట చాలా బాగా చేసిందని అంతా మెచ్చుకున్నారు . లలితసహస్రనామాలు అందరూ కలసి చదువుతుంటే ఇల్లంతా పులకించి పోయినట్లనిపించింది . పొద్దుటినుండి సాయంకాలము 5 గంటల వరకు అందరు ముతైదువులు ఇల్లంతా తిరుగుతూ వుంటే , ఆ కార్యక్రమం అంతా కన్నులపండుగ గా వుండింది .

ముత్తైదువలకేనా , బాలలకు తాంబూలం ఇచ్చారు . ఇంతేనా ? ఐతే నాకేదీ అంటూ . మా మరిదిగారి మనవడు మిహిర్ అడిగాడు . అవునుకదూ , మరి అప్పుడు అక్కడ వున్న మా కుటుంబ పెద్ద , మా మొగ దిక్కు వాడే కదా ! తప్పుతుందా వాడికి , వాడి తో పాటు మిగితా మొగపిల్లలకి తాంబూలము తో పాటు 100 రూపాయలు దక్షిణ .

ఇంత పుణ్య కార్యము మా ఇంట్లో జరుపుకొని , మాకింత మంచి అనుభూతిని కలిగించినందుకు థాంక్ యు వదినగారు .


హరిణీ ,
ఫొటోలు తీసి ఇచ్చినందుకు థాంక్ యు . వాటి కోసం నిన్ను టెన్షన్ పెట్టాను కదూ ! హి హి హి

Wednesday, November 11, 2009

పెళ్లి సందడి

మా స్నిగ్ధ కళ్యాణం నవంబర్ 4 న చాలా బాగా జరిగింది . అంత బాగా జరగాలి అంటే మామూలుగా కాదు , మీరంతా తలాఓ చెయ్యి వేయాలి వదినా అంటూ ఉష ఇదో ఇలా నన్ను కూలేసింది . ఇక చూసుకోండి అప్పటి నుండి మాకందరికీ పనులో పనులు . మరి చీరలు కొనాలా ? నాకే గాజులు కొన్నుకోవాలా ? నాకే . బ్లౌసులు కుట్టించుకోవాలా ? అవీ నాకే లేండి . ఏమిటో ఇన్ని పనులు . తలుచుకొని , తలుచుకొని , ఆలోచించి , ఆలోచించి అలిసిపోయి , అసలు ఏమీ కొనకుండా , వున్నవాటి తోనే సరిపెట్టుకున్నాను .

సరె నా సంగతికేమొచ్చెకాని , మా పిల్లల హడావిడి చూడాలి . ముందుగా యు. యస్ వెళ్ళిన మా పిల్ల జనాభా తిరిగొచ్చి , ఇక్కడ ఉద్యోగాలు చూసుకొని , హాయిగా అమ్మా నాన్నల నీడలో సెట్టిల్ అయ్యిన వాళ్ళ హడావిడే హడావిడి . ముందుగా వీళ్ళ కోసం అన్ని సిద్దం చేసుకోవాలి , ఆ తరువాత యు. యస్ లో వుండిపోయినవారికి , వీళ్ళ సందడి చూపించి ఏడిపించాలి . పాపం ఎంత సమయమూ సరిపోలేదు . దీని తో అమ్మాయిలకేమో ఆ టైలర్ ఒక్క బ్లౌజూ ఇవ్వలేదు . అబ్బాయిలకేమో ఏకుర్తా కొనాలో తేలలేదు ! ఏంచేస్తారు పాపం , కాస్త పెళ్ళి చూడటము , ఏ టేలర్ దగ్గరికో పరిగెత్తటము . ఇంకాస్త పెళ్ళి చూడటము షాపింగ్లకెళ్ళటము . అందులో అబ్బాయిలు తెచ్చుకున్నవి అమ్మాయిలకు నచ్చదు .పోనీ వెళ్ళితేవటాని కి వీరికి సమయం సరిపోదు . అమ్మాయి కట్టుకున్న చీర అబ్బాయికి బాగోదు . మళ్ళీ వెళ్ళి మార్చుకొచ్చుకోవాలిగా ? మధ్య లో పిల్లకాయలని తయారు చేయాలి . ఇలా తయారు చేయగానే అలా మాపేసుకుంటారు . సందులో సటాకు కలికి చిలకల కొలికి మాకు మేనత్త అంటూ పాటలు పాడి ఉషత్తను కుష్ చేయాలి .మరి , మెహందీ ఫంక్షన్ , గాజుల ఫంక్షన్ , వాళ్ళ పెదబావగారి షష్టిపూర్తి , వియ్యపురాలికి , మేనకోడలికి , కోడలికి మ్యారెజ్ ఆనివర్సరీ అంటూ బోలెడు కార్యక్రమాలు పెట్టిందికదా ! అత్తగారిని కుష్ చేసి అల్లుడిని ( కొత్త పెళ్ళికొడుకు ) భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ అని ఆటపట్టించగానే మామగారికి బెంగ , ఈ పిల్లల అల్లరికి కాబోయే అల్లుడు పారిపోతాడేమోనని .

పిల్లలూ ,పెద్దలూ అందరూ పెళ్ళిని చాలా ఎంజాయ్ చేసారు . అందరూ పెళ్ళిసంబరములోనే కాదు , పెళ్ళిపనులలో కూడా పాలుపంచుకున్నారు . ఇక్కడ కొంచం ప్రత్యేకముగా చెప్పుకోవలసినది , మా ఉష ఆడపడుచులగురించి . 4 వ తారీకు ఉదయము నాలుగున్నరకి ఎలా వున్నారో , మరునాడు ఉదయము నాలుగుగంటలకు కూడా అలాగే ఫ్రెష్ గా , ఎంత పనిచేసినా అలసట లేకుండా , చిరునవ్వుతో వున్నారు . అలా ఎలా వుండగలిగారో తెలియాలంటే ఇక్కడ చూడాలిసిందే !

7 వ తారీకున మా మరిదిగారి అబ్బాయి , గౌతం వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి , మా కుటుంబసభ్యులను కొత్తపెళ్ళికొడుకు అభినయ్ కి పరిచయము చేసి ,ఉషత్త , శివాజి మామయ్యలకు కూల్ కపుల్ అని అవార్డ్ ఇచ్చి , గ్రూప్ ఫొటో దిగటము తో పెళ్ళిసందడి ముగించి , పెళ్ళికూతురు , పెళ్ళికొడుకులను వాళ్ళమానాన వాళ్ళను వదిలేసాము .

Wednesday, August 12, 2009

మా ఇంటికి రండి.. స్పెషల్ సండే

అనగనగా ఒక రోజు జ్యోతిగారు ప్రమదావనంలో ఓముఖ్య విషయం చెప్పారు.. ప్రముఖ రచయిత్రి , బ్లాగరు ఐన నిడుదవోలు మాలతి గారు హైదరాబాదు వస్తున్నారహో. మనసులో మాట సుజాత గారు తన ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఎవరైనా రావొచ్చు. మాలతిగారిని కలిసినట్టు ఉంటుంది.,మిగతా బ్లాగర్స్ ని కలిసినట్టు ఉంటుంది అని.. అది చూసి ఏమో ఎవరితోను పరిచయము లేదు , ఎవరింటికో ఏం పోతాములే !అనుకున్నాను . మా వారు కూడా తెలీని వాళ్ళింటికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. సరేలే అని ఊరుకున్నాను. కాని అనుకోకుండా సుజాతగారి మెయిల్. "మాలాగారూ, నేను సుజాతనండీ ,ఈ ఆదివారం మా ఇంటికి రాగలరు. మా అడ్రెస్ ఇది ,మా ఫొన్ నంబర్ ఇది అని ప్రేమగా పిలిచారు. ఆవిడతో పరిచయం లేకున్నా , కొత్త బ్లాగర్ని ఐనా పిలిచి, ఇంత వివరంగా చెప్పారంటె మంచోళ్ళేనన్నమాట.ఇల్లు వాకిలీ వున్నోళ్ళే ! పైగా బ్రహ్మ కమలం చెట్టుకూడా వుందిట. మొలక కూడా ఇస్తానన్నారు సో, వెళ్ళొచ్చు.( చిన్న దురాశ) పైగా మా గురూజీ వూరుకుంటారా ? నేనూ వస్తున్నాను పదండి అన్నారు. ఓ కె డన్ .

ఆ రోజు ఆగస్ట్ 9 . ముందు రోజే జ్యోతి అదేనండి మా గురుజీ చెప్పారు, మా అమ్మాయిని తీసుకొని మీ ఇంటికే వస్తాను .ఇద్దరమూ కలిసే వెళదాము అని. ఓ కే.మరీ మంచిది , నాకు ఇల్లు వెతుక్కునే పని తప్పుతుంది. పొద్దున్నే ఫొన్ చేసి మీరు చందనా బ్రదర్స్ దగ్గరికి వచ్చేయండి అని హుకుం. ఓ.కే గురూజీ ఎలా చెపితే అలానే అన్నా. .పొద్దున్నే నా టెన్షన్ మొదలయింది, ఏ చీర కట్టుకెళ్ళాలి ? అసలైతే హాయిగా డ్రస్ వేసుకెళ్ళొచ్చు. కాని మా బాబా జమానా గాళ్ళే వొప్పుకోరే ! పైగా పెద్ద దానివి ఏదైనా గంభీరమైన చీర కట్టుకెళ్ళు అని సలహా ! ఇక చేసేదేముంది పేద్ద లుక్ రావాలని నల్లంచు తెల్ల చీర కట్టాను .( హుం రమణి గారి పొస్ట్ లో ఎవరో దాన్ని బట్టే పాత తరం దానని అనేసారు .అందుకే జీన్స్ పాంట్ ,కుర్తీ వేసుకుంటానంటే ఎవ్వరూ వొప్పుకోరు.అయినా నేను పాత తరందాన్నంటే నేనొప్పుకోను .) ఐనా తప్పదుగా. చిరంజీవి సినిమాలోని "నల్లంచు తెల్లచీర" అని మనసులో పాడుకుంటూ వెళ్లా. చందనా బ్రదర్స్ దగ్గర జ్యోతి, వాళ్ల అమ్మాయి కలిసారు. హయ్ దీప్తీ అంటే పాపం దీప్తి సిగ్గుపడుతూ చిన్నగా హయ్ అంది. ఏంటి జ్యోతీ మీ అమ్మాయి కి మాటలేరావా అంటే అవునండీ మా వారి పోలిక అన్నారు. ( అంతేలే ఆయనకి మాట్లాడే చాన్స్ ఇస్తేగా పాపం ) నేనూ జ్యొతి హాయిగా కబుర్లు చెపుకుంటూ వుంటే దీప్తి మమ్మలిని గమ్యం చేర్చింది. ఆ రోజు ప్రకృతి కూదా మాకు సహకరించింది. ఎంద, వానా రెండూ లేక చల్లని రొమాంటిక్ వాతావరణం.. కుర్రాళ్ళైతే పాటలు పాడుకునేవారేమో. అసలు అంత దూరం ప్రయాణించినా కొంచం కూడా అలసట విసుగు తెలీలేదు. మధ్యలో సుజాత గారు మేము ఎక్కడున్నామో కనుక్కుంటూనే ఉన్నారు. వారి అడ్రస్ త్వరగానే దొరికింది.మరివెంట ఉంది ఎవరు?? తలుపు దగ్గరే నవ్వుతూ ఆహ్వానించిన సుజాత ని చూసి మనసులో పాపం ఈవిడ ఇంత ఫ్రెండ్లిగా వున్నారు, నేనేమో దావూద్ ఇబ్రహీం డెన్కి వెళుతున్నట్లుగా హడలి పోయాను అనుకున్నాను .
ఎంత మంది ఉన్నారో ఒకతే ముచ్చట్లు బయటివరకు వినిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళగానే వరూధిని కనిపించారు. ఆవిడని ఇంతకు ముందు ప్రమదావనం ప్రొగ్రాం లో చూసాను కాబట్టి గుర్తుపట్టాను. ఆవిడనే మాలతి గారిని, శ్రీవల్లీ రాధికగారినీ, రమణి గారినీ పరిచయం చేసారు. మీ పేరు కామెంట్స్ లలో చూసాను అని మాలతిగారన్నారు, ఓహో మనం కామెంట్స్ ల లో కనిపిస్తామన్నమాట 1 అని కూసింత పొంగిపోయాను. రమణి గారి పేరు చెప్పగానే మీ బ్లాగ్ లో మీ పేరు దగ్గర బాపు బొమ్మ వుంటుంది కదండీ అని గుర్తు పట్టేసాను .మరి నేను బాపూ వీరాభిమానిని ఎక్కడ బాపు బొమ్మ వుండునో అక్కడ నా చూపు వుండును. ఆ తర్వాత జ్యోతిగారు మిగతావారిని పరిచయం చేసారు. కస్తూరి మురళీకృష్ణ గారి పవర్ పాలిటిక్స్ రెగ్యులర్ గా చదువుతాను అదే ఆయన తో చెప్పాను.... అరే గీతాచార్యా అంటే ఈ అబ్బాయా ???? చిన్న పిల్లవాడిలా వున్నాడే !అతని బ్లాగులు చదివి ఎంత పెద్దవాడో అనుకున్నాను సుమా !... ఓ ఈయన కత్తిగారా ? కత్తి లానే వున్నారు.... ఓహో ఈయన చదువరినా ? బాగా చదువరిలానే వున్నారే ! అందరినీ చూస్తూ మనసులొ అనుకుంటూ మరే మనసులోని మాట దగ్గరికి వచ్చాముకదా !


