Wednesday, July 29, 2009

శ్రావణమాసం – చింతకాయ ప్రహసనం

-->
శ్రావణ మాసం రాగానే గుర్తుకు వచ్చేవి నోములు, పేరంటాలు,శనగల వాయనం. పెళ్ళైన కొత్తలో నోముకున్న మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం, అమ్మవారి నైవేద్యాలు ...తలుచుకుంటే అప్పుడు జరిగిన పొరపాట్ల లోని తమాషాలు వగైరా.. ఇప్పటికీ నవ్వొస్తుంది.. .నాకైతే ముందుగా గుర్తొచ్చేది కొత్తచింతకాయ పచ్చడి , దానికోసం జరిగిన హడావిడి. నా మొదటి శ్రావణ శుక్రవార నోముకోసం నేను పుణె నుండి హైదరబాద్ వచ్చాను. పెళ్ళి కాకముందు అమ్మ నోముకుంటుండగా అమ్మవారి అలంకరణలో , పేరంటం లో చిన్న చిన్న సహాయాలు చేయటంతో ఉత్సాహంగానే ఉండేది . ఆ రోజు నోములో వాయనం ఇవ్వటం కోసం మా మామగారు వూరినుంచి పెసలు తెచ్చారు. పూలు పండ్లు పూజ ముందు రోజు తెస్తారు. పేరంటం పిలుపులు కూడా మొదలయ్యాయి. ఇహ మొదలైంది అసలు హడావిడి.
ఏమయ్యా!” ( మా అత్తగారు మా మామగారిని బహు సొగసుగా అలా పిలిచినప్పుడల్లా నాకూ మావారిని అలా పిలవాలనిపించేది. కాని భయం , మొహమాటం వల్ల ఇప్పటికీ పిలవలేక పోతున్నాను. ప్చ్.) శుక్రవారం రెండు రోజులలోకి వచ్చింది .నువ్వింకా చింతకాయలు తేలేదు.
నేనేమన్నా ఖాళీగా వున్నానా ? వెతుకుతునే వున్నాను .ఇంకా రాలే.
మరి ఎట్లా ?
మళ్ళీ మా మామగారు, సంచీ తీసుకొని చింతకాయల కోసం బయలు దేరారు. ముందుగా నారాయణగూడా మార్కెట్ కి. అక్కడ ఇంకా రాలేదు.
తరువాత చిక్కడపల్లికి. అక్కడవున్నాయి . కాని పిట్టలోళ్ళు మహా కంత్రీ గాళ్ళు, బేరం పడనీయరు.
ఆ పైన బడీచావిడీ కి .అక్కడా బేరం కుదరలేదు.
అటుపై సుల్తాన్ బజార్ అక్కడ బేరం కుదరలేదు.
రకం గా రెండూ రోజులూ తిరిగీ, తిరిగీ చివరికి సుల్తాన్ బజార్ లోనే తెచ్చారు. ఈ తతంగం అంతా ప్రతి సంవత్సరం శ్రావణశుక్రవారం ముందు తప్పనిసరి. మా ఇంటి అలవాటో ,ఆనవాయితి నో తెలీదు కాని వరలక్ష్మీ వ్రతము రోజు బూరెలు, పులిహోరతోపాటు కొత్తచింతకాయ పచ్చడి నైవేద్యము కూడా తప్పనిసరి ఉండాల్సిందే.
మా హోల్ మొత్తం కుటుంబాని కి చింతకాయ పచ్చడి అంటే బహు ప్రీతి. ఎంత అంటే పోయిన సంవత్సరము మోండా మార్కెట్ లో 50రూపాయలు పావు కిలో అయినాసరే కొనుక్కునేంత అన్నమాట. మావారి మేనత్త చింతకాయ పచ్చడి పెట్టటములో ఎక్స్పర్ట్ . ప్రతి సంవత్సరము మాకు ఆవిడే చింతకాయ పచ్చడి సరఫరా చేసేవారు. దాన్ని మేము వూరూవాడా ఇతోధికంగా పంచేవాళ్ళము. అదేమిటో మా హోల్ మొత్తం కుటుంబానికే కాక ,మా ఫ్రెండ్స్ కి కూడా మా చింతకాయ పచ్చడి మహా ఇష్టం. మాజాంగ్ ఆడటానికి వచ్చినప్పుడు ,మా ఫ్రెండ్స్ మాకు వేడి వేడి అన్నం, ముద్దపప్పు చింతకాయ పచ్చడి పెట్టమంటారు. 4 గంటలకు టీ టైం లో ఇదేమిటి అంటే ఇదే మా స్నాక్స్ అంటారు. సొ అంత పేరు ప్రఖ్యాతి కలదన్నమాట మా చింతకాయ పచ్చడి. కొత్తగా వస్తున్న లేలేత చింతకాయలు కొద్ది వగరుతో ,కొద్ది పులుపు తో చాలా రుచిగావుంటాయి. నేను మా అత్తగారి దగ్గర వాటితో పచ్చడి చేయడం నేర్చుకున్నాను .
ఆ విధానము,
ఈ కాలములో ముందుగానే ఓ పావుకిలో మెంతులు ఎరుపు రంగు వచ్చేవరకు వేయించి ,పొడి చేసుకొని వుంచుకుంటాము. చింతకాయలు శుభ్రం చేసుకొని కడిగి ఆరపబెట్టు కోవాలి. తరువాత వాటిని రోట్లో వేసి, వాటిలో పసుపు, కరివేపాకు వేసి, కొద్ది కొద్దిగా వుప్పు వేసుకుంటూ దంచాలి. వుప్పు కొంచం ఎక్కువగానే పడుతుంది. దీనికి కొలతలు చెప్పటము కష్టం. మద్య మద్య లో సరిపోయిందో లేదో రుచి చూడటమే ! రుచి చూసాక మిగిలిన పచ్చడి లో కొద్దిగా మెంతిపొడి ,సరిపడ ఎర్ర కారం పొడి , కొద్దిగా ఇంగువ వేసి మెత్తగా నూరుకోవాలి. ఆ పైన పల్లి నూనెని కాచి దానిలో కొన్ని మెంతులు వేసి ఎరుపు రంగు వచ్చాక ,ఎండు మిరపకాయలు ,కొన్ని ఆవాలు ,ఇంగువ ,కరివేపాకు వేసి పోపు పెట్టాలి .అంతే కొత్తచింతకాయ పచ్చడి రెడీ .
ఫొటో లో వున్న చితకాయ పచ్చడి పోయిన సంవత్సరంది . అందుకే రంగు మారింది. కాని ఏదో పురజనుల కోరిక పై ఇప్పటికి ఇది పెట్టాను. కొత్తది చేయగానే అప్పుడు మార్చేస్తాను. ఇప్పటికి దీనితో సర్దుకొండి. సర్దుకుపోవాలి మరి. తప్పదు..


Friday, July 17, 2009

ఆహా ఏమి రుచి

గాజర్ హల్వా
ముందుగా ఫ్యాన్ వేసుకోండి.. చాలా వెనక్కి వెళ్లాలి..
1969 ( నెల ,డేట్ గుర్తులేవు )
స్తలం ; పూనె
అప్పటికి మా కొత్తకాపురం మొదలై కొన్ని నెలలే అయింది.. నేను మా ఏమండీ గారి  ఆధ్వర్యములో వంట నేర్చుకుంటున్నాననే భ్రమలో మా ఏమండీ  ఉన్నరోజులవి. ఇద్దరమూ ఉదయమే 8 గంటలకల్లా కాలేజీ లకు వెళ్ళిపోయేవాళ్లం. మళ్ళీ ఒంటిగంటకల్లా వచ్చేసేవాళ్ళము. వచ్చాకా వంట చేసుకోవచ్చు, కుక్కర్ లో అన్నం, పప్పు ఎంతలో వుడుకుతాయి, రాగానే వండుకుంటే వేడిగా తినొచ్చు అనే మా ఏమండీ గారి  అభిప్రాయంతో ఏకీభవించి వచ్చాక వంట మొదలు పెట్టేదాన్ని. పెళ్లైన కొత్తగదా మొగుడి మాట జవదాటకూడదు అనుకునే అమాయకపు అమ్మాయిని మరి.. అది అప్పట్లో... మా అత్తగారు ఇంట్లోకి రాకూడని మూడు రోజులు  మా ఏమండీనే  వండేవారట. ఆ అనుభవం తో నా వెనక చేరి, ఇంకాస్త ఉప్పేయ్, కొంచం నీళ్ళు పోయ్ అంటూ సలహాలిస్తూ, ఆ తరువాత తినలేక ఇంత ఉప్పేసావేమిటి? నేను చెప్పినట్లు చేయలేదు అని గొణుగుతూ వుండేవారు. కాని ఇప్పటికీ వినేవాళ్ళుంటే మా ఆవిడకి నేనే వంట నేర్పాను అంటూ ఎంత సేపైనా చెపుతారులెండి. ఏం నేర్పారండీ అంటే ఆమ్లెట్ నేర్పానా ? టీ పెట్టటము నేర్పానా అంటూ లిస్ట్ మొదలుపెడుతారు.తమ గొప్పలు చెప్పుకోవడం ఎవరికి మాత్రం ఇష్టముండదు. చెప్పొద్దు.. ఆ ఆమ్లెట్ కొసం ఎంత గోలని ? ( అసలు అది తినేదెవరు ఆయన తప్ప ) అయినా ఈ అబ్బాయిలకి అమ్మ వెనుకెనకే తిరుగుతూ, కొద్దో గొప్పో వంట నేర్చేసుకొవటం ఏమి పాడు అలవాటో? . ఆ తరువాత వాళ్ల భార్యల పాట్లు భగవంతుడికే తెలుసు. ప్రతీదాంట్లో వేలెట్టి తప్పులు ఎత్తి చూపిస్తారు . ఏ యింతి కథ చూసినా ఇంతే కదా
.
ఇంతలో ఇద్దరికీ సెలవలొచ్చాయి. హైదరాబాద్ వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఏం తీసుకెళ్ళాలి ?అప్పటికి కొద్ది రోజుల ముందే మా మామగారి ఫ్రెండ్స్ వచ్చి, నేను చేసిన టమాటా పప్పు, టమాటా చారు, టమాటా పచ్చడి ,వాళ్ళ కంట పడకుండా మావారు చేసిన టమాటా ఆమ్లెట్ తిని, హైదరాబాద్ లో మా మామగారి దగ్గర మీ కోడలు వంట బ్రహ్మాండం గా చేసింది అని మెచ్చుకున్నారట ! కాబట్టి ఏదైనా చేసి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఆయననే డిసైడ్ చేయమని అడిగా.. నేను వూరుకొవచ్చుగా ! అబ్బే అంత మంచి బుద్ది ఏది ? రెండుమూడు సార్లు అర్ద కిలో గాజర్లు హల్వా చేసిన ధైర్యం, అనుభవంతో ఏమండీ గాజర్ హల్వా చేయనా? అని అడిగా, . ఆ హల్వా ఆయనకూ నచ్చటము వలన సరే అనేసారు.
"ఎంత ఒక కిలో చేయనా ?"
"కిలో ఏం సరిపోతుంది ?"
"పోనీ రెండు కిలోలు ?"
"కాదులే మూడు కిలోలు చేయి . మనింట్లో అందరికీ స్వీట్ ఇష్టము కదా ."
సరే కిర్కీ మార్కెట్ కి గాజర్ తెద్దామని వెళ్ళాము. గాజర్ ఫ్రెష్ గా వుండటముతో తెగ నచ్చేసి నాలుగు కిలోలు తీసుకున్నారు. సాయంకాలం పాలవాడికి ఎనిమిది లీటర్ల పాలు కావాలని చెప్పాను. మావారు ఇరుగయ్యనీ, పొరుగయ్యనీ అడిగీ, బ్లాక్ లో కొంత వైట్ లో కొంత కొని ఎనిమిది కిలోలల పంచదార తెచ్చారు. సామాన్లన్నీ వచ్చేసాయి. రాత్రి మూడు గంట వరకు గాజర్ తురిమినా వుత్సాహంగానే వున్నాను. మొదటిసారికదా ఇంత పెద్ద ప్రయోగం చేయడం. ఉండదేంటి మరి.. పొద్దున పాలవాడు వచ్చేలోపల జీడి పప్పు వేయించి వుంచుదామని తీసాను. మళ్లీ దానిదో కథ. పదిరూపాయలకే కిలో అని ఇంటిముందుకు ఓ అమ్మాయి తెస్తే అందరమూ ఎగబడి కొనేసాము .ఆ తరువాత ఎవరికో అనుమానం వచ్చి కిలో జీడిపప్పు తూకం వేయిస్తే పూర్తిగా అర్ధ కిలో కూడా లేదు. ఇంకో కిలో కిస్మిస్స్ లు ఓ రెండు కిలోల నెయ్యిలో వేయించి, ఓ వంద గ్రాములు ఇలాచీలు పొడి చేసేసరికి పాలవాడు రానే వచ్చాడు .
మిసెస్ బల్బీర్ దగ్గరికి వెళ్ళి పెద్ద గిన్నె కావాలని అడిగాను, మరి ఆమె దగ్గరే కదా పెద్ద పెద్ద గిన్నెలున్నాయి. ఏం చేస్తావంటే గాజర్ హల్వా అన్నాను. ఎన్ని కిలోలు అంటూ చిన్న గిన్నె చూపిస్తే ఇది సరిపోదు నాలుగు కిలోలు అని గొప్పగా చెప్పాను. పెద్ద గిన్నె తీసి ఇస్తూ, “ఇత్నా కర్ సక్తీ క్యా?” అనగానే ఎంత కోపం వచ్చిందో ! ఇంత చేస్తున్నానని కుళ్ళుకుంటోంది. అందుకే మనం వంట చేసేటప్పుడు ఎవ్వరినీ రానీయద్దు అనేవారు అత్తయ్య గారు అనుకొని జవాబివ్వకుండా గిన్నె తీసుకొని వచ్చేసాను. కిరోసిన్ స్టవ్ వెలిగించా.. మరి అప్పుడు మాకు గాస్ కొరత అందుకే చాలా పొదుపుగా వాడే వాళ్ళము, గిన్నెలో నాలుగు కిలోల గాజర్ తురుము, నాలుగు  కిలోల పంచదార , ఎనిమిది కిలోల పాలు కలిపి పెట్టేసి , బట్టలు సర్దుకోవటము మొదలు పెట్టాను. మరి సాయంకాలము నాలుగింటికే ట్రైన్. అప్పటికి పన్నెండైంది . భోజనాలయ్యాయి,సద్దుళ్ళాయాయి .టైం అయిపోతోంది. కాని హల్వానే కొంచం కూడా చిక్కబడలేదు. అలాగే ఉంది. అలిగిన పెళ్లాంలా ! ఏంచేయాలి ? ఎవరికిద్దామన్నా అందరూ సెలవల్లో వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఆపత్ భాంధవి మిసెస్ .బల్బీర్ వచ్చి అయ్యిందా అని అడిగింది. ఏడుపు మొహం వేసుకొని చూపించాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి అడగటమెందుకో ? అని గొణుక్కుంటూ ఉండగా,ఇంకో రెండు గిన్నెలు తెచ్చి మొత్తం కలిపి, మూడు గిన్నెలలోకి సర్ది, గాస్ స్టవ్వుల మీదికి కూడా ఎక్కించి నువ్వు ఒకటి కలుపు నేను రెండు కలుపుతాను అని చక చకా కలపటము మొదలు పెట్టింది. హమ్మయ్య ఎలా అయితేనేం సరిగ్గా ట్రైన్ టైమ్ కి పూర్తి చేసి, ఆవిడ దగ్గరే వున్న ఓ పెద్దకాన్లో సర్ది ఇచ్చింది. ఏమో అనుకున్నాను కానీ, పాపం ఆ గిన్నెలు కూడా ఆవిడే తోమేసుకుంది. అంత వేడి వేడి హల్వా ఎలా తీసుకెళ్ళామని మటుకు అడగొద్దు. కాన్ వేడి చురకలు తగిలించుకొని కూలీ మమ్మలినెంత తిట్టాడో చెప్పలేనుగా ! రుచి అంటారా నాలుగు కిలోల గాజర్, నాలుగు  కిలోల పంచదార, ఎనిమిది లీటర్ల పాలూ, రెండు కిలోల నెయ్యీ, కిలో అనుకున్న అర్ద కిలో జీడిపప్పూ,కిలో కిస్మిస్ ,25 గ్రాములకు తగ్గని ఇలాచీ పొడీ తో ఆరుగంటలు వుడికిన హల్వా బాగుండక ఏమౌతుంది .
ఇంక ఫాన్ ఆఫ్ చేసి, ప్రస్తుతానికి వస్తే, ఇప్పుడు నేను చేసే గాజర్ కా హల్వా ;
కిలో గాజర్,
కిలో పంచదార,
1/2 కిలో కోవా లేదా కలాకండ్,
ఓ కప్పు వేడి నెయ్యి,
జీడి పప్పు ,కిస్ మిస్స్ మన ఇష్టం , కొద్దిగా ఇలాచి పొడి.
ముందుగా గాజర్ తురుము, పంచదార కలిపి స్టవ్ మీద పెట్టాలి. పంచదార కరిగి కొంచం దగ్గర పడ్డాక కోవా కాని , కలాకండ్ కాని వేసి దగ్గరకి వచ్చేదాకా కలుపుతూ వుడికించాలి. దగ్గర పడ్డాక ముందుగా నేతి లో వేయించి వుంచుకున్న జీడి పప్పు, కిస్మిస్ ,ఇలాచిపొడి కలిపి ,వేడి నెయ్యి కూడా కలిపి ఓ ఐదు నిమిషాలుంచి తీసేయాలి. కొంచము వేడిగా తింటే అహా ఏమి రుచి , కారా మైమరచి..
( ఈ మధ్య గాజర్ బజార్ లో చాలా కనిపిస్తున్నాయి.పాపం మీరు చేసుకుంటారని :) )




Monday, July 13, 2009

తొలకరి (తడిసి చూడు )

వాన లో తడుస్తూ హీరో,హీరొయిన్లు పాటలు పాడు కోవటము ,పాత సినిమాల నుండి ఇప్పటి వరకూ వుంది. డైరక్టర్లు తమ తమ ఐడియా లు,ప్రతిభలను బట్టి ఆ సీనులను పండించటనికి,ముఖ్యముగా హీరోయిన్లను తడి పొడి బట్టలలో అందముగా చూపటాని కి శక్తి కొలది ప్రయత్నిస్తునే వున్నారు. కాని,శ్రీ 420 లో ప్యార్ హువా పాటలో రాజ్ కపూర్ ,నర్గీస్ ని చూపించినంత అందముగా ఎవ్వరూ చూపించలేదేమో ! అసలు రాజ్ కపూరే తన తరువాతి హీరోయిన్లను ఇంత అందముగా ,డిగ్నిఫైడ్ గా ప్రెజెంట్ చేయలేదు.ఆ వాన లో గొడుగు లో తడుస్తూ నడవటము,ఆ పై రోడ్ పక్కన టీ వాలా దగ్గర ఒన్ బై టు టీ తాగటము,వాహ్ క్యా సీన్ హై ! అదే పాట చివర లో ముగ్గురు పిల్లలు రైన్ కోట్ వేసుకొని వెళుతారు.వాళ్ళు రాగానే ప్రతివాళ్ళూ ,వాళ్ళు రాజ్ కపూర్ పిల్లలు అని పక్కవారి తో చెప్పటము పరిపాటి.

మా చిన్నప్పుడు ఆత్మ బలం సినిమా లో చిట పట చినుకులు పడుతూవుంటే పాట లో ,నాగేశ్వర రావు, బి.సరోజా దేవి చాలా రొమాంటిక్ గా చేసారని ఓ తెగ చెప్పుకొని,పిల్లలని ఆ సినిమా కి వెళ్ళకుండా కట్టడి చేసారు.పెద్దయ్యాక సుదర్షన్ థియేటర్ లో మార్నింగ్ షో వస్తే ఇప్పుడు మనల్న్ని ఎవరు ఆపుతారూ అని ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము. కాని చాలా నిరాశ చెందాము.

వానలో తడవటము, వాన నీళ్ళలో కాగితం పడవలు వేయటము చేయని వారు, తడి మట్టి వాసనని ఆస్వాదించనివారు ఎవరూ వుండరేమో 1 తిరుపతి కొండ మీద సుప్రభాత దర్షనం తరువాత బయటకి వస్తే ,చాలావరకు తుంపరలు పడుతూనే వుంటాయి.ఆ తుంపరలలో తడుస్తూ ,వేడి వేడి కాఫీ తాగుతూ నడవటం చాలా బాగుంటుంది. సాయంకాలం వానప్పుడూ పేపర్ ని కోన్ లా మడిచి ,దాని లో వేసిన మరమరాలూ,మామిడికాయ ముక్కలూ కలిపిన మిక్స్చర్ తింటూ నడుస్తూ పోతూ వుంటే కాటేజ్ ఎంతదూరమో కూడా తెలియదు.అసలు ఆ మిక్స్చర్ టేస్ట్ తిరుపతి కొండ మీద ,ఆ వాన లో ఆ నడక లో తప్ప ఇంకెక్కడా రాదు.

ఎండా కాలం మల్లెలూ,మామిడి పండ్లూ ,కొత్తావకాయా, మామిడికాయ పప్పూ,గుమ్మడి వడియాలూ చల్ల మిరపకాయల కాంబినేషన్ అవుతే, వానాకాలం చామంతిపూలూ ,కొత్త చింత కాయ పచ్చడీ, వేడి వేడీ పకోడీలూ,పొగలు కక్కే టీ ,ఓ నచ్చిన నవల కాంబినేషన్ అదుర్స్.

మల్లెల పరిమళం మరువక ముందే సన్నని సువాసనలు వెద జల్లుతూ ,బంగారు కళికలు రాసులు పోసినట్లు చామంతులు రానే వస్తాయి. ఎన్ని రకాలో ! పచ్చ చామంతి, తెల్ల చామంతి, కస్తూరి చామంతి,చిట్టి చామంతి ఇంకా ఎన్నో ఎన్నెన్నో రంగులు. అదేమిటో కస్తూరి చామంతి కనుమరుగైంది.ఎక్కడా దర్షనాలు లేవు.పచ్చ చామంతి, ఎర్ర మందారాలూ కలిపి దేవుడిని అలంకరిస్తే దేవుడు కళ కళా, తళ తళా .

అరె రే అదిగో మబ్బులు కమ్మేసాయి. సన్న చినుకులు మొదలయ్యాయి.

ఏమండీ, వానొచేట్టుగా వుంది, పకోడీలు చేయనా ?

చేయి.

సెనగ పిండి,

కొద్దిగా వరి పిండి,

సన్నగా పొడుగ్గా కోసిన ఉల్లిపాయ ముక్కలూ,

సువాసన కోసం ఓ పచ్చిమిరపకాయ ముక్కలూ,

కరివేపాకు,

జీలకర్ర,

ఉప్పూ,కారం అన్ని వేసి, కొద్దిగా వేడినూనె వేసి,గట్టిగా నీళ్ళతో కలుపుకొని సన సన్నటి , కర కర లాడే పకోడీలు చేసి

మా వారికిస్తే హాయిగా పకోడీల రుచి ని ఆస్వాదిస్తూ ,సెల్ లో, సురేంద్రా వాన వొచ్చేట్టుగా వుంది,బ్రేక్ డౌన్ వర్క్ లు వస్తాయేమొ గాంగ్ రేడీగా వుంచు,అని చెపుతున్న మాఅయిన్ని చూసి హూం బొత్తిగా కలాపోసన లేదు అనుకుంటూ,ఓ ప్లేట్ లో వేడి వేడి పకోడీలు ,గాజు గ్లాస్ లో పొగలు కక్కే టీ (ఈ కాలం లో టీ గాజు గ్లాస్ లో కాని ,స్టీల్ గ్లాస్ లో కాని తాగాలి ) మల్లాది వెంకట కృష్ణ మూర్తి కొత్త నవల తాడంకి- ది థర్డ్ తీసుకొని బాల్కనీ లో కి వెళ్ళగానే రా రమ్మంటూ తొలకరి జల్లు పలకరించింది.


ఎనాళ్ళ కొచ్చావే వానా వానా

Tuesday, July 7, 2009

ఆంకొపరి వార్సికోత్సవం



-->
బామ్మా
ఏమిటి రా?
నా పాస్ వర్డ్ ఏమిటి ?
నీ పాస్ వర్డ్ నాకేమి తెలుసు రా?ఐనా కంప్యూటర్ గురించి నాకేమీ తెలీదు.
నీకు కంప్యూటర్ తెలీదా?
తెలీదు.
నువ్వు కంప్యూటర్ మీద గేంస్ ఆడవా?
ఆడనుగా
మాజాంగ్?
అది మా ఫ్రెండ్స్ తో ఆడుతానుగా .అసలు నాకు కంప్యూటర్ గురించి తెలీదు.వాడటం రాదు.
ఇంత పెద్ద దానివి కంప్యూటర్ రాదా?
అబ్బ రాదన్నానుగదరా! ఇన్ని సార్లు అడుగుతావు.
ఐతె నెర్చుకో నేను నేర్పిస్తాను.
నాకేం వస్తునందిరా?
వస్తుంది నేర్చుకో .
ఇది సంవత్సరము కిందట నాకు మా మనవడి కి జరిగిన సంభాషణ.మావారి లాగే వాడూ ఏదైనా చెప్పటము మొదలు పెడితే ఆపడు.ఇక గంట గంట కీ షంటటము మొదలు పెట్టాడు.వాడి గోల పడలేక మా అమ్మాయి ని ,వెబ్ సైట్ ఓపెన్ చేయాలంటే ఏంచేయాలి అని అడిగాను. ఏమిటీ అంది?అంది అదే అమ్మమ్మా .కం లో లా అన్నాను.
అంటే నువ్వు కూడా ఆవిడలా సలహాలిస్తావా? నా మొహం ,నాకేమి తెలుసని ఇస్తాను.మరి? ఏంచెప్పాలో తెలీలేదు.
బేటా ?,
ఏమిటి? మమ్మీ
కంప్యూటర్ లో మాజాంగ్ ఆడవచ్చట కదా ?
అవును ఆడుకుంటావా గబ గబా కంప్యూటర్ మీద మాజాంగ్ పెట్టేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
వావ్ కంప్యుటర్ మీద మాజాంగ్,కాని ఏలా ఆడటము? దాని మొహం చూస్తూ కూర్చున్నాను.
ఇదికాదు పని అనుకొని మా మనవరాలి ట్యూష టీచర్ అనిత కి ఫొన్ చేసాను.
అనితా అమీర్ పేట లో ఏవైనా కంప్యూటర్ నేర్పించే మంచి ఇన్స్టిట్యూషన్స్ వున్నాయా?
ఎవరి కి మాం?
నేనే నేర్చుకుందామని.
ఓ అయితే మా ఆఫీస్ కి వచ్చేయండి.
ఎక్కడి కో మార్చారని ట్యూషన్ కూడా మానేసావుకదా!
ఆఫిస్ మార్చారు,కాని ఇక్కడ చందనా బ్రదర్స్ షాప్ ,ఫొర్థ్ ఫ్లొర్ మీద ఇన్స్టిటూషన్ పెట్టారు. రేపు నేను అక్కడే వుంటాను మీరొచ్చేయండి.
మరునాడు పొద్దున్నే పన్లు చక చకా పూర్తి చేసుకొని ,శారద తో బయటికి వెళ్ళుతున్నానని చెప్పి బయటపడ్డాను.వెళ్ళేసరికి,అనిత పని చేసుకుంటోంది.రండి మాం మా సర్ ఎవరి తోటో మాట్లాడుతున్నారు.కాగానే వెళుదాము.ఈ లోపల మీ ఎకౌంట్ ఒపెన్ చేస్తాను.అని కంప్యూటర్ మీద గబ గబా ఏదో చేసి మీ ఎకౌంట్ చేసాను అంది.ఐతే ఇక్కడ ఫీజ్ ఈ ఎకౌంట్ లో కట్టాలన్నమాట. అని అనుకుంటుండగానే వాళ్ళ సర్ పిలిచారు.
సర్ ఈవిడ నేను ట్యూషన్ చెప్పే పాప వాళ్ళ బామ్మ గారు,కంప్యూటర్ నేర్చుకుందామని వచ్చారు.
ఓ వెరీ గుడ్.చెప్పండి ఏం కొర్స్ చేస్తారు?
నాకు కొర్స్ లేమీ వద్దండీ,నేను జాబ్ చేద్దామని కాదు,అసలు కంప్యూటర్ ఎలా వాడాలి ?అనేది తెలుసుకుందామని.అంటే కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు.
సరే నని ఒకబ్బాయి ని పిలిచి,ఇతని పేరు నరేష్ బాబు,అని అతనితో ఈవిడ మన దగ్గర కంప్యూటర్ కోర్స్ చేయటాని కివచ్చారు. పెద్దావిడ(అంత పెద్ద దాని లా కనిపిస్తున్నానా?) నేర్చుకోవటాని కి ఓపిక గా వచ్చారు.జాగ్రత్తగా నేర్పు అని చెప్పారు.
తిరిగి నాతో ఎప్పటి నుంచి రాగలరు ?
మీరెప్పుడంటే అప్పుడే .కాని పొద్దున 10 నుంచి 12 వరకు రాగలను .మా మనవడు 12.45 కి వస్తాడు(ఓ అరగంట అమ్మీర్ పెట్ లో దిక్కులు చూడొచ్చని ఆశ) .అన్నాను.
కాని ఆకొద్ది సమయము సరిపోదే!
సరేనండి 12.15(పావు గంట దిక్కులు త్యాగం) వరకు ఉండగలను.
రేపు మంచి రోజు మీకు నమ్మకం వుంటే రేపటి నుంచి మొదలు పెడదామన్నారు.
సరేనని ,మరునాడు పొద్దున్నే చక చకా పనులన్నీ ముగించుకొని, 10 కల్లా వెళ్ళాను.నిన్నేదో ఉత్సాహం లో అలమార లిఫ్ట్ లోనుంచి పైకి వెళ్ళాను కాని ఇప్పుడు దాన్ని చూడగానే గుండె గుబ్బిల్లుమంది.ఎలా ఫొర్థ్ ఫ్లొర్ కి వెళ్ళటము? పైకీ కింది కి చూస్తున్నాను.ఇంతలో సెక్యురిటీ గార్డ్ వచ్చి క్యా చాహియే మేడం? అన్నాడు.
ఫొర్థ్ ఫ్లోర్ కొ జానా హై.
ఇదర్ లిఫ్ట్ హై మేడం.
యే ఏకీ హై క్యా?
అతను నావైపు విచిత్రం గా చూసి హౌ మేడం అన్నాడు.
చందనా బ్రదర్స్ కె అందర్సే ఎస్కలేటర్ సే జాసక్తే క్యా?
నై .
స్టెప్స్ కిదర్ హై?
యే హై. క్యో మేడం లిఫ్ట్ మె జావోనా ?
ఏం చెప్పను అతనికి?
పది రోజు లలో నేర్చుకోలేనా ?ఈ పది రోజులు మెట్లెక్కి వెళితే సరి.కాస్త శరీరమూ తగ్గుతుంది.ఓ రెండు రోజు లైతే అదే అలవాటు అవుతుంది అనుకొని ,నా వైపు వింత గా చూస్తున్న సెక్యూరిటీ గార్డ్ ని పట్టించు కోకుండా ,అసలు ఈ అలమారా లిఫ్ట్ లు ఎవరు కనిపెట్టారు?,హాయిగా కట కటా ల లిఫ్ట్ లైతే బాగుంటాయి కదా అని తిట్టుకుంటూ ఆపసోపాలు పడుతూ నాలుగు అంతస్తులూ ఎక్కి వెళ్ళా ను.
ఇక నరేష్ బాబు క్లాస్లు మొదలయ్యాయి.12 గంటలకి క్లాస్ అయ్యాక నరేష్ బాబు కూడా నాతోటే బయటి కి వచ్చాడు.మెట్ల వైపు నడుస్తున్న నాకు మేడం ఇటు లిఫ్ట్ వుంది అన్నాడు.నేను మొహమాటం గా నవ్వి మెట్ల వైపు నడిచాను.
మరునాడు సేం టు సేం.ఖమ్మ సంఘం ఆవరణ లోంచి ఎవరో మేడం అని పిలిచారు. ఏమిటా అని చూస్తే ఎవరో మేడం లిఫ్ట్ ఇటుంది అని చెపుతున్నారు.విననట్లు వెళ్ళి పోయాను.ఇలా రోజూ ఎవరో వకరు చెప్పటము, నేను అంజాన్ కొట్టటము .అసలెవరన్నారూ పక్కవాళ్ళే మవుతున్నా ఎవరూ పట్టించుకోరని? పి.వి.ఆర్ లో ఐదు అంతస్తులు ఎక్కి, ఐదు అంతస్తులు దిగి ,ఇంటికి వచ్చాక ,ఇక జన్మ లో నీతో సినిమా కి రాను అని ఏమండీగారి తో ప్రతిజ్ఞ చేయించిన ఘన చరిత్ర నాది మరి. మెట్లెక్కుతూ, దిగుతూ అడ్విల్ టాబ్లెట్ వేసుకుంటూ క్లాస్లు అటెండ్ అవుతూ ,రోజులు లెక్క పెట్టుకుంటూ,నాలుగు రోజులు గడిచాయి.ఇక ఏమండీ  కి అనుమానం వచ్చి,రోజూ ఎటెళ్ళుతున్నావు, మొహం అట్లా పీక్కు పోయింది,మళ్ళీ గుళ్ళో 108 ప్రదక్షణలు చేస్తున్నావా అన్నారు .కంప్యూటర్ నేర్చు కొని ఒక్కాసారే అందరి నీ హాచర్య చకితుల్ని!చేద్దామను కున్న నా అభిప్రాయం మార్చుకొని క్లాస్ల సంగతి, లిఫ్ట్ సంగతి చెప్పక తప్పలేదు.కంప్యూటర్ నేర్చుకుంటున్నావు బాగానే వుంది కాని, లిఫ్ట్ సంగతి నేనేమి చేయలేను అని పాపం రోజూ వెళ్ళి రావటాని కి కార్ ఇచ్చారు.
నరేష్ బాబు చెప్పే విధానాని కైతే నేమి,మా నస మాస్టర్ల (మావారు, మనవడు ) వలనైతే నేమి ఒకటొకటి గా నేర్చుకున్నాను.వెబ్ సైట్, అకౌంట్ ఏమిటో తెలిసాక నామీద నాకే నవ్వొచ్చింది.కాపీ, పేస్ట్ కోసం శ్రీ రామా ఎన్నిసార్లు చేసానో! ఇదెందుకు, అదెందుకు , అంటున్నా వినకుండా యం.యస్ ఆఫీస్ దాకా గుంజుకొచ్చాడు నరేష్. పదిహేను రోజులనుకున్న దాన్ని మూడు నెలలు వెళ్ళాను.ఇంకా ఫొటో షాప్ ,మాయ వగైరా కూడా నేర్పుతానన్నాడు .కాని,అప్పటికే లిఫ్ట్ భయం జాగ్రత్త చేసు కుంటూ మెట్లెక్కుతూ దిగుతూ అడ్డం పడకుండా ఎలాగో నెట్టుకొచ్చాను.మావాడి పాస్ వర్డ్ గుర్తుంచుకోవటము వచ్చింది.కంప్యూటర్ గురించి కొద్దో గొప్పో తెలిసింది. కొన్ని రోజులైయాక మళ్ళీఈ వస్తానులే అన్నాను. కాని నేను మళ్ళీ వెళుదామను కునేసరి కి వాళ్ళు అక్కడి నుంచి మారిపోయారు.
ఇంట్లోనే అనితా దగ్గర ,మా అబ్బాయి దగ్గరా మళ్ళీ కోచింగ్ మొదలు పెట్టాను.ఎంత నేర్చుకున్నా అప్పుడు తెలిసి నట్లె వుంటుంది కాని ,సందేహాలు బోలెడు !
ఇక మా ఆంకోపరి షేరింగ్ ఆటో .చూసారుగా దాని మీద ఎంతమంది వున్నారో ,హోటల్ లో మనమెప్పుడు టేబుల్ ఖాళీ చేస్తామా అని చూసేవాళ్ళ లాగా !
ఎంత కష్టపడి నేర్చుకున్నానో కదా !
హాపీ ఆంకోపరి ( లాప్ టాప్) వార్సికోత్సవ డే టు మి.