Showing posts with label నేను - నా పరివారం. Show all posts
Showing posts with label నేను - నా పరివారం. Show all posts

Monday, December 7, 2009

రధచోదకుడు


రధచోదకుడు
మాలాకుమార్

మా వారికి , రాజమండ్రి లో వర్క్ వచ్చింది . ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనుకుంటూ కోనసీమ అందాలు చూడబోతున్నానుకదా , అని మహదానందంగా , మావారి తో పాటు , నేను , చుటికి బయిలుదేరాము . మన వీలు ప్రకారము ప్రయాణము చేయవచ్చని , మావారు , కార్ లో వెళుతే మనకు కావలసిన చోట ఆపుకోవచ్చని నేను , చాలావరకు కార్లోనే వెళుతుంటాము. వర్క్ మొదలుపెట్టే హడావిడి లో మావారు , కొత్త డ్రైవర్ నరసింహ డ్రైవింగును , మద్య మధ్య లో స్లొరా నరసింహ , అంటున్నారే కాని ఎక్కువగా పట్టించుకోలేదు . రాజమండ్రి చేరగానే , సీతారామయ్యగారి మనవరాలు లోని ఇంటి లాంటి ఇల్లును ఊహించుకున్న నాకు , మా ఇల్లు చూసి నిరాశకలిగింది , కాని పోనీలే గోదావరి అందాలకు దగ్గరగా వున్నాను కదా అని సంతోషించాను .
మావారు పొద్దున్నే వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు . మద్యాహ్నము నరసింహ వచ్చి సార్ అక్కడికే కారియర్ తెమ్మన్నాడమ్మా అన్నాడు. మరి నువ్వు తిన్నావా అంటే లేదమ్మా అన్నాడు . సరే నువ్వు తినేసి సార్ కు తీసుకుపో అని వాడికి వడ్డించాను . తింటూ తింటూ బొట బొటా కన్నీళ్ళు కార్చటము మొదలెట్టాడు . నాకు గాభరా వేసి , ఏమైంది నరసింహ అంటే , “నువ్విట్లా అన్నం పెడుతుంటే మా అమ్మ యాదికొస్తోందమ్మా అని ఏడవటము మొదలు పెట్టాడు .
ఓరినీ దుంపతెగ , మీ అమ్మ యాదికొస్తే అన్నం ముందు ఆ ఏడుపేమిటిరా నాయనా , ముందా ఏడుపు ఆపు అన్నాను .
ఇప్పుడేనమ్మా నేను మా అమ్మని వదిలిరావుడు . హైదరాబాద్ లో అని కొలువులో చేరిన , సారేమో ఇంతదూరం తెచ్చిండు . అని కాసేపు భాధ పడి వెళ్ళాడు .

