Showing posts with label అనగనగా. Show all posts
Showing posts with label అనగనగా. Show all posts

Saturday, June 5, 2010

ముచ్చటగా మూడు కథలు





నేను నా బుక్స్ కొనుకున్నప్పుడల్లా , మా పిల్లల కోసం కూడా కథల పుస్తకాలు కొంటూ వుంటాను . ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకు కథలు చెప్పుకోవటము ( వాళ్ళు నాకు , నేను వాళ్ళకు ) తప్పనిసరి . ముందుగా కొన్ని బుడుగు కథలు , అందులో కాళిదాసు కవిత్వం కొంత , నా కవిత్వం కొంత కలిపి చెప్పుకున్నాక , వేరే కథలు చెప్పుకుంటామన్న మాట . అందులోని , ముచ్చటగా మూడు కథలు చెపుతాను . ఆలకించండి .

అమ్మ పెట్టేవి రెండు .

ఒకరోజు మా మనవరాలు అదితి అన్నం తినటానికి మారాము చేస్తోంది . అప్పుడు అక్కడ పనిచేసుకుంటున్న , మా పనిమనిషి సుబ్బులు రెండు పీకమ్మా , ఆమే తింటది . మా అమ్మ అంతే చేస్తది అంది . అంతే ఆ పనమ్మాయి పేరుతోనే చిన్నప్పటి నుండి నేను విన్న కథ అదితి కి చెప్పాను . అంతే కాదు , నా మనవలు , మనవరాళ్ళందరికీ అన్నం తినేముందు ఈకథే చెపుతాను . నేను మొదలు పెట్టగానే , సుబ్బలక్ష్మి కథ వద్దు బాబోయ్ , మేము అన్నం తింటాం కాని ఇంకేదైనా కథ చెప్పు అంటారు వాళ్ళు ! వద్దు బామ్మా వద్దు మేము అన్న తింటాము అని మా మనవలు దండాలు మొదలు పెడుతారు . అన్నం మింగావా .. . మింగు లేక పోతే అమ్మమ్మ , సుబ్బలక్ష్మి కథ చెపుతుంది అని పాటలు పాడుతారు . అంత సరదా మా మనవలకి , మనవరాళ్ళకి ఈ కథ అంటే . అంతటి పేరు , ప్రఖ్యాతి కలిగిన కథ ఇది .

అనగనగా ఒక వూళ్ళో సుబ్బలక్ష్మి అని ఓ అమ్మాయి వుంటుంది . ఆ అమ్మాయికి పెళ్ళై అత్తవారింటి కి వెళుతుంది . కొత్త కోడలు వచ్చింది కదా అని మురిపెంగా అత్తగారు , పులిహోర , పాయసం చేసి , కోడలి కి వడ్డిస్తుంది . అప్పుడు సుబ్బలక్ష్మి నాకు మా అమ్మ పెట్టేవి రెండు కావాలంటుంది . ఏమిటమ్మా , మీ అమ్మ పెట్టేవి అని అత్తగారు ఆప్యాయంగా అడుగుతుంది . మా అమ్మ పెట్టేవి అని మాత్రమే అంటుంది సుబ్బలక్ష్మి . కొత్త కదా మొహమాటం పడుతోందేమో చెప్పటాని కి అనుకొని , అత్తగారు , లడ్డూలు చేసి పెడుతుంది .

అబ్బే , సుబ్బలక్ష్మి తింటేనా ?? ఊం హుం ! మా అమ్మ పెట్టేవీ . . . అని మొదలు పెడుతుంది .

