Friday, September 20, 2013

చక్కటి పూల కు చాంగుభళా!


నిత్య పూజలివిగో నెరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము.


 పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి - తెచ్చి శిరసాదిగ దిగనలది
అద్దెరబ ఈ కూన అందరి కన్నులకింపై,


పేరంటాళ్ళ నడిమి పెళ్ళికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు - See more at: http://www.lyricsintelugu.com/2010/07/pidikita-talambrala-pendli-koothuru.html#sthash.EgYZU2wp.dpufపేరంటాళ్ళ నడిమి పెళ్ళికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు - See more at: http://www.lyricsintelugu.com/2010/07/pidikita-talambrala-pendli-koothuru.html#sthash.EgYZU2wp.dpufపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు.



కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సలుపు చూపులకు చాంగుభళా!


ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా!


జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర.

ఈ సారి కుసిన వానల మహత్యమో, ఆరు సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషి , సంవత్సరము గా  కొత్తమాలి ఈశ్వర్ పడుతున్న శ్రమ కు ఫలితమో , ఏదైనా కాని ఈ సారి నా తోట నలువైపులా రంగు రంగుల పూవులతో కనులకింపుగా వుంది:)

ఇదికాదే సౌభాగ్యము,ఇదికాదే వైభవము!
ఇంతటి ఆనందములో ,పక్కుంటి వారికోసం బాదం చెట్టును కు వీడ్కోలు ఇవ్వటం , వెనికింటి వారి కోసము అరటి మొక్కను తీసేయటము సరిపోనట్లు కొత్త బాధ వచ్చింది :(


  అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితినీ!`

చెట్టు నిండా బోండాలతో కళకళలాడుతూ , ప్రతి శనివారమూ వెంకటేశునికి తప్పక కాయనిస్తుంది ఇది. ప్రతి శ్రీరామనవమి కీ "విను వీధుల తిరిగే " మా శ్రీరామునికి నాలుగు సంవత్సరాలుగా మా ఇంటి ముందు దీని కాయను సమర్పించుకుంటున్నాము.అంతేనా ఇంటికెవరు వచ్చినా పైకి తీసుకెళ్ళి , పిట్ట గోడ మీదుగా అందే బోండాళ్ళను , వాళ్ళు కోసుకుంటే ఆనందిస్తున్నాము.అదేమిటో దీని కాండానికి చెదలు పట్టాయి. ఏ మందులకూ లొంగటము లేదు. కాండమంతా డొల్లగా ఐపోయింది. ఐనా చెట్టు నిండా బోండాలు వస్తూనే వున్నాయి. మొన్న శ్రావణ శుక్రవారానికి , వినాయక చవితి కీ నాలుగేసి పెద్ద పెద్ద కాయలు ఇచ్చింది. ఐనా ఈ చెట్టును వుంచకూడదుట!ఇంత డొల్ల వుంటే ఎప్పుడైనా కూలిపోవచ్చు, చాలా ప్రమాదం అంటున్నారు. నిన్న మా వియ్యంకుడు చూసి మరీ మరీ చెప్పారు తీసేయమని.శుక్రవారము, మంగళవారము కాకుండా చూడండి, ముందుగా దీని కాయలు గుళ్ళో కొట్టండి, చెట్టుకు పసుపూ కుమకుమ తో పూజచేసి తీసేయండి తప్పదు అని మరీ మరీ చెప్పివెళ్ళారు. ఎంత దిగులుగా వుందో !


 దిగులుపడకు నేను పూత మొదలుపెట్టాను కదా అని ఓదారుస్తోంది పక్కనున్న ఇంకో నారికేళవృక్షం.


నానాటి బ్రతుకు నాటకము.
ఓ నిష్క్రమణ , ఓ అవిష్క్రమణ తప్పనిదేమో!