మిగతావాళ్లంతా వచ్చి రెండు గంటలు పైనే ఐంది. మేమే లేటుగా వెళ్లాము. ఇక చర్చలు మొదలు.సినిమా గురించి, టీవీ సీరియళ్ల గురించి. పాత దూరదర్శన్ సినిమాల గురించి,మధ్యలో కథలు, పుస్తకాలు.ఇలా వివిధ విషయాలపై చర్చించారు అందరూ.భలే ముచ్చటేసింది. అందులో కొందరు మొదటిసారి కలుసుకున్నా కూడా ఎలాంటి జంకు భయం లేకుండా చర్చించారు. నేనే ఏం మాట్లాడాలొ,మాట్లాడకూడదో అని మౌనంగా వింటూ ఉన్నాను. అదేంటో మరి రమణి గారు కూడా సైలెంటుగా ఉన్నారు.ఆవిడ సీనియర్ బ్లాగరే కదా..

అప్పుడే సుజాత గారు "లేవండి ..భోజనాలు చేసి ,చేస్తూ మాట్లాడుకోవచ్చు"అని దండోరా వేసారు. సరె ఇదో పని ఐపోతుంది అని అందరం భోజనాలు మొదలెట్టాం. చల్లని ఆదివారం, లైట్ గా లంచ్ .. ఏమేం చేసారో చెప్పనామరి.. పులిహోర, పెరుగు ఆవడలు, పూరి, ఖుర్మ, డబల్ కా మీటా..అసలు ఈ ముచ్చట్లు ఎంతకూ పూర్తికావనిపించింది. తింటూ కూడా మళ్లీ చర్చలే. ఇప్పుడు మల్లీ ఓ నాలుగైదు గ్రూపులు. అందరూ ఒక్కో టాపిక్ గురించి ముచ్చట్లు .నేనైతే హాయిగా కూర్చుని తినసాగాను. కొత్తగదా. మళ్లీ ఇంకోసారి రెచ్చిపోతా చూడండి.ఎందుకు పిలిచామురా అనుకుంటారు .. తిన్న తర్వాత మళ్లీ సాహిత్య చర్చలు. . అలాగే కొద్ది సేపు ఆ చర్చలు వింటూ ఉన్నాను. చివర్లో ఫోటో సెషన్.. పాపం.. దీప్తి, సుజాతగారి ఆయన శ్రీనివాస్ గారు ఫోటోలు తీసారు. మరి అందరు నిలబడీతే ఎలా అంటే మాలతి గారో బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చారు. -5 కింద కూర్చోండి, +5 పైన కూర్చోండి . మగవాళ్లు ఎక్కడో సర్దుకోండి అని.. అల నవ్వుతూ ,ఉల్లాసంగా,ఉత్సాహంగా , మాట్లాడుకుంటూ లిఫ్ట్ సంగతి కూడా మర్చిపోయి మెట్లు దిగేసాం.

గేటుదాకా వెళ్లాక గుర్తొచ్చింది బ్రహ్మకమలం. సుజాత గారి రండి అని తీసికెళ్లి చెట్లని పరిచయం చేసి అదిగినవారికి లేదనకుండా బ్రహ్మకమలం ఆకులను కోసి ఇచ్చారు. ఆకు దాతా సుఖీభవ!! నాఖర్మ కాకపోతే అది జ్యోతి గారి కారులొనే మర్చిపోయా.. ఈ సారి మాతో శ్రీవల్లి రాధిక కూడా వచ్చారు. కొంచం దూరం వెళ్ళాక కృష్ణకాంత్ పార్క్ లో ఈ-తెలుగు మీటింగ్ జరుగుతుంది కదా ఇంటికెళ్లి చేసే పనేమీలేదు.ఒకసారి అక్కడున్నవాళ్లని పలకరించి వెళదామాని బయలుదేరాం. ఆ రోడ్లు కొత్తకాబట్టి నేను దారిచూపిస్తున్నాను.. దగ్గరికి వచ్చాకా దారి తప్పి , దీప్తికి ఐస్ క్రీం ఆశ చూపించి అటు తిప్పి ఇటు తిప్పీ మొత్తానికి కృష్ణకాంత్ పార్క్ కి వెళ్ళాము. వాళ్లు షాకైనట్టున్నారు.ఇదేంట్రా పిలవకుండా వచ్చేసారు అని. అక్కడ మా పేర్లు బుక్ లో రాసాము. చాలా సమయం అయ్యేట్లుగా వుంది,వాళ్లు ఏదో సీరియస్సుగా చర్చిస్తున్నారు అనుకొని చిన్నగా లేచి బయట పడ్డాము. జ్యోతి కొన్ని ఫొటోలు తీసుకున్నాక చెట్ల గురించి మాట్లాడుకుంటూ అక్కడే వున్న కాంటిన్లో ఐస్ క్రీంలు తిని , కార్ లో రాధిక గారి నవల్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వుండగానే మా ఇల్లు వచ్చేసింది.

ఇదండీ మా స్పెషల్ ఆదివారం ముచ్చట్లు..