సరే పోనీయ్ పాపం అనుకొని అత్తగారు గారెలొండి పెడుతుంది . అబ్బే తినదే ! మళ్ళీ మా అమ్మపెట్టేవీ అని రాగాలు మొదలుపెడుతుంది . ఇంటిల్లి పాదీ వచ్చి , నీకేం కావాలో చెప్పమ్మా , వండిపెడతాము . బంగారు తల్లి వి కదూ ఏడవకమ్మా అని బతిమిలాడుతారు . నాకు ఆకలేస్తోంది , మా అమ్మ పెట్టేవి కావాలి అని ఏడుస్తూ ఎంతసేపటికీ ఆపదే ! అపుడు సుబ్బలక్ష్మి భర్తకు విసుగొచ్చి ఇవి మింగుతావా మింగవా అని రెండు దెబ్బలేస్తాడు . అంతే సుబ్బలక్ష్మి ఏడుపాపేసి , ఇవే మా అమ్మ పెట్టేవి అని ఆనందంగా అని అత్తగారు చేసినవన్ని తినేస్తుంది .

మింగావా మింగు అని కూడా మా పిల్లలు అన్నం దగ్గర పాట పాడుతూ వుంటారు . ఇదండీ అమ్మ పెట్టేవి రెండూ కథ .

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -


ఇక రెండో కథ , కలసివుంటే కలదు సుఖం .

అనగనగా ఒక వూళ్ళో సంజ్యొత్ , సతీష్ ( అను , బిపు ) అనే అమ్మానాన్న వుంటారు . వారికి అదితి , విక్రం ( మేఘ , గౌరవ్ ) అని , ఇద్దరు పిల్లలుంటారు . ఒకరోజు అమ్మ బేగంపేట బేకర్స్ ఇన్ కు వెళ్ళి మంచి కేక్ తెస్తుంది . పిల్లలకిచ్చి మీరు తినండి , నాకు పని వుంది అని లోపలకు వెళుతుంది . నేను కట్ చేస్తాను అంటే నేను కట్ చేస్తాను అని ఇద్దరూ పోట్లాడుకుంటూ వుంటారు . ఎందుకంటే ఎవరు కట్ చేస్తే , వారు పెద్ద ముక్క తీసుకుంటారని రెండోవారికి అనుమానమన్నమాట . ఇంతలో పక్కింటి కరటకుడు వచ్చి నేను ఇద్దరికీ సమానం గా కట్ చేసి ఇవ్వనా అంటాడు . సరే అంటారు పిల్లలు .

కరటకుడు కేక్ ను కట్ చేసి చెరో ముక్కా ఇస్తాడు . అప్పుడు ఊ ఊ అక్కకు పెద్దది ఇచ్చావు , నాకు చిన్నది ఇచ్చావు అని తమ్ముడు ఏడుపు మొదలు పెడుతాడు . ఓహో అవునా , సరే ఐతే అని తమ్ముడి దాని లోనుండి కొంత కట్ చేసి తినేస్తాడు కరటకుడు . అప్పుడు అక్క నాకు చిన్నదిచ్చావు అని గొడవ పెడుతుంది . అప్పుడేమో ఎంచక్కా అక్క కేక్ లోనుండి కట్ చేసి తినేస్తాడు . అలా కేక్ మొత్తం తినేసి , పిల్లలకు టా టా చెప్పి హాపీగా వెళ్ళి పోతాడు . ఇద్దరూ ఏడుపు మొహాలేసుకొని కూర్చుంటారు . అమ్మ వచ్చి , సంగతి తెలుసుకొని , చూసారా , అందుకే సిస్టర్ , బ్రదర్ ఎప్పుడూ పోట్లాడుకో కూడదు . కలిసి మెలిసి వుండాలి . పెద్దవాళ్ళైనా కూడా ఒకరికొకరు ఫ్రెండ్లీ గా వుండాలి అంటుంది . అప్పటి నుండి పిల్లలు పోట్లాడుకోకుండా హాపీ గా కలిసి మెలిసి వుంటారు .

ఇహ కొసమెరుపేమిటంటే ఈ మధ్య ఈకథ చెపుతుంటే ఇంత కష్టం ఎందుకు , హాయిగా స్కేల్ తో కొలిచి కట్ చేసుకుంటే ఐపోతుంది కదా అంటున్నారండి , మా పిల్లలు . ఇదీ ఈ కథ ఎఫ్ఫెక్ట్ !!!!!!

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ముచ్చట గా మూడో కథ :

ఆడిన మాట తప్పరాదు .

ఒకసారి అమ్మ అను ( సంజు ) , పిల్లలు , మేఘ , గౌరవ్ ( అదితి , విక్రం ) లను అడివికి పిక్నిక్ కు తీసుకెళుతుంది . చాలా సేపు ఆడుకున్నాక పిల్లలు అలిసి పోతారు . వాళ్ళదగ్గర వున్న నీళ్ళు ఐపోతాయి . అందుకని అమ్మ , పిల్లలూ మీరిక్కడే వుండండి , నేను ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూసి తెస్తాను అని , నీళ్ళు వెతుక్కుంటూ వెళుతుంది . ఇంతలో ఓ పులి గాండ్రు మంటూ అమ్మ మీదికి వస్తుంది . అప్పుడు అమ్మ అయ్యో నా పిల్లలు అనుకుంటుంది .
పులీ , పులీ , ప్లీజ్ ,ప్లీజ్ నన్నొదిలేయవా , నా పిల్లలు అక్కడ వొంటరిగా వున్నారు అని పులిని వేడుకుంటుంది .

ఆ నిన్నొదలను . నాకు చాలా రోజులకు ఆహారం దొరికింది అని గాండ్రిస్తుంది పులి .

అయ్యో , నా పిల్లలు అడవిలో ఒంటరి వాళ్ళై పోతారు . చాలా చిన్న పిల్లలు . ఇంటికి దారి కూడా తెలీదు . పోనీ వాళ్ళను ఇంటిదగ్గర వదిలేసి వస్తాను ప్రామిస్ అంటుంది అమ్మ .

సరే . నువ్వు తిరిగి రాక పోయావో , మీ ఇంటికి వచ్చి నీ పిల్లలను కూడా తినేస్తాను . పో , వాళ్ళను దింపేసి తొందరగా రాపో అని పర్మిషన్ ఇస్తుంది పులి .

అమ్మ పిల్లలను ఇంటిదగ్గర దింపేసి వాళ్ళను వదలలేక వదలలేక వదిలేసి ఏడ్చుకుంటూ పులి దగ్గరకు తిరిగి వస్తుంది . అప్పుడు పులి , అమ్మ చేసిన ప్రామిస్ ను తప్పలేదని , అమ్మను చాలా మెచ్చుకొని , నీ పిల్లల దగ్గరకే వెళ్ళిపో అని అంటుంది . అమ్మ పులికి థాంక్స్ చెప్పి , సంతోషం గా ఇంటికి తిరిగి వస్తుంది . కాబట్టి ఎప్పుడు కూడా ఆడిన మాటను తప్పరాదు అని నీతి .

( నా మొహం . ఇప్పుడైతే ఈ కథ మొదలు పెట్టగానే మా పిల్లలు అడవికి వెల్లేటప్పుడు గన్ తీసుకెళితే సరి . అప్పుడు ఏ ఆనిమల్ వచ్చినా కాల్చేయొచ్చు అంటారండి మా పిల్లలు . ఇవన్ని పంచతంత్రం మొదలైన పుస్తకాల లోవే . కాకపోతే కాస్త మార్చి వాళ్ళ పేర్ల తో చెపితే ఇంట్రెస్ట్ గా వింటారని ఇలా చెపుతానన్నమాట . కాక పోతే చిన్నపుడు బాగానే వినేవారు . ఇప్పుడే ఇలా తెలివి మీరిపోయారు హుం ! )