మా డ్రైవర్ నరసింహ 22 / 23 సంవత్సరాలవాడు . వాళ్ళ అమ్మా వాళ్ళూ కొత్తపేట లో వుంటారు . కొత్తగా పనిలో చేరాడు . చిన్నవాడు కాబట్టి నాతో చనువుగా మాట్లాడుతుండేవాడు . పైగా నన్ను చూస్తే వాడికి అమ్మ యాదికొస్తోంది . అంతవరకు బాగానే వుంది , కాని ప్రతిపూటా అన్నం ముందు ఏడుపే ! వాడి ఏడుపు చూసి నాకు గుండె దడ ! తిరిగెళ్ళేటప్పుడు , కొత్తపేటలో వాడి కి తెలిసిన సేటు దగ్గర కొంచం ధర తగ్గించి చీర ఇప్పిస్తానన్నాడు . దారిలో ఆలంపూర్ లో మహిమగల తల్లి వుంది చూపిస్తా నన్నాడు . వాళ్ళ వూరి కబురులన్నీ చెప్పేవాడు . ఇదేమిటో , ఎంతో ఊహించుకొని రాజమండ్రి వచ్చి , మావారేమో పనిలో, నేనేమో కొత్తపేట ముచ్చట్లలో బిజీ అయ్యాము , అనితెగ గింజుకున్నాను !
అలా అలా పదిహేను రోజులు గడిచాయి . ఈ లోపల ధవళేశ్వరం , కడియం , పట్టిసీమ వెళ్ళొచ్చాము . రోజూ సాయంకాలం గోదావరి వొడ్డున షికారుకెళ్ళే వాళ్ళము.అక్క్డ మల్లెపూల, కంకాంబరం దండలు పెద్దపెద్దవి చాలా చౌకగా దొరికేవి.కొనుక్కొచ్చి దేవుడికి, నాకు కాగా గుమ్మాలకు కూడా కట్టేదానిని. ఒక సాయంకాలము , రాజమండ్రి కి వెళ్ళివస్తుండగా , ఏమండి నాకు కొంచం హైదరాబాద్ వెళ్ళే పని వుంది , ఒకరోజు పనే , నువ్విక్కడ వుంటావా ? హైదరాబాద్ వస్తావా ? హైదరాబాద్ నుండి రాగానే చుట్టుపక్కల చూసొద్దాం అన్నారు . నేనిక్కడే వుంటే , ఆయన తిరిగి వస్తారు , నేనూ వెళితే మళ్ళీ వచ్చే అవకాశము తక్కువే అని నాలో నేను స్వగతం అనుకొని , “నేనిక్కడే వుంటాను లెండి , ఒక్కరోజే గా పరవాలేదు నరసింహ తోడుంటాడు లెండి . మీరింకెవరన్నా డ్రైవర్ ని తీసుకొని వెళ్ళండి అన్నాను . నామాట పూర్తికూడా కాకముందే , నరసింహ ," ఏందమ్మా ? ఈడకొచ్చినప్పటి సంది చూస్తున్నా , ఏదేదో చూడాలంటావు , వంటిమీద సోయిలేదు . ఇంటి ద్యాస లేదు , చిన్నోడు (మా మనవడు) గుబులు పడతాడని లేదు , ఇంకెన్నాళ్ళుంటవు ? " అని దులిపేసాడు . అంతే నేనుకాని , ఏమండీ కాని కిక్కురుమంటే ఒట్టు !
పెళ్ళికెళుతూ పిల్లిని చంకన పెట్టుకొని వచ్చినట్లు వీడిని తీసుకొచ్చినందుకు తిట్టుకుంటూ , నరసింహ గొడవ భరించలేక నేను కూడా హైదరాబాద్ ప్రయాణమైనాను ." నరసింహ స్లోరా " , " నరసింహ స్లోరా " ఏమండీ అంటున్నా బేఫికర్గా మమ్మలిని గాలిలో తేలియాడించాడు. పైగా ఏంది సారూ గా ఎడ్లబండిలా తోలమంటావా ? అని దబాయింపు ! అట్లాగే ఆలంపూర్ లొ మహిమగల తల్లి ని చూపించాడు .కొత్తపేట లో సేట్ దుకాణానికి తీసుకెళ్ళాడు . అయినా అదేమిటో  ఏమండీ వాడి స్పీడ్ భరించలేక,వాడిని దిగమని , వెనుక కూర్చోమని , ఆయన డ్రైవింగ్ తీసుకున్నారు . వెనుక సీట్లో ఒక్కడే కాలుమీద కాలేసుకొని , వెనుకవైపు రెండు చేతులూ బార్లాజాపుకొని దర్జాగా కూర్చొని ఏంది సారూ నువ్వేమన్నా చిన్నగా తోలుతున్నావా వెనుక కూర్చుంటే గట్లనే అనిపిస్తాది . అని నస మొదలు పెట్టాడు .
వరేయ్ ఇట్లా మాట్లాడవంటే నిన్ను దింపేస్తా , ఏ లారీ లోనో రా అని ఏమండీ,
ఏందీ నేను లారీలో రావాలా ? “
అని వాడూ , ఇదెక్కడి గొడవరా దేవుడా అని భయపడుతూ నేను , ముడుచుకొని కూర్చొని మా చుటికీ  ఎలాగో హైదరాబాద్ చేరాము !
ఆ తరువాత ఏమండీ నరసింహను పనిలోనుంచి తీసేసారు . ఒకరోజు నేను బడీచావిడి లో కూరలు కొంటుండగా అమ్మా , అమ్మా అని వినిపించింది . ఎవరా అని చూస్తే నరసింహ రోడ్ కడ్డంగా హడావిడిగా పరిగెత్తుకొస్తూ కనిపించాడు . ఒకరికొకరం కుశలం అడుగుకున్నాక , " అమ్మా , నేనేమి చేసినా ? సారు నన్ను ఎందుకు పనిలోనుండి తీసేసిండు ? నువ్వు సానా మంచిదానివి , సారుకు కోపం సానా ఎక్కువ . నువ్వు ఇన్నేళ్ళ సంది , సారుతో కాపురం ఎట్ల చేస్తున్నవో ? " అని జాలిగా నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు ! ! ! ! !
అదేమిటో నాకు దొరికే పనివాళ్ళు (పనివాళ్ళు అనకూడదుట, హెల్పర్స్ అనాలిట మా మనవరాలు చెప్పింది) అందరూ ఇదో ఇలాంటివాళ్ళే దొరుకుతారు.




