ఈ రోజు అంగా కార్తీక శుద్ద విదియ . ఉత్తరాదిన ముఖ్యంగా "భగినీ హస్త భొజన్" అని జరుపుకుంటారు.
మన వైపు కూడా కొంత మంది చేస్తారు కాని అంతగా ప్రాచుర్యం లో లేదు. భగినీ అంటే
సోదరి. సోదరుడు , సోదరి చేతి భోజనం చేయటమన్నమాట. వివాహమైన అమ్మాయి ఇంట్లో
మనవాళ్ళు భోజనం చేసేవారు కాదు. పంజాబ్ అటువైపైతే తప్పని సరిగా చేయాల్సి వస్తే
విస్తరి కింద కొంత డబ్బు ఉంచుతారని మా పంజాబీ స్నేహితులు చెప్పారు. అమ్మాయి ఇంట్లో
భోజనం చేయటము తప్పని కాదు కాని ఆడపిల్ల రుణం ఉంచుకోకూడదు అని. శుభకార్యాలల్లో
తినొచ్చుట.ఐతే కార్తీక శుద్ద విదియనాడు మటుకు సోదరుని, సోదరి పిలిచి భోజనము
పెట్టి కానుకలిచ్చి పంపాలట.
దీనికీ ఒక కథ ఉంది.
సూర్యభగవానునకు
సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’
అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా
‘యమీ’ అని పిలిచేవాడు. యమునకు వివాహం
జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని
కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు
వస్తానని యమధర్మరాజు యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు తన అన్నయ్య కు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం
ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, మన్నించమని,
‘కార్తీక
శుధ్ద విదియ’ నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు
యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ
తయారుచేసింది.
అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు
వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన
పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు
అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ ప్రతి యేడు
ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ., అలాగే ప్రతి పోదరుడు ఈ
రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని
యమునకు అనుగ్రహించాడు. అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి
భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల
కొనసాగుతోంది.
ఇదంతా పుక్కిటి పురాణం అని అనుకున్నా, రాఖీ రోజు సోదరుని ఇంటి కి వెళ్ళి రాఖీ కట్టి
బహుమతి తెచ్చుకోవటము, సోదరుడు భగినీ
హస్త భోజనము రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి బహుమతి తెచ్చుకోవటమూ, చిన్ననాటి ఆప్యాయతలు , అనుబంధాలు దూరం కాకుడదు అని ఈ సంప్రదాయామును పెట్టి
ఉంటారు అనిపిస్తుంది. తరిచి చూడాలే కాని మన సంప్రదాయాలన్నిటిలోనూ ఏదో ఒక అర్ధము
ఉంటుంది.అవి ఆషామాషీగా ఏర్పర్చినవికావు.
మా స్నేహితులు చేస్తుంటే చూసి నేనూ మా అమ్మాయితో
చేయించేదానిని. మా పిల్లలిద్దరూ ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మాయి తమ్ముడిని భోజనానికి
తప్పక పిలిచేది. ఈ రోజు ఎక్కడో చదివారట , మా పెద్ద ఆడపడుచు గారు తమ్ముళ్ళిద్దరినీ భోజనానికి పిలిచారు.వాళ్ళిద్దరి
తోపాటు మా తోటికోడళ్ళిద్దరినీ పిలిచారు :)
2 comments:
వ్యాసం బాగుంది. అయితే "వివాహమైన అమ్మాయి ఇంట్లో మనవాళ్ళు భోజనం చేసేవారు కాదు." అని మీరన్నది అర్ధం కాలేదు. ఇది ఏదైనా కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించే పట్టింపాండీ? నాకు పరిచయమున్న కృష్ణా జిల్లాలో అయితే లేదు.
ఒకప్పుడు మనవైపు కూడా ఉండేది ఈ పట్టింపు అని విన్నానండి కాని నేనెప్పుడూ చూడలేదు.మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అయితే పాటించేవారు.మా ఫ్రెండ్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు హోటల్ లో ఉండేవారు. తన దగ్గర ఉంటే వెళ్ళేటప్పుడు భోజనం ఖర్చు అని డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు.ఇది కూడా నలభైఎళ్ళ క్రితం సంగతి.మరి ఇప్పుడు పాటిస్తున్నారో లేదో నాకు తెలీదు.
Post a Comment