మొగ్గ తొడిగినప్పటి నుంచి పుష్పించేవరకూ గమనించటం ఎంత ఆనందం :) ప్రతిరోజూ ఉదయమే మొక్కలలో తిరుగుతూ ఏవి పూసాయి, ఏవి వాడిపోయాయి అని పరిశీలిస్తూ ,నా మాట వినని  మొండి మొక్కలు రాధామాధవాన్ని, గన్నేరును మందలిస్తూ,నీకెప్పుడూ ఎర్ర మందారమే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని అలిగే పసుపు, గులాబీ మందారాల అలుకలు తీరుస్తూ , అదిగో అల్లదిగో అంటూ పైపైకి పోతున్నావు కాని ఎప్పుడు పూస్తావు అని మల్లెను కోపం చేస్తూ, నువ్వు బంగారుతల్లి పూయటం మొదలుపెట్టిన సన్నజాజిజి బుజ్జగిస్తూ (నా మొహం మూడే పూలు పూసింది. గట్టిగా అంటే అవీ పూయదేమో),నన్ను పూజకు ఎప్పుడూ కోయవు అని మూతిముడిచే గోరింట, చంద్రకాంత, కనకాంబరాలను ఓదారుస్తూ (అదేమిటో అవి పూజకు పనికి రావని ఎవరో చెప్పారు ) భావములో , భాహ్యంలో ఆ గోవిందుని తలుచుకుంటూ నేను పూజకు పూలు కోసుకొచ్చేసరికి చాలా సార్లు మావారి పూజైపోతుంది :) 

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం - 

Wednesday, September 11, 2013

నీరో చక్రవర్తిణి

నిన్నటి నుంచి మేము బరోడాలో వుండగా వున్న, మావారి పర్సనల్ కుక్ మోతీరాం గుర్తొస్తున్నాడు:) మావారు ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు, కాంప్ లకు వెళ్ళినప్పుడు వెంట వెళ్ళేవాడు. ఓ రెండు పెట్టెలల్లో స్టవ్, వంటసామాను అన్నీ తీసుకొని వెళ్ళేవాడు. భోజనం సమయం లో ఎక్కడ ఆగుతే , అక్కడ ఓ పక్కగా , పెట్టెలు తెరిచేసి గబగబా పులకాలు , ఆలూ సబ్జీనో ఏదైనా టిండ్ సబ్జీనో చేసి పెట్టేవాడు.ఈయన ఇంటికి వచ్చినప్పుడు మోతీరాం గరం గరం రోటీ, సబ్జీ , చాయ్ చేసిచ్చాడు అని తెగ మెచ్చుకునేవారు. సరే అంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నేనూ , ఆలూ సబ్జీ నో, ఏదైనా టిండ్ సబ్జీనో చేసిపెడితే,ఇంట్లో కూడా ఇవెందుకు ఫ్రెష్ కూరలు చేయక అని విసుక్కునే వారు.మరే ఏ ఎడారిలోనో మోతీరాం చేసిపెడితే ఇంటికి వచ్చినా అవే తలుచుకుంటారు నేను చేస్తే విసుక్కుంటారు అని మనసులో గొణుక్కునేదాన్ని. అంతేగా పైకి అనే ధైర్యం అప్పుడు లేదుగా :) ఇంట్లో ఏదైనా పార్టీ అనగానే , మసాల్చీ (హెల్పర్) తో సహా వచ్చేసేవాడు.అతని వచ్చేలోపలే నేను నా వంట కానిచ్చుకొని బయట కూర్చునేదాన్ని.అతను వంట పూర్తి చేసి, ఎంత రాత్రైనా పార్టీ అయ్యాక వంటిల్లు , స్టవ్ , గట్టు అన్ని శుభ్రంగా తుడిచి ప్లేట్లన్నీ బయటవేసి, వంటింట్లో వాసనలు రాకుండా స్ప్రే చేసి వెళ్ళేవాడు:)
ఓసారి ఇలాగే నా పని ముగించుకొని బయట వరండాలో కూర్చొని నవల చదువుకుంటున్నాను. ఇంతలో ఓ బుజ్జి కోడిపిల్ల గున గున లాడుతూ నా కాలి కిందికి వచ్చింది.తెల్లగా ముద్దుగా వుంది. ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తుంటే మోతీరాం పరుగెత్తుకొచ్చాడు.ఏమిటీ అంటే ఆ కోడిపిల్ల కోసం అట!అదేమిటి దీనితో ఏమిచేస్తావు అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను మేం సాహెబ్ అన్నాడు.లోపల చికెన్ , మటన్ వండుతున్నాడని తెలుసు కాని వాటికోసం ఇలా కోడిపిల్లలని చంపాలా అని కళ్ళు తిరిగిపోయాయి. చికెన్ అంటే కోడిపిల్లేకదా మేం సాహెబ్ అన్నాడు. పైగా జిందా చికెన్ ఐతే చాలా రుచి అట.మా అమ్మాయైతే దాన్ని చంపేస్తావా అని ఏడుపు మొదలు పెట్టింది.గుడియా రాణీ ఆప్ జాకె ఖేలో అని దాన్ని బుజ్జగించి పంపి, మేం సాహెబ్ కృపయా ఆప్ అందర్ మత్ ఆయియేగా అని శుద్ద హిందీలో చెప్పి , ఆ కోడిపిల్లను వెంటాడి పట్టుకొని వెళ్ళాడు.


ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడెందుకు గుర్తొచ్చాడు అంటే , ఈ రోజు ఇంట్లో 60 మందికి పార్టీ జరుగుతోంది.బరోడా నుంచి వచ్చేసాక ఎన్ని పార్టీలైనా ఇంట్లో నాన్ వెజ్ వండలేదు. పది సంవత్సరాల క్రితం వరకూ మా అత్తగారు, మామగారు వున్నారు. కాబట్టి నో నాన్ వెజ్ :) ఆ తరువాత పిల్లలకు ఇష్టంలేదు అందుకూ నో నాన్ వెజ్ :) ఇప్పుడు ఫుల్ సొతంతరం వచ్చేసింది. వాళ్ళ ఆఫీస్ లో వి.పి జాబ్ వదిలేసి వెళుతున్నాడు అందుకని ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచీ అందరినీ విత్ ఫామిలీస్ పార్టీ కి పిలిచేసారు.ఆ వి.పి ఈయన గారికి చాలా క్లోజ్. ఈయన కు బాస్ అట మరి. కాని చూసేందుకు ఈయనగారే బాస్, ఆ అబ్బాయి ఈయన అసిస్టెంట్ లా వుంటారు. ఈయన చేరక ముందు అతను అతని వీలుప్రకారం రావటం , అతని పనేదో అతను తాపీగా చేసుకోవటం అలవాటట.అప్పటికీ ఆ అబ్బాయి నాతో అన్నాడు, సార్ ని ఆఫీస్ కు రోజూ రానవసరం లేదు, టైం ప్రకారం రానవసరం లేదు అని చెప్పామండి కాని వచ్చేస్తున్నారు. మమ్మలినందరీ అలాగే రమ్మంటున్నారు. బోలెడు పని చేయిస్తున్నారు అని. అంటే అన్నాను అంటారు కాని ఈయన షంటింగ్ భరించలేకే జాబ్ వదిలేసి వెళుతున్నాడేమోనని నా డౌటూ :) కాదట హయర్ స్టడీస్ కు వెళుతున్నాడు అన్నారు కాని నాకైతే అనుమానమే ! ప్రియమైన శిష్యుడు వెళ్ళిపోతున్నాడని పార్టీ అన్నమాట!

నిన్నటి నుంచి పార్టీ ఏర్పాట్లు మొదలయ్యాయి. మావారి పర్సనల్ అసిస్టెంట్ నంబర్ 2 కం డ్రైవర్ మహేష్ , మా వాచ్ మాన్ వెంకట్రావు రంగం లోకి దిగారు.చుట్టు పక్కల వున్న హోటల్స్ నుంచి  నాన్ వెజ్ వెరైటీస్ కొద్ది కొద్దిగా తెచ్చారు. రుచి చూసారు. బావర్చీ నుంచి , ఏదోట. అమీర్పేట్ లో ఇంకేదో హోటల్ నుంచి ఇంకేదోట. ఆర్డర్స్ ఇచ్చేసారు.డబల్కా మీఠా, కుర్బాని మీఠా ఓ కప్పు తెచ్చారు.అవి తింటే డైయాబిటిక్స్ కాని వాళ్ళకు కూడా వచ్చే ప్రమాదం వుంది వద్దు,డబల్కా మీఠా నేను చేస్తానులెండి అన్నాను. సరే అన్నారు.పొద్దున్నే ఆయన ఆఫీస్ అసిస్టెంట్ కాల్ చేసి సార్ కలాకండ్, రబ్డీ ఇక్కడ మంచి ది దొరుకుతుంది తేనా అన్నాడు. వాకే తెచ్చేయ్ :) కలాకండ్ తో రబ్డీ ఏమిటి , జిలేబీ తో ఐతే బాగుంటుంది అని నేను గొణుగుతే ఓకే జిలేబీ కూడా 2 కిలోలు వచ్చేస్తోంది. సో స్వీట్ పత్తర్ ఘట్టీ నుంచి వస్తోంది.సరే నా డబల్కా మీఠా కాన్సిల్.వెజిటేరియన్ వంట మా శైలజ చేసేస్తుందిట. నువ్వు వంటింట్లోకి రాకమ్మా , నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేస్తావు, మా చెల్లి ని సాయం రమ్మన్నాను వస్తోంది అంది.పొద్దున్నే 6 గంటలకు మహేష్, వెంకట్రావు పైకి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ వెజిటేరియన్స్ కు, సెకండ్ ఫ్లోర్ నాన్ వెజిటేరియన్స్ కూ , డ్రింక్స్ కార్నర్, స్మోక్ జోన్ అన్నీ సార్ గారి ఆధ్వర్యం లో సద్దేసారు. ఇంతలో మావారికి ఆ వి.పీ కీ అతని భార్య కూ , ఇద్దరు పిల్లలకు దండలు వేస్తే బాగుంటుంది కదా అనిపించింది. అంతే ఇంకో అసిస్టెంట్ కు కాల్ చేసి , ఫ్లవర్ మార్కెట్ నుంచి నాలుగు గులాబీ దండలు తెమ్మని పురమాయించేసారు. దండలూ తయార్!

భారి ఎత్తున ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.అందరికీ నేను కాళ్ళకూ చేతులకూ అడ్డం వస్తున్నానట! ఓ రెండేళ్ళ క్రితం ఎవరైనా ఓ కప్పు  కాఫీ ఇస్తే బాగుండు, కాసేపు నడుము వాలుస్తే బాగుండు , అస్సలు కూర్చోనీయరు , నిలబడనీయరు  అని అనుకున్నమాట నిజమేకాని మరీ ఇంతగానా :) నాకు నేనే  నీరో చక్రవర్తిణి గా ఫీలవుతూ ఇక్కడ సెటిలైపోయాను:)

Wednesday, September 4, 2013

ఎటోవెళ్ళిపోయింది మనసు :)

"హాయ్ బామ్మా "
"హాయ్ కన్నా "
"కెన్ వుయ్ హావ్ మిడ్ నైట్ ఐస్క్రీం ?"
"వావ్ వాటే గ్రేట్ ఐడియా :)" ఎన్ని సంవత్సరాలైందో మిడ్ నైట్ ఐస్క్రీం తిని !అర్జెంట్ గా కళ్ళ ముందు రింగులు తిరిగిపోయాయి!
"బుజ్జిగాడా తప్పకుండా తిందాము కాని నువ్వు అప్పటి వరకు మెలుకువగా వుండగలవా మరి?"
"వుంటా బామ్మా."అనేసి హడావిడిగా "మహేష్" అని డ్రైవర్ ను పిలిచాడు.ఏమిటిబాబూ అంటూ వచ్చాడు మహేష్.
"నువ్వు మిడ్ నైట్ వస్తావా "?
మహేష్ కు అర్ధం కాలేదు :)
బాబు అర్ధరాత్రి బయటకు వెళ్ళి ఐస్క్రీం తింటాడట , నువ్వు వచ్చి తీసుకెళుతావా అని అడుగుతున్నాడు అని చెప్పాను.ఈ బామ్మా మనవళ్ళు ఎక్కడి పిచ్చోళ్ళు అనుకున్నాడో ఏమో , మా ఇద్దరినీ తిప్పి తిప్పి చూసి వస్తాను బాబూ అని చెప్పి వెళ్ళిపోయాడు.ఇహ అప్పటి నుంచి మా రాజాబాబు గారు గంతులే గంతులు. మాటి మాటి కీ టైం చూసుకోవటం , ఇంకా మిడ్ నైట్ ఎప్పుడవుతుంది బామ్మా అని హైరానా పడిపోవటం , నాకు చాలా ముచ్చటగా , వాడి కి చాలా భారం గా సమయం గడిచీ . . .  గడిచీ . . . మొత్తానికి 11 అయ్యింది!
ఇహ మా హడావిడి మొదలైపోయింది. అందరూ బయిలుదేరేవరకూ వాడికి ఎంత కంగారో!తాత వస్తానని మర్చిపోయి నిద్రపోయారు.ఎంత లేపినా ఊ ఊ అంటారే కాని లేవరు ! డాడీ కి మీటింగూ!ఏచేస్తాం ఇద్దరినీ వదిలేసాం:)హాయిగా మా కోడలు , నేనూ , మనవడు, మనవరాలు వెళ్ళాము.

అబ్బ ఐస్క్రీం పార్లర్ ఎంత చల్లగా వుందో!ఐస్క్రీం ఓ పట్టాన తేడు. మేమిద్దరమూ చలికి ఊహ్ అనుకుంటూ వున్నాము. చివరకు తట్టుకోలేక వాడేమో చేతులు షర్ట్ లో దాచేసుకున్నాడు:)నేనేమో కొంగు పూర్తిగా కప్పేసుకున్నాను:) ఐనా చలి మమ్మలిని వదలందే!ఇద్దరికీ ఆరాటమే కాని ఏదీ తట్టుకోలేరు అని మాకోడలు, మనవరాలు మామీద జోకులు!అమ్మయ్య ఎట్లా ఐతేఏం మావాడి షేక్ (ఏమి షేక్ అబ్బా వాడేదో పేరు చెప్పాడు మర్చిపోయాను ), నా కసాటా , మనవరాలి బుల్ ఐ , కోడలి లీచీ ఐస్క్రీం వచ్చాయి.చలికి వణుకుతూ , చల్లటి ఐస్క్రీం తింటం వావ్ అదో తుత్తి :)

బయటకు వచ్చి కార్ లో ఎక్కుతూనే మహేష్ కు థాంక్స్ చెప్పాడు. పాపం మహేష్ సిగ్గుపడిపోయి ముసిముసి నవ్వులు నవ్వాడు.అంతే మా పని ఐపోయింది. ఎంత నిద్ర ముంచుకు వచ్చిందో!ఇంటికి వెళ్ళేదాకా అన్నా ఆగరా అంటే ఆ నిద్ర ఎలా ఆగుతుంది.ఏదో మిడ్ నైట్ ఐస్క్రీం మోజులో అప్పటి వరకూ అగాడుకాని !అలా అలిసిపోయి మీదవాలి నిద్రపోతుంటే ఎంత ముద్దువచ్చేసాడో చిన్నిగాడు:)



పైన కనిపిస్తోందే అది నా కొత్త కంప్యూటర్. మా అబ్బాయి తెచ్చి ఇచ్చాడు.అలా ఇస్తే పరవాలేదు బోలెడు జాగ్రత్తలు చెప్పాడు .ఇప్పుడేకాదు ముందు నుంచీ అంతే!మొదటిసారి నేను కంప్యూటర్ వాడినప్పుడు ఏ సైట్ కు వెళ్ళాలన్నా పర్మిషన్ అడిగేది.మా అబాయి కంప్యూటర్ పక్కకు తిప్పి ఏదో చేసేవాడు వచ్చేది . అప్పట్లో నేంతగా అదేమిటో పట్టించుకోలేదు. నా లాప్ టాప్ పిల్లలూ వాడేవారు.ఏదో కాజువల్ గా చూసినట్లు నా ఈ మేయిల్సూ చెక్ చేసేవాడు:) అందరికీ తలో ఎకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు.ఓరోజు మనవరాలు అడిగింది"బామ్మా నువ్వు పెద్దదానివేకదా డాడీ  నీకు ఎడ్మిన్ష్ట్రేషన్ పవర్ ఇవ్వొచ్చుకదా " అని . నిజమే కదా అనుకొని మావాడి ని షంటి, వాడితో బోలెడు కండీషన్స్ పెట్టించుకొని అడ్మిన్ష్ట్రేషన్ పవర్ తీసుకున్నాను. అప్పటి నుంచి పిల్లలు ఏదో ఓపెన్ చేసి తెచ్చి బామ్మా ఇక్కడ నీ పాస్ వర్డ్ రాయి అనేవారు. అప్పటికీ నేను అదేమి సైటా అని చూసేదానిని. పిల్లసన్నాసులు ఏసైట్ కు వెళుతారు , ఏవో గేంస్ కు వెళ్ళేవాళ్ళు పాపం. ప్రతిసారీ వాళ్ళు అడగటం నేను టైప్ చేయటం ఎందుకని నా పాస్ వర్డ్ వాళ్ళకు చెప్పేసాను. ఆ సంగతి డాడీ కి చెప్పొద్దు అనుకున్నాముకూడా !స్చప్ ఎలాగో తెలిసిపోయింది !ఇహ చూసుకోండి ఏమి తాండవమాడాడో .ఐదుగురం (ఇద్దరు మనవరాళ్ళు , ఇద్దరు మనవలు , నేను అన్నమాట)బిక్క చచ్చిపోయి , నిలువు గుడ్ళేసుకొని చూస్తూ వుండిపోయాము!అదేమిటో నేను పెద్దదాన్ని , వాడి అమ్మను అన్న జ్ఞానం కూడా లేకుండా పిల్లల ముందు చెడామడా అరిచేసి, నా అడ్మిన్ష్ట్రేషన్ పవర్ పీకేసి,కొన్ని రోజులు నేను కూడా లాప్ టాప్ వాడొద్దు అని రూల్ పెట్టేసి అబ్బో ఏ చెప్పాలి నా కష్టాలు ! 

సరే అదంతా పాత కథ కదా ఇప్పుడెందుకు అంటే ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చింది నా కథ!నేను గ్రీటింగ్ కార్డ్స్ కోసం ఏవేవో డౌన్లోడ్ చేస్తున్నానట!అందువల్ల నా కంప్యూటర్ లో వైరస్ వచ్చి ఫార్మెట్ చేయించాల్సి వస్తోందిట.ఈ కొత్త లాప్టాప్ లో ఏవీ డౌన్లోడ్ చేయనూ అంటేనే ఇస్తానన్నాడు!ముద్దుగా వున్న విండోస్ 8 లాప్ టాప్ వదులుకోబుద్ది కాలేదు!ఓ పది రోజులు తీవ్రం గా ఆలోచించాను.( అవును మరి పది రోజులు టైం ఇచ్చాడు, నేను ఇక్కడ వున్నన్ని రోజులూ వాడుకుంటాను తరువాత ఇచ్చిపోతాను అని.)గ్రీటింకార్డ్స్ నా, కంప్యూటరా అని . నా లాప్టాప్ మళ్ళి ఫార్మెట్ చేయించే స్టేజ్ కు వచ్చింది.ఇప్పటికే చాలా సార్లు చేయించాను.ఓ క్షణం అనుకున్నాను , పోరా నువ్వియకపోతే మా ఆయన కొని ఇవ్వరా ( మరే నేను కంప్యూటర్ నేర్చుకున్నపటి నుంచి నేను కంప్యూటర్ తో బిజీగా వున్నాను అని సంతోష పడిపోతూవుంటారు) అని కూడా అనుకున్నాను. కాని బుజ్జి దాన్ని వదులుకోలేక , గ్రీటింకార్డ్స్ చేయటానికి వాడుపెట్టిన షరతులు ఒప్పేసుకున్నాను.ఇహ పైన ఫొటో షాప్ లో రకరకాలుగా చేయలేను. నా పోస్ట్ లలో ఇమేజెస్ పెట్టలేను !లేదా అందరినీ ఫొటోలు అప్పు అడుక్కోవాలి:) నేను తీసిన ఫొటోలో లేక ఇంకెవరన్నా పర్సనల్ గా తీసిన ఫొటోలో మాత్రమే వుపయోగించాలిట!నెట్ నుంచి అస్సలు అస్సలు తీసుకోవద్దట! ఈ లాప్టాప్ ఫార్మెట్ చేయిస్తే మటుకు ఇకపై నేను లాప్ టాప్ మర్చిపోవాల్సిదే అని హెచ్చరించి మరీ ఇచ్చిపోయాడు. ఓ పక్క సంతోషం , ఓ పక్క దుఖం:)