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - -

ముసలమ్మ సూది కథ కొనసాగింపు

మా అమ్మమ్మ అలా నేనేదంటే అలా నటే సూది వస్తుందా అని అడుగుతూ వుండేది . ఇహ విసుగూ , కోపం వచ్చి పక్కకు తిరిగి పడుకునేదానిని . కాసేపైనాక అమ్మమ్మ అమండూ నిద్రపోయావురా అని అడిగేది . అమ్మమ్మ , ముసలమ్మ సూది ఎలా వస్తుందో చెపుతుందేమోనని ఆశ తో గబ్బుక్కున లేదమ్మమ్మా అంటూ లేచి కూర్చునేదానిని . చటుక్కున అమ్మమ్మ లేదమ్మమ్మా అంటే సూది వస్తుందా అని అడిగేది . అంతే ఉక్రోషం తో మాట్లాడకుండా పడుకుండి పోయేదానిని . అప్పుడు అమ్మమ ' బూచివాడు వచ్చి బుట్ట్లల్లుతున్నాడు ' అని పాడటము మొదలు పెట్టేది . మా అమ్మమ్మ చాలా బాగా పాడేది . నాకు ఈ పాటలో ఈ ఒక్క చరణమే గుర్తుంది . చిరు చీకటిలో , కింద నుండి తడి మట్టిమీద నుండి సువాసనలు తేలుతూ వస్తున్న చల్లటి గాలి లో , అమ్మమ్మ సన్న సన్నగా పాడుతున్న పాట తో ఎప్పుడు నిద్ర పోయే దాని నో నాకే తెలీదు .

నా మనవళ్ళు , మనవరాళ్ళు ఎంతసేపటికీ నిద్ర పోకుండా ఇంకా ఇంకా కథలని వేధిస్తూ వుంటే నేనూ ఈ కథే చెప్పి , మా అమ్మమ్మ ట్రిక్నే ఉపయోగిస్తాను . కాక పోతే అమ్మమ్మ అంత మధురంగా పాడ్లేను . అసలు పాడనే లేను , కాని ఇదో ఈపాట తో వాళ్ళను నిద్ర పుచ్చుతాను .

ఆటలు ఆడి , పాటలు పాడి అలసి పోయానే
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీపెట్టమ్మా .

గూటి లోని బెల్లం ముక్క కొంచం పెట్టమ్మా
చాటలోని చాయా పప్పూ చారెడు పెట్టమ్మా
అటకా మీది అటుకుల పళ్ళెం అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిల మేదో తీసి పెట్టమ్మ .

ఆటలు ఆడి పాటలు పాడి అలసీ పోయామే
తీయా తీయని తాయిల మేదో తీసీ పెట్టమ్మా .

Sunday, May 30, 2010

అమ్మ చెప్పిన కథ





నేను ఆవకాయ పని లో వుంటే అందరూ కథలు చెప్పేసుకుంటున్నారే ! ఐతే నా ఆవకాయల పోస్ట్ ల కు కామా పెట్టాల్సిందే ,

రాత్రి ఆరుబయట పడుకున్నపుడు అమ్మ చెప్పే కథలంటే చాలా చాలా ఇష్టం గా వుండేది . ఎన్ని కథలు చెప్పినా కర్ణుడి కథ తప్పకుండా చెప్పాల్సిందే . అడిగి మరీ చెప్పించుకునే దానిని . చెప్పేంతసేపూ ఏడుస్తూ వుండే దానిని . నువ్వేడుస్తున్నావు చెప్పనంటే ఏడవనమ్మా అని బతిమిలాడి మరీ చెప్పించుకునేదానిని . కర్ణుడి కథ తరువాత స్థానం కృష్ణదేవరాయుడి ది . నేను పుట్టినప్పుడు మా నాన్నగారు తుంగభద్ర ప్రాజెక్ట్ దగ్గర పనిచేసేవారట . అందుకని ఎక్కువగా హంపీ వెళ్ళే వారట . దాని తో అమ్మ , ఆ హంపీ వీధులను వర్ణిస్తూ కథ చెపుతుంటే , నాకు హంపీ లో వున్నట్లుగా నే వుండేది .ఆ రెండు కథలు తప్ప ఇంకేవీ చెప్పనిచ్చేదానిని కాదు . అలా చిన్నప్పటి నుండి కర్ణుడన్నా , శ్రీకృష్ణదేవరాయుడన్నా ఆరాధన ఏర్పడింది . ఆ తరువాత బుడుగు కథ . బుడుగు కథ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను .


నా మనవళ్ళూ , మనవరాళ్ళకు కూడా నేను చెప్పే కథలు చాలా ఇష్టం . ప్రతి రోజూ బుడుగు కథ చెప్పుకోకుండా పడుకోము . నా పేరు బుడుగు , మా బామ్మ నన్ను హారి పిడుగా అంటుంది దగ్గర నుండి , చివరలో వున్న గ్రూప్ ఫొటో వరకూ అందరికీ కంఠతా వచ్చు ! ఐదారేళ్ళ పిల్లలకెవరికైనా గిఫ్ట్ ఇవ్వలంటే నేను బుడుగు పుస్తకం ఇస్తాను .

- - - - - - - - - -- - - - - - -- - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -


ముసలమ్మ సూది కథ


మా అమ్మనే కాదు మా అమ్ముమ్మను కూడా కథలు చెప్పమని వేధించేదానిని . సెలవల్లో మా చింతలపాడు వెళ్ళినప్పుడు , సాయంకాలము ఆరు బయట వరండా నీళ్ళ తో కడిగి , పక్కలు వేసేవారు . ఇహ అమ్ముమ్మ పక్కన చేరి ఎన్ని కథ లో . మా ఆమ్ముమ్మ పేరు మా కెవరికీ తెలీదు , ఎందుకంటే ఎవరూ పేరు పెట్టి పిలిచేవారు కాదు కదా . అందుకన్న మాట . అందుకే అమ్మమ్మ పేరు తెలుసుకోవాలని మహా కోరిక గా వుండేది . నీ పేరు చెప్పు అమ్మమ్మా అంటే పేరు మర్చి పోయిన ఈగ కథ చెప్పేది . ఆ కథ నేను కొత్తగా చెప్పేదేముంది అందరికీ తెలిసిందే కదా . ఎంతకీ నిద్ర పోక కథలని వేధించే మాకు ఓ పొడుపు కథ చెపుతాను అది విప్పండి , ఆ తరువాత ఇంకోటి అని , మా అమ్ముమ్మ చెప్పిన కథ :

అనగనగా ఒక వూళ్ళో వొక పేద ముసలమ్మ వుంది . పాపం ఆమెకు ఎవరూ లేరు . కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు . ఐనా అలాగే కాలం వెళ్ళ దీసుకుంటూ వుంటుంది . ఇంతలో చలి కాలం వస్తుంది . కప్పుకోవటానికి ఏమీ లేవు . అందుకని తన దగ్గర వున్న పాతబట్టలతో బొంత కుట్టుకుందామనుకుంటుంది . సరే , పెరట్లో వున్న బావి గట్టు మీద కూర్చొని కుట్టుకుంటూ . . . కుట్టుకుంటూ . . . వుండగా సూది బావి లో పడి పోతుంది . పాపం పేద ముసలమ్మ కదా , ఇంకో సూది కూడా లేదు . ఇప్పుడు ఆ సూది ఎలా బయటకు వస్తుంది ?
" అవునమ్ముమ్మా ఎలా వస్తుంది ? "

" అవునమ్ముమ్మా ఎలా వస్తుంది అంటే వస్తుందా "

" అట్లా అనగానే ఎట్లా వస్తుందమ్ముమ్మా , ఎట్లా వస్తుందో చెప్పు "

" ఎట్లా వస్తుందో చెప్పు అంటే వస్తుందా "

" అబ్బా , అమ్ముమ్మా చెప్పు "

" అబ్బా అమ్ముమ్మా చెప్పు అంటే వస్తుందా "

" హుం"

" హుం అంటే వస్తుందా "

" ఎట్లా వస్తుంది చెప్మా "

" ఎట్లా వస్తుంది చెప్మా అంటే వస్తుందా "

? ? ? ? ? ? ?

( ఈ పోస్ట్ ను ఏదో కాస్త ఎడిట్ చేద్దామని ఓపెన్ చేస్తే పాపం ఎటో వెళ్ళి పోయింది . గురూజీ సాయం తో వెతికి తెచ్చాను , కాని దీనికి వచ్చిన ఒకేఒక కామెంట్ ను తిరిగి తేలేక పోయాను . కిరణ్ గారు , మీ కామెంట్ను నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి )