Showing posts with label ఆనందం. Show all posts
Showing posts with label ఆనందం. Show all posts

Sunday, December 17, 2017

ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)














ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)
"ఎప్పుడెళుతున్నావు సభలకు ?" అని అడిగారు ఏమండి.
"హుం నేనేమి వెళుతాను ? ఓ నాలుగు రోజులాగి వెళ్ళవచ్చుగా పి.యస్.యం గారు.ఉమ్హు సరిగ్గా సభల ముందే యు.యస్ వెళ్ళారు. జి.యస్.లక్ష్మిగారు బిజీట.మీరు రానన్నారు.కనీసం రిజిస్టర్ చేయించుకోమన్నా చేయించుకోలేదు.నేనొక్క దాన్ని ఏ వెళుతాను?" నిట్టుర్చాను.
కాసేపు ఇద్దరమూ పేపర్ చూడటం లో మునిగిపోయాము.సడన్ గా "నేను ఈ నాలుగు సెలెక్ట్  చేసాను ."అన్నారు ఏమండి.
"ఏమిటి?ఎందుకు?"
"నువ్వు తెగ ఫీలైపోతున్నావుగా అందుకు సభలకు వెళుదామని ఈ ప్రోగ్రాంలు సెలెక్ట్ చేసాను.పద వెళుదాము ."
"అబ్బా కవి సమ్మేళనాలా ? హాస్యావధానానికి వెళుదాము.ఐనా మీకోసం ఫాం తీసుకొని, ఆధార్ కార్డ్, ఫొటో తీసుకొని వచ్చినా రిజిస్టర్ చేయించుకోలేదు.మరి మిమ్మలిని రానిస్తారో లేదో"నా సందేహం.
"పరవాలేదు లే నా ఐడి కార్డ్ తెస్తాను.రానీయకపోతే తిరిగి వచ్చేద్దాం"భరోసా.
అంతే చెంగున లేచి అలమారా తీసి ఏమి చీర కట్టుకోనబ్బా అనుకుంటూ ఇక్కత్ సారీ కట్టుకుందాము తెలంగాణా అభిమానం ఇలా చాటుకుందాం డన్ :)
హాస్యావధానం చూద్దామనుకుంటూ రవీంధ్రభారతి చేరాము.కార్ బయటనే ఆపేసారు. లోపల జనం హడావిడిగా తిరుగుతున్నారు. ఒక చోట క్యూ కనిపించింది.మరి ఏమండీగారి కి రిజిస్ట్రేషన్ చేయించాలి కదా అని అక్కడికి వెళ్ళి ఈ క్యూ ఎందుకు అని అడిగాను.ఇది ఎంప్ల్యాస్ క్యూ అని సమాధానం వచ్చింది.మరి రిజిస్ట్రేషన్ ఎక్కడ అంటే రిజిస్ట్రేషన్ లు ఐపోయాయి.అన్నారు.ఇంకో కౌంటర్ దగ్గర అడుగుతే రిజిస్ట్రేషన్ లేకపోయినా వెళ్ళవచ్చు అన్నారు.మరి ఎక్కడా హాస్యావధానం అని వెతుకుతుంటే
"మీరు మాలాకుమార్ గారు కదూ" అని వినిపించింది.ఈ మహాసభలల్లో నన్ను గుర్తుపట్టి పలకరించేవారెవరు చెప్మా అని తెగ హాశ్చర్యపోతూ వెనక్కి తిరిగాను. ఓ అబ్బాయి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించాడు.ఎవరో గుర్తుపట్టలేకపోయాను.జానీ భాషా నమ్మా అన్నాడు.హోరినీ నువ్వా ?ఫొటోలల్లో గడ్డంతో గంభీరంగా ఉంటావు ఇంత చిన్న అబ్బాయివా అని ఇంకా బోలెడు హాశ్చర్యబోయాను!మా ఏమండీ కి పరిచయం చేసాను.ఈ అబ్బాయిని ఇంతకు ముందు చూసావా అని అడిగారు.జాని లేదండి ఫొటో చూసాను కదా అందుకే గుర్తుపట్టాను అని చెప్పి నవ్వి తన పుస్తకాలు ఇచ్చాడు.ఇంతలో ఇంకో ఆవిడ వచ్చి జానీ ని పలకరించారు.ఆవిడ ఇందిర అని ఒక రచయిత్రి అని పరిచయం చేసాడు జానీ. కుంచె అని ఇంకో కార్టూనిస్ట్ ను అతను మా ఫొటో తీసాక పరిచయం చేసారు.మీ కార్టూస్ చూస్తానండి అన్నాను కుంచె తో. అనుకోకుండా వీళ్ళను కలవటము ఆనందం అనిపించింది.
ఆ తరువాత మేము ప్రోగ్రాం చూద్దామని వెళుతుంటే మెట్ల దగ్గర అంతా హడావిడిగా ఉంది.విడియోలు, ఇంటర్వ్యూ లు ఎవరెవరో ఎవరెవరినో తీసుకుంటున్నారు.ఆ హడావిడి చూస్తూ లోపలికి వెళ్ళాము.అత్తలూరివిజయలక్ష్మి గారు హాస్యవధానానికి వెళుతున్నాను ఎవరైనా వస్తే రండి అని చెప్పింది గుర్తొచ్చి ఆవిడకు ఫోన్ చేసాను.హాస్యావధానం దగ్గర చాలా రష్ ఉందండి లోపలికి వెళ్ళలేకపోయాను మేన్ హాల్ లో ఉన్నాను ,మీరు ఇటొచ్చేయండి సీట్లు ఉన్నాయి మీకు పెడుతాను అన్నారు.నేనూ మా ఏమండీ వచ్చాము అన్నాను,మీకూ మీ ఏమండీకి కూడా సీట్లు పెడుతాను రండి అన్నారు.సరే అని, ఐనా ఆశ కొద్దీ హాస్యావధానం వైపు వెళ్ళాము.అస్సలు లోపలికి వెళ్ళే సందేలేదు.కిక్కిరిసిపోయి ఉన్నారు.వేడి గాలులు బయటకు వస్తున్నాయి. నాకు గాభరావేసి మెట్ల దగ్గరే నుంచుండిపోయాను.ఏమండీ మాత్రం తలుపు దగ్గర నిలబడి కాసేపు విని నవ్వుకుంటూ వచ్చారు. బాగుంది మనం ఇంకొంచం ముందు వస్తే లోపలికి వెళ్ళేవాళ్ళం అన్నారు. ఒకవేళ ముందుగా వచ్చి లోపలికి వెళ్ళినా ఆ రష్ కు బయటకు రాలేక లోపల ఉండలేక ఉక్కిరిబిక్కిరి ఐపోయేదానిని అమ్మో అనుకుంటూ ఎందుకూ నవ్వుతున్నారు ఏమిటీ జోక్ అన్నాను.
"ఒకావిడ పాయసం చేస్తూ వాళ్ళాయనను కిస్ మిస్ లు తెమ్మన్నదిట.ఆయన రోడ్ మీద ఒక మిస్ ను చూసి బస్ మిస్సయ్యాడుట." దాని మీద నడుస్తొంది అన్నారు :)
మేన్ హాల్ కు వెళుదామని వెళుతే ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోయాము అంత రష్.విజయలక్ష్మిగారికి ఫోన్ చేసి సారీ అండి లోపలికి రాలేకపోతున్నాము , మేము వెళుతున్నాము అని చెప్పి బయటకు వచ్చి ఊపిరిపీల్చుకున్నాము. బయట మెట్ల మీద ఓ అబ్బాయిని అడిగి ఫొటోలు తీయించుకొని లంచ్ కౌంటర్ వైపు వెళ్ళాము.అక్కడ మెళ్ళో రిజిస్ట్రేషన్ కార్డ్ ఉన్నవళ్ళనే రానిస్తున్నారు.మరి ఏమండీకి బిళ్ళ లేదుగా అందుకని దగ్గరలో ఉన్న పురానాధిల్లీ కి వెళ్ళి భోజనం చేసాము.
మిగితా వేదికలు కూడా అలాలా తిరిగొద్దాము అనుకొని ముందుగా యల్.బి స్టేడియం కు వెళ్ళాము.అక్కడ ఒక పోలీసు మా ఏమండీ కి బిళ్ళ లేదని ఆపేసాడు.ఆయన ఐ.డి కార్డ్ బయటకు తీయబోయారు ఇంతలో ఇంకో పోలీస్ వెళ్ళండి సార్ అన్నాడు.వాళ్ళు భార్యాభర్తల్లా ఉనారు ఆవిడనొక్కదాన్నే పంపటం ఎందుకని ఇద్దరినీ వెళ్ళమన్నాను అతను మొదటి పోలీస్ తో చెప్పటం వినిపించి ఔరా ముక్కూమొహం తెలీని వాళ్ళు కూడా నా బిక్క మొహం చూసి, నేను ఒక్కదాన్ని వెళ్ళలేనని కనుక్కుంటున్నారే! అనుకోవటం తప్ప నేనేమి చేయ్గలను!
గేట్ పక్కనే ఉన్న మ్యూజియం చూసుకొని వేదిక దగ్గరకు వెళ్ళాము.ఏమి ప్రోగ్రాంలు లేవు కదా ఎందుకు అన్నారు.ఐనా చూద్దాం అని తీసుకెళ్ళాను.సీటింగ్ అరేంజ్మెంట్ వేదిక అన్నీ చూసాను.అక్కడక్కడా కొంత మంది ఉన్నారు.వాళ్ళు ఏవో పనులు చేసుకుంటున్నారు.అక్కడే ఉన్న ఇద్దరబ్బాయిలను చూసి మాకు ఫొటో తీస్తారా అని అడిగాను.ఒకతను వచ్చి మమ్మలిని అటూ ఇటూ నిలబెట్టి ఫొటోలు తీసాడు.ప్రొఫెషన్ల్ లా తీసావు అని ఏమండీ జోక్ చేస్తే నవ్వుతూ నా సెల్ ఇచ్చాడు.అప్పుడు అతని బాడ్జ్ చూస్తే పోలీస్ అని ఉంది.నాలుక్కరుచుకొని హోరినీ పోలీస్ నే ఫొటో తీయమని అడిగానా అని సారీ అన్నాను.పరవాలేదు మేడం అన్నాడు అతను.మీరు యూనీఫాం లో లేరు సెక్యూరిటీ నా ? అంటూ ఏమండీ వాళ్ళతో కాసేపు ముచ్చట్లేసుకున్నారు.స్వజాతి అభిమానం :)
అక్కడి నుంచి స్టేడియం అంతా చుట్టేస్తూ వెనకవైపుకు వెళ్ళాము.అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.చాలావరకు మూసి ఉన్నాయి.కొన్ని స్వగృహ స్టాల్స్ అని తెరిచిఉంచారు.అక్కడ అన్నీ తెలంగాణా పలగారాలు (స్నాక్స్) అమ్ముతున్నారు .ఇంకొంచం లోపలికి వెళితే మన  కనిపించాయి. అన్నీ కిటకిటలాడిపోతున్నాయి.ఒక్కొక్కళ్ళు మోయలేనన్ని పుస్తకాలు కొని తీసుకెళుతున్నారు.చివరగా ఉన్న ఒక స్టాల్ లో ఒక పెద్దాయన ఒక్కరే ఉన్నారు.ఆయనతో ఏమండీ కాసేపు కబుర్లేసుకున్నారు.ఆయన విష్ణుసహస్రనామం పుస్తకం బొమ్మలతో , అర్ధం తో వేయించారు.అవి బయట ఎక్కడా చూడలేదు అని నేను అంటే ఆయన పుస్తకం అమ్ముకోవటంలోని ఇబ్బందులు, పబిషర్స్ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం చెప్పుకున్నారు.ఏమండీ అంతా ఓపికగా విని  500 లకు కొనుకున్నారు. ఆయన నన్ను మీరు పుస్తకాలేమీ వేయించలేదామ్మా అని అడిగారు.ఇదో మీరు చెపుతున్న సాధకబాధకాలు పడలేకే ప్రింట్ చేయించకుండా ఈ బుక్స్ తో సరిపెట్టుకున్నానండి అన్నాను నవ్వుతూ.నేనేమో సాఫ్ట్వేర్ అబ్బాయిలు కృష్ణచైతన్యవారి పుస్తకాలు  అమ్ముతుంటే పునర్జన్మం గురించిన పుస్తకం కొనుకున్నాను.
చిన్నగా బయటకు వచ్చేసరికి ఇద్దరికీ ఓపిక ఐపోయి ఇంక వేరే ఏ వేదికల దగ్గరకూ వెళ్ళ కుండా ఇంటికి వచ్చేసాము.అదీ సంగతి :)

ప్రపంచమహాసభల ఏర్పాట్లు అన్నీ చాలా ఘనంగా చేసారు.ప్రతినిధులుగా రిజిస్టర్ చేయించుకున్నవారికి ,బయటవారికి వసతి , రవాణా, భోజన ఏర్పాట్లు , వేదికల వద్ద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసారు.రిజిస్టర్ చేయించుకోని వారికి ప్రవేశము వుంది కాని , భోజనము , సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేవు.దూరంగా గాలరీలో కూర్చోవాలి.బాంబే నుంచి వచ్చిన మా ఫ్రెండ్ రమేష్ గారు మంచి హోటల్ లో ఇచ్చారండి.హోటల్ లోనే బస్ కూడా ఉంచారు వేదికల దగ్గరకు తీసుకెళ్ళేందుకు అన్నారు. పోలీస్ వారు కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు.మరి విమర్శలు వస్తున్నాయి అంటే, మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే పొరపాట్లు జరుగుతాయి మరి ఇంత పెద్ద ఫంక్షన్ లో జరగకుండా ఎలా ఉంటాయి.పొరపాట్లూ సహజమే!విమర్శలూ సహజమే! అవన్నీ పట్టించుకోకుండా మన ఊళ్ళో జరుగుతున్న ఇంత పెద్ద సాహితీ సదస్సును చూసి ఆనందిద్దాము అనుకుని వెళ్ళి వచ్చాము.

Tuesday, August 15, 2017

పొదరిల్లు





" అత్తగారిని హీరోయిన్ గా పెట్టి రాసేసిన భానుమతిగారు . వూళ్ళో వాళ్ళ మీద రాస్తే దెబ్బలాటకి రారూ ! మాఇంట్లో వాళ్ళమీద రాస్తే ఏగోలా ఉండదు అన్న బీనాదేవిగారు , తన బాల్యం .తనఫాక్టరీ నేపధ్యంగా ,తీసుకుని కధలు అల్లిన సోమరాజు సుశీలగారూ ,
తన పల్లెటూరూ తన అనుభవాలని కధల రూపంలో చెప్పే పొత్తూరి విజయలక్ష్మీ (అంటే నేనే )
వీళ్ళందరూ ఆకోవకే చెందుతారు . 
వీళ్లకధల్లో ఏముంది అని అంటే ఏమీ ఉండదు . కానీ పాఠకులకు వీళ్లంటే వల్లమాలిన అభిమానం . వీళ్ళ పుస్తకాలు బాగానే అమ్ముడవుతాయి . 
ఆ రచయిత్రుల్లాటి ఓ ఇల్లాలే ఈ మాలాకుమార్ . ఈవిడ అనుభవాలను అలవోకగా చెప్పటం తో.
అవన్నీ హాయిగా చదివిస్తాయి .
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సాహితి అనే బ్లాగ్ లో రాసుకున్న వన్నీ ఒక మాలగా కట్టి ఈ బుక్ గా మనకు అందిస్తున్నారు .
ఈ సువిశాలమైన సాహితీ ప్రపంచంలో ఇది నాతొలి ప్రస్థానం అంటూ భారీగా చెప్పలేదు .
నా చిన్నిప్రపంచం . పొదరిల్లు అన్నారు ఆమె తరహాలో .
నిజమే .పొదరింట్లో కి అడుగు పెడితే కలిగే అనుభవం వేరుకదా. " అని నా అభిమాన రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు ,
" ఎంతో తెలివైనపని చేసేననుకుని గొప్పలు పోయే అమాయకపు ముదిత ముచ్చటైన కబుర్లు వినాలన్నా, ముఖ్యంగా మురిసిపోతూ చెప్పే “ఏవండీ” గారి కబుర్లు ముగ్ధులై వినాలన్నా ఈ సాహితి పుస్తకం వెంటనే చదివెయ్యడం ఒక్కటే మార్గం." అని జి.యస్.లక్ష్మి గారు ( రచయిత్రి బ్లాగర్ ) ,
"షడ్రసోపేతమైన విందు ఆరగించబోతున్నారు కదా, దాని రుచి నేను చెప్పటమెందుకు. మీరే ఆస్వాదించండి.అని పి.యస్.యం లక్ష్మి గారు (రచయిత్రి,బ్లాగర్),

తన పిల్లల్లూ, తన పిల్లల పిల్లలూ వారి ముచ్చట్లూ గురించి రాస్తున్నప్పుడు సంపూర్ణమైన కుటుంబజీవితంలోని ఆనందాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించిన గృహిణిగా తల్లిగా కనిపిస్తారు. అలాగే కంప్యూటర్ నేర్చుకోవడంలో ఆవిడ పట్టుదల, పూల పెంపకంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ ఆవిడ సౌందర్యారాధనా - వెరసి పాఠకులకి ఒక చక్కని ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. " అని సీనియర్ బ్లాగర్ కొత్తపాళీ గారు అభినందించిన, (అడిగి పోగిడించు కున్నాను అని ఏమండి అంటున్నారు కాని ఆయన మాట వినకండి ) 

ఈ సాహితి నా స్వంతం . . నా ఊహల ప్రతి రూపం.. నా  చిన్ని ప్రపంచమైన నా కుటుంబములోని సరదా సంఘటనలను  పోడుపుకున్న చిన్ని పొదరిల్లు.ఈ  నా "సాహితీ" బ్లాగ్ పోస్ట్ ల తో చేసిన ఈ బుక్ "సాహితీ " నిన్న మా ఏమండి గారు ఆవిష్కరించారు. 
నా సాహితిని , నీ జతగా నేనుండాలి కథా సంపుటిని , అనగనగా ఒక కథ పుస్తక సమీక్శలను ఇంత చక్కగా , ఓపిక గా ఈబుక్స్ చేసి ఇచ్చింది మా కోడలు అను. తన ప్రోత్శాముతోనే తొమ్మిదేళ్లుగా నేనూ చేసుతున్న రచనలన్నీ ఈబుక్స్ గా మారాయి. థాంక్ యు అను. 
ఈ మూడు పుస్తకాలూ , ఇక్కడ సైడ్ బార్ లో ను , 

http://kinige.com/kbook.php?id=8242

https://telugu.pratilipi.com/read?id=4546056755347456


ఇక్కడా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు.  
నా పొదరింటి కి ఇదే స్వాగతం .

Friday, July 14, 2017

కూ . ..చుక్ . . . చుక్. . . చుక్




పుస్తకాలు సద్దుకుంటూ , భాను వైపు చూసాను.అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ  అని కూత  పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగినవెంటనే  వదల్లే . అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. అందులో నుంచి గార్డ్ మామయ్య దిగుతున్నాడు. మమ్మలిని చూసి నవ్వుతూ ఈ రోజు ఆలశ్యం అయ్యిందెందుకు అమ్మాయిలూ అని పలకరించాడు. మామయ్యా ఆ జెండా ఇవ్వవా అని ఆశ గా చూస్తూ అడిగాను. తప్పమ్మా మీకు ఇవ్వకూడదు అని పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి వెనక్కి కూ అని కూతేసుకుంటూ పరిగేట్టాము. డ్రైవర్ మామయ్యదగ్గరకు వెళ్ళాము. డ్రైవర్  మామయ్యా ఇద్దరికీ చెరొక గాజు గొట్టం ఇస్తూ ఇక  వెళ్ళండమ్మా అన్నాడు. అప్పుడేనా అనుకుంటూ ఆ చివరనుంచి ఈ చివర దాకా పెట్టలు లెక్కపెడుతూ పరుగెత్తి , పట్టాలు దాటి అవతలి ప్లాట్ ఫాం కు వెళ్ళాము. అక్కడ ఫ్లాట్ ఫాం చివర ఉన్న పసుపచ్చని బోర్డ్ మీద నల్లటి అక్షరాల తో రాసి ఉన్న “ మహుబూబాబాద్ “ అక్షరాలను  ఆరాధనగా చూసి, అవి అందుకుందామని ఎగిరాము .కాని ఊమ్హూ  అందలే. కాసేపు బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడున్న గానుగ చెట్టు చుట్టు పరిగెత్తాము .ఇంకా అలిసిపోయి ఇంటికి బయలు దేరాము. ఇంతలో ఎక్కడి నుంచో “ ... . . పోవు పాసెంజర్ కొద్దిసేపట్లో . . . “ అని వినిపించింది.  నా కాళ్ళు అప్రయత్నం గా ఆగిపోయాయి. చెవులు నిక్కబొడుచుకొని పూర్తి గా  విన్నాను. అబ్బ ఆ అమ్మాయి ఎంత బాగా చెపుతుందో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కాని నాకు అలా వినటం భలే ఇష్టం!  అది పూర్తయ్యే దాకా అక్కడి నుంచి కదిలేదానిని కాదు. నేనూ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మానుకోట లో ఇంటి కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ దాటి  వెళ్ళాల్సి వచ్చేది. అదో అప్పుడు అక్కడ నేనూ, నాఫ్రెండ్ భాను ఇలా అలిసిపోయే దాకా ఆడుకునేవాళ్ళం!  ఆ వెళుతున్న పాసెంజర్ ఎప్పుడు ఎక్కుతామా అనుకునే వాళ్ళం. అలా అనుకుంటూ అనుకుంటూ  మా నాన్నగారికి మానుకోట నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వరంగల్ వెళ్ళటానికి ఎక్కాము. ఆ డబ్బా లో అమ్మ, నాన్నగారు, నేనూ . అంతే ఇంకెవరూ లేరు. అందులో అద్దం  కూడా ఉంది.ఆ అద్దం  లో ఎన్ని సార్లు చుసుకున్నానో! అలా ఆ మానుకోట రైల్వే స్టేషన్ నా మనసులో ఉండిపోయింది.చిన్నపుడే రైలంటే ఏర్పడిన ఇష్టం మనసులో ఉండిపోయింది.చాలా ఏళ్ళవరకు ఎనౌన్సర్ గా జాబ్ చేయాలని కోరికగా ఉండేది.ఇప్పటికీ రైల్వే స్టేషన్ లొ ఎనౌన్స్మెంట్ వినగానే నా కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతాయి. చెవులు దోర విచ్చుకుంటాయి.
ఆ తరువాత చాలా ఏళ్లకు , పెళ్ళయ్యాక పాటియాలా వెళ్లేందుకు సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. మూడు రోజుల ప్రయాణం. అందులోనే స్నానం, భోజనం అన్నీ అంటే ఎంత వింతగా అనిపించిందో. ఫస్ట్ క్లాస్ కూపే,కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న స్తంబాలు,ఇల్లు, పొలాలు అన్నీ తెగ నచ్చేసాయి. మూడు రోజులు రైల్ లో ఉన్నా బోర్ కొట్టలేదు. ఆ తరువాత దేశం నలుమూలలా, కలకత్తా, డిల్లీ , మద్రాస్, పూనా , బొంబాయ్ మొత్తం తిరిగాము.  అప్పట్లో మొదటగా వచ్చిందిట భోగీల మధ్య కనెక్షన్ లేని రైల్ , ఆగ్రా నుంచి డిల్లీ .దాని లో సరదాగా ఈ చివర నుంచి ఆ చివరకు తిరిగాము. కొత్తగా వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గంగాకావేరి , బాంబే లో లోకల్ ట్రేన్స్ అబ్బో తనివితీరా ఎన్నిరైళ్ళల్లోప్రయాణం చేసానో! కాకపోతే డార్జ్ లింగ్ లో టాయ్ ట్రేన్ ఎక్కటమే పడలేదు ! సిలిగురి వెళ్ళేటప్పుడు ఆ రోజులల్లో  ఏ.సి భొగీ లు లేవు. మా అబ్బాయి మూడు నెలల వాడు.అమ్మాయి మూడేళ్ళది . మంచి ఎండాకాలం . వడగాలులు. కూపే కిటికీ కి పలచటి గ్లాస్కో దోతీ కట్టి, ప్రయాణం అంతా దానిని తడుపుతూ ఉన్నాము.  ప్రతి రైల్ స్టేషన్ లో అక్కడ దొరికే స్పెషల్స్ తింటం సరదాగా ఉండేది. కలకత్తా లో చిన్న చిన్న మట్టి ముంతలల్లో చాయ్, రసగుల్లాలు, ఇటార్సీ స్టేషన్ లో స్టీల్ గ్లాస్ లో గరమాగరం చాయ్, నాగ్ పూర్  లొ ఆరెంజెస్, లోనావలాలో చిక్కీ , బటాకా వడా, రాజమండ్రి లో ఆకుపచ్చని బత్తాయిలు, వైజాగ్ లో ముసలతని బండి మీది కందిపొడి, జాల్నా లో జామకాయలు ఇలా అన్నీ బాగుండేవి. అన్నింట్లోకి బాంబే వి.టి స్తేషన్ దగ్గర పావ్ భాజి, చాట్ , పానీ పూరీ , భేల్ పూరీ నాకు భలే నచ్చేవి. అంతేనా బరోడా నుంచి బాంబే వెళ్ళేటప్పుడు ఆ కాస్త ప్రయాణానికీ గుజరాతీ లు పెద్ద పెద్ద డబ్బాల నిండా స్నాక్స్ తెచ్చుకునేవారు.మాకూ తినమని పెట్టే ఆ చుడువా , ఘమండ్ , స్వీట్స్ అన్నీ చాలా టేస్టీ గా ఉండేవి. కేరళ, ఉత్తరప్రదేశ్ తప్ప దాదాపు భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుంచీ మా కూ. . . చుక్. . . చుక్ ప్రయాణించింది. ఈ రాష్ట్రం దాటాము, ఈ రాష్ట్రం లోకి వచ్చాము , రాత్రి పడుకున్నప్పుడు ఒక రాష్ట్రం లో, తెల్లారి లేచేటప్పటికి ఇంకో రాష్ట్రం లో, ష్టేషన్ లల్లో వివిధ భాషలు మాటలు గల గలా వినిపించటం అంతా తమాషా గా ఉండేది.

అలాగే రైలు ప్రయాణం లో ఎంతో మంది ప్రయాణికులు పరిచయము అవుతారు.అందులోనూ మా ఏమండీ అందరినీ పలకరిస్తారు . కాకపోతే రైలు దిగగానే వాళ్ళను మర్చిపోతాము అది వేరే సంగతి. కాని ఒక్క జంటను మాత్రము నేను ఇప్పటికీ మర్చిపోలేను . మాకు ఆగ్రా హోటల్ లో పరిచయం అయ్యారు.వాళ్ళూ మాలాగే కొత్త గా పెళ్ళైనవాళ్ళు. నలుగురమూ కలిసి టాక్సీ మాట్లాడుకొని ఆగ్రా అంతా తిరిగాము. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే , తాజ్ మహల్ దగ్గర నేను ఫొటో గ్రాఫర్ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను.నై నై భాభీ మై కీంచూంగా అని రకర్కలా ఫొజులల్లో మా ఇద్దరి ఫొటోలు తీసాడు. ఆ తరువాత డిల్లీ దాకా కబుర్లు చెప్పుకుంటూ , రైలంతా కలియ తిరుగుతూ కలిసి ప్రయాణించాము. మా ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు.పాటియాలా లో ఉన్నన్ని రోజులూ ఎదురు చూసాను ఆ ఫొటోలకోసం.రాలేదు. పక్కింటి మిసెస్.జగన్నధం కు వస్తాయేమో , వస్తే పంపించమని చెప్పాను . ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను ఆ ఫొటోల కోసం . ఆ తరువాత డిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ  ఆగ్రా వెళ్ళటం పడలేదు. సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన మటుకు గుర్తుండిపోయాడు !
అన్నింటి లో కి మరుపురాని ప్రయాణం పాటియాల నుంచి పూనా కు వెళ్ళింది. పెళ్లి తరువాత మొదటి సారిగా వెళ్ళింది పాటియాలా అయినా అక్కడ ఒక్క నెలనే  ఉన్నాము. అప్పటి కే పూనా పోస్టింగ్ వచ్చింది. పాటియాలా చూపించాలని తీసుకెళ్ళారు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాము. మా కొత్తకాపురం మొదలయ్యింది పూనా లో. పాటియాలా స్టేషన్ కు యూనిట్ వాళ్ళంతా వీడ్కోలు ఇచ్చేందుకు కుటుంబాలతో వచ్చారు. అందరమూ స్టేషన్ లో నిలబడి మాట్లాడుకుంటున్నాము. ఇంతలో ఇద్దరు జవానులు ఒక పెద్ద కర్ర కు మల్లె పూల దండలు వెళ్లాడదీసుకొని  చెరో వైపు పట్టుకొని మార్చ్ ఫాస్ట్ చేస్తూ వచ్చారు. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్  (c.o) ఒక దండ తీసుకొని మావారి మెళ్ళో వేసాడు. ఆతరువాత ఒక్కక్కరే వచ్చి ఆయనకు ధన్ మని సెల్యూట్ చేసి దండ వేసారు. నేను ఆశ్చర్యం గా చూస్తూ ఉండగా సి.ఓ గారి భార్య  నాకు పెద్ద బుకే ఇచ్చి , “ తుమారా జిందగీ హమేషా ఫూలే ఫలే రహే “ అంది. నాకు అప్రయత్నంగా కళ్ళల్లో  నీళ్ళొచ్చాయి. ఆ తరువాత ఆడవాళ్ళందరు నాకు బుకే లు ఇచ్చారు. జవానులొచ్చి , మా వారికి వేసిన దండలు , నాకిచ్చిన బుకేలు తీసుకుపోయారు.అయ్యొ తీసుకుపోతున్నారే అని మనసులొ బాధ పడ్డాను కాని ఏమీ అనలేదు. రైల్ కదిలాక తలుపు దగ్గర నిలబడి అందరికీ చెయి ఊపి లొపలికి వెళ్ళాము.అద్భుతం. మా దగ్గర తీసుకున్న మల్లెల దండలన్నీ , బుకేలనీ  కిటికీలకి, బర్త్ కి అలంకరించారు. యూనిట్ వాళ్ళు ప్రెజెంట్ చెసిన ఇత్తడి కాండిల్ స్టాండ్ ను తళతళా నెరిసేట్టుగా పాలిష్ చేసి , అందులొ కొవ్వొత్తులు వెలిగించారు. ఆకొవ్వొత్తుల వెలుగు, బయట నుంచి పడుతున్న దీపాల వెలుగు లొ ఆ కూపే ఎంత అందంగా ఉందో చెప్పలేను. కొత్త కాపురానికి తీసుకెళుతున్న పూలరధం లా ఉంది. ఆ ప్రయాణం మరుపురానిది.

అలాగే ఇంకోటి గుర్తొచ్చినప్పుడల్లా భయపెట్టేది. సిలిగురివెళ్ళి నప్పుడు , కలకత్తా లో రైల్ మారాల్సి వచ్చేది. కలకత్తా లో దిగాక నెక్స్ట్ ట్రేన్ కు టికెట్ కంఫర్మ్ అయ్యిందో లేదో కనుక్కొని వస్తాను అని మా వారు వెళ్ళారు. ఎంత కూపే కిటికీలకు గ్లాస్కో ధోతి కట్టి , తడుపుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చినా మా అబ్బాయి కి వడదెబ్బ తగిలినట్టయ్యి కందిపోయాడు.చాలా చికాకు చేసుకుంటున్నాడు. వాడిని సముదాయించటం లో సతమతమవుతున్నాను. ఇంతలో మావారొచ్చి ఏమిటీ సంజు ను ఇట్లా వదిలేసావు అని కోపం గా అడిగారు.నేను వదలటమేమిటి మీతో వచ్చింది కదా అన్నాను నేను. నా దగ్గర ఉందని ఆయన అనుకున్నారు.ఆయనతో వెళ్ళిందని నేను అనుకున్నాను. ఆయన వెనుక పరిగెత్తిందిట డాడీ అంటూ . ఆయన హడావిడి గా వెళుతూ వినలేదు. నా గుండె జారిపోయింది. మరి అని ఇక అడగలేక పోయాను. నేనూ డాడీ అని పరిగెత్తుతుంటే ఒక తాతయ్య చేయి పట్టుకున్నాడు అంది.ఆ పెద్దాయన దానిని ఆపి అటూ ఇటూ మాకోసం చూస్తున్నాడుట. మావారు తిరిగి వస్తూ చూసారు. మా అదృష్టం  ఎక్కువ దూరం వెళ్ళలేదు అందుకే దొరికింది . అమ్మో లేకపోతే అంత పెద్ద హౌరా ష్టేషన్ లో తప్పిపోతే ! బాబోయ్ తలుచుకుంటేనే ఇప్పటికీ వళ్ళు జలాదరిస్తుంది.
హైద్రాబాద్ వచ్చేసాక రైల్ ఎక్కే సందర్భాలు అంతగా రాలేదు . మావారి కాంట్రాక్ట్ పనులన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే కాబట్టి, ఎక్కడికెళ్ళినా కార్ లో , దూరం వెళ్ళాల్సి వస్తే విమానం లోనే వెళ్ళటం! చాలా ఏళ్ళతరువాత  మావారి ఫ్రెండ్ మనవరాలి పెళ్ళి కి బెంగుళూర్ రైల్ లో వెళుతున్నాము. నిన్న రాత్రి రైల్ ప్రయాణం, మళ్ళీ రేపు హైద్రాబాద్ లో పనుండటం వల్ల ఈ రోజే రైల్ ఎక్కాము. రెండు రాత్రులు వరుసగా ప్రయాణం చేసినా అలసటగా లేదు . బయటకు చూద్దామంటే ఏ.సి కంపార్ట్మెంట్ కావటం తో అద్దాలు బిగించి ఉన్నాయి.అంతా మసకగా తప్ప ఏమీ కనిపించటం లేదు. ఆ రోజులల్లో నా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసే పిచ్చిని పాపం మావారు ఎంత భరించారో ! ఎక్కడికెళ్ళినా మూడు రోజుల ప్రయాణం తప్పనిసరి.అన్ని రోజులూ నేను వదలకుండా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఊహలల్లో ఉంటే పాపం ఆయనే పిల్లలను ఎంగేజ్ చేసేవారు. చీకటి పడింది. అందరూ కబుర్లాపి పక్కలేసారు. పెద్ద లైట్ ఆపేసి చిన్న బ్లూ లైట్ వేసారు. అంతటా నిశబ్ధం  నేనూ పడుకున్నాను కాని నిద్ర రావటం లేదు . బయటకు చూస్తే చీకట్లో అక్కడక్కడ దీపాలు మిణుక్కుమంటున్నాయి.పక్కకు తిరిగి పడుకున్నాను. రైల్ చక్రాలు లయబద్ధంగా కదులుతున్నాయి. వాటి తో పాటే సాగిపోతున్నాయి నా మది లోని మధురానుభూతులు అలా. . .అలా. . .

Monday, April 24, 2017

అత్తయ్య మామయ్య





మా మామయ్య చింతలపాటి వెంకట కృష్ణారావుగారు మా అమ్మకు బాబాయిగారి అబ్బాయి,అన్నయ్య.మా అత్తయ్య చింతలపాటి సీత మానాన్నగారి ఏకైక చెల్లెలు,మా మేనత్త.మామామయ్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి.ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్గా రిటైర్ అయ్యారు.ఉద్యోగం చేస్తున్నరోజులల్లో పసర,నాగోలు,రంపచోడవరం,కొత్తగూడెం దగ్గర, బూర్గుంపాడ్ దగ్గరి వివిధ గ్రామాలల్లో అనేక సంక్షేమకార్యక్రమాలు చేపట్టారు.అక్కడ అడవులల్లో నివసిస్తున్న గిరిజనులకు స్కూల్స్ కట్టించటము,వ్యవసాయ నీటి వనరులు ఏర్పరచటం, పాలకేంద్రాలు పెట్టటం మొదలైనవి చేయించారు.పసర లో పెట్టిన పాలకేంద్రానికి"క్షీరాబ్ధి"అని పేరు పెట్టారు.ఆయా ఊర్లకు వెళ్ళినప్పుడు ఏ కరణం ఇంటికో వెళ్ళటం కాకుండా సరాసరి గిరిజనుల ఇంట్లోకే వెళ్ళేవారు.వారి తో పాటే వారు పెట్టిన భోజనం చేసేవారు.ఎవరి నుంచీ ఏమీ ఆశించేవారు కాదు.కొన్ని సార్లు మా అత్తయ్య కూడా వెంట వెళ్ళేది.అప్పుడు ఓ పెట్టలో వంటకు కావలసిన సామాగ్రి అంతా తీసుకెళ్ళి, ఏ చెట్టు కిందో, మూడురాళ్ళు పెట్టి, కట్టెలతో వంట చేసేదట.ఓసారి ఒక చింత చెట్టు నిండా చిగురు ఉంటే అత్తయ్య బాగుందనుకుంటే అక్కడి గిరిజనులు కోసి ఇచ్చారట.వెంటనే మామయ్య మనము వాళ్ళకు ఇవ్వటానికి వచ్చాము కాని తీసుకోవటానికి రాలేదు అని అత్తయ్యను కోపం చేసి చింతచిగురు తిరిగి ఇచ్చేసారట.పెట్టెలో చింతపండు ఉంది,పప్పులో వేసి గట్టిగా చేస్తే పప్పు, నీళ్ళగా చేస్తే పప్పుచారు అవుతుంది,ఆ చిగురు ఎందుకు అడిగాను అని అభిమానపడిందిట అత్తయ్య!ఇది మామయ్య నిరాడంబరతకు ఓ ఉదాహరణ.
మామయ్య 45 సంవత్సరాలు "నెలనెలావెన్నల" అని కవిసమ్మేళనాలు,మితృఅమండలి సమావేశాలు నిర్వహించేవారు.వర్ధమాన కవులందరూ ముందుగా తమ కవితలను నెలనెలావెన్నెలలోనే చదివేవారు.మామయ్య రిటైర్ ఐయి హైదరాబాద్ వచ్చాక నెలనెలావెన్నల చాలామంది సభ్యులతో సాగింది.సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పొత్తూరి వెంకటేశ్వర రావు గారు,వాడ్రేవు చినవీరభద్రుడు గారు,దీవిసుబ్బారావుగారు,ముకుంద రామారావుగారు,రేణుకా అయోలాగారు,వాసాప్రభావతిగారు,మృణాళిని గారు,కొండెపూడి నిర్మల,శీలంవీర్రాజు గారు మొదలైన వారంతా కలిసి నెలనెలావెన్నలని జరుపుకునేవారు.ప్రస్తుతము కొంచము వినికిడిసమస్యల వల్లా,కొద్దిగా వయసుమీదపడటము వల్లా ఈ సమావేశాలు నిర్వహించలేకపోతున్నారు.అయినప్పటికీ ఆయన అభిమానులు అప్పుడప్పుడూ వచ్చి వారి కవితలు వినిపించి వెళుతుంటారు.
నేను కథలు వ్రాస్తున్నానని తెలిసి చాలా సంతోషించారు.నాదేముంది ,ఆయన వేసిన సాహితీవనం లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న చిరు మొలకని.అందుకని ఈ రోజు ప్రస్తుతం కూతురు పార్వతి వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తయ్యమామయ్యల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలని ఇచ్చాను.ఇలా పెద్దవారికి ఇచ్చేందుకే మా ఏమండీ , నా ఈ బుక్స్ ను కొన్ని ప్రింట్ ఔట్ చేయించారు మరి.చాలా సంతోషంగా నా పుస్తకాలను  అందుకొని ,అప్పటికప్పుడే తిరిగేసారు అత్తయ్య మామయ్య.
మా అత్తయ్య ఎప్పుడు నన్ను చూసినా చాలా ఎమోషనల్ అవుతుంది.ఆమె తిరిగే రోజులల్లో కనీసం నెలకోసారైనా వచ్చి నన్ను చూసి వెళ్ళేది.ఇప్పుడు నేను వెళుతున్నా అంత ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాను.అత్తయ్య తో నాన్నగారి జ్ఞాపకాలను పంచుకోవటము, నాన్నగారి చిన్నతనము గురించి తెలుసుకోవటమూ నాకు ఇష్టము.ఈ రోజు మా అన్నయ్య ఫొటో ఒకటి తెచ్చి ఇవ్వవా అని అడిగింది.ఈ బుక్ లో ఉందత్తయ్యా అని అనగనగా ఒక కథ పుస్తకం లో ఉన్న నాన్నగారి ఫొటో చూపించాను.ఇది కాదు మా అన్నయ్య ఉద్యోగం లో చేరిన కొత్తల్లో హాట్ పెట్టుకోని తీయించున్నది కావాలి అన్నది , నా పుస్తకం లో నాన్నగారి ఫొటోను ఆప్యాయంగా తడుతూ.ఇంటికి రాగానే ఆ ఫొటో వెతికి తీసాను అత్తయ్యకు పంపటానికి.అత్తయ్య కాసేపు మా చెల్లెలి తో కలిసి పాటలు పాడుకుంది.మమ్మలిని అసలు వదలలేదు.

ఊళ్ళో ఉన్న కుమారి, సరళ మా కజిన్స్ కూడా వచ్చారు.నేను అమ్మ, మా చెల్లెలు వెళ్ళాము.అందరమూ కలిసి లంచ్ చేసాము.మళ్ళీ ఇన్నాళ్ళకు నీమూలంగా ఇంట్లో నెలనెలా వాతావరణం వచ్చింది అనుకున్నారు.ఈనాటి గెట్ టుగేదర్ సంతోషం గా,కొంచం సెంటిమెంటల్ గా జరిగింది.థాంక్ యు పార్వతి.

Friday, March 31, 2017

అలా జరిగింది!




అలా జరిగింది!
పుస్తకావిష్కరణ సభలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు , పి.యస్.యం లక్ష్మిగారు, ఇక నెక్స్ట్ మీదే అనేవారు.నాదా? నావెవరు కొంటారండి. పుస్తకాలు నేను అమీర్పేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ పక్కన నిలబడి అందరి కీ పంచాల్సిందే అనటము మాకు అలవాటైపోయింది. మధ్య ఒక సభలో కస్తూరి మురళికృష్ణ గారు ,మీవెన్ని కథలయ్యాయండి అని అడిగారు.దాదాపు పదిహేనండి అన్నాను.ఐతే ఇక మీ కథలు బుక్ వేయించేద్దాం అన్నారు.నేను నవ్వి ఊరుకున్నాను.ఇదే విషయం ఓసారి మా కోడలు అనూ ఫోన్ చేసినప్పుడు అన్నాను.వేయించవచ్చుకదా ఆంటీ అంది.ఎందుకమ్మా దగరదగ్గర 20/30 వేలు ఖర్చుపెట్టాలి. పైన పుస్తకాలన్నీ చూసుకుంటూ నేను దిగులుపడాలి.అంత మనీ అలా ఖర్చుపెట్టటం నాకిష్టం లేదు అన్నాను.ఐతే నేను బుక్స్ చేస్తాను మెటీరియల్ నాకు పంపండి అంది.అదో అప్పటి నుంచి, అంటే నాలుగునెలలైందేమో, ఎక్కడెక్కడో ఉన్న నా కథలూ , సమీక్షలూ అన్ని వెతికి పట్టుకొని, వాటిని దిద్ది,సరిచేసి తనకు పంపాను.ఆంటీ చాలా మిస్టేక్స్ వస్తున్నాయి అనేది.ఎంత కళ్ళుపొడుచుకొని చూస్తున్నాను అనుకున్నా ఇలా ఐతోందేమిటి అని , తప్పులు దిద్దేందుకు మా చెల్లెలు జయ, ,జి.యస్ లక్ష్మి గారి హెల్ప్ తీసుకున్నాను.ఐనా కొన్ని వచ్చాయి.మొత్తానికి నా వర్డ్ లోనే ఫాంట్ ప్రాబ్లం అని తేలింది.ఇక మా అబ్బాయి రంగం లోకి దిగాడు.నా స్క్రీన్ షేర్ చేసుకొని ఫాంట్ సరిచేసాడు.అమ్మయ్య ని ఊపిరి పీల్చుకొని, మళ్ళీ అంతా కరెక్ట్ చేసి, జయకు, లక్షి గారికి ఓసారి ఫైనల్ గా చూపించి పంపాను.అనూ కూడా ఓకే అంది.ఇక కవర్ డిజైన్!నేను పంపిన ఫొటో తనకు నచ్చదు.ఏమనుకోకమ్మా ఇది సరిగ్గాలేదు అంటే ఎందుకనుకోను అనుకుంటాను,మీరు వదిలేయండి నేను మాడ్ గా చేస్తాను అని ఎక్కడెక్కడి నుంచో ఇమేజెస్ తెచ్చి,వాటిని కొని రెండు పుస్తకాలకూ డిజైన్ చేసింది.మళ్ళీ నా ఫొటో పెడతానంటుంది.మీ గురించి మీరు చెపుతారా నేను రాసేయనా అంటుంది.దేవుడా ఎక్కడి పిల్లవమ్మా అని ఏదో నా గురించి నేను రాసుకొని ఫొటో ఇచ్చాను.మీ బుక్స్ రెడీ అని పంపేసింది.ఐతే అవి నువ్వే ఆన్ లైన్ లో ఉగాది పండుగ రోజు అవిష్కరించేయి అన్నాను.అలా మా కోడలి ప్రొత్షాహం,కష్టం తో నా బుక్స్ రెడీ అయ్యాయి.
నా బుక్స్ రెడీ అన్నాను లక్ష్మిగారితో, ఐతే పార్టీ అన్నారు.ఇందులో ఏముందండీ పార్టీ కి అన్నాను.మిమ్మలిని కాదు, మేజర్ గారిని అడుగుతాను,ఆయనైతే ఫైవ్ స్టార్ హోటల్ లో ఇస్తారు అన్నారు.నేను నవ్వి ఊరుకున్నాను.మా వదినగారికి, తోటి కోడలికి , చిన్న ఆడపడుచు విజయకు చెప్పి సెల్ల్ లో చూపించాను.ఇలా కాదు పార్టీ కావాలి అంది విజయ.అసలే తనకు ఇలాంటివన్నీ అంటే ఉషారు.వద్దులే అన్నాను.మీరు పిలిచినా పిలవకపోయినా నేను ప్రశాంత్ ఉగాదిరోజు లంచ్ కు వస్తున్నాము అంది మా చెల్లెలి కోడలు రష్మి.ఐతే మీ అత్తగారిని మామగారిని కూడా తీసుకొనిరా అన్నాను.కాదక్కా ఉషా వాళ్ళందరినీ కూడా పిలువు సరదాగా చేసుకుందాము అంది మా చెల్లెలు.ఇక మా కోడలు, అమ్మాయి ఒకటే గొడవ చిన్నగా అన్నా చేయి అని.మేము రికార్డ్ బుక్స్ పిడియఫ్ తో చేయించేవాళ్ళము, కనీసం అలా ఒక కాపీ అన్నా చేయించండి బాగుంటుంది అంది కోడలు.ముందే మా ఏమండీ పార్టీలా చేద్దాము అంటే వద్దన్నాను. ఉగాది ముందు రోజు ఏమనుకున్నారో , కోడలు చెప్పినట్లు,ఎదురుగా ఉన్న జెరాక్స్ సెంటర్ కు వెళ్ళి రెండు పుస్తకాలూ నాలుగేసి కాపీస్ తీయించుకొచ్చారు.అవి చాలా బాగా వచ్చాయి.ఇంతమంది నా కోసం ఆలోచిస్తూ ఉంటే నేనెందుకు వద్దనాలి, ఎవరూ లేనట్ల్లు ఒక్కదాన్నే బ్లాగ్ లో ఎందుకు పెట్టేసుకోవాలి అని సెంటిమెంటల్ గా ఫీలైపోయి, ఏమండీ తో చిన్న పార్టీ ఇద్దామండి అన్నాను.ఎవరెవరి ని పిలవాలో నువ్వే చెప్పు అన్నారు.అప్పటికే రాత్రి ఎనిమిదైపోయింది.తెల్లవారితే పండగ.ఎక్కువ మందైతే ఇంట్లో సరిపోరు.అని కొంత మంది కే చెప్పాను.కుటుంబసభ్యులనందరికీ ఫోన్ చేసి చెప్పారు.మా డ్రైవర్ మహేష్,వాచ్ మాన్ సరేంద్ర సహాయముతో చక చకా ఏర్పాట్లు చేసారు.మా చిన్నాడపడుచు ఉష కు వంటిల్లు అప్పచెప్పేసాను.మా మేనకోడళ్ళు, రష్మి అందరూ వడ్డనలోకి వచ్చేసారు. మావారు అడగగానే లక్ష్మిగారు కార్యక్రమం జరిపించే భాద్యత తీసుకొని చక్కగా అవిష్కరణలు జరిపించేసారు.షరా మామూలుగానే నేను టెన్షన్ పడుతూ ఉండగానే ,అందరూ కలిసి నా ఫంక్షన్ ను అనుకోని విధం గా విజయవంతంగా చేసేసారు.
సాదరంగా ఆహ్వానించలేదు అని అనుకోకుండా మా వియ్యాలవారు , అల్లుడి అమ్మగారు నాకిష్టమని ఐస్క్రీం, కోడలి అమ్మగారు పసుపు,కుంకుమ, చీర, వారింట్లో పూయించిన మరువం గులాబిలతో చిన్న బుకే చేసి తీసుకొని వచ్చారు.రాత్రి పది గంటలకు మెసేజ్ బాక్స్ లో మెసేజ్ పెట్టినా సుందరి నాగమణి వాళ్ళ వారి తో, లక్ష్మిగారు ప్రొఫెసర్ గారితో వచ్చారు.సీనియర్ రైటర్ ,పెద్దావిడ డి.కామేశ్వరి గారు, మెసేజ్ కే స్పందించి ఇంత దూరం ఇల్లు వెతుకుంటూ రావటం చాలా చాలా సంతోషం అనిపించింది.అది నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఎంతబాగా జరిగినా అందరు ఆత్మీయులనూ పిలవలేకపోయానే అని చిన్న అసంతృప్తి మటుకు కొద్దిగా ఉంది.మీ అందరీ విషెస్ నాకు ఉంటాయనే భావిస్తున్నాను.
ఇంత మంచి కుటుంబాన్ని, స్నేహితులను నాకు ఇచ్చిన దేవదేవుని కి సదా కృజ్ఞురాలిని .




Wednesday, June 9, 2010

భూమికకు ధన్యవాదాలు

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు పోస్ట్ , ఏమైనా తప్పుగా రాస్తానా , ఎవరినైనా నొప్పిస్తానా , ఎవరినైనా మరిచిపోతానా ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుమానాల తో , చాలా భయపడుతూ పడుతూ రాసాను . నా బ్లాగ్ కు నేనే మహారాణిని కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు . మావారి మీద రాసినా , మనవళ్ళు , మనవరాళ్ళ మీద రాసినా మన వాళ్ళేకాబట్టి ఏమనుకోరులే అని ధైర్యం . వాళ్ళేకాదు మేమంతా నీ వాళ్ళ మే అని , నా రాతలను సంతోషం గా స్వీకరించారు మితృరాళ్ళు . ఆ ఆనందం తోనే వుబ్బి తబ్బిబౌతుంటే , భూమిక లో ప్రచురించి , నా ఆనందాన్ని ఆకాశమంత చేశారు , సత్యవతి గారు . సరదాగా మొదలు పెట్టిన ఈ ఆర్టికల్ ఇంతటి ఆదరణను పొందిదంటే నాకు నమ్మశక్యం కావటము లేదు . నా సంతోషాన్ని ఎలా తెలపాలో , మాటలు రావటము లేదు . సత్యవతి గారూ మీకు నా ధన్యవాదాలను ఎలా తెలపాలో నిజం గా తెలీటము లేదండి . మాటలు తడబడి పోతున్నాయంటే నమ్మండి . అచ్చులో మొదటి సారిగా నా పేరును చూపించారు . చాలా చాలా ధన్యవాదాలండి .

నా ఈ పోస్ట్ రాయటానికి కారణమైన , కృష్ణ వేణి , లలిత డి గార్లకు , లింకులు వెతికి పెట్టి సహకరించిన , వరూధిని , జ్యోతి , మధురవాణి , జయ , సుభద్ర గార్లకు ధన్య వాదాలు . పి .డి యఫ్ చేసిపెట్టిన జ్యోతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు . చదివి ఆదరించిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు .

ఈ మధ్య నా కర్సర్ ఎందుకో నా మాట వినటము లేదు . ఈ రోజే సత్యవతి గారి దగ్గర నుండి భూమిక పుస్తకం అందింది . థాంక్స్ చెబుదామని , ఇంతకు ముందున్న టైటిల్ , ఇంకా పిక్చర్ మారుద్దామని ఎడిట్ చేసేసరికి ఎటో వెళ్ళిపోయింది . అదృష్టవసాత్తు టెస్ట్ బ్లాగ్ లో వుండటము వలన మళ్ళీ పోస్ట్ చేయగలుగుతున్నాను !

Wednesday, April 28, 2010

నేనూ వెదురుపూలను చూసానుగా :-) :-) :-)




వెదురు చెట్లు నలభై సంవత్సరాల కొక సారి పూస్తాయి . ప్రస్తుతము జూ పార్క్ లో వెదురు చెట్లన్నీ పూసి , కనువిందు చేస్తున్నాయి అని పేపర్ లో చదివినప్పటి నుండి , చూడాలని మహా ఆరాట పడ్డాను . కాని సికింద్రాబాద్ నుండి , హైదరాబాద్ కు అటు చివరనున్న జూ కు , ఈ మండే ఎండల లో ఎలా వెళ్ళాలా అని దిగులేసింది . పైగా సత్యవతి గారి బ్లాగ్ లో , ఆవిడ చూసొచ్చానని , పూలు రాలి పోతున్నాయని , ఆలసించిన ఆశాభంగం అని మరీ మరీ చెప్పారు . ఎలాగా . . . ఎలా వెళ్ళటము చెప్మా ???

ఎలా ఎలా ఎలా అనుకుంటుండగానే అవకాశము రానే వచ్చింది ,ఇలా , కార్ తీసుకెళ్ళకుండా మావారు వరంగల్ వెళుతూ , ఎటైనా వెళ్ళా లి అంటే వెళ్ళిరా అని పర్మిషన్ ఇచ్చిన రూపము లో !!! ఒక్క దానిని ఎలావెళ్ళాలి ? అదో ప్రాబ్లం హుం . జయకు ఫోన్ చేసాను , అబ్బే లిఫ్ట్ చేయదే ! ప్రయత్నించగా , ప్రయత్నించగా మా మరిదిగారు లిఫ్ట్ చేసి , సెల్ ఇంట్లోనే మర్చిపోయి కాలేజ్ కెళ్ళి నట్లున్నదండీ అని చిన్నగా చెప్పారు . కింకర్తవ్యం ? మంచి తరుణం మించిన దొరకదు . పట్టువదలని విక్రమార్కిణి లా కాలేజ్ కెళ్ళాను . జయమ్మ మీటింగ్ లో వున్నారమ్మా అని ఆయా చెప్పింది . ఏం చేస్తాను ? ఎదురుచూస్తూ కూర్చున్నాను . జయ ఫ్రెండ్ కళ్యాణి చూసి , జయను పిలుచుకొచ్చింది . అమ్మయ్య ఇక టైం లేదు పద పద , జూ కెళుదాము అని తొందర చేసాను . ఆకలేస్తోందక్కా , ఇంటికెళ్ళి అన్నం తిని పోదాం అని దీనంగా మొహం పెట్టింది . సరే పద అన్నాను . అనక చేసేదేముంది .

ఎక్కడికి మేడం జూకా ? రేపెళుదాం , మా తమ్ముడు కూడా వస్తాడు అని మా డ్రైవర్ ,మహేష్ నసగటం మొదలు పెట్టాడు . ఇహ చాల్లే నడు , ఇప్పటికే బోలెడు టెన్షన్ పడ్డాను అని తొందర చేసాను . తీరా అక్కడికెళ్ళాక , అక్కడి వాళ్ళను వెదురు చెట్లు ఎక్కడున్నాయి అని అడుగుతే వెదురు చెట్లా ఎక్కడున్నాయి , జూ లో లేవు అంటారే ! ఓ పనామె ఐతే ఈ టి. వి ల్లోళ్ళు , పేపరోళ్ళు ఇంతుంటే అంత చేస్తారు ఆ బొంగు చెట్లన్ని ఎప్పుడో గింజలు రాల్చేసాయి , వాటిని కొట్టేసారు అని చావు కబురు చల్లగా చెప్పింది . అయ్యో . పోనీ లే ఇంతదూరం వచ్చాము , కనీసం ఏవో జంతువులు కనిపించక పోతాయా చూసి పోదాములే అని , జయ ఐస్ క్రీం కొనిచ్చి వోదార్చింది ! అలా తెల్ల పులిని , చిరుతను , పక్షులను చూస్కుంటూ , సుభద్ర రాజాధి రాజునంటా పోస్ట్ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ , సిమ్హాని చూసుకుంటూ , చూసుకుంటూ వెళుతూ . . . వెళుతూ . . . వుండగా , మహేష్ మేడం అని గావుకేక పెట్టాడు . అసలే ఫొటోలు తీస్తూ తెగ తంటాలు పడుతున్నాడు , ఏమైందా ఏ జంతువో కరిచిందా ఏంపాడు అని దడుచుకొని చూద్దును కదా , ఇక్కడ బొంగు చెట్టుంది మేడం అని మరో పోలి కేక పెట్టాడు . వహవా అనుకుంటూ వెళ్ళాము . కొన్ని వెదురు చెట్ల్లు , ఎండిపోయిన పూల గుత్తులతో దర్షనం ఇచ్చాయి . బహుషా పూలు ఎండిపోయినట్లున్నాయి అనుకొని వాటిని చూసే సంతోష పడిపోయాము . వాటినే కొన్ని ఫొటోలు తీసుకున్నాము . అక్కడక్కడా కాల్చేసిన వెదురు చెట్లు కనిపించాయి .

హుర్రే . . . ఇక్కడ ఒకానొక చెట్టు , ఏక్ అకేలా లా , మా కోసమే , మాకోసమే చెట్టునిండా పూల తో వయ్యారలొలక పోస్తూ ఎంత బాగుంది . అమ్మయ్యా మొత్తానికి వెదురుచెట్టు పూల తో సహా చూడగలిగాము . ఓహో ఐతే వెదురుపూల రంగే బ్రౌనన్నమాట . ఎండి పోవటము కాదు . మొత్తానికి చూసేసామోచ్ !