లాప్ టాప్ గోలకేమొచ్చే గాని , ఐస్క్రీం తిని వస్తుంటే మా బుజ్జిగాడు బామ్మా మనం ఐస్క్రీం తిన్నది నీ బ్లాగ్ లో వ్రాయాలి అన్నాడు. నేను మాట్లాడలేదు . అవునాంటీ తప్పకుండా వ్రాయండి. అంది . ఏమో అనూ నేను పిల్ల ల విషయాలు కొంచం ఓవర్గా వ్రాస్తున్నానేమో అనిపిస్తోంది అన్నాను. లేదాంటీ , మీకు తెలుసా గౌరవ్ కు నేనెప్పుడూ చెపుతూవుంటాను, నీ పిల్లలకు మీ బామ్మ నీ గురించి వ్రాసినవన్నీ చదివి వినిపిస్తాను.అప్పుడు మీ బామ్మ ఫ్రెండ్స్ ఇలా అన్నారు అని కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను అని అంది.నిజమా అని ఎంత త్రిల్ ఫీలైపోయానో!.అవునాంటీ పిల్లల చిన్నప్పటి సంగతులు మీ ఫీలింగ్స్ అన్నీ చదవటానికి బాగుంటున్నాయి.అవి వాళ్ళపిల్లలకు చదివి వినిపిస్తుంటే ఇంకా బాగుంటుంది కదూ అంది.

ఓహ్. . . నేనెప్పుడూ ఇలా అనుకోలేదు. బ్లాగ్ లో ఏదో రాసుకోవాలి అనుకోవటం , నీకు నచ్చినవి వ్రాసుకో అమ్మా అని మా అమ్మాయి సలహా ఇవ్వటం తో , పిల్లల సంగతులు , మావారి గురించి ఐతే ఏగొడవలు రావుకదా అనుకొని అవి వ్రాసుకుంటున్నానే కాని , భవిష్యత్తులో నా ముని మనవలు- మనవరాళ్ళు చదువుతారు అని ఎప్పుడూ అనుకోలేదు!పైగా ఈ మధ్య మరీ ఓవర్ గా వ్రాసానేమో అనుకున్నవి డిలీట్ చేసానుకూడా ! అయ్యో అనుకుంటున్నాను ఇప్పుడు. బుజ్జిగాడు వాడి బర్త్డే కు అడిగి మరీ కార్డ్స్ పెట్టించుకునేవాడు. పిల్లలు సర్ప్రైజ్ గా వాళ్ళ బర్త్ డేస్ కు పోస్ట్ వేస్తే ఎంత సంతోషపడిపోయేవారో. అలా సంతోషపడ్డానే కాని , ఈ  కోణం లో ఎప్పుడూ ఆలోచించలేదు .నా మునిమనవరాలు/మనవడు ను మధ్యలో పడుకోబెట్టుకొని, నా బ్లాగ్ ఓపెన్ చేసి, నాకోడలు చదివి వినిపించటం వూహించుకుంటూంటేనే ఎంత ఉద్వేగం గా వుందో!ఆ రోజు నేను వుండను కాని నా బ్లాగ్ , నా బ్లాగ్ లో నేను వ్రాసిన నా మనవడి గురించిన విషయాలు సజీవంగా వుంటాయి.మా కోడలు చెపుతుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.తట్టుకోలేని ఆనందం తో తనని హగ్ చేసి థాంక్ యూ అనూ అని చెప్పాను !ఏమో ఎవరు చెప్పొచ్చారు , ఆ మునిమనవడుగానో/ముని మనవరాలూగానో నేనే మళ్ళీ జన్మించి వుండవచ్చుకదా !అప్పుడు ముందు జన్మలో నేను వ్రాసుకున్నవే నేను వినటం ఓహ్ ఎంత అద్భుతంగా వుంది ఈ ఊహ!ఓ మరీ ఎటో వెళ్ళిపోయాను కదూ :)

నా మనవడి కోరిక మీద నా కొత్త లాప్ టాప్ వాడి మిడ్ నైట్ ఐస్క్రీం తోనే మొదలు పట్టాను :) అందుకే అన్ని విషయాలు , నా లాప్ టాప్ గురించి, ఐస్క్రీం గురించి , అఫ్ కోర్స్ నా పునర్జ్మ గురించి అన్నీ కదంబమాల లా వచ్చేసాయి:)