Showing posts with label శుభాకాంక్షలు. Show all posts
Showing posts with label శుభాకాంక్షలు. Show all posts

Wednesday, December 27, 2017

నా చిన్నారి సాహితి నవవసంతాలు పూర్తిచేసుకుంది :)





రాధామాధావాల పావడాను  కట్టి
జాజిపూలను జడలో తురిమి
గులాబీల అందాన్ని పొదుపుకొని
పారిజాతాల పరిమళాన్ని అద్దుకొని
ముద్దమందారాన్ని ముద్దుగా అరచేత ఉంచుకొని
మంచు బిందువులో తడిసిన నందివర్ధనం లా
ఓ వెన్నెల కిరణంలా, ఓ పిల్ల తెమ్మెరలా

నా చిన్ని ప్రపంచంలోకి వచ్చి, నాలోని ఊహలకు రూపాన్ని ఇస్తూ , నన్ను తొమ్మిది సంవత్సరాలుగా సాహితీవనంలో విహరింపజేస్తున్న నా చిన్నారి "సాహితి" కి జన్మదిన శుభాకాంక్షలు.

Friday, December 27, 2013

హాపీ బర్త్ డే సాహితి

 
ఈ రోజే నా బ్లాగ్ పుట్టినరోజు. నేనింకా రేపనుకుంటున్నాను. అదేమిటో ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేస్తోంది.

ఈ రోజు కు ఐదు సంవత్సరాలు నిండాయి.స్కూల్ల్ ల్లో వేయాలి :)  ఐదు సంవత్సరాలంటే ఎక్కువే :)  నేనసలు ఇన్ని సంవత్సరాలు బ్లాగ్ వ్రాస్తాననుకోలేదు :)

హాపీ బర్త్ డే సాహితి:)

Thursday, December 27, 2012

హాపీ బర్త్ డే సాహితి


సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదేసమయాని కి నేను ఓ సోఫాలో పడుకొని ఆంధ్రభూమి వీక్లీ చదువుతున్నాను . మా అబ్బాయి పక్క సోఫాలో లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటున్నాడు . పొద్దటి నుంచి ఆలోచిస్తున్న విషయం మా వాడి ని అడగటాని కి ఇదే సమయం అనుకొని , " వరే బాబా " అని ముద్దుగా పిలిచాను . "ఏమిటి మాతే " అని అంతకన్నా గారంగా అన్నాడు మావాడు ." పొద్దున రవి బావ తెలుగు లో కూడా బ్లాగ్ వ్రాయవచ్చని చెప్పాడు కదరా ఎలా వ్రాయాలి " అని అడిగాను .జవాబు లేదు . కాసేపు వాడి వైపు చూసాను . చాలా సీరియస్ గా లాప్ టాప్ లో తలదూర్చి వున్నాడు . హుం కుయ్ అనడు , కయ్ అనడు . కాసేపు పైకి , కాసేపు లోపల విసుక్కొని , ఎవరిమీదైనా ఆధారపడితేలే అనుకొని నిరాశ తో బుక్ లోకి తల దూర్చేసాను


. కొద్ది నిమిషాలు నిశబ్ధం గా గడిచిపోయాయి . నేనూ చాలా సీరియస్ గా సీరియల్ చదువు కుంటున్నాను . " మాతే నీ బ్లాగ్ కు ఏమి పేరు పెడుదామనుకుంటున్నావు ?" అని వినిపించింది . నాకు వాడేమన్నాడో ఓ క్షణం అర్ధం కాలేదు . ఏమిటిరా అని అడిగాను . మళ్ళీ అదే ప్రశ్నను అడిగాడు . అప్పుడు నేను చదువుతున్న సీరియల్ లోని హీరోయిన్ పేరు సాహితి . ఆ పేరు నచ్చి వెంటనే " సాహితి " అన్నాను .

 మళ్ళీ నిశబ్ధం . నేను మళ్ళీ నా సీరియల్ లోకి ." మాం ఇదిగో నీ సాహితి " అని అరిచాడు . నేను ఒక్క ఉదుటున లేచి కూర్చొని ఏమిటీ అన్నాను . లాప్ టాప్ నా ముందు పెట్టి " సాహితి - మాల " అన్నది నీ బ్లాగ్ పేరు టెంప్లెట్ ఏమిపెట్టాలి అని అడిగాడు . ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి ఐపోయాను . సింపుల్ టెంప్లెట్ అని చెప్పాను . నా ఆనందమో , ఆరాటమో ఏదో తెలీని స్తితిలో నేనుండగా ఇదిగో నీ బ్లాగ్ తయారైపోయింది . అని చూపించాడు . ఓ గంట సేపు దాని తో కుస్తీ పడి ఎలా వ్రాయాలి , ఎలా పోస్ట్ చేయాలి అన్నీ చూపించాడు . నా నోట్స్ లో గబ గబా రాసేసుకున్నాను . "ఇప్పుడేదైనా అందులో వ్రాయి " అన్నాడు . అమ్మో ఏమి వ్రాయాలి ? ఆలోచించుకొని రేపు వ్రాస్తాలేరా అన్నా .కాదు వ్రాయాల్సిందే అన్నాడు .

తడబడుతూ , సంతోషం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీక అబ్బ అప్పటి ఉద్వేగం చెప్పలేను . ఇదో ఇలా నేనూ , నా సాహితీ బ్లాగ్ లోకం లోకి వచ్చేసాము :) 

హాపీ బర్త్ డే సాహితి  :)





Friday, December 7, 2012

లక్ష్మిగారు అభినందనలు





పి.యస్. యం లక్ష్మి గారు యాత్ర లక్ష్మి గా బ్లాగ్ లలో అందరికీ పరిచయమే . ఆవిడ హైదరాబాద్ లోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసు నుంచి సీనియర్ ఎకౌంటెంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు . అంతటి పదవిని నిర్వహిస్తూ , పిలల్లను , ఇంటినీ గృహిణిగా చూసుకుంటూ , తీరిక సమయాలలో  దేవాలయాలను దర్శించటం ఆవిడ హాబీ . అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై సెటిలైపోయారనుకోండి :) విచిత్రమేమిటంటే వారి శ్రీవారు శ్రీ.యం . వెంకటేశ్వర్లు గారి కి కూడా ఈ హాబీ వుండటం .భార్యాభర్తలిద్దరి కీ ఒకే హాబీలుండటం  , అవి పాటించటం చాలా అరుదు .నాకంతా మావారి సహకారమే . ఆయన సహకరించకపోతే నేను ఇన్ని వూళ్ళు తిరుగగలిగేదానిని కాదు అంటారు లక్ష్మిగారు .

మామూలుగా ప్రశిద్ది చెందిన దేవాలయాలనే కాదు , ఎక్కడెక్కడో వున్న చిన్న చిన్న దేవాలయాలనూ , పురాతన దేవాలయాలనూ దర్శించారు లక్ష్మిగారు . వూరికే చూడటమే కాదు , వాటిగురించి , అవి ఎక్కడవున్నాయి , ఎలా వెళ్ళాలి , అక్కడి సదుపాయాలేమిటి , వాటి చరిత్ర అన్నీ వివరం గా వారి బ్లాగ్ "యాత్ర" లో వ్రాశారు . చాలా వరకు వివిధ పత్రికలలో వ్యాసాలుగా కూడా ప్రచురించారు .అంతేకాదు  ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్తలాలను పుస్తక రూపంగా తీసుకురావాలనే ఆకాంక్షతో ఇప్పటిదాకా నల్గొండ , వరంగల్ జిల్లా  పుణ్యక్షేత్రాలు , 'యాత్రా దర్శిని -నల్గొండజిల్లా', 'యాత్రా దర్శిని -వరంగల్ జిల్లా ' లను ఈబుక్స్ రూపం లో కొనిగె. ఆర్గ్ వారు ప్రచురించారు . ఇవేకాక కొనెగె వారు ప్రచురించిన మరొక ఈపుస్తకం ' పంచారామాలు - పరిసర క్షేత్రాలు '. ఇంకా త్వరలో రాబోతున్న ఈ బుక్స్ ' కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లూ

' హైద్రాబాదు నుంచి ఒక రోజులో '

హైద్రాబాదు నుంచి రెండు రోజులలో '




ఈ బుక్స్ గానే కాక "యాత్రాదీపిక , వరంగల్ జిల్లా " , వరంగల్ జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ వ్రాసిన పుస్తకాన్ని ప్రింటు చేయించారు . మామూలుగా వరంగల్ అనగానే గుర్తువచ్చేది వేయిస్తంబాల గుడి , వరంగల్ దగ్గరగా వున్న రామప్ప దేవాలయం . కానీ ఈ పుస్తకం లో వరంగల్ , హనుమకొండ , ఖాజీపేటలలో వున్న 12 దేవాలయాల గురించి ,వరంగల్ చుట్టుపక్కల వున్న 11 దేవాలయాల గురించి వివరించారు .

ఈ రోజు 7-12-2012 శుక్రవారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు రంజని - తెలుగు సాహితీ సమితి, ఏ.జీఆఫీస్ హైద్రాబాద్ వారి ఆధ్వర్యం లో , ఏ. జీ ఆఫీస్ రంగస్తలం లో ఆవిష్కరించారు . ప్రక్యాత రచయత , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ గారు పుస్తకావిష్కరణ గావించారు .ఆచార్య అయినవోలు ఉషాదేవి , పిఠాధిపతి , భాషాబివృద్ధి పీఠం , పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం గారు వక్త గా వ్యవహరించారు . అనుకోకుండా ఇద్దరు గెస్ట్ లూ వరంగల్ వాస్తవులే అయ్యారు :)




కార్యక్రమము  ముందుగా శ్రీమతి శిష్టా లీలా వసంత లక్స్మి బృందము ఆలపించిన గానలహరితో ప్రారంభం ఐనది .



తరువాత డాక్టర్ నవీన్ గారు పుస్త్కావిష్కరణ గావించారు . ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు , పుస్తకం లోని అంశాలను చూపుతూ ప్రసంగించారు . ఆపైన రంజని -తెలుగు సాహితీ సమితి వారు లక్ష్మిగారి ని శాలువతోనూ , పూలమాల తోనూ , జ్ఞాపిక తోనూ సత్కరించారు






వారే కాదు , లక్ష్మిగారి అక్క చెళ్ళెళ్ళు , వారి కాలనీ లోనివారి స్నేహితులూ శాలువాలతో , పూలమాలల తో , చీరల తో సత్కరించారు . అన్నట్లు  నేనూ ఓ పూల బుకే ఇచ్చానండోయ్ :)

కార్యక్రమము ఆసాంతమూ చాలా చక్కగా జరిగింది .




లక్ష్మిగారు , మీరు మరిన్ని వూళ్ళు తిరగాలని , ఆ విశేషాలన్నీ చక్కని పుస్తకాలుగా ప్రచురించాలనీ , ఇంకా ఇంకా సత్కారాలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ  మీకు అభినందనలు తెలియజేస్తున్నాను .  .

Saturday, March 31, 2012

సీతారాములు మా ఇంటికి వచ్చిన శుభవేళ



మా కాలనీ లో ఈ రొజే సీతారామ కళ్యాణం చేసుకున్నాము . ఉదయం 10 .30 కు మా సీతారాములు , లక్ష్మణ , ఆంజనేయ సమేతంగా మా కాలనీ లో ఊరేగింపు గా బయలు దేరారు . మా ఇంటికి ఎప్పుడు వస్తారా అని , పాదప్రక్షాళణ కోసం నీరు , సుందరమైన మా సీతారాములకు ధృష్ఠి తీసేందుకు కొబ్బరికాయ , పూజించేందుకు పసుపు , కుంకుమ పూలు తీసుకొని ఎదురుచూస్తూ నిలబడ్డాను .






ఎదురు చూస్తుండగా సీతారామ ,లక్ష్మణ ఆంజనేయులను మా వారు తీసుకొని రానే వచ్చారు .



నేను సీతారామ,లక్ష్మణ , ఆంజనేయుల పాదాలను కడిగి , కొబ్బరికాయ తోదృష్ఠి తీసి ఇవ్వగా , మావారు కొబ్బరికాయను కొట్టారు . ఆ తరువాత నేను , మా వదినగారు హారతి ఇచ్చాము .









మా కాలనీ అంతా ఊరేగించిన తరువాత , మా పార్క్ లో వేసిన వేదిక మీద సీతారామలక్ష్మణ ఆంజనేయులను స్థాపించాము .



ఆ పైన కన్నుల పండుగ గా సీతారాముల కళ్యాణం జరిపించాము . మావదినగారు , అన్నయ్యగారు కన్యాదాతలుగా ,గొట్టిముక్కల నరసిమ్హారావుగారు వారి పత్ని వరుని తల్లి తండ్రులుగా వ్యవహరించారు . కళ్యాణము లోని కొన్ని ముఖ్యఘట్టాలు .

కన్యాదానం ;



మంగళసూత్రం ;



మాంగల్యధారణ ;



ముత్యాల తలంబ్రాలు ;



పెళ్ళికావలసిన అమ్మాయిలు కొంగుబట్టి తలంబ్రాలు పట్టుకున్నారు .ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలములిచ్చారు .

రంగ రంగ వైభోగం గా కళ్యాణం జరిగాకా , పానకం వడపప్పు , లడ్డూ ప్రాసదం తీసుకొన్నాము .

సీతా కళ్యాణ వైభోగమే , రామా కళ్యాణ వైభోగమే .

శ్రీరామనవమి శుభాకాంక్షలు .

Sunday, January 1, 2012

హాపీ న్యూ ఇయర్



2011 జనవరి న్యూఇయర్ పార్టీ కి మా అబ్బాయి , మేమిద్దరమూ కలిసి వెళ్ళాము . ఆ తరువాత రెండు రోజులకె అమెరికా వెళ్ళిపోయాడు . అంతకు నెల క్రితమే కోడలు , పిల్లలు వెళ్ళారు . 2011 మొదట్లో 40 సంవత్సరాల క్రితం , పూనా లో వున్నట్లు , ఇంట్లో ఇద్దరమే మిగిలాము . నావరకు నాకు చాలా పెద్దమార్పు. కొన్ని రోజులు దిగులు దిగులుగా వుంది . స్చప్ . . . కాని ఏమి చేస్తాము , పిల్లలు వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళూ చూసుకోవాలిగా , దిగులెందుకు , మేము దేశమంతా తిరగలేదూ ! వాళ్ళు విదేశాలు ఓపికున్నంత కాలం తిరుగుతారు . మట్లాడుతూనే వున్నారు , స్కైప్ లో కనిపిస్తూనే వున్నారు అనుకొని సద్దేసుకున్నాను :)

పిల్లలు పెద్దవాళ్ళైపోయారు . ఇద్దరూ హాపీగా సెటిల్ అయ్యారు . మనవలు , మనవరాళ్ళు బుడుగు లాగా వాళ్ళంత వాళ్ళు వాళైనారు . బరువు లు , బాధ్యతలు లేవు .
" నాకు నువ్వూ , నీకు నేను ,
ఒకరికొకరం నువ్వూ నేనూ "
అని హాపీస్ గా పాడేసుకుంటూ , మాజాంగ్, కార్డ్స్ ఆడుకుంటూ , , , కిట్టీ పార్టీలూ , లేడీస్ మీటింగ్ లూ అటెండ్ అవుతూ , అప్పుడప్పుడు బ్లాగ్ చూసుకుంటూ బేఫికర్ గా వుంటే . . . . .
హూం . . . . .
కాలం పెద్ద జలక్ . . . పెద్ద కుదుపు కుదిపేసింది * * * * *
అలా చేయక పోతే కాలమెలా అవుతుంది ? అమ్మో . . . తలుచుకుంటే నే వళ్ళు జలదరిస్తోంది . పిల్లల ఆసరా , బంధుమితృల సహకారం తో మళ్ళీ మామూలు మనుషులమయ్యాము . 2011 వెళుతూ వెళుతూ , సుఖ సంతోషాలే కాదు , ఇబ్బందులను కూడా తెలుసుకోవాలి అని తెలియ చెప్పింది ! "ఆరోగ్యమే మహాభాగ్యం " అనే నీతి పాఠాన్ని చెప్పి వెళ్ళింది ! లైఫ్ ను ఎంజాయ్ చేయండి , కాని ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించింది !

సో 2011 స్టార్టింగ్ , ఎండింగ్ వెరైటీ గా గడిచిందన్నమాట :)
మరి 2012 ఎలా వుంటుంది అని ' శివాజీ ' ( చిలుక పేరు ) ఏమి చెప్పిందంటే ,

Wednesday, December 28, 2011

సాహితి అలిగింది :(



నిన్నటి తో సాహితి కి మూడు సంవత్సరాలు నిండాయి . నిన్న బర్త్ డే చేసేందుకు వీలు కాలేదు . పొద్దటి నుంచీ వీలు కాలేదు . స్చప్. . . ఏమి చేయను ? ఇంతలోనే అలిగేసింది నా సాహితి . పాపం ఎంతైనా మూడు సంవత్సరాల ముద్దు పాపాయి కదా ! నా వీలూ చాలూ తెలుసు కునే వయసెక్కడిది ? సారీ రా అమ్మలూ వెరీ వెరీ సారి . చూడు . . . చూడు నీకోసం ఇప్పటి కిప్పుడే బర్త్ డే కార్డ్ చేసానా ? మరి నీకోసమే కదా ఈ కార్డ్ :)




మా బుజ్జి కదూ . . . మా బంగారు కదూ దామ్మా కేక్ కట్ చేద్దాం . . .
హాపి బర్త్ డే టు యూ . . .
హాపీ బర్త్ డే టు యూ . . .
హాపీ హాపీ బర్త్ డే డియర్ సాహితీ . . .
హాపీ బర్త్ డే టు యూ * * * * *

ఇక నవ్వమ్మా నవ్వు . . . నవ్వాలి మరి . . . . .




హే . . . . . నవ్విందమ్మా నవ్వింది . మా బంగారు తల్లి అలక తీరి నవ్వింది :)

మూడు సంవత్సరాల క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చాము నేనూ , మా సాహితి . బెరుకు బెరుకుగా ఏమీ తెలియని తనం తో , ఈ వింత ప్రపంచం లోకి అడుగు పెట్టి మూడు సంవత్సరాలైంది * * * మూడు సంవత్సరాలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి . బెరుకు తనం పోయిందా ????? ఏమో :))))) కొంచమైనా పెపంచ జ్ఞానం వచ్చిందా ????? ఏమో ????? ఏహే అన్నింటి కీ ఏమో ఏమిటి ????? ఏమో :)))))
సాహితి ని ప్రేమగా ఆదరించిన మీ అందరి కీ ధన్యవాదాలు .

Wednesday, June 8, 2011

మా చిన్ని అదితి కి అభినందనలు



"అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకు ముద్దు ,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు ,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు ,
మాచిన్ని అదితి మాకు ముద్దు ."
అని పాడగానే కిలకిలా నవ్వేది మా చిన్ని అదితి . కళ్ళు విప్పార్చుకొని మరీ చూసేది . అబ్బో మా అదితి కళ్ళు ఎంత అందమైనవో ! పుట్టీ పుట్టగానే కళ్ళు తెరిచేసింది . అప్పుడే లోకాన్ని చూసేయాలని ఎంత ఆరాటమో ! కళ్ళు మిల మిలా మెరుస్తూ , చాలా బ్రైట్ గా వుండేవి . కార్ లో నా పక్కన , కార్ సీట్ లో కూర్చొని రెప్ప వేయకుండా , సీరియస్ గా చూసేది . అమ్మ ఇంట్లో వున్నంతసేపూ నాతో నే ఆటలూ పాటలూ . కాని అమ్మ బయటికి వెళ్ళిందో అంతే ఏడుపే ఏడుపు . అమ్మా కావాలి , అమ్మమ్మా కావాలి :) అంతే తప్ప పాపం ఎప్పుడూ గొడవ చేయలేదు . అసలు పుట్టిన రెండో రోజే ఇంట్లో స్నానం చేయించాలి అంటే ఎంత భయము వేసిందో ! మా అమ్మాయికి , అల్లుడి కి నా గొప్ప చూపించుకోవాలి కదా ! పైగా వాళ్ళిద్దరికీ బేబీ టబ్ లో కాకుండా చక్కగా నూనే రాసి , నలుగు బెట్టి స్నానం చేయించాలని కోరిక . పైగా మా అమ్మ తో సున్ని పిండి ప్రత్యేకముగా చేయించి తెచ్చుకుంది నా కూతురు :) నాకొచ్చు నాకొచ్చు అని బడాయికి పోయి , మా అత్తగారిని మనసులో తలుచుకొని , టబ్ లో కూర్చొని , కాళ్ళ మీద పసిపిల్లను వేసుకొని స్నానము చేయించేసాను . పాపము హాయిగానే వుండిందో , నొప్పే పుట్టిందో తెలీదు కాని , కుయ్ , కయ్ అనకుండా స్నానం చేయించేసుకుంది మా బంగారక్క . ఏడాదికే ముద్దు ముద్దు మాటల తో ,
" ఐ లవ్ యు ,
యు లవ్ మి ,
వుయ్ అర్ ఆర్ హాపీ ఫామిలీ ,
వితె గ్రేట్ కీస్ అండ్ హగ్ ,
ఐ లవ్ యూ అమ్మమ్మా ."
అనిపాడేది . ఎంత సంతోషమో కదా ! మరే మా బంగారుతల్లి అంతా నా పోలికే :)

ఇలా నా మనవరాలి గురించి చెప్పాలంటే బోలెడు కబుర్లు వున్నాయి . అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లే వున్నాయి . నిన్న మొన్నటి పసికూన 10త్ మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యింది . ఈ రోజు నుంచి కాలేజ్ గర్ల్ ! పిల్లలు పెరుగుతూ వుంటే వారి ఆటపాటలను చూస్తూ మురిసిపోవటము బాగానే వుంటుంది కాని అప్పుడే ఇంత పెద్దవాళ్ళు ఐపోయారా అని బెంగ కూడా వేస్తుంది ! కాని తప్పదు కదా !!!
భవిష్యత్తు లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ,
నీకు ఇష్టమైన , నచ్చిన ఫీల్డ్ లో రాణించాలని కోరుకుంటూ ,
ఆల్ ద బెస్ట్ అదితీ .

మా అదితి కి ఇష్టమైన చాక్లెట్ కేక్ తిని , ఈ రోజు నుంచి కాలేజీ కి వెళుతున్న మా అదితి ని మీరందరు కూడా విష్ చేసేయండి మరి.. పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు రక్ష కదా !

Tuesday, February 15, 2011

Monday, December 27, 2010

అయ్యబాబోయ్ సాహితి కి రెండేళ్ళట !!!!!!!!!!!!!!



కొత్త పోస్ట్ హారం, మాలిక లో వెంటనే కూడలి లో పది నిమిషాలు ఆలశ్యముగా విడుదలైంది . ఎలా నడుస్తుందో ఏమో ? కూడలి నుండి 63 టికెట్స్ అమ్ముడయ్యాయట . హారం నుంచి 49 , మాలిక నుంచి 26 అమ్ముడయ్యాయని స్టేట్స్ చెపుతోంది ! స్చప్ . . . అంతేనా ???? మొత్తం 200 లైనా కాలేదు (((( . . . . . ఈ గ్రాఫ్ ఎప్పటికి పైకి పోను ? కామెంట్స్ కూడా 8 ఏ వచ్చాయి , , , , ,

కొత్త పోస్ట్ రాసినప్పుడల్లా , కోట్లు గుమ్మరించి కొత్త సినిమాను విడుదల చేసిన నిర్మాతను మించి ఆత్రుత , టెన్షన్ :) అవును మరి కోటి కోటి ఆలోచనలు చేసి రాస్తాను కదా ఆమాత్రం ఆత్రుత వుండదేమిటి ?:-)అలా అని అన్ని పోస్ట్ల కూ ఆ ఆత్రుత వుండదు . చాలా బాగా రాసాను అనుకున్నదానికే , రామచరణ్ సినిమానో , జూనియర్ యంటీఅర్ సినిమానో కోట్ల తో నిర్మించి , విడుదల చేసి , రిజల్ట్ కోసం అన్ని కేంద్రాల లోని తన ఏజంట్ల కు కాల్ చేసి , ఎప్పటికప్పుడు ఎలా నడుస్తోందో తెలుసుకుంటూ వుండే నిర్మాతలా ఫీలైపోతూవుంటాను ! టెన్షన్ పడిపోతూవుంటాను . కాని అదేమిటో నేను బాగున్నది అనుకున్న పోస్ట్ కు టుక్కూ . . . టుక్కూ . . . టుక్కూ అనుకుంటు రెండో మూడో కామెంట్స్ వస్తాయి :)

అసలు రెండు సంవత్సరాల క్రితం బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు రెండు సంవత్సరాలు బ్లాగ్ వ్రాస్తానని నేనేమాత్రమూ ఊహించలేదు . ఏదో కొన్ని రోజు వ్రాసి ఆపేస్తాననుకున్నాను .రాస్తూనే వున్నాను . పైగా ఈ ఎదురుచూపులు ! ఇంకా ఆపైన ఐదు బ్లాగులు ! అంతేనా బుక్స్ అండ్ గర్ల్స్ ఫ్రెండ్స్ కు ఫస్ట్ గెస్ట్ ఆథర్ ని ! అంతేనా ? చిత్రమాలిక కూ మొదటి అథిది రచయిత్రినే :) ఏమిటో అంతా మాయ , కల ! కమ్మటికల :)

సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు .

శ్రీలలిత గారు , ఈ కార్డ్ చేసి కానుకగా పంపారు .అభిమానము తో వచ్చిన కానుకను మరి అందుకోకుండా వుండగలనా ? థాంక్ యు శ్రీలలిత .



ఇంకా ఎవరైనా కానుకలు ఇద్దామనుకుంటే ఇచ్చేయండి . ఎంతైనా రెండు సంవత్సరాల పాపాయే కదా ! అందుకే ఈ పుట్టినరోజు కు కానుకలు స్వీకరించబడవు అని రిస్ట్రిక్షన్ పెట్టలేదు :))

Wednesday, December 22, 2010

ప్రమదావనం పండుగ



ఈ రోజు మా ప్రమదావనం పండుగ . ఇదేమి పండుగ పేరు వినలేదే అంటున్నారా ? అవునండి ఇది మాకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ . మా అందరికీ స్నేహితురాలు , హితురాలు , మాలో కొందరికి బ్లాగ్ గురువు , ఈ ప్రమదావనం రూపకర్త జ్యొతి పుట్టిన రోజు .
మరి మా గురూజీ పుట్టిన రోజు న షడ్రుచుల తో విందివ్వాలా ? ,
వీనుల కింపైన పాటలు వినిపించాలా ?
చక్కనైన చిత్రాలు తీయాలా ?
అమ్మో అమ్మో ఎంత హడావిడి . మీతో మాట్లాడేందుకు టైం లేదు . మా పార్టీ అయ్యాక ఆ విశేషాలతో అభినందనమాల లో కలుద్దాం * * * * *

Tuesday, September 21, 2010

హాపీ బర్త్ డే టు గౌరవ్





ఎవరైనా నాన్న భుజాల మీద ఎక్కుతారు . లేదా వీపు నెక్కుతారు . కాని నాన్న బుగ్గ మీద ఎక్కటము చూశారా ?లేదు కాదా ? ఇదో ఇలా , నాన్న బుగ్గ ఎక్కి ముద్దులు కుడుస్తున్న , మా చిన్నారి , బంగారు తండ్రి , నా రాజాబాబు గౌరవ్ పుట్టినరోజు ఈ రోజు .

నా బంగారు కన్నా .
హపీ బర్త్ డే టు యు .


Monday, May 10, 2010

వాలుకొబ్బరి చెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు



' వాలు కొబ్బరిచెట్టు ' పేరు చూడగానే , ఇదెవరో కోనసీమ వాళ్ళే రాసివుంటారు అనుకుంటూ చూసాను . వాహ్వా నా గెస్ కరెక్టే . అలా మొదటిచూపులోనే దోస్త్ ఐపోయింది , వాలుకొబ్బరిచెట్టు . అందులో వచ్చే కోనసీమ తోటల కబుర్లకు మహా కుళ్ళుకొని , అంతలా వూరించక పోతే మమ్మలిని పిలవొచ్చుగా మీ తోటకు అని పోట్లాటేసుకున్నాను . అలా సుభద్ర తో కూడా దోస్తీ కుదిరి పోయింది . వాలుకొబ్బరి చెట్టూకింద కూర్చొని , కొబ్బరి నీళ్ళు తాగుతూ ఎన్ని కబుర్లు చెప్పుకుంటామో లెక్కే లేదు .

చిన్ని కశుగాడిని నవ్వరా బాబూ ఎంత బతిమిలాడుకున్నా అబ్బో ఎంత ఏడిపించాడో , విజయభాస్కరవర్మ గారి పేరు , సుభద్ర పేరు తో ఎంత హిస్టరీకల్గా మాచ్ అయ్యిందో . పెళ్ళికాని ప్రసాదుల కోసం కేరళ కుట్టీల ( బంగారం ) అందాలూ , రాజాధిరాజంట అంటూ అంట అట అని విన్న న్యూస్లూ , మరుజన్మలో జేజి గా పుట్టాలి అని , జేజిని తలుచుకునే కబుర్లూ , ఇలా ఒకటేమిటి బోలెడు కబురులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వుండ గా వుండగా ఏడాది గడిచి పోయింది . ఎంత తొందరగా గడిచి పోయిందో కదా !

ఇంకా బోలెడు సంవత్సరాలు ఇలాగే ఇంకా ఇంకా బోలెడు కబుర్లు , చెప్పాలని కోరుకుంటూ ,

వాలుకొబ్బరిచెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు .

Friday, January 1, 2010