Thursday, November 26, 2009

రామయ్య ( ఎవ్వరి మాట వినడు - ఎవ్వరికీ భయపడడు )

ఎదురింటి గోపాలరావు గారింట్లో పని చేసేవాడు , అయన వద్దని పంపించేసారు , మనింట్లో వుండమని పిలిచాను అంటూ మా వారు రామయ్యను , మా మామగారికి పరిచయము చేయగానే , ఆయన , ఈ ముసలోడేం పని చేస్తాడురా ? నెలకు 50 రూపాయలు దండగ , ఏం వద్దు పంపించేయ్ అన్నారు . కాని మా వారు వినలే , నేనిస్తానులే , కాస్త అన్నం పెట్టి , 50 రుపాయలిస్తె , ఇంటికి కాపలాగా మెట్లకింద వుంటాడు అని వాదించారు . పెద్దోడు చెపుతున్నాడు వుండనీయ రాదయ్యా అంటూ మా అత్తగారి సపోర్ట్ తో మా ఇంట్లో చేరాడు రామయ్య . ఇక అప్పటి నుండి ఇంటికే కాదు , ఇంటి మనుషులకు కూడా కాపలాదారైనాడు .

మా మామిడిచెట్టు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు సంవత్సరానికి ఒకటో , రెండో కాయలు కాసేది కాని , ఆకులు మాత్రము చెట్టునిండా ,గుబురుగా నవనవ లాడుతూ వుండేవి . మా వీధి లో పండగలకి , పబ్బాలకి మామిడాకులు , కొబ్బరాకులూ మా ఇంటినుండి తీసుకెళ్ళేవారు . మా రామయ్య వచ్చాక అదంతా బంద్ ! అరిచిఘీ పెట్టినా ఒక్కటంటే ఒక్క ఆకు కూడా ఇచ్చేవాడు కాదు .మా మామగారరిచినా , నీమ్మకు నీరెత్తినట్లు , దున్నపోతుమీద వానజల్లు పడ్డట్టు వుండేవాడు !

బయటి వాళ్ళకు సరే , ఇంట్లో వాళ్ళకు కూడా , ఏ ఆకు , పూవు ఏది ముట్టుకోవటానికి వీలులేదు . రామయ్య ఇస్తేనే , కొబ్బరికాయైనా , నిమ్మకాయైనా , పూవైనా చివరికి కరివేపాకైనా ! ఇంతకు ముందు ఇంటికెవరైనా వస్తే , వారికి బొట్టుపెట్టి , కొబ్బరికాయ ఇచ్చేవారు , మా అత్తగారు . రామయ్య హయాం వచ్చాక , రామయ్యకు , వచ్చినవారి ముఖారవిందం నచ్చి ఇస్తేనే ఇవ్వటము అలవాటు చేసుకున్నారు ఆవిడ . మా ఆడపడుచులు వచ్చినప్పుడు , రామయ్యా , ఆడపిల్లగాళ్ళు వచ్చారు , కొబ్బరికాయలు తే అని , మా అత్తగారు ఎంత పిలిచినా వినిపించుకునేవాడు కాదు . అన్ని స్టోర్ రూం లో ఎక్కడో దాచేసేవాడు . తనకు ,సబ్బు పైసలు అవసరమైనప్పుడు మాత్రము ,ఓ రెండు కొబ్బరికాయలు , ఓ రెండు నిమ్మకాయలు , కాస్త కరివేపాకు , సంచీ లో వేసుకెళ్ళి , వాళ్ళకిచ్చి , రెండు రూపాయలు తెచ్చుకునేవాడు ! మాకవసరమై ఎంత అడిగినా నిమ్మకు . . . . . దున్నపోతు . . . . . . . . రామయ్య దయ , మా ప్రాప్తం ! బయట అమ్ముకునేవాడా అంటే అదేం లేదు . తన ఇష్టప్రకారము మా కిచ్చేవాడన్నమాట .


పొద్దున లేచినప్పటినుండి , మా మామగారికి , రామయ్యకు ఏదోవక దాని మీద గొడవలే ! ఇద్దరూ మీద పడి కొట్టుకుంటారా అన్నట్లుండేవి . అలా ఇద్దరూ కాసేపు అరుచుకొని , బజారుకు బయిలుదేరేవారు . రామయ్య ఒక సంచీ పట్టుకొని , రామ భక్త హనుమాన్ లా ఆయన వెనుక వెళ్ళే వాడు . ఎంతైనా ఆయనకు నమ్మిన బంటు . మా అత్తగారికి , మామగారికి చాలానే సేవ చేసేవాడు .

మా ఇంటి ముందుకు కు , అసలు మా గేట్ దరిదాపులకు ఎవరూ వచ్చేందుకు వీలు లేదు . పిల్లల తో ఆడుకోవటానికి ఎవరైనా వస్తే , పక్కింటికి వెళ్ళమని పంపించేసేవాడు . ఒకసారి మా అబ్బాయి ఫ్రెండ్ , చదువుకోవటానికి వస్తాడని ఎదురుచూస్తూ వున్నాడు . ఆ అబ్బాయి రాలేదు . ఏమైందా అనుకున్నాడు మా వాడు . మరునాడు స్కూల్ కి వెళ్ళాక తెలిసింది , అతను వచ్చాడట. కాని మా ఇంటికి రావొద్దు , పక్కింటికెళ్ళు అని వెళ్ళ గొట్టాడట . మా వాడు ఒకటే ఏడుపు , వాడు ఒల్డ్ సిటీ నుండి వచ్చాడమ్మా . ఎవరొచ్చినా పక్కింటికి వెళ్ళమని పంపిచేస్తాడు అని . మావారు , రామయ్య ను పిలిచి కోపం చేసారు . అబ్బే నిమ్మకు . . . . . .దున్నపోతు . . . . .


ఇంతేనా ? ఒకసారి మావారికే తగిలింది ఆ దెబ్బ , ఆయన ఫ్రెండ్ , వాళ్ళ అమ్మాయిపెళ్ళికి పిలవటానికి రాత్రి 11 గంటలకి వచ్చారు .నాలుగు రోజులలో కుదిరిందిట . సమయము ఎక్కువ లేదు అందుకని వాళ్ళ దురదృష్టము ఆ టైం లో వచ్చారు . యధావిధి , మా రామయ్య గేట్ తీయనని , వాళ్ళను పక్కింటికెళ్ళమని పంపించేసాడు . ఆ తరువాత కథ ఎందుకులెండి .


మా గేట్ ఎట్టి పరిస్తితులలోనైనా , రాత్రి 10 గంటల కల్లా మూయాల్సిందే . తాళం పడాల్సిందే ! మా ఇంటికి ఎవరైనా వచ్చి 10 తరువాత వుంటే వచ్చి వాళ్ళనే , మీకేం పనిలేదా ? ఇంకెంతసేపుంటారు వెళ్ళండి అనేసేవాడు . అంత మాట అనిపించుకున్నాక ఎవరైనా ఎందుకుంటారు ? పక్కనుంచి మావారు అరుస్తున్నా సరే నిమ్మకు . . . . . . దున్నపోతు . . . . . . .


మా అమ్మాయి కి ఎదురింట్లోనే ఇద్దరమ్మాయి లు ఫ్రెండ్స్ వుండేవారు . ముగ్గురూ , రాత్రి చదువుకోవటము అయ్యాక మా ఇంటిముందు కూర్చొని కబుర్లాడుకునేవారు . మామూలుగానే , మా ఇంటిదగ్గరెందుకు పక్కింటికెళ్ళండి అని పంపేసాడు . వాళ్ళూ సరేనని ఎదురింటి గేట్ ముందు కూర్చున్నారు . 10 కాగానే సంజమ్మా వస్తున్నావా అని అరిచి , పిలిచాడు . పాపం తను రావటము 5 నిమిషాలు ఆలస్యం చేసింది . అంతే గేట్ తాళం పడిపోయింది . ఏంచేస్తుంది ? గేట్ తీయడు , అందుకని గోడ దూకి వచ్చింది . ఇహ చూస్కోండి నువ్వు ఆడపిల్లవి కాదా ? అట్లా గోడ దూకుతావా అని క్లాస్ పీకాడు . మా అబ్బాయి రామయ్య కళ్ళ పడకుండా గోడదూకి , రామాఫలం చెట్టెక్కి , బాల్కనీ లోకి దూకేవాడు . రామయ్య పుణ్యమా అని మా పిల్లలకు గోడలు దూకటము , చెట్లెక్కటమూ బాగా వచ్చింది !

మా అమ్మాయి పెళ్ళై తను వెళ్ళిపోయాక , మావారు కూడ ఎక్కువ టూర్స్ లలో వుండేవారు , ఇల్లంతా ఖాళీనే కదా అని మా అబ్బాయి ఫ్రెండ్స్ రాత్రుళ్ళు మా ఇంటికే వచ్చి , చదువుకునేవారు . మా ఇంట్లోకి నాలుగు మోటర్ సైకిళ్ళు రావటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు మా రామయ్య . అదీనూ రాత్రి 10 లోపలే రావాలి . పాపం పిల్లలు నలుగురైదుగురు ఒక్కొక్కదానిమీద వచ్చేవారు . ఎప్పుడైనా ఎవరికైనా ఆలస్యమై , గోడ దూకి వచ్చారో , వాళ్ళ నడ్డి విరిగిందే ! వాళ్ళ అమ్మలు మాత్రము మీఇంటికి వస్తే మాకు బెంగ లేదండి , మీ రామయ్య ఎటూ కదలనివ్వడుగా అని సంతోష పడిపోయేవారు .


నేను పార్లర్ కి వెళ్ళిన కొద్దిసేపటికే , పార్లర్ కొచ్చేసేవాడు . ఏమిటి అంటే , ఇంటికి చుట్టాలొచ్చారు , చాయ్ పెడుదువు పదా అని , నేను బయిలుదేరేదాకా అక్కడే బెల్ కొడుతూ కూర్చునేవాడు . ఇక నా క్లైంట్సేమో నేను చేసుత్తున్న ఐబ్రో నో , ఫేషియలో మద్యలో వదిలేసి పోతానేమో నని తెగ భయపడి పోయేవారు . ఆ తరువాత పార్లర్ చుట్టుపక్కల రామయ్య కనిపిస్తే రావటమే మానేసారు .ఇలా కనీసము రోజుకు ఐదారు సార్లన్నా ఇంటికి తీసుకెళ్ళేవాడు . సాయంకాలము గేట్ దగ్గరికి రాగానే ఒక రుపాయివ్వు , సబ్బు తెచ్చుకోవాలే అనేవాడు . నాకు వళ్ళు మండి ,నా దగ్గరలేవు అంటే , పొద్దటిసంది గిరాకి రాలే అని దబాయించేవాడు . నువ్వు నన్నెక్కడ పని చేసుకోనిచ్చావు ? ఇన్ని సార్లు తీసుకొచ్చావు అని నేను ఉక్రోశ పడితే , నీతాన పనిచేసే పిల్లలేం చేస్తున్నారు ? అని తిరిగి దబాయింపు ! ఇంటికి ఇంత దగ్గరగా పార్లర్ వద్దు , కొంచము దూరము వుండాలి అని మావారు చెపితే వినకుండా , ఇంటికి దగ్గరైతే ఇంటినీ , పిల్లలనూ చూసోకొవచ్చని , ఇంటిదగ్గరగా పార్లర్ పెట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకుంటూ రూపాయి సబ్బు కోసం సమర్పించుకునేదాన్ని . నాకు తెలుసు , మా పిల్లల లాగే మీకూ రోజూ సబ్బెందుకు అని అనుమానం వస్తోంది కదా ? సబ్బు అంటే , మా రామయ్య భాష లో సారాయి .

ఇంతేనా అంటే ఇంకా చాలా వున్నాయి చెప్పల్సినవి . కాని ఇంకా ఎందుకులెండి . ఇప్పటికే చాలా ఎక్కువైంది . మా మామగారు చనిపోయిన నెలకే రామయ్య కూడా చనిపోయాడు . అక్కడ కూడా వాళ్ళకు ( మా అత్తగారికి , మామగారికి ) సేవ చేయటానికే వెళ్ళాడు అని అందరూ అనుకోవటమే .