Thursday, October 29, 2009

కార్తీకమాసము - పర్వదినములు




కార్తీకమాసమంతా స్నానాలు, ఉపవాసాలు , దీపదానాలు , పూజలూ ,వ్రతాలూనూ . ఏపూజకాపుజే విశిష్టమైనది .కాని నాకు అన్నిటిలోకి కార్తీక పౌర్ణమి చాలా ఇష్టము . సోమవారనాడు ,,కార్తీకపుర్ణిమ నాడు ఉపవాసాము చేయటము నాకు అలవాటు . ఆ రోజు ఉదయమంతా ఉపవాసముండి , సాయంకాలము భోజనము చేసేదానిని . రెండు సంవత్సరాలనుండి ఆరోగ్యరీత్యా మానేయాల్సివచ్చింది. ఆ రోజు మా అత్తగారు సాయంకాలము నిమ్మకాయపులిహోర , నిమ్మకాయ మిరియం బహు రుచిగా చేసేవారు. ఉపవాసమున్నవాళ్ళకే అవి పెడుతాననేవారు . అలా వాటి కోసము నా ఉపవాసాలు మొదలయ్యాయి ! అలాగే కార్తీకపౌర్ణమి రోజు అనుకోకుండా హరిషిద్ది మాత గుడి కి వెళ్ళటము జరిగింది. ఆ రోజు పోరుబందర్ లో సముద్రపు వడ్డున స్త్రీలు దీపాలు వెలిగించి ,పాటలు పాడుతూ సముద్రములోకి దీపాలను వదలటము మరుపురాని అనుభూతి.
ప్రతి రోజు దేవునికి దీపము వెలిగించలేని వారు ఈ రోజు 365 వత్తులను ఆవునేయితో ఏఏదైనా దేవాలయములో , వీలుకాకపోతె ఇంటిలో దేవుని వద్ద వెలిగిస్తే రోజూ వెలిగించిన ఫలము వస్తుంది అంటారు .
ఈ సారి 2 / 11 న కార్తీకపౌర్ణమి , సోమవారము రెండూ కలిసి వచ్చాయి .

ఈ మాసములోని పర్వదినాలలో శుక్లపక్ష ద్వాదశి రోజున చేసే క్షీరాభ్ధిద్వాదశి పూజ ప్రధానమైనది .ఈ రోజున కృతయుగములో దేవతలు , రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించిన రోజు కనుక క్షీరాభ్ధిద్వాదశి అని పేరు. క్షీరసాగరము లోనుండి వచ్చిన మహాలక్ష్మిని ఈ రోజు శ్రీమహావిష్ణువు వివాహమాడాడు . అందుకని ఈ రోజు శ్రీమహావిష్ణువు , శ్రీ మహాలక్ష్మిల కల్యాణము చేస్తారు. ఎప్పుడూ క్షీరసాగరములో శయనించే విష్ణువు ఈ రోజున మహాలక్ష్మి తో పాటు బృందావనానికి వస్తాడని అంటారు. అందుకే ఈ రోజు తులసి మొక్క వద్ద , ఈ కార్తీకమాసములో సమస్త దేవతలూ , మునులుకూడా ఆశ్రయించుకొని వుండే ఉసిరిక కొమ్మని పెట్టి పూజిస్తారు.
ఈ నెల 30 న క్షీరాభ్ధిద్వాదశి .

కార్తీకమాసములో శనిత్రయోదశి సోమవారముకంటే చాలా ఎక్కువ ఫలితమిస్తుంది . ఆ శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితమిస్తుంది . పౌర్ణమి కంటే కార్తీక పాడ్యమి నూరురెట్లు అధిక పలమిస్తుంది . ఆ కార్తీక పాడ్యమి కంటే బహుళ ఏకాదశి కోటిరెట్లు ఎక్కువ పలితానిస్తుంది . ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి విస్తారమైన పలితానిస్తుంది అని పెద్దలంటారు.

కార్తీకపురాణములో ఇలా చెప్పారు.
కార్తీక శు. పాడ్యమి : తెల్లవారు జామునే లేచి ,స్నానము చేసి , దేవాలయానికి వెళ్ళి , కార్తీకవ్రతం సంకల్పము చెప్పుకొని ,ఆకాశదీపాని దర్షించుకోవాలి .
విదియ : ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి , కానుకలిచ్చి రావాలి .
తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటము వల్ల సౌభాగ్యసిద్ది .
చవితి : ఈ రోజు నాగులచవితి సంధర్భముగా పుట్టలో పాలు పోయాలి .
పంచమి : దీనికి జ్ఞాన పంచమి అని పేరు . ఈ రోజు సుబ్రమణ్యప్రీత్యర్ధము అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ది కలుగుతునది .
షస్టి : నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానము చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి .
సప్తమి : ఈ రోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానమివ్వటము వలన ఆయుషు వృద్ది అవుతుంది .
అష్టమి : ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది .
నవమి : నేటినుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి .
దశమి : ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి .
ఏకాదశి : ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి .
ద్వాదశి : ఈ క్షీరాబ్ధి ద్వాదశి రోజు సాయంకాలము ఉసిరిమొక్క , తులసి మొక్కలను పూజించి ,దీపాలను వెలిగించటము సర్వపాపాలనూ నశింప చేస్తుంది .
త్రయోదశి : ఈ రోజు సాలగ్రామ దానము చేయటము వలన సర్వకష్టాలు దూరమవుతాయి .
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతము చేసుకునేందుకు నేడు మంచిది .
కార్తీక పూర్ణిమ : మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానము చేసి , శివాలయము వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటము వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి .

ఇంకా ఈ మాసములో చేసే ఈశ్వరార్చనా , అభిషేకం అపమృత్యు దోషాలను ,గ్రహ బాధలను తొలిగిస్తాయి .

సర్వేజనాః సుఖినోభవస్తు .

Tuesday, October 27, 2009

కార్తీకమాసము

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే " గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి ! నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు " అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.

కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని ,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది .

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం

జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం

రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం

సర్వసుగంధి సులేపితలింగం బుద్దివివర్ధన కారణలింగం

సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం

దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

కుంకుమచందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం

సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం

దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం

అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం

అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం

సురగురు సురవరపూజితం లింగం సురవరపుష్ప సదార్చితలింగం

పరమపదపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం

లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచివసన్నిధౌ

శివలోక మవాపోత్ని శివేన సహమోదతే .

<
/tr>
Get this widget | Track details | eSnips Social DNA



పైన వున్న ఫొటో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో వున్న బిల్వ వృక్షముది . మా అల్లుడు సతీష్ అడుగగానే ఫొటో తీసి మేల్ చేసారు , థాంక్ యు సతీష్. .

Sunday, October 25, 2009

టీ కప్ తో చిటపటలు

అదో అన్నిటికన్నా పెద్ద కప్పు వుందే , దాని తో పాలు తాగి నా మనవలు మనవరాళ్ళు బలవాలనే కోరికతో కొన్నాను . వాళ్ళు అందులో సగము కూడా తాగరు అది వేరే సంగంతి. పక్కన నల్ల చారల తో వొగలుపోతూ వుందే అది పదహారు సంవత్సరాల క్రితం ఐదుగురు సహోదరుల తో అమెరికా నుండి వచ్చింది .అందుకే అమేరికా ఫోజులు కొడుతుంది ! మిగితా ఐదు ,ఇండియా పనివాళ్ళ ధాటికి ఆగలేక అమెరికా కి పారిపోగా ఇదొక్కటి వుందునా పోదునా అనుకుంటూ ఏక్ అకేలాగా మిగిలింది ! దాని పక్కన వున్న కప్పులలో మావారికి , ఇంటికి వచ్చినవారికి కాఫీ ఇస్తానన్నమాట. ఆ మూల గోడకి వదిగి పోయి కనిపిస్తోందే స్టీల్ గ్లాస్ అందులో నేను సర్వకాల సర్వావస్తలందు కాఫీ కాని టీ కాని తాగుతాను. ఇక అన్నిటికి దూరంగా వుందే గ్రీన్ కప్ అది మడి కప్పు ! ఏంటీ మీ ఇంట్లో మడితో కాఫీ తాగేవారున్నారా ? అని ఆశ్చర్య పోకండి . ఇప్పుడు ఆ కథా కమీషు చెప్ప పోతున్నాను . అదేమిటి మధ్యలో బ్లు అండ్ బ్యూటిఫుల్ గా ,బుజ్జి కప్ వుంది దాన్ని పరిచయము చేయలేదేమి అంటున్నారా ? కంగారు పడకండి అన్నీ వివరం గా చెప్తాగా !

మా ఇంట్లో పొద్దున కాఫీ క్లబ్ పదిగంటల వరకు వుంటుంది . అంటే ఆ తరువాత తాగమని కాదు , అప్పటినుండి టీ తాగుతాము. ఇంటికి వచ్చినవారికి వారి ఇష్ట ప్రకారము కాఫీ నో ,టీ నో ఇస్తాము. పొద్దున లేవగానే మొదటి కాఫీ నేనే కలుపుకుంటాను. అప్పుడే వేడి చేసిన పాల లో ఫిల్టర్ డికాక్షన్ వేసి ఒక స్పూన్ పంచదార తో కలుపుకొని ( అదేమిటో మొదటి కాఫీ ఎవరు కలిపినా నాకు నచ్చదు . ఆ తరువాత ఎవరిచ్చినా తాగుతాను ! ) , నాకు గ్లాస్ లో , మావారికి కప్ లో తీసుకొచ్చి , ఆయనకిచ్చాక , నేను బాల్కనీ లోని నా కుర్చీలో సెటిల్ అయ్యి , ఉదయించే సూర్యుడిని , ఆకాశములో ఎగిరే పక్షులను , అవీ ,ఇవీ చూసుకుంటూ , ఒక్కో చుక్క ఆశ్వాదిస్తూ చిన్నగా తాగుతాను. మా వారేమో ఎవరో తరుముతున్నట్లు అంత వేడి కాఫీ హడావిడిగా తాగేసి , ఇంకా తాగుతున్న నన్ను చూసి కుళ్ళు తో , జాంబెడు తాగుతున్నావా అంటూ మొదలుపెడుతారు . నేను నా లోకం నుండి బయటకొచ్చి పొద్దున్నే ఈ గొడవ ఎందుకని మా వారికి ఇంకో కప్ కాఫీ తెచ్చిస్తాను . హాయిగా తాగొచ్చుగా ? తాగితే మావారెందుకవుతారు ? నువ్వు సోలెడు తాగుతావు సరె నాకెందుకు తెచ్చావ్ అని చిట పటలాడుతారు . ఇహ నాకొళ్ళుమండి పోతుంది . నేను జాంబడే తాగుతానో , సోలెడే తాగుతానో మానెడు సోలెడు తాగుతానో నా ఇష్టం అనేస్తాను ! సరే నీ ఇష్టం కాని మా ఆఫీస్ లో కి కాఫీ పంపమన్నా ఆ పెద్ద కప్లలో పంపుతావు. మంచి నీళ్ళంటే ఆ స్టీల్ గ్లాస్ లు పంపుతావు అని చిట పట లాడి పోతారు !

మరేం చేయను ? గాజు గ్లాస్లు అన్ని మాయమై పోయాయ్ !1 ఎలా పోయాయా అని నేను శారదా తలపగలు కొట్టున్నాము .మొత్తం బాక్స్ పోయింది ! ఇక కప్స్ విషయాని కొస్తే ఆ గ్రీన్ కప్ ని పరిచయం చెసానే ఆ సైజ్ కప్స్ కావాలంటారు మా వారు అవీ అన్నీ పోయి ఒక్కటంటే ఒక్కటే మిగిలింది .అందుకే దానిని మడి కప్ అని అందులో మావారి కిస్తాను.ఈ మద్య అదీ సొట్ట పోయంది . ఆ సైజ్ కప్ లు కొందామంటే నాకు దొరకటం లేదు. కాదు నువ్వు సరిగా వెతకటం లేదు అని చిట పట లాడుతారు.

ఇహ ఈ చిట పటలు భరించలేక ఈ రోజు మధ్యాహ్నము శారద ను తీసుకొని వాల్యుమార్ట్ కెళ్ళి ఓ డజను గ్లాస్ లు , ఓ డజను చిన్న కప్లు కొనుకొచ్చాను. రాగానే మావారికి ఆ కప్ లో టీ పంపించాను .

ఆయన ఇంట్లోకి రాగానే టీ తాగారా అని అడిగాను ! ఏం మాట్లాడలేదు . అక్కడే వున్న మా అబ్బాయి ఏమైంది డాడీ అన్నాడు.

" ఆ పంపిందిరా ఓ గుటికెడు."

" అదేమిటి ? ఫంక్షన్స్ ల లో ఇస్తారే చిన్న ప్లాస్టిక్ గ్లాస్ లు అందులో పంపిందా ? "

వెంటనే నేను అందుకొని ఏంకాదు ఇదో ఈ కప్ లలో ఇచ్చాను అని కొత్త బుజ్జి కప్ చూపించి , జాంబెడే తాగుతారో , సోలెడే తాగుతారో , చిటికడే తాగుతారో గుటికెడే తాగుతారో మీ ఇష్టం ముందు 1000 రూపాయలివ్వండి . డజను కప్స్ , డజన్ గ్లాసెస్ తెచ్చాను అని ఇంట్లో వున్న కప్ లు అన్ని వరుసగా పేర్చి చూపించి 1000 రూపాయలు వసూలు చేసుకున్నాను. డజను గ్లాస్లు ,డజను కప్పులు 1000 రూపాయలా అనకండి . మొగుడి దగ్గర అలానే వసూలు చేయాలి ! ! !

లేక పోతే రోజూ జాంబెడు , సోలెడు అంటూ నా కాఫీ కి దిష్టి పెడుతారా ?

Thursday, October 22, 2009

నాగులచవితి

ఈ రోజు నాగులచవితి కదా , మీరేమి రాయలేదేమి అని ఫణి ఇప్పుడే చాట్ లో అడుగగానే ,ఒహో ఏమైనా రాయాలికదూ అనుకొని , పాములతో నాకున్న పరిచయం రాద్దామని మొదలు పెట్టాను ! అలా అంటే నేనేదో సద్దాం ఆంటీ ఇంటికథ నవల లో జాంబవతి లాగా తరతరాల పాములను పెంచుకొనే దాన్ని అనుకోకండి !

మా నాన్నగారు పొట్టిచెలమ ,( నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ కాంప్ ) లో పనిచేసేటప్పుడు , అక్కడ టెంపరరీ ఇళ్ళు, సగము రాళ్ళ గోడలు, సగము తడికల తో కట్టి ,పైన రేకులతో కప్పిన ఇళ్ళలో వుండేవారము. అక్కడ కాంప్ తప్ప మిగితా ప్రదేశం అంతా కొండలు , చెట్ల తో వుండేది . కాబట్టి మాకు , మేము పడుకున్నప్పుడు పైన దూలం మీదనుండి , బియ్యం డబ్బా పక్కనుండి , బాత్ రూంలొ , చదువుకునేటప్పుడు టేబుల్ కిందనుండి ఇలా ఓ చోటని కాదు ఎక్కడ పడితే అక్కడ మాకు హాయ్ చెప్పటానికి వచ్చేసేవి . అవీ అలాటి ఇలాటి మామూలు పాములుకాదు నాగుపాములు ! ఏదో అలా వాటి తో సహజీవనం చేసేసాం !

ఆ తరువాత నా పెళ్ళైనాక , జబల్పూర్ లో వున్నప్పుడూ ఇంతే ! ఎక్కడపడితే అక్కడ హల్లో చెప్పేసేవి .ఓసారి నేను రోడ్ మీద వెళుతుండగా గోధుమరంగు లో వున్న ఓ పాము నా ముందునుండి వెళ్ళింది . అబ్బ ఈ పాము ఎంత అందముగా వుంది అని చూస్తూ వుండిపోయాను . అది కొంచం దూరం వెళ్ళాక , బాబోయ్ ఇది . . . ఇది పాముకదూ ! గోధుమవన్నె తాచంటే ఇదేనేమో అనుకొని , అప్పుడు గడ గడా వణికిపోయి , అక్కడినుండి కిందపడుతూ , మీద పడుతూ పరుగో పరుగు ! అక్కడే ఓసారి మావారు ఆఫీస్ కి వెళుతుండగా రోడ్ కడ్డంగా పెద్ద లావు చాంతాడంత పాము వెళుతూ కనిపించిందట . భయం తో అది రోడ్ దాటి వెళ్ళేవరకు స్కూటర్ ఆపి పక్కకు వుండి పోయారట. ఆ పాము గారే ఎదురింట్లోకి దూరందిట ! వాళ్ళ ఇంటి కి వెళ్ళి తలుపుకొట్టి ఇలా ఓ పాము మీ ఇంటి వెనుకకి వెళ్ళింది అనగానే ,అదే చేయదండి ,ఇటే తిరుగుతుంటుంది అన్నాడట ఆ ఇంటాయన ! మా ఇంటాయన మటుకు ఇప్పటికీ దాన్ని తలుచుకుంటునే వుంటారు .

ఇక బరోడాలో వున్నప్పుడు మా ఇంటి ఆవరణలో ఓ పెద్ద ,నల్లటి పాము ,రాత్రులు తిరుగుతూ వుంటుందని , దాని నెత్తిన ఓ మణి కూడ వుంటుందని అక్కడి వాళ్ళు చెప్పేవారు. దాన్ని చూడటానికి నేను , జయ చాలా రాత్రులు ,పాముకు కనిపించకుండా , లైట్లు ఆర్పి , కిటికీ వెనుక కుర్చొని కాపలా కాసాము , అబ్బే ఎక్కడా చడీ చప్పుడు లేదు . దర్షనబాగ్యము కలుగలేదు !

పాములతో ఇంత అనుబందం వున్నా నాకు పాములంటే చచ్చేంత భయ్యం ! వాటి బొమ్మ చూడాలన్నా భయమే ! ఎప్పుడూ ఓ అనుమానం వస్తుంది సుభద్ర గారు ఎంచక్కా వాటి కుటో తీసి బ్లాగ్లో ఎలా పెట్టారా అని.

సరె ఇక నాగుల చవితి విషయానికి వస్తే కార్తీకశుద్ద చతుర్దశి నాడు అంటే ఈరోజు నాగుల చవితి .పుట్టిన బిడ్డలు బతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను నాగ ప్రతిష్టచేసి పూజించటము సాంప్రదాయము . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి ,నాగలక్ష్మి , నాగేశ్వరరావు ,నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు .ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి పూజించి పాలు పోసి చలిమిడి , చిమ్మిలి నైవేద్యం పెడుతారు . ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవిదగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారి కి ఈపుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.

నన్నేలు నాగన్న , నాకులమునేలు ,

నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .

పడగ తొక్కిన పగవాడనుకోకు ,

నడుము తొక్కిన నావాడనుకొనుము .

తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .

ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .

అని పుట్టలో పాలు పోస్తూ , నూకవేసి వేడుకుంటారు .

ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !

మా అత్తగారితో నేను ప్రతి నాగుల చవితికి కాచిగూడ హనుమంతునిగుడిలో వున్న పాము పుట్టదగ్గరికి వెళ్ళేదానిని . అప్పుడు గుడి చాలా చిన్నగా, గుట్టమీద వుండేది . ( ఇప్పుడు వున్న గుడిని కొత్త డిజైన్ లో డెవలప్ చేసిన ఆర్కిటెక్ట్ మా అల్లుడు సతీష్ .వాళ్ళ కుటుంబానికి కూడ ఆ గుడితో చాలా కాలము నుండి అసోషియేషన్ వుంది .) చలిమిడి , చిమ్మిలి , కొబ్బరిముక్కలు , అరటిపండు తిని ఉపవాసం వుండేవాళ్ళము. దీపావళి రోజే కొన్ని టపాకాయలు పిల్లలకు కనిపించకుండా దాచి ఈ రోజు కాలిపించేవారము .

దిబ్బు దిబ్బు దీపావళి , మళ్ళీ వచ్చే నాగుల చవితి .

Saturday, October 17, 2009

దీపావళి శుభాకాంక్షలు

మా అత్తయ్య , వాళ్ళ అమ్మాయిలు , పార్వతి , శ్యామల తో మానుకోట ,మాఇంటికి రావటము , నేను, మా చెల్లెలు జయ , అత్తయ్య నాన్నగారికి హారతి ఇవ్వటము ,నాన్నగారు నాకు ,జయకి చెరి ఐదు రూపాయలు ,అత్తయ్యకి పదిరూపాయలు ఇవ్వటము , నాన్నగారు పెద్ద బుట్ట నిండా టపాకాయలు తేవటము ,నాకు లీలగా గుర్తున్న మొదటి దీపావళి . ఎందుకో తెలియదుకాని నాకు టపాకాయలు కాల్చటము పెద్దగా ఇష్టం వుండేదికాదు . నాకు ,దీపాల తో ఇంటిని అలంకరించటము చాలా ఇష్టము . అందుకే రకరకాల దీపప్రమిదలను కొంటూవుంటాను .

నేను బ్యూటీపార్లర్ నడుపుతున్న రోజులలో , సాయంకాలము పార్లర్ లో నా అసిస్టెంట్స్ , మాస్నేహితులు ,బంధువులను పిలిచి లక్ష్మీ పూజ చేసేదానిని .

పోరుబందర్ దగ్గర హరిసిద్దిమాత దర్షనము ఐనప్పటినుండి , దీపావళి రోజు అమ్మవారికి పూజచేసి , ఎర్రచీర ,పసుపు జాకెట్టు సమర్పించేదాన్ని . అలాగ దీపావళి రోజున ఉదయము ఇంట్లో అమ్మవారి పూజ , సాయంకాలము పార్లర్ లక్ష్మీ పూజ చేయటము అలవాటైంది . పార్లర్ మూసివేసినా , ఇంట్లో అమ్మవారి పూజమాత్రము చేస్తునేవున్నాను. ఈ సంవత్సరము తో నేను ఈ పూజ చేయటము మొదలు పెట్టి ఇరవైఐదు సంవత్సరాలు పూర్తికావటముతో , ఈ రోజు ఉదయము పూజ అయ్యాక , అమీర్ పేట్ లో వున్న కనకదుర్గ గుడిలో , ఎర్రచీర , పసుపు జాకిట్ బట్ట ,ఎర్రపూలు ( మందార పూలు ) ,పచ్చచామంతి పూలు , ఎర్రగాజులు , పసుపు ,కుంకుమ ,పళ్ళు ,కొబ్బరికాయ అమ్మవారికి సమర్పంచి కుంకుమ పూజ చేసుకొని వచ్చాను .

దీపావళి రోజు లక్ష్మి పూజ ఎందుకు చేయాలనే దానికి చాలా కథలు ప్రాచుర్యము లో వున్నాయి . అందులో ఒకటి ,
వొకరోజు , ఒకషావుకారు దగ్గరికి ,జేష్టాదేవి , లక్ష్మీదేవి వచ్చి ,ఇద్దరిలో ఎవరు అందముగా వున్నారో చెప్పమని అడిగారు . జేష్టాదేవిని ఇంట్లోనుండి బయటకి పంపాలి , లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి .అందుకు ఉపాయముగా ,జేష్టాదేవితో అమ్మా నీవు వెనుకనుండి అందముగా వున్నావు అనగానే జేష్టాదేవి ఆనందముగా బయటికినడిచింది . లక్ష్మీదేవితో అమ్మా నీవు ముందునుండి అందముగా వున్నావు అనిచెప్పాడు .అప్పుడు లక్ష్మీ దేవి వయ్యారముగా ఇంటిలోకి నడిచింది .
తెల్లచీర కట్టి ,తెల్ల రవిక తొడిగి, మునిమాపు వేళ వచ్చె లక్ష్మి .
అని షావుకారు సంతోషము తో ఇల్లంతా దీపాల తో అలంకరించి , బాణాసంచా పేల్చి లక్ష్మిని ఆహ్వానించాడు .
అప్పటినుండి దీపావళి రోజు సాయంకాలము ముఖ్యముగా వ్యాపారస్తులు లక్ష్మి దేవిని పూజిస్తారని ఓకథ !

అందరికీ అమ్మవారి కటాక్ష ప్రాప్తిరస్తు !

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు .

Get this widget | Track details | eSnips Social DNA




Wednesday, October 14, 2009

పదివేల క్లిక్ ల నోము

కైలాసగిరి పై ఒకానొక రోజు , నందీశుని విన్యాసాలు తిలకిస్తూ , విశ్రాంతిగా వున్న శంకరునితో ,పార్వతీదేవి ఇట్లనియె ,

స్వామీ ,భూలోకమున ,మీ భక్తురాలు మాల చింతాక్రాంతురాలైయున్నది తిలకించితిరా ?

అవును దేవీ ,ఆమె ఈమద్య బ్లాగ్ లిఖించుట మొదలిడినది . అప్పటి నుండి తన బ్లాగునకు అథిదులు లేరే అని చింతించుచున్నది.

అటులైనను ఏదైనా తరుణోపాయమును సూచించి , మీ భక్తురాలి చింతను తీర్చవచ్చునుకదా ! అని పార్వతీదేవి నిష్టూరమాడెను .

దేవీ అంత నిష్టూరము వలదు , పదివేల క్లిక్ ల వ్రతమును భక్తి శ్రద్ధల తో ఆచరించిన ఆమె కోరిక తీరును అని అనియెను.

అంత ,పార్వతీదేవి ఆ వ్రత విధానమును తెలుపమనగా శంకరుడు పార్వవతీదేవికి తెలుపగా , అంత పార్వతీదేవి మాలకు స్వప్నమున అగుపించి ఆ వ్రత విధానమును వివరించెను.


సో , ఆవిధముగా నేను స్వప్నమునందు పార్వతీ దేవి వలన ఆ వ్రతవిధానమును తెలుసుకొని , ఆది దంపతుల కృపకు సంతసిచిందానినై , ఆ వ్రతమును ఆచరించాను !


ఆ వ్రతవిధానములో చెప్పినట్లుగా ముందుగా లో కూడలి చేరాను. ఆ తరువాత కొద్ది రోజులు నేను రాతలు ఆపి , అందరి రాతలు పరిశీలిస్తూ , వాఖ్యానిస్తూ వాఖ్యాతగా మారాను. ఆ విధముగా కొందరి దృష్టినైనా నావైపు తిప్పుకోగలిగాను. అమ్మయ్య కొద్దిమంది మిత్రులైనారు ! ఆటుపిమ్మట నా శైలిని కొద్ది కొద్దిగా మెరుగు పరుచుకుంటూ , రాతలు మొదలుపెట్టాను. నా మితృలైన వారిని మొహామాట పెట్టో , మీరు నా పోస్ట్ ను చూస్తేనే మీకు నేను కామెంటుతాను అని బ్లాక్ మేయిల్ చేసో , మీరు చాలా బాగారాస్తున్నారండీ ,నాకూ కొన్ని కిటుకులు చెప్పరూ అని వుబ్బేస్తూనో ( మరి పొగడ్తలకు లొంగని వారుంటారేమిటి ? ) , ఇంకొంచం దగ్గరైనాక మీరు నా కొత్త పోస్ట్ చూడలేదు అని కాస్త అలక చూపించో , కాస్త బతిమిలాడో , బామాలో , బుజ్జగించో నానాతిప్పలు పడి నా బ్లాగ్ కు రప్పించుకొని మొత్తానికి నా పదివేల క్లిక్ ల వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను .


నా రాతలు నచ్చి కొందరు , నచ్చక పోయినా కొందరు , నచ్చీ నచ్చక కొందరు అలా ఇలా అలవోకగా కొందరు , అటూ ఇటూ వెళుతూ కొందరు ఏమైతేనేం అందరూ నా పదివేల క్లిక్ ల వ్రతమును దిగ్విజయముగా పూర్తి చేయటానికి సహకరించారు . అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.


ఈ వ్రతమును కొత్తగా బ్లాగ్ ను వ్రాయటము మొదలు పెట్టిన వారెవరైనను చేయవచ్చు. విధానము పైన నేను చేసినట్లుగా చెప్పినదే ! కాక పోతే చిన్న సలహా , వ్రాసేవిధానమును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ , తప్పులులేకుండా రాస్తూ , నొప్పించక ,తానొవ్వక అనేట్లుగా మన పోస్ట్ లు వుంటే బాగుంటుందని నా అభిప్రాయము.


ఉద్యాపన :


పదివేల క్లిక్ లు పూర్తి కావచ్చే ముందు చెల్లెలిని మన బ్లాగ్ ముందు కూర్చోపెట్టి , పదివేల సంఖ్య పూర్తికాగానే మనకు తెలిపే ఏర్పాటు చేసుకోవాలి ! ఆ వెంటనే , ముందు గానే మనము తయారుగా వుంచుకున్న టపాను ప్రచురించి , మన బ్లాగ్ కు వచ్చే అథిదులకు వాయనమివ్వాలి . ఎంతమందికైనా , స్త్రీ పురుషులు ఎవరికైనా ఇవ్వవచ్చు .


అందుకే ఈ టపా .


ఇస్తినమ్మ వాయనం


పుచ్చుకుంటినమ్మ వాయనం


నా వాయనం అందుకున్నదెవరు ?


పురుషులైతే నేనే శంకరుని అనండి


స్త్రీ లైతే నేనే గౌరీ దేవిని అనండి .


అథిది దేవా నమో నమహః !


కామెంట్ దాతా సుఖీభవ !

Monday, October 12, 2009

జాజిపూలు

సాహితి అనుకొని జాజిపూలు బ్లాగ్ లోకి వచ్చామా అనుకొకండి . ఇది నా పోస్ట్ శీర్షిక మాత్రమే ! కాకపోతే ఆ పేరు పెట్టటానికి నాందీ , ఉపోద్ఘాతం , ప్రస్తావన వగైరా చాలా వున్నాయ్ ! వాటి కథా కమీషూ అన్ని చెపుతాను .కాస్త ఓపికగా చదవండి.

అవి నాకు జ్యోతిగారు పరిచయం అయిన తొలి రోజులు . కొన్ని బ్లాగుల లింకులిస్తాను చదవండి , ఎలా రాయాలో ఐడియా వస్తుంది అన్నారు. సరే కానీయండి . కాని రాజకీయాలు సుదీర్ఘ చర్చలు లాటి భారీ ,భారీ వి వద్దు . నేనసలే ఏడు జాజిపూలెత్తు సుకుమారిని , అలాంటి సుకుమారమైనవే ఇవ్వండి అన్నాను. అదిగో అప్పుడు జ్యోతిగారిచ్చిన లింకులలో జాజిపూలు బ్లాగ్ లింక్ కూడా ఒకటి .

జాజిపూలు బ్లాగ్ లోకి వెళ్ళగానే పువ్వులలో బజ్జున్న పాపాయి ని చూడగానే తెగ ముద్దొచ్చేసింది . ఆ తరువాత చదవగానే అహా ఏమి నా భాగ్యము , నా అభిమాన రచయిత /త్రి లు రాయటము మానేసారే అన్న దిగులు తీరింది కదా అని తెగ సంతోషించాను . అంతటితో ఆగొచ్చుగా ! అబ్బే అంత మంచి బుద్ది ఏది ? నేస్తం గారు , మీ బ్లాగ్ నాకు తెగ నచ్చేసిందండి , ఇంత మంచి బ్లాగ్ పరిచయము చేసిన జ్యోతిగారి నెత్తిన పాలు పోసి ఉక్కిరి బిక్కిరి చేయను కాని మా ఇంట్లో పూసే జాజిపూలు మాల కట్టి సమర్పించుకుంటాను అన్నాను. అదే ఉత్సాహము లో జాజి తీగ దగ్గరికి వెళ్ళి చూద్దును కదా అప్పటి వరకూ ఒకటో రెండో వున్న పూలు కూడా లేవు ! పోనీ సీజను కాదేమో అనుకుందామా పక్కింటి వారి తీగ విరగ పూస్తోంది !

ఇప్పుడే గొప్పగా ప్రతిజ్ఞ చేసి వచ్చానే ఏమి చేద్దు ? కింకర్తవ్యం ? అని దిగులుగా వున్న నాతో మా శారద అమ్మా ! మా అమ్మ పని చేసే చోట మాలి , రూఫ్ గార్డెన్ చేసాడమ్మ , బాగుంది , అతనిని పిలుద్దామా ? అంది సరే అన్నాను.

మాలి హుస్సేన్ గారు వచ్చారు . మా ఇంటి చుట్టూ ,అతను , వెనుకాల నేను , నావెనుక శారద మూడు సార్లు ప్రదక్షణ చేసాక , చెప్పటము మొదలు పెట్టాడు.

బాదం చెట్టు కొమ్మలు కత్తిరించాలె ,

సరె ,

ఉసిరిచెట్టు కొమ్మలు కూడా కత్తిరించాలె ,

మంచిది .

జాజి తీగ కొమ్మలు కత్తిరించి , పందిరి మంచిగ వేయాలె

అవును . అది చాలా ముఖ్యం ! గోడ వెంట కాశీ రత్నం , బఠాణీ పూల తీగ వేస్తావా ?

వేయొచ్చు.

రెండు కొబ్బరి చెట్ల కి ఒకదానికి మాలతి , ఒక దానికి రాధామాధవం వేస్తే బాగుంటుందా ?

కొబ్బరి చెట్లకి వద్దు , ఈ గోడ వెంట , ఈ మెట్ల పక్కన వేస్తే , పై బాల్కని దనుక పోయి మంచిగ కొడుతయ్ !

అవును పాత సినిమాలలో బాల్కనీ లో స్తంబాలకు పూల తీగలు , వాటి దగ్గర సావిత్రి ఒహ్ ఎంత మంచి దృశ్యం !

కుండీలల కూడా సీజనల్ పూలు వేయొచ్చు . నువ్వు నర్సరీకి వస్తే నీకేవి కావాలంటే అవి తెద్దాము.

కుండీలలో ఆకు కూరలు వేస్తే బాగుండదా ?

బాగుంటది .

గుత్తులు గుత్తులుగా మాలతి పూల తీగ , సువాసనలు వెదజల్లుతున్న రాధామాధవాలు , ఎర్రని సోయగాల కాశీరత్నాలు ,గులాబీ బఠాణీలు పూల కుటీరం లోకి వెళ్ళిపోయిన నన్ను , మేడం ముందుగల చుట్టూ ఒక అడుగు మట్టి తవ్వి తీయాల అన్న హుస్సేన్ మాట ఈ లోకం లోకి తెచ్చింది.

ఏమిటి ?

చుట్టూ మట్టి తవ్వి , ఓ పది బండ్ల కొత్త మట్టి , ఎరువు పోయాల . పాత మట్టి పాడై పోయంది .

మొత్తం ఎంత అవుతుంది ?

5000 ల రూపాయలు.

5000 లా ?

అవ్ ఇద్దరు లేబర్ని తెస్త్త , మట్టి , ఎరువు అంత కలిపి అవుతది . ఆ ఇంకో మాట తీసిన మట్టి ఏడ పోయాల ?

మీరు తీసుకు పోరా ?

లేదు . మీరె పారేయించుకోవాలె . మేము బయట గోడ పక్కన పోస్తం !

నా మొహం చూసి ఏమనుకున్నాడో ఆలోచించుకొని నాకు ఫోన్ చెయ్య్ వస్తా అని వెళ్ళిపోయాడు .

రాత్రి బోజనాలు చేసేటప్పుడు చిన్నగా నసుగుతూ మాలి సంగతి చెప్పాను . ముగ్గురికీ కొర పోయి , నెత్తి మీద ఠపాఠప్ అని కొట్టుకున్నారు . మా అబ్బాయి , కోడలు మిడిగుడ్లేసుకొని చూస్తుంటే , మావారేమో , ఏమిటీ ఇంటిచుట్టూ రెండడుగులు తవ్వి పోస్తాడా ?

రెండడుగులు కాదు ఒకడుగే అని చిన్నగా గొణిగాను .

నువ్వు మాట్లాడకు .ఆ మట్టి బయట రోడ్ మీద పోస్తాడా ? అది ఎవరు తీయాలిట ?

లేబర్ ఎవరు దొరకరా ?

ఆ నువ్వూ , నేనే మోయాలి . ( నా కళ్ళ ముందు నేనూ , మా వారు మట్టి తట్టల తో ప్రత్యక్షం ) శ్రీధర్ , శారద సహాయం చేస్తారు చేయించుకో . కావాలంటే ఒక్క మూర కాదు పది మూరలు ,పది రకాల పూలు కొని పెట్టుకో ( మరే బతకమ్మలా పేర్చుకుంటా ! అయ్నా నా కోసం ఏమిటి ? ) అంతేకాని కొంప కూల్చకు . అని ఘట్టిఘా వార్నింగ్ ఇచ్చారు.

నా బాధ చూసి , మా ఆడపడుచు ఉష వాళ్ళ ఆడపడుచు ఆదిలక్ష్మి , మాలి అవసరము లేదండి , మా ఇంట్లో 300 రకాల చెట్లు వున్నాయి , నేనే చూసుకుంటాను . అంతగా ఐతే పబ్లిక్ గార్డెన్ లో మొక్కల పెంపకము మీద క్లాసులు జరుగుతుంటాయి .ఓ సారి వెళ్ళొస్తే మనకు కొన్ని కిటుకులు తెలుస్త్తాయి అని ఓ మంచి ఉపాయం చెప్పారు . మరునాడు చక చక గా పనులు పూర్తిచేసుకొని , పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళాను . అక్కడా నన్ను విధి వెక్కిరించింది ! ప్రతి నెల మొదటి వారములో మూడు రోజులు క్లాస్లు వుంటాయి . ఈ నెలవి అయిపోయాయి .వచ్చేనెల ఫోన్ చేయండి , కనీసము నలుగురైనా వుంటే చెపుతాము అని చాలా మర్యాదగా చెప్పారు . హూం ! ఆ రోజు ఇంతవరకు రాలేదు .

ఈ లోపల శ్రీధర్ దాని కొమ్మలు కత్తిరించి , ఆకులు దూసి , గొప్పులు తీసి ఎరువులు వేసి , రోజూ బోలెడు నీళ్ళూ పోసాడు . తీగ చక్కగా గుబురుగా పెరిగి , కొమ్మా , రెమ్మా వేసిందేకాని , ఒక్కటంటే ఒక్క పూవు పూస్తే ఒట్టు ! నాకు చాలా విరక్తి కలిగి ఇక దానికి చేసిన పోషణ చాలులే ,మరీ ఎక్కువైనట్లుంది . కొన్నిరోజులు మాడ్డుదాం అని శ్రీధర్ కి చెప్పాను ,

నిన్న సాయంకాలం బాల్కనీ లో శూన్యం లోకి చూస్తూ , నేనసలు ఇంతటి మాట ఎందుకిచ్చాను ? ఇచ్చిన మాట తప్పటము మాఇంట , వంటా లేదే , మూరెడు కాదు , జానెడు , కాదు కాదు బెత్తెడు , పోనీ ఓనాలుగు పూలు ఇద్దామన్నా లేవే ! నా మాట దక్కకపాయెనే ! అని చింతిస్తువుండగా అమ్మా అమ్మా అని కిందనుంచి శారద పిలిచింది .ఏమిటా గావు కేకలు ?

మీరు తొందరగా జాజి తీగ దగ్గరికి రండమ్మా .

వెళ్ళి చూద్దునుకదా విచ్చుకొని ఓ పువ్వూ , విచ్చుకుంటూ నాలుగు మొగ్గలు , ఇంకా కొన్ని బుజ్జి బుజ్జి మొగ్గలు నన్ను చూసి చిలిపిగా నవ్వాయి .

Friday, October 9, 2009

ష్ మాటాడకు

యెలహంక స్టేషన్ లో దిగగానే , మేము హసన్ లోని ,ఆరెంజ్ కౌంటీ వాళ్ళ ,హోసల విలేజ్ రిసార్ట్ కి వెళ్ళటానికి , మా అల్లుడు ఏర్పాటు చేసిన రెండు క్వాలిష్ లు వచ్చాయి . అందులో ఒకటి మాకు ( నాకు ,మా అదితి కి ) నచ్చలేదు. సరేపోనీయ్ ఇంకోదాన్లో కూర్చుందాములే అనుకున్నాము. కాని , మా వారు, మా తోటి కోడలు, మా అమ్మాయి , కుట్ర చేసి మనకందరికీ ఒకటి చాలులే , ఇక్కడినుంచి 2 1/2 గంటల ప్రయాణమే కదా సద్దుకుందాం , 9000 మిగులుతాయి అన్నారు. సరే అనుకున్నాము. ఇంతలో బాగా వున్న క్వాలిష్ డ్రైవర్ , ఈ డ్రైవర్ కార్ కొన్నాక ఇప్పుడే మొదటిసారి వచ్చాడు , కాబట్టి అతనిని తీసుకెళ్ళండి , తిప్పి పంపుతే బాధపడతాడు అదీ , ఇదీ అని చెప్పి , మాకు సెంటు కొట్టి మాకు నచ్చని క్వాలిష్ ని మాకు అంటగట్టి , త్యాగరాజై వెళ్ళిపోయాడు. అంతే , మావారు దయార్ధహృదయులై , పాపం అతను బోణీ పోయింది అని బాధపడతాడు , మనము అంతా కలిపి ఓ ఐదారు ,గంటలకంటే ఎక్కువ ఈ కార్ లో ప్రయాణము చేయము కదా , కంపు లేదు ఏమి లేదు ఎక్కండి అని ఆ కార్ ఎక్కించారు ! ఇహ అప్పటి నుండి మా కష్టాలు మొదలైనాయ్ !

మేము కొంచం దూరం వెళ్ళగానే కొద్దిగా వాన మొదలైంది . పైన సామానులు కప్పటానికి ఏదైనా వుందా అంటే లేదన్నాడు . అతనికి మా బాష రాదు , మాకు అతని భాష రాదు ! సరే ఎలాగో వివరించి పక్కన ఆపి ఓ రెండు పట్టాలు కొని కట్టించారు . కష్టపడి అతని పేరు ధర్మరాజ్ అని తెలుసుకోకలిగాము ! . మా అమ్మాయి వచ్చిరాని కన్నడలో మాట్లాడుతుంటే ,మా తోటి కోడలు లక్ష్మి మురిసిపోతూ బాగానే కన్నడ నేర్చుకున్నావే అని మెచ్చుకుంది . ఇంట్లో కన్నడ మాట్లాడుతావా అని అడగగానే ,లేదు పిన్నీ మావాళ్ళు నవ్వుతారు అందుకే ఇంట్లో మాట్లాడను అంది . మరి నేను వూరుకోవచ్చుకదా ! నా నోరు ఆగక పెళ్ళై 16 సంవత్సరాలైంది ఇంకా నేర్చుకోక పోవటమేమిటి అన్నా . అంతే గుర్రున నావైపు చూసింది మా అమ్మాయి. ఈ హడావిడి లో చాలా దూరం వచ్చినట్లుగా అనిపించి , మద్యలో దారి అడగమని ధర్మరాజును పురమాయించిది . అబ్బే అతను ధర్మరాజు కదా నిషబ్ధముగా వున్నాడు . ఇక అందరూ అతనికి దారి తెలీదని , డ్రైవింగ్ రాదని డిసైడ్ అయిపోయి , సంజు కు ఏదో చెప్పటము , తనేమో కన్నడ లో అడగటము ,ధర్మరాజేమో ధర్మంగా తలూపటమూ జరుగుతూ పోయింది ! ఎంతసేపటికీ గమ్యం రాదు . నేనూ ఏదో చెప్పలికదా అనుకొని సంజు తో చెప్ప పోయాను . అంతే అబ్బ నువ్వుండమ్మా ! అందరూ చెప్పేవాళ్ళే , కాసేపు మాట్లాడకు అంది . సరేలే కానియ్ అనుకొని మాట్లాడకుండా కూర్చున్నాను.

అలా అలా వెళుతూనే వున్నాము . పెద్దలందరికీ టెన్షన్ వచ్చేసింది . ఇతను ఎక్కడికి తీసుకెళుతున్నాడా అని . ఎక్కడా బోర్డ్ అయినా కనపడటము లేదు , అందరూ చూస్తూ వుండండి కనిపిస్తుందేమో అంది సంజు . నేను చూసాను అన్నాను . నేను కిటికీ పక్కన వున్నాను కదా ! నా మాట నమ్మేసి , ఎక్కడ అంది .

వెనుకనే చూసాను .

మరి చెప్పలేదేమిటి ?

నువ్వు నన్ను మాట్లాడొద్దు అన్నావుగా !

అమ్మా !

సరే కార్ వెనుకకి తిప్పించింది . కొద్ది దూరము వెళ్ళగానే ఓ బోర్డ్ కనిపించింది . ఇదే నేను చూసిన బోర్డ్ అన్నాను. ఇదా ! దీనిమీద ఏదో అడ్వర్టైజ్మెంట్ వుందికదా ! అవును , నువ్వు బోర్డ్ చూసావా అన్నావు కాదా , అందుకే బోర్డ్ చుసాను అని చెప్పా . బోర్డ్ మీద ఏముంది అంటే చెప్పేదాన్ని . నువ్వు నన్ను ఎక్కువ మాట్లాడద్దు అన్నావుగా !

అమ్మా ! - సంజు

మాలా! - మావారు

కమలా ! - లక్ష్మి

ఆంటీ ! - బాల

అవి ఆర్తనాదాలా ? గావు కేకలా ?

స్వగతం : లేకపోతే నన్నే మాట్లాడకు అంటుందా హన్నా ! మంచిగైంది లే లల్లలా ! ఏదో మంచిదాన్ని కాబట్టి , ఇంకా ఎక్కువ దూరం తీసుకుపోలే , ఇంతటి తో వదిలేసాను .

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

తిరిగి వచ్చే రోజు , పొద్దుటి నుండి మా మరిదిగారు వెంకట్ , మా అల్లుడు సతీష్ ఒకటే ఫోన్లు , ఇక్కడ వానలు చాలా పడుతున్నాయి , మీరు ట్రేన్ లో రాకండి , ఫ్లైట్ లో రండి అని. మద్యాహ్నము వరకు ట్రేన్స్ వెళుతున్నాయి అని ,ఆ తరువాత కాన్సిల్ అయ్యాయి అన్నారు. ఇక అప్పుడు ఫ్లైట్ టికెట్స్ కోసం సంజు, బాల ప్రయత్నం మొదలు పెట్టారు. నేనేమో ఇంత వానలో వెళ్ళక పోతేనేమి , రెండు రోజులాగి వెళ్ళొచ్చుగా అని టెన్షన్ పడ్డాను . షరా మామూలే ! నువ్వు మాట్లాడకు , నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని మావారి డైలాగు .అయినా నాకు తెలీక అడుగుతాను ప్రాణానికి ప్రాణం ఎలా అడ్డేస్తారబ్బా ?

మొత్తానికి ఫ్లైట్ ఎక్కించారు ! ఎక్కిన కొద్ది సేపటికి , ఏమండీ అంత పెద్దాయన రాజశేఖర్ రెడ్డినే వర్షం లో కాపాడలేకపోయారు , మన ఫ్లైట్ సరిగ్గా వెళుతుందంటారా ? అని అడిగాను .

అబ్బ ఏంకాదులే ఎక్కినప్పటినుండి నస పెడుతున్నావు , నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా నన్నాను కదా !

వెధవది నా ప్రాణం కోసం కాదు బాబూ , చిన్న పిల్లలని తీసుకొని ఇంత మొండిగా బయిలుదేరకపోతే ఏం ? పైగా మీ అల్లుడు పెద్దవారు మీరున్నారు కదా అని మీ మీద భారం వేసాడు . ఇదో కిందికి చూడండి , ఇది నల్లమల అడివేనంటారా ? ఇన్ని చెట్లు కనిపిస్తున్నాయి , ఇది పావురాలగుట్టే మో !

మాలా నువ్వు నోరుమూస్తావా ముయ్యవా ?

మా గౌరు అన్నట్లు మనం ఏం చేయగలము అనుకొని నోరు మూసుకున్నాను.

ఇంతలో ఏర్ హోస్టెస్ స్నాక్స్ తెచ్చింది . నేను ఇటువున్న అదితిని , అటు వున్న మావారిని చూస్తూ కూచున్నాను . నీ కొంచం ఐస్ క్రీం కావాలా అంటూ మావారు నావైపు తిరిగి ఏమిటి తినటము లేదు ? కట్లెట్ బాగుంది , గార్లిక్ కాని మసాలా కాని ఎక్కువ లేదు తిను అన్నారు .

ఎలా తినను ? మీరు నోరు మూసుకోమన్నారు కదా !

అమ్మమ్మా ! యు ఆర్ టూమచ్ ! అని అదితి ,

మావారేమో

గుర్ ర్ ర్ ర్ ర్ . . . . .

Tuesday, October 6, 2009

అట్లతద్దె

మా అత్తగారు ,మా వదినగారితో చాలా నోములు పట్టించారట .వదినగారు అవన్నీ ఈమధ్య ఒకొటొకటిగా తీర్చటము మొదలు పెట్టారు. అందులో బాద్రపదమాసములో ఉండ్రాలతద్దె తీర్చారు. ఇప్పుడు అశ్వయుజమాసం బహుళతదియ ( 7 వ తారీకు అక్టోబర్ ) నాడు అట్లతద్దే తీరుద్దామనుకున్నారు ,కాని ,దేవీనవరాత్రులలో కుడా తీర్చవచ్చు అని నవరాత్రులలో అట్లతద్దె నోము ఉద్యాపన చేసారు.

ఆవిడ చిన్నతనములోనే ఈ నోము పట్టారట . ఐదుగురు కన్నెపిల్లలకు ముందురోజు రాత్రి గోరంటాకు పెట్టాలి. తెల్లవారుఝాముననే ఐదుగురితో కలిసి చద్ది అన్నము తిని ఉయ్యాలలూగాలి. ఆ తరువాత వారికి తలస్నానము చేయించి, తనుకూడా చేసి , గౌరీదేవిని పూజించి ఐదు అట్లను ,కొంచము బెల్లము ముక్కను పెట్టి నివేదన చేయాలి. ఐదుగురు కన్నెపిల్లలకు తలా ఐదు అట్ట్లను , బెల్లము తో ( ఆ రోజులలో అట్లు బెల్లము తోనే తినేవారుట ! ) . వాయనము ఇవ్వాలి.ఇలా ఐదు సంవత్సరములు వివాహమునకు పూర్వమే నోచుకోవాలి. వివాహము తరువాత ఎప్పుడైనను ఉద్యాపన చేయవచ్చు.

నోచుకునేటప్పుడు అదుగురు కన్నెపిల్లలు , ఉద్యాపనకు పదిమందిమంది ముత్తదువులు కావాలి. మా పదిమందికీ , ముందు రోజే గోరింటాకు కోన్లు, షాంపూ పాకెట్స్ ఇచ్చారు. ఉదయము 8 గంటలకు చిక్కడపల్లి లోని మావదినగారంటికి వెళ్ళాము. అంతకు ముందే ఆవిడ గౌరీ పూజ చేసుకున్నారు. పది అట్లు అమ్మవారికి నివేదన చేసారు. అందరికీ పది అట్లు కొంచము బెల్లము ముక్క తో , ఒక జాకిట్ బట్ట ,పసుపు ,కుంకుమ , గాజులు , పూలు ,దక్షిణ ,తాంబూలం ఇచ్చారు. తిమ్మనం ( బియ్యపండి ,పాల తో చేసే ఓ పాయసము ) కూడ వాయనము తో పాటు ఇచ్చారు. ఉద్యాపన అప్పుడు , ఉయ్యాలలూపటము , చద్ది అన్నము పెట్టటము అవసరము లేదట. వాయనము ఇచ్చిన తరువాత , బోజనము పెట్టారు.

మా ఇంటి పద్దతి అని ఇలా చేసారు . కాని, కథ లో వేరుగా వుంది .

కథ ---

ఒక రాజుగారి అమ్మాయి ,తన చెలికత్తెలతో కలిసి అట్ల తద్దె నోమునోచుకుంది.చెలికత్తెలందరూ ఉపవాసమున్నారు ,కాని రాచకన్య మాత్రము ఉండలేక ,సాయంకాలమైయ్యేసరికి సొమ్మసిల్లి పడిపోయింది .ఆమె సోదరుడు అరిక ( గడ్డి ) కుప్పకు నిప్పుపెట్టి , చెట్టుకి ఒక అద్దము వేళ్ళాడ తీసి , మంట చూపించి ,చంద్రోదయం అయ్యింది భోజనము చేయవచ్చునని చెప్పాడు. అదినిజమనుకొని ఆ రాచకన్య వాయనము అందించి , భోజనము చేసింది వ్రతలోపము కలుగుట వల్ల ఆమెకు మంచి సంబంధము దొరకలేదు .ఆమె చెలికత్తెలందరికి వివాహాలైనాయి . ఆమె విచారించి , గ్రామమున కల కాళికాలయమునకు వెళ్ళి, అమ్మా! అందరిలా నేనూ వ్రతమాచరించాను ,వారందరికి వివాహాలైనాయి నాకు మాత్రం కాలేదు అందుకు కారణము తెలుపుమమ్మా ! అని అడిగింది .అంత గౌరి ఆమె చేసిన లోటును , పొరపాటును తెలిపి మరల చేయమంది .రాచకన్య మరల నోచింది .ఆనాడే అశ్వయుజమాసం, బహుళ తదియ కావటమువలన ఆమె యధావిధి గా వ్రతం ఆచరించింది .వ్రత పలితముగా ఆమెకు మంచి భర్త లభించాడు .ఆమె తన భర్త తో హాయిగా జీవించింది .

ఉద్యాపన -

ఈ వ్రతం అశ్వయుజమాసం ,బహుళ తదియనాడు ఉపవాసం చేసి ,చంద్రోదయం అయ్యేవరకు ఏమీ తినకూడదు . గౌరీ దేవికి పది అట్లు నివేదన చేయాలి .అలా తొమ్మిది సంవత్సరములు చేసి ,10 వ సంవత్సరమున , 10 మంది ముత్తైదువులను పిలిచి , వారికి తలంటు స్నానము చేయించి , 10 అట్లు ,పసుపు ,కుంకుమ , రవికల బట్ట , దక్షిణ తాంబూలము సమర్పించి , సంతృప్తిగా భోజనము పెట్టవలెను.

ఈ నోము నోచుకుంటే కన్నెలకు మంచి మొగుడొస్తాడని , పెళ్ళైన స్త్రీలకి నిడు ఐదవతనం కలుగుతుందని ,భర్తలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతారని నమ్మకము.

ఈ పండగ వైభవము పట్టణాలకంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తుంది.అందరూ ఉత్సాహము గా జరుపుకుంటారు .తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చొని గోంగూరపచ్చడి , కందిపులుసు మొదలైన వాటి తో చద్ది అన్నము తిని తాంబూలం వేసుకుంటారు.ఇక అప్పటి నుండి నిద్ర పోరు .ఆట పాటల తో గడుపుతారు .అట్లతద్దోయ్ ఆరట్లో , ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఉయ్యాలలు ఇంట్లోకాక తోటలలో పెద్ద పెద్ద చెట్లకి వేస్తారు .ఈ పండుగ ని అందరూ జరుపుకుంటారు. అందుకే అస్టాదశ వర్ణాలవారికి అట్లతద్దె అనే పేరు వచ్చింది.