Sunday, December 17, 2017

ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)














ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)
"ఎప్పుడెళుతున్నావు సభలకు ?" అని అడిగారు ఏమండి.
"హుం నేనేమి వెళుతాను ? ఓ నాలుగు రోజులాగి వెళ్ళవచ్చుగా పి.యస్.యం గారు.ఉమ్హు సరిగ్గా సభల ముందే యు.యస్ వెళ్ళారు. జి.యస్.లక్ష్మిగారు బిజీట.మీరు రానన్నారు.కనీసం రిజిస్టర్ చేయించుకోమన్నా చేయించుకోలేదు.నేనొక్క దాన్ని ఏ వెళుతాను?" నిట్టుర్చాను.
కాసేపు ఇద్దరమూ పేపర్ చూడటం లో మునిగిపోయాము.సడన్ గా "నేను ఈ నాలుగు సెలెక్ట్  చేసాను ."అన్నారు ఏమండి.
"ఏమిటి?ఎందుకు?"
"నువ్వు తెగ ఫీలైపోతున్నావుగా అందుకు సభలకు వెళుదామని ఈ ప్రోగ్రాంలు సెలెక్ట్ చేసాను.పద వెళుదాము ."
"అబ్బా కవి సమ్మేళనాలా ? హాస్యావధానానికి వెళుదాము.ఐనా మీకోసం ఫాం తీసుకొని, ఆధార్ కార్డ్, ఫొటో తీసుకొని వచ్చినా రిజిస్టర్ చేయించుకోలేదు.మరి మిమ్మలిని రానిస్తారో లేదో"నా సందేహం.
"పరవాలేదు లే నా ఐడి కార్డ్ తెస్తాను.రానీయకపోతే తిరిగి వచ్చేద్దాం"భరోసా.
అంతే చెంగున లేచి అలమారా తీసి ఏమి చీర కట్టుకోనబ్బా అనుకుంటూ ఇక్కత్ సారీ కట్టుకుందాము తెలంగాణా అభిమానం ఇలా చాటుకుందాం డన్ :)
హాస్యావధానం చూద్దామనుకుంటూ రవీంధ్రభారతి చేరాము.కార్ బయటనే ఆపేసారు. లోపల జనం హడావిడిగా తిరుగుతున్నారు. ఒక చోట క్యూ కనిపించింది.మరి ఏమండీగారి కి రిజిస్ట్రేషన్ చేయించాలి కదా అని అక్కడికి వెళ్ళి ఈ క్యూ ఎందుకు అని అడిగాను.ఇది ఎంప్ల్యాస్ క్యూ అని సమాధానం వచ్చింది.మరి రిజిస్ట్రేషన్ ఎక్కడ అంటే రిజిస్ట్రేషన్ లు ఐపోయాయి.అన్నారు.ఇంకో కౌంటర్ దగ్గర అడుగుతే రిజిస్ట్రేషన్ లేకపోయినా వెళ్ళవచ్చు అన్నారు.మరి ఎక్కడా హాస్యావధానం అని వెతుకుతుంటే
"మీరు మాలాకుమార్ గారు కదూ" అని వినిపించింది.ఈ మహాసభలల్లో నన్ను గుర్తుపట్టి పలకరించేవారెవరు చెప్మా అని తెగ హాశ్చర్యపోతూ వెనక్కి తిరిగాను. ఓ అబ్బాయి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించాడు.ఎవరో గుర్తుపట్టలేకపోయాను.జానీ భాషా నమ్మా అన్నాడు.హోరినీ నువ్వా ?ఫొటోలల్లో గడ్డంతో గంభీరంగా ఉంటావు ఇంత చిన్న అబ్బాయివా అని ఇంకా బోలెడు హాశ్చర్యబోయాను!మా ఏమండీ కి పరిచయం చేసాను.ఈ అబ్బాయిని ఇంతకు ముందు చూసావా అని అడిగారు.జాని లేదండి ఫొటో చూసాను కదా అందుకే గుర్తుపట్టాను అని చెప్పి నవ్వి తన పుస్తకాలు ఇచ్చాడు.ఇంతలో ఇంకో ఆవిడ వచ్చి జానీ ని పలకరించారు.ఆవిడ ఇందిర అని ఒక రచయిత్రి అని పరిచయం చేసాడు జానీ. కుంచె అని ఇంకో కార్టూనిస్ట్ ను అతను మా ఫొటో తీసాక పరిచయం చేసారు.మీ కార్టూస్ చూస్తానండి అన్నాను కుంచె తో. అనుకోకుండా వీళ్ళను కలవటము ఆనందం అనిపించింది.
ఆ తరువాత మేము ప్రోగ్రాం చూద్దామని వెళుతుంటే మెట్ల దగ్గర అంతా హడావిడిగా ఉంది.విడియోలు, ఇంటర్వ్యూ లు ఎవరెవరో ఎవరెవరినో తీసుకుంటున్నారు.ఆ హడావిడి చూస్తూ లోపలికి వెళ్ళాము.అత్తలూరివిజయలక్ష్మి గారు హాస్యవధానానికి వెళుతున్నాను ఎవరైనా వస్తే రండి అని చెప్పింది గుర్తొచ్చి ఆవిడకు ఫోన్ చేసాను.హాస్యావధానం దగ్గర చాలా రష్ ఉందండి లోపలికి వెళ్ళలేకపోయాను మేన్ హాల్ లో ఉన్నాను ,మీరు ఇటొచ్చేయండి సీట్లు ఉన్నాయి మీకు పెడుతాను అన్నారు.నేనూ మా ఏమండీ వచ్చాము అన్నాను,మీకూ మీ ఏమండీకి కూడా సీట్లు పెడుతాను రండి అన్నారు.సరే అని, ఐనా ఆశ కొద్దీ హాస్యావధానం వైపు వెళ్ళాము.అస్సలు లోపలికి వెళ్ళే సందేలేదు.కిక్కిరిసిపోయి ఉన్నారు.వేడి గాలులు బయటకు వస్తున్నాయి. నాకు గాభరావేసి మెట్ల దగ్గరే నుంచుండిపోయాను.ఏమండీ మాత్రం తలుపు దగ్గర నిలబడి కాసేపు విని నవ్వుకుంటూ వచ్చారు. బాగుంది మనం ఇంకొంచం ముందు వస్తే లోపలికి వెళ్ళేవాళ్ళం అన్నారు. ఒకవేళ ముందుగా వచ్చి లోపలికి వెళ్ళినా ఆ రష్ కు బయటకు రాలేక లోపల ఉండలేక ఉక్కిరిబిక్కిరి ఐపోయేదానిని అమ్మో అనుకుంటూ ఎందుకూ నవ్వుతున్నారు ఏమిటీ జోక్ అన్నాను.
"ఒకావిడ పాయసం చేస్తూ వాళ్ళాయనను కిస్ మిస్ లు తెమ్మన్నదిట.ఆయన రోడ్ మీద ఒక మిస్ ను చూసి బస్ మిస్సయ్యాడుట." దాని మీద నడుస్తొంది అన్నారు :)
మేన్ హాల్ కు వెళుదామని వెళుతే ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోయాము అంత రష్.విజయలక్ష్మిగారికి ఫోన్ చేసి సారీ అండి లోపలికి రాలేకపోతున్నాము , మేము వెళుతున్నాము అని చెప్పి బయటకు వచ్చి ఊపిరిపీల్చుకున్నాము. బయట మెట్ల మీద ఓ అబ్బాయిని అడిగి ఫొటోలు తీయించుకొని లంచ్ కౌంటర్ వైపు వెళ్ళాము.అక్కడ మెళ్ళో రిజిస్ట్రేషన్ కార్డ్ ఉన్నవళ్ళనే రానిస్తున్నారు.మరి ఏమండీకి బిళ్ళ లేదుగా అందుకని దగ్గరలో ఉన్న పురానాధిల్లీ కి వెళ్ళి భోజనం చేసాము.
మిగితా వేదికలు కూడా అలాలా తిరిగొద్దాము అనుకొని ముందుగా యల్.బి స్టేడియం కు వెళ్ళాము.అక్కడ ఒక పోలీసు మా ఏమండీ కి బిళ్ళ లేదని ఆపేసాడు.ఆయన ఐ.డి కార్డ్ బయటకు తీయబోయారు ఇంతలో ఇంకో పోలీస్ వెళ్ళండి సార్ అన్నాడు.వాళ్ళు భార్యాభర్తల్లా ఉనారు ఆవిడనొక్కదాన్నే పంపటం ఎందుకని ఇద్దరినీ వెళ్ళమన్నాను అతను మొదటి పోలీస్ తో చెప్పటం వినిపించి ఔరా ముక్కూమొహం తెలీని వాళ్ళు కూడా నా బిక్క మొహం చూసి, నేను ఒక్కదాన్ని వెళ్ళలేనని కనుక్కుంటున్నారే! అనుకోవటం తప్ప నేనేమి చేయ్గలను!
గేట్ పక్కనే ఉన్న మ్యూజియం చూసుకొని వేదిక దగ్గరకు వెళ్ళాము.ఏమి ప్రోగ్రాంలు లేవు కదా ఎందుకు అన్నారు.ఐనా చూద్దాం అని తీసుకెళ్ళాను.సీటింగ్ అరేంజ్మెంట్ వేదిక అన్నీ చూసాను.అక్కడక్కడా కొంత మంది ఉన్నారు.వాళ్ళు ఏవో పనులు చేసుకుంటున్నారు.అక్కడే ఉన్న ఇద్దరబ్బాయిలను చూసి మాకు ఫొటో తీస్తారా అని అడిగాను.ఒకతను వచ్చి మమ్మలిని అటూ ఇటూ నిలబెట్టి ఫొటోలు తీసాడు.ప్రొఫెషన్ల్ లా తీసావు అని ఏమండీ జోక్ చేస్తే నవ్వుతూ నా సెల్ ఇచ్చాడు.అప్పుడు అతని బాడ్జ్ చూస్తే పోలీస్ అని ఉంది.నాలుక్కరుచుకొని హోరినీ పోలీస్ నే ఫొటో తీయమని అడిగానా అని సారీ అన్నాను.పరవాలేదు మేడం అన్నాడు అతను.మీరు యూనీఫాం లో లేరు సెక్యూరిటీ నా ? అంటూ ఏమండీ వాళ్ళతో కాసేపు ముచ్చట్లేసుకున్నారు.స్వజాతి అభిమానం :)
అక్కడి నుంచి స్టేడియం అంతా చుట్టేస్తూ వెనకవైపుకు వెళ్ళాము.అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.చాలావరకు మూసి ఉన్నాయి.కొన్ని స్వగృహ స్టాల్స్ అని తెరిచిఉంచారు.అక్కడ అన్నీ తెలంగాణా పలగారాలు (స్నాక్స్) అమ్ముతున్నారు .ఇంకొంచం లోపలికి వెళితే మన  కనిపించాయి. అన్నీ కిటకిటలాడిపోతున్నాయి.ఒక్కొక్కళ్ళు మోయలేనన్ని పుస్తకాలు కొని తీసుకెళుతున్నారు.చివరగా ఉన్న ఒక స్టాల్ లో ఒక పెద్దాయన ఒక్కరే ఉన్నారు.ఆయనతో ఏమండీ కాసేపు కబుర్లేసుకున్నారు.ఆయన విష్ణుసహస్రనామం పుస్తకం బొమ్మలతో , అర్ధం తో వేయించారు.అవి బయట ఎక్కడా చూడలేదు అని నేను అంటే ఆయన పుస్తకం అమ్ముకోవటంలోని ఇబ్బందులు, పబిషర్స్ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం చెప్పుకున్నారు.ఏమండీ అంతా ఓపికగా విని  500 లకు కొనుకున్నారు. ఆయన నన్ను మీరు పుస్తకాలేమీ వేయించలేదామ్మా అని అడిగారు.ఇదో మీరు చెపుతున్న సాధకబాధకాలు పడలేకే ప్రింట్ చేయించకుండా ఈ బుక్స్ తో సరిపెట్టుకున్నానండి అన్నాను నవ్వుతూ.నేనేమో సాఫ్ట్వేర్ అబ్బాయిలు కృష్ణచైతన్యవారి పుస్తకాలు  అమ్ముతుంటే పునర్జన్మం గురించిన పుస్తకం కొనుకున్నాను.
చిన్నగా బయటకు వచ్చేసరికి ఇద్దరికీ ఓపిక ఐపోయి ఇంక వేరే ఏ వేదికల దగ్గరకూ వెళ్ళ కుండా ఇంటికి వచ్చేసాము.అదీ సంగతి :)

ప్రపంచమహాసభల ఏర్పాట్లు అన్నీ చాలా ఘనంగా చేసారు.ప్రతినిధులుగా రిజిస్టర్ చేయించుకున్నవారికి ,బయటవారికి వసతి , రవాణా, భోజన ఏర్పాట్లు , వేదికల వద్ద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసారు.రిజిస్టర్ చేయించుకోని వారికి ప్రవేశము వుంది కాని , భోజనము , సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేవు.దూరంగా గాలరీలో కూర్చోవాలి.బాంబే నుంచి వచ్చిన మా ఫ్రెండ్ రమేష్ గారు మంచి హోటల్ లో ఇచ్చారండి.హోటల్ లోనే బస్ కూడా ఉంచారు వేదికల దగ్గరకు తీసుకెళ్ళేందుకు అన్నారు. పోలీస్ వారు కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు.మరి విమర్శలు వస్తున్నాయి అంటే, మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే పొరపాట్లు జరుగుతాయి మరి ఇంత పెద్ద ఫంక్షన్ లో జరగకుండా ఎలా ఉంటాయి.పొరపాట్లూ సహజమే!విమర్శలూ సహజమే! అవన్నీ పట్టించుకోకుండా మన ఊళ్ళో జరుగుతున్న ఇంత పెద్ద సాహితీ సదస్సును చూసి ఆనందిద్దాము అనుకుని వెళ్ళి వచ్చాము.

